నివాళి
జ్యేష్ట స్వయంసేవక్ మధుభాయ్ కులకర్ణి సెప్టెంబర్ 18న కన్నుమూశారన్న వార్త బాధించింది. భాగ్యనగర్ కేంద్రంగా వారు మా అందరికీ పాలక్‌గా ఉండేవారు. పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు ఒకసారి కార్యకర్తల సమావేశంలో, దేశంలో సామాజిక పరివర్తన కోసం పనిచేసే సంస్థకు గ్రామాలలో, రైతులలో పట్టు ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుందని నిర్మాణాత్మకమైన సూచన చేశారు. గడచిన శతాబ్దంలో అనేక హిందూ ధార్మిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు దేశభక్తితో పరివర్తన తేచ్చే పనిచేశాయి. కానీ ఈ పని కొనసాగ లేదు. సుమారుగా అన్ని ప్రయత్నాలు కాలక్రమంగా తగ్గాయి. లేదా బలహీనపడినాయి. మధుభాయ్ చెప్పిన మరొక అంశం ఎప్పటికీ గుర్తుంటుంది. సంఘం శతాబ్ది వస్తున్నది. కాబట్టి సంస్థ తన శక్తిని కాపాడుకోవడంలో మరింత జాగరూకతతో ఉండాలని చెప్పారు. ఆయన దేశం కోసం ఎంతో ఆలోచించిన మహానుభావులు.
మధుభాయ్ కులకర్ణి మహారాష్ట్ర ప్రాంతం నుండి ప్రచారక్‌గా వచ్చారు. గుజరాత్ ప్రాంత ప్రచారక్‌గా పనిచేశారు. గుజరాతీపై పట్టు సాధించారు. ఆ రాష్ట్రంలో శాఖల విస్తరణతో పాటు, విశ్వహిందూ పరిషత్, కిసాన్ సంఫ్‌ు విస్తరణలోను విశేషమైన ప్రగతి సాధించారు. వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు దేశమంతా విజయవంతంగా నిర్వహింప చేశారు. అది భారత్, సంఘ చరిత్రలలో మైలు రాయిగా నిలిచింది. సంఘ సమావేశాలలో మధుభాయ్ నిలబడితే చాలు, వివేకానంద అంటూ అంతా చూసేవారు.
వారి అధ్యయనంలోతైనది. సమరసత బాధ్యతను సంఘం అప్పచెప్పగానే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవి తాన్ని, ఇంకా మహా పురుషుల జీవితాలను ఆయన కూలకషంగా అధ్యయనం చేశారు. అంతేకాదు, నా వంటి ఎందరో కార్యకర్తలతో చేయించారు. మధుభాయ్ సమరసతతో ఏకాత్మతను పొందారు. వారి తరువాత నాకు బౌద్ధిక్‌ప్రముఖ్‌గా బాధ్యత ఇచ్చారు. బౌద్ధిక్ విభాగం దస్త్రమంతా అప్పగిస్తూ, ‘చూడు! ప్రార్థన పాడుతున్నప్పుడు దేశమంతా ‘ప్రభోశక్తిమన్ హిందూ..’ అంటున్నారు. అలా అనకూడదు. ‘ప్రభోశక్తిమన్’ ఒక శబ్దం. ‘హిందూ రాష్ట్రంగ భూత’ ఇంకొకశబ్దం. అలా ఉచ్చారణ మార్చ గలిగితే నీ జీవితం ధన్యమవుతుంది’ అన్నారు. ఇంకా ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది.
మధుభాయ్ పరిపూర్ణ జీవితం చూసి 88వ ఏట తనువు చాలించారు. నెల రోజుల ముందు కూడా అన్ని పనులతో పాటు, నిత్యం కొంత వ్యాయామం చేసేవారు.యుక్తవయసులో ఒక సంవత్సరమైతే నిత్యం 58 సూర్య నమస్కారాలు చేశారు. సాధకులని పించుకున్నారు. ఘన పదార్ధాలను తాగాలి. ద్రవ పదార్ధాలను తినాలి అనేవారు. అంటే బాగా నమిలి తినాలని. జీవితాంతం అలాగే చేశారు. ఆరోగ్యం పట్ల వారికి ఉన్న శ్రద్ధకు ఇవన్నీ నిదర్శనాలు. ఒకసారి ఢల్లీిలో అఖిల భారతీయ బౌద్ధిక్ విభాగ్ బైఠక్ జరి గింది. ఒక బాల ప్రబంధకుని నేను దీపక్ అని ఏక వచనంతో సంబోధించాను.ఆ రోజు రాత్రి నాతో, బాల, తరుణ అందర్నీ ‘జీ’ అనే సంబోధించాలి అని చెప్పారు. అదొక మంచి పరంపర. అలా ఎన్నో నేర్పారు. వారి జ్వలిత జీవితం మనకు సదా ప్రేరణ కలిగిస్తుంది.
వారి చరణాలకు వినయపూర్వక నమస్సులు!
– భాగయ్య, అఖిల భారత కార్యకారిణి సభ్యులు