తమిళనాడు సీఎం స్టాలిన్ మాట ఎత్తితే చాలు మా మీద హిందీని రుద్దుతున్నారంటూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మీద విరుచుకుపడిపోతుంటారు. తమిళం, ఇంగ్లీషు భాషలు మాకు రెండు కళ్లు అంటూ అసెంబ్లీకి వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాటలు కోటలు దాటిస్తుంటారు. అలాంటి స్టాలిన్‌కు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో తమిళం, ఇంగ్లీషు భాషల్లో నానాటికి కొరవడుతున్న నైపుణ్యాలకు సంబంధించి తాజాగా విడుదలైన గణాంకాలను చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనపడకమానదు. గురువింద గింజ సామెత గుర్తుకు రాక మానదు.
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 7.29 లక్షల మందికిపైగా తమిళం, ఇంగ్లీషు భాషా పరీక్షల్లో ఫెయిల్ కావడం తమిళ భాషాభిమానులను దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేసింది. ఇది ప్రభుత్వ పాఠశాల్లో పడిపోతున్న నాణ్యతాప్రమాణాలకు అద్దం పడుతోంది. తాజాగా చేసిన మదింపు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి విద్య సముపార్జనలో ప్రమాదఘంటికలను మోగిస్తున్న అంతరాలను వెలుగులోకి తీసుకొనివచ్చింది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతు లకు16.8 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వారిలో 7.29 లక్షల మంది విద్యార్థులు అంటే మొత్తం విద్యార్థుల్లో దాదాపు 45.38 శాతం చదవడంలో, రాయడంలో కనీస పరిజ్ఞానాన్ని ప్రదర్శించడంలో విఫలమయ్యారు. అలాంటివారిలో నేర్చుకోవడంలో నైపుణ్యాలను మెరుగపరచడానికి ప్రత్యేక తరగతులను నిర్వహించడానికి డీఎంకే సర్కారు ఉపక్రమించింది అనే వార్త నేతి బీరకాయలో నెయ్యి నానుడిని గుర్తుకు తెస్తోంది. సీఎం స్టాలిన్, ఆయన మంత్రివర్గ సహచరులు ఎంతసేపూ హిందీ మీద టన్నులకొద్దీ ద్వేషాన్ని కుమ్మరించడమే తప్ప రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర అధికారిక భాష తమిళం బోధనా తీరు ఏ విధంగా ఉంది? విద్యార్థులు వారి మాతృభాషలో ఏమేరకు పరిజ్ఞానాన్ని సంపాందించు కుంటున్నారు? అనే విషయం మీద శ్రద్ధ పెట్టక పోవడం ప్రస్తుత దురావస్థకు దారితీసిందనేది విద్యారంగానికి చెందిన విశ్లేషకుల వాదన.
ఓ తమిళ దినపత్రిక పూనుకోకపోయి ఉంటే తమిళం, ఇంగ్లీషు భాషల పరిస్థితి రాష్ట్రంలో ఇంత దారుణంగా ఉందనే సంగతి ఎప్పటికీ వెలుగులోకి వచ్చేది కాదు. ఆలస్యంగానైనా ఇంతటి బృహత్ కార్యానికి పూనుకొని మాతృభాషపట్ల ఏలికల కళ్లకు కమ్ముకున్న మాయపొరలను తొలగించడానికి తన వంతు ప్రయత్నం చేసిన తమిళ దినపత్రిక దిన మలర్‌ను భాషాభిమానులందరూ తప్పక అభినందించి తీరాలి.
తమిళనాడులోని 38 జిల్లాల్లో 16 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటున్నారు. దినమలర్ పత్రిక వారిలో 8 లక్షల మందికిపైగా విద్యార్థులకు నైపుణ్య పరీక్షలను నిర్వహించింది. జూలై 8 నుంచి 10వ తేదీ మధ్యకాలంలో తమిళం, ఆంగ్లం, గణితశాస్త్రంలో నైపుణ్య పరీక్షలను చేపట్టారు. జూలై 28న వెల్లడైన ఫలితాల్లో ఏడు లక్షల మందికిపైగా విద్యార్థులు దారుణంగా ఫెయిల్ అయ్యారు. 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 45.83 శాతం మందికి పైన పేర్కొన్న సబ్జెక్టుల్లో కనీస పరిజ్జానం కొరవడింది. నీల్‌గిరీస్ జిల్లాలో 6,322 విద్యార్థులతో అత్యధికంగా 67.41 శాతం ఫెయిల్ అయ్యారు. తర్వాతి స్థానంలో 10,741 మంది విద్యార్థులతో పెరంబళూర్(65.85 శాతం), 29,806 మంది విద్యార్థులతో తిరుచ్చి (55.34 శాతం), 31,233 మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో చెన్నయ్(54.47 శాతం) నిలిచాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో అత్యధికులు 1 నుంచి 5 తరగతులకు ఉద్దేశించిన పాఠ్యపుస్తకాల్లో పాఠాలను చదవలేకపోయారు. చిన్నచిన్న లెక్కలను కూడా చేయలేకపోయారు. అనేక అధ్యయనాలు ఈ వాస్తవాలను పదేపదే వెలుగులోకి తెచ్చినప్పటికీ ఏమీ తెలియనట్టుగా స్టాలిన్ సర్కారు మొద్దు నిద్రను నటిస్తోందనేది సామాజిక విద్యావేత్తల అభియోగం. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాల విద్యావ్యవస్థలో వాస్తవాలను ఎత్తిచూపే నివేదికలను, అధ్యయనాలను అదేపనిగా తోసిపుచ్చడం పాలకులకు ఓ అలవాటుగా మారిపోయింది. ఈ సందర్భంగా తమిళనాడులో చదువు చెబుతున్న వైనం గురించి అక్కడి గవర్నర్ ఆర్‌ఎన్ రవి అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నర్ ఇటీవల ఒక చోట మాట్లాడుతూ ‘‘తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిలో ఎక్కువమంది పేద, అణగారిన వర్గాల కుటుంబాలకు చెందినవారు. ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంలోనూ, విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడంలో అనుసరించాల్సిన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి’’ అని అన్నారు. వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక-ఏఎస్‌యీఆర్‌ను ప్రస్తావిం చారు. ‘‘ఉన్నతపాఠశాల విద్యార్థుల్లో 50 శాతానికి పైగా విద్యార్థులు తేలికపాటి లెక్కలు కూడా చెయ్య లేరు. ఆఖరికి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించిన పాఠ్యపుస్తకాలను కూడా చదవలేరు.
తమిళనాడులో ప్రభుత్వ విద్యావ్యవస్థ క్రమ క్రమంగా క్షీణించిపోతోంది. విద్యార్థులు అత్తెసరు మార్కులతో పాసవుతున్నారు. సర్టిఫికేట్లతో బాహ్యప్రపంచంలోకి వస్తున్నారు. ఉపాధి అవకాశాల్లేక విలవిలలాడి పోతున్నారు’’ అని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి, 2025లో తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై స్టాలిన్ సర్కారు తీరును ఎండగడుతూ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ఆ పోస్టులో ‘‘తమిళనాడు కళావిహనమైపోతోంది. మాతృభాషలో (తమిళం) కనీస నైపుణ్యానికి చెందిన జాబితాలో అట్టడుగునకు పడిపోయింది. ఎంకే స్టాలిన్, ఆయన వందిమాగధులు విద్యలో నాణ్యతను దిగజార్చి నందుకు, విద్యారంగానికి రాజకీయం చేసినందుకు, తమిళనాడు పిల్లలకు సమాన అవకాశాలను, ప్రపంచ స్థాయి విద్యను దూరం చేస్తున్నందుకు సిగ్గుపడాలి’’ అని అన్నారు.
అన్నామలై మరో పోస్టులో ‘‘తమిళనాడులో డీఎంకె సర్కారుకు ప్రభుత్వపాఠశాలలు, కళాశాలల్లో విద్యా మౌలికసదుపాయలను ఉన్నతీకరించడంపై ఒక దృక్కోణం కొరవడింది. అలాంటి ఒక దృక్కోణం ప్రావీణ్యంలో అంతరాలను తొలగిస్తుంది. ఈ విషయంలో తమిళనాడు గత కొద్ది సంవత్సరాలుగా విఫలమైంది. డీఎంకే ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన మంచిపనులకు అడ్డుగోడగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించే ప్రయోజనాలను తమిళనాడు ప్రజలకు దక్కకుండా చేస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ను తమిళనాడులో విద్యా సంస్థలను ఉన్నతీకరించడానికి మీ దురహం కారం అడ్డుపడిందా? అని ప్రశ్నిస్తున్నా’’ అని నిలదీశారు.
తమిళులకు స్టాలిన్ కుచ్చుటోపీ రాష్ట్ర విద్యా విధానం-ఎస్‌యీపీ
జాతీయ విద్యా విధానానికి-ఎన్‌యీపీ-2020కి ఆమడదూరంలో ఉండే తమిళనాడు సీఎం స్టాలిన్ దేశంలో మరే రాష్టప్రభుత్వమూ కనీసం కలలో కూడా అనుకోని ఓ వింత విధానాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన కుచ్చుటోపీలా పెట్టారు. అదే పాఠశాల విద్యకు రాష్ట్ర విద్యా విధానం-ఎస్‌యూపీ. ఆగస్టు 8న దీనికి సంబంధించిన విధి,విధానాలతో కూడిన ఓ పుస్తకాన్ని చెన్నయ్‌లోని అన్నా శతాబ్ది గ్రంథాలయంలో అట్టహాసంగా విడుదల చేశారు. తాడూ బొంగరం అంటూ లేని ఈ ఎన్నికల స్టంటుకు స్టాలిన్ పుత్రరత్నం, సందు దొరికినప్పుడల్లా హిందూత్వంపైన అవాకులూ చెవాకులూ పేలే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరయ్యారు. పాఠశాల విద్యా మంత్రి అంబిల్ పొయ్యమొళి తండ్రీకొడుకులకు తోడయ్యారు. మోదీ సర్కారు ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎన్‌యీపీని మక్కీకి మక్కీ దించేశారు. కాకపోతే తమది ద్విభాషావిధానం అని ఢంకా బజాయించారు. ఆ రెండు భాషల్లో ఒకటి తమిళం అయితే మరొకటి ఆంగ్లం. ఎస్‌యీపీ గురించి సీఎం స్టాలిన్ చెప్పిన మాటలు ఆకాశంలో చుక్కలను దాటి పోయాయి. రాష్ట్ర విద్యా విధానంతో విద్యార్థులకు పాఠాలను బట్టీపట్టే పని ఉండదట. అది విద్యార్థులను ముందుగా ఆలోచింపజేస్తుందట. ఆ తర్వాత వారిని పనికి పురిగొల్పుతుందట. తమిళ భాష ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెబుతుందట. ఉదయనిధి స్టాలిన్ అయితే మరో అడుగు ముందుకు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా రంగాన్ని రాష్ట్ర జాబితాలోకి చేర్చే విషయంలో తమిళనాడు ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉందని కోతలు కోశారు. పాఠశాల విద్యామంత్రి అంబిల్ తండ్రీకొడుకలకు వంత పాడారు.
వేలల్లో పాఠశాలలకు తాళాలు
మోదీ సర్కారు తీసుకొచ్చిన ఎన్‌యీపీ-2020 మీద పడి ఏడుస్తున్న డీఎంకే సర్కారు రాష్ట్రంలో పాఠశాలలను ఉద్ధరించకపోగా ఉన్నవాటిలో వేలాది పాఠశాలలకు తాళాలు బిగిస్తోంది. ఈ ఏడాది జూలైలో స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. పాఠశాలల మూసివేతపై మీడియాలో వచ్చిన వార్తలపై ఎలి మెంటరీ విద్య డైరెక్టరేట్ -డీయీయీ స్పందించాల్సి వచ్చింది. ఒక్క విద్యార్థి కూడా చేరని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,204 పాఠశాలలను మూసివేసినట్టు వెల్లడించింది. వాటిలో 208 ప్రభుత్వ పాఠశాలలు, 869 అన్‌ఎయిడెడ్, 114 ఎయిడెడ్, 11 పాక్షికంగా ఎయిడెడ్ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని రెండు పాఠశాలలు ఉన్నాయి. అయితే పాఠశాలల మూసివేతకు జననాల రేటు లో తగ్గుదల, గ్రామాల నుంచి పట్టణాలకు, నగరాలకు ప్రజల వలసలను అధికారులు సాకుగా చూపారు. ఆగస్టు 14న రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి, శాసనసభలో విపక్ష నేత ఎడప్పడి కే పళనిస్వామి తమిళనాడు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మూసివేత నిర్ణయం అత్యంత దారుణమని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలక ప్రత్యేకించి పాలక డీఎంకే నాయకులకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రయోజనం చేకూర్చడానికి అలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
ఉన్నతపాఠశాల విద్యార్థుల్లో లక్షలాది మందికి తమిళభాషలో ఓనమాలు కూడా రాని పరిస్థితుల్లో, దాన్ని చక్కదిద్దాల్సింది పోయి కొత్తగా ప్రాథమిక విద్యకు విద్యా విధానాన్ని తీసుకొని రావడం ఏమి టంటూ స్టాలిన్ సర్కారును విమర్శించే విద్యావేత్తలు తమిళనాడులో కోకొల్లలు.
– జాగృతి డెస్క్