కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నా స్వాతంత్య్ర కాంక్ష వీడని దేశభక్తుల ఆకాంక్ష నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చింది. అండమాన్‌లోని సెల్యులార్‌ ‌జైలుతో పాటు ఇంకొన్ని కూడా మన యోధులను హింసించాయి. భారత స్వరాజ్య సమరానికీ, జైళ్లకీ అవినాభావ సంబంధం ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.


మాండలే జైలు

ఇది నేటి మైన్మార్‌ (‌పాత బర్మా)లో ఉంది. అటు అండమాన్‌కు, ఇటు మాండలేకు ఉద్యమ కారులను పంపించడంలో ఉద్దేశం, వారిని ప్రధాన గడ్డకు దూరంగా ఉంచడమే.ఇది కూడా కేంద్ర కారాగారమే. 4,833 మంది ఖైదీలను ఇక్కడ నిర్బంధించవచ్చు. మాండలే పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు బాలగంగాధర తిలక్‌. ఆయన ఇక్కడ ఆరేళ్లు శిక్ష అనుభవించారు. భగవద్గీతకు ఆయన వ్యాఖ్యానం గీతా రహస్యం ఇక్కడే అవతరించింది. కలకత్తా జైలు నుంచి సుభాశ్‌చంద్ర బోస్‌ను ఈ జైలుకు తరలించిన తరువాత ఆయనకు క్షయ వ్యాధి సోకింది. అందుకు లోపల ఉన్న వాతావరణమే కారణం. అయినా తిలక్‌, ‌లాలా లాజ్‌పతిరాయ్‌ ‌వంటివారిని బంధించిన జైలులోనే తనను ఉంచడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేవారాయన. జనవరి 25, 1925 అర్ధరాత్రి బోస్‌ను ఇక్కడకు తీసుకు వచ్చారు. మూడేళ్లు ఉంచారు.


వైపర్‌ ‌చైన్‌ ‌గ్యాంగ్‌ ‌జైలు

ఇది కూడా అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులలోనిదే. దక్షిణ అండమాన్‌లో ఉంది. 1789లో అండమాన్‌ ‌దీవులకు లెఫ్టినెంట్‌ ఆర్చిబాల్డ్ ‌హెచ్‌ఎంఎస్‌ ‌వైపర్‌ అనే నౌక మీద వచ్చాడు. ఆ నౌక పేరు ఈ దీవికి పెట్టారు. నిజానికి ఆ నౌక ప్రమాదానికి గురై, ఈ దీవికి చేరిందని కూడా అంటారు. ఇక్కడ 1864-67 మధ్య లెఫ్టినెంట్‌ ‌బార్నెట్‌ ‌నాయకత్వంలో జైలును (శిక్షా స్థావరం) నిర్మించారు. దీనికే వైపర్‌ ‌చైన్‌ ‌గ్యాంగ్‌ ‌జైలు అన్న పేరు వచ్చింది. ఇక్కడకు తీసుకువచ్చిన ఖైదీలను రాత్రి వేళ గొలుసులతో కలిపి కట్టివేసేవారు. అందుకే ఆ పేరు వచ్చింది. అండమాన్‌ ‌జైలుకు వచ్చిన కాఠిన్యానికి ఇదే ప్రేరణ అయి ఉండాలి. ఇక్కడ స్త్రీలను కూడా శిక్ష కోసం తీసుకువచ్చారని తెలుస్తున్నది. ఈ జైలుకు రెండు మూడు రకాలుగా కీర్తి ఉంది. పూరి మహారాజు కిశోర్‌సింగ్‌ ‌దేవ్‌ను ఇక్కడే బంధించారు. ఆయన ఇక్కడే 1879లో చనిపోయారు. వైస్రాయ్‌ ‌లార్డ్ ‌మేయోను హత్య చేసిన పెషావర్‌ ‌వీరుడు షేర్‌ అలీ అఫ్రీదిని ఫిబ్రవరి 8, 1872న సమీపంలోని ఛాథమ్‌ ‌దీవిలో ఉరి తీశారు. 1906లో సెల్యులార్‌ ‌జైలు ఉపయోగంలోకి వచ్చిన తరువాత ఇది ప్రాధాన్యం కోల్పోయింది.


ఆగాఖాన్‌ ‌భవనం

ఇది పూనా (నేటి పుణే)లో ఉంది. సుల్తాన్‌ ‌మహమ్మద్‌ ‌షా మూడో ఆగాఖాన్‌ ‌దీనిని 1892లో నిర్మించాడు. దుర్భిక్షం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలు తల్లడిల్లిపోతున్న సమయంలో ఆగాఖాన్‌ ‌వారి ఉపాధి కల్పన కోసం ఈ భవనం నిర్మించాడు. దీనిని బ్రిటిష్‌ ‌ప్రభుత్వం స్వరాజ్య సమరయోధులను నిర్బంధించడానికి ఉపయోగించుకుంది. ఇప్పుడు దీనిని కస్తూర్బా గాంధీకి అంకితం చేశారు. 1942 నాటి క్విట్‌ ఇం‌డియా ఉద్యమం సమయంలో అరెస్టయిన గాంధీజీ, కస్తూర్బా, మహదేవ దేశాయ్‌, ‌సరోజినీ నాయుడు వంటి వారందరినీ ఇక్కడే నిర్బంధంలో ఉంచారు. కస్తూర్బా ఇక్కడే కన్నుమూశారు. ఈ భవనం జాతీయ ప్రాధాన్యం కలిగినదిగా 2003లో పురావస్తు సర్వే శాఖ ప్రకటించింది.


సబర్మతి కేంద్ర కారాగారం

1891 నుంచి 1894 మధ్య నిర్మించిన సబర్మతి కేంద్ర కారాగారం అహ్మదాబాద్‌లో ఉంది. 114 ఏళ్లుగా ఉపయోగంలోనే ఉంది. మార్చి 7,1930న గాంధీజీ దండి సత్యాగ్రహం ప్రారంభించిన తరువాత సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయి పటేల్‌ను బ్రిటిష్‌ ‌ప్రభుత్వం అరెస్టు చేసి ఈ జైలులోనే ఉంచారు. సమీపంలోని రస్‌ అనే గ్రామంలో ప్రసంగిస్తుండగా అరెస్టయ్యారు. పటేల్‌ అరెస్టుతోనే ఆ ఉద్యమం నిలిచిపోతుందని ప్రభుత్వం భావించినా అలా జరగలేదు.


అహమ్మద్‌నగర్‌ ‌కోట

ఇది నిజాం షాహి సుల్తాన్‌ ‌రాజధానిగా ఉండేది. 15వ శతాబ్దంలో మాలిక్‌ అహ్మద్‌ ‌నిజాం షాహీ నిర్మించాడు. తరువాత మరాఠాల చేతికి వెళ్లిన ఈ కోటను 1803లో ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. ఏడువేల మంది భిల్లు తెగ గిరిజనులతో దీనికి సమీపంలోనే ప్రభుత్వం మీద తిరుగుబాటు జరిగింది. తరువాత దేశంలో ఉద్యమాలు పెరిగి పోవడంతో ఈ కోటనే ఆంగ్లేయులు జైలుగా మార్చారు. జవాహర్‌లాల్‌ ‌నెహ్రూను ఇక్కడే నిర్బంధించారు. ఆయన ఇక్కడే ‘డిస్కవరీ ఆఫ్‌ ఇం‌డియా’ పుస్తకం రాశారు. ఇవన్నీ ఇందిరకు రాసిన లేఖలు.


మియాన్‌వాలి కేంద్ర కారాగారం

1929లో ఢిల్లీలోని జాతీయ అసెంబ్లీలో బాంబులు వేసిన తరువాత భగత్‌సింగ్‌, ‌బటుకేశ్వర్‌ ‌దత్‌లను, ఇతర అనుచరులను బంధించిన జైలు ఇదే. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ‌భాగంలో ఉంది. ఇక్కడ చూపుతున్న జాతి వివక్షకు నిరసనగా వారు 116 రోజుల పాటు నిరాహార దీక్ష చేయవలసి వచ్చింది.


హిజ్లీ నిర్బంధ శిబిరం

1950 ఖరగ్‌పూర్‌లో ఐఐటీ సంస్థను స్థాపించిన భవనం ఒకనాడు భారత విప్లవవీరులను బంధించిన కారాగారమే. అదే హిజ్లీ నిర్బంధ శిబిరం. 1930లో దీనిని ఏర్పాటు చేశారు. 1931లో ఇద్దరు జైలు అధికారులు కాల్పులు జరపడంతో సంతోష్‌ ‌కుమార్‌ ‌మిత్రా, తారకేశ్వర్‌ ‌సేన్‌ ‌గుప్తా అనే ఇద్దరు స్వాతంత్య్ర సమర యోధులు చనిపోయారు. ఈ చర్యకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమయింది. రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌, ‌సుభాశ్‌చంద్ర బోస్‌ ‌కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తరువాత ఆ మృతవీరుల భౌతిక కాయాలను తీసుకురావడానికి బోస్‌ ‌స్వయంగా వెళ్లారు. ఈ విషాదమే బోస్‌ ‌తీవ్రంగా కదిలించిందని చెబుతారు. 1942లో దీనిని మూసివేశారు.


యరవాడ కేంద్ర కారాగారం

ఇది మహారాష్ట్రలోనే అతి పెద్ద కేంద్ర కారాగారం. 1871లో నిర్మించారు. పూనా నగర శివార్లలోనే కోడిగుడ్డ ఆకృతిలో కట్టారు. అందుకే అండాసెల్‌ అం‌టారు. అత్యంత ప్రమాదకర వ్యక్తులుగా భావించిన ఉద్యమకారులను ఇక్కడకు తరలించేవారు. తిలక్‌, ‌బోస్‌, ‌గాంధీజీ, నెహ్రూ ఇక్కడ కొద్దికాలం ఉండవలసి వచ్చింది. గాంధీజీ, డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌మధ్య 1932 నాటి పూనా ఒప్పందం ఈ జైలులోనే జరిగింది.

About Author

By editor

Twitter
YOUTUBE