‘‌గోమతి’ని చూశారా? ‘వారధి’ని గమనించారా?

‘హరివిల్లు’ మీ ఇంట్లో ఉందా? ‘భావబంధం’ తెలుసా మీకు?

‘ధర్మం నిలిచింది’ గుర్తుందా? ‘మనస్వి’ గుర్తొస్తోందా?

‘నైజగుణం’ నచ్చిందా? ‘తీరని కోరిక’ అర్థమైందా మీ అందరికీ?

‘విలువలు’ను మరోసారి చూడాలనుందా? ‘వారసత్వం’ బాగుంటుంది కదూ? ఇవ్వన్నీ పుస్తకాల పేర్లు. కొన్ని కథలు, ఇంకొన్ని నవలలు.

వీటిని రాసిన విశాలాక్షిది స్వతంత్ర భావతరంగం.

ఈమె పుట్టిందీ మన స్వాతంత్య్ర దినోత్సవానే!

మరో నాలుగేళ్లకు (2029) ఆగస్టు 15న ఈ రచయిత్రికి శతజయంతి ఉత్సవ వసంతం. విజయనగరాన పుట్టిన ఆమె అమెరికా, ఇంగ్లండ్‌ ‌సహా ఎన్నో విదేశాల్లో పర్యటించి వనితావాణిని వినిపించారు. నవలను అనేక భారతీయ భాషల్లోకి అనువదింపచేసుకున్న అక్షర తపస్విని ద్వివేదుల విశాలాక్షి!

ఎన్నెన్నో రాసిన ఈ సాహితీవేత్త తన పుస్తకాల హక్కులన్నింటినీ ఒక గ్రంథాలయానికి రాసి ఇచ్చేశారు. అది విశాఖ ద్వారకానగర్‌లోని పబ్లిక్‌ ‌లైబ్రరీ. తదుపరి తరంమీద ఎంత ప్రభావం చూపారంటే- పరిశోధన గ్రంథాలనేకం ఆంధ్ర విశ్వకళాపరిషత్తు యువత నుంచి వెలువడ్డాయి. తిరుపతి శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయ పరిశోధకుల గ్రంథాలు ఆ జాబితాకు జతచేరాయి.

ఢిల్లీ తెలుగు అకాడమీవారి సారస్వత పురస్కారం ద్వివేదులవారికే! అవార్డుల పరంపర ఆమె సొంతం.

తొలి నవల ‘వైకుంఠపాళి’ అలనాడు ఒక ప్రసిద్ధ పత్రిక పెట్టిన పోటీలో ప్రథమ బహుమతి అందుకుంది.

స్వర్ణ కంకణం స్వీకరించిన ప్రతిభామూర్తి.

ఇంకా విశేషాంశం ఏమిటంటే… ఆమె తన నవలల్ని తనే నాటకాలుగా రూపొందించడం, అవి ఆకాశవాణిలో ప్రసారం కావడం. శేష జీవితం విశాఖలో గడిపారు. తన నివాసం పేరు ‘సాగరిక’. సముద్రంలో అపార సంపద ఉన్నట్లే… ఈమె రచనల్లోనూ భావనారాశి. వందలాది పుస్తకాల సమీక్షకురాలు, ‘సుమన’ అంటే ఆమె!

గవరయ్యకి చర్మం ఎంత దళసరో – నాలుక అంత పలచన. డబ్బు ఇచ్చేటప్పుడు అది తేనె ఒకలబోస్తుంది. తిరిగి పుచ్చుకునేటప్పుడు విషం చిందిస్తుంది. – ఇలా ఉంటుంది ద్వివేదుల రచనల్లో పాత్ర చిత్రణ.

ఆ భగవంతుడు ఆమెకు కీడులో మేలు చేశాడు. తనకు మతి స్థిమితం లేకపోబట్టే, తన భర్త జీవించే ఉంటాడన్న ఆశ ఉండబట్టే, అలా ఉంది శశి. లేదంటే, ఏనాడో ఈ లోకాన్ని విడిచేది. అంతులేని నిరీక్షణ ఆమెది. లేశమాత్రమైనా విచారం లేకుండా ఉంటోందంటే జీవితాన్ని ఇలా గడిపేస్తోందంటే, ఎంత శోకాతీతం! లోకాతీతం! ఈ మాట ఆమె ముఖంలో కనిపించింది అంతటి భర్త ప్రేమ! – ఇదీ విశాలాక్షి ‘స్వభావ పరిపోషణ’.

అందని మేఘాలు, అందిన మేఘాలు. రెండు రచనలూ ఆమెవే! తర్వాత వాటిని క్రోడీకరించి ‘అందని’ని స్థిరీకరించారు. ‘ఆకాశంలో మబ్బులు పలచనై దూదిపింజల్లా దూరం దూరంగా పరుగులు పెడుతున్నాయి. మానవ జీవితంలో ఆ మేఘల్లాగే కన్పించి, ఊరించి, తొలగిపోయే అవకాశాలు అనంతం. వాటినన్నిటినీ ఉపయోగించుకోగలం అనుకోవటం అవివేకాన్ని మాత్రమే సూచిస్తుంది – ఇదంతా రచయిత్రి వర్ణనాసక్తి.

‘అడుగున పడిన పునాది రాళ్లు’ అని మరో రచన. ‘విరిసీ విరియని గులాబి మొగ్గలా ముద్దుగా బొద్దుగా ఉన్న ఆ పిల్లాడిని చూస్తే, దగ్గరికి పిలిచి మాట్లాడాలని మనసైంది. ‘రెండు అడుగులువేసి మెల్లగా నవ్వుతూ, ‘దగ్గరికి రా’ అన్నట్లు చేతులు ఊపాడు. ఆ పిల్లడు కిలకిల నవ్వుకుంటూ, తన రెండు చేతులతో ముఖం కప్పుకొని ఊరి వైపు పరుగుతీశాడు’. ఇది మొత్తం గోపన్న తాత కథానుభవం. దీన్ని రాయడంలో ఎంతో సున్నితత్వం కనబరిచారు విశాలాక్షి. తాత కడుతున్న బ్రిడ్జి, రోజు రోజుకూ పెరుగుతుంటే, చిట్టి మనసు సంతోషంతో ఉరకలేసింది. ఆ తాత లేకపోతే, ఇంకెవరూ ఆ పని చేయలేరని పిల్లవాడి నమ్మకం… అంటూ ఆకట్టుకుంటారామె.

ఇతివృత్తాన్ని ఎంచుకోవటంలో ఆమెకు ఆమే సాటి. రచనను తనదైన రీతిన మొదలుపెట్టి, ఆసక్తిగా కొనసాగించి, అనూహ్యతీరున ముగించడంలోనూ సిద్ధహస్తురాలు. కథనానికి సంబంధించి నూతన ప్రయోగాలు చేయడంలో కూడా ఎప్పుడూ ముందే ఉండేవారు.

కథ / నవల వస్తువును స్వీకరించడం, ఆవిష్క రించడంలో సైతం విభిన్న పంథా అనుసరించేవారు. సందేశం ఇస్తున్నట్లో, ఉపదేశిస్తున్నట్లో ఉండవు ఆమె రాతలు. కళ్లముందు ఉన్నవాటిని ఉన్నది ఉన్నట్లు చూపుతున్నట్లుఉండేవి.

నిశిత పరిశీలన, సూటి వ్యక్తీకరణ విశాలాక్షి ప్రధాన లక్షణాలు. సూక్ష్మ దృష్టి కనిపిస్తుండేది. విశ్లేషణ ప్రస్ఫుటమవుతూ ఉండేది. అందుకే ఆమె ఏం రాసినా, చదువరుల సమాదరణ.

‘అక్క’ అనే పెద్ద కథను ఎలా ఆరంభించారో చూడండి. ‘ఎంతో అందంగా ఉండేది అక్క! అప్పుడే రేకులు విచ్చుకుంటున్న పువ్వులా, ఎండా వానల కలయికతో ఆకాశాన విరిసిన హరివిల్లులా, కడలి తరగల మీద వెల్లివిరిసిన వెన్నెల కాంతిలా, గులాబీ రేకుల్ని పాల మీగడతో కలిపి మర్దించి… పురిషెడు బంగారు నీటితో పదును చేసి ఆ ముద్దతో రూపుదిద్దిన బొమ్మలా!’

‘అమ్మ’ అనేది మరోకథ. ‘ఇది నీ అమ్మ స్వార్థం అను, నలుగురు బిడ్డల భవిష్యత్తు కోసం ఒక కన్నబిడ్డ బతుకును ఎందుకూ కొరగాకుండా కాలరాచిన త్యాగం అను, ఏమన్నా సరే… నా గురించి నువ్వు ఎలా అనుకున్నా సరే… నాకు మీరంతా ఒకటే తల్లీ! మిమ్మల్ని పెంచి పెద్ద చేసేందుకే నా ఈ పోరాటం! ఆనాడు మీ నాన్నతో పోరాడాను. ఈనాడు మీతో…’ అంటూ సాగిపోతుంది సంభాషణ అంతా. ఎంత సహజత్వమో చూశారా!

కవితలు రాయడంలో ఎంత శబ్దసంపన్నమో, వ్యాసాలుగా విశదీకరించడంలోనూ అంత నిపుణత! రేడియో నాటికల తయారీలో సైతం విలక్షణత ప్రతిఫలించేది మొదటి నుంచీ. ఇంతటి బహుముఖ ప్రజ్ఞ కనబరిచినందుకే ప్రశంసలెన్నింటినో పొందారు ఆమె.

వారధి నవల గురించి ఎంతైనా చెప్పాల్సి ఉంటుంది. తెలుగు నవలా యుగంలో అదొక మెరుపు. గ్రామీణ వాతావరణ దృశ్యీకరణ ఒక ఉదాహరణ. ‘దుఃఖాన్ని దిగమింగి, లాల్చీ కొసతో కళ్లు తుడుచుకుని, పొలాలవైపు చూశాడు రాజు. సెనగ చేను- పచ్చని తివాచీలాగా చుట్టూ పరచుకొని ఉంది. ఆ చేలకు వెనకగా – కొత్తగా వేసిన అంటు మామిడి తోట. లేత మామిడి మొక్కల తలల మీదుగా ఎండలో తళతళ మెరుస్తున్నాయి వంతెన స్తంభాలు.’

ఆ నవల అంతా రెండు కుటుంబాల కథ. వైవిధ్యానికి, విశిష్టతకు పెద్దపీట. రచన చేసినంత కాలమూ తనకు ఎదురైన అనుభవాలన్నింటినీ ద్వివేదుల విశాలాక్షి విపులీకరిస్తూ వచ్చారు. వాటిని చదువుతుంటే, మన మనసంతా అనిర్వచనీయత చోటు చేసుకుంటుంది.

గ్రహణం విడిచింది; ఎక్కవలసిన రైలు, జారుడు మెట్లు, కలకానిది వంటి నవలలు / నవలికల గురించీ ఎంత చెప్పుకొన్నా తరగదు! కొవ్వొత్తి, పరిహారం నవలలు విమర్శకుల ప్రశంసలకు పాత్రమయ్యాయి. ఎందరో మెచ్చుకున్నారు.

‘ధర్మం నిలిచింది’ కథలోని సంభాషణలు, అభివర్ణనలు, వ్యక్తీకరణలు చర్చనీయాంశాలుగా మారాయి ఆ రోజుల్లోనే! చర్చ అంటే ఆ రచనా చాతురిని గురించిన చర్చ. ప్రత్యేక సమావేశాలు నిర్వహించీ మరీ సమీక్షలు జరిపిన నిదర్శనా లున్నాయి. భాషను, యాసను ఎందరెందరో విడమరచి ప్రస్తావించారు ఆనాడు.

‘ఏదో, ఓటి సెయ్యండి బాబూ! ఎక్కడో ఓకాడ ఆ కుర్రదాన్ని బతకనీండి!’ – ఆత్రంగా అందరినీ బతిమాలుకుంది అసిరి. ఆ తర్వాత పెద్దల అనుజ్ఞ అందుకుని, అసిరి ముందుకు అడుగేసింది. ఆమె చేతిలోని పసిడి అతిదీనంగా చూస్తోంది. అమ్మను కోల్పోయిన చిన్నది. నాన్నెవరో ఎరుగని కుర్రది. అసిరి చేతిలో!

రెప్పపడని ఆ కళ్లు విచ్చుకునే ఉన్నాయి. ధర్మనిర్ణేతల్ని తరిచి తరిచి ప్రశ్నిస్తున్నాయి. ‘చెట్టుల్లారా, పుట్టల్లారా! చుట్టూ ఉన్న పెద్దల్లారా! మీలో ఎవరైనా చెప్పగలరా…. నా జనన, మరణ రహస్యాన్ని’ అన్నట్లుంది.

ఉదాహరిస్తే ఇటువంటివి మరెన్నో. ఆ అన్నీ విశాలాక్షి నిష్పాక్షికతను వెల్లడించేవే! ప్రవీణతను చాటి చెప్పేవే!

1960లలో అందునా ప్రారంభదశలో ఆమె రచించిన అనేకం పాఠకుల చేతుల్లోకి అలవోకగా ఒదిగాయి. ప్రధానంగా మహిళాచదువరుల ఆదరణను మరింతగా సంపాదించాయి. మధ్య తరగతివారి మనోమందిరాల్ని అలంకరించాయి.

ఒకటా రెండా… పదుల సంఖ్యలో పురస్కారాలు ఆమెను వరించి వచ్చాయి. విశ్వవిద్యాలయంవారు గౌరవ డాక్టరేట్‌ ‌ప్రదానం చేస్తూ ‘మీ రచనలు సాటి స్త్రీలను చేయిపట్టి ముందుకు తీసుకెళ్లాయి’ అని అభినందించారు. నిజమే. అక్షర సత్యం అది.

లలిత, జానకి, భారతి, గోమతి, శారద, మాధవి, ఇంకా ఎన్నెన్నో పాత్రలు సృష్టి చేశారు విశాలాక్షి. వాటితో ఇప్పటికీ పాఠక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరచుకున్నారు.

అంతరంగానికి అద్దం పట్టడం చేశారు కాబట్టే, ఇవాళ్టికీ ప్రాతః స్మరణీయురాలిగా నిలిచే ఉన్నారు ఆ మేటి రచయిత్రి / కవయిత్రి. ఘనత ఎంత అనేది కథల / నవలల నాయికల పాత్రలే మనందరికీ వివరిస్తాయి. ఆమె రచనా నాయిక!

జంధ్యాల శరత్‌బాబు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE