ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చరిత్ర గతి మారుతోంది. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం, డాలర్ ఆధిపత్యం ఇంకానా అంటున్నాయి పేద దేశాలు. కొత్త చరిత్ర నిర్మాణానికి పరిస్థితులను వేగవంతం చేస్తున్నవారు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావడమే నేటి వైచిత్రి. రోగి చస్తే చచ్చాడు కానీ ఆపరేషన్ సక్సెస్ అయిందన్నట్టుంది ట్రంప్ టారిఫ్‌ల విధింపు వ్యవహారం. అమెరికా అధ్యక్షుడి ఆర్థిక విధానమో, విదేశాంగ విధానమో దానికి ఏ పేరు పెట్టినా ఒక ప్రహసనంగా కనిపిస్తున్నది. డాలర్ మరణం ఆసన్నమయిందని అమెరికా బ్రాండ్ ప్రముఖుడు ఒకరు హెచ్చరించడం ఆ ప్రహసనానికి విషాదకరమైన మలుపు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం ట్రంప్‌కు ఇష్టం లేదు. అందుకే సుంకాల మీద సుంకాల పెంచాడు. ఆ సుంకాలను భారత్ ఖాతరు చేయవలసిన అవసరం లేదని ఆ దేశ కాంగ్రెస్ సభ్యులు, మాజీ భద్రతా సలహాదారులు చెబుతున్నారు. బ్రిక్స్ పటిష్టమవుతున్న నేపథ్యంలో, దానికి భారత్, చైనా వెన్నుదన్నుగా ఉందన్న విషయం ట్రంప్ విస్మరించడమే ఈ రగడకు అసలు కారణం. మీ సుంకాల వడ్డింపుతో భారత్ లొంగడం మాట అటుంచి, రష్యా వైపు మరింత మొగ్గే అవకాశం ఉందని అమెరికా నిపుణులు ట్రంప్‌ను హెచ్చరించారు కూడా. కొన్ని దశాబ్దాలుగా అమెరికా- భారత్‌ల నడుమ నిర్మించుకుంటూ వచ్చిన సంబంధాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయే పరిస్థితి దాపురించిందని కూడా వారు వెల్లడించారు.
పెంచిన టారిఫ్‌ల పుణ్యమాని అమెరికా ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగినమాట వాస్తవం. కానీ ఈ ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది? దేశీయ పరిశ్రమలు, వినియోగదార్లు చెల్లించే అధిక పన్నుల కారణంగా!! అంటే తన దేశ పౌరుల నుంచే ముక్కుపిండి వసూలు చేసే పన్ను వల్ల బొక్కసం నిండుతున్నా, యు.ఎస్.లో నివసించే విదేశీయులు ఈ భారాన్ని మోయాల్సిందేనంటూ ట్రంప్ వినిపిస్తున్న వితండవాదం అర్థం కావడంలేదు! సుంకాలు పెంచడంతో ధరలు విపరీతంగా పెరిగి అమెరికన్ ప్రజలు లబోదిబో మంటున్నా ట్రంప్‌కు పట్టడంలేదు! తనకు నోబెల్ బహుమతి రావాలన్న కోర్కె ఇటు దేశ ప్రజలను, ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతోంది. ఇవేవీ పట్టని ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తూ తుగ్లక్ పాలనను తలపిస్తున్నారనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
భారత్‌పై 50శాతం సుంకాలు విధించిన తర్వాత ట్రంప్ తాజాగా ఒక ప్రకటన చేస్తూ, ఈ టారిఫ్‌ల అంశం తేలేవరకు భారత్‌తో వాణిజ్య చర్చలు జరిపేదే లేదని తెగేసి చెప్పారు. ట్రంప్ భారత్‌పై రెండో విడత పెంచిన టారిఫ్‌లు ఆగస్ట్ 27నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ పకటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో టెలిఫోన్‌లో ద్వైపాక్షిక చర్చలు జరపడం ద్వారా, బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని యు.ఎస్.కు తేల్చిచెప్పినట్లయింది. బ్రెజిల్ అధ్యక్షుడితో కూడా మోదీ ఫోన్‌లో చర్చలు జరిపి ఈ అంశం చర్చించారు. అంతేకాదు ఈ ఏడాది జరిగే 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేయడం ట్రంప్‌కు హెచ్చరిక వంటిదే. పలు దేశాలనుంచి మరోవైపు స్వదేశంలో వ్యతిరేకత వస్తున్నా ట్రంప్ తన టారిఫ్‌ల వాదనను పదే పదే సమర్థించుకోవడం విచిత్రం. ఇప్పటికే ఈ టారిఫ్‌లకు వ్యతిరేకంగా దాఖలైన కేసుపై యు.ఎస్. ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలు అమెరికా విధించిన సుంకాలపై కోర్టును ఆశ్రయించాయి. ఈ సుంకాల విధింపులో అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అవసరాల చట్టం (ఐఈఈపీఏ)ను ఉపయోగించ డంపై ఈ కేసు దృష్టి సారించనుంది. ఒకవేళ కోర్టు తీర్పు ట్రంప్‌కు వ్యతిరేకంగా వస్తే టారిఫ్‌ల విధింపు మరికొంతకాలం ఆలస్యమవుతుంది. ఎందుకంటే ఓడిపోయిన పార్టీ సుప్రీం కోర్టులో అప్పీలు దాఖలు చేయవచ్చు. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే 1929 నాటి మాంద్యాన్ని ఎదుర్కోక తప్పదని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. నిజమేమంటే 1929లో అమెరికా టారిఫ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకు ప్రతిగా ఇతర దేశాలు కూడా వాణిజ్య ఆంక్షలు విధిస్తూ రావడంతో, పెను సంక్షోభం ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ దేశాల జీడీపీ పడిపోయి, చివరకు హిట్లర్ ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలచుకోవ డానికి దారితీసింది. అసలు విషయాన్ని తెలుసు కోకుండా సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిస్తున్న ట్రంప్ వీటి పర్యవసానంతో సంభవించే ప్రతికూల ఫలితాలను గుర్తించకపోవడం మూర్ఖత్వమే అనుకోవాలి.
స్నేహం చెడటానికి కారణం
ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కావాలన్న కాంక్ష తలకెక్కింది. ఇందుకు అర్హుడిగా తనను తాను చెప్పుకోవడానికి భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన సంఘర్షణ జూన్ 17న తాను ఫోన్‌లో చెప్పడం వల్లనే ఆగిపోయిందని ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే దీన్ని నరేంద్రమోదీ తిరస్కరించడమే కాదు, కేవలం పాకిస్తాన్ కోరడం వల్ల మాత్రమే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశామని స్పష్టం చేయడం డోనాల్డ్ ట్రంప్‌కు ఎక్కడలేని కోపం తెప్పించిందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అక్కడి నుంచే ఇరుదేశాల సంబంధాలు క్షీణించడం మొదలు పెట్టాయని కూడా వివరించింది. జీ7 సమావేశాల్లో పాల్గొన్న తర్వాత నరేంద్రమోదీ నేరుగా క్రొయేషియాకు వెళ్లిపోయారు. అసీమ్ మునీర్‌తో తనకు సమావేశాన్ని ట్రంప్ ఏర్పాటు చేస్తారన్న అనుమానంతో మోదీ అమెరికాలో దిగకుండా, నేరుగా క్రొయేషియాకు వెళ్లినట్టుకూడా తన కథనంలో పేర్కొంది. ఇది మాత్రమే కాదు, చైనాతో ట్రంప్ ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చు కోవడం కూడా భారత్ తన వైఖరిని మరింత కఠినం చేయడానికి మరోకారణంగా బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఈ ఒప్పందం వల్ల చైనాకు టారిఫ్‌లో కొంత వెసులుబాటు దక్కడం, అమెరికాలో మరిన్ని మార్కెట్ల లోకి దానికి అవకాశం లభించడంతో, తన వాణిజ్య అవకాశాలు కుంచించుకుపోయే పరిస్థితి నెలకొనడం భారత్ ఆగ్రహానికి కారణమని వివరించింది.
ఒప్పందాలు రద్దు కాలేదు
ట్రంప్ 50శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో భారత్ ఆ దేశంతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలను కొన్నింటిని తాత్కాలికంగా నిలిపే సిందన్న వార్తలు వచ్చాయి. ముఖ్యంగా యు.ఎస్. తయారీ స్ట్రెకర్ ఆర్మ్‌డ్ ఫైటింగ్ వెహికిల్స్ (ఏఎఫ్‌ఎస్) ను ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన చర్చలను భారత్ నిలిపేసిందన్నది వాటి సారాంశం. అమెరికా ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోలును భారత్ రద్దు చేసిందని రాయిటర్స్ పేర్కొంది. అంతేకాదు రాబోయే కొద్దివారాల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆయుధ కొనుగోళ్లపై చర్చించేందుకు యు.ఎస్. వెళ్లాల్సిన పర్యటన కూడా రద్దయినట్టు వార్తలు వచ్చాయి. భారత్ తీసుకున్న నిర్ణయాల వల్ల జనరల్ డైనమిక్స్ తయారీ స్ట్రైకర్ వాహనాలు, ట్యాంకు విధ్వంసక జావ్‌లిన్ క్షిపణులు, బోయింగ్ పి81 నిఘా విమానం కొనుగోలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిచిపోయాయి. పి81 విమానం కొనుగోలు ఒప్పందం విలువ 45000 మిలియన్ డాలర్లు! ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలును నిలిపేస్తు న్నట్టు అంతకు ముందే భారత్ స్పస్టం చేసింది. ఈ నిర్ణయాలకు సంబంధించి లిఖిత పూర్వక ఆదేశాలు ఇప్పటికీ జారీ చేయకపోవడంతో, వీటి పునరుద్ధరణ అవకాశాలు ఇంకా ఉన్నాయని కూడా వార్తా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను మన విదేశాంగ శాఖ కొట్టిపారేయడం గమనార్హం. రక్షణ ఒప్పందాల రద్దుపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. రక్షణ సామగ్రి కొనుగోళ్లు యథా తథంగా కొనసాగుతాయని పేర్కొంది. మొత్తంమీద చెప్పాలంటే అమెరికా ఆయువుపట్టుగా భావించే వాణిజ్యంపైనే దెబ్బకొట్టే చర్యల ద్వారా తనతో పెట్టు కుంటే ఎట్లావుంటుందో ట్రంప్‌కు రుచి చూపిస్తోంది.
పన్నుల భారంతో అమెరికన్ల విలవిల
ఒకటి వాస్తవం. అమెరికాది వినియోగ ఆర్థిక వ్యవస్థ అయినందున దిగుమతులు ఎలాగూ తప్పవు! అటువంటప్పుడు ఎంత మొత్తంలో సుంకాలు విధించినా అమెరికా కంపెనీలు దిగుమతులు చేసుకోకుండా ఉండలేవు. మరి ఈ అధిక టారిఫ్‌లు చెల్లించేది ఈ కంపెనీలే! ఈ మొత్తం ప్రభుత్వ ఖజానాకే వెళుతుంది. ఈ కంపెనీలు ఇవే వస్తువులను రిటైల్ అమ్మకాలు జరిపినప్పుడు ఈ టారిఫ్‌ల భారమంతా మళ్లీ వినియోగదారుల నెత్తినే రుద్దుతాయి. అంటే ఈ సుంకాల వల్ల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే టారిఫ్‌లు పెంచడం వల్ల విదేశాలు, చివరిగా దేశీయ వినియోగ దారులు నష్టపోతారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నదిదే. దిగుమతి సుంకాలు పెంచడం వల్ల అమెరికా ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరుగు తుందని అక్కడి తయారీ రంగానికి ప్రోత్సాహం లభిం చడంతో పాటు, ఇన్నేళ్లుగా అమెరికాకు ప్రతికూలంగా కొనసాగుతున్న అనుచిత వాణిజ్య విధానాలను గాట్లో పెట్టవచ్చనేది ట్రంప్ వాదన. నిజం చెప్పాలంటే్ర ప్ విధానాల వల్ల అమెరికా ప్రభుత్వ ఆదాయం బాగా పెరిగిన మాట నిజం. ఉదాహరణకు ఒక్క జూలై మాసంలోనే 152 బిలియన్ డాలర్ల మేర సుంకాల ద్వారా ఆదాయం లభించింది. మరి ఈ టారిఫ్‌ను చెల్లిస్తున్నదెవరు? అమెరికాలోని స్థానిక కంపెనీలు! ఇంతగా పెంచిన టారిఫ్‌లను ఇంకెంతో కాలం భరించడం సాధ్యం కాదని అవి మొత్తుకుంటు న్నాయి. పెంచిన టారిఫ్‌ల కారణంగా యు.ఎస్.లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. గత జూన్ నెలలో వస్త్రాలు, గృహ వినియోగ వస్తువుల ధరలు బాగా పెరిగాయి. ఆర్థికవ్యవస్థలో వృద్ధి నమోదైనా అది ఆరోగ్యకరమైన రీతిలో లేదు. శ్రామిక మార్కెట్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. బొలీవియా, ఈక్వెడార్, ఐస్‌ల్యాండ్, నైజీరియా వంటి దేశాల దిగుమతులపై 15% టారిఫ్ విధిస్తుండగా, తైవాన్ వంటి దేశాలపై 20% టారిఫ్ అమలవుతోంది. టారిఫ్‌లు పెంచిన మేర అమెరికన్ పౌరులు అధికంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే తన విధానాలే యు.ఎస్.ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్న మాటలను ట్రంప్ ఖాతరు చేయడంలేదు. ఈ టారిఫ్‌ల వల్ల కష్టనష్టాలను విదేశీయులు మాత్రమే భరించాల్సి ఉంటుందని ట్రంప్ గతంలో ఒకసారి అన్నారు. ట్రంప్ చెబుతున్న మాటలకు, దేశంలో వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. టారిఫ్‌ల వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్న ప్పటికీ, వీటిని చెల్లించేది సాధారణ అమెరికన్ పౌరులు. పెంచిన టారిఫ్‌ల నేపథ్యంలో సగటు అమెరికన్ 18% వరకు అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఒక సర్వే ప్రకారం సగటున ఒక అమెరికన్ కుటుంబం వార్షికంగా 2400 డాలర్ల వరకు ఈ టారిఫ్‌ల వల్ల నష్టపోతుందని అంచనా. ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నా, సగటు అమెరికన్ పౌరులు పెనుభారాన్ని మోయాల్సి వస్తోంది. ట్రంప్ విధానం ‘‘రోగి చచ్చినా ఆపరేషన్ సక్సెసయింది’’ అని డాక్టర్లు సంతోషపడిన చందంగా తయారైంది. కాగా టారిఫ్‌ల వల్ల పెరిగే ధరల కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించి పోవడం ఖాయమని కొందరు ఆర్థిక విశ్లేషకులు మరోవైపు హెచ్చరిస్తున్నారు!
సహనం కోల్పోయిన భారత్
ఇప్పటివరకు టారిఫ్‌ల విషయంలో ఆచితూచి వ్యవహరించిన భారత్ స్థిరత్వంలేని ట్రంప్ వైఖరిని బేఖాతరు చేస్తూ ముందుకెళ్లాలనే నిర్ణయించింది. భయపడుతూ కూర్చుంటే రోజుకో సమస్యను సృష్టించి ఇబ్బంది పెడతాడని ఒక నిర్ణయానికి వచ్చి రష్యాతో వాణిజ్య ఒప్పందానికి ఓకే చెప్పేసింది. ఎంత టారిఫ్ అయినా భరిస్తాం గాని, రష్యాతో వాణిజ్య ఒప్పందం విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తెగేసి చెప్పింది. ప్రయోజనం లేని మిత్రత్వం అవసరంలేదని తన చర్యల ద్వారా యు.ఎస్.కు అర్థమయ్యేలా చేసింది. దీంతోపాటు ఈనెల 31, వచ్చేనెల 1వ తేదీన చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో పాల్గొనేందుకు మోదీ పర్యటన ఖరారైంది. ఆ విధంగా ఇప్పటివరకు దీనిపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. భారత్- చైనాలను ఒక్కటి చేసేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. కానీ ట్రంప్ అతిక్లిష్టమైన ఈ సమస్యను తన తలతిక్క నిర్ణయాలతో పరిష్కరించారు. 2019 తర్వాత మొదటిసారి నరేంద్రమోదీ చైనాలోకి అడుగుపెట్టడా నికి, ట్రంప్ టారిఫ్‌ల రూపంలో సహాయం చేసినట్ల యింది. ఎస్సీవో సభ్యదేశాలతో పాటు మరో 20 దేశాలు ఈ సదస్సులో పాల్గొననున్నాయి. యుద్ధాలను ఆపడం మాట అట్లావుంచి శత్రువులుగా మెలిగే దేశాలను సన్నిహితం చేస్తున్నందుకు ట్రంప్‌కు నిజంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే.
రంగంలోకి ఇజ్రాయెల్ ప్రధాని
భారత్-అమెరికాల మధ్య మిత్రత్వం దెబ్బతిన్న దన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజా మిన్ నేతన్యాహు రంగంలోకి దిగడమే కాకుండా, త్వరలో మనదేశంలో పర్యటించబోతు న్నట్టు వార్తలు వస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్‌కు, నెతన్యాహు అత్యంత సన్నిహితుడు. ఇజ్రాయెల్ ప్రధాని, మన ప్రధాని నరేంద్ర మోదీకి ఎటువంటి సలహా ఇవ్వబోతున్నారన్న సంగతి పక్కన పెడితే ఆయన ట్రంప్ తరపున రాయబారం నెరపడానికే వస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందితే జుట్టు అందకుంటే కాళ్లు అనేది ట్రంప్ వైఖరి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చైనాతో ఎట్లా ఉన్నా, ట్రంప్ వైఖరితో భారత్‌తో సంబంధాలు దెబ్బతినడం యు.ఎస్.కు చెందిన నిపుణులు, మేధావులు, అత్యధిక శాతం మంది ప్రజలకు ఎంతమాత్రం ఇష్టంలేదు. బలమైన భారత్‌తో సంబంధాలు దెబ్బతినడం యు.ఎస్.కు శ్రేయస్కరం కాదని ఇప్పటికే నిక్కీహెలీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏదో విధంగా టారిఫ్‌ల విషయంలో భారత్‌ను ఒప్పించేందుకే ఈ రాయబారమని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
తొలి టర్మ్ సుంకాల ప్రభావం లేదు
ట్రంప్ మొదటి టర్మ్‌లో ఇతర దేశాల దిగుమతు లపై విధించిన టారిఫ్‌ల వల్ల, దేశంలో ఉద్యోగావ కాశాలు తగ్గడం లేదా పెరగడం జరగలేదని మసాచు సెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్, ప్రపంచ బ్యాంకుకు చెందిన ఆర్థికవేత్తలు జరిపిన అధ్యయనంలో స్పష్టమైంది. 2018లో ఉక్కు దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధించినప్పుడు, అక్కడి ఉక్కు పరిశ్రమలపై దీని ప్రభావం పడలేదు. కానీ ఇందుకు ప్రతిగా చైనా, ఇతరదేశాలు యు.ఎస్. ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచిన ప్రభావం ఉద్యోగ రంగంలో ప్రతికూల ప్రభావాలను చూపింది. కార్ల తయారీలో కెనడా, మెక్సికో, యు.ఎస్.ల మధ్య సంక్లిష్టమైన సరఫరా శృంఖలాలున్నాయి. ఫలితంగా వీటిపై టారిఫ్ విధింపుతో ఈ మూడు దేశాల• నష్టపోతున్నాయి! ఎందుకంటే టారిఫ్‌ల వల్ల పెరిగిన కార్ల ధరల భారం అమెరికన్ వినియోగదారులకే బదిలీ అయింది. ఈ విధంగా వాణిజ్యయుద్ధంలో భాగంగా విధించే అధిక టారిఫ్‌లు, అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడానికే దోహదం చేస్తాయన్నది నిష్టుర సత్యం. వరుసగా కొనసాగుతున్న లోటు, సంస్థాగత స్వేచ్ఛ తగ్గిపోతున్న తరుణంలో యు.ఎస్. ట్రెజరీలో అపరిమితంగా డిపాజిట్లు చేస్తున్న ఇతర దేశాలు వెనకాముందూ ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు 2022లో విదేశాల్లోని రష్యా ఆస్తులను, నిధులను స్తంభింపజేసిన తర్వాత ప్రపంచ దేశా ఆలోచనా సరళిలో మార్పు వచ్చింది. ఆర్బీఐతో సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు డాలర్ మారకం కంటే, బంగారాన్ని కొనుగోలు చేయడమే శ్రేయస్కరమన్న నిర్ణయానికి వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ దేశీయంగా పన్నుల్లో కోత, విదేశీ దిగుమతులపై టారిఫ్ పెంపు అమలు చేస్తున్న నేపథ్యంలో దేశంలో ద్రవ్యోల్బణం పెరగవచ్చునని ఆర్థిక నిపుణులు వేసిన అంచనాలు నిజమయ్యాయి.
దిగుమతులపైనే ఆధారం
నిజం చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యు.ఎస్ ఆర్థిక వ్యవస్థ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. దేశీయంగా పూర్తిస్థాయి ఉద్యోగాల కల్పన ద్వారా తగినంత మేర ఉత్పత్తులు లేకపోవడంతో దిగుమతులపై ఆధారపడక తప్పని పరిస్థితి! ముఖ్యంగా అమెరికా ఆర్థికవ్యవస్థలో ఉత్పత్తి కంటే వినియోగమే అధికం! ఇదే అధిక దిగుమతులకు, వాణిజ్య లోటుకు ప్రధాన కారణం. అంతేకాదు అమెరికాలో శ్రామిక ఖర్చులు అధికం. ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేస్తూ ఉత్పత్తి చేసేకంటే చౌకగా లభించే దిగుమతులే ఉత్తమం! ఇది ఆ దేశ ఆర్థికవ్యవస్థ నిర్మాణం తీరు! యు.ఎస్.తో పోల్చి నప్పుడు శ్రామిక, ఉత్పత్తి, ముడిసరుకుల లభ్యత తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న దేశాలు చాలా తక్కువ ధరలకే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నాయి. అధిక దిగుమతుల కారణంగా తమ దేశ తయారీరంగంలో ఉద్యోగావ కాశాలు పడిపోతున్నాయని ట్రంప్ చేస్తున్న వాదనలో అర్థం లేదు. అంతేకాదు, ఈ సుంకాల పెంపునకు ఈ ఉద్యోగాలు కోల్పోవడానికి సంబంధమేలేదు. అందువల్ల టారిఫ్‌ల విధింపు అక్కడి ఉద్యోగ, ఉపాధి సమస్యను పరిష్కరించదు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యు.ఎస్.డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా రూపొందింది. ఫలితంగా దేశీయంగా దిగుమతి వస్తువుల వినియోగం బాగా పెరగడానికి ఇది దోహదం చేసింది. ఈ సానుకూలత ప్రపంచంలోని మరే ఇతర దేశానికి లేదు. అటువంటప్పుడు వాణిజ్య లోటును ప్రధాన సమస్యగా చూపడం ట్రంప్ ప్రభుత్వానికి ఎంతమాత్రం తగదు. ఎందుకంటే యు.ఎస్.కు డాలర్ వల్ల కలుగుతున్న అపరిమితమైన ప్రయోజనం నేపథ్యంలో, ఇతర దేశాలు ఈ అంశాన్ని ప్రశ్నించే హక్కును కలిగివుంటాయి.
భారత్-చైనాలపై ఆగ్రహం
వర్థమాన దేశాల ముసుగులో భారత్, చైనాలు వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నాయని మొదటి నుంచీ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తర్వాతి కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేషియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్ ద్విచక్రవాహనాలపై సుంకా లను తగ్గించాలని మనదేశంపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. చివరకు మనదేశం సుంకాలు తగ్గిస్తే, ఇది చాలదంటూ పేచీకి దిగారు. అంతేకాదు మన ఉక్కుపై 25%, అల్యూమినియం ఉత్పత్తులపై 10% అదనపు టారిఫ్ విధించడం ద్వారా ప్రతీకార వైఖరిని చూపారు. మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు పెంచింది. తర్వాత జీఎస్పీ నిబంధనలు భారత్‌కు వర్తింప జేయొద్దని ఏకంగా ప్రపంచ వాణిజ్య సంస్థలకు ట్రంప్ లేఖ రాశారు. ఇక బ్రిక్స్ దేశాలు డాలర్ రహిత వాణిజ్యం వైపు మొగ్గు చూపితే వందశాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. బ్రిక్స్‌లో మనదేశం కీలక భాగస్వామి. ఏదోవిధంగా మన దేశాన్ని రష్యా, చైనాల నుంచి దూరం చేయాలన్నది ట్రంప్ ఉద్దేశం. కానీ ఈ ప్రయత్నాల్లో ఆయన ఎప్పటికప్పుడు విఫల మవుతూ వస్తున్నారన్నది వర్తమాన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే టారిఫ్‌లపై ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, చివరకు అమెరికన్ ప్రజలకే భారంగా మారమవుతాయి తప్ప, మరో ప్రయోజనం కనిపించడంలేదు.ఈ దిశగా ఆయన ఎందుకు ఆలోచించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!
మనదేశం నుంచి యు.ఎస్.కు ఎగుమతులు
మన దేశంనుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల్లో ముత్యాలు, రంగురాళ్లు, ఔషధాలు, ఆహార ఉత్పత్తులు ప్రధానంగా ఉండగా, మన దే శానికి దిగుమతి అయ్యేవాటిల్లో విద్యుత్-మెషినరీ పరికరాలు, అణు రియాక్ట ర్లు-యంత్రాలు, ఖనిజ ఇంధనాలు- చమురు, లెన్స్‌లు, మైక్రోస్కోప్‌లు, వైద్య పరికరాలు ఉన్నాయి. మన దేశం నుంచి విదేశాలకు చేసే మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 17.7%. ఇక మనదేశం విదేశాలనుంచి చేసుకునే దిగుమతుల్లో యు.ఎస్. నుంచి దిగుమతి చేసుకునేవి 2.7% మాత్రమే. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షు డయ్యాక భారత్‌నుంచి 761మిలియన్ డాలర్ల స్టీల్, 382 మిలియన్ డాలర్ల అల్యూమినియం దిగుమతు లపై వరుసగా 25%, 10% చొప్పున సుంకాలు విధించారు. దీనికి ప్రతిగా భారత్ 28 అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించింది. నిజానికి 2018లో అమెరికా ఉత్పత్తులపై భారత్ విధించే సగటు సుంకాల విలువ 11.59 శాతం కాగా అమెరికా మన ఉత్పత్తులపై విధించిన సుంకాలు 2.72శాతం. ఇది 2022 నాటికి సగటున 15.3, 3.83శాతంగా ఉన్నాయి.
మనతో వాణిజ్యలోటు తక్కువే
విచిత్రమేమంటే ట్రంప్ ఇన్నివిధాలుగా వాదిస్తున్నప్పటికీ 2024 ఆర్థిక సంవత్సరంలో చైనా(295.4 బిలియన్ డాలర్లు), మెక్సికో (171.8 బిలియన్ డాలర్లు), జపాన్(68.5 బిలియన్ డాలర్లు), కెనడా(63.3 బిలియన్ డాలర్లు) దేశాలతో జరిపిన వాణిజ్యంలో పెద్ద ఎత్తున వాణిజ్యలోటు నమోదైంది. మరి ఇదే ఏడాది భారత్‌తో వాణిజ్య లోటు 45.7 బిలియన్ డాలర్లు మాత్రమే. పై దేశాలతో పోలిస్తే మనదేశ వాణిజ్యలోటు చాలా తక్కువ. అమెరికా వాణిజ్య ప్రతినిధి వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం 2024లో భారత్-అమెరికాల మధ్య జరిగిన మొత్తం వాణిజ్యం 129.2 బిలియన్ డాలర్లు. ఇందులో భారత్‌కు యు.ఎస్. ఎగుమతుల విలువ 41.8 బిలియన్ డాలర్లు. ఇదే సమయంలో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న వాటి విలువ 87.4 బిలియన్ డాలర్లు. ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు ‘‘పారదర్శకత, జాతీయ భద్రత, ఉద్యోగాల కల్పన’’ అనే అంశాల ప్రాతిపదికన ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగించాలన్న అంగీకారానికి వచ్చారు. అంతేకాదు 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరుదేశాధినేతలు నిర్దేశించారు. కానీ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోర్కె ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీయడమే కాదు, తాను కూర్చున్న కొమ్మను నరుకుతున్న చందంగా తయారైందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్
డాలర్ భవిష్యత్తును వందేళ్ల క్రితమే చెప్పిన కార్టూన్
నానృషిః కురుతే కార్టూన్ అంటే ఇదే… మూడు పేజీలు కూడా వ్యక్తం చేయలేని నిగూఢ భావాన్ని మూడు కాలాల కార్టూన్ అలవోకగా ఆవిష్కరిస్తుందని ఒక మహనీయుడు అన్నారు. అలాగే మరొక మహనీయుడు కూడా నానృషిః కురుతే కార్టూన్ అన్నాడు. కావ్యం అన్న చోట కార్టూన్ అని మార్చారంతే. సుంకాల ట్రంప్ గోల నేపథ్యంలో హఠాత్తుగా బయటకు వచ్చిపడి, ప్రపంచాన్ని హల్‌చల్ చేస్తున్న 1925 నాటి ఒక కార్టూన్‌ను చూసినా ఇదే అనిపి స్తుంది. ఆ కార్టూనిస్టు ఊహ సరిగ్గా వందేళ్లకు నిజమయ్యే దశలోనే ఉందని వీక్షకులు స్పష్టంగా నమ్ముతున్నారు. ఆర్.ఎల్. నారాయణన్ అనే లింక్డిన్ యూజర్ దీనిని బయటపెట్టి సంచలనం సృష్టించారు. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ వంటి దేశాల పాశ్యాత్య సామ్రాజ్యవాదం చతికిల పడి, చైనా, భారత్, ఆఫ్రికాల ప్రాభవం పెరుగుతుందని ఆ కార్టూన్ ఆనాడు చెప్పింది. ఇప్పుడు ఈ మూడు దేశాలు సభ్యులుగా ఉన్న బ్రిక్స్ డాలర్ ఆధిపత్యానికి మంగళం పాడే క్రమంలో ఉన్నాయి. ఇంతకీ ఈ కార్టూన్ లేదా రాజకీయ వ్యంగ్య చిత్రం గీసిన వారు అమెరికా దేశీయుడే. పేరు బాబ్ మైనర్.
ఈ కార్టూన్‌ను మళ్లీ ఇన్నేళ్లకు పాఠకులకు దృష్టికి తెచ్చినది షికాగో నుంచి వెలువడిన ‘డెయిలీ వర్కర్’ వార్తాపత్రిక. 2024లోనే ఈ కార్టూన్‌ను పునర్ముద్రిం చారు. ఆ సందర్భంగా ఆ పత్రిక చేసిన వ్యాఖ్య: ‘దాదాపు వందేళ్ల క్రితమే ప్రముఖ అమెరికా కార్టూనిస్టు బాబ్ మైనర్ (ప్రపంచ) భవిష్యత్తు ఇలా ఉండబోతున్నదని గ్రహించాడు. పాశ్చాత్య దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయంటే అందుకు కారణం- ధనం, తుపాకులు. కానీ చైనా, భారత్, ఆఫ్రికాలకు ధనం లేదు, తుపాకులూ లేవు. కానీ మానవ సంపత్తి విశేషంగా ఆ దేశాలకు ఉంది. ఏదో ఒకరోజున (ప్రపంచ) ఆధిపత్య సమతౌల్యం మారిపోతుంది. మైనర్ ఈ కార్టూన్‌ను 1925లో రచించారు. 99 ఏళ్ల తరువాత ఇవాళ్టి ప్రపంచ ప్రజానీకం మేల్కొంటూ, ఏదో మార్పు అయితే వచ్చిందన్న వాస్తవాన్ని గ్రహిస్తున్నారు.’ సరిగ్గా ట్రంప్ తన సుంకాల వడ్డనతో ప్రపంచాన్ని కంగారు పెట్టాలని చూసి, తన గోతిని తానే తవ్వుకుంటున్నాడన్న భావన ప్రపంచమంతా నెలకొన్న తరుణంలో ఈ కార్టూన్ జనం ముందుకు వచ్చింది. దీనితో మరింత ఆసక్తి, ఆకర్షణ దీని పట్ల ఏర్పడినాయి. పైగా రష్యాతో చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై ట్రంప్ కక్ష కట్టడంతో ఈ కార్టూన్ భారతీయులన• ఇంకాస్త ఎక్కువగా ఆకర్షిస్తున్నది. ఈ కార్టూన్ శతాబ్ది వేళకే బ్రిక్స్ పటిష్టం కావడం, భిన్న ధ్రువ ప్రపంచం నిర్మాణం కావడం చూస్తున్నాం అని ఈ కార్టూన్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చిన నారాయణన్ వ్యాఖ్యా నించారు. అంతేకాదు, ఇలాంటి అనర్ధమైన యుద్ధాలకు సంబంధించి, బుద్ధితక్కువ వ్యూహాలకు సంబంధించి మన ఆర్య చాణక్యుడు చెప్పిన ఒక అంశాన్ని కూడా జాతికి గుర్తు చేశారాయన. ‘నీవు ఒక యుద్ధం ఆరంభించే ముందు, దానితో వచ్చే విజయం మూల్యమెంతో అంచనా వేయి. అలాగే శత్రువు పగకు మూల్యం ఎంతో కూడా అంచనా వేయి’ అన్నాడు ది గ్రేట్ చాణక్య. దీనికి కొనసాగింపుగా నారాయణన్ తన వ్యాఖ్య కూడా చేర్చారు. ‘పురోభి వృద్ధిలో ఉన్న ఒక వ్యవస్థ మీద ఆచితూచి చూడకుండా ఎత్తు వేస్తే ఆ రోజుకు విజయం కనిపించవచ్చు. కానీ ఒక శతాబ్దాన్ని కోల్పోతారు’ అన్నారాయన. దీనికి విశేషంగా లైక్‌లు వచ్చి పడుతున్నాయట.
– జాగృతి డెస్క్
‘డాలర్‌కు అంతిమ ఘడియలు సమీపించాయి!’
అమెరికా డాలర్ ఆధిపత్యం పతనం కావడం మొదలయిందని ఆ దేశ ట్రెండ్ ఫోర్‌కాస్టర్ గెరాల్డ్ సెలెంటి హెచ్చరించాడు. భారత్, చైనా దేశాల గణనీయమైన ఆర్థిక స్వయం సమృద్ధి, ఈ రెండు దేశాలు ‘బ్రిక్స్’కు మద్దతుగా నిలవడం ఇందుకు కారణంగా గెరాల్డ్ చూపుతున్నాడు. బ్రిక్స్ దేశాలు కూటమి (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా) అమెరికా విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా ఉండడం కూడా డాలర్ పతనానికి మార్గం వేస్తున్నా యని ఆయన చెబుతున్నారు. ఈ పరిణామం గురించి ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు.
సుంకాల పేరుతో అమెరికా నిరోధించాలని చూసినప్పటికి రష్యా నుంచే చమురు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయం తీసుకోవడం గురించి ఒక చర్చలో ప్రస్తావనకు వచ్చినప్పుడే గెరాల్డ్ ఈ విషయం చెప్పాడు. క్యూబన్-అమెరికన్ పత్రికా రచయిత రిక్ సాంచెజ్ గెరాల్డ్ వద్ద ఈ అంశం ప్రస్తావించినప్పుడు డాలర్ ఆధిపత్య తిరోగమనం మొదలయిందని ఆయన వ్యాఖ్యానించడం విశేషమే. అమెరికా ఆంక్షలతో ఏమీ కాదని, అమెరికాతో భారత్ చేస్తున్న వాణిజ్యం మొత్తం వారి జీడీపీలో రెండు శాతం మాత్రమేనని విశ్లేషించారు. ఆ దేశాల వారు మరింత స్వయం సమృద్ధిని, స్వయం సమృద్ధిలో నిలకడను సాధిస్తున్నారని చెప్పారు. వారి ఉత్పత్తులు వారే చేసుకుని, వారే కొనుగోలు చేస్తున్నారు, అక్కడి ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. అది అమెరి కాకు ఏం ప్రయోజనం కాగలదని ఆయన ప్రశ్నిం చారు. ప్రపంచ ఆర్థిక శక్తి మీద అమెరికా పట్టు కోల్పోతున్నదని అన్నారు. ఆర్థిక శక్తిగా ప్రస్తుతం చైనా ప్రపంచాన్ని నడిపిస్తున్నదని, ఈవీలను ఒకదాని తరువాత ఒకటి పరిశీలిస్తే ఇది తెలుస్తుందని, వారు పూర్తి స్వయంసమృద్ధి సాధించే దిశలోనే ఉన్నారని గెరాల్డ్ అన్నారు. తమ దేశంలో భారత్ దిగుమతుల మీద 50 సుంకాలు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్‌ను కూడా వదిలిపెట్టలేదు. దీనితో బ్రిక్స్ కూటమికీ, అమెరికాకూ నడుమ ఘర్షణ వాతావరణం మరింత తీవ్రమైంది.
విదేశాల వ్యవహారాలలో, అవి తీసుకునే నిర్ణయాలలో అమెరికా జోక్యం గురించి ప్రశ్నించి నప్పుడు గెరాల్డ్ అసహనం వ్యక్తం చేశారు. తన సరిహద్దులకు ఆవల ఉన్న దేశాల ఆర్థిక వ్యవహారాలను శాసించే హక్కు అమెరికాకు లేదని ఆయన కరాకండీగా చెప్పారు. అమెరికన్‌గా నా పని నేను చేసుకోవాలి, రష్యా-భారత్ ఏదో చేస్తే అది నాకెందుకు అన్నారా యన. బ్రిక్స్ కూటమి మీద అమెరికా కాలు దువ్వు తున్నది. అంటే ప్రపంచ జనాభాలో 40 శాతం ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమితో ఘర్షణకు దిగుతున్నది. ఇప్పుడు అమెరికా ఆర్థిక విధానాలను ఆ కూటమి దేశాల ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అమెరికా తన ఆధి పత్యాన్ని చూపగలిగినంత కాలం చూపింది. నిజానికి ఆ ధోరణితో ప్రపంచం విసిగిపోయింది. మనం భారత్, చైనాలను చూస్తున్నాం. ఒక్కొక్క దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. 34.7 కోట్లు ఉన్న అమెరికా జనాభా ఏం చేయగలదు అని కూడా గెరాల్డ్ ప్రశ్నించారు. పెరిగిన ఆర్థిక వత్తిడుల నేపథ్యంలోనే ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డజిల్వా మన ప్రధాని మోదీతో ఫోన్‌లో చర్చించారు. పెరిగిన అమెరికా సుంకాల ప్రభావం ఆర్థిక వ్యవస్థ లను ఏ విధంగా ప్రభావితం చేయగల దన్న అంశమే వారి మధ్య చర్చకువచ్చింది. అమెరికా లేదా ప్రపంచం నుంచి వస్తున్న ఆర్థిక ఒత్తిడులతో నిమిత్తం లేకుండా ఇరు దేశాలమధ్య వాణిజ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయానికి వచ్చారు. తాను 2026లో భారత్‌లో పర్యటిస్తానని బ్రెజిల్ అధ్యక్షుడు చెప్పారు కూడా.
డాలర్ భవిష్యత్తు అంధకారంలో పడిందని గెరాల్డ్ అంచనా వేస్తున్నారు. ఈ పతనం డాలర్ మరణానికి దారి తీస్తుందని కూడా హెచ్చరించారు. ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్నదంతా తిరోగమనమే. అందుకే డాలర్ అంతిమ క్షణాలు మొదలయ్యాయి అని ఆయన ప్రకటించాడు. అమెరికా ఆర్థిక విధానాలు బ్రిక్స్ విస్తృత అజెండా మీద ప్రభావం చూపుతాయి. బ్రిక్స్ కూటమి కూడా వాణిజ్యంలో డాలర్ స్థానాన్ని తగ్గించే పనిలోనే ఉంది. ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థల నిర్మాణం కోసం జరుపుతున్న కృషిలో ఇదొక భాగం. ఆ క్రమంలోనే పాశ్యాత్య దేశాల కనుసన్నలలో పనిచేసే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలపై ఆధార పడడాన్ని తగ్గించుకోవాన్నది కూడా బ్రిక్స్ ఆశయం.
– జాగృతి డెస్క్