ఆగస్టు 11న దేశరాజధానిలో, పార్లమెంట్‌కు దగ్గర్లో విపక్షాలు ఆడిన వీధి నాటకం రక్తి కట్టలేదు సరికదా.. నవ్వులపాలైంది. అభాసుపాలైన ఈ నాటకానికి కథానాయకుడు, సూత్రధారి కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ ఐతే ఆయన్ను అధిగమించి మరీ నటించడానికి తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మహిళా ఎంపీలు, సమాజ్‌వాది పార్టీ-ఎస్‌పీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌ప్రయత్నించారు. ఈ వీధినాటకానికి పెట్టుకున్న పేరు ఓట్ల చోరి.. ప్రజాస్వామ్యం ఖూనీ. నిజానికి వీధినాటకం అనే స్ట్రీట్‌ ‌ప్లేను జనసమ్మర్థం ఉన్న ఒక చోట మాత్రమే ఆడతారు. కానీ విపక్షాలు జట్టు కట్టిన ఇండియా కూటమి మాత్రం పార్లమెంట్‌ ‌నుంచి కేంద్ర ఎన్నికల సంఘం-ఈసీ ప్రధాన కార్యాలయం కొలువైన నిర్వాచన్‌ ‌సదన్‌ ‌వరకు ఆడాలని నిర్ణయించుకున్నాయి. కళాకారులు ఆడే వీధినాటకానికి నటులు మహా అయితే 10 మందికి మించి ఉండరు. కానీ ఈ రాజకీయ నటుల కళా•ండంలో 250  మంది పాలుపంచుకున్నారు.

ఉదయాన్నే అందరూ సిద్ధమైపోయారు. సభా కార్యకలాపాలు మరికాసేపట్లో మొదలవుతాయనగా పార్లమెంట్‌కు చేరుకున్నారు. రాహుల్‌ ‌గాంధీ అయితే తన కారు డోరు తెరుచుకొని ఒక్క అంగలో బైటకు దూకి మిగిలినవారికి తోడయ్యారు. పార్లమెంట్‌ ఉదయం 11 గంటలకు మొదలైతే.. ఉభయసభల్లో సభ్యులందరూ కలిసి చర్చించి, ప్రజాపయోగకరమైన మార్పులు చేర్పులు సూచిస్తే, అందరి అంగీకారంతో చట్టబద్ధత పొందుదామని కీలకమైన ఎనిమిది బిల్లులు ఎదురుచూస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన ఆర్థిక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌సిద్ధంగా ఉన్నారు. భారత్‌ ‌వచ్చే 2036 ఒలింపిక్స్ ‌క్రీడలకు ఆతిథ్యమిచ్చే దిశగా బిడ్డింగ్‌కు ఉపకరించే క్రీడా బిల్లులను సభ ముందు ఉంచడానికి క్రీడల శాఖా మంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయా ఉద్యుక్తులవుతున్నారు. రాజ్యసభలో మరికొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టడానికి మంత్రులు అర్జున్‌ ‌రామ్‌ ‌మేఘ్‌వాల్‌, ‌సర్బానంద సోనోవాల్‌ ‌సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రజలకు ఉపకరించే, ప్రపంచ క్రీడా వేదికపై దేశ ప్రతిష్టను పెంచే బిల్లులకు చట్టబద్ధత కల్పించే క్రతువులో పాలుపంచుకోవాలనే కనీసపు ఇంగిత జ్ఞానం విపక్ష కూటమికి లేకుండా పోయింది. ముందుగా చేసుకున్న ప్రణాళికలో భాగంగా ఉభయసభల్లోకి అడుగుపెట్టారు విపక్ష ఎంపీలు. వారి మనసంతా వీధినాటకం ఎలా ఆడాలనే దానిపైనే ఉండిపోయింది.పార్లమెంట్‌ ‌మొదలుకాగానే రభసకు నడుం బిగించారు. లోక్‌సభలో స్పీకర్‌, ‌రాజ్యసభలో ఛైర్మన్‌ ‌స్థానంలో ఉన్నవారు వద్దు వద్దు అంటున్నా కానీ వినకుండా వెల్‌లోకి దూసుకొని వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభాసంప్రదాయాలకు విరుద్ధంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అధికార పక్షం బిల్లుల ప్రస్తావనను చేసినప్పటికీ బేఖాతరు చేశారు. దీంతో మొదలైన కొద్దిసేపటికే ఉభయసభలు వాయిదాపడ్డాయి. అక్కడితో ప్రజాప్రతినిధులనే మాటకు పాతరేస్తూ విపక్షాల వీధి నాటకంలో మొదటి అంకం పూర్తయ్యింది. అంతా పార్లమెంట్‌ ‌మకర్‌ ‌ద్వార్‌ ‌వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే రాజ్యసభలో చెప్పిన దాని ప్రకారం 250 మంది ఇండియా కూటమి ఎంపీలు జమ అయ్యారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. సమయం 11.30 గంటలవుతుందనగా వీధుల్లో నాటకం ఆడటానికి నిర్వాచన్‌ ‌సదన్‌కు గుంపుగా బయలుదేరారు. వీరికి తోడు వారివారి స్థాయిని బట్టి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఈసీ తనను కలుసుకోవడానికి 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ ఇక్కడ చూడబోతే 250 మంది ఉన్నారు. పైగా నిత్యం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండే కీలకమైన ప్రాంతంలో వందలమంది మరీముఖ్యంగా వందలాది ఎంపీలు ప్రదర్శనగా బయలుదేరారు. ఏ మాత్రం తేడా వచ్చినా దేశ రాజధాని సాక్షిగా శాంతి, భద్రతలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని ముందే గ్రహించిన ఢిల్లీ పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఎక్కడి కక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంబులెన్సులను, అగ్నిమాపక శకటాలను, ఎంపీలను తరలించడానికి వాహనాలను సిద్ధం చేశారు. నినాదాలు, ప్లకార్డులతో నానా హంగామా చేస్తూ ట్రాన్స్‌పోర్టు భవన్‌ ‌దాకా వచ్చిన విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈసీ దగ్గరికి 30 మంది అని చెప్పి 250 మందితో బయలుదేరిన విపక్ష కూటమికి వీధుల్లో ప్రదర్శన చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదే విషయాన్ని తమతో వాగ్వాదానికి సిద్ధమైన ఎంపీలకు పోలీసులు చెప్పారు. అక్కడితో ఆగిపోతే విపక్షాలు చెప్పుకుంటున్నట్టుగా అది శాంతియుత ప్రదర్శనగా మిగిలిపోయేది. ప్రజల్లో దానికి కాస్తో కూస్తో గుర్తింపు వచ్చేది. కానీ అలా చేస్తే వారు విపక్షాలు ఎందుకవు తారు? దశాబ్దాలుగా దేశాన్ని పాలించి, పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కడానికి ఎంతకైనా తెగించే కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు ఎందుకవుతారు? ఆ సమయానికి కుర్చీలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు తెచ్చారో కానీ 83 ఏళ్ల వయస్సు ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్‌ ‌ఖర్గే, ఇంచుమించు అదే వయసులో ఉన్న రాజ్యసభ సభ్యుడు శరద్‌ ‌పవార్‌ ‌వాటిల్లో కూర్చున్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ రాహుల్‌ ‌గాధీ, ప్రియాంక గాంధీ వాద్రా, తదితరులు రోడ్డుపైన బైఠాయించారు.

వీధి నాటకానికి కథానాయకుడు, సూత్రధారి రాహుల్‌ ‌గాంధీ నేతృత్వంలో మిగిలిన పాత్రధారులు రెచ్చిపోయారు. అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, సుస్మితా దేవ్‌ ‌బారికేడ్లపైకి ఎక్కేశారు. అటువైపు దూకడానికి ప్రయత్నించారు. కొందరు ఎంపీలు అత్యుత్సాహంతో వారిని అనుసరించారు. పోలీసులతో పెనుగులాడారు. ఘర్షణకు దిగారు. వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ హడావుడిలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌మహిళా ఎంపీ మిథాలి భేగ్‌ ‌సొమ్మసిల్లిపడిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి శ్రుతిమించడంతో పోలీసులు విపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకు న్నారు. నినాదాలు చేస్తూ, మీడియా ప్రతినిధుల ముందు మోదీ సర్కారుపైన, ఈసీపైన రంకెలు వేస్తూ రాహుల్‌, ‌ఖర్గే తదితరులు వాహనాలు ఎక్కారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు. ఇంత జరిగినా కానీ కాంగ్రెస్‌ ‌నేతలు మాత్రం తమది శాంతియుత ప్రదర్శన అని చెప్పుకోవడం విశేషం. బారికేడ్లు మీద నుంచి దూకడానికి ప్రయత్నించి పోలీసులకు విషమపరీక్ష పెట్టిన ఎంపీల్లో ఒకరు తమ ప్రదర్శన 30 సెకండ్లలోనే ముగిసిపోయిందని వాపోవడం గమనార్హం. ఖర్గే లాంటివారైతే ఈసీకి వినతిపత్రాన్ని ఇద్దామని బయలుదేరిన తమను పోలీసులతో అడ్డుకుంటారా? అని ప్రధాని మోదీపై మండిపడ్డారు. కానీ ఈసీ చెప్పినట్టుగా 30 మందితో ప్రదర్శనగా కాకుండా ఎవరికి వారు సొంతవాహనాల్లో నిర్వాచన్‌ ‌సదన్‌కు చేరుకొని ఆ వినతి పత్రమేదో అక్కడి అధికారులకు ఇచ్చి, ఆ తర్వాత మీడియాతో తాము చెప్పాల్సింది చెప్పుకొని ఉంటే పోలీసులకు పని తప్పేది కాదా? కానీ అలా చేస్తే ఇది ఒక మామూలు కార్యక్రమంగా మిగిలిపోయేది. కానీ మొదట్లో చెప్పుకున్నట్లుగా కాంగ్రెస్‌ ‌పెద్దలు కోరుకున్న రీతిలో నవరసాల వీధి నాటకం హస్తినలోని ట్రాన్స్‌పోర్ట్ ‌భవన్‌ ‌వద్ద ఆవిష్కృతమయ్యేది కాదు. అలాగని అది విజయవంతమైందా అంటే అదీ లేదు. ఎందుకంటే దానిలో ప్రలకు పనికొచ్చే విషయం ఏదీ లేదు కాబట్టి. ఓట్ల చోరీ… ఓట్ల చోరీ అంటూ ఈసీ మీద పడి ఏడుస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీ తన ఏలుబడిలోని కర్ణాటక రాష్ట్రాన్ని కార్యక్షేత్రంగా చేసుకొని బొక్కాబోర్లాపడింది. మన హయాంలోనే కదా ఓటర్ల జాబితా తయారైంది.. దానికి ఇతరులను తప్పు పట్టడం ఎందుకు? ఇంత హడావుడి ఎందుకు? అని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని, మరీ ముఖ్యంగా రాహుల్‌ ‌గాంధీని నిజాయితీగా నిలదీసిన కర్ణాటక మంత్రి రాజన్నపై ఇదే వీధి నాటకం రోజున వృద్ధ పార్టీ వేటు వేసింది. ఓట్ల చోరీ పేరిట నెలల తరబడి తాను సాగిస్తున్న నాటకానికి ఒక మంత్రి పదవిని బలిగొంది. కాంగ్రెస్‌ ‌పార్టీ తన రాజకీయ లబ్ధి కోసమని మున్ముందు మరెంత మందిని బలిపెడు తుందో, ఇంకెన్ని వీధినాటకాలు ఆడేదీ వేచి చూడాలి. ఈ రాకీయ చదరంగంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పావులుగా వాడుకోవడానికి ప్రయత్నించడం ద్వారా, దేశానికి స్వరాజ్యం తెచ్చామని ఘనంగా చెప్పుకునే ఆ పార్టీ అత్యంత హేయమైన స్థితికి దిగజారడం యావత్‌ ‌జాతి స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడానికి సిద్ధమవుతున్నవేళ చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం. జైరామ్‌ ‌రమేశ్‌ ‌లాంటి కాంగ్రెస్‌ ‌నేతలు చేసే వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా నిలుస్తాయి. తమకు ఏదైనా నచ్చకపోయినా, ఎన్నికల్లో గెలవక పోయినా ప్రజాస్వామ్యం హత్యకు గురైదని అనడం ఇలాంటి కాంగ్రెస్‌ ‌నేతలకు పరిపాటిగా మారి పోయింది. అయినదానికి, కానిదానికి ప్రజా స్వామ్యంతో ముడిపెట్టడం ఓ అలవాటైపోయింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గేది మరీ విచిత్రమైన పరిస్థితి. ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మాత్రమే కాదు. రాజ్యసభలో విపక్ష నేత కూడా. హస్తినలో వీధినాటకం ముగిసిన తర్వాత తీరుబడిగా సాయంత్రం నాలుగు గంటలకు రాజ్యసభకు వచ్చారు. కీలకమైన బిల్లులపై మాట్లాడాలని ఛైర్మన్‌ ‌స్థానంలో కూర్చున్న సురేంద్ర సింగ్‌ ‌నాగర్‌ ‌మైకును ఇస్తే ఖర్గే దాన్ని వదిలేసి తాము చేపట్టిన వీధినాటకానికి హాజరైన ఎంపీల సంఖ్యను, నాటకం జరిగిన తీరును వివరంగా చెప్పడం మొదలు పెట్టారు. బిల్లులపై మాట్లాడాలని ఛైర్మన్‌ అదేపనిగా కోరినా పట్టించుకోలేదు. ఇదేమిటని అడిగిన అధికార పక్ష సభ్యులపై కాంగ్రెస్‌ ఎం‌పీ విరుచుపడ్డారు. చివరకు తోటి విపక్ష సభ్యులతో రాజ్యసభ నుంచి వాకౌట్‌ ‌చేశారు. ఇక లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ వ్యవహారశైలి అయితే మరీ విడ్డూరంగా ఉంటుంది. ఎక్కడికైనా సరే తన కూడా జేబులో పట్టేంత ఉండే ఒక ఎరుపు రంగు పుస్తకాన్ని తీసుకొనివెళుతుంటారు. దాని మీద రాజ్యాంగం అని రాసి ఉంటుంది. పోనీ పుస్తకంలో అచ్చువేసిన పేజీలను చూపిస్తారా? అంటే అలాంటిదేమీ ఉండదు. కేవలం ఓ ఇంద్రజాలికుడి తరహాలో ఆ పుస్తకాన్ని ఒక్క చేత్తో పట్టుకొని గాల్లోకి లేపి అందరికీ చూపిస్తారు. గతంలో ఆయన చేసే విమర్శలు మోదీ ప్రభుత్వానికి మాత్రమే పరిమితమై ఉండేది. కానీ తాజాగా రాహుల్‌ ‌కళ్లకు ఈసీ కూడా ఓ పాపాల భైరవుడిలా కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలో ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకునే రోజునే రాహుల్‌ ‌గాంధీ న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ ‌భవన్‌లో పార్టీ న్యాయవాదుల విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజర య్యారు. ఎప్పటిలాగానే వేదికపైన ఎర్రటి పుస్తకాన్ని రాజ్యాంగం అని పరిచయం చేశారు. అక్కడితో ఆగకుండా రాజ్యాంగం దేశ ప్రజల రక్తంతో తయారైందని వ్యాఖ్యానించారు. ఇక ఈసీపై విరుచుకుపడ్డారు. అంతటి పవిత్రమైన రాజ్యాంగాన్ని అవమానించేలా ఈసీ వ్యవహరిస్తోందని మండి పడ్డారు.

స్వంత లాభానికి కూటమిని కలపడానికి ఎరగా ఈసీ

కాంగ్రెస్‌ ‌పార్టీ ఇండియా కూటమికి దూరంగా తలో దిక్కుకు పారిపోతున్న పార్టీలను మళ్లీ ఒక దగ్గరకు చేర్చడానికి ఈసీని ఎరగా వాడుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రెండు రోజుల్లో పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు మొదలవుతాయనగా ఇండియా కూటమి ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. సమావేశానికి తాము హాజరయ్యేది లేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కూటమి నుంచి ఇప్పటికే నిష్క్రమించినట్టు వెల్లడించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పటిదాకా ఏం ఘనకార్యం చేసిందని కూటమికి నేతృత్వం వహిస్తోందని నిలదీసింది. ఆ పార్టీ కూటమిని ఏర్పాటు చేసిన ఇన్నేళ్లలో ఎన్నిసార్లు కూటమిని సమావేశపరిచిందీ చెప్పాలని ప్రశ్నించింది. విపక్షాల కూటమి విషయంలో కాంగ్రెస్‌ ఉదాసీన వైఖరిని మొదట్నుంచి గమనిస్తూ వస్తున్న పశ్చిమ బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా ఆన్‌లైన్‌ ‌సమావేశానికి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. పార్లమెంట్‌ ‌సమావేశాలు మొదలవుతున్న తరుణంలో తనకు నష్టం కలిగించే విధంగా కూటమి కకావికలై పోతుండటం కాంగ్రెస్‌ ‌పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఓట్ల చోరీ అనే కట్టు కథను అల్లి కూటమిని పేకమేడలా కూలిపోకుండా కాపాడు కోవాలని నిర్ణయించుకుంది. అంతకుమునుపు మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయాయని, ఆ కారణంగానే అక్కడ తమ పార్టీ ఓటమి పాలైందంటూ కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీతో ఒకానొక ఆంగ్ల దినపత్రికలో పెద్ద వ్యాసాన్ని రాయించినప్పటికీ అది ఎందుకూ పనికిరాకుండా పోవడాన్ని పార్టీ పెద్దలు గ్రహించారు.

ఇదిలా ఉండగా ఈసీ బిహార్‌లో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణ-సర్‌ ‌చేపట్టాలని నిర్ణయించ డాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్‌ ‌పార్టీ తలపోసింది. సర్‌ ‌జరుగుతున్న వేళ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విదేశాల నుంచి భారత్‌కు అక్రమంగా తరలి వచ్చినవారు దేశ భద్రతకు పెను ముప్పుగా మారుతున్న తరుణంలో బిహార్‌లోని ఓటర్ల జాబితాలో నేపాల్‌, ‌బాంగ్లాదేశ్‌ ‌లాంటి పొరుగుదేశాలకు చెందినవారు ఓటర్లుగా నమోదై ఉన్నారని ఈసీ గుర్తించింది. అలా గుర్తించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని ప్రకటించింది. సర్‌ను దేశవ్యాప్తంగా చేపడతామని వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లూ అక్రమ వలసదారులను తమ ఓటు బ్యాంకుగా మార్చుకొని బిహార్‌ ‌రాజకీయాల్లో ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్‌, ‌సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌ ‌పార్టీలకు తోడు, పశ్చిమబెంగాల్‌ అధికార తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి, తమిళనాడులో అధికార ద్రవిడ మున్నేట్ర కళగం-డీఎంకే పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సర్‌ను మొగ్గలోనే తుంచివేయకపోతే తమ అస్తిత్వానికే ముప్పు వస్తుందని భయపడ్డాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాయి.

సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు

బిహార్‌లో ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ -సర్‌ ‌పేరిట ఈసీ అక్కడి ప్రజలను ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్లు కాకుండా కొత్త కొత్త డాక్యుమెంట్లు సమర్పించాలని కోరుతూ ఇబ్బంది పెడుతుందని ఆరోపిస్తూ, సర్‌ను సవాల్‌ ‌చేస్తూ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలైనాయి. పిటిషన్‌లు దాఖలు చేసినవారిలో ప్రజాస్వామ్య సంస్కరణల అసోసియేషన్‌-ఏడీఆర్‌ అనే ఎన్జీవో, కాంగ్రెస్‌, ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంపీ మహువా మొయిత్రా, రాష్ట్రీయ జనతాదళ్‌ ‌నేత మనోజ్‌ ‌ఝా సహా తొమ్మిది రాజకీయ పార్టీలు, సామాజిక విశ్లేషకుడు, ఆమ్‌ ఆద్మీ పార్టీ మాజీ నేత యోగేంద్ర యాదవ్‌, ‌సామాజిక కార్యకర్త అర్షద్‌ అజ్మల్‌ ఉన్నారు. సీనియర్‌ అడ్వకేట్లు గోపాల్‌ ‌నారాయణన్‌, ‌కపిల్‌ ‌సిబల్‌, అభిషేక్‌ ‌మను సింఘ్వీ,షాదన్‌ ‌ఫరాసత్‌, ‌వృందా గ్రోవర్‌, ‌నిజామ్‌ ‌పాషాతో కూడిన బృందం పిటిషనర్ల తరఫున రంగంలోకి దిగింది. సీనియర్‌ అడ్వకేట్లు కేకే వేణుగోపాల్‌, ‌రాకేశ్‌ ‌ద్వివేది, మణీందర్‌ ‌సింగ్‌ ఈసీ తరఫున నిలిచారు. అయితే సర్‌కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన ఏ ఒక్కరూ బిహార్‌కు చెందిన ఓటర్లు కాకపోవడం విశేషం. ఇదే విషయాన్ని ఈసీ తరఫు న్యాయవాదలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొనివచ్చారు. అయితే సర్‌ను దేశవ్యాప్తంగా చేపడతామనిఈసీ ప్రకటించినందున ఆ పక్రియ బిహార్‌ ‌రాష్ట్రేతర ఓటర్లకు కూడా వర్తిస్తుందని పిటిషనర్ల తరఫు సీనియర్‌ అడ్వకేట్లు వాదించారు. ఈ సందర్భంగా ఆధార్‌ ‌లాంటి డాక్యుమెంట్లను గుర్తించాలని సుప్రీంకోర్టు ఈసీని కోరగా బిహార్‌లో సర్‌ ‌చేపట్టిన సందర్భంగా ఓటర్ల జాబితాలో ఉన్న అక్రమ వలసదారులు ఆధార్‌ ‌కార్డు కలిగి ఉన్న వైనాన్ని ఈసీ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొని వచ్చింది. సుప్రీంకోర్టు ఆ తర్వాత కొద్దిరోజులు వాదోపవాదాలు విన్న తర్వాత సర్‌పై స్టే విధించేది లేదని తేల్చి చెప్పింది. అక్రమ ఓట్ల ఏరివేతలో ఈసీకి పచ్చజెండా చూపింది. విపక్షాలు ఇంత రాద్దాంతం చేసిన సర్‌కు బిహార్‌ ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. పెద్ద సంఖ్యలో ఆ పక్రియలో పాల్గొన్నారు. ఈసీ చెప్పిన దాని ప్రకారం 92.5 శాతానికి పైగా ఓటర్లు సర్‌కు మద్దతు ఇచ్చారు. ఓటర్ల జాబితాకు మార్పులు, చేర్పులు చేయడంలో కీలకమైన పాత్రను పోషించారు. ఈసీ ఆగస్టు ఒకటవ తేదీన బిహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్టు ప్రకటించింది. ఓటర్ల తొలగింపు వ్యవహారం సుప్రీంకోర్టులో వాదోప వాదాలకు దారి తీసింది. తొలగింపునకు గురైన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను కోర్టుకు సమర్పించా లని, కారణాలను తెపాలని ఈసీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే తొలగించిన ఓటర్ల వివరాలను, కారణాలను వెల్లడించాల్సిన అవసరం ఈసీకి లేదని ఈసీ తరఫు న్యాయవాదులు వాదించారు.దీంతో ఓటర్ల తొలగింపు, చేరిక ఈసీ పరిధిలోనే ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

పార్లమెంట్‌లోనూ విపక్షాల ఆటకట్టు

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల్లోనూ విపక్షాల వైఖరి విస్తుగొలిపేలా ఉంది. జూలై 21న సమావేశాల ఆరంభంలో ఆపరేషన్‌ ‌సిందూర్‌పై చర్చ జరపాలని భావించి నప్పటికీ అప్పట్లో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా చర్చను జూలై 28న చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌లోక్‌సభలో చర్చకు నాంది పలికారు.ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌సాధించిన ఘనతను, అంతర్జాతీయ వేదిక భారత్‌ ‌ప్రతిష్ట వైనాన్ని సభకు వివరించారు. అయితే దశాబ్దాల కాలంగా తాము సాధించలేనిది, కేవలం 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించడాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్‌ ‌ఖర్గే చర్చ జరుగుతున్నప్పుడు వ్యవహరించిన తీరు ప్రజల విమర్శలకు గురైంది. రాహుల్‌ ‌గాంధీ చర్చలో మాట్లాడుతూ ‘‘నిన్ను కొట్టాము.. నువ్వు మమ్మల్ని కొట్టవద్దు అని ఎవరైనాశత్రువుతో అంటారా? మన ప్రభుత్వం మాత్రం ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌కు దాని గురించి చెప్పింది’’ అని అంటూ ఏదోదో మాట్లాడుతూ ఎదురుగా ఉన్న బల్లను అదేపనిగా చేతితో కొట్టడం మొదలుపెట్టారు. అది ఎంత దాకా వెళ్లిందంటే… మీ ఎదురుగా ఉన్న బల్ల పార్లమెంట్‌ ఆస్తి.. దాని జోలికి వెళ్లకండి అని లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా రాహుల్‌కు పదేపదే చెప్పేదాకా వెళ్లింది. ఇక మల్లికార్జున్‌ ‌ఖర్గే విషయానికి వస్తే ప్రధాని మోదీ ఇదివరకే లోక్‌సభలో చర్చకు సమాధానం ఇచ్చినప్పటికీ రాజ్యసభలో చర్చకు కూడా సమాధానం ఇవ్వాలని పట్టుపట్టారు. చర్చకు సమాధానం ఇస్తున్న హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షాను అడుగడుగునా అడ్డుకున్నారు.

అయితే ముంబై ఉగ్రదాడులపై పార్లమెంట్‌లో జరిగిన చర్చకు అప్పటి హోమ్‌ ‌మంత్రి సమాధానం ఇచ్చిన వైనాన్ని ఖర్గేకు అమిత్‌ ‌షా గుర్తు చేశారు. దీంతో కంగుతిన్న ఖర్గే నోటమాట రాక రాజ్యసభ నుంచి వాకౌట్‌ ‌చేశారు. ఇలా ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌విషయంలో ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో ఇరకాటంలో పెడతామనుకున్న ఉభయ సభల విపక్ష నేతల ఆటలు ఏ మాత్రం సాగలేదు.

సర్‌పై పార్లమెంట్‌లో చర్చ నిషిద్ధం

విపక్షాలు ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌విషయంలో అభాసు పాలుకావడంతో పార్లమెంట్‌లో సర్‌ అం‌శాన్ని భుజానికి ఎత్తుకున్నాయి. అదేపనిగా పార్లమెంట్‌ ‌కార్యకలాపాలకు అడ్డుపడ్డాయి. సర్‌పై సాకులు చెప్పకుండా చర్చకు అనుమతించాలంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ‌హరివంశ్‌ ‌నారాయణ్‌కు ఖర్గే లేఖ రాశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ ‌రిజిజు ఈ విషయమై దీటుగా స్పందించారు. ఈసీ లాంటి స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ బద్ధమైన సంస్థ పనితీరును పార్లమెంట్‌ ‌చర్చించ రాదనే రూలింగ్‌ను సుదీర్ఘకాలానికి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన బలరామ్‌ ‌జాకర్‌ ఇచ్చారని గుర్తు చేశారు. అదీ కాకుండా సర్‌ ‌సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కారణంగా అది చర్చనీయాంశం కాదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ‌నట్టింట్లో పేలిన రాహుల్‌ ఆటంబాంబు

రాహుల్‌ ‌గాంధీ పార్లమెంట్‌ ఇ‌టా బయటా తమ పప్పులు ఉడకపోవడంతో కంగారుపడ్డారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై త్వరలో ఆ•ంబాంబు పేల్చుతానని ప్రకటించారు. ఆగస్టు 8న ఇండియా కూటమి నేతలను తన ఇంట రాత్రిపూట విందుకు ఆహ్వానించారు. ఇదిగో ఆటంబాంబు అంటూ పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ ప్రజంటేషన్‌ ‌వెనుక ఆరు నెలల శ్రమ దాగి ఉందని చెప్పుకొచ్చారు. అనేక రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఏవేవో లెక్కలు చూపించారు.

తమ పార్టీ ఏలుబడిలోని కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో ఒక లక్షకుపైగా ఓట్లు చోరీకి గురయ్యాయని తెలిపారు. లెక్కలకు పత్రమూ, ఆధారమూ చూపించాలంటూ ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు రాహుల్‌ ‌గాంధీకి నోటీసులు పంపించారు. మహదేవ పుర వ్యవహారంతో కర్ణాటక కాంగ్రెస్‌లో అగ్గిరాజుకుంది. కాంగ్రెస్‌ ‌నేతృత్వంలో విపక్షాలు హస్తినలో వీధి నాటకం ఆడుతున్నప్పుడే ఆ అగ్గి కర్ణాటక మంత్రి రాజన్న పదవికి మంటపెట్టింది. ఈ మంట ఎక్కడి దాకా వ్యాపిస్తుందో చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్‌కు దాన్ని ఆర్పడం వల్లకాని పని.

About Author

By editor

Twitter
YOUTUBE