ధర్మస్థల-దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం. అక్కడ మంజునాథేశ్వరుడు కొలువై ఉన్నాడు. అంటే శివుని రూపమే. బెంగళూరు నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహా పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేలాది మంది హిందువులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. అలాంటి పవిత్ర క్షేత్రంలో కొన్ని దుష్టశక్తులు, జాతి విద్రోహశక్తులు ‘శవ’ పంచాయతీ పెట్టి అపవిత్రం చేయాలని చూశాయి. శవ రాజకీయాలు చేసి అప్రతిష్ట పాల్జేయడానికి యత్నించాయి. హిందూత్వం మీద ద్వేషంతో ఎంత నీచానికయినా దిగజారే ఇలాంటి వాళ్లెవరికీ నీతినియామాలు లేవు. రాజకీయం కోసం వీళ్లంతా సృష్టించిన ‘‘గుట్టల కొద్దీ’’ శవాల మీద కొన్ని యూట్యూబ్ చానళ్లు పేలాలు ఏరుకుతిన్నాయి. సామూహిక ఖననాలు జరిగాయంటూ అమ్ముడు పోయిన ఒక వ్యక్తి చేత చెప్పించారు. ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం పవిత్రత మీద, హిందువుల విశ్వాసాల మీద దొంగదాడి చేయడమే లక్ష్యంగా ధర్మస్థల వివాదం నడిపించారు. దీనికి కాంగ్రెస్, సామాజిక కార్యకర్తల ముసుగులో ఉండే కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్, ఒక ముస్లిం యూట్యూబర్ తమ వంతు సాయం చేశారు. పరమ జుగుప్సాకరమైన తమాషా చూపించాలని అనుకున్నారు. ఒక ప్రఖ్యాత హిందూ దేవాలయం ఖ్యాతిని మసక పరిచే ప్రయత్నంలో కోట్లాదిమంది హిందువుల మనోభావాల మీద సమ్మెటతో మోదారు. ఆ ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా, గొప్ప సేవా దృక్పథంతో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న జైనబంట్ కుటుంబాన్ని వీధి పాల్జేయాలన్న దురుద్దేశంతోనే ఇదంతా చేశారని చివరికి బయటపడిపోయింది. చివరికి ధర్మస్థలలో ధర్మానిదే పైచేయి అయింది. శవాల గుట్టు బయటపడిపోయింది. అంతా కుట్ర అని తేలింది. బీజేపీ మీద రాజకీయ పోరాటం పేరుతో హిందూధర్మం మీద యథేచ్ఛగా సాగిపోతున్న దాడిలో ఇదొక భాగం మాత్రమేనని స్పష్టమైంది. ఇప్పుడు కర్ణాటక పోలీస్ వ్యవస్థ పరువు, కర్ణాటక ప్రభుత్వ ప్రతిష్ట మొత్తం కుళ్లిన శవం కంటే జుగుప్సాకరంగా ఉందంటే తొందరపాటు కాదు.
ధర్మస్థల చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో వందలాది యువతుల శవాలను పూడ్చిపెట్టారని, అవన్నీ లైంగిక అత్యాచారాలకు గురైన వారివేనని ఒక వ్యక్తి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చెప్పడంతో దేశం నిర్ఘాంతపోయింది. తన చేతులతోనే డెబ్బయ్ ఎనభయ్ భౌతికకాయాలను అటవీ ప్రాంతంలో పాతి పెట్టానని అతడు చెప్పడం తీవ్ర సంచలనం సృష్టిం చింది. అక్కడ ఉన్న నేత్రావతి నదీతీరంలో ఈ ఘోరం జరిగిందని అతడు చెప్పుకొచ్చాడు. దాదాపు నెలరోజుల పాటు అత్యంత ఉత్కంఠను నింపిన ఈ ఉదంతం చివరికి పెద్ద అబద్ధమని తేలిపోయింది. ఇది హిందూ బంధువుల గుండెల మీద బరువు దిగినట్టు తాత్కాలికంగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న ఆ భారీ కుట్ర మన ధర్మం, పుణ్యక్షేత్రాల భవిష్యత్తు గురించిన ప్రశ్నల బరువును ఎంతో పెంచింది. అమ్ముడుపోయిన కొందరు వ్యక్తులు చెప్పిన మాటలు పట్టుకుని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎందుకు ఆదరాబాదరాగా నియమించింది? వేలాది శవాలను పాతిపెట్టానని ఒక తాగుబోతు అంటే, ఆ మాట ఆధారంగా పోలీసు యంత్రాంగం తక్షణమే ఎందుకు రంగంలో దిగిపోయింది?
కుట్రకు ఆరంభం
జూన్ 22న ఇద్దరు న్యాయవాదులు సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఒక లేఖతో గొడవ మొదల యింది. నిజానికి పాత రగడకు ఊపిరి పోసినట్ట యింది. ఓజస్వి గౌడ, సచిన్ ఎస్ దేశ్‌పాండే అనే ఆ ఇద్దరు ధర్మస్థలలో వందలాది శవాలను సామూహిక ఖననం చేశారని లేఖలో ఆరోపించారు. దీనికి బలం చేకూర్చుతూ, దేశం దృష్టి అటు మళ్లించేటట్టు చేసే పరిణామం జూలై 4న జరిగింది. నఖశిఖ పర్యంతం ముసుగు ధరించి వచ్చి, ముసుగు మనిషి పేరుతో మాధ్యమాలలో ప్రసిద్ధుడైన, ఇంతకాలం హిందువుల మనసులను బాధపెట్టిన వ్యక్తి ఆరోజున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొత్త దగా ఆరంభమైంది. సీఎన్ చెన్నయ్య అన్న ఆ ముసుగు మనిషి పేరు బయటపడడానికి కొన్ని వారాలే పట్టింది. కేవలం ముసుగు మనిషి అంటూ మీడియా రాసేది. అతడి ప్రాణాలకు అంత ముప్పు ఉందని ఉత్కంఠ పెంచారు. జూలై 10న ఇతడే ఒక మానవ కపాలం పట్టుకుని ధర్మస్థలలోనే బెల్తంగాడీ కోర్టుకు వచ్చాడు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ్యమన్నట్టే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జూలై 19న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. ఆ కిరాయి మనిషి మాటల ఆధారంగా నేత్రావతి తీరంలో, ఆలయం సమీపం లోని అడవిలోని 13 ప్రదేశాలను ఎంపిక చేసి తవ్వకాలు మొదలు పెట్టారు. అక్కడే తాను శవాలను పాతి పెట్టానని అతడు అడ్డంగా అబద్ధమాడాడు. తానే కాకుండా దేవస్థానంలో పనిచేసే మరొక ఐదారుగురు కూడా ఈ పని చేశారని చెప్పాడు. ఆలయ సిబ్బందే తమకు శవాల సంగతి తెలియ చేసేవారని, తాము వాటిని తీసుకెళ్లి సమీపంలోని కొండలలో, అడవిలో పాతిపెట్టేవాళ్లమని వెల్లడిం చాడు. ఇంతకీ ఆరో నెంబర్ స్థలంలో ఒక మానవ కంకాళం కనిపించింది. తరువాత మరొక కంకాళం 11వ నెంబర్ స్థలంలో దొరికింది. ఇవి పురుషులవే కావడం విశేషం. ఆ దగాకోరు చెప్పినట్టు అవి యువతలవి కావు. ఒక నెల పాటు సాగిన ఈ సుదీర్ఘ దగా తరువాత సిట్ కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన మాటలను రుజువు చేసే సరైన ఆధారాలే లేవని నిర్ధారణకు వచ్చింది. కోర్టును కూడా మోసం చేసేందుకు అతడు ప్రయత్నించాడు. కోర్టుకు అతడు తెచ్చి చూపించిన అస్థికలన్నీ పురుషులవే. తరువాత నిస్సిగ్గుగా, నిష్పూచీగా, తాను చూపించిన ఏ ప్రదేశం లోను మానవ కంకాళాలు దొరకని మాట నిజమేనని, అందుకు కారణం, ప్రకృతిలో వచ్చే పరిణామంతో భూమి కొట్టుకుపోవడమేనని అతడు చెప్పడం విశేషం. యంత్రాలే ఈ విషయం గమనించలేక పోయాయి. ఇక మానవమాత్రుడినైన నేనెంత అని కూడా అన్నాడు. పెద్దల ఆదేశాల మేరకు 70 నుంచి 80 శవాలను పాతి పెట్టినట్టు ఆ ముసుగు మనిషి చూపిన స్థలంలో (13 నెంబర్ స్థలం) సిట్ గ్రౌండ్ పెనిట్రేషన్ రాడార్‌ను ఉపయోగించింది. అక్కడ 20 నుంచి 40 అడుగుల లోతుకు సిట్ తవ్వించింది. యంత్రం విఫలమైనదంటూ చెన్నయ్య వ్యాఖ్యా నించినది ఈ ఫలితాలతోనే. ఖననం చేసిన స్త్రీలు మొదట లైంగిక అత్యాచారానికి గురయ్యారని, హింసించి చంపారని ఎలా గమనించావని సిట్ బృందం ప్రశ్నిస్తే, తాను గుర్తించలేదని, ఆ మృతదేహా లను చూస్తే తనకు అలా అనిపించిందని చెప్పాడు. అలాంటివి ఉంటే డాక్టర్లు మాత్రమే చెప్పగలరని, తాను చెప్పలేనని కూడా అన్నాడు. తాను ఖననం చేసిన శవాలలో 13 ఏళ్ల బాలికది కూడా ఉందని అతడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ శవాన్ని ఖననం చేసిన స్థలం వద్ద తవ్వినా అందుకు సంబంధించి ఏవీ ఆ ప్రదేశంలో దొరక లేదు. ఇంతకీ ఇంతకాలం తరువాత ఈ శవాల సామూహిక ఖననం అతడికి ఎందుకు గుర్తుకు వచ్చింది? చేసిన పాపాలకు పరిహారం చెల్లించుకోవ డానికే తాను తిరిగి వచ్చానని, ఎలాంటి లాంఛనాలు లేకుండా అంత్యక్రియలు జరిగిన వీరికి ఏదో మంచి చేయడమే తన ఉద్దేశమని అతడు చెప్పాడు. ఈ చావుల గురించి అప్పుడు మీడియాలో రాకపోవడం, ఎవరికీ తెలియకపోవడం వల్ల దగ్గరివారు ఎవరూ రాలేదని కూడా చెప్పాడు. సిట్ బృందం, దాని నాయకుడు ప్రణబ్ మహంతి అతడిని విచారించారు. చెన్నయ్య కోర్టులో చెప్పిన దానిని సిట్ బృందం నమ్మలేకపోయింది. ఇప్పటిదాకా చేసిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతడు చెప్పిందంతా అబద్ధమని నిర్ధారించారు. ఇవి ఎలాంటి అబద్ధాలంటే, పోలీసులైనా తట్టుకోవడం కష్టమే. అందుకే ఇతడిని ఆగస్ట్ 23న అరెస్టు చేశారు.
ఇతడు కోర్టులోను, పోలీసుల దగ్గర ఒక పథకం మేరకు శిక్షణతోనే సమాచారం వెల్లడించినట్టు అర్ధమవుతుంది.‘చాలామంది మహిళల మృతదేహాల మీద దుస్తులు లేదా లోదుస్తులు లేవు. కొందరి మృతదేహాల మీద హింస, లైంగిక అత్యాచారాలకు సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. గొంతు నులిమి చంపినట్టుగా గాయాలు ఉన్నాయి. కొందరు విద్యార్థినులు సహా వందమందికి పైగా లైంగిక అత్యాచారాలకు గురయ్యారు. తరువాత చంపి పాతి పెట్టారు.’ జూన్ 3, 4 తేదీలలో చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు ఇవి. కొన్ని మానవ కంకాళాల ఫోటోలు సహా ఈ ఫిర్యాదు ఇచ్చాడతడు. తరువాత పోలీసు బందోబస్తు మధ్య బెల్తంగడి కోర్టుకు హాజరయ్యాడు. కళ్ల మీద పారదర్శ కంగా ఉండే గుడ్డ మినహా, మిగిలిన శరీరమంతా కప్పుకుని అతడు కోర్టుకు వచ్చాడు. ఆ మృతులలో వందమందిని తన చేత బలవంతంగా పాతి పెట్టించా రంటూ తన ఫిర్యాదులో పేర్కొన్న విషయాన్ని న్యాయ మూర్తి ఎదుట చెప్పడానికి అతడిని తీసుకువచ్చారు. ఆ దురాగతాలు, లేదా లైంగిక అత్యాచారాలన్నీ 1998-2014 మధ్య జరిగాయని అతడు చెప్పాడు. ఎంత విషాదమంటే, ఆ రోజున వర్షంలోను కొందరు కోర్టు వద్ద ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు. ధర్మస్థలలో చనిపోయినట్టు చెబుతున్న తమ కుటుంబ సభ్యుల అవశేషాలను ఇవ్వాలని వారంతా కోరారు.
ఇంతకీ, రాజు (వైద్యనాథపుర), చెన్నయ్య ధర్మస్థల దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుల•గా పదేళ్ల క్రితం కలసి పనిచేశారు. ఒక పుణ్యక్షేత్రాన్ని, దానిని నిర్వహిస్తున్న వారిని అపఖ్యాతి పాలు చేయడానికి ఇంత దారుణానికి ఒడిగట్టడం దారుణమని రాజు చెప్పాడు. ఇతడిని కూడా సిట్ అరగంట పాటు విచారించింది. మంజునాథ ఆలయానికి సమీపంలో నదీతీరంలో బాహుబలి బెట్టా రేవు వద్ద తామిద్దరం విధులు నిర్వహించేవారమని, మేం ఇరుగు పొరుగు కూడానని, దేవస్థానం వారు మంచి జీతం, మంచి భోజనం కూడా ఇచ్చేవారని సిట్ ఎదుట చెప్పాడు రాజు. కొన్ని కుళ్లిన శవాలను చూశామని, చెట్లకు ఉరి వేసుకుని మరణించినవారిని కిందికి దించామే తప్ప వాటిని ఎప్పుడూ తాము పూడ్చి పెట్టలేదని రాజు చెప్పాడు. ఆ శవాలను అంబులెన్స్ లలో తీసుకుపోయేవారని తెలియచేశాడు. ఎవరివో శవాలు తీసుకెళ్లి ఖననం చేయమని తమను ఎవరూ ఏనాడూ ఆదేశించలేదని, తాము ఖననం చేసినవన్నీ పోలీసుల సమక్షంలోనేనని కూడా చెప్పాడు. మరి పోలీసులు ప్రదర్శించిన ఈ అత్యుత్సాహానికి అర్ధం ఏమిటి?
ఎవరీ చెన్నయ్య?
ఇంతకీ ఈ ముసుగు మనిషి లేదా చెన్నయ్య ఎవరు? ఇతడు కర్ణాటకలోని మాండ్యాకు చెందిన వాడు. నిజానికి తమిళుడు. ఆ రాష్ట్రంలోనే 1980లో పుట్టాడు. మాండ్యాలో 1987 నుంచి 1995 వరకు చదువుకున్నాడని రికార్డులు చెబుతున్నాయి. ధర్మస్థలకు సమీపంలోని ఉజిరేలో ఉన్న తన సోదరుడి ద్వారా ఇతడు దేవస్థానంలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. తరువాత తమిళనాడులో కూడా పారిశుద్ధ్య పనులు చేశాడు. కానీ ధర్మస్థలలోను, తమిళనాడులోను కూడా ఆరోపణల కారణంగా తొలగించారు. ఇతడెంత అబద్ధాలకోరో మాండ్యాలో అందరికీ తెలుసు. తెలియనది పోలీసులకే. ఇతడి గతం కూడా అంతో ఇంతో నేరపూరితమైనదే. ఇతడు చేసిన ఒక ఆరోపణను పట్టుకుని కొండను తవ్వారు. వందల శవాలు ఖననం చేశానన్నాడు చెన్నయ్య. తానే 70కి పైగా పాతిపెట్టా నన్నాడు. అన్నీ కలిపి పాతిక ముప్పయ్‌కి మించి కూడా ఎముకలు దొరకలేదు. అయితే ఇతడి తల్లిదండ్రులకి అతడి వర్గంలో మంచి పేరు ఉంది. గౌరవనీయులన్న ఖ్యాతి ఉంది. చెన్నయ్య మూడో తరగతి చదివాడు. ధర్మస్థల నుంచి 2014లో మళ్లీ స్వగ్రామం వెళ్లాడు, మూడో భార్యతో. అక్కడ ఉన్న ఒక సంవత్సరంలో ప్రభుత్వ స్థలంలో గ్రామ పంచాయతీ నిర్మించిన షెడ్ తనదని స్థానికులతో గొడవకు దిగడంతో అక్కడ నుంచి వెళ్లిపోవలసి వచ్చింది. గ్రామస్థులు ఎవరు ధర్మస్థలకు వెళ్లినా వారిని గుడిలోపలి వరకు తీసుకుపోయేవాడు. ఒకసారి గ్రామంలో చీరలు పంచిపెట్టాడు. అవి వీరేంద్ర హెగ్గడ ఇచ్చారని చెప్పాడు. అలాగే మరొక దారుణం విషయం, శవాల మీద ఉండే చిన్న చిన్న ఆభరణాలు ఇతడు దొంగిలించేవాడని ఆ గ్రామస్థులు చెప్పారు. ఇతడు ధర్మస్థల గురించి అలాంటి ప్రకటన చేసి ఉండవలసింది కాదు. కానీ డబ్బు కోసం ఇతడు ఎంతకయినా దిగజారతాడని వారు చెప్పారు.
మొదటి భార్య ఆరోపణ
చెన్నయ్య మొదటి భార్య కూడా అతడు శుద్ధ అబద్ధాలకోరనే చెప్పింది. తాను 25 ఏళ్ల క్రితం అతడిని పెళ్లి చేసుకున్నానని, కుమార్తె, కొడుకు ఉన్నారని, తనను నిరంతరం తిట్టడం కొట్టడంతో విడాకులు తీసుకుని నాగమంగళలోని పుట్టింటికి చేరుకున్నానని మీడియాతో చెప్పారు. ఇతడికి ధర్మస్థలలో వీరేంద్ర హెగ్గడ ఒక ఇల్లు ఇచ్చి, రూ 3000 జీతం ఇచ్చేవారని చెప్పింది. నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చిన అనాథ శవాలన• పూడ్చి పెడతానని చెప్పి రాత్రిళ్లు వెళ్లేవాడని, ఏం చేసేవాడో తెలియదని అన్నారు. ఇతడి అబద్ధాల మీద పూర్తిగా దర్యాప్తు జరిపించాలని కూడా ఆమె కోరారు. మొదటి భార్య విడాకులు తీసుకున్న తరువాత మరొక పెళ్లి చేసుకున్నాడు. ఆమె సత్యమంగళలోని బన్నారికి చెందినది. ఆమె ఏం చెప్పారంటే, తనతో పెళ్లి జరిగినా ఇతడు మరొక స్త్రీని తీసుకుని వెళ్లిపోయాడు. దీనితో తాను పరిహారం కోరానని, ఆ డబ్బు కోసం ఈ పని చేసి ఉంటాడని అన్నారు. చెన్నయ్య సహోద్యోగి, వైద్యనాథపురకు చెందిన రాజు కూడా చెన్నయ్య గతం గురించి ఇదే చెప్పాడు. అతడి జీవితమంతా అబద్ధాలతోనే నిండి ఉంది. ధర్మస్థలను అపఖ్యాతి పాల్జేయాలన్న ఉద్దేశం ఉన్న ఆ ముఠాతో ఇతడు కలవడానికి ముందు వరకు తమిళనాడులోనే ఉన్నాడు. ఆ వాస్తవాలు కూడా త్వరలోనే బయట పడతాయని అనుకోవచ్చు. తమిళనాడులోనే ఈ కుట్రకు పునాదులు పడ్డాయని ఇప్పటికైతే భావిస్తున్నారు.
సమీర్ వీడియో
జూలై 10న చెన్నయ్య ఒక మానవ కపాలం పట్టుకుని ధర్మస్థలలోనే బెల్తంగాడీ కోర్టుకు వచ్చి సంచలనం సృష్టించిన ఒక రోజు తరువాత భయానక మైన వీడియో బయటకు వచ్చింది. ‘దూత’ యూట్యూబ్ చానల్ దీనిని లోకం మీదకు వదిలింది. 23 నిమిషాల 52 సెకెండ్లు ఉన్న ఆ వీడియో పేరు ‘హూ ఆర్ సీరియల్ కిల్లర్స్ ఆఫ్ ధర్మస్థల’ (ధర్మస్థల వరస హత్యలు ఎవరు చేశారు?). ఆ చానెల్‌ను నడుపుతున్న వివాదాస్పద సమీర్ మహమ్మద్ అనే యూ ట్యూబర్ జూలై 12, 2025న దీనిని అప్‌లోడ్ చేశాడు. దీనిని 31 లక్షల మంది చూశారట. ధర్మస్థల ఆలయం చుట్టూ ఉన్న అడవులలో వందలాది మృతదేహాలను పూడ్చి పెట్టారంటూ చెన్నయ్య చేసిన ఆరోపణల ఆధారంగా తయారు చేసిన వీడియో ఇది. కానీ చెన్నయ్య కథనానికి సమీర్ సొంత పైత్యాన్ని కూడా రంగరించి వదిలి పెట్టాడు. చెన్నయ్య రెండు చెబితే సమీర్ ఇరవై రాశాడు. ఈ విషయం పోలీసులే చెప్పారు. వివాదాలు సృష్టించడం సమీర్ మహమ్మద్‌కు కొత్తేమీ కాదు. 2008 నాటి ఒక విద్యార్థిని హత్యమీద ఇతడు పెట్టిన వీడియోకు సంబంధించి పది కోట్ల రూపాయల పరువు నష్టం కేసులో ఈ ఏప్రిల్‌లోనే కోర్టు సమన్స్ పంపింది. అది కూడా ధర్మస్థలకు చెందినదే. శ్రీక్షేత్ర ధర్మస్థల ప్రతినిధి డి. హర్షేంద్రకుమార్, నిశ్చల్ డి ఈ కేసు వేశారు. సమీర్ హిందూ ధార్మిక కేంద్రాలను అపఖ్యాతి పాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని ఆనాటి పిటిషన్‌లోనే వారు కోర్టుకు ఫిర్యాదు చేశారు. తరువాత అదే హిందూ పుణ్యక్షేత్రం మీద చెన్నయ్య ఆరోపణలు చేయడంతో కేసుకు కొత్త జీవం వచ్చింది. ఇంతకీ ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించినది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు దక్షిణ కన్నడ పోలీసులు ఇతడికి వారెంట్ జారీ చేశారు. ఇలాంటి కుళ్లిన సమా చారంతో మన తెలుగు అర్బన్‌నక్సల్స్ కూడా వీడియోలో వదిలిపెట్టారు. అందులో ఒకదాని పేరు ‘తవ్విన కొద్దీ ఘోరాలు’. ఏవీ ఘోరాలు? ఏవీ శవాలు? రుజువులేవీ సామూహిక ఖననాలకి! అయినా ఇప్పటికీ ఈ బాపతు యూట్యూబర్లు అక్కడ శవాల గుట్టలు ఉన్నాయంటూ నమ్మించడానికే చూస్తున్నారు?
తౌసిఫ్ ఇంక్ యూట్యూబ్ కథనం
కనిపించకుండా పోయిన వారి ఆచూకీ తెలుసుకుని అందించడం, ఉత్కంఠలు ఛేదించడం మా ప్రత్యేకత అంటూ ఈ చానల్ చెప్పుకున్నది. ధర్మస్థలలో కనిపించకుండా పోయారంటూ చాలా మంది పేర్లు ఇచ్చింది. తప్పిపోయిన వారి కథనాలు ఎక్కడెక్కడివో జరిగినవి ఇచ్చాం. ఇప్పుడు ధర్మస్థలలో జరిగినదేమిటో చెబుతాం అంటూ ఈ పేర్లు ఇచ్చింది. ధర్మస్థల పశ్చిమ కనుమలలో ఉంది. నేత్రావతి నదికి సమీపంగా ఉన్న ఈ ఆలయానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. అక్కడ వేలాది మందికి ఉచితంగా భోజనాలు పెడతారు. తమదైన ప్రత్యేక న్యాయవ్యవస్థతో వివాదాలు పరిష్కరిస్తారు. అది ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఆలయం. అయితే దీనికే మరొక చీకటి కోణం ఉందంటూ ఈ కథనం వండి వార్చింది. 1998 నుంచి 2013 వరకు ఇక్కడ 400 మంది కనిపించకుండా పోయారని ఈ చానల్ చెప్పింది. మరొక 463 మంది అసహజంగా మరణిం చారని కూడా వెల్లడించింది. జూలై 22, 2025న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని కూడా ఇది చెప్పింది. ఆలయ పరిసరాలలోని అడవులు, నేత్రావతి నదిలో, అతిథి గృహాలలో గుర్తు తెలియని వారి శవాలు చాలా కనిపిస్తాయని, కానీ ఎలాంటి విచారణ లేకుండానే అవన్నీ ఆత్మహత్య లేనని రూఢి చేసేస్తారని కూడా తెలియచేసింది. స్థానికులు కూడా ఈ బలవన్మరణాల గురించి, ప్రధానంగా మహిళలు, బాలికల గురించి గుసుగుసలాడుకుంటూనే ఉంటారట. వీళ్ల మీద కూడా లేచివచ్చి ఆత్మహత్య చేసుకున్నవారిగా, ప్రమాదాలలో మరణించిన వారిగా ముద్ర వేస్తారని చెప్పుకుంటారని కూడా తేల్చేసింది. గడచిన 20 ఏళ్లుగా ఇలా బయట పడిన శవాల వివరాలు ఇవ్వవలసిందిగా ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ దక్షిణ కన్నడ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నివేదిక కోరిందని కూడా ఈ చానల్ తెలియచేసింది. దీనికి గురించి సామాజిక కార్యకర్తలు ఏం చెబుతారో అంటూ ఈ చానల్ చేసిన వ్యాఖ్య మనకి చాలా సందేహాలు తెస్తుంది. ధర్మస్థల ఏకాంతంగా ఉంటుందని, ఇక్కడ ఆలయం కారణంగా ఆ బలవన్మరణాల గురించి వివరాలు తెలియకుండా ఉండిపోయే అవకాశం ఉందని అంటారట. కానీ నవేడ్డు నిల్లాదిద్దారే వంటి సంస్థలు వాటిపై దర్యాప్తు చేయించాలని గతంలో ఉద్యమాలు చేశాయట. జూలై 3న ముసుగు మనిషి ఇచ్చిన వాఙ్మూలం కారణంగా ఇక్కడకు వచ్చి కనిపించ కుండా పోయిన తమ కుటుంబికుల అస్థికలు ఇస్తే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించు కుంటామంటూ అనేక మంది వచ్చారని కూడా తెలియచేసింది. 1979లో వేదవల్లి అనే ఆమె ఈ ఆలయం వద్ద కనిపించకుండా పోయిందంటూ జాబితా మొదలుపెట్టి 2018లో 15 ఏళ్ల వయసు విద్యార్థి శవం దొరకడం వరకు పలువురి పేర్లు ఈ వెబ్‌సైట్ ఇచ్చింది. ఇందులో సౌజన్య కేసు ప్రత్యేకమైనది (అనన్య కేసు కల్పితం, ఈ సంగతి ఆమె తల్లిగా చెప్పుకున్న సుజాతా భట్ అంగీక రించింది). సౌజన్య మృతదేహం అక్టోబర్ 9, 2012లో దొరికింది. ఆలయం నిర్వహించే ఒక ఆసుపత్రి వద్ద అడవికి సమీపంలో దొరికిన ఈ యువతి దేహం మీద లైంగిక అత్యాచారం జాడలు కనిపించాయని చెబుతారు. జస్టిస్ ఫర్ సౌజన్య పేరుతో మహేశ్ శెట్టి తిమోరోడి ఉద్యమం మొదలు పెట్టాడు. ఇతడు బీజేపీ మీద ధ్వజమెత్తి, ఆ పార్టీ ప్రముఖుడు బీఎల్ సంతోష్ మీద అవాకులూ చెవాకులూ పేలినందుకు అరెస్టయ్యాడు. బెయిల్ మీద వచ్చాడు.
సిట్ జరుపుతున్న దర్యాప్తు గురించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మంజునాథ్ ఎన్ అనే న్యాయవాదిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ పాతిపెట్టిన శవాలకు పరీక్షలు జరుపుతున్నా రంటూ ఈ న్యాయవాది జూలై 30న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాడు. దీనిమీదే ధర్మస్థలలోని బ్తెంగడి ప్రాంత వాసి రఘురామ్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనన్య ఎవరు?
ధర్మస్థల సామూహిక ఖననాల కథనానికి ఊపు, అదనపు ఆకర్షణ తెచ్చిన పేరు అనన్య. ఈ వివాదం చెలరేగి, చెన్నయ్య పోలీసు స్టేషన్‌లో, న్యాయస్థానంలో స్వైర విహారం చేస్తున్న సమయంలోనే తెర మీదకు వచ్చిన మరొక కిరాయి పాత్ర సుజాతా భట్. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న తన కుమార్తె అనన్య ధర్మస్థలలోనే మాయమైందని ఆమె పోలీసు లకు ఫిర్యాదు చేసింది. ఈమె తరఫు న్యాయవాదే మంజునాథ్ ఎన్. మణిపాల్‌లో చదువుతున్న అనన్య 2003లో మిత్రులతో కలసి ఇక్కడికి వచ్చి మళ్లీ కనిపించలేదని సుజాతా భట్ చెప్పింది. అది పచ్చి అబద్ధం. 2003 నాటికి తాను సీబీఐ కోల్‌కొతా కార్యాలయంలో స్టెనోగా పనిచేసేదానినని, అప్పుడు ధర్మస్థలకు రైలు మీద వచ్చానని చెప్పింది. నాటి ఆలయ ధర్మాధికారి వద్దకు వెళ్లి అనన్య కనిపించ కుండా పోయిన సంగతి చెప్పానని, అందుకు ఆయన ఎవరితోనో లేచిపోయి ఉంటుందని అవమానకరంగా మాట్లాడారని కూడా సుజాతాభట్ కథనం. అప్పుడే తనను ముగ్గురు వ్యక్తులు వెంబడించారని, అనన్య ఆచూకీ తమకు తెలుసునంటూ తనను తీసుకువెళ్లి చేతులు కట్టేశారని, మరునాడు ‘వేకువన నీకు బతుకు మీద ఆశ ఉంటే ఈ ఊరి నుంచి వెంటనే వెళ్లి పోవాల’ని ఆదేశించారని కూడా చెప్పింది. అందుకు తాను నిరాకరించడంతో తల మీద కొట్టారని, ఆ దెబ్బతో కోమాలోకి వెళ్లపోయిన తాను మూడు మాసాల తరువాత మేలుకొన్నానని చెప్పింది. తీరా మంగళూరులోని తమ ఇంటి వచ్చి చూస్తే అంతా చిందరవందరగా ఉందని, పత్రాలు, ఫోటోలు అన్నీ పట్టుకుపోయారని అందుకే అనన్య ఫోటో ఇవ్వలేకపోయానని చెప్పింది. కానీ సుజాత చెప్పిన సంవత్సరాలలో మణిపాల్ వైద్య కళాశాలలో అనన్య అనే అమ్మాయి ఎవరూ చదవలేదని యాజమాన్యం తెలియచేసింది. కేసు బట్టబయలయిన తరువాత అసలు అనన్య భట్ అనే యువతి లేనేలేదని సుజాతా భట్ ఒక యూట్యూబర్ దగ్గర నోరు జారారు. కొందరి బలవంతం వల్లనే తాను ఆ అబద్ధం చెప్పానని కూడా అంగీకరించారు. వీరిలో సుజాతా భట్ ఆడిన నాటకం మామూలుది కాదు. ఈమెకు అసలు కూతురే లేదు. ఇంతకీ ధర్మస్థల మీద ఈవిడకు వ్యక్తిగత కక్ష ఎందుకట! కథో, వాస్తవమో తరువాత తెలుస్తుంది. అదేమిటో చూద్దాం! ఈమె తాతగారు తన ఆస్తిని ధర్మస్థల దేవస్థానానికి అమ్మేశారు. అందులో తనను వాటాదారుగా చేర్చడానికి ఆలయ యాజమాన్యం అంగీకరించలేదు. అప్పటి నుంచి ఆమె ఆలయం మీద కక్ష పెంచు కుంది. అబద్ధాల మధ్య ఇంకొ అబద్ధం కూడా చెప్పిందీమె. ఒక హిందూ దేవాలయ యాజమాన్యం జైనుల అధీనంలో ఉండడం ఆమెకు బాధగా ఉందట. అంతిమంగా అనన్య గురించి తాను చెప్పిన దంతా అబద్ధమేనని ఒప్పుకుంది. తన కుమార్తెగా చెప్పిన అనన్య తప్పిపోయిందంటూ ఈ జూలై 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే లేని అనన్య తప్పిపోయినది 2003లో. ఫిర్యాదును అప్పుడు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చింది. ఈ అబద్ధం ఆడితే గుడి నుంచి తన ఆస్తి తనకు అప్పగించేటట్టు చేస్తామని సామాజిక కార్యకర్తలు ఆశ పెడితేనే తాను అబద్ధం ఆడానని సుజాతా భట్ బయటపెట్టింది. గిరీశ్ మట్టన్నావర్, టి.జయంతి అనే వారు చెప్పమన్నట్టే సుజాతా భట్ చెప్పింది. ఇదంతా నేను డబ్బు కోసమైతే చేయలేదు. కాబట్టి యావత్ దేశం నన్ను క్షమించాలని కూడా కోరింది.
నాలుగు దశాబ్దాల కుట్ర
ధర్మస్థల మీద, ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్గడ మీద బురద జల్లే కార్యక్రమం ఈనాటిది కాదు. చెన్నయ్య ద్వారా ఈ భారీ కుట్రకు అనుకోకుండా ముగింపు తప్పలేదు. కానీ దీని వెనుక హిందూ హక్కుల నాయకునిగా చెలామణి అవుతున్న మహేశ్‌శెట్టి తిమరోడితో పాటు అర్బన్ నక్సల్స్ కూడా ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ కుట్ర సాగుతోంది. ఈ కుట్ర వెనుక లక్ష్యం ఎవరంటే- రాష్ట్రంలోనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు. ధర్మస్థల ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వీరేంద్ర హెగ్గడ. ఆయన బీజేపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేవస్థానంలో ప్రధాన పాలనాధికారి లేదా ధర్మాధికారి హోదాలో ఉన్నారు. ధర్మస్థల కేవలం ఆధ్యాత్మిక కేంద్రం కాదు. ప్రజానీకానికి విద్య, వైద్యం ఇతర సహాయాలు అందిస్తున్న సామాజిక సేవాకేంద్రం కూడా.
శ్రీక్షేత్ర ధర్మస్థల ఆధ్వర్యంలో 30 విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో పది ఉన్నత పాఠశాలలు. రెండు ప్రీయూనివర్సిటీ సంస్థలు. ఒక న్యాయశాస్త్ర కళాశాల. ఆరు వైద్య విద్యాసంస్థలు. మూడు మేనేజ్‌మెంట్ కళాశాలలు. ఐదు సాంకేతిక విద్యా కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ శ్రీధర్మస్థల మంజునాథేశ్వర పేరుతోనే ఉంటాయి. ఆయుర్వేదం, ఫిజియోథెరపీ, యోగ, డెంటల్ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం 15,000 మంది భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందుతుంది. రెండు పూటలా ఉచిత ప్రసాదం స్వీకరించవచ్చు.
ఇదంతా అక్కడి క్రైస్తవ సంస్థలకు, కమ్యూ నిస్టులకు, నక్సల్ అభిమానులకు కన్నెర్ర అయింది. ఆనాటి ప్రయత్నంలోను ఈ ముఠా ఓడిపోయింది. ధర్మస్థలలో అబలలు మరణిస్తున్నారంటూ గతంలో బాగా అల్లరి చేస్తూ, అందుకు వీరేంద్ర హెగ్గడను బాధ్యులను చేయడానికి చూశారు. వారిమీద నోటికి వచ్చినట్టు పేలవద్దని సుప్రీంకోర్టు 2022లోనే సోమనాథ్ నాయక్ అనేవాడికి గడ్డి పెట్టింది. ఇతడు నాగరిక సేవా ట్రస్ట్ పేరుతో ధర్మస్థల దేవస్థానానికి పోటీ సేవ ప్రారంభించాడు. అంతకు ముందు బ్తెంగడి న్యాయస్థానం నాయక్, మరో ఐదుగురిని కూడా ఇదే విధంగా హెచ్చరించింది. అయితే న్యాయస్థానాలను వాడుకోవడమే కానీ, గౌరవించే సంస్కృతి తెలియని ఈ అర్బన్ నక్సల్స్ సామాజిక మాధ్యమాలలో వీరేంద్ర హెగ్గడ మీద అవాకులూ చెవాకులూ ఆపలేదు. దీనితో బెల్తంగడి న్యాయస్థానం నాయక్‌కు మూడు నెలలు జైలు శిక్ష, రూ. 4.5 జరిమానా కూడా విధించింది. దీనిని సుప్రీంకోర్టు సమర్ధించింది. సౌజన్య అనే యువతి హత్య (అక్టోబర్ 9, 2012)లో ధర్మస్థల నిర్వాహకుల కుటుంబం ప్రమేయం ఉందని మహేశ్ శెట్టి తిమరోడి ఆరోపిం చడం కూడా ఇలాంటిదే. సౌజన్య ఉదంతం మీద మహమ్మద్ సమీర్ విడుదల చేసిన వీడియో కూడా నాడు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో గిరీశ్ మట్టన్నవార్ అనే మరొక సామాజిక కార్యకర్త సమీర్‌కు వత్తాసు పలికాడు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు కూడా వెనక్కి వెళ్లిపోయారు. గిరీశ్ మట్టన్నవార్ గతంలో పోలీసుశాఖలో పని చేసి సస్పెండయ్యాడు.
దిశ మారిన దర్యాప్తు
ధర్మస్థల ప్రతిష్టను మంట గలిపేందుకే ఇలాంటి భారీ కుట్ర చేశారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా శాసనసభలో వెల్లడించడం విశేషం. ఇదంతా ఒక కుట్రగానే కనిపిస్తున్నది. అందుకే సిట్ కూడా తన దర్యాప్తు దిశను మార్చు కుంది. కుట్ర సిద్ధాంతం ఆధారంగా దర్యాప్తును కొనసాగించే ప్రయత్నాలలో ఉంది. ధర్మస్థల దేవ స్థానానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఐదుగురుని దృష్టిలో ఉంచుకుంటే కుట్ర సిద్ధాంతమే నిజమని అనిపిస్తుంది. ఇందులో మొదటివాడు ముసుగు మనిషి లేదా చెన్నయ్య. మరొకడు మహేశ్ శెట్టి తిమరోడి, ఇంకొకడు యూట్యూబర్ మహ్మద్ సమీర్, సామాజిక కార్యకర్త గిరీశ్ మట్టన్నావర్ కనిపిస్తారు. చివరిగా వచ్చేది సుజాతా భట్. ఒక బృందం ఆడమన్నట్టే తాను అంతా ఆడానని అరెస్టయిన ఆగస్ట్ 23న పోలీసుల ఎదుట చెన్నయ్య అంగీకరించాడు. సుజాతా భట్ చెప్పింది కూడా ఇదే. యూట్యూబర్ చెప్పమన్నట్టే చెప్పానని అన్నారు. అంటే సమీర్ అడమన్నట్టు ఆడారు. చెన్నయ్య ఒక సంవత్సన్నర కాలంగా ధర్మస్థలకు సమీపంగా ఉండే ఉజిరే పట్టణానికి తరుచు వచ్చి వెళ్లినట్టు తెలిసింది. ఉజిరే పట్టణ పారిశుద్ధ్య సిబ్బందిలో ఒకడైన తానోసిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు ముసుగు మనిషికి తమ్ముడే. ఇక మహేశ్ శెట్టిని 20వ తేదీన బ్రహ్మవర పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇతడికి ఉడిపి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సామాజిక కార్యకర్తగా మారిన మాజీ పోలీసు ఉద్యోగి గిరీశ్ మట్టన్నావర్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఇంతకీ ఇంత పెద్ద కుట్ర పన్నిన యూట్యూబర్ సమీర్ గురించి గాలిస్తున్నారు. ఇతడికి మంగళూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆపై ఆచూకీ లేడు.
సామూహిక ఖననం అంటూ వచ్చిన ఆరోపణ లన్నీ నిరాధారమని తేలిందని, కేవలం హిందూ పవిత్ర క్షేత్రాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఇంత కుట్ర పన్నారని వీరేంద్ర హెగ్గడ వ్యాఖ్యానించారు. ఇంతవరకు 17 చోట్ల తవ్వారని ఏమీ దొరకలేదని ఆయన తెలియచేశారు. హిందువులు మరింత జాగరూకతతో ఉండాలని, మన ధర్మాన్ని మనం మరింత జాగ్రత్తగా రక్షించుకోవడం అవసరమని ఆయన అన్నారు. ఒక పథకం ప్రకారం జరుగుతున్న ఇలాంటి దుష్ప్రచారం మీద ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేయించాలని మాజీ ఎమ్మెల్యే అశోక్ కటావే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ధర్మస్థల అంటే మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చింతనకు కేంద్రమని ఆయన అన్నారు. హిందూత్వను అపఖ్యాతి పాలు చేయడానికే కాంగ్రెస్ ఇదంతా సాగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. ఇవాళ ధర్మస్థల దగ్గర చేశారు. రేపు మరొక హిందూ దేవాలయం వద్ద కూడా ఇదే తంతు నడిపిస్తారని ఆయన విమర్శించారు. దీనికి కమ్యూనిస్టుల సాయం కూడా ఉందని అన్నారాయన. ఈ వివాదాన్ని తెర మీదకు తెచ్చిన చెన్నయ్య (ముసుగు మనిషి), మరొక నాటకం ఆడిన సుజాతా భట్ ఇద్దరూ డబ్బులకు ఆశపడి, ఎవరివో ఆదేశాలతో ఇదంతా చేశారని బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి ఆరోపించారు. చెన్నయ్యకు నార్కో అనాలిస్ చేయించాలని పోలీసులు భావిస్తుం డగా, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం కూడా కొన్ని అనుమానాలకు దారి తీసేదని ఆయన అన్నారు. కాగా, ఈ పరిణామం నుంచి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నదని రాష్ట్ర కాంగ్రెస్ ఎదురు ఆరోపణ చేసింది.
కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో హిందూధర్మం దయనీయ పరిస్థితులలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. తమిళనాడులో డీఎంకే ఉంది. ఆంధప్రదేశ్, తెలంగాణలలో ప్రాంతీయ పార్టీలు కూడా హిందూ ధర్మం మీద దాడి పట్ల ప్రేక్షక పాత్ర మాత్రమే వహించాయి. ఇప్పటికైనా హిందువులు మేల్కొనడం అవసరం. ధర్మస్థలలో జరిగినది కేవలం ఒక గొప్ప హిందూ పుణ్యక్షేత్రాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నమే. ఒక యూట్యూబర్. ఒక పారిశుద్ధ్య కార్మికుడు, ఒక మహిళ కలసి ప్రదర్శించిన ఈ తమాషా అత్యంత హేయం. హిందువులు ఇకనైనా కళ్లు తెరుస్తారా? ఉదారవాదం పేరుతో, సెక్యులరిజం పేరుతో మన ధర్మానికి జరుగుతున్న ఘోర అవమానాలను నిలువరించాలన్న ఆలోచనకు రాగలరా? కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వైఎస్‌ఆర్‌సీపీ, బీఆర్‌ఎస్, డీఎంకే వంటి పార్టీలు భారతీయతకు ఎంత అన్యాయం చేస్తు న్నాయో గమనించాలి. ధర్మస్థల పరిణామాలు హిందువులకు కనువిప్పు కలిగించాలి. హిందువులను దొంగలని, హిందూధర్మం కరోనా, డెంగ్యూ వంటిదని విమర్శిస్తున్నా హిందువులు మేల్కొనకపోవడం నిజంగా విడ్డూరం. యూట్యూబర్ల పేరుతో, సెక్యులరిస్టులు, స్టాండప్ కమేడియన్‌ల పేరుతో నిరంతరం మన ధర్మాన్ని అవహేళన చేస్తున్నా మనకు చీమ కుట్టినట్టయినా లేదెందుకు?
మంజునాథుడి కొలువు
శ్రీక్షేత్ర ధర్మస్థల దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి కలిగిన ఆలయం. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మంజునాథేశ్వరుడు కొలువై ఉన్నాడు. శివుడినే మంజునాథేశ్వరుడు (ఆయన అవతారం) అని పిలుచుకుంటారు. ఈ ఆలయం ప్రత్యేక ఏమిటంటే ఇది శైవ ఆరాధన ఆలయమయినా, వైష్ణవ అర్చకులు ఉంటారు. నిర్వాహకులు జైనులు. పేరుకు తగ్గట్టు ఇది ధర్మభూమిగా నమ్ముతారు. భారతీయత ప్రకారం ధర్మమే అత్యున్నత జీవన విలువ. ఇక్కడ ఇంకా ధర్మదైవం, అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. కాలరాహు, కాలర్కయి, కుమారస్వామి, కన్యాకుమారి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం బెల్తంగడిలోని కుడుమ అనే చిన్న గ్రామంలో నిర్మించారు. ఇదే ధర్మస్థలగా స్థిరపడింది. అంటే ధర్మస్థల అసలు పేరు కుడుమ. నేత్రావతి నదికి సమీపంగా ఈ ఆలయం ఉంది. జైన మతానికి చెందిన బిర్మన్న ప్రెగ్గడే, ఆయన భార్య అమ్ము బల్లాలతి ఆ గ్రామంలోనే నివాసం ఉండేవారు. ఒకరోజు ధర్మదేవుడు, నలుగురు దేవతలు మానవరూపంలో వారి ఇంటికి వచ్చారు. ధర్మానువర్తనులైన ఆ జైన దంపతులు దేవతలను ఆహ్వానించారు. ధర్మ ప్రచారం కోసం ఈ ఇల్లు కావాలని దేవతలు కోరడంతో, వీరు ఆనందంగా అంగీకరించారని పురాణం. నలుగురు ధర్మదైవాలను ఇంటిలో ప్రతిష్టించిన తరువాత జైన బిర్మన్న పూజాదికాల కోసం ఒక అర్చకుడిని తీసుకువచ్చాడు. ఆయన శివలింగం కూడా ప్రతిష్ఠించమని సలహా ఇచ్చాడు. అలా మంజునాథేశ్వరుడు వెలిశాడు. ఇప్పటికి బిర్మన్న ప్రెగడ వారసులే ధర్మాధికారులుగా కొనసాగుతున్నారు.
సూత్రధారి సెంథిల్?
ఇంత పెద్ద కుట్రతో, ఇన్ని పాత్రలతో నడిపించిన ధర్మస్థల వివాదం వెనుక కీలక పాత్రధారి ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పుడు అందరి చూపు అతడివైపు తిరుగుతున్నాయి. తమిళనాడులోని తిరువళ్లువర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశికాంత్ సెంథిల్ ప్రమేయం ధర్మస్థల రగడ నిండా ఉందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గాలి జనార్దనరెడ్డి ఆరోపించారు. సెంథిల్ ఐఏఎస్ అధికారి. దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశాడు. వేలాది మృతదేహాల సామూహిక ఖననం హారర్ కథనం ఇతడి సృష్టేనని జనార్దనరెడ్డి ఆరోపించారు. ఈ కుట్ర కేవలం ఇక్కడి వారిదే అనుకోరాదని, దీని వెనుక చాలా విస్తృత పరిధి ఉందని, దుర్మార్గపు రాజకీయాలు ఉన్నాయని అన్నారు. నిజానికి ముసుగు మనిషి లేదా చెన్నయ్య తమిళనాడు వ్యక్తేనని, ఎన్నో ఏళ్లు అక్కడే ఉన్నాడని, చెన్నయ్యకి సెంథిల్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో సాన్నిహిత్యం ఉన్న సెంథిల్ ఒత్తిడితోనే ఆదరాబాదరాగా సిట్‌ను కర్ణాటక ప్రభుత్వం నియమించదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలే సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఈ దుస్థితికి తీసుకువచ్చాయని వ్యాఖ్యానించారు. బళ్లారి కేంద్రంగా పనిచేసే ఒక యూట్యూబర్, వామపక్ష సంబంధాలు ఉన్న మరొక ముగ్గురు ఈ కథంతా నడిపించారని, దీనికి దర్శకుడు కూడా సెంథిల్ అని అన్నారు.
సెంథిల్ మీద ఇలాంటి ఆరోపణలు ఎవరు చేసినా అవి కొట్టి పారేయవలసినవి కాలేవు. 2023లో ఇతడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేశాడు. 2024 ఎన్నికలలో తమిళనాడు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అంటే డీఎంకే సహాయంతో. కాబట్టి ఇందులో డీఎంకే పాత్రను కూడా తేలిగ్గా తీసేయడానికి లేదు. 2024 లోక్‌సభ ఎన్నిక లకు కాస్త ముందు ఇతడు తమిళనాడులో కాంగ్రెస్ దళిత ప్రముఖుడిగా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కావచ్చు నన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇతడి ప్రస్తావ నకి కొసమెరుపు వంటి ఒక పరిణామం ఉంది. ఇతడు 2019లో ఐఏఎస్ హోదాకు రాజీనామా ఇచ్చాడు. కారణం- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసన. తరువాత తిరవళ్లువర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి 5,72,165 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు. అప్పుడు తమిళనాడులో ఏ ఇతర ఎంపీకి ఇన్ని ఓట్లు రాలేదు. ఇవి చాలు, ఇతడి నేపథ్యం ఏదో తెలియడానికి! నిజానికి ఇతడు డీప్‌స్టేట్ అడుగుజాడలలో నడిచే మనిషి. దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్‌గా రాజీనామా చేసినప్పుడే, దేశంలో ప్రజాస్వామిక మూలాలు కనీవినీ ఎరుగని తీరులో రాజీపడుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజీనామా లేఖలోనే ఇతడు పేర్కొన్నాడు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ అని కూడా విమర్శించాడు. దీనితోనే అనంతకుమార్ హెగ్డే (బీజేపీ ఎంపీ) ఈ మనిషికి ఈ దేశంలో ఏం పని? పాకిస్తాన్ వెళ్లిపోతే మంచిది అని తీవ్ర విమర్శలు గుప్పించారు. తరువాతే సెంథిల్ కాంగ్రెస్‌లో చేరి అనతికాలంలోనే వార్ రూమ్ ఇన్‌చార్జ్ అయ్యాడు. ఇతడు లోక్‌సభకు పోటీ చేసినప్పుడు ప్రచారమంతా మెజారిటేరియనిజం, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి మాటలే అన్నాడు. బీజేపీ దేశాన్ని చీలుస్తుందని చెప్పాడు. ఒక్కసారి కులగణన చేస్తే హిందూరాష్ట్ర భావన మిథ్యగా మిగులుతుందని ఏప్రిల్ 16, 2024న డెక్కన్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐఏఎస్ హోదాకు రాజీనామా ఇచ్చిన తరువాత ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా జరిగిన అనేక కార్యక్రమాలలో సెంథిల్ పాల్గొన్నాడు. కాంగ్రెస్ తనకు తగిన వేదిక అని కూడా ప్రకటించాడు. ఒక విధంగా చూస్తే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తమిళనాడుకు చెందిన కర్ణాటక కేడర్ ఐపీఎస్. సెంథిల్ తమిళనాడుకు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. అన్నామలై రాజీనామా చేసి బీజేపీలో చేరిన కొద్ది కాలానికే సెంథిల్ రాజకీయాలలోకి వచ్చాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలిని అపఖ్యాతి పాల్జేయడానికే ఇలాంటి ఆరోపణలు తెచ్చారనడం సరికాదని తమిళనాడులోని తిరువళ్లువర్ లోక్‌సభ నియోజక వర్గ కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ ప్రకటించడం విశేషం. సెంథిల్ కర్ణాటక కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. అలాంటి వాదనలన్నీ నిరాధారాలని కూడా అన్నాడు. కానీ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న తీరులోనే ఇతడి ప్రకటన ఉంది. ఇలాంటి ఆరోపణను ఇంకా ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డిని ఆయన హెచ్చరించాడు.
————————