రష్యాపై ఉక్రెయిన్‌ ‌దాడి.. 700   కోట్ల డాలర్ల విలువైన బాంబర్లు ధ్వంసం!

ఒక్కొక్క డ్రోన్‌ ‌ఖరీదు 1200 డాలర్లు ఉంటుంది. అలాంటి 117 డ్రోన్లు ఒక్క చోట చేరాయి. కడుపులో పేలుడు పదార్థాలను కుక్కుకొని ట్రక్కుల్లో చెక్కతో చేసిన కంటైనర్లలో దాక్కున్నాయి.బైటకు రావడానికి సమయం కోసం వేచి చూస్తున్నాయి. జూన్‌ 1‌వ తేదీ.. ఆదివారం. అందరికీ హాలిడే. కానీ దాగి ఉన్న డ్రోన్లకు మాత్రం వర్కింగ్‌ ‌డే. ఎవరో రిమోట్‌ ‌కంట్రోల్‌తో ఆపరేట్‌ ‌చేసినట్టుగా కంటైనర్‌ల తలుపులు తెరుచుకున్నాయి. వాటితో పాటే ట్రక్కు పైన ఉన్న తలుపులు కూడా. డ్రోన్లు గాల్లోకి లేచాయి. వీరవిహారం చేశాయి. కంటికి (రిమోట్‌) ‌కనిపించిన యుద్ధ విమానాలపై పేలుడు పదార్థాలతో దాడి చేశాయి. అలా కొద్ది గంటలపాటు విధ్వంసం సృష్టించాయి. రష్యాకు చెందిన 40కి పైగా యుద్ధ విమానాలను తీవ్రంగా దెబ్బతీయడం లేదా ధ్వంసం చేయడం చేశాయి. తలా 1200 డాలర్ల ఖరీదు చేసే 117 డ్రోన్లు 40కి పైగా రష్యా యుద్ధ విమానాల మీద దాడి చేస్తే రష్యాకు జరిగిన నష్టం దాదాపు 700 కోట్ల డాలర్లు! ఈ మాట అన్నది నష్టపోయిన రష్యా కాదు డ్రోన్లను శత్రుదేశం మీదకు ఉసిగొల్పిన ఉక్రెయిన్‌కు చెందిన ఉక్రెయిన్‌ ‌సెక్యూరిటీ సర్వీస్‌ – ఎస్‌బీయూ. మెరుపుదాడి అన్నట్టుగా ఇంత భారీగా ఎత్తున జరిగిన ఆపరేషన్‌కు పెట్టిన పేరు స్పైడర్‌ ‌వెబ్‌. ‌మానవ సమాజంలో ఇప్పటిదాకా జరిగిన యుద్ధాల తీరుతెన్నులను ఔపాసన పట్టిన నిపుణులు ఆపరేషన్‌ ‌స్పైడర్స్ ‌వెబ్‌ను ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన పెరల్‌ ‌హార్బర్‌తో పోలుస్తున్నారు. డిసెంబర్‌ 7, 1941‌న జపాన్‌ ‌వైమానిక దళం హవాయిలోని పెరల్‌ ‌హార్బర్‌లో అమెరికా నావిక స్థావరంపై మెరుపుదాడి చేసింది. ఇది అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి అడుగుపెట్టడానికి దారి తీసింది.

‌మరికొద్ది గంటల్లో రెండవ విడత శాంతి చర్చలు జరుగుతాయనగా రష్యాపై ఉక్రెయిన్‌ ‌విరుచు కుపడింది. వందకుపై డ్రోన్లతో మెరుపుదాడులు చేసింది. కీలక వైమానిక స్థావరాలే లక్ష్యంగా ప్రతీకారానికి దిగింది. రష్యా భూభాగంలోకి డ్రోన్లతో కూడిన ట్రక్కులను వ్యూహాత్మకంగా తరలించింది. వైమానిక స్థావరాలకు చేరువలో వాటిని మోహ రించింది. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లను ప్రయోగించడం ద్వారా శక్తిమంతమైన రష్యన్‌ ‌బాంబర్‌ ‌యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. ఒలెన్యా, బెలయా సహా నాలుగు సైనిక స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ముర్‌మున్స్ ‌నగరంలోని పెట్రోల్‌ ‌బంక్‌ ‌వద్ద నిలిపి ఉంచిన ఓ ట్రక్కు వెనుకభాగం నుంచి డ్రోన్లు పక్షుల్లా ఎగిరాయని స్థానిక మీడియా వెల్లడించింది. ట్రక్‌ ‌డ్రైవర్‌ను రష్యా అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సైబీరియాలోనూ ఇలాంటి ఘటనే పునరావృతమైంది.

తూర్పు సైబీరియా సరిహద్దులోని సైనిక స్థావరాలే లక్ష్యంగా సుదీర్ఘంగా ప్రయాణించగల డ్రోన్లను ప్రయోగించినట్టు ఉక్రెయిన్‌ ‌సెక్యూరిటీ సర్వీసెస్‌ – ఎస్‌బీయూ అధికారికంగా వెల్లడించింది. ఉక్రెయిన్‌పై దాడి కోసమని మోహరించిన దీర్ఘ శ్రేణి క్షిపణులను తునాతునకలు చేసినట్టు తెలిపింది. మరోవైపు రష్యాలోని ఇర్కుట్స్  ‌గవర్నర్‌ ఇగోర్‌ ‌కొబ్జెవ్‌ ‌డ్రోన్‌ ‌దాడులను ధ్రువీకరించారు. ఆ దేశానికి చెందిన రిమోట్‌ ‌పైలట్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్ ‌తమ సైనిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఉక్రెయిన్‌ ‌సరిహద్దు నుంచి రష్యా భూభాగంలో 4,300 కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను డ్రోన్లు ఛేదించినట్టు ఎస్‌బీయూ తెలిపింది.ముర్‌మాన్స్ ‌నగరంలోని ఒలెన్యా వైమానిక స్థావరం వద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, భారీ ఎత్తున పొగలు ఎగసిపడ్డాయని, గంటలతరబడి మంటలు రేగుతూనే ఉన్నాయని బెలారస్‌ ‌న్యూస్‌ ‌మీడియా ఏజెన్సీ నెక్స్‌ట్రా తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను ఎక్స్‌లో షేర్‌ ‌చేసింది.ఉక్రెయిన్‌ ‌మీడియా ప్రకారం ఆపరేషన్‌ ‌స్పైడర్‌ ‌వెబ్‌లో 40కి పైగా బాంబర్‌ ‌యుద్ధ విమానాలు ధ్వంసమైపోయాయి. వాటిలో నాలుగు టీయూ- 95ఎంఎస్‌, ‌టీయూ-22ఎఎం3 బాంబర్లు, కీలకమైన ఎ-50 యుద్ధవిమానం ధ్వంసమైనట్టు సమాచారం. అదే సమయంలో డ్రోన్ల దాడికి గురైన ఒలెన్యా వైమానిక స్థావరం రష్యాకు ఎంతో ముఖ్యమైనది. అణ్వాయుధాలను మోసుకెళ్లే యుద్ధ విమానాలను ఇక్కడే మోహరిస్తారు. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఇంత భారీ స్థాయిలో రష్యాపై ఉక్రెయిన్‌ ‌దాడులకు దిగడం ఇదే మొదటిసారి. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు రష్యా మీడియాలోనూ ప్రసారమయ్యాయి.

దాడులకు ప్రణాళిక చేసిన వైనం అత్యంత ఆసక్తికరమైనది. కార్గో ట్రక్కులపై చెక్క షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ షెడ్ల లోపల ప్రత్యేక బాక్స్‌లలో డ్రోన్లను దాచి ఉంచారు. అవసరమైనప్పుడు ఈ ట్రక్కులపై కప్పులు రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌ద్వారా తెరుచు కుంటాయి. ఆ వెంటనే డ్రోన్లు ఆకాశంలోకి ఎగురుతూ లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. ఉక్రెయిన్‌కు రష్యా తరహాలో శక్తిమంతమైన, విస్తారమైన క్షిపణి సామర్థ్యాలు లేవు. అందుకునే అది పూర్తిగా డ్రోన్లపైనే ఆధారపడుతూ ఉంటుంది. గతంలోనూ రష్యా సైనిక స్థావరాలపైన, చమురు శుద్ధి కర్మాగారాలపైన చేసిన దాడుల్లోనూ డ్రోన్లను వినియోగిచింది.

కాగా ఉక్రెయిన్‌ ఆపరేషన్‌ ‌స్పైడర్‌ ‌వెబ్‌ ‌చేపట్టిన రోజునే ఆ దేశానికి చెందిన సైనిక శిక్షణా కేంద్రంపై రష్యాకు చెందిన క్షిపణి దాడి చేసింది. దాడిలో 12 మంది సైనికులు మరణించగా, 60 మందికిపైగా గాయపడ్డారని ఉక్రెయిన్‌ ‌సైన్యం తెలిపింది.

రష్యన్ల సాయంతో ఆపరేషన్‌ ‌విజయవంతం

ఆపరేషన్‌ ‌ముగిసిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా సైనిక స్థావరాలే లక్ష్యంగా చేపట్టిన దాడిలో 40కి పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమై పోయాయని తెలిపారు. ఆపరేషన్‌ను విజయవంతం చేసిన సాయుధ దళాలు, తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఈ ఆపరేషన్‌కు 18 నెలలుగా ప్రణాళిక చేశాం. మొత్తం 117 డ్రోన్లను వినియోగించాం. ఈ దాడిలో రష్యాకు గణనీయమైన నష్టం జరిగింది. ఆ దేశానికి అలా జరగాల్సిందే. ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్‌ అని నేను కచ్చితంగా చెబుతున్నాను. రష్యా వైమానిక స్థావరాల్లో వ్యూహాత్మక క్రూయిజ్‌ ‌క్షిపణి వాహక నౌకలలో 34 శాతాన్ని ధ్వంసం చేశాం’’ అని ఆయన వివరించారు. ఆపరేషన్‌ ‌గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తూ ‘‘ఈ ఆపరేషన్‌ ‌గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్పాలి. మేం ఆపరేషన్‌ ‌చేపట్టిన కార్యాలయం రష్యా భూభాగంలోని రష్యా సమాఖ్యకు చెందిన ఫెడరల్‌ ‌సెక్యూరిటీ సర్వీస్‌ – ఎఫ్‌ఎస్‌బీ కార్యాలయానికి దగ్గరలోనే ఉంది.

ఆపరేషన్‌లో రష్యా దేశస్తులు కూడా పాల్గొన్నారు. వారు మా వద్ద భద్రంగా ఉన్నారు’’ అని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ ‌చేపట్టడానికి ముందే రష్యా మరో దాడికి సిద్ధమవుతోందనే సమాచారం తమకు అందిందని తెలిపారు. రోజురోజూకు దాడులు పెంచుకుంటూ పోయిన రష్యా కేవలం రెండు రోజుల్లో 500 డ్రోన్లను ఉక్రెయిన్‌పైకి పంపించిందని చెప్పారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ ‌భూభాగాన్ని, ప్రజలను రక్షించుకుంటామని ఆయన తెలిపారు.

మారిన రణతంత్రం.. పోరులో డ్రోన్లదే రాజ్యం

ఉక్రెయిన్‌ ‌చేపట్టిన ఆపరేషన్‌ ‌సైడర్‌ ‌వెబ్‌ ‌ప్రపంచపు యుద్ధతంత్రపు పాఠ్యప్రణాళికలో కొత్త పాఠాలను చేర్చింది. భారీతనం, లక్ష్యాలను చేరుకోవడం, సంక్లిష్టతలపరంగా చూస్తే ఆధునిక ప్రపంచ చరిత్రలో అతిపెద్ద దాడిని ఉక్రెయిన్‌ ‌చేపట్టింది. మూడు టైమ్‌ ‌జోన్లలో, 6,000 కి.మీ.ల పరిధిలో వేర్వేరు చోట్ల ఉన్న రెండు వైమానిక స్థావరాలపై దాడి చేసింది. ప్రత్యేక ఆపరేషన్లకు సంబంధించి అడ్మిరల్‌ ‌విలియమ్‌ ‌మెక్‌ ‌రావెన్‌ ‌ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం ఒక సులభమైన ప్రణాళికను అత్యత గోప్యంగా ఉంచి, ఒకటికి పదిసార్లు రిహార్సల్‌ ‌చేసి, అత్యంత వేగంగా, ప్రయో జనం సిద్ధించేలా, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉక్రెయిన్‌ ‌పనికానిచ్చింది. కేవలం రిమోట్‌ ‌కంట్రోల్‌తో జరిగిన ఇంత పెద్ద ఆపరేషన్‌లో ఉక్రెయిన్‌ ‌జవాన్లెవరూ రష్యాకు బందీలు కాకపోవడం విశేషం.

ఇదిలా ఉండగా మొదట్నుంచీ రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధాన్ని రష్యా, నాటో కూటమి మధ్య జరుగుతున్న ఒక పరోక్ష యుద్ధమనే వాదనైతే అంతటా వినిపిస్తోంది. అందుకు నిదర్శనం అన్నట్టుగా పశ్చిమ దేశాలు సరఫరా చేసిన ఆయుధాలను, కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థలను ఉక్రెయిన్‌ ‌వాడుతూ వస్తోంది. అయితే స్పైడర్‌ ‌వెబ్‌ ‌విషయానికి వచ్చేసరికి నాటో లేదా పశ్చిమ దేశాల ప్రమేయం లేకుండానే సొంతంగా దాడులకు దిగినట్టు ఉక్రెయిన్‌ ‌ప్రకటించింది. దేశాధ్యక్షుడు  జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ ‌సొంతంగా ఫలితం సాధించిందని ఎక్స్‌లో పోస్టు చేశారు. దాడిలో దేశీయంగా తయారుచేసిన డ్రోన్లను వాడారు. పశ్చిమ దేశాలు సరఫరాచేసే దీర్ఘశ్రేణి టారస్‌ ‌తరహా క్షిపణులను వాడలేదు. బహిరంగ ప్రదేశంలో నిలిపి ఉంచిన బాంబర్‌ ‌విమానాలపై కచ్చితంగా దాడిచేయ డానికి వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న హై-రెసొల్యూషన్‌ ‌శాటిలైట్‌ ఇమేజ్‌లను ఉక్రెయిన్‌ ‌వాడింది. వాటిని సోషల్‌ ‌మీడియాలో షేర్‌ ‌చేసింది.

రానున్న రోజులన్నీ డ్రోన్‌లదేనన్న సంగతి 2022కు ముందే తేలిపోయింది. అర్మేనియా- అజెర్‌బైజన్‌ ‌ఘర్షణలోనూ, సౌదీ అరేబియాలో చమురు శుద్ధి కర్మాగారాలపై హౌతీలు జరిపిన దాడిలోను డ్రోన్లను వాడారు. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం నవశకపు డ్రోన్ల సమరాన్ని తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో డ్రోన్లు మానవసహిత ఫైటర్‌ ‌విమానాల నుంచి చిన్నపాటి ఆయుధాల దాకా యుద్ధ రంగంలో ప్రతీ ఒక్కదాన్ని భర్తీ చేసే రోజు ఎంతో దూరం లేదు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE