ఈ ఏడాది భక్తులు సాగించిన అమర్‌నాథ్‌ ‌యాత్ర పరమపవిత్రమైన తీర్థయాత్రగా మాత్రమే కాకుండా ఒక శక్తిమంతమైన స్వచ్ఛతా ఉద్యమంగా అవతరించింది. నాలుగు లక్షల మందికిపైగా భక్తులు 3,880 మీటర్ల ఎత్తున హిమాలయాల్లో పవిత్రమైన గుహ(కశ్మీర్‌)‌లో కొలువుదీరిన అమరనాథుని దర్శించుకున్నారు. ఇలాంటి యాత్రలో చోటు చేసుకునే వ్యర్థాలు హిమాలయ పర్వతాల్లో పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలిగించకుండా ఉండటానికి యాత్ర నిర్వాహకులు అనేక చర్యలు చేపట్టారు. శ్రీ అమర్‌నాథ్‌జీ క్షేత్ర బోర్డు జమ్మూకశ్మీర్‌ ‌ప్రభుత్వ సమన్వయంతో స్వచ్ఛతా కార్యనిర్వాహకులను, స్వచ్ఛంద సేవకులను యాత్రీకులు బస చేసే కేంద్రాలు, లంగర్‌ (‌వంటలు వండి, వడ్డించే చోటు) ప్రాంతాలు, యాత్రా శిబిరాల వద్ద మోహరింపజేసింది. వీరంతా కూడా తడి, పొడి చెత్తను వేరుచేయడం, సింగిల్‌- ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌వినియోగాన్ని నిరాకరించడం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల యాత్రికుల్లో అవగాహన కలిగించారు. టాయిలెట్లకు ఏర్పాటు చేసిన క్యూఆర్‌ ‌కోడ్‌ ‌ద్వారా పారిశుద్ధ్య సదుపాయాలకు సంబం ధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్వీకరించారు.

పటిష్టమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలతో, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలతో పరిశుభ్రతను పాటించేలా, వ్యర్థాలను వదిలివేయడంలో బాధ్యతగా వ్యవహరించేలా యాత్రికులను ప్రోత్సహించారు. బోర్డు అందించిన వివరాల ప్రకారం, యాత్ర సందర్భంగా రోజుకు దాదాపు 11.67 మెట్రిక్‌ ‌టన్నుల వ్యర్థాలు పోగుపడేవి. అందులో పొడి చెత్త 3.67 మెట్రిక్‌ ‌టన్నులు కాగా తడి చెత్త 7.83 మెట్రిక్‌ ‌టన్నులు ఉండేది. అలా పోగుపడిన వ్యర్థాలను నూటికి నూరుశాతం సేంద్రియ ఎరువులుగా శుద్ధి చేశారు. జమ్మూలోని లంగర్లు, యాత్రికులు బస చేసిన కేద్రాల నుంచి సేకరించిన తడి చెత్తను ఒక్కొక్కటి ఒక టన్ను సామర్థ్యం కలిగి ఉన్న మూడు సేంద్రియ వ్యర్థాల కంపోస్టర్లలో శుద్ధి చేశారు. పొడి చెత్తను మెటీరియల్‌ ‌రికవరీ ఫెసిలిటీలు (ఎంఆర్‌ఎఫ్‌లు)కు తరలించారు. తద్వారా యాత్ర మార్గంలో, పరిసర ప్రాంతంలో ఏ మాత్రం వ్యర్థాలు నేలలోకి ఇంకిపోకుండా చూసుకున్నారు. ఇందులో భాగంగా నీలం, ఆకుపచ్చ జంట చెత్తబుట్టలతో కూడిన 1,016 వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వ్యర్థాలను సేకరించేందుకు 65 వాహనాలను అందు బాటులో ఉంచారు. యాత్రా మార్గాన్ని 24 గంటలు పరిశుభ్రంగా ఉంచడానికి దాదాపు 1,300 సఫాయి మిత్రలను మార్గం వెంబడి వేర్వేరు చోట్ల ఉంచారు. లంగర్‌ల వద్ద సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. పర్యాటకులపై ప్లాస్టిక్‌ ‌ప్రభావం లేకుండా చేయడానికి వారికి 30కి పైగా తాత్కాలిక కేంద్రాల ద్వారా జనుము, వస్త్రంతో చేసిన 15 వేలకు పైగా సంచులను పంపిణీ చేశారు.  ప్లాస్టిక్‌ ‌లావో, థేలా లేజావ్‌(‌ప్లాస్టిక్‌తో రండి.. సంచితో పొండి), బిన్‌ ఇట్‌, ‌విన్‌ ఇట్‌(‌చెత్తను నింపండి.. బహుమతి గెలుచుకోండి) వంటి కార్యక్రమాలను నిర్వహించారు.

పారిశుద్ధ్యం అవసరాల కోసం యాత్రా మార్గం వెంబడి 1,600కు పైగా మొబైల్‌ ‌టాయిలెట్లను ఏర్పాటు చేశారు. నిర్దేశిత పారిశుద్ధ్య బృందాలు వాటిని రోజుకు రెండుసార్లు శుభ్రం చేశాయి. టాయిలెట్ల దగ్గర ఏర్పాటు చేసిన క్యూఆర్‌ ‌కోడ్‌ల ద్వారా పొందిన 20వేలకు పైగా ప్రతిస్పందనలతో అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతో సేవలను మరింత మెరుగుపరిచారు. మానవ వ్యర్థాలను సేకరించి వాటిని నిర్దేశిత శుద్ధి కేంద్రాలకు చేర్చడానికి 39 వాహనాలను వినియోగించారు.

హరిత ప్రతిన ప్రచార కార్యక్రమంలో 70 వేల మందికిపైగా భక్తులు చురుగ్గా పాల్గొన్నారు. తద్వారా స్వచ్ఛతను పాటించడంలోనూ, దానికి సంబంధించిన పక్రియలను అమలు చేయడంలోనూ వారి నిబద్ధతను చాటుకున్నారు. భక్తులు ప్రతినబూనుతూ గోడల మీద సంతకాలు చేయడాలు, సెల్ఫీ బూత్‌లలో సెల్ఫీలు తీసుకోవడాలు దగ్గరి నుంచి స్వచ్ఛత కిట్‌లను పంపిణీ చేయడం దాకా అమర్‌నాథ్‌ ‌యాత్రలో స్వచ్ఛత కోసం వేసుకున్న ప్రణాళికలు భక్తుల అండదండలతో కార్యరూపం దాల్చాయి. తోటి భక్తులకు స్ఫూర్తి మంతంగా ఉంటాయనే ఉద్దేశంతో బాధ్యత కలిగిన భక్తులను నిర్వాహకులు తగురీతిన సత్కరించారు. వారి అనుభవాలను కథల రూపంలో సామాజిక మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికతతో ముడిపడిన అమర్‌నాథ్‌ ‌యాత్ర స్వచ్ఛభారత్‌ ‌మిషన్‌ అర్బన్‌ 2.0 ‌లక్ష్యాలకు తగ్గట్టుగా కార్యాచరణకు మార్గం సుగమం చేసింది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE