కర్ణాటకలో ప్రజల విశ్వసనీయతను కాపాడు కోవడానికి నానాతంటాలు పడుతున్న అధికార కాంగ్రెస్‌ ‌పార్టీకి రాష్ట్ర సహకార మంత్రి కేఎన్‌ ‌రాజన్న రూపేణా కొత్త సంక్షోభం వచ్చిపడింది. రాజన్న ఓటరు గుర్తింపు వ్యవహారంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టివేయడమే కాకుండా బీజేపీకి కాంగ్రెస్‌పై అన్ని వైపుల నుంచి దాడి చేయడానికి ఒక సరికొత్త ఆయుధాన్ని అందించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కనిపించినవారికల్లా చెబుతున్న రాహుల్‌ ‌గాంధీ వైఖరిని, ఆరోపణలను రాజన్న తోసిపుచ్చారు.

రాష్ట్రంలో బెంగళూరు సెంట్రల్‌ ‌లాంటి కీలకమైన నియోజకవర్గాలను కోల్పోవడానికి కూడా పార్టీ బాధ్యత వహించాలని డిమాండ్‌ ‌చేశారు. రాహుల్‌ ‌తరహాలోనే రాజన్న కూడా ఓ ఆటంబాంబు పేల్చారు. మన ప్రభుత్వం ఏలుబడిలోనే రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సవరణ జరిగిందనే విషయాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీలో ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. ‘‘అప్పుడెందుకని మన పార్టీ (కాంగ్రెస్‌) ఈ ‌విషయాన్ని (ఓట్ల చోరి) చూసీచూడనట్టుగా వదిలేసింది? అవకతవకలు ఉన్న మాట నిజమే. కానీ అది మన ఏలుబడిలో జరగడం మనకు అత్యంత అవమానకరం’’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకొనిరావాలని ప్రకటించిన విషయాన్ని పార్టీ సహచరులకు ఆయన గుర్తు చేశారు. ‘‘ఓటర్ల జాబితా లాంటి విషయాల్లో సకాలంలో స్పందించాల్సిన బాధ్యత మనకు ఉండాలి. మనం అప్పట్లోనే ఏమైనా ఉంటే అభ్యంత రాలను (ముసాయిదా ఓటర్ల జాబితా) లేవనెత్తి ఉండాల్సింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయి ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం’’ అని రాజన్న పరోక్షంగా రాహుల్‌ ‌గాంధీకి చురకలు అంటించారు. అయితే రాజన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గానికి చెందినవారు కావడంతో సీఎం పోస్టు కోసమని సిద్ధరామయ్యపై అంతర్గతంగా పోరాడుతున్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ‌వర్గం రాజన్నపై నిప్పులు చెరిగింది. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మండి పడింది. ఇదే విషయమై డీకే శివకుమార్‌ ‌మద్దతుదారుడు, కునిగల్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది. అడ్వకేట్‌ ‌జనరల్‌ను ఒక నివేదిక సమర్పించాలని కోరింది అని తెలిపారు. దర్యాప్తు చేపట్టకముందే మన సొంత పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం క్షమించరానిది. పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ముగింపు చెప్పాలి అని అన్నారు.

అయితే ఈ విషయం ఇక్కడితో ఆగిపోలేదు. పార్టీ బెంగళూరు కేంద్రీయ ప్రచార కమిటీ అధ్యక్షుడు జీ ప్రకాష్‌ ‌నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తల బృందం రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ ‌రణదీప్‌ ‌సింగ్‌ ‌సుర్జేవాలాకు తీవ్రమైన పదజాలంతో ఒక రాతపూర్వకమైన ఫిర్యాదును చేసింది. రాజన్న ప్రకటనలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఓట్ల చోరీ అంటూ రాహుల్‌ ‌గాంధీ చేస్తున్న ఆరోపణలను కాలరాస్తున్నాయి. పార్టీలో ఐకమత్యాన్ని దెబ్బ తీస్తున్నాయి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ ‌శ్రేణుల నుంచి ఈ రకమైన ఆగ్రహం వ్యక్తం కావడం సబబైనదే. ఎందుకంటే రాహుల్‌ ‌గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ – కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ‌మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వేలాదిగా కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తలు రాజన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి రెండు రోజుల ముందు బెంగళూరులో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆ ఆందోళన కార్యక్రమం 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహదేవపుర నియోజకవర్గంలో బీజేపీ పెద్ద ఎత్తున ఓటర్ల అక్రమాలకు పాల్పడిందని ఆరోపించడం ముఖ్య ఉద్దేశంగా జరిగింది. ఒక లక్షకుపైగా ఓట్లు చోరీకి గురైనాయని రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. అలాంటి ఒక తీవ్రమైన ఆరోపణ చేయడం ద్వారా ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకొని, తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్‌ ‌కోటి ఆశలు పెట్టుకుంది. అయితే రాజన్న చేసిన ఏక వాక్య విమర్శతో పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. రాజన్న కాంగ్రెస్‌ ‌హయాంలోనే ఓట్ల జాబితా రూపొందిందని ఒప్పుకోవడం ద్వారా పార్టీ తన సొంత వైఫల్యాలకు ఇతరులను నిందిస్తున్నదని ప్రజలకు అత్యత ప్రభావ వంతంగా చెప్పగలిగారు. ఇది బీజేపీ అమ్ముల పొదిలోకి అయాచితంగా వచ్చిపడిన ఆయుధం. అది బీజేపీ ప్రమేయం లేకుండానే రాహుల్‌ ‌గాంధీ ఆరోపణల వెనుక విశ్వసనీయతను తునాతునకలు చేసింది. కాంగ్రెస్‌ ‌నాయకత్వానికి నిజాయితీ, సమర్థత లేదని నిరూపించింది. కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే రాజన్నపై చేసిన ఫిర్యాదులోనూ జరిగింది. ఆయన ఒక సీనియర్‌ ‌మంత్రిగా ప్రజల మధ్యలో పార్టీని వెనుకేసుకొని రావాలి తప్ప దాన్ని కాలరాయకూడదని ఫిర్యాదు పేర్కొంది. ఆయన అదేపనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పరిస్థితిని బలహీన పరిచింది. పార్టీకి మరింత నష్టం జరగకమునుపే రాజన్నను ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ అధిష్టానానికి పార్టీనేతలు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓట్ల చోరీ విషయమై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ ‌చిత్తశుద్ధిని ప్రశ్నించే అవకాశం వచ్చింది. ఇదే విషయమై విపక్ష నేత ఆర్‌ అశోక ఎక్స్‌లో చేసిన పోస్టులో ‘‘మంత్రి రాజన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలోనే ఓటర్ల జాబితా సిద్ధమైందనే సత్యాన్ని బహిర్గతం చేశారు. అప్పుడు చూసీచూడనట్టుగా వదిలేసి దాని గురించి ఇప్పుడు మాట్లాడటంలో ప్రయోజనం ఏముంటుంది? రాజన్న ఈ విషయం గురించి రాహుల్‌ ‌గాంధీతో మాట్లాడిందీ లేనిదీ డీకే శివకుమార్‌ ‌లేదా సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేయాలి’’ అని డిమాండ్‌ ‌చేశారు. ఈ తీవ్రమైన రాజకీయ విమర్శ రాహుల్‌ ‌గాంధీ నాయకత్వాన్ని ఎద్దేవా చేయడంతో ఆగి పోలేదు. అది కాంగ్రెస్‌లో లోతైన లుకలుకలను బహిర్గతం చేసింది. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్రాన్ని పాలిచడం లేదా బీజేపీని బాధ్యురాలిని చేసే సంగతి కాదు కానీ కనీసం మంత్రులను దారిలో పెట్టుకోలేక పోతున్నదనే అభండాన్ని మూటగట్టుకున్నది. రాజన్న చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌పార్టీ బెంగళూరులో నిర్వహించిన అతిపెద్ద ఆందోళన కార్యక్రమం వెనుక ఔచిత్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. వారి సొంత సర్కారు కన్నుసన్నల్లోనే ఓట్ల చోరీ జరిగిన పక్షంలో అదే అంశంపై వారు చేపట్టిన ఆందోళన కార్యక్రమం నిజాయితీతో కూడుకున్నదని ప్రజలు ఎందుకు నమ్మాలి? ఈ ఆత్మవంచన రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ప్రచారం నుంచి లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ ‌కంటున్న కలలను కల్లలు చేసింది. అది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడం వృద్ధ జాతీయ పార్టీ స్వయంకృతాపరాధం.

రాహుల్‌కు కర్ణాటక సీయీవో నోటీసులు

కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీకి కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి-సీయీవో ఆగస్టు 10న నోటీసులు జారీ చేశారు. కర్ణాటకలో మహదేవపూర నియోజకవర్గానికి చెందిన 70 ఏళ్ల శకున్‌ ‌రాణి రెండు సార్లు ఓటు వేశారంటూ చేసిన అభియోగానికి తగిన పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. అభియోగానికి సంబంధించి శకున్‌ ‌రాణిని విచారిం చగా, తాను ఒకసారి మాత్రమే ఓటు వేసినట్టు ఆమె తెలిపారని రాహుల్‌కు పంపించిన నోటీసులో సీయీవో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎం‌పీ తన పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌లో చూపించిన ఇమేజ్‌లలో శకున్‌ ‌రాణి పేరుతో ఉన్న ఇమేజ్‌లో కనిపిస్తున్న డాక్యుమెంట్‌ ‌పోలింగ్‌ అధికారి జారీ చేసిన డాక్యుమెంట్‌ ‌కాదని స్పష్టం చేశారు. రాహుల్‌ ‌గాంధీ ఆగస్టు ఎనిమిదవ తేదీన తన యూట్యూబ్‌ ‌చానెల్‌లో అప్‌లోడ్‌ ‌చేసిన ఒక వీడియోలో మహదేవపుర నియోజకవర్గంలో 1,00,250 ఓట్లు చోరీకి గురయ్యాయని ఆరోపించారు. అందులో డూపిక్లేట్‌ ఓటర్లు దాదాపు 12 వేల మంది, నకిలీ లేదా చెల్లుబాటి కాని చిరునామాల్లో 40 వేల మంది, ఒకే చిరునామాలో నమోదు చేసుకున్న వారు 10 వేల మంది, చెల్లుబాటుకాని ఫొటోలతో ఓటర్లుగా నమోదు చేసుకున్నవారు 4,100 మంది, కొత్త ఓటర్లుగా ఫామ్‌-6‌ను దుర్వినియోగం చేసుకున్నవారు దాదాపు 34వేల మంది ఉన్నారని గణాంకాలతో సహా నిరూపించడానికి ప్రయత్నించారు. తన గణాంకాలు నిజమే అని నమ్మించడానికి అన్నట్టుగా శకున్‌ ‌రాణి రెండుసార్లు ఓటు వేశారని ఆరోపిం చారు. అలా చెప్పడం ఆయన మెడకు చుట్టుకుంది. ఆరోపణకు తగిన పత్రాలు సమర్పించాలని కర్ణాటక సీయీవో నోటీసు జారీ చేయడంతో రాహుల్‌ ‌పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.

కర్ణాటక మంత్రి రాజన్న రాజీనామా

ఓటర్ల జాబితా తయారైంది మన ఏలుబడిలోనే కదా అని సొంత పార్టీని నిజాయితీగా నిలదీసిన సహకార మంత్రి కేఎన్‌ ‌రాజన్న ఆగస్టు 11న తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పంపించారు. ఆయన్ను నిలువరించేందుకు సిద్ధరామయ్య చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు. అయితే ఎలాంటి సంజాయిషీలకు అధిష్టానం అంగీకరించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ లేవనెత్తిన ఓట్ల చోరీ అంశానికి వ్యతిరేకంగా రాజన్న వ్యాఖ్యలు చేయడంపై అధిష్టానం ఆగ్రహించిందని తెలిపాయి. దీంతో రాజన్న రాజీనామాను ఆమోదించి, దానిని వెంటనే గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గెహ్లాట్‌ ‌కార్యాలయానికి పంపించాలని ముఖ్యమంత్రిని ఆదేశించింది. ఫలితంగా సిద్ధరామయ్య రాజన్న రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించడం, గవర్నర్‌ ‌దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE