భావాలు మనసులో పుడతాయి. ఇవి ఏదో ఒక భాషలో అల్లుకుంటాయి. ‘‘మానవుడు తన భావాలను, కోరికలను బుద్ధిపూర్వకంగా వ్యక్తం చేయడానికి క్రమపద్ధతిలో ఉచ్చరించే ధ్వనుల సముదాయపు విధానం భాష’’ అని సపేర్ ‘లాంగ్వేజ్’ అన్న గ్రంథంలో వివరించాడు. తర్వాత కొన్ని వేల సంవత్సరాలకి లేఖన విధానం లేదా భాషకు లిపి వచ్చింది. మానవ పురోగమన దిశలో మనిషి రాయడం నేర్చుకోవడాన్ని గొప్ప పరిణామ క్రమంగా భావించవచ్చును. మాట్లాడటం ఎదుటివారికోసం, రాయడం దూరంగా ఉన్నవారి కోసం. నోటి మాట ఒక్క మారే వినబడుతుంది. చేతివ్రాత చాలాసార్లు చూసి చదవవచ్చును.
లిపి ఒక కోడ్. రాసే వారు తమ భావాలను, అంటే భాషను లిపి కోడ్ లోనికి మార్చి అందిస్తారు. దీనిని చదివే వారు డికోడ్ చేసుకొని చదువుతారు. అందుచేత లేఖక పాఠకులకు సందిగ్ధత లేని అవగాహన ఉండాలి. భాషాధ్వనులను లిపిలోకి తేవాలంటే ధ్వనులకు అక్షర సంకేతాలు కావాలి. దీనికి వర్ణమాల అవసరం.
ఉత్తర భారతదేశం అంతా వ్యాపించివున్న ఆస్ద్రిక్ భాషా వ్యవహర్తలైన ఈ ఆదివాసీలు నేడు అస్సాం, పశ్చిమబెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. వీరిలో ‘సోర’’ భాష మాట్లాడే హిందువులను సవర లేదా శబరి అని వ్యవహరిస్తారు. 1921 సం।। లెక్కల ప్రకారం వీరి జనాభా 2,10,5110. వీరికి భాష ఉంది (సవర భాష), దానికి లిపి లేదు. ‘తెలుగు’ భాషలో ఇద్దరే ఆచార్యులున్నారు. ఒకరు నన్నయ్యభట్టు, రెండు గిడుగు రామమూర్తి. వారు చూడని గ్రంథం లేదు. మథించని శబ్దం లేదు. వీరు తెలుగుతల్లి ముద్దుబిడ్డలు అన్నారు విశ్వనాథ• సత్యనారాయణ.
రామమూర్తి దుందుభినామ సంవత్సరం, ఆగస్టు 29, 1863న పర్వతాలపేటలో (శ్రీకాకుళం జిల్లా) జన్మించారు (రాజా విక్రమ దేవవర్మ కూడా ఇదే గ్రామంలో జన్మించారు). వీరు వ్యవహారిక భాషా వాదులు. వీరి జన్మదినాన్ని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వీరు శాసన పరిశోధకులు. అన్నింటికి మించి సవర భాషకు లిపిని, వ్యాకరణాన్ని, నిఘంటువును తయారు చేసిన ఘనులు. 22.01.1940న మరణించేవరకూ సవర భాషా సేవ చేస్తూనే ఉన్నారు.
గిడుగు రామమూర్తి 1880లో మెట్రిక్ ఉత్తీర్ణులైన తరువాత విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో గుమస్తా పని కోసం నెలకు 15 రూపాయల జీతం, విజయ నగరం దగ్గర కోనాడలో నెలకు 25 రూపాయల జీతం, మన్యం ప్రాంతం పర్లాకిమిడిలో 30 రూపాయలు జీతంతో పనిచేశారు. ఎక్కడ పని చేస్తావని అడగ్గా 5 రూపాయలు ఎక్కువ ఇస్తారనే ఉద్దేశంతో పర్లాకిమిడిలో చేరతానన్నారు రామమూర్తి. వారి ఈ నిర్ణయమే ప్రపంచానికి మొదటి సవర భాషావేత్తను అందించింది.
పర్లాకిమిడిలో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అక్కడ ప్రతి శనివారం జరిగే సంతలో గిరిజనులైన సవరలను చూస్తుండేవారు. వారి ఆకారం, వేషం, భాష అన్నీ వేరుగా కన్పించాయి. వారు లెక్కలు తెలియని అమాయకులు, నిరక్షరాస్యులు. సంతలో వర్తకులు వీరిని ఏ విధంగా మోసగిస్తున్నారో చూశారు. తన అభిరుచి కనుగుణంగా శాసన పరిశోధన చేస్తూ విజ్ఞాన సముపార్జన చేస్తూ కాలం గడపాలా? లేక సవరల అభివృద్ధికి కృషి చేయాలా అని ఆలోచించారు. రామమూర్తి గారిలోని మానవత్వం మేలుకొంది. అమాయకులు, నిరుపేదలు అయిన సవరల జీవితాలను మెరుగు పరచాలను కొన్నారు. వారికి చదువు నేర్పాలనుకున్నారు. వారికి వ్యవహార జ్ఞానం కల్పించాలనుకున్నారు. అందుకు తాను ముందుగా సవరలతో స్నేహం చేయాలి. అందుకోసం సవర భాష నేర్చుకొన్నారు. భాషాశాస్త్రం చదువుకున్నారు. ప్రభుత్వం సవరల కోసం పాఠ శాలలు స్థాపించి వారి మాతృభాషలో విద్యాబోధన చేసి, వారిని జన జీవన స్రవంతిలోనికి తెచ్చేవరకు రామమూర్తి కృషిని కొనసాగించారు.
శబర అన్న పదాన్ని జాతి వాచకంగానూ, భాషావాచకం గానూ కూడా వాడుతున్నాం. శబర జనులు మాట్లాడే భాష సవర భాష. తెలుగువారు ‘సవర’ అంటే, ఓడ్రులు ‘శబరో’ లేక ‘స’ ఓర’’ అంటున్నారు. గిడుగు రామమూర్తి”A Manual of the SO:RA (or Savara) Language” లో ‘స’ ‘ఓర’ అన్నదే సరైన ఉచ్చారణ అని అభిప్రాయ పడ్డారు. నేడు సవరలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తూర్పు కనుమల్లోనూ, ఒరిస్సాలోని కోరాపుట్, కలహండి, మయూర్‌భంజ్, బాలాసోర్, కటక్, గంజాం, గజపతి జిల్లాల్లోను ఎక్కువగా కనిపిస్తున్నారు.
రామమూర్తి తెలుగు, ఒరియా వచ్చిన ‘తవుడు’ అనే వ్యక్తిని గురువుగా పెట్టుకొని సవర భాష నేర్చుకుంటూ ఉండేవారు. 1884 నాటికి కొంత భాష అలవడింది వీరికి. ఆ ఏడదిలో జరిగిన ఓ సంఘటన రామమూర్తి పట్టుదలను పెంచింది. తవుడు గురువు సవర భాష చెపుతూ ఉండగా ఇద్దరు సవర బాలురు కట్టెలు, కొండచీపుళ్లు పట్టుకొని వచ్చారు. వాటిని కొని డబ్బులిచ్చిన తరువాత రామమూర్తి కోరిక మేరకు ఆ బాలురు కాసేపు కూర్చున్నారు. రామమూర్తి వారితో సవర భాషలో మాట్లాడారు. వీరి మాటలకు ఆ బాలురు నవ్వడం ప్రారంభించారు. వచ్చిన సవర బాలురకు ఒకడికి తెలుగు, మరొకనికి ఒరియా కొంచెం తెలుసు. ఛీ ఛీ, ఇవి అసలైన సవర మాటలు కావు, కాపు సవర (తెలుగు పదాలు కలసిన సవర) డొంబొసోర (ఒరియా పదాలు కలిసిన సవర) అని పరిహసించారు. దానితో రామమూర్తి తన మూడు సంవత్సరాల కృషి వృథా అయిందని బాధ పడ్డారు. తరువాత కొండపై నున్న మాళువా సవరలను తెప్పించుకొని తిండి, బట్ట, డబ్బు ఇచ్చి భాష నేర్చు కున్నారు.
సవరలతో స్నేహం చేయడమంటే అదో విన్యాసం. వారు నాగరికులను నమ్మరు. స్నేహం కుదిరితే ప్రాణం ఇస్తారు. స్నేహనికంగీకరించిన సవరలు తేనె, పసుపు, అల్లం, రెండు కొండచీపుర్లు పట్టుకు వస్తారు. వారికి మనం రెండు ఎర్రని కుచ్చుటోపీలు, రెండు కట్టల చుట్టలిచ్చి భోజనం పెట్టాలి. తరువాత వారు గడీ ఞేన్ (స్నేహితుడు నా) గడీనమ్ (స్నేహితుడు నీ) అని చెప్పి చీపురు పుల్లలను మూడుమార్లు విరిచి పడవేస్తారు. ‘‘నేను నీ స్నేహితుడను, నీవు నా స్నేహితుడవు’’ అని పరస్పరం ఆత్మీయతను ప్రకటించుకోవడం దీన్ని వాళ్లు నేస్తం కట్టడం అంటారు (గిడుగు రామమూర్తి జీవిత చరిత్ర (రచయిత, మనుమడు) జి.వి.రామమూర్తి).
అయితే తవుడు గురువు వద్ద నేర్చుకున్న డొంబొసోరే అంటే ఒరియా తెలుగు పదాలు కలిసిన భాష కొంత ఉచ్చారణ తేడానే గాని అది రామమూర్తి గారికి సవర భాష లిపి తయారీలో బాగా ఉపయోగ పడింది.
సోర భాష అభివృద్ధికి నోచుకోని భాష. దానికి గుర్తించదగిన ప్రామాణికత లేదు. ఒక గ్రామానికి మరో గ్రామానికి, ఒక మనిషికి మరో మనిషికి ఉచ్చారణ భేదం కనిపిస్తుంది. సజీవ భాషల్లోనే ఉచ్చారణ భేదాలుంటాయి. రామమూర్తి తాను నేర్చుకున్న భాష గుమ్మ మాండలికమని, ఎక్కువ మంది సవరలు ఈ మాండలీకాన్నే అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ మాండలికంలోనే రామమూర్తి క్రింది తరగతులకు వాచకాలు తయారుచేశారు. వీరు ఈ భాషను క్షుణ్ణంగా నేర్చుకోడానికి 30 సంవత్సరాలు పట్టింది. పదాలు గుర్తుండడం కోసం నోట్సు రాసుకున్నారు. వాక్య విశ్లేషణ చేస్తూ వ్యాకరణం తయారుచేశారు. సవరలతో నేస్తం కట్టారు. వారి పల్లెలకు వెళ్లారు. వారి కుటుంబ జీవితం చూశారు. వారి విధానం చూశారు, కథలు విన్నారు. వాటిని రాసుకున్నారు. చివరకు గిడుగువారు సవర భాషా పండితులయ్యారు.
రామమూర్తి సవర భాష నేర్చుకోవడం కోసం భాషాశాస్త్రాన్ని చదివారు. ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు వ్యాకరణలతోపాటు గ్రీకు, లాటిన్ వ్యాకరణాలు చదివారు. ఆయన మేధస్సు ముందు ప్రపంచ భాషాశాస్త్రవేత్తలు తలలు వంచవలసిందే. 1890 నాటికే సవర భాషలో డల్‌లూ గమజ్ గు-అరి-నేబఞజి (చెట్లు రోదిస్తున్నాయి) మొదలైన మాళువ సవరలు పాడిన పాటలను రాసుకున్నారు. వీటిని బడిపిల్లల చేత పాడించేవారు. అయితే ఈ కృషికి రాజావారి తోడ్పాటు గానీ, ప్రభుత్వ సహాయంగానీ లభించలేదు. ఆయన తమ సొంత ధనాన్ని వెచ్చించి పర్లాకిమిడి ప్రక్కన గల గ్రామాల్లో గ్రాంటు బడులు పెట్టి గ్రాంట్ కోసం ప్రయత్నించారు.
1894లో గవర్నర్ పర్లాకిమిడి రాగా వారిని సన్మానించి సవరల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం వారు బడులు పెట్టవలసిందిగా కోరుతూ ఒక మెమోరాండం సమర్పించారు. కాని ఆ సభకు వచ్చిన గంజాం కలెక్టర్ మెకార్ట్నీ గవర్నర్ భోజన సమయంలో ఇలా వివరించాడు ‘‘రామమూర్తి పంతులు పిచ్చివాడు, స్థిమితంగా జీవిస్తున్న సవరలకు లేనిపోని ఆశలు కలిగించి ప్రశాంతమైన సవర దేశంలో విప్లవం పుట్టించదలచాడు. అతడు సవర దేశం వెళ్లడానికి వీలులేదని శాసించదలచాను’’ అని గవర్నర్ అనుమతిని కోరాడట. కానీ దానికి గవర్నర్ సుముఖత వ్యక్తం చేయలేదట.
1900లో ‘‘పొట్టిగాడు’’ అనే సవర వానికి తిండి, బట్టపెట్టి కొంతకాలం అతడికి చదువు చెప్పి, రోజుకు పావలా తన సొంత సొమ్ము ఇచ్చి సవర పాఠశాలను ప్రారంభించారు. తరువాత కొందరు సవరలను ఉపాధ్యాయులుగా తయారుచేసి పల్లె బడులకు పంపారు. బడిపిల్లల హాజరు తీసుకోవడం పాఠశాలల పనితీరును గురించి కూడా రాసుకొనే వారు. సవర గ్రామాల చిట్టాను తయారు చేసుకు న్నారు. భాష నేర్పే ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. తరువాత ఉపాధ్యాయుల శిక్షణ పాఠశాల ప్రారంభించారు.
అటవీశా• అధికారిగా వెల్ష్‌మెన్ 1908లో పర్లాకిమిడి వచ్చారు. ఏజన్సీ ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు సవర భాష నేర్చుకోవాలనే నిబంధన ఉంది. కాబట్టి రామమూర్తి దగ్గర వెల్ష్‌మన్ అంతర్జాతీయ ధ్వని లిపి ద్వారా చాలా తక్కువ సమయంలోనే సవర భాష నేర్చుకోగలిగాడు. తరువాత ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు.
1929లో సెరంగోలో సవర భాషా బోధనకు ఒక పాఠశాలను మద్రాసు ప్రభుత్వం ప్రారంభించగా దానికి వెల్ష్‌మెన్ పేరును రామమూర్తి సలహా మేరకు పెట్టారు. వెల్ష్‌మెన్ తరువాత 1921లో సవర భాషను అంత శ్రద్దగా నేర్చుకున్నవారు ఫ్రెంచ్ దేశానికి చెందిన మిస్. మన్రో. ఆమె అరణ్యాలకే పరిమితమైన సవరలకు బాహ్య ప్రపంచాన్ని చూపారు.
చివర్లో రామమూర్తి సవర మాన్యుయల్ మిస్ మన్రోకు అంకితమిస్తూ ఇలా రాశారు. ‘‘నా కృషిని ఎంతగానో ప్రశంసించిన నా మిత్రురాలు మిస్.ఎ.సి. మన్రోగారికి రుణపడియున్నాను. సోర భాషలో మాట్లాడటానికి ఆ భాషలో మత బోధన చేయడానికి కొంతకాలం వారు నా వద్ద సోరభాషను అభ్యసిం చారు. నా సోర భాషాజ్ఞానాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి అది నాకు ప్రోత్సాహమిచ్చింది. నా భాషాజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోనికి తెచ్చారు. ఆమె వలె ఇతరులు కూడా సోరలకు మేలు జరిగే విధంగా ఈ భాషాజ్ఞానాన్ని ఉపయోగిస్తారని నా ఆశ’’ అన్నారు.
‘‘అనాదిగా రుషులకు జన్మభూమి అయిన ఈ భారత క్షేత్రంలో ఇప్పటికీ రుషులు అవతరిస్తూనే ఉన్నారు. రుషితుల్యులైన అటువంటి మహానుభావుల్లో ఒకరు శ్రీ గిడుగు రామమూర్తిగారు’’ అన్నారు చారిత్రక నవలా రచయిత నోరి నరసింహశాస్త్రి. ‘ఆంధ్ర భాషారసాన్ని పుక్కిలించి ఉమిసిన ఆధునిక అగస్త్య మహర్షి ఆయన’ అన్నారు చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ.
మూలం:
- గిడుగు దర్శనం, డా।। అల్లంశెట్టి చంద్రశేఖర్ రావు, పేజి.10, 12, 27 టు 50.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు