చూడబోతే ఆపరేషన్ సిందూర్ ప్రభావం జగన్నాథుడి రథయాత్రపైన కూడా పడినట్టుంది. కోల్‌కతాలో జగన్నాథుడు ఈ నెల 27న జరిగే రథయాత్రలో సుఖోయ్ యుద్ధ విమానం టైర్లు అమర్చిన రథంపై ఊరేగనున్నాడు. ఈ మేరకు అక్కడి ఇస్కాన్ వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రథాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి బోయింగ్ విమానం టైర్లు వాడుతున్నారు. అయితే వాటితో సమస్య రావడంతో ఈసారి సుఖోయ్ యుద్ధ విమానం టైర్లు వాడాలని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు టైర్లు తయారు చేసే కంపెనీకి ఆర్డరు పెట్టారు. ఆధ్యాత్మిక యాత్రకు, యుద్ధ విమానానికి మధ్య సంబంధంపై కంపెనీ వారు మల్లగుల్లాలు పడ్డారు. ఇదేమిటో తేల్చుకుందా మని విమాన వేగంతో కోల్‌కతాకు చేరుకున్నారు. రథాన్ని, దానికి తగిలించి ఉన్న బోయింగ్ విమానం టైర్లను పరిశీలించారు. విషయమేమిటో స్పష్టంగా తెలిసివచ్చాక యుద్ధ విమానం టైర్లు సరఫరా చేయడానికి సరే అన్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈసారి స్వామివారు సుఖోయ్ టైర్లు అమర్చిన రథంపై ఊరేగుతారని కోల్‌కతా ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ తెలిపారు. అదే జరిగితే 48 ఏళ్ల తర్వాత జగన్నాథుడి రథానికి కొత్త చక్రాలు అమర్చినట్టవుతుంది. స్వామివారి రథం గంటకు దాదాపు ఒకటిన్నర కి.మీ.ల వేగంతో నడుస్తుంది. అదే సుఖోయ్ టైర్ల విషయానికి వస్తే అవి గంటకు 280 కి.మీ.ల వేగాన్ని సైతం తట్టుకొని శత్రువుల గుండెల్లో మిస్సైళ్ల మోత మోగిస్తాయి.