సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు భాద్రపద శుద్ధ విదియ – 25 ఆగస్ట్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ఏ స్వతంత్ర దిన వేడుక అయినా, ఎన్నేళ్ల తరువాత జరుగుతున్నదైనా సరే, నిజమైన భారతీయుల గుండెలను ఉప్పొంగేటట్టు చేస్తుంది. ఆగస్ట్ 15 నాటి జెండా వందనమంటే-ఒక మహా పోరాటం ఫలితంగా శతాబ్దాల బానిసత్వం నుంచి విముక్తమై, స్వేచ్ఛను ప్రకటించుకున్న, సార్వభౌమత్వాన్ని సాధించుకున్న మాతృభూమిలో నీవు జన్మించావని గుర్తు చేస్తుంది. ఈ సంవత్సరం జరుపుకున్న 79వ స్వాతంత్య్ర దిన వేడుకకు ఇంకొన్ని అదనపు అలంకారాలు ఉన్నాయి. రక్షణ వ్యవస్థలో భారత్ ఇప్పుడొక అజేయశక్తి అన్న సంగతి ప్రపంచం గ్రహించక తప్పని, అంగీకరించక తప్పని ఆపరేషన్ సిందూర్ ఈ సంవత్సరమే జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది కూడా ఈ సంవత్సరమే.
స్వాతంత్య్రం తరువాత దేశ నిర్మాణం చేసినది ప్రభుత్వం మాత్రమే కాదని, అధికార పగ్గాలు చేపట్టినవారివల్లే అది జరగలేదు. ఎందరో రుషితుల్యులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, కర్షకులు, సైనికులు, వ్యక్తుల, సంస్థల వల్ల ఆ నిర్మాణం జరుగుతున్నది. ఇవాళ నేను ఒక సంగతిని సగర్వంగా చెబుతున్నాను అంటూ, ఎర్రకోట నుంచి ఆర్‌ఎస్‌ఎస్ పేరు ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది చరిత్రలో తొలిసారే అయినా ఆర్‌ఎస్‌ఎస్‌కు సరైన సమయంలో లభించిన సముచిత గౌరవం.
సరిగ్గా వందేళ్ల క్రితం ఇక్కడ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే సంస్థ ఆవిర్భవించిందని చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను అన్నారు ప్రధాని మోదీ. వందేళ్ల ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్థానం అంటే మాతృభూమికి వందేళ్ల సేవ అని, అదొక సువర్ణాధ్యాయమని కీర్తించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అని వర్ణించారు. మాతృభూమి సేవలో, వ్యక్తి నిర్మాణమే, జాతి నిర్మాణమన్న ధ్యేయంతో స్వయంసేవకులు తమ జీవితాలను జన్మభూమి సేవకు అర్పించారని, ఆర్‌ఎస్‌ఎస్ అంకిత భావానికి వందేళ్ల చరిత్ర ఉందని చెప్పారు. నూరేళ్లుగా మాతృభూమి సేవలో తరించిన స్వయంసేవకులందరిని ఎర్రకోట నుంచి తాను స్మరించుకుంటున్నానని అన్నారు. మోదీ ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చినప్పటికి మాతృసంస్థ గురించి ఇంత ఘనంగా చెప్పడం ఇదే తొలిసారి.
ఈ దేశంలో మైనారిటీలను బుజ్జగింపు కోసం కొన్ని పార్టీల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతూనే ఉంది. ఇది స్వాతంత్య్రానికి, సార్వభౌమాధికారానికి కూడా సవాలే. విభజన కాలం నాటి విషాద జ్ఞాపకాలను, రక్తపాతాన్ని గుర్తు చేసుకోవడం కేరళ ప్రభుత్వానికి ఎందుకు కంటగింపుగా ఉంది? ఆ జ్ఞాపకాలు సమాజంలో సంఘర్షణ వాతావరణాన్ని పెంచుతాయని దాని వాదన. ఆగస్ట్ 14న ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలనుకున్న జాతీయ భావాలు కలిగిన విద్యార్థి సంఘాలతో జాతీయతను ద్వేషించే విద్యార్థి మూకలు సంఘర్షించడాన్ని ఏమనాలి? అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని అవమానిస్తున్నాయి. అయితే వీళ్లు విమర్శిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత స్వాతంత్య్రం గురించి ఏమన్నారు!
స్వాతంత్య్రం వచ్చిందని భారతీయులు తృప్తి పడిపోతే సరిపోదని, వచ్చిన స్వాతంత్య్రాన్ని సజీవంగా ఉంచుకోవడానికి, ప్రపంచానికి సుఖసంపదలను అందించడానికి కూడా త్యాగాలు చేయవలసి ఉంటుందని సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్‌జీ భాగవత్ అన్నారు. ఉత్కళ్ బిపన్న సాహిత్య సమితి ప్రాంగణంలో సరసంఘ చాలక్ త్రివర్ణ పతాకం ఎగురవేసి వందనం చేశారు. భారత్ ఒక ప్రత్యేక దేశమని, ప్రపంచంలో శాంతి, సుఖ సంతోషాలను నింపడమే ధ్యేయంగా ఉన్న దేశమని అన్నారు. మనం స్వాతంత్య్రం తెచ్చుకున్నామంటే దేశంలో ప్రతి ఒక్కరికి భద్రత, శాంతి, సుఖసంతోషాలు, గౌరవం అందించడానికేనని చెప్పారు. భువనేశ్వర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెప్పిన ఈ మాటలు విశిష్టమైనవి. స్వాతంత్య్రం తేవడానికి మన ముందు తరాల వారు ఎనలేని త్యాగాలు చేశారు. స్వాతంత్య్ర పరిరక్షణ అనేది మన మతం, మేధాశక్తితో జరగాలని అన్నారు. దానిని సజీవంగా ఉంచుకోవడానికి ఈ తరాలు త్యాగాలు చేయక తప్పదని అన్నారు. మన పూర్వికులలో మూడు తరాలవారు చేసిన త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని గుర్తు చేశారు. 2000 ఏళ్లుగా సమాధానం దొరక్క ప్రపంచం బాధపడుతున్న అనేక సమస్యలకు భారత్ పరిష్కారం చూపాలని అన్నారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తినీ, ఆ యోధులను గౌరవించడం అంటే ఇది.
ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్, కమ్యూనిస్టులు సహా చాలా పార్టీలకు రుచించడం లేదు. చిత్రం ఏమిటంటే, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కూడా, ప్రధాని ఎర్రకోట నుంచి ఆర్‌ఎస్‌ఎస్ పేరు ప్రస్తావించడం ద్వారా స్వాతంత్య్ర సమర యోధులని, వారు సాగించిన పోరాటాన్ని కించపరిచారని అనడం. ఆగస్ట్ 14 విభజన నాటి విషాదాల స్మరణ దినాన్ని పాటిస్తున్న వారి మీద దాడులకు దిగిన కేరళ సీపీఎం దాష్టీకం ఈయనకు తెలియదు కాబోలు. నెహ్రూ కుటుంబంతోనే స్వాతంత్య్రం వచ్చేసిందన్న నమ్మకంతో ఉండే కాంగ్రెస్ ప్రతినిధి కూడా, వలస వ్యతిరేక పోరాటంతో సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్ అంటూ నోరు పారేసుకోవడం వికృతం కాదా! ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న మాణిక్కం టాగూర్, జైరామ్ రమేశ్ వంటి వారికి లోక్‌సభ విపక్ష నేత రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసలు ఎర్రకోట వేడుకల వైపే చూడలేదన్న సంగతి తెలియదు కాబోలు. ఇంకా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వంటివారూ ఇలాగే వాగినా ఆ మాటలకు విలువేం లేదు. స్వరాజ్యం గురించి ఒక మంచి మాట చెప్పాలంటే గుండెలలో దేశభక్తి ఉండాలి. దేశంలో దానిని లేకుండా చేద్దామనుకుంటున్న వారే మోదీ మాటలను తప్పుపడుతున్నారు.