బాలదైవంగా ఉద్భవించి దేవతాగణంలో విశేష పూజనీయ స్థానం పొందాడు వినాయకుడు. పురాణాలు ఆయనను ఎంతగానో ప్రశంసించి, స్తుతించాయి. ఏ దైవాన్ని పూజించాలన్నా బుద్ధిరాశి, శుభగుణ సంపన్నుడైన ఆయనను తొలుత అర్చిస్తారు. ఇతర దేవతల్లో చిన్నవాడైనా బుద్ధిలో బృహస్పతి లాంటివాడు. అందుకే పంచ మహాదేవతల్లో (విష్ణువు, శివుడు, సూర్యుడు, భగవతి) ఒక్కడ•య్యాడు. తన సర్వజ్ఞతతో రుగ్వేదకాలంలో దేవతలకు ఆచారత్వం వహించిన ఆ దైవమే పురాణాల కాలానికి గజముఖుడుగా, వినాయకుడిగా, గణపతిగా రూపాంతరం చెందాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. వినాయకోత్పత్తిపై అనేక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నప్పటికీ అన్నింటిలో గల సామాన్య లక్షణం మట్టిగా కనిపిస్తుంది. పార్వతీమాత అభ్యంగన స్నాన సమయంలో నలుగు పిండితో రూపొందించిన బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసినదే ప్రాచుర్యంలో ఉంది.

‘హస్తానక్షత్ర సంజాతం విఘ్నేశ్వరం గజాననం

పార్వతీ హృదయాంబోధి సోమం సదా స్మరామ్యహం’

ఎలాంటి పూజ, వ్రతమైనా,యజ్ఞయాగాది క్రతువులైనా తొలి పూజ ఆయనకే. యజ్ఞత్వం, దైవత్వం, మంత్రత్వం, ద్రవ్యత్వం..అనే నాలుగు అంశాలతో కూడినదే గణపతి ఆరాధన. ముక్కోటి దేవతల్లో ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. బ్రహ్మవిష్ణురుద్రాది దేవతలు తమ విశ్వరక్షణ కార్యకలాపాల ఆరంభంగా గణేశుడిని పూజిస్తారని శివమహాపురాణం పేర్కొంటోంది. సకల దేవతల పూజలను అందుకొనే గణపతిని వేదం ‘బ్రహ్మణ స్పతి’గా ప్రస్తావించింది. శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవులు వినాయక వ్రతం చేసి విజయం సాధిం చారని స్కంద పురాణం పేర్కొంది.

‘గణం’ అంటే సమూహం.అనేక గణాల మేలు కలయికైన సృష్టిని నడిపే లోకనాయకుడు గణాధిపుడు. ‘గణ’ అనే ధాతువుకు లెక్కించడం అనే అర్థం కూడా ఉంది.ఆయన ప్రతి విషయాన్ని సూక్ష్మంగా, జాగ్రత్తగా ఆలోచిస్తాడు. అనేకంగా వ్యాపించి ఉన్న గణాలను ఏకోన్మోఖం చేసే మహా చైతన్యమూర్తి గణపతి. ‘గణ’పతిగా నలుగురిని కలిపి, వారితో తాను కలిసి పని చేసి, పనిచేసే నేర్పును అలవరిచాడు. అదే ‘గణేశ్‌ ‌విద్య’. సంఘటన శాస్త్రాన్నే ‘గణేశ్‌ ‌విద్య’గా వ్యవహరిస్తారు.

శక్తి,యుక్తి, ఆనందం, ఐశ్యర్యం అనే అంశాల పరిపూర్ణతత్వమే గణపతి రూపం. విష్ణుతేజస్సు, బ్రహ్మ యశస్సు, ఈశ్వరుడి ఓజస్సు ఏకీకృతమై విలసిల్లే విరాట్‌ ‌మంగళమూర్తిగా విశ్వ గణపతి ప్రకటిత మయ్యాడు. ఆనందమే గణేశుడి రూపమని శ్రీ విద్యార్ణ వతంత్రం పేర్కొంది. బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాలు గణపతి గాథలను విపులంగా ప్రస్తావించాయి. రుగ్వేదంలో గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. పరమేశ్వ రుడు, పరాశక్తి ఏకీకృతంగా ప్రకటించిన ప్రసన్న భావమే ‘గణపతి’ స్వరూపం అని బ్రహ్మాండపురాణం పేర్కొంటోంది. ఆయనను ప్రణవనాద స్వరూపుడిగా, శబ్దబ్రహ్మ ఆకృతిగా ముద్గల పురాణం, లోకరక్షకుడిగా గణేశపురాణం, సమస్త లోకానికి ఆధారశక్తిగా గణేశగీత చెబుతున్నాయి.

భవిష్యోత్తర పురాణాన్ని అనుసరించి, వినాయక చవితి పర్వదినాన్ని మధ్యా హ్నవ్యాప్తి (‘పూజావ్రతేషు సర్వేషు మధ్యాహ్నవ్యాపినీ తిథిః’) గల చవితి తిథినే గ్రహించాలి. ఒకవేళ చతుర్థ తిథి మధ్యాహ్న వ్యాప్తిని లేకపోతే ముందు తిథి (తదియ)ని ప్రామాణికంగా తీసుకోవాలి. చవితి ఆది, మంగళవారాలలో వస్తే ప్రశస్థమని చెబుతారు. భాద్రపద శుద్ధ చవితిని వరద చతుర్థి అంటారు. వేదజ్ఞులు సాధారణంగా శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ నిర్వహిస్తే, సామవేదజ్ఞులు ఈ చవితి నాడే దానిని ఆచరిస్తారు. ఆయన బాల, తరుణ, భక్తి, వీర, శక్తి, ధ్వజ, సిద్ధి, ఉచ్ఛిష్ట, విఘ్న, క్షిప్ర, హేరంబ, లక్ష్మీ, మహా, విజయ, నృత్య, ఊర్ధ్వ, ఏకాక్షర, వర, త్య్రక్షర, క్షిపప్రసాద, హరిద్రా, ఏకదంత, సృష్టి, ఉద్దంఢ, రుణవిమోచన, డుంఢి, ద్విముఖ, త్రిముఖ, సింహ, యోగ, దుర్గ, సంకటహర గణపతిగా (ముప్పయ్‌ ‌రెండు రూపాలుగా) పూజలు అందు కుంటున్నాడు.

గణేశుడిని ఇరవై ఒక్క (ఏకవింశతి) పత్రాలతో పూజిస్తారు. పంచ భూతాలు, పంచకర్మేంద్రియాలు. పంచజ్ఞానేంద్రియాలు, పంచ తన్మంత్రాలు, సాధకుడి మనసు… వెరశి 21 మార్గాల ద్వారా దేహమనే దేవాలయంలోకి గణపతిని ఆవాహన చేసుకోవడమే పత్రిపూజ పరమార్థంగా చెబుతారు. వినాయకుడు హరిహర అభేదకుడు. శ్రీహరి పది అవతారాలు, మహేశ్వరుడి ఏకాదశ (11) రూపాలకు ఈ 21 రకాల పత్రి ప్రతీకలుగా పేర్కొంటారు.

ప్రకృతిని భగవత్‌ ‌స్వరూపంగా భావించి ఆరాధించడం వినాయక వ్రత విధానంగా చెబుతారు. ఆయన రూపుదాల్చిందీ వర్ష రుతువులోనే. ఈ కాలం ప్రకృతి ఆకులు, పూలతో హరితమయంగా ఉంటుంది. భూమిని, ప్రకృతిని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయన్నది చవితి అందించే ప్రధాన సందేశం. ఆదిదేవుడిని అర్చించే.. మాచీ పత్రం, బృహతీపత్రం (ములగ), బిల్వ (మారేడు), దూర్వారయుగ్మం (గరిక), దత్తూర (ఉమ్మెత్త), బదరీ (రేగు), అపామార్గ (ఉత్తరేణి), తులసీ పత్రం, చూతపత్రం (మామిడి), కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (అవిసె), దాడిమీ (దానిమ్మ), దేవదారు, మరువక, సింధూర (వావిలాకు), జాజి, గండకీ (కామంచి), శమీ (జమ్మి), అశ్వత్థ (రావి), అర్జున (మద్ది), అర్క (జిల్లేడు) పత్రులన్నీ ఓషధీ గుణాలు కలిగినవే. వీటి ద్వారా అనేక వ్యాధులను నివారించ వచ్చని ప్రకృతి వైద్యం చెబుతోంది. వీటిలోనూ గరిక శ్రేష్ఠమైనది. ఇది చర్మవ్యాధులను నివారిస్తుంది. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే.

నిరాడంబరతను నేర్పే వేలుపు వినాయకుడు. భగవంతుడు భక్తసులభుడు అనుకుంటే విఘ్న నాయకుడు ముందుంటాడు. తమలపాకుపై ప్రతిష్ఠించినా సంతోషిస్తాడు. విలువైన నగలు, ఆభరణాలు కోరడు. ప్రకృతిలో లభించే పత్రాలను సేకరించి భక్తితో అర్చిస్తే ఆనందపరవశుడవుతాడు. గణపతిని విద్యాదేవతగా భావించి పూజిస్తారు. భాద్రపద శుద్ధ చ•వితినాడు గణాధిపత్యం సిద్ధించడంతో ఆనాడు భక్తజనులు షోడశోపచారాలతో ఆయనను అర్చిస్తున్నారు. వినాయకుడి మరుగుజ్జు రూపం చూచి నవ్విన చంద్రుడిని ఆరోజు దర్శించిన వారు నీలాపనిందలు పాలవు తారన్నది పార్వతీదేవి శాపం. అయితే శ్యమంతకోపాఖ్యానం కథ చెప్పుకొని స్వామివారి పూజాక్షితలు శిరస్సునదాలిస్తే దోష పరిహారమవుతుందని విష్ణు పురాణం (సింహ ప్రసేన మవధీత్సింహా జాంబవతా హతః/సుకుమారక మారోదీస్త వహ్యేషః శ్యమంతకః) పేర్కొంది. వినాయకుడిని అర్చించిన తరువాత ఆ ప్రతిమకు ఉద్వాసన (నిమజ్జనం) చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రతిమ(ల)ను ధాన్యాగారంలో భద్రపరచే ఆచారమూ ఉంది. గాదెలో ధాన్యం అక్షయమై ఉండాలనే వాంఛతో సిద్ధి వినాయకుడి ప్రతిమను అలా ఉంచుతారు. దానివల్ల ఆయన వాహనం మూషిక సంతతి ధాన్యానికి నష్టం చేయవని నమ్మకం.

వినాయక పర్వదినంలో ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఎన్నో సామాజిక, వ్యక్తిత్వ వికాస అంశాలు అంతర్లీనంగా ఉన్నాయి. గజాననుడు యోగులకు పరబ్రహ్మ, నర్తకులకు నాట్యాచార్యుడు, భాగవతులకు గానమూర్తి, విద్యార్థులకు విద్యాగణపతి, భక్తులకు సంకటహారకుడు, సర్వసిద్ధి ప్రదాత. ఆయన శైలి వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనం. ముఖ్యంగా… తల్లిదండ్రులను సేవించడానికి మించిన తీర్థాలు లేవని ఆయన వృత్తాంతం చాటి చెబుతోంది. మాతాపితరుల ప్రదక్షిణంతోనే సర్వలోక ప్రదక్షిణ చేసి, గణాధిపత్యాన్ని సాధించిన బుద్ధిశాలి, వివేక చూడామణి. కన్నవారిని నిరాదరించే సంతతి గ్రహించవలసిన అంశం.

విఘ్నాలు తొలగేందుకు ఆయనను అర్చించడంతో పాటు ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణంలోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది. గెలవాలని సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని, స్వీయ లోపాలు పెద్ద సమస్య కాబోదని లోకానికి చాటి చెప్పాడు. తన స్థూల కాయానికి, అతికించిన గజముఖానికి వగచలేదు. కుశాగ్రబుద్ధితో ఆ లోపాన్ని అధిగమించి సర్వలోకాల మన్ననలు అందు కుంటున్నాడు. శారీరకంగా లోపాలను అధిగమించి ప్రతికూలతలను అను కూలంగా మార్చుకొని గణాధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించాడు. మాతాపిత రులను ప్రత్యక్ష దైవాలుగా భావించిన మార్గదర్శకుడు. మాతృ వందనంతో సర్వదేవతా వందనం చేసిన వినయశీలి. ‘గణ’పతి అయి నలుగురిని కలిపి, వారితో తాను కలిసి పని చేసి, పనిచేసే నేర్పును అలవరిచాడు. ‘గణేశ్‌ ‌విద్య’ అంటే అదే. సంఘటనశాస్త్రాన్నే ‘గణేశ్‌ ‌విద్య’గా వ్యవహరిస్తారు. వ్యాసభగవానుడు చెబుతుంటే విని భారతాన్ని రాయడంలోనే గజాననుడి సర్వవిద్యా పారంగత్వం, కుశాగ్రబుద్ధి వెల్లడవుతుంది.

గజాననుడి అవయవ విశిష్టతను ఆధ్యాత్మికవేత్తలు వివిధ కోణాల్లో, అర్థాల్లో విశ్లేషించవచ్చు, విశ్లేషిం చారు. ఉదాహరణకు, కళ్లు ఎంత పరిమాణంలో ఉన్నాయన్నది కాదని, ఎంత నేర్పుగా, నిశితంగా పనిచేస్తున్నాయన్నది ముఖ్యమని చిన్నచిన్న కళ్లు విశదీకరిస్తాయి. ఎవరేమి చెప్పినా వినాలనే విషయాన్ని తన పెద్ద చెవుల ద్వారా చాటి చెప్పాడు. సాధనం చిన్నదే అయినా దానితోనే పెద్ద కార్యాలు సాధించగలమనే విషయాన్ని వాహనం మూషికాన్ని చూచి నేర్చుకోవాలి..

వివిధ వర్గాల మధ్య సుహృద్భావం, జాతీయ భావాల పెంపునకు గణపతి నవరాత్రి ఉత్సవాలు తోడ్పడతాయన్న భావనతో వీరశివాజీ ఈ ఉత్సవా లను ఘనంగా, బహిరంగ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆయన తరువాత ఉత్సవ నిర్వహణకు కొంత ఆటంకం కలిగినా స్వరాజ్య సమరం సమయంలో నేతలు దానిని అందిపుచ్చుకున్నారు. బాలగంగాధర తిలక్‌ ‌గణపతి నవరాత్రులను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన ఈ పూజలు ఆయన ఆధ్వర్యంలో సామూహిక ఉత్సవంగా రూపుదిద్దు కుంది. అలా మైదానాలలో, కూడళ్లలో విగ్రహాలు ప్రతిష్ఠించి పూజాదికాలు నిర్వహించి నిమజ్జనం చేసే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.

వినాయక ఆరాధన మన దేశానికే పరిమితం కాదు. నేపాల్‌, ‌భూటాన్‌, ‌టిబెట్‌, ‌చైనా, కంబోడియా, జపాన్‌, ఇం‌డోనేసియా, సింగపూర్‌ ‌వంటి దేశాలో ప్రాచీన కాలం నుంచి గణపతి ఆరాధన ఉండేది. పలుదేశాల్లో ఇప్పటికీ ఆరాధన కొనసాగుతోంది. జావా, బాలి, బోర్నియా, బర్మా, కంబోడియా, జపాన్‌, ‌థాయ్‌లాండ్‌, ‌టిబెట్‌, ‌సింగపూర్‌ ‌వంటి తూర్పు, ఆగ్నేయదేశాలలో పురాతన కాలనాటి వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇండోనేసియా కరెన్సీపై గణపతి బొమ్మ దర్శనమిస్తుంది.

వినాయకుడు ప్రకృతి ప్రియుడు. అందుకు తగినట్లుగానే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని మట్టితో తయారైన వినాయక ప్రతిమ(ల)ను అర్చించడం ఉత్తమం. విగ్రహాల తయారీలో రసాయ నాల వాడకం ఎక్కువ కావడం పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తోంది. ముఖ్యంగా నిమజ్జన సందర్భాలలో సరస్సులు, చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి.ఈ నేపథ్యంలో అలాంటి విగ్రహాల తయారీని మానుకోవాలని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు హితవు చెబుతూ ఉద్యమిస్తున్నాయి. ‘ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమిం చాలి. దాంతో చెలిమి చేయాలి, కాపాడుకోవాలి.నా రూపమైన ప్రకృతిని ప్రేమించి, ఆరాధించండి. అది సర్వదా, సర్వధా రక్షిస్తుంది’ అనే సందేశాన్ని గ్రహించ వలసి ఉంది.

‘తత్పురుషాయ విద్మహే

వక్రతుండాయ ధీమహి

తన్నోదంతిః ప్రచోదయాత్‌’

‌డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE