వర్తమాన భారతంలోని ప్రజలలో అత్యధికులు స్వాతంత్య్రానంతరం జన్మించినవారే. ముఖ్యంగా నేటితరం యువత ఆర్థిక సంస్కరణలు అమలు జరిపిన అనంతరం పుట్టినవారే. కాబట్టి వాళ్లలో చాలామందికి మనం స్వాతంత్య్రానంతరం సాధించిన విజయాలేంటి? స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తదుపరి ప్రపంచంలో అత్యంత అధిక జనాభాగల దేశంగా పూర్తిగా ఆహార భద్రత సాధించటంతోపాటు, ప్రపంచంలో ప్రభావవంతమైన దేశాలలో ఒకటిగా ఎదిగిన మన విజయపరంపరను, అధిగమించిన సమస్యలను గుర్తు చేసుకోవటం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అవసరం.

అనేక సంవత్సరాల విదేశీ పాలనవల్ల మన ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. 1900 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం వాటా 20 శాతంగా నిలిచింది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం దాదాపు వాటిలో నాలుగో వంతు వాటా కలిగి ఉండేవాళ్లము. అటువంటిది పరపాలనలో మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ 1947 నాటికి మన వాటా 3.5 శాతానికి తగ్గిపోయింది. 1950-51లో మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తి రూ.4,96,848 కోట్లుగా ఉండేది. అది క్రమంగా పెరుగుతూ వచ్చి 2023-24 నాటికి రూ.1,71, 25,892 కోట్లుగా నమోదైంది. ఈ గణంకాలను కాన్‌స్టంట్‌ ప్రైసెస్‌ – స్థిర ధరలు ప్రకారం చేపట్టినట్టుగా గుర్తించాలి. 1950-51లో మన తలసరి ఆదాయం అప్పటి ధరల ప్రకారం రూ.265 (స్థిర ధరలు ప్రకారం రూ.12,443). అదే 2023-24 నాటికి రూ.1,06,744గా, ఇప్పటి ధరల ప్రకారం రూ.1,84,208 గా నమోదైంది.

స్వాతంత్య్రానంతరం మన ఆర్థిక వ్యవస్థ స్థిరధరల ప్రకారం 35 రెట్లకు పైగా పెరిగింది. కేవలం 77 సంవత్సరాల్లో మన ఆర్థిక వ్యవస్థ 35 రెట్లు పెరిగిందంటే మనం సాధించిన విజయం సాధారణమైనది కాదని గుర్తించాలి. ప్రపంచంలో ఇంత వేగంగా వృద్ధిని సాధించిన దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. మన కన్నా వేగంగా వృద్ధిని సాధించిన దేశాలూ ఉన్నాయి. అంత మాత్రం చేత మనం తక్కువ అని, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన ఖజానా ఖాళీగా మిగిలింది. దేశం పేదరికంతోపాటు, అనేక సమస్యలతో సతమతమవుతున్నది. ఆ పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశ తొలి ఆర్థికమంత్రి ఆర్‌.కె. షణ్ముగం చెట్టి నవంబర్‌ 26, 1947న రూ.24.59 కోట్ల ద్రవ్యలోటుతో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పట్లో మన కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆదాయం రూ.171.15 కోట్లుగా అంచనావేసి, రూ.197.29 కోట్లు ఖర్చు చేయటానికి ప్రతిపాదించేది. అందులో రూ.93 కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. అంటే ఆదాయంలో 50 శాతానికి మించి రక్షణ రంగానికి కేటాయించారు. మనం చేసుకునే దిగుమతులకు దేశీయ ప్రత్యామ్నాయాలను గుర్తించేవారు. వాటి వృద్ధి చేసేవారు. తద్వారా దిగుమతులను నిలువరించి దేశీయ ఉత్పత్తిని పెంచడంతోపాటు, వాణిజ్యలోటు తగ్గించే లక్ష్యంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన అనంతరం భారత రిపబ్లిక్‌కు తొలి ఆర్థిక మంత్రిగా జాన్‌ మతాయ్‌ ఫిబ్రవరి 28,1950న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ.347.50 కోట్లుగా అంచనావేసారు. అందులో రూ.168 కోట్ల రూపాయలను రక్షణ రంగానికి కేటాయించారు.ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచటం, దిగుమతులను తగ్గించటం వంటి లక్ష్యాలను నిర్దేశించారు. అదే బడ్జెట్‌లో ప్రణాళికా సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించటానికి ప్రైవేటు రంగ సంస్థలు అంతగా లేవు. ఆ కారణంగా ప్రభుత్వ రంగంలోనే ఉపాధి కల్పించటానికి ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించటం, అనేక రంగాలలో ప్రభుత్వం నేరుగా ప్రజా సంక్షేమ కార్యాలు చేపట్టటం వంటి చాలా కారణాలవల్ల ప్రభుత్వ వ్యయం బాగా పెరిగింది.

ఖర్చు పెరుగుతోంది కాబట్టి ఆదాయపు వనరులు పెంచుకోవటానికి క్రొత్త మార్గాలు అన్వేషించసాగారు. అందులో భాగంగా 1957-58లో అప్పటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి సంపద పన్నును ప్రవేశపెట్టారు. అప్పట్లో సోషలిస్టు విధానాల వ్యామోహంలో పన్ను రేట్లు పెంచటం, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అనేక ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పటం ఆర్థిక వ్యత్యాసాలను సవరించే ప్రయత్నంలో భాగంగా ప్రైవేటు పెట్టుబడులను నిర్లక్ష్యం చేయటం, ప్రైవేటు వ్యాపారాలకు అడ్డంకులు కల్పించటం మొదలుపెట్టారు. దాని ప్రభావంవల్ల 1960-1970 మధ్య కాలంలో మన స్థూల జాతీయ ఉత్పత్తి కేవలం 40 శాతం పెరిగింది. ఆ వేగం మరింత తగ్గి 1980-1990 మధ్య కాలంలో మనం కేవలం 34 శాతం వృద్ధితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ప్రగతికి అవరోధంగా మారుతున్న విధానాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలను చేబట్టలేదని అపోహపడవలసిన అవసరం లేదు. ఆర్థిక ప్రగతిని మెరుగుపరచడానికి ముఖ్యంగా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచటానికి విధానపరమైన సవరణలు చేసే ప్రయత్నాలు కొనసాగాయి. అందులో భాగంగా 1968లో అప్పటి ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయిగారు ఎక్స్‌ౖజ్‌ సుంకాల విషయంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. తద్వారా ఫ్యాక్టరీ గేట్ల వద్ద ఎక్సైజ్‌ సుంకాలను మదింపు చేసి, స్టాంపింగ్‌ వేసే అధికారుల పర్యవేక్షణ విధానాన్ని రద్దు చేశారు. పారిశ్రామిక సంస్థలకు అవి చెల్లించవలసిన సుంకాలు, పన్నులపై స్వీయ మదింపు చేసే బాధ్యతను అప్పగించారు. తద్వారా దేశంలో స్వీయ మదింపు విధానానికి శ్రీకారం చుట్టారు. అదే విధానం కొన్ని మార్పులతో ఈనాటికీ కొనసాగటం గమనార్హం.

మనకు స్వాతంత్య్రం వచ్చే నాటికి మన పరిస్థితులు అంత గొప్పగా లేవు. మన దేశంలో మూడొంతుల జనాభా వ్యవసాయంపై ఆధారపడినప్పటికి మన రైతులు అత్యంత పేదరికంలో మగ్గేవారు. చాలామందికి సొంత వ్యవసాయ భూమి ఉండేది కాదు. ఆధునిక వ్యవసాయ పనిముట్లు ఉండేవికావు. ఎక్కువ మంది వ్యవసాయ కూలీలుగా మనుగడ సాగించేవారు. అక్షరాస్యత మన దేశంలో కేవలం 15శాతంగా ఉండేది. ప్రజల సగటు జీవనశైలి దుర్భరంగా ఉండేది. సగటు జీవితకాలం 32 సంవత్సరాలు. సరైన విద్యా, వైద్య రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. పరిశ్రమలు పరిమితంగా ఉండేవి. వ్యవసాయ దిగుబడి అల్పంగా ఉండేది. అందుకే మన ప్రాధాన్యతలు వేరుగా ఉండేవి. అప్పట్లో మన జనాభా 36 కోట్లు. ఇది ప్రపంచ జనాభాలో ఏడవ భాగంగా ఉండేది. మన సగటు తలసరి ఆదాయం తక్కువగా ఉండేది. మన ప్రజలు సగటు ఆదాయం ఆ రోజులలో అమెరికా ప్రజల సగటు ఆదాయంలో 15వ వంతుగా ఉండేది. ఇటువంటి పరిస్థితులలో దేశ ప్రజల సంక్షేమం కోసం, వరుసగా అనేక ప్రయత్నాలు చేశారు. అందుకే తొలి రోజులలో రక్షణ వ్యయానికి కేటాయింపులు అధికంగా చేసినా, వ్యవసాయ పారిశ్రామిక ఉత్పాదకత పెంచటానికి ప్రాధాన్యత ఇచ్చారు. 1952`53లో ఆహార ఉత్పత్తి పెరిగి, ధరలు తగ్గినప్పటికి మనం ఆహార వస్తువుల దిగుమతి కొనసాగించాల్సి వచ్చింది. 1955-57 మధ్యకాలంలో పారిశ్రామిక రంగం వృద్ధికి ప్రాధాన్యతనివ్వటంవల్ల 5 శాతం వార్షిక వృద్ధిరేటును సాధించగలిగాము. అప్పుడే రసాయన పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు, వినిమయ వస్తువుల పరిశ్రమలలో పెట్టుబడులు పెరిగాయి. ప్రభుత్వం విద్యారంగానికి కేటాయింపులు పెంచింది. ముఖ్యంగా మాధ్యమిక విద్య, ఆపైన విశ్వవిద్యాలయ విద్య వరకు, సాంకేతిక విద్యకు కేటాయింపులు పెంచారు. ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిల విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వటానికి రాష్ట్రాలకు నిధులు సమకూర్చారు. పేదరికం తగ్గించటానికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచటానికి ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్ల ప్రభుత్వ వ్యయం, అప్పులు పెరిగాయి. ప్రభుత్వం ప్రజలపై కొత్త పన్నులు విధించింది వ్యయపన్ను, ప్రయాణికు లపై పన్ను వంటి పన్నులను ప్రవేశపెట్టారు. ఎక్సైజ్‌ సుంకాలను 400 శాతానికి పెంచారు. ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేశారు. జీతాల ద్వారా, వ్యాపారం ద్వారా, వడ్డీల ద్వారా, అద్దెల ద్వారా వచ్చే ఆదాయాలను విడిగా గుర్తించి మదింపు చేసే ప్రక్రియను ప్రవేశపెట్టారు. 1958-60 మధ్యలో పారిశ్రామిక ఉత్పత్తి మందకొడిగా పెరిగినప్పటికీ ఇనుము, ఉక్కు, అల్యూమినియం వంటి ఉత్పత్తులు బాగా పెరిగాయి. అలాగే వాతావరణ పరిస్థితులు అనుకూలించటంవల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. దిగుమతులు తగ్గాయి. ఎగుమతులు పెరిగాయి. అయితే 1960`1965 మధ్యకాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంవల్ల మన వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు తగినంత దిగుబడులు రాలేదు. అందువల్ల అప్పటి ప్రభుత్వాలు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచేవి. పెట్టుబడులు పెంచేవి. ఉపాధి అవకాశాలు మెరుగుపరచటానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చేవి. 1947`1968 మధ్యకాలంలో మన దేశంలో ఆహార కొరత ఉండేది. ఆహారధాన్యాలకు విదేశాలపై ఆధారపడవలసి వచ్చేది. అందుకే అప్పటి ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌శాస్త్రి ప్రజలను వారానికి ఒకపూట భోజనం మానేయమని దేశప్రజలకు పిలుపు ఇచ్చారు. హరిత విప్లవానికి నాంది పలికారు. ఫÛలితంగా మనం ఆహార స్వావలంబన సాధించగలిగాము. 1950-51లో 135 మెట్రిక్‌ టన్నులుగా ఉన్న మన వ్యవసాయ ఉత్పత్తులు ప్రస్తుతం 1300 మెట్రిక్‌ టన్నులకు మించిపోయాయి. ఇది స్వతంత్ర భారతదేశంలో మనం సాధించిన విజయం. దేశంలో వ్యవసాయ పంటల భూమి విస్తీర్ణం స్వల్పంగా తగ్గినప్పటికీ ఉత్పత్తి పెరగటం సాధ్యపడిరదంటే అందులో సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు, విధానకర్తలు వంటి అనేక వర్గాల కృషి ఇమిడి ఉంది. 1970-75 మధ్యకాలంలో మన బడ్జెట్లు మెట్ట ప్రాంతాల వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాయి. అలాగే ఆహార పంటల విషయంలో స్వయంసమృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాయి.

1970లో ఆపరేషన్‌ ఫ్లడ్‌ – శ్వేత విప్లవం పేరుతో పాల ఉత్పత్తికి కూడా అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. 1950 నుంచి 1970వరకు దేశంలో పాల కొరత ఉండడంవల్ల మనం పాలను, పాల పొడిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. అప్పటి నుంచి జనాభా పెరిగినా సరే పాల ఉత్పత్తిని అంత కంటే వేగంగా పెంచగలిగాము. పాల ఉత్పత్తిలో 1970 అనంతరం మన వార్షిక వృద్ధిరేటు 6.4 శాతం వరకు పెరిగింది. అదే సమయంలో ప్రపంచ పాల ఉత్పత్తి సగటున 2.2 శాతం మాత్రమే ఉండేది. ఫలితంగా ప్రస్తుతం మన దేశంలో తలసరి పాల లభ్యత సగటున రోజుకు 400 గ్రాములు కాగా ప్రపంచ సగటు 300 గ్రాములు మాత్రమే. దేశంలో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టడంతోపాటు 1966లోనే రైతుల కోసం ఎంఎస్పీ విధానాన్ని ప్రవేశ పెట్టారు. రైతులకు వారి పంటలపై కనీస మద్దతు ధర లభించే విధంగా చర్యలు చేపట్టారు. స్వాతంత్య్రా నంతరం మన దేశంలో దాదాపు 6 వేల రకాల అధిక ఉత్పాదక వంగడాలను అభివృద్ధి చేశారు. 1970-75 మధ్యకాలంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచటానికి, పాలు తదితర నిత్యావసర వస్తువుల ఉత్పత్తి పెంచటానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదేసమయంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు పెట్టుబడులు సమకూర్చే దిశగా వ్యవస్థీకృత పరపతి అందుబాటులో ఉంచటానికి ప్రయత్నాలు చేశారు. సంక్షేమ రంగానికి కూడా తగు ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రజలకు త్రాగునీటి సదుపాయం కల్పించారు. బీమా సౌకర్యాలను మెరుగుపరచటానికి జనరల్‌ ఇన్సూరెన్స్‌ను జాతీయం చేశారు. బొగ్గు, రాగి గనులను జాతీయం చేశారు. పౌరులకు పింఛను పథకాన్ని ప్రవేశపెట్టారు. 1975-80 మధ్య కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లు సైతం వ్యవసాయ రంగానికే ప్రాధాన్యతను ఇచ్చాయి. అందులో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటం, ఎరువుల వినిమయాన్ని నియంత్రిస్తూనే రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడటం, భూగర్భ జలాల సమర్థ వినియోగాన్ని ప్రోత్సహించటం, రైతు సేవా సంఘాలను ప్రారంభించటం వంటి విధానాలను అమలుజరిపారు. ఆహార సబ్సిడీకి కేటాయింపులు కూడా గణనీయంగా పెంచారు. కేటాయింపును రూ.295 కోట్లకు చేర్చారు. ప్రజారోగ్యానికి తగిన ప్రాధాన్యతను ఇచ్చారు. విదేశీమారక ద్రవ్యాన్ని నియంత్రించడానికి 1973లో విదేశీమారక ద్రవ్య నియంత్రణ యాక్టు ` ఫెరాను అమలు చేశారు. అదే సమయంలో ఉద్యోగభద్రత, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని నష్టాలలో నడిచే అనేక కంపెనీలను ముఖ్యంగా వస్త్ర తయారీ మిల్లులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ సంస్థలను మూతపడకుండా కాపాడిరది.

1969లో 14 ప్రధాన బ్యాంకుల జాతీయ కరణలో మొదలైన ప్రభుత్వ జాతీయకరణ విధానం 1980వరకు కొనసాగుతూనే ఉన్నది. 1979లో పారిశ్రామిక విధానాన్ని సమీక్షించి చిన్న మరియు సూక్ష్మ సంస్థల వృద్ధికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చిన్న, కుటీర పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత కల్పించటం జరిగింది. అప్పటికే అమలులో ఉన్న ఎంఏటీపీసీ చట్టాన్ని ఉపయోగించి పెద్ద వ్యాపార సంస్థలు చిన్నతరహా, కుటీర, సూక్ష్మ పరిశ్రమల ప్రయోజనాలు దెబ్బతీయకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. 1980-85 మధ్య కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇచ్చారు. అదే కాలంలో పేదరిక నిర్మూలనకు 20 అంశాల కార్యక్రమాన్ని అమలు చేశారు. లైసెన్సు విధానాలలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. దిగుమతు లను తగ్గించటానికి ప్రయత్నాలు చేశారు. మన భాగ్యనగరంలో వరి పరిశోధన డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేశారు. అలా అనేక చర్యల ద్వారా ఆర్థిక వృద్ధికి కృషిచేశారు. 1985`90 కాలంలో సంస్కరణలకు మరింత ప్రాధాన్యతను ఇచ్చారు. లైసెన్సు విధానాన్ని రద్దు చేశారు. మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ `ఎంటీఎన్‌ఎల్‌ వంటి సంస్థలను స్థాపించారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో అమలు జరిపిన సోషలిస్టు విధానాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత వేగంగా వృద్ధి చెందలేదు. దిగుమతులు పెరిగాయి. ఎగుమతులు తగ్గాయి. ప్రభుత్వం స్వల్పకాలిక ఋణాలపై ఆధార పడవలసి వచ్చింది. ఆదాయాన్ని పెంచుకోవటానికి మినిమమ్‌ ఆల్టర్‌నేట్‌ ట్యాక్స్‌-కనీస ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని అమలు జరిపారు. అయినా ద్రవ్యలోటు గణనీయంగా పెరిగింది.

1990 నాటికి మన ఆర్థిక పరిస్థితి సంక్షోభం అంచులకు చేరింది. అందువల్ల 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేయవలసి వచ్చింది. మన స్వాతంత్య్రానంతరం ఆర్థిక ప్రస్థానంలో 1991కి ముందు, ఆ తరువాత అనే విధంగా విశ్లేషించవలసి వచ్చింది. ఆర్థిక సంస్కర ణలు.. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే మూడు ప్రధాన అంశాల ద్వారా అమలులోకి వచ్చాయి. పన్నుల చట్టాలలో మార్పులు చేసి పన్ను రేట్లు తగ్గించారు. దిగుమతి సుంకాలు తగ్గించారు. 1994లో సేవల పన్నును ప్రవేశపెట్టారు. నల్లధనాన్ని వెలికి తీయటానికి స్వచ్ఛంద ఆదాయ బహిర్గతం పథకాన్ని అమలుచేశారు. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించారు. ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించారు. ప్రపంచంలో అప్పుడే ఊపందుకుంటున్న ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ – ఐసీటీ విప్లవంలో భారత్‌ ప్రముఖ పాత్ర పోషించేలా విధానపరమైన మార్పులను తీసుకొని వచ్చారు. పరిశ్రమలకు అనుకూలమైన పద్ధతులను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను క్రమంగా ప్రైవేటీక రించటం మొదలుపెట్టారు.

అంతర్జాతీయ వాణిజ్యంలో అడ్డంకులను గుర్తించారు. వాటిని సవరించటం మొదలుపెట్టారు. ఫలితంగా మన అభివృద్ధి వేగాన్ని పుంజుకుంది. నేడు ప్రపంచంలో నాల్గవ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. అయితే ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన అనంతరం 2014 నాటికి, మౌలికమైన కొన్ని అంశాలతో మన ఆర్థిక వ్యవస్థ మళ్లీ సమస్యాత్మకంగా మారింది. ముఖ్యంగా 2009-2014 మధ్య కాలంలో ద్రవ్యలోటు, రెవెన్యూలోటు భారీగా పెరిగాయి. దీనికితోడు ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఒక దశలో 12.3 శాతానికి చేరింది. అలాగే జాతీయ బ్యాంకులలో నిరర్థక ఆస్తులు అంటే మొండి బకాయిలు భారీగా పెరిగాయి. ఆర్థిక సంస్కరణల అనంతరం ప్రభుత్వరంగ బ్యాంకులలో నిరర్థక ఆస్తులు 1999 నాటికి 16 శాతానికి చేరాయి. ప్రభుత్వం బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చటం, బ్యాంకింగ్‌ రంగంలో మార్పులు చేయటం, ఇతర ప్రయత్నాలవల్ల 2004 నాటికి 7.8 శాతానికి తగ్గాయి. కాని మళ్లీ ఈ మొండి బకాయిలు భారీగా పెరిగి సెప్టెంబర్‌ 2013 నాటికి 12.3 శాతానికి చేరాయి. దానికి తోడు కొన్ని మొండి బకాయిలను దాచిపెట్టటం కూడా జరిగింది. రెవెన్యూ లోటు పెరిగింది. ఒక దశలో అది మన స్థూల జాతీయ ఉత్పత్తిలో 5.3 శాతానికి చేరింది. 2009-13 మధ్య కాలంలో రెవెన్యూ లోటు మదింపులో కూడా ఆక్షేపణకరమైన పద్ధతులు అవలంభించారు. ఉదాహరణకు సబ్సిడీలకు బదులుగా ప్రభుత్వరంగ చమురు సంస్థలు, భారత ఆహార సంస్థలు వంటి వాటికి ఇచ్చిన రూ.1.9 లక్షల కోట్లను రెవెన్యూ లోటు మదింపులో పరిగణనలోకి తీసుకోలేదు.

ఒకవైపు ప్రభుత్వం భారీగా అప్పులు చేసినప్పటికి ప్రభుత్వ పెట్టుబడి వ్యయం బాగా తగ్గి ఆ మొత్తం ప్రభుత్వ వ్యయంలో 16 శాతానికి చేరింది. 2014 తర్వాత కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం, చట్టాలను సవరించటం, విధానపరమైన మార్పులు చేయటం వంటి అనేక సంస్కరణలతో ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడిరది. మొండి బకాయిలు తగ్గాయి, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు తగ్గుముఖం పట్టింది. పెట్టుబడి వ్యయం పెరిగింది, పేదరికం తగ్గింది. అంతేకాకుండా మన మౌలిక సదుపాయాల రంగం ముఖ్యంగా జాతీయ రహదారులు, ఓడరేవులు మెరుగు పడ్డాయి. విద్యుత్‌ ఉత్పత్తి పెరిగింది. దేశంలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. సగటు జీవితకాలం కూడా స్వాతంత్య్రానంతరం బాగా పెరిగి ఇప్పుడు 70 ఏళ్లకు మించింది. భారత్‌ దశాబ్దాల తరబడి చేసిన సుదీర్ఘ ప్రస్థానంలో ప్రకృతి విపత్తులు, దాడులు, యుద్ధాలు, అంతర్జాతీయ సంక్షోభం ఎదుర్కొంది. ప్రపంచంలో నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.


మన ఆదాయపు పన్నుల రేట్ల ప్రస్థానం

–        1949-50లో జాన్‌ముత్తాయ్‌ ఆదాయపు పన్ను రేట్లను రూ.10వేల వరకు ఉన్న ఆదాయంపై రెండు శ్లాబ్‌లలో తగ్గించారు. మొదటి శ్లాబ్‌లో ఒక అణా నుంచి 9 పైసలకు, రెండవ శ్లాబ్‌కు రెండు అణాల నుంచి ఒక అణా 9 పైసలకు తగ్గించారు

–         1971-72లో ఆదాయపుపన్ను 93.05 శాతానికి పెంచారు. అది మరింతగా పెరిగి 1975 నాటికి 97.75 శాతానికి చేరుకుంది. భారతదేశ చరిత్రలో ఇదే అత్యంత అధిక ఆదాయపు పన్ను.

–        1974-75లో వై.బి.చవాన్‌ ఆదాయపు పన్నును 97.75 శాతం నుండి 75శాతానికి తగ్గించారు. రూ.70వేల ఆదాయం కలిగినవారు 70 శాతం పన్ను 10 శాతం సర్‌చార్జ్‌, వెరసి 77 శాతం కట్టాల్సి వచ్చేది.

–        1985-86లో వి.పి.సింగ్‌ ఆదాయపు పన్నును 8 శ్లాబుల నుంచి 4 శ్లాబులకు కుదించారు. పన్ను రేటును 50 శాతానికి తగ్గించారు.

–       1992-93లో మన్మోహన్‌సింగ్‌ ఆదాయపు పన్నును 40 శాతానికి తగ్గించారు.

–        1997-98 చిదంబరం ఆదాయపు పన్ను శ్లాబులను 10, 20, 30 శాతానికి మార్చారు. అంటే అత్యధిక పన్ను రేటు 30శాతం మాత్రమే. ఆ                          తదుపరి ప్రణబ్‌ముఖర్జీ కూడా కొన్ని సవరణలతో అవే శ్లాబ్‌లు కొనసాగించారు.

–        2014-15లో అరుణ్‌జైట్లీ సంపద పన్ను రద్దు చేశారు. అలాగే ఆదాయపు పన్ను శ్లాబ్‌లో తక్కువ రేటైన 10 శాతాన్ని 5 శాతానికి తగ్గించారు.

–         2022-21లో నిర్మలాసీతారామన్‌ పన్ను రేటు తగ్గించనప్పటికి మదింపు విధానంలో సమూలమైన మార్పులు చేశారు


                                                                            1950 – 51                      2023 – 24

భారత్‌ జీడీపీ.. ప్రస్తుత ధరలలో                రూ.1018.1 కోట్లు              రూ.330.68 లక్షల కోట్లు

(స్థూలజాతీయ ఉత్పత్తి)

జనాభా (కోట్లలో)                                                    36.11                             145

తలసరి ఆదాయం                                             రూ.265                              రూ.1,84,205

కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల ఆదాయం      రూ.237 కోట్లు            రూ.19.58 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నుల ఆదాయం        రూ.396 కోట్లు         రూ.15.37 లక్షల కోట్లు

స్థూల జాతీయ ఉత్పత్తిలో పన్నుల శాతం          3.59                             12

రెవెన్యూలోటు (కోట్లలో)                                       రూ.0.24                     రూ.7,65,216

ద్రవ్యలోటు (కోట్లలో)                                    రూ.134                             రూ.16,54,643

ప్రభుత్వ అప్పులు (కోట్లలో)                          రూ.2865.40                రూ.200.16 లక్షలు


మన ఉత్పాదకత నాడు – నేడు

                                                                   1950-51           2024-25

ఆహార ధాన్యాలు (మెట్రిక్‌ టన్నుల్లో)      51                    353.96

కూరగాయలు, పళ్లు (మెట్రిక్‌ టన్నుల్లో)    25              334.19

పాలు (మెట్రిక్‌ టన్నుల్లో)                        17                   239.30

కోడిగుడ్లు (వందకోట్లలో)                          1.8                142.77

చేపలు (మెట్రిక్‌ టన్నుల్లో)                  0.3                      19.5

చెరకు (పంచదార) (మెట్రిక్‌ టన్నుల్లో)     57.05           439.9

పప్పులు (మెట్రిక్‌ టన్నుల్లో)                8.41                    24.5

నూనెగింజలు (మెట్రిక్‌ టన్నుల్లో)       5.16            44.7

  • సాయి, ఆర్థిక నిపుణులు

About Author

By editor

Twitter
YOUTUBE