చరిత్ర రచన ఒక చరిత్రకారుడితో ముగిసిపోదు. ఒక తరంతో ఆగిపోదు. అదొక నిరంతర పక్రియ. సర్వం రాజకీయ మయం చేసిన ఒక యాభయ్ ఏళ్ల స్వతంత్ర భారత పాలన భారతీయ చరిత్రను అపవిత్రం చేసిందంటే అతిశయోక్తి కాదు. బ్రిటిష్ ఇండియా వలస పాలకులు భారత దేశ చరిత్రకు చేసిన ద్రోహానికి ఇది అదనం, కొనసాగింపు. ఆ యాభయ్ ఏళ్ల పాలనలోని రాజకీయ బలహీనతలే అదనుగా సెక్యులరిజం పేరుతో, ఉదారవాదం పేరుతో హిందూ పాలకుల చరిత్రను తీవ్రంగా అవమానించారు. బానిస వంశీకుల పాలన, మొగల్ పాలన వివాదాలకు అతీతం కాదు. ఆ చరిత్రరచనలో మరుగుపరచిన నిజాలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో, విశ్వవిద్యాలయాలలో వామపక్ష వాదాన్ని నమ్మే, నమ్ముతున్నట్టు కనిపించే ఆచార్యులు అంతా కలసి వాస్తవాలను కప్పిపుచ్చారు. ఇప్పటికీ అదే ప్రయత్నంలో ఉన్నారు. కేరళను పాలిస్తున్న సీపీఎం ఈ ఆగస్ట్ 12న ఇచ్చిన ఆదేశాలు అందుకు తిరుగులేని సాక్ష్యం. దేశ విభజన నాటి ఘోరాలను జ్ఞాపకం చేసే ప్రయత్నం చేయవద్దని నిస్సిగ్గుగానే ఆదేశాలు ఇచ్చింది. ప్రపంచ చరిత్రలోనే అతి దారుణమైన, రక్తసిక్తమైన విభజన విషాదాన్ని గుర్తు చేసుకోవడం సీపీఎంకు రుచించడం లేదు. దాదాపు రెండు కోట్ల మంది విభజన విషాదాన్ని అనుభవించారు. మాటలకందని హింసాకాండ జరిగింది. 20 లక్షల మంది అమాయకులు బలైపోయారు. ఇప్పటికీ విభజన విషాదానికి సంబంధించిన లెక్కలే లేవు. పరిహారం మాటే లేదు. ఇక ఆ అభాగ్యులకు ఒక నివాళి ఘటించే అవకాశం ఎక్కడిది? ఆఖరికి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రూపొందించిన ఆధునిక విద్యా విధానం-2020 ప్రకారం ఇప్పుడు చరిత్రలో వక్రీకరణలను తొలగించే ప్రయత్నం మొదలయింది. ఇందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) నడుం కట్టింది.
భారతీయులకు చరిత్ర పట్ల స్పృహ తక్కువ అన్నారు నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత వీఎస్ నయీపాల్. ఆయన సదుద్దేశంతోనే అన్నారు. దీనికి పౌరుషం తెచ్చుకోనక్కరలేదు. వెంటనే తెచ్చుకో వలసింది చరిత్ర పట్ల స్పృహ మాత్రమే. 1206లో భారతదేశంలో ఢిల్లీ సుల్తానేట్ పాలన ఆరంభమైంది. 1526లో మొగల్ వంశ స్థాపకుడు బాబర్ వచ్చే వరకు సాగింది. ప్రథమ స్వాతంత్య్ర సమరం వరకు, అంటే-1857 వరకు, మొగలులు పాలించారు. ఇంత సుదీర్ఘ పాలనలో హిందువుల నుంచి ఒక్క చెప్పుకోదగిన ప్రతిఘటన కూడా ఎదురు కాలేదా? ఆ విదేశీయుల పాలన మీద ఏవో కొన్ని ప్రతిఘట నలు జరిగినా అవేవీ లెక్కించదగినవి కాదన్న తీరులోనే చరిత్ర రచన కనిపిస్తుంది. మొగలులు భారతీయులకు నాగరికత నేర్పారని చెబుతారు కొందరు. కానీ మొగలు చక్రవర్తుల డైరీలు, వారి ఆస్థాన కవుల రచనలు, విదేశీయుల కథనాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. వాళ్లలో అత్యధికులు భారతదేశాన్ని దోపిడీకి మాత్రమే ఉపయోగించు కున్నారు. ఆ యుగపు పాలకుల మతోన్మాదం, వారి చేతులలో కూలిన వేలాది గుడులు, హిందూ సమాజాన్ని సామూహికంగా అవమానించిన తీరు ఎక్కడా ప్రస్తావనకు రాదు.పైగా ఔరంగజేబు మతోన్మాదాన్ని దాచి పెట్టడానికి కాశీ విశ్వేశ్వరుడి ఆలయంపై దాడిపై జుగుప్సాకరమైన కథనాలు వండి వార్చారు. బహమనీ సుల్తానులు విజయనగర రాజ్యాన్ని ధ్వంసం చేస్తే దానిని శైవ, వైష్ణవ వర్గాల ఘర్షణగా చిత్రించే ప్రయత్నం కూడా అలాంటిదే.
చరిత్ర రచనలో రాజకీయ కుట్ర
ఢిల్లీ చుట్టూ తిరిగే చరిత్రకు పెద్ద పీట వేయడం, దక్షిణాదిన కాకతీయ, విజయనగర వంటి సామ్రా జ్యాలు వెలిసినా వాటికి సరైన స్థానం కల్పించక పోవడం చరిత్ర రచనలో ఒక పథకం ప్రకారం జరిగిన కుట్ర. భారత స్వతంత్ర సమరం ఘనతను కొన్ని కుటుంబాలకి పరిమితం చేయడం, గిరిజన పోరాటాలు, రైతాంగ పోరాటాలు, ఈశాన్య భారతంలో జరిగిన పోరాటాలు ఇవేమీ చరిత్ర పుటలకి చేరకపోవడం కూడా ఒక దుష్ట ఆలోచనతో జరిగినదే. ఇక్కడ జరిగిన శాస్త్ర సాంకేతిక సంపదను పుక్కిటి పురాణాలుగా తేల్చేశారు. చరిత్ర చదివితే రేపటి పౌరులకు దేశం పట్ల గౌరవం ఏర్పడాలి. అంతేకాని, నిరాశ కలగరాదు. అలాంటి నిరాశకు భావి భారతపౌరులను దూరంగా ఉంచడానికే ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలో మార్పుల ద్వారా ప్రారంభించింది.
చరిత్ర రచనలో సత్యనిష్ఠ అవసరం. దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే చరిత్రను, పారిశ్రామిక విప్లవం తరువాత వర్గ సంఘర్షణకు దారి తీస్తాయనుకున్న పరిస్థితులను శతాబ్దాల నాటి చరిత్రలో చొప్పించే వికృత చర్య స్వేచ్ఛగా జరిగింది. అలాగే మార్క్సిస్టు దృక్పథం కలిగిన సూత్రాలతో రాసినదైనా అదే నిజమైన చరిత్ర అని, జాతీయభావాలు కలిగిన చరిత్ర కాబట్టి మిగిలినదంతా తిరోగమన భావాల చరిత్ర అని చెప్పడం చరిత్ర రచన పట్ల పెద్ద ద్రోహం. అది కూడా యథేచ్ఛగా జరిగింది. విదేశీ పాలకుల మీద తిరగబడిన వారి ఉద్యమానికి చోదక శక్తి దేశభక్తి కాక మరేమవుతుంది? ఆ చరిత్ర ఏమైందని అడిగితేనే కాషాయీకరణ ప్రయత్నమన్న ముద్ర వేస్తున్నారు. అందుకే చరిత్ర అధ్యయనంలో సమ తౌల్యం అనివార్యం. ఆ పనే ఎన్‌సీఈఆర్‌టీ స్వీక రించింది. కొత్త విద్యావిధానం ఆశయం కూడా ఇదే.
చరిత్ర పుస్తకాల ‘హేతుబద్ధీకరణ’ కోసం ఎన్‌సీఈఆర్‌టీ ఈ పక్రియ ప్రారంభించింది. ఢిల్లీ సుల్తానేట్, మొగల్ వంశీకుల చరిత్రను తగ్గించడం, కొన్ని అంశాలు పూర్తిగా తొలగించడం ఇందులో భాగమే. ఏడో తరగతి విద్యార్థులకు పరాయిపాలకుల చరిత్రను తగ్గించి, పురాతన భారతానికి చెందిన రాజ వంశాల గురించి, దేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాల గురించి చెప్పే పాఠ్యాంశాలను చేర్చారు. ఒకే అంశాన్ని రుద్ది రుద్ది పెంచిన భారాన్ని తగ్గించి, గతానికీ, వర్తమానానికీ బంధం ఉన్న అంశాల గురించి విద్యార్థులకు పరిచయం చేయాలని నిర్ణయించారు.
ఏం తొలగించారు? ఏది మార్చారు?
ఏడో తరగతి సామాజికశాస్త్రంలో ఢిల్లీ సుల్తానేట్, మొగల్ వంశీకుల గురించిన అధ్యాయాలన్నిటిని మార్చారు. వాస్తవాలతో కొత్త రూపు ఇచ్చారు. ఢిల్లీ సుల్తానేట్ అంటే 1206లో కుతుబుద్దీన్ ఐబక్ పాలనతో మొదలై, 1526 వరకు ఉన్న విదేశీ పాలకుల గురించి. వీరంతా తుర్కిక్, అఫ్ఘాన్‌స్తాన్‌కు చెందినవారే. ఇందులో మొదటిది బానిస వంశం. రెండోది ఖిల్జీ వంశం. మూడు తుగ్లక్‌లు. నాలుగు సయ్యద్‌లు. ఐదు లోడీలు. మహమ్మద్ ఘోరీ బాగా నమ్మిన బానిస కుతుబుద్దీన్ ఐబక్. ఇంకా బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఘియాజు ద్దీన్ తుగ్లక్, సికిందర్ లోడీ వీరంతా ఢిల్లీ సుల్తానేట్‌లో ప్రముఖులు.
లోడీలలో ఆఖరి సుల్తాన్ ఇబ్రహీం లోడీని మొదటి పానిపట్టు యుద్ధం (1526)లో ఓడించిన బాబర్ మొగల్ వంశాన్ని స్థాపించాడు. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ మొదటి భాగం మొగల్ వంశ పాలనలో కనిపిస్తారు. ప్రతి ఒక్కడు హంతకుడే. ఔరంగజేబు తరువాత మొగల్ వంశంలో అంతా అనామకులే. 1857 నాటి బహదూర్ షా జఫర్ వరకు ఇలాంటి వారే.
సాంస్కృతిక వారసత్వానికి పెద్ద పీట
తొలగించిన ఈ భాగాలకు బదులు భారతీయ రాజవంశాలు మౌర్యులు,శుంగులు, శాతవాహనుల వివరాలు ఉంటాయి. ఇంకా సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాల గురించి వివరిస్తారు. భారతదేశాన్ని పుణ్యభూమిగా ఎందుకు భావిస్తారో కూడా మార్చిన ఆ అధ్యాయాలు వివరి స్తాయి. అయితే పవిత్ర క్షేత్రాల పరిచయం అంటే కేవలం హిందూ పుణ్యక్షేత్రాల పరిచయం ఒక్కటే కాదు. హిందూధర్మానికి చెందిన స్థలాలు, క్షేత్రాలతో పాటు ఇస్లాం, క్రైస్తవం, జూడాయిజం, జొరాస్ట్రియ నిజం, బౌద్ధం, సిక్కు మతాలకు సంబంధించిన క్షేత్రాలను కూడా పరిచయం చేశారు. దీనినే పవిత్ర భౌగోళిక శాస్త్రం అంటున్నారు. ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ప్రస్తావించారు. చార్‌ధామ్, శక్తి పీఠాలు, పర్వతాలు, నదులు, ఆడవుల గురించి వివరాలు ఇచ్చారు. కాస్త తరచి చూస్తే భారతీయ సమాజంలోని ఏకత్వం ఏ విధంగా పరిఢవిల్లిందో ఇవన్నీ చెబుతాయని అర్థం చేసుకోవాలి. దక్షిణ, ఉత్తర భారతాల వాదన ఎంత రాజకీయ ప్రేరేపితమో కూడా అర్థం చేసుకోగలుగుతారు. పూర్వకాలం దేశంలో వర్ణం/జాతి ఏ విధమైన సుస్థిరతను సాధించిందో, తరువాత బ్రిటిష్ హయాంలో మౌఢ్యంగా మారిందో కూడా తెలియచేశారు. బ్రిటిష్ ఇండియాలో వచ్చిన మార్పులతోనే అసమానతలు ప్రబలాయని కొత్త సిలబస్ చెబుతోంది. ఆధునిక కాలానికి సంబంధిం చిన సాంస్కృతిక విజయాల గురించి కూడా ప్రస్తావించారు. అందులో భాగంగా 66 కోట్ల మంది స్నానమాచరించిన ప్రయాగరాజ్ మహా కుంభమేళా గురించి కూడా పాఠం ఉంది. ఇన్ని శతాబ్దాల తరువాత, ఇన్ని దాడులు దండయాత్రల తరువాత ఇప్పటికీ భారతీయులలో ఏకాత్మత స్థిరంగా నిలిచి ఉందని ఇది రుజువు చేసింది. అలాగే ఆ సమయంలో జరిగిన తొక్కిసలాట, అందులో 30 మంది వరకు చనిపోయిన వాస్తవాన్ని కూడా దాచి పెట్టలేదు. అదొక పాఠంగా స్వీకరించారని అనిపిస్తుంది. మనమంతా ఒక జీవన విధానానికి వారసులమని ఇవన్నీ చెప్పాయి. ఆధునిక భారత ప్రభుత్వం తీసుకున్న మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో, బేటీ పడావో, అటల్ టన్నెల్ వంటివి కూడా పాఠ్యాంశాలుగా చోటు దక్కించుకున్నాయి. సామాజిక శాస్త్రాలలో కొత్తగా దృష్టి పెట్టిన విషయం, రాజ్యాంగం. మన రాజ్యాంగం మన జాతీయ పతాకం గురించి చెబుతుంది. 2004లో జాతీయ పతాకం ఎగరవేయడం అనేది ప్రాథమిక హక్కులలో చేర్చడం వంటి అంశాలను బోధించే అవకాశం ఇప్పుడు వచ్చింది. 12వ తరగతి పాఠ్య పుస్తకాలలో కూడా మొగల్ చరిత్రను తొలగించారు.
ఇండియా బియాండ్
ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్రంలో టిప్పు సుల్తాన్, అతడి తండ్రి హైదరాలీల చరిత్రను తొలగిం చారు. నిజానికి ఇంతకాలం దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి ఎదురైన ప్రతిఘటన పేరుతో ఆ ఇద్దరి చరిత్రలను ఘనంగా బోధించే వారు. ఇప్పుడు తొలగించారు. దీనితో ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు కూడా కనిపించవు. టిప్పును, హైదరాలీని తొలగించడం ప్రాంతీయ చరిత్రలకు అన్యాయం చేసినట్టు అవుతుందని కొందరు పార్లమెంట్‌లో కూడా అభ్యంతరాలు లేవదీశారు. అయితే తమ ప్రాంతీయ అనుబంధాలలో ఇలాంటి చరిత్రలు చేర్చుకునే అంశం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టారు. మొగల్ వంశీకుల గురించి వాస్తవిక చిత్రం ఎనిమిదో తరగతి పుస్తకాలలో ఇచ్చారు. అందులో ఒకటి మొగల్ వంశ స్థాపకుడు బాబర్ తన విజయాల విషయంలో అత్యంత అమానుషంగా ఉన్నాడని చెప్పడం. మధ్య ఆసియా నుంచి దురాక్రమణదారుడిగా ప్రవేశించిన బాబర్ ఉప ఖండ భౌగోళిక చిత్రపటం రూపును మార్చేశాడు. అయితే ఇది సానుకూల దృక్పథంతో జరిగినది కాదు. ఈ సంగతి చెబుతూనే అతడు నిర్దాక్షిణ్యంగా రాజ్య విస్తరణ చేశాడని చెప్పారు. ఆ క్రమంలో మొదటి పానిపట్ యుద్ధంలో విజయం, అప్పటికి ఆధునిక యుద్ధ వ్యూహాలతో గెలిచాడన్న విషయాన్ని విస్మరించలేదు. బాబర్ నామా (బాబర్ స్వీయచరిత్ర) ఆధారంగా ఈ వివరాలు ఇచ్చారు. అదే వంశానికి చెందిన అక్బర్ పాలన కూడా నిర్బంధాలతో కూడినదే నని చెప్పారు. అక్బర్ చరిత్ర అంటే, పాశవికత, అవసరం కోసం సహనం, వ్యూహాల మిశ్రమమని వ్యాఖ్యానించారు. 1568లో చిత్తోర్‌ఘడ్‌ను ఆక్రమించినప్పుడు వేలాది మందిని అతడి సైన్యం ఊచకోత కోసింది. మహిళలను, పిల్లలను బానిసలుగా తీసుకుపోయారు. ఈ విషయాలు చెబుతూనే జిజియా పన్నును రద్దు చేసిన విషయాన్ని, రాజపుత్రులను తన దర్బారులో చేర్చుకున్న సంగతిని కూడా విస్మరించలేదు. ఫతేపూర్ సిక్రి కేంద్రంగా అతడు భారత రామాయణాలను పర్షియా లోకి అనువదించే పథకం చేపట్టిన సంగతిని కూడా వెల్లడించారు. ఇక ఔరంగజేబ్ సైనిక దాడులతో పాటు, అతడి కాలంలోని మత అసహనం గురించి కూడా వివరించారు. అక్బర్ రద్దు చేసిన జిజియాను ఇతడు మళ్లీ ప్రవేశపెట్టాడు. దర్బార్ నుంచి సంగీత నృత్యాలను నిషేధించాడు. కాశీ, మధుర ఆలయాల ధ్వంసం వంటి అంశాలను కూడా కొత్త పాఠ్యాంశాలు తెలియచేస్తాయి. ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకానికి ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా బియాండ్ అని పేరు పెట్టారు.
మొత్తంగా చెప్పాలంటే 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఉన్న చరిత్రలో భారీగా మార్పులు చేశారు. ఇక్కడ మార్పులు అంటే చేర్పులు మార్పులు కూడా. ఢిల్లీ సుల్తానేట్, మొగల్ పాలన, విజయనగర సామ్రాజ్యం, సిక్కు ప్రతిఘటనల గురించి చరిత్రలో ఈ మార్పులు తీసుకువచ్చారు.
ఇలా మధ్య యుగాలనాటి కీలక చరిత్రను తొలగిస్తే ప్రధాన భాగాలను తొలగించినట్టేనని విమర్శకుల ఆరోపణ. భారతీయ వాస్తు, శిల్ప కళల మీద, సాహిత్యం, చిత్రలేఖనం మీద ముస్లిం ప్రభావం చాలా చాలా ఉందని వాదిస్తున్నారు. నిజానికి మూడేళ్ల క్రితమే చరిత్ర పుస్తకాల నుంచి సుల్తానేట్, మొగలుల భజన తప్పించే పక్రియ మొదలయింది. అంటే 2020 ప్రాంతంలో దీనిని ప్రారంభించారు. 2025కు దీనిని పూర్తి చేశారు.
హిందూ సమాజ వైఫల్యం
ఢిల్లీ సుల్తానేట్, తరువాతి మొగల్ పాలకులు ఇద్దరూ ముస్లింలే. ముస్లిం పాలకులలో మతోన్మాదం సహజ లక్షణం కూడా. వాళ్ల దండయాత్రలు, తరువాత పాలన మత సూత్రాల ప్రాతిపదికగా ఉన్నవే. తరువాత ఆంగ్లేయుల పాలన వచ్చింది. వీళ్ల ప్రధాన ఉద్దేశం రత్నగర్భ అన్న ఘనత కలిగిన ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేయడం. ఈ ఇద్దరి విదేశీ పాలకుల ధ్యేయం తమ తమ మతాలను రుద్దడం కూడా. ఇంత జరుగుతుంటే ఇంత పెద్ద భారతీయ సమాజం ఏం చేసింది? పాలకులు ఏం చేశారు? అన్న ప్రశ్న వేసేవారు చాలామందే ఉన్నారు. ప్రారబ్ధం అదే. ఆ వైఫల్యం ఒక చేదు నిజం. హిందువుల అనైక్యత, లోపించిన దూరదృష్టి, వ్యక్తులుగా చాలా మంది ఉన్నతులే అయినా, సామాజిక దృష్టి అడుగంటి పోవడం వంటి మహా తప్పిదాలు ఒక మహోన్నత దేశాన్ని దాదాపు 800 సంవత్సరాలు బానిసత్వంలో ఉంచాయి. క్షమార్హం కాని ఆత్మ విస్మృతిలో భారతీయ సమాజాన్ని బంధించాయి. అందుకు శిక్ష ఈ జాతి మీద జరిగిన అత్యాచారాలను గుర్తించడానికి నిరాకరించడం, అక్షరబద్ధం చేయ కుండా వదిలివేయడం మాత్రం కాదు. కానీ అంతర్జాతీయ సమాజం చేసింది అదే. 800 ఏళ్లు భారతీయ సమాజం మీద జరిగిన హత్యాకాండ, స్త్రీలను, పిల్లలను బానిసలుగా ఎత్తుకుపోవడం వంటి అకృత్యాలను చరిత్రగా నమోదు చేయడానికి, గుర్తించడానికి చాలా మంది ముందుకు రాలేదు. వలస పాలనలో భాగంగా ఉండిపోవడం, దేశ చరిత్రను ఆంగ్లేయులు రాసి పెట్టడం కూడా ఈ దేశం మీద జరిగిన మహా మారణహోమాలు, ఘోరాలు, ఘోరకలిలు ప్రపంచ ప్రజల ముందుకు రాలేదు. కానీ ఇంతటి ఊచకోతకు కారణమైన ఢిల్లీ సుల్తానేట్, మొగలులు, బ్రిటిష్ పాలన మనకు చాలా నేర్పిందని చెప్పేవాళ్లు ఎందరో! గుడ్డిలో మెల్ల. ఈ దేశంలో బ్రిటిష్ వాడు రైలు మార్గాలు వేశాడంటే, కారణం- సంపదను త్వరితంగా తరలించడానికే. తమ పాలనకు వ్యతిరేకంగా జరిగే తిరుగబాట్లను సత్వరం అణచివేయడానికే. ఈ విషయాల గురించి కొందరు విదేశీ చరిత్రకారులు, రచయితలు, పరిశోధకులు ఏమన్నారో చూద్దాం. అంటే ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ ఆయా పాఠ్యాంశాలను తొలగించడం ఎంత న్యాయమో కొంతమేరకైనా అర్ధం కావడానికి వాటిని పరిశీలిద్దాం.
అర్ధం చేసుకున్న చరిత్రకారులు
కొయెన్రాడ్ ఎల్స్‌ట్ అనే చరిత్రకారుడు ఏం రాశాడు? హిట్లర్ సృష్టించిన నరమేధానికి మించి భారతదేశంలో ముస్లిం ‘పవిత్ర పాలకులు’ హిందువు లను చంపారు. హిట్లర్ నరమేధానికి బలైన వారు 60 లక్షలు. బహమనీ సుల్తానులు (1347-1528) వేలాది మంది హిందువులను చంపారని ఫెరిస్టా అనే విదేశీ యాత్రికుడు రాశాడు. బహమనీలంటే ఇస్లాం రాజ్యాలలో మూడో స్థాయిలో ఉన్న ప్రాంతీయ పాలకులు. ఇక వీరి మీది సుల్తానుల హత్యాకాండ ఎంతటిది? మహమ్మద్ ఘజనీ, ఘోరీలు, వీళ్ల సైనికాధికారులు వేలాది మంది హిందువులను చంపారని కొయెన్రాడ్ చెబుతారు. భారతదేశం మీద ముస్లిం దండయాత్రలంటే ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన రక్తపాతంతో కూడుకున్నవని ఆయన రాశారు. సాధారణ శకం 800 మొదలు, 1700 వరకు జరిగిన మతాంతీకరణలే మిలియన్ లలో ఉంటాయని కూడా అంచనా వేశాడాయన. మిలియన్ అంటే పది లక్షలు. మతాంతరీకరణను ఎదిరించి చనిపోయినవారూ తక్కువేమీ కాదు. ఇక, ఫ్రాంకాయిస్ గాటీర్ అయితే, భారతదేశంలో ముస్లింలు చేసిన మారణహోమాన్ని పోల్చడానికి మరొక ఘటన ఏదీ ప్రపంచ చరిత్రలో లేదని వ్యాఖ్యానించారు. ఇర్ఫాన్ హుసేన్ అనే చరిత్రకారుడు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. మహమ్మద్ ఘజనీ సోమనాథ్ మీద ప్రతి ఏటా దండెత్తేవాడు. ప్రతి దండయాత్రలోను 50,000 మంది స్థానికులను చంపేవాడు. ఢిల్లీ మీద దండయాత్ర చేసినప్పుడు కేవలం గంట వ్యవధిలోనే 10,000 మంది అవిశ్వాసులను నరికామని తైమూర్ చెప్పుకున్నాడు. ముస్లిం పాలకులు భారత దేశంలో ఏం చేశారో చెప్పిడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
అప్పుడు… ఇప్పుడు…
ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ ఈ తప్పిదాన్ని సవరించింది. బాబర్ గురించి ఇంతకు ఆ పాఠ్య పుస్తకాలలో ఏం చెప్పారు? అతడు మధ్య ఆసియా నుంచి వచ్చిన వీరుడు, విజేత. మొగల్ వంశ స్థాపకుడు. కానీ అతడు సాధారణ పౌరులను ఎంతమందిని చంపినది దాచిపెట్టారు. తాజాగా, అతడు పాశవిక మనస్తత్వం కలిగిన, దయాదాక్షిణ్యాలు లేని దురాక్రమణదారుడు అని చెబుతున్నారు. జనాన్ని భయభ్రాంతులను చేయడానికి మానవ కపాలాలను స్తూపాలుగా నిలిపేవాడు. ఇక అక్బర్ గురించి: ఇంతకు ముందు- దిగ్రేట్ అనేవారు. పరిపాలకునిగా కీర్తించారు. పరమత సహనం కలవాడని చెప్పారు. సాంస్కృతిక సమన్వయం పాటించాడని కూడా అంచనా వేశారు. దీన్ ఇ ఇలాహీ అనే కొత్త మత శాఖను కూడా స్థాపించాడని అన్నారు. జిజియాను రద్దు చేశాడన్న ఖ్యాతిని ఇచ్చారు. కొత్తగా, అక్బర్‌లో పరమత సహనం ఉన్నా, పాశవికత కూడా ఉందని చెబుతున్నారు. చిత్తోర్‌ఘడ్ హత్యాకాండ గురించి ప్రస్తావించారు. ఔరంగజేబ్‌ను మతం పట్ల విపరీతమైన అభిమానం కలవాడని మెత్తగా చెప్పారు. సామ్రాజ్యం విస్తరించాడని రాశారు. కొత్తగా మధుర, కాశీ, సోమనాథ్ ఆలయాల మీద దాడులు చేసి ధ్వంసం చేసిన వాస్తవాన్ని కూడా చేర్చారు.
చీకటియుగాల నాటి ప్రజల బాధలు చెప్పాం
ఈ విషయం గురించి మీడియా ప్రశ్నకు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య ప్రణాళికా విభాగం (సామాజిక శాస్త్రాలు) అధిపతి మైఖేల్ డానినో వివరణ ఇలా ఉంది: భారతదేశ చరిత్ర అంతా ఆనందమయం అని, అసలు విషాదాలు లేవని చెప్పలేం. అంతా సజావుగా, సుఖసంతోషాలతో ఉందని అనలేం. చరిత్రలో గర్వించదగిన యుగాలు ఉన్నాయి. చీకటియుగాలూ ఉన్నాయి. ఈ చీకటియుగాలలో ప్రజలు బాధలు పడ్డ మాట నిజం. అందుచేత మేం చరిత్రలోని చీకటి అధ్యాయాలను కూడా అందించాం’ అన్నారు డానినో. ఇంకొక మాట కూడా ఎన్‌సీఈఆర్‌టీ చెప్పింది. గతంలో జరిగిన వాటికి ఇప్పటి తరాలను బాధ్యులను చేయరాదన్నదే దాని సారాంశం.
నిజమే, 800 సంవత్సరాలలో హిందూ సమాజం అనుభవించిన ఊచకోత పట్ల అంతర్జాతీయ సమాజం నిర్లక్ష్యం వహించింది. ప్రఖ్యాత భారతీయ చరిత్ర కారుడు ప్రొఫెసర్ కేఎస్ లాల్ ఈ ఊచకోత ఏ స్థాయిలో జరిగిందో ఒక అంచనాకు రాగలిగారు. కేవలం సాధారణ శకం 1000 మొదలు, 1525 వరకు దేశంలో ఎనిమిది కోట్ల జనాభా తగ్గిందని ఆయన చెప్పారు. ఇలాంటి మారణకాండ ప్రపంచ చరిత్రలోనే కానరాదంటారాయన. అరబ్బులు, అఫ్ఘాన్లు, తురుష్కులు, మొగలుల కాలంలో హిందువులపై ఊచకోత అంచనాలకు అందనంతగా సాగిందని చెప్పారాయన. ఆచార్య బీబీ లాల్ మొట్టమొదటిసారి అయోధ్యలో పురావస్తు తవ్వకాలు మొదలుపెట్టిన పురావస్తు చరిత్రకారుడు. అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కింద హిందూ ఆలయం శిథిలాలు ఉన్నాయని ఆయన కనుగొని ముస్లిం దాడులలో మతోన్మాదం నిజమని తేల్చారు.
13 శతాబ్దం చివరిభాగంలో, 14వ శతాబ్దం ఆరంభంలో జీవించిన సూఫీ కవి ఆమీర్ ఖుస్రో రచన ‘తారిఖ్ ఇ అలంగిరి’ ఢిల్లీ సుల్తానేట్ నాటి రక్తపాతం గురించి చెబుతుంది. 1757లో అఫ్ఘాన్ పాలకుడు అహమ్మద్ షా అబ్దాలి దండయాత్ర గురించి కథనాలు కూడా ఉన్నాయి. ఇతడికి దురానీ అనే బిరుదు కూడా ఉంది. అంటే వజ్రం. నరికి తెచ్చిన ప్రతి శత్రువు తలకు రూ 5 వంతున అబ్దాలీ సైనికులకు చెల్లించేవాడు. ప్రతి సైనికుడి గుర్రం దోచేసిన సొమ్ము మూటలతో బరువుగా వచ్చేది. అతడి గుర్రానికి ముందు బానిసలుగా చేజిక్కించుకున్న మహిళలు, చిన్నారులు ఉండేవారు. వీళ్ల తలల మీద నరికేసిన శత్రువుల తలల మూటలు ఉండేవి. వాటిని మంత్రి ముందుకు తెచ్చేవారు, సొమ్ముల కోసం. ఇక బానిసలుగా దొరికిన యువతుల గొంతులు రాత్రి వేళల్లో ఎంతగా విలపిస్తూ ఉండేవో కూడా కొందరు ముస్లిం చరిత్రకారులు, సుల్తానులు, పాదుషాలు సగర్వంగా రాశారు. నరికి తీసుకువచ్చిన తలలతో స్తంభాలు కట్టారు. ఇవి బయట పెడితేనే కదా, లేదా బయట పెట్టమంటేనే కదా విద్య కాషాయీకరణ, చరిత్ర కాషాయీకరణ అంటూ గోల చేస్తున్నారు! ఈ వైఖరి ఎంత నీచమో వాళ్లకైనా తెలుసా? ఈ చరిత్ర బయటపెడితే ఘర్షణలు వస్తాయట. మత సామరస్యం దెబ్బ తింటుందట. అంటే గతంలో ఎన్ని గాయాలు తగిలినా, అవి ఇప్పటికీ మానకున్నా అంతిమంగా హిందువులే మౌనం దాల్చాలని ఈ వాదన ఉద్దేశం కాదా? దీనికే నెగేషనిజం అని పేరు పెట్టారు పాశ్చాత్య చరిత్రకారులు. వాస్తవాలు కళ్లెదుట కనిపిస్తున్నా, కొన్ని ప్రయోజనాల కోసం వాటిని గుర్తించడానికి నిరాకరించే పాశవిక మనస్తత్వమే నెగేషనిజం అంటే. గతంలో జరిగిన దాని మీదే కాదు, మన కళ్ల ఎదుట జరుగుతున్న ముస్లిం మతోన్మాదాన్నీ మౌనంగా భరించమనే వ్యక్తులు, సంస్థలు లేకపోలేదు. దీనికి సెక్యులరిజం అని పేరు పెడుతున్నా, వాస్తవం మైనారిటీలను బుజ్జగించడం. దీనికి బలైంది చరిత్ర.
వక్రీకరణలకు విరుగుడు
సెక్యులరిజం, వామపక్ష భావజాలం ఉన్న చరిత్రకారులు రాసిన కింది తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాలకు ఇప్పటికైనా ఆ బాధ విరగడైంది. సత్యనిష్ఠకు చోటు దొరికింది. రొమిలా థాపర్, బిపన్‌చంద్ర, ఇర్ఫాన్ హబీబ్ వంటివారు చరిత్రలోని మరకల పేరుతో చాలా భాగాలను మరుగుపరిచారు. ఇందులో అనుమానాలు ఉంటే, అయోధ్య తుది తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం జేఎన్‌యూ తరహా చరిత్ర పండితుల గురించి చేసిన వ్యాఖ్యను గమనిం చాలి. చరిత్ర రచనలో వచ్చిన ఈ దురాక్రమణ ధోరణిని ఖండించినవారిలో డాక్టర్ కెకె మహమ్మద్ వంటివారు కూడా ఉన్నారు. అయోధ్యను హిందువు లకు సగౌరవంగా అప్పగించాలని, ఘర్షణ నివారించా లని మహమ్మద్ చేసిన విజ్ఞప్తిని కూడా వివాదాస్పదం చేశారు, జేఎన్‌యూ బృందం చరిత్ర మేధావులు. విక్రమ్ సంపత్ వంటి చరిత్రకారులు, ఆనంద్ రంగనాథన్, సాయిదీపక్ వంటి రచయితలు, ఇటీవలనే రాజ్యసభకు ఎంపికైన మీనాక్షీ జైన్ వంటివారు వాస్తవ చరిత్రను ఆవిష్కరించే ప్రయత్నం అద్భుతంగా చేస్తున్నారు.
వామపక్ష, ఉదారవాదులలో ఎక్కువ మంది గిరిజనోద్యమాల జోలికి మాత్రం వెళ్లలేదు. దేశం కోసం గిరిజనులు చేసిన త్యాగాలను గుర్తించకుండా, వారిని ప్రధాన స్రవంతిలో కలపడం ఎలా? అన్న ప్రశ్న ఈ ఉదారవాద చరిత్రకారులు వేసుకోలేదు. పైగా క్రైస్తవ మిషనరీలు సృష్టించిన గిరిజనులు హిందూ సమాజంలో భాగం కాదన్న వాదనలను బలపరిచే విధంగా కథనాలు తీసుకువచ్చారు. వారి ఉద్యమాల కంటే, వారి స్వేచ్ఛా కాంక్ష కంటే, ఆచార వ్యవహారాల మీద వారికి ఉన్న నిష్ఠ కంటే అసలు వారు హిందూ సమాజంలోని వారు కాదన్న విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఘనులు వీరు. అక్బర్‌ను తిరుగులేని చరిత్ర పురుషుడుగా నిలపడానికి భిల్, గోండ్, సంథాల్, కోచ్ వంటి గిరిజన తెగలు అతడి మీద చేసిన తిరుగుబాట్లను కూడా ఈ చరిత్రకారులు గౌరవించలేదని అనిపిస్తుంది. వీళ్లకి చరిత్రపట్ల సత్యనిష్ఠ ఉంటే గోండు రాజ్యాన్ని ఏలిన రాణి దుర్గావతి చరిత్ర కాస్తయిన ప్రాధాన్యం దొరికి ఉండేది.
వలసవాదులు వెళ్లిపోయారు. ఆ మనస్తత్వం భారతీయ మేధావులను వదిలిపోవడం లేదు. దీనికి మార్క్సిజం తోడయింది. మన పూర్వకాలపు ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పిన లెక్కలను ఇవాళ నాసా దాదాపు ఆమోదిస్తున్నది. పాణిని అష్ఠాధ్యాయి వ్యాకరణ సూత్రాలన• ఇప్పటికీ ప్రపంచం ప్రామాణికంగా స్వీకరిస్తున్నది. మన పురాణ పురుషుడు ధన్వంతరి చేతిలో జలగ ఉంటుంది. ఇవాళ జలగ వైద్యానికి పాశ్చాత్య దేశాలలో పెద్ద పీట. ఇదంతా గతాన్ని కీర్తిస్తూ మైమరచిపొమ్మని చెప్పడానికి కాదు. దాని నుంచి స్పూర్తి పొందమని చెప్పడానికే. మన గతం మనకు గర్వకారణంగా ఉండాలి. నిజానికి గర్వ కారణమే. కానీ దానికి బానిస, వలసవాద మేఘాలు అడ్డుపడుతున్నాయి.
– జాగృతి డెస్క్
‘విభజన తెరవెనుక’
1947 నాటి దేశ విభజన ప్రపంచ చరిత్రలో జరిగిన విషాద ఘటనలలో ఒకటి. మానవాళి యావత్తు విస్తుపోయే నెత్తుటి కాండ ఆనాడు జరిగింది. అది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఈ విషయాలు ప్రతి తరం తెలుసుకోవాలి. ఎందుకంటే దేశం అనుభవిస్తున్న అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక సంక్షోభాలు దేశ విభజన ఫలితమే.ఆగస్ట్ 14న ఈ సంస్మరణ దినం జరపవలసిందిగా ప్రధాని నరేంద్ర మోదీ 2020లోనే పిలుపు నిచ్చారు. విభజన నాటి ఘోరాల సంస్మరణ దినం సందర్భంగా పాఠశాలల కోసం ఎన్‌సీఈఆర్‌టీ ఒక చిన్న సమాచార లేఖ వంటిది (మాడ్యూల్) రూపొందించింది. విభజనకు ఎవరో ఒకరే కారణం కాదని ఆ మాడ్యూల్ పేర్కొన్నది. మూడు శక్తులు విభజన వెనుక ఉన్నాయని తేల్చింది. అవి- పాకిస్తాన్‌ను కోరి సాధించుకున్న మహమ్మదలీ జిన్నా, విభజన డిమాండ్‌ను అమోదించిన భారత జాతీయ కాంగ్రెస్, ఆఖరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్. మౌంట్‌బాటన్ ప్రధాన లక్ష్యం భారత్‌ను విభజించడమే. విభజన చట్టాన్ని అమలు చేయడమే. విభజన తరువాత కూడా భద్రతకు సంబంధించి కశ్మీర్ ఇప్పటికి సమస్య ఎందుకయింది? కశ్మీర్‌ను అడ్డం పెట్టుకుని ఇప్పటికీ కొన్ని దేశాలు భారత్ మీద ఒత్తిడి తీసుకు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అన్న అంశం కూడా మాడ్యూల్ ప్రస్తావించింది.
యథా ప్రకారం ఈ మాడ్యూల్ అబద్ధాల పుట్ట కాబట్టి దానిని వెంటనే దగ్ధం చేయమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖెరా చిందులు వేశాడు.
1940 నాటి ముస్లిం లీగ్ లాహోర్ సమా వేశాలలో ఆమోదించిన తీర్మానం గురించి ఈ మాడ్యూల్ గుర్తు చేసి చాలా విషయాల మీద ఉదారవాదులకు, సెక్యులరిస్టులకు కంగారు పుట్టించింది. ఈ సమావేశంలోనే జిన్నా హిందువులు వేరు, ముస్లింలు వేరు అన్న వాదనను అతి తీవ్రంగా వినిపించాడు. అంతేకాదు, ముస్లింలు అధికగా ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని బ్రిటిష్ ఇండియాను కోరాడు. అయితే పాకిస్తాన్‌ను కోరిన జిన్నా అంటూ వార్తాపత్రికలు రాశాయి. దీని గురించి జిన్నాను అడిగితే ఒక్కటే అన్నాడు- అదంతా హిందూ పత్రికలు రాసుకున్నది అని.హిందువులు, ముస్లింలు వేర్వేరు ప్రపంచాలకు చెందిన వారు. వారి తత్త్వం వేరు. వారి సామాజిక ఆచారాలు వేరు. వారి సాహిత్యం వేరు అని లాహోర్ సభలో జిన్నా ద్విజాతి సిద్ధాంతానికి ఊపిరి పోశాడు. అయితే ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలకు అధినివేశ ప్రతిపత్తి (డొమీనియన్ స్టాటస్) ఇవ్వాలని బ్రిటిష్ ఇండియా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను భారత జాతీయ కాంగ్రెస్ నిరాకరించిన సంగతిని ఎన్‌సీఈఆర్‌టీ మాడ్యూల్ గుర్తు చేసింది. ఈ మాడ్యూల్ పాఠ్య పుస్తకాలలో చేరకపోయినా, 6 నుంచి 8వ తరగతి వరకు ఒక కథనంగా, 9నుంచి 12వ తరగతికి వేరొక కథనంగా దీనిని రూపొందించారు.
విభజన గురించి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మాట్లాడుతూ, భారత్ రణరంగమైంది.అంతర్యుద్ధం కంటే విభజన మేలు అని చెప్పిన సంగతిని ఈ మాడ్యూల్ వెల్లడించింది. విభజనను వ్యతిరేకించిన గాంధీజీ, తాను హింసతో కాంగ్రెస్ నిర్ణయాన్ని నిరోధించలేననే అన్నారు. అంతిమంగా నెహ్రూ, పటేల్ విభజనకు అంగీకరించారు. జూన్ 14, 1947న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అందులో విభజన ప్రతిపాదనను గాంధీజీ చేత ఒప్పించారని చెబుతున్నదీ మాడ్యూల్. ఇది ఎలాంటి వక్రీకరణ లేని చారిత్రక వాస్తవం. ఎన్‌సీఈఆర్‌టీ ప్రస్తావించపోయినా, రామ్ మనోహర్ లోహియా వంటి వారు తమ జ్ఞాపకాలలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒక దశాబ్దం క్రితమే కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ జిన్నా జీవితం గురించి రాసిన పుస్తకం కోసం రామ్‌మనోహర్ లోహియా పుస్తకం నుంచి ఇవే అంశాలను స్వీకరించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ భుజాలు తడుముకోవడం ఎందుకో అర్థం కాదు. కేరళలో సీపీఎం అసలు విభజన నాటి విషాదాన్ని గుర్తు చేసుకోవడాన్నే నిషేధించింది. గవర్నర్ ఈ మేరకు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయమని కాలేజీలకు పిలుపును కూడా ఇచ్చింది. విభజన నాటి ఆ దురాగతాలను గుర్తు చేయడానికి ప్రయత్నించిన అఖిల భారతీయ విద్యార్థి సంఘం వంటి సంస్థల ప్రయత్నాలను హింసాత్మకంగా చెప్పడానికి ఎస్‌ఎఫ్‌ఐ కేరళలో ప్రయత్నించింది. విభజన నాటి ఘోరాలను స్మరించుకుని, నాటి బాధితుల కోసం ఒక నిమిషం మౌనం పాటించడం మన ధర్మం కదా అంటూ గవర్నర్ చేసిన విన్నపాన్ని ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా, అమర్యాదకరంగా వీధిన పడి విమర్శించడం ఎందుకు?
విభజనకు ముందు భారతీయ జాతీయ కాంగ్రెస్‌తో పాటు, ఆఖరి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ చూపించిన అత్యుత్సాహం కూడా జుగుప్స కలిగిస్తుంది. నిజానికి బ్రిటిష్ పార్లమెంట్‌లో ఈ అంశం గురించి జరిగిన చర్చ మేరకు జూన్, 1948 నాటికి భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించాలి. కానీ ఆగస్ట్ 1947కి తాము దేశం విడిచి పోతున్నామని ఆయన ప్రకటించాడు. విభజన నాటి రక్తపాతానికీ, హింసకూ సగం కారణం ఇదే. ఈ విషయాన్ని కూడా ఎన్‌సీఈఆర్‌టీ మాడ్యూల్ తూర్పార పట్టింది.
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న అజ్ఞానానికి హద్దులు ఉండడం లేదు. ఇక కింది స్థాయి నాయకులలో విజ్ఞత ఎందుకు కనిపిస్తుంది. ఇప్పటికీ చరిత్రకు మసి పూద్దామనే వీరి ఆలోచన. విభజన అనేది హిందూ మహాసభ, ముస్లిం లీగ్ షరీకైన కారణంగా సంభవించిందని పవన్ ఖెరా అత్యంత నీచమైన వివరణ ఇచ్చాడు. జూన్ 3, 1947న విభజన ప్రణాళిక లేదా మౌంట్‌బాటన్ ప్రణాళిక గురించి చర్చించడానికి అతడితో సమావేశమైనది ఎవరు? కాంగ్రెస్ నుంచి నెహ్రూ, పటేల్, జేబీ కృపలానీ (నాటి ఏఐసీసీ అధ్యక్షుడు), ముస్లిం లీగ్ నుంచి జిన్నా, లియాఖత్ అలీ ఖాన్, సర్దార్ బల్దేవ్‌సింగ్ (సిక్కుల ప్రతినిధి) పాల్గొన్నారు. ఇందులో హిందూ మహాసభ పేరేది? వీర్ సావర్కర్ లేదా శ్యామాప్రసాద్ ముఖర్జీ పేర్లేవి?