ఉపాధ్యాయ, ఉపాధ్యాయిని. అధ్యాపక, అధ్యాపకురాలు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం. అంతర్లీనంగా ఉపాధ్యాయినీ దినోత్సవం కూడా. గురుపత్నినే ఉపాధ్యాయినిగా భావించిన సంస్కృతి మనది. విద్యాబోధనకు, కుటుంబ వ్యవస్థకు అంతటి అవినాభావ సంబంధం. కాలక్రమంలో ప్రత్యేకత సంతరించుకుంది ఉపాధ్యాయినీ వృత్తీ, ప్రవృత్తీ. టీచర్‌ అం‌టే ఉపాధ్యాయిని అని ఇప్పటి విస్తృత అర్థం.

గురుకులమే ఇల్లు. గురువే దైవం. గురుపత్నే దేవత.

గురుశిష్య బంధానికి ఇంతటి పవిత్రత, ప్రత్యేకత ఉన్నాయి.

సోదరి నివేదిత జీవితమంతా ఉపాధ్యాయినిగానే! చదువులమ్మ.

విశిష్టతను నిలబెట్టిన ఉపాధ్యాయినులు దేశంలో ఎందరెందరో.

వారిని పేరు పేరునా తలచుకోవాల్సిన అవసరం, ఎప్పటికీ ఉంటుంది. టీచరు ఉద్యోగాన్నే స్త్రీ ఎందుకు చేపట్టాలంటే – బోధనలో ఓర్పు, నేర్పు, సహజంగానే ఉంటుంది కాబట్టి. కొన్ని కుటుంబాల్లో మహిళా టీచర్ల సంఖ్య ఎక్కువ. ఉపాధ్యాయినులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ఉన్నాయంటే… అదీ ప్రాధాన్యం!

బాలబాలికలకు నిత్యమూ విద్యాబుద్ధులు నేర్పే మహిళా టీచర్లకు గురుపూజోత్సవ వేళ సంయుక్త సత్కారాలూ ఏర్పాటవుతుంటాయి.

ప్రత్యేకించి వనితల కోసమే పాఠశాలల చరవాణి సమూహాల్లో ఏర్పాట్లు. ఆ ఉపాధ్యాయినీ బృందాల పేర్లు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తుంటాయి.

ఇవన్నీ ఇప్పుడు, మరి అప్పుడు?

ఇవి- ఆ రోజుల్లోనే వనితాశక్తిని చాటి చెప్పిన ఉపాధ్యాయినుల గురించిన  విశేషాలూ, విలక్షణతలూ. తెలుసుకున్న కొద్దీ మనకు ఆశ్చర్య ఆనందాలు! తరచి చూసినకొద్దీ ఎన్నెన్నో విశేషణాల పరంపరలు!

అంతర్జాతీయంగా హెలెన్‌ ‌కెల్లర్‌. ఆమెకు ఉపాధ్యాయిని ఆన్‌ ‌సులీవన్‌. అం‌దరూ ‘ఆన్‌’ అని పిలిచేవారు. శారీరకంగా ఎన్నో సమస్యలున్నా, మానసికంగా ఆమె ధైర్యవంతురాలు. బీదరికం బాధించినా, చుట్టుపక్కలవాళ్లు చిన్నచూపు చూసినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.

అటువంటి స్థితిగతుల్లోనే చదివి స్కూలు ఫస్ట్ ‌వచ్చింది! హెలెన్‌కీ వ్యాధుల బాధలు ఎక్కువ. వాటిని తట్టుకునే పటిమా ఎక్కువే. శారీరక, మానసిక వేదనలు ఎన్ని ఉన్నా అన్నింటినీ భరించేది హెలెన్‌. ఆమెకి సహాయంగా అడుగుపెట్టింది ఆన్‌.

ఒకసారి తన దగ్గరికి వచ్చిన ఆన్‌ ‌చేతి సంచీని తటాలున లాగేసుకుంది హెలెన్‌. అదంతా అప్పటి తన మనోస్థితి ప్రభావం! ఆ ‘సంచీలో ఏముందా?’ అని అదే పనిగా వెదికింది. అందులో కనిపించింది చేతి గడియారం! ఆన్‌ ‌పాఠశాలలో ప్రథమురాలిగా వచ్చినపుడు, టీచర్‌ ‌బహూకరించింది అది. ఆ వాచీనే హలెన్‌కు ఇచ్చేసింది ఆన్‌.

ఆ ఇవ్వడంలోని వాత్సల్యం హెలెన్‌ ‌మనసును తాకింది. కొంత కాలానికి ఆమె మారాం తగ్గింది. చదువుమీద ‘చూపు’ నిలిచింది. ఆన్‌కీ దృష్టి అంతగా ఆనదు. అయినా శిష్యురాలి కోసం ఎంతెంతో శ్రమను ఓర్చుకుంది. గాయాలను భరించింది. బాధలను సహించింది.

మరికొంత కాలానికి, హెలెన్‌ ‌కళాశాల స్థాయికి చేరింది. అలా చేరేలా చేసింది గురువు, ఆన్‌. ‌తోడూ నీడుగా నిలిచింది. గురువుగా ఆన్‌, ‌శిష్యురాలిగా కెల్లర్‌ ‌చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయారు!

చూశారా! విద్యాబోధనలో ఎంతెంతో ఒత్తిడి ఉంటుంది. సహనాన్ని ఏ దశలోనూ కోల్పోకూడదన్న పట్టుదలా ఉంటుంది అందులో. శిష్యుడు/శిష్యురాలిని చదువులో, ఇతరత్రా సైతం తీర్చి దిద్దేందుకు ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. చేయక తప్పదనేలా.

బడిలో, తరగతి గదిలో పలు మనస్తత్వాల పిల్లలుంటారు. కొందరైతే మొండిగా ప్రవర్తిస్తుంటారు. అసలేమీ పట్టించుకోని బాలలు మరికొంతమంది. వీరందరినీ దరిచేర్చుకుని అంతా నేర్పించడమే గురుబాధ్యత. అంత సహనశీలత సర్వసాధారణంగా మహిళకే ఉంటుందన్నది నిత్య సత్యం.

వర్తమానంలోకి వద్దాం. గురుధర్మం కేవలం అక్షరజ్ఞాన ప్రదానం కాదు. జీవితాన్ని చక్కని తీరున నడిపించటం. శిష్యులకు వివేకాన్ని అందించటం, విచక్షణ జ్ఞానాన్ని కలిగించడం, ఉత్తమ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడం. ఇందులో ఉపాధ్యాయినుల పాత్ర అనం••ం.

కలమైనా, స్వరమైనా, బలమైనా, వరమైనా, అమృతజలమైనా గురువే. దీపాన్ని మరో దీపం వెలిగించినట్లు – శిష్యజీవితాన్ని వెలిగిస్తారు గురువులు. శిష్యురాళ్ల మాటలు ఇవే చెప్తుంటాయి.

తెలంగాణలోని వరంగల్‌ ‌జిల్లాలో తెలుగుభాష ఉపాధ్యాయినిగా ఉన్న విజయలక్ష్మికి మహిళా టీచరు సుగుణ. ప్రేమతో పలకరింపులు, ధైర్యం నింపే మాటలు. ఎప్పుడు అవసరమైనా సూచనలు. దగ్గరికి వాత్సల్యంగా తీసుకుని మెచ్చుకున్న జ్ఞాపకాలు. ఇక ముందు రోజుల్లో అటువంటి ఉత్తమ ఉపాధ్యాయి నులకు పట్టాభిషేకం జరగాలన్నదే శిష్యురాలి అభిమతం.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలుగా ఉన్న కవితకు గురుదేవత సుశీల. ఆ చల్లని చేతి స్పర్శ, అందించిన ఓదార్పు, కనబరచిన ఆప్యాయత ఎన్నటికీ మరవరానివని శిష్యురాలి అనుభవం. బడి అంటే మమతల గుడి. అక్కడ తన ఒళ్లో కూర్చోబెట్టుకుని పలకమీద బలపంతో చేయిపట్టి రాయించిన టీచరమ్మనే ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు కవిత. ఓనమాలు నేర్పించి, పద్యాలు చదివించి, కథలు వినిపించి, అమ్మభాష తెలుగుమీద మక్కువ పెంచారనీ నేటికీ గుర్తు చేసుకుంటున్నారు. జ్యానజ్ఞోతిగా, చైతన్యమూర్తిగా మనసారా పిలుచుకుంటున్నారు.

ఉన్నత విద్యా రంగంలో ఆచార్య ఎస్‌.‌శమంతక మణి పేరెన్నికగన్న విదుషీమణి. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆమె వద్ద పాఠాలు నేర్చుకున్న ఎందరో… ఉదాత్త అధ్యాపకురాలిగా ప్రశసిస్తుంటారు నేటికీ.

తెలుగునాట భాగ్యనగరంలో అధ్యాపక వృత్తిని నిర్వర్తించిన నాయని కృష్ణకుమారి సుదీర్ఘకాలం సేవలందించినవారు. అనేకమంది శిష్యురాళ్లకు అభిమాన పాత్రురాలయ్యారు. గౌరవాదరణ పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసిన మలయవాసిని, అరుణకుమారి తమ శిష్యుల అభిమానాన్ని అపారంగా సంపాదించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో; తమ్మారెడ్డి నిర్మల, ఎస్‌.‌రాజేశ్వరి, ఆర్‌.‌రాజేశ్వరమ్మలకు మహిళా శిష్యులెందరో.

మహిళాబోధకులు అనేకమంది విద్యారంగంలో తమదైన ముద్ర వేశారు, వేస్తున్నారు. చదువులో, సంస్కారంలో తీర్చిదిద్దుతున్నారు. విజయావకాశాలను మెరుగుపరిచేందుకు ఎంత చేయాలో అంతా చేస్తున్నారు.

వృత్తి ప్రాధాన్యం, ప్రథమత్వాన్ని సూచించే కీలక అంశం మరొకటుంది. తెలంగాణలోని హన్మకొండ ప్రాంతంలో ఒకే కుటుంబం నుంచి 80మంది టీచర్లు ఉన్నారు! వారంతా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా ఉంటున్నారు. అత్యధికులు వనితలే! నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు గ్రామంలోనైతే 200మంది పైగా ఉపాధ్యాయులున్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరిలో పడతుల సంఖ్య ఎక్కువ.

ఉపాధ్యాయుల విధి నిర్వహణలో లోపం జరిగితే తరానికి తరమే నష్టపోయే ప్రమాదముంది. అందువల్లనే టీచర్లది ఎంతో గురుతర బాధ్యత, నిబద్ధత, నిరంతర శ్రమ, సమర్థత వల్లనే మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులతో ఎలా ఉండాలి, వారి మానసిక అవసరాలు తీరేందుకు ఎటువంటి విధానాలు అనుసరించాలి, నైపుణ్యం వెలికి తీసేందుకు ఏం చేయాలన్నదానిపై సంబంధిత వర్గాల నుంచి సూచనలున్నాయి.

వికాసజ్యోతి, సద్గుణ సంపత్తి. ఈ రెండింటికీ దీపమాలిక ప్రత్యక్ష సూచిక. ‘అజ్ఞానము చీకటిగా / విజ్ఞానము వెలుగుకాగా / వివరించిన భావజ్ఞానము సుజ్ఞేయము, సుమధురము’ అన్నారందుకే విశ్వనాథ కవి. వెలుగు అనేది నిరంతర వరప్రసాదితం. అదే సర్వజీవరాశికీ ప్రాణాధారం. ఆ కాంతినే వనితగా భావించినపుడు, వనితా ఉపాధ్యాయుల సేవలు ఎప్పుడూ నిరుపమానమే!

ప్రతిభ, శక్తి, సామర్థ్యం కలగలిసిన రీతిన ఎందులోనైనా పోటీ పడి రాణిస్తున్నారు నారీమణులు. అందునా విద్య అనేది ప్రకాశం, వికాసం. అతి ప్రధానం, విశ్వవర్ధనం విద్యే. సూచక, వాచక, బోధక మార్గాలనేకం ఉంటాయిందులో. వీటిని ఆకళింపు చేసుకుని, విద్యార్థులకు ఒంటపట్టేలా చేసి, మున్ముందుకు నడిపించేవారే ఉపాధ్యాయినులు. ‘తల్లీ! నిన్నుదలంచి పుస్తకము చేతన్‌బూనితిన్‌’ అం‌టున్నపుడు మన నేత్రాల ముందు ప్రత్యక్షమయ్యేది విద్యాధిదేవతే! ఆ రీత్యా, ప్రతీ ఉపాధ్యాయినిదీ గురుతర పాత్ర.

‘కీర్తి నిలుపుటయు కాదె జనులకు జన్మఫలము’ అనలేదూ నన్నయ? ఖ్యాతిని నిలబెట్టడంలోనే అంతా ఉంటుంది. జాతికి గొప్పతనంగా అదే భాసిస్తుంది. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయుల్లో ఉపాధ్యాయినీ వృత్తి ఇనుమడించడం వారిపైనే పరిపూర్తిగా ఆధారపడి ఉంది. రాష్ట్రాలు, జిల్లాలు, స్థానికంగా జరిగే ఉపాధ్యాయ దినోత్సవ నేపథ్యాన మహిళా బోధకుల పాత్ర, ప్రాధాన్యం, ప్రత్యేకత ఘనతరం. ప్రభుత్వ, తదితర వ్యవస్థలు ఈ సత్యాన్ని తెలుసుకుని మసలిననాడు, అన్ని స్థాయుల్లో ఉపాధ్యా యినుల సంక్షేమం కోరుకున్ననాడు ‘దినోత్సవం’ అనిపించుకుంటుంది. వారి గురుత్వాన్ని పరి పోషించి, ఉత్తమ ఫలితాలు కలిగేలా చూడటమే సామాజికంగా అందరి బాధ్యత. ‘గుణాత్మకత’కు అసలైన అర్థం అదే!

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE