2008 మాలేగావ్ పేలుడు కేసు నుంచి సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులకు విముక్తి లభించింది. ఈ మేరకు జులై 31న ముంబైలో ప్రత్యేక జాతీయ దర్యాప్తు ఏజెన్సీ -ఎన్‌ఐఏ – కోర్టు తీర్పునిచ్చింది. నిందితులందరూ సంశయ లబ్ధికి అర్హులని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి సహేతుకమైన, హేతుబద్ధమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఏ మతమూ హింసను సమర్థించదు. కేవలం తెలివిడి, నైతిక రుజువు ప్రాతిపదికగా కోర్టు ఏ ఒక్కర్నీ దోషిగా నిర్ధారించదు. అందుకు తగిన ఆధారం ఉండాలి. దర్యాప్తులోనూ, ప్రాసిక్యూషన్‌లోనూ సాంకేతికపరమైన అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయని ప్రత్యేక జడ్జీ జస్టిస్ ఏకే లహోటి వేలెత్తి చూపారు. ప్రాసిక్యూషన్ వాదించినట్టుగా పేలుడుకు ఉపయోగించిన మోటార్ బైక్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ అయ్యిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే బైక్‌కు అమర్చిన బాంబు ద్వారానే పేలుడు జరిగిందనేందుకు ఎలాంటి రుజువులు లేవని జడ్జి తెలిపారు. ఈ సందర్భంగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ జడ్జిని ఉద్దేశించి మాట్లాడుతూ నేను సన్యాసిని కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఒక కుట్రతో వారు భగ్వా-కాషాయంను అప్రతిష్ట పాల్జేశారు. నేడు భగ్వా గెలిచింది. హిందుత్వ విజయం సాధించింది. దీనికంతటికీ కారణమైన వారిని దేవుడు శిక్షిస్తాడు అని అన్నారు.
సెప్టెంబర్ 29, 2008:
మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలోని మాలేగావ్ పట్టణంలో బిక్కూ చౌక్ సమీపంలో ఒక మోటార్ సైకిల్‌కు అమర్చిన బాంబు పేలుడు. ఆరుగురు మృతి, 101 మందికి గాయాలు.
సెప్టెంబర్ 30, 2008:
మాలేగావ్‌లోని ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు.
అక్టోబరు 21, 2008:
కేసు దర్యాప్తు చేపట్టిన మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం-ఏటీఎస్.
అక్టోబరు 23, 2008:
సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మరో ముగ్గురు అరెస్టు.
నవంబరు, 2008:
లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ అరెస్టు.
జనవరి 20, 2009:
సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా అరెస్టయిన 11 నిందితులపై ప్రత్యేక కోర్టులో ఏటీఎస్ చార్జ్ షీట్ నమోదు. నిందితులపై మహారాష్ట్ర సంస్థాగత నేరాల నియంత్రణ యాక్ట్ – ఎంసీవోసీఏ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక యాక్ట్ – యూఏపీఏ, ఇండియన్ పీనల్ కోడ్ – ఐపీసీలో కఠినమైన సెక్షన్ల కింద అభియోగాలు నమోదు. వెదుకుతున్న నిందితులుగా మరో ఇద్దరు వ్యక్తులు రాంజీ అలియాస్ రామచంద్ర కాల్‌సంగ్ర, సందీప్ దాంగే పేర్ల ప్రస్తావన.
జూలై, 2009:
నిందితులకు ఎంసీవోసీఏ వర్తించదన్న ప్రత్యేక కోర్టు. కేసు విచారణను నాసిక్‌లోని కోర్టులో చేపట్టాలని ఆదేశం.
ఆగస్టు, 2009:
ప్రత్యేక కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం.
జూలై, 2010:
ప్రత్యేక కోర్టు ఆదేశాన్ని తోసిపుచ్చిన బాంబే హైకోర్టు. నిందితులకు ఎంసీవోసీఏ వర్తిస్తుందన్న హై కోర్టు.
ఆగస్టు, 2010:
హైకోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పురోహిత్, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.
ఫిబ్రవరి 1, 2011:
ప్రవీణ్ ముతాలిక్ అనే వ్యక్తి అరెస్టు. 12కు చేరుకున్న నిందితుల సంఖ్య.
ఏప్రిల్ 13, 2011:
కేసును చేపట్టిన జాతీయ దర్యాప్తు ఏజెన్సీ – ఎన్‌ఐఏ.
ఫిబ్రవరి, డిసెంబర్, 2012:
లోకేశ్ శర్మ, ధన్‌సింగ్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు అరెస్టు. 14కు చేరుకున్న నిందితుల సంఖ్య.
ఏప్రిల్, 2015:
నిందితులకు ఎంసీవోసీఏ వర్తింపు అంశంపై సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక కోర్టుకు తిరిగివచ్చిన కేసు.
ఫిబ్రవరి, 2016:
కేసుకు ఎంసీవోసీఏ వర్తిస్తుందా లేదా అనే అంశంపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్నట్టు ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఐఏ వెల్లడి.
మే 13, 2016:
ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఐఏ చార్జ్ షీటు నమోదు. కేసు నుంచి ఎంసీవోసీఏ తొలగింపు. ఏడుగురు నిందితులకు క్లీన్‌చిట్.
ఏప్రిల్ 25, 2017:
ప్రజ్ఞా ఠాకూర్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు. పురోహిత్‌కు బెయిల్ నిరాకరణ.
సెప్టెంబర్ 21, 2017:
పురోహిత్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు. సంవత్సరాంతానికి అరెస్టయిన నిందితులందరికీ బెయిల్ మంజూరు.
డిసెంబర్ 27, 2017:
కేసు నుంచి నిందితులు కాల్‌సంగ్ర, శ్యామ్ సాహూ, ప్రవీణ్ ముతాలిక్‌కు విముక్తి.
అక్టోబర్ 30, 2018:
ఏడుగురు నిందితులు ఠాకూర్, పురోహిత్, రమేశ్ ఉపాధ్యాయ, సమీర్ కులకర్ణి, అజయ్ రహీర్‌కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ త్రివేదిలపై అభియోగాలు నమోదు.
డిసెంబర్ 3, 2018:
కేసులో మొదటి సాక్షిని ప్రశ్నించడంతో విచారణ మొదలు.
సెప్టెంబర్ 14, 2023:
323 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను ప్రశ్నించిన తర్వాత ఆధారాల సేకరణ నిలిపివేతకు ప్రాసిక్యూషన్ నిర్ణయం.
జూలై 23, 2024:
డిఫెన్స్ తరఫున ఎనిమిది మంది సాక్షుల విచారణ పూర్తి.
ఆగస్టు 12, 2024:
ప్రత్యేక కోర్టులో నిందితుల తుది స్టేట్‌మెంట్లు నమోదు. తుది వాదనలకు కేసు వాయిదా.
ఏప్రిల్ 19, 2025:
ప్రత్యేక కోర్టులో ముగిసిన వాదనలు. తీర్పునకు సన్నాహాలు.
జూలై 31, 2025:
ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక ఎన్‌ఐఏ జడ్జీ ఏకే లహోటి తీర్పు.
– జాగృతి డెస్క్