డి.కామేశ్వరి. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందా?
ఏ కథల పుస్తకమో గుర్తుకొచ్చిందా? నవల ఏదైనా మీ మదిలో మెదిలిందా?
కథలు, నవలలు అనగానే మన తలుపులోకి వచ్చే అతికొద్దిమంది రచయిత్రుల్లో ఈమె తప్పకుండా ఉంటారు.
ఆ రచనల్లో ఒక అందమైన పేరు ‘పద్మనయన’. కథలో మాత్రం అందచందాలేవీ ఉండవు. కఠిన వాస్తవాలుంటాయి.
‘రైళ్లల్లో, బస్సుల్లో లేడీస్ ఫస్ట్ అంటూ చోటు ఇచ్చి మీరు నిలబడుతుంటారే! అలాంటిది – ఈ ఉద్యోగం నాకు ఇవ్వడానికి మీరు కొంచెం…’ అంటూ ఓ అమ్మాయి ఒక అబ్బాయిని అడుగుతుంది. అతను సంకటస్థితిలో పడిపోతాడు!
ఆమే ఏం అడిగిందీ? అతను చివరికి చేసిందేమిటీ అనేది కథ మొత్తం తెలిసీ తెలియనంత రీతిన కొనసాగుతుంది.
తెలుసుకోవాలని అనుకుంటే ఆ రచనను చదివి తీరాల్సిందే!
ఇటువంటి ఉత్కంఠలు కామేశ్వరికి అలవాటు. దాన్ని సాగిస్తూనే ఎన్నెన్నో రాశారు. ఆ రోజుల్లో. ఆ కథలు వందల్లో, నవలలు పదుల సంఖ్యలో ఉన్నాయి.
రచనపరంగా ‘ఇతివృత్త స్పృహ’కు పెట్టింది పేరు. ప్రధానంగా ఆ ఒక్క ప్రత్యేకతే ఆమెను సాహితీరంగాన ఉన్నతంగా నిలబెట్టింది.
లేకుంటే… ఉత్తమ రచయిత్రి పురస్కారం వరసబెట్టి మూడు నిర్దేశిత సంవత్సరాల్లో ఆమెకే ఎందుకొస్తుంది? అదీ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి.
మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు ఆమెనే ఎందుకు వరించి వస్తుందీ?
నవలకు గోపీచంద్ పేరిట ఉన్న పురస్కృతికి ఆమే ఎందుకు ఎంపికవుతారు?
స్వస్థలం కాకినాడ ప్రాంతం. పుట్టిన సంవత్సరం 1935.
మరెంతో విశేషం – సుశీలా నారాయణరెడ్డి అవార్డూ కామేశ్వరికి లభించడం. ఆ ఘట్టానికి ఇది రజతోత్సవ పరిపూర్ణవేళ!
పెళ్లయ్యాక, భర్త ఉద్యోగరీత్యా చాలాకాలం ఒడిశాలో ఉన్నారు కామేశ్వరి. ఆయన ఉద్యోగ విరమణ తదుపరి తెలుగునాట స్థిరపడ్డారు.
దాదాపు పాతికేళ్ల వయసులో తొలి రచన చేశారామె. అది వ్యాసం.
అటు తర్వాత కొన్నేళ్లకు మొదటగా నవల రాశారు. మూడక్షరాల శీర్షిక (ఆకలి)తో రాసిన తీరు మనల్ని ఆగకుండా చదివిస్తుంది. ఆపకుండా ఆలోచింపచేస్తుంది.
శైలి ఇదిగో ఇలా…
‘లేదమ్మా! నీ మీద కోపం లేదు తల్లీ! ఏ క్రూర జంతువో వెంట తరిమి నిన్ను చంపాలని చూస్తే ఏం చేస్తావ్? దాని బారి నుంచి తప్పించుకోవాలని ఓపిక ఉన్నంత వరకూ పరిగెడతావ్. ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తావ్.’
‘కానీ… నాన్నా !’
‘ఆగమ్మా. నన్ను చెప్పనీయనీ. నువ్వు ఆ సమయంలో ఏం చేస్తావంటే – ఏ ప్రయత్నమూ లాభం లేదని తెలిసినా, అన్ని ప్రయత్నాలూ చేస్తావ్. ఒంటరిగానే ఎదురొడ్డుతావ్. పోరాడాలని చూస్తావ్ చివరిదాకా! ఎలాగూ ప్రాణం పోతుందని అనుకోవు కదా. ఆహుతి అయిపోవు కదా. కానీ ఈ ఆకలి ఉంది చూశావా? అన్నింటిని మించిన క్రూరం తల్లీ అది!’
అసలు ఏం జరిగిందో, ఆ తండ్రి తన కూతురికి ఏమని చెప్పాడో, ఆఖరికి ఏం చేశాడో తెలియాలంటే ఆ కథను చదవాలి మరి!
రచనలకి, వాటిల్లో పాత్రలకి పేర్లు పెట్టడంలో కామేశ్వరిది ప్రత్యేక పంథా. ‘జీవితం చేజారనీయకు’ అనేది ఒక నవల. ‘కాలాన్ని వెనక్కి తిప్పకు’ ఈ పేరు ఓ కథది.
అభిమాన భంగం అనే పదం వాడారు. ఆ పేరుతో ఏకంగా కథే రాశారు.
‘ఒకే రెమ్మా… రెండు పువ్వులూ’ అనేది ఇంకో కథానిక. ‘చేదు విషం, జీవఫలం’ అనేది వేరొకటి.
నగరంలో నాలుగిళ్లు; పురోగమనానికి పునాది రాళ్లు; మనకెందుకులేద్దూ – ఇవన్నీ ఆనాడు చదువరులను మంత్రముగ్ధం చేసిన కథా రచనలు.
ఉదాహరిస్తే – ఇటువంటివి అనేకం.
ఏదైనా రాయాలంటే – వెళ్లి చూడాలి. అనుభవాలకు తెచ్చుకోగలగాలి. గదిలో బల్లముందు కూర్చొని అదేపనిగా రాయడం రచయితలకు, రచయిత్రులకు సరికాదు. వెళ్లి, చూసి, విని… రాస్తే… అదీ కథా వస్తువు అయినట్లు’ ఈ ఉద్దేశం బలపడినందునే ఆమె యాత్ర సాహిత్యాన్నీ వెలువరించారు. ‘నా విదేశీయాత్రానుభవాలు’ అంటూ వాస్తవాలను కళ్లముందు ఉంచారు.
సన్నివేశ చిత్రణపరంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది కామేశ్వరి రచనల గురించే! కలం విహారం చేశారు విస్తృతంగా. అయితే నేల విడిచి సాముచేయని సమాజ అంశాలే అన్నీ! అనుభవ వైశాల్యం ప్రస్ఫుటమవుతుంటుంది.
క్లుప్తత ఉంటుంది. అవసరమైనపుడు విస్తరించడమూ కనిపిస్తుంటుంది. ఏది రాసినా, అది ఏ సాహితీ పక్రియ అయినా జీవన తాత్వికత అంతర్లీన సూత్రం. ఆ కోణంలో కామేశ్వరి ఎంతోమందికంటే ముందున్నారు. ఎన్నో ప్రయోగాలకు ఆద్యులయ్యారు.
ఆమె పెరిగింది గుంటూరులో. పోస్టుగ్రాడ్యుయేట్ అయింది హైదరాబాద్‌లో. రసాయనశాస్త్రంలో మరింత పరిశోధన సాగించాలని అమెరికాకు వెళ్లి వచ్చారు. వృత్తి-బోధన.
సాహిత్యంతోపాటు, సంగీతంలో కూడా ప్రతిభావంతురాలు. కర్ణాటక సంగీత రంగంలో డిప్లొమా చేశారామే.
యోగాభ్యాసం, పరిశోధనల్లో సైతం దిట్ట.
ఆమె వచనంలోనే కాదు – పద్య పక్రియలోనూ పేరొందినవారు. ఆమె రాసిన వాటిలో మూడు శతకాలూ ఉన్నాయి. పద్య ఖండికలూ వెలువడ్డాయి.
వాస్తవాల చిత్రీకరణలో తనకు తానే సాటి. ‘గట్టిమేల్ తలపెట్టవోయ్’ అనే కథలో ఏం రాశారో చూడండి.
‘మంటలు, మంటలు. నల్లని పొగల మధ్యన నాలుకలు చాస్తున్న ఎర్రని మంటలు! వాటి మధ్య నిస్సహాయంగా బస్సు!
కదలలేని ఆ బస్సును మరింత ఆనందంగా కౌగిలించుకున్నాయి మంటలు. మంటలే మంటలు!
కాలుస్తున్న బస్సును సంబరంగా చూస్తున్నారు కొందరు! ఇలాంటి పరిస్థితిలో భవిష్యత్తు అంధకారం అన్నట్లు చుట్టూ నల్లటి పొగ కమ్ముకొస్తోంది!
ఫైరింజన్ గణగణలు. పోలీసుల విజిల్స్.
జనం హాహాకారాలు. బూట్ల చప్పుళ్లు. అవి పోలీసులవే! లాఠీచార్జీలూ, టియర్ గ్యాస్‌లు.
ఆ తర్వాత ఎప్పుడో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంటలు చల్లారాయి. బస్సులు మటుకు అస్థిపంజరాల్లా నిలబడ్డాయి. రోడ్డు నిండా పగిలిన సీసా పెంకులు! రాళ్లూ రప్పలూ.
అక్కడ కాసేపటికి మనుషులెవ్వరూ లేరు!
ఇంతకీ ఆ బస్సును ఎందుకు తగలబెట్టారు? ఏమో!
దేనికోసం – ఎందుకో, ఏమిటో!’
ఈ విధంగా ఉంటుంది కామేశ్వరి రచనా స్థాయి.
ఎంతో సహజత్వం. ఆమె తొలి రచనలతో నిండిన కథాసంపుటి వానజల్లు; వాటిల్లో ఉమ్మడిగా చూస్తే:
- నిర్మొహమాటం. ముక్కుసూటితనం. (రచనల్లో)
- ప్రశంసనీ, విమర్శనీ స్వీకరించడంలో పరిణతి.
- కథాశిల్పం గురించిన పూర్తి సదవగాహన.
- ఇరువైపులా ఆలోచించి, ఏ కోణాన్ని ఆ ప్రకారం సమీక్షించి, తగిన ముగింపునివ్వడం.
- ప్రశ్నలు, వాటికి తగిన స్థాయిలో సమాధానాలు.
- సమస్యలకు పరిష్కారాల విశదీకరణ. ఉదాహరణలతో ప్రబల ప్రభావం – ఆమెకు సుసాధ్యమైంది.
కామేశ్వరిది నవ్వుముఖం. హుషారుగా ఉండేవారు. రచనల్లో నూతన ప్రయోగాలు చేయాలని పరితపించారామె.
‘ఈతరం అమ్మాయిలు’ కథ గురించి చివరగా చెప్పుకొందాం.
ఒక అమ్మాయి చెప్తుంది ఆ కథానికలో…
‘ఆంటీ! ఆరునెలల పాపని తెచ్చుకున్నాక జీవితానికో అర్థం తెలిసింది. అనాథబిడ్డను తెచ్చి పెంచడంలో ఉండేదంతా తల్లిప్రేమే! ఆ పాప పెరుగుతుంటే …
చేతితో నాటిన మొక్క ఆకుతొడిగి, మొగ్గ వేసినంత సంతృప్తి. కన్నబిడ్డను పెంచడం ప్రతీ తల్లి చేస్తుంది. ఏమీ కాని ఒక అనాథ బిడ్డని పెంచడంలో ఎంత ఆత్మ తృప్తి ఉందో నా అనుభవంలో తెలుస్తోంది!’
జీవిత దశలకు ఇంత వైవిధ్య రచనా రూపమిచ్చిన దూర్వాసుల కామేశ్వరి నూరు శాతమూ మేటి మహిళ!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్