హైడ్రా.. హైదరాబాద్‌ను హడలెత్తిస్తోంది. కూల్చివేతలతో కలకలం సృష్టిస్తోంది. హఠాత్తుగా తెరపైకి వచ్చి.. హడావిడి చేస్తోంది. సామాజికంగానే కాదు.. రాజకీయంగానూ దుమారం రేపుతోంది. అక్రమ నిర్మాణాల యజమానుల్లో దడ పుట్టిస్తోంది. అయితే, మొదట్లో అందరితోనూ శభాష్.. అనిపించుకున్న హైడ్రా.. క్రమంగా ఆ ప్రతిష్టను కోల్పోతోంది. విమర్శలను మూటగట్టుకుంటోంది. దీర్ఘకాలిక ప్రణాళికతో.. సంస్కృతిని, కాలుష్య రహిత పర్యావరణాన్ని, పాతతరాల జ్ఞాపకాలను పదిలం చేసి.. ముందుతరాలకు కూడా జాగ్రత్తగా అందించాలన్న ఆశయం మంచిదే అయినా.. ఆ ఆశయం వెనుక అంతర్గత ఆలోచనలు, హస్తినశక్తులు ఉంటే మాత్రం ఆక్షేపణీయమనే చెప్పాలంటున్నారు విశ్లేషకులు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ప్రత్యేక అధికారాలతో ఆవిర్భవించింది. వరదలకు పరిష్కారం చూపించేం దుకు, పాత చెరువుల వైభవాన్ని తిరిగి తేవడమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైడ్రాను విస్తరించారు. హైడ్రాకు చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు చెరువులు, కుంటలతో విలసిల్లిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఆ కళను కోల్పోయింది. కాంక్రీట్ జంగిల్‌గా మారింది. చెరువులు కుచించుకు పోయాయి. నాలాలు కనుమరుగయ్యాయి. కేవలం కాంక్రీట్ నిర్మాణాలు తప్పితే ఏవీ కనిపించడం లేదు. చినుకు పడితే రహదారులు చెరువులను తలపిస్తు న్నాయి. చెరువులను ఆక్రమించి, నాలాలను మూసి వేయడంతో ఈ సమస్య ఏర్పడింది. దీంతో అక్రమ నిర్మాణాలు కూల్చేసే పనిలో హైడ్రా నిమగ్నమైంది.
బయటకు తెలిసే సరికే కూల్చివేతలు సమాప్తం
గత కొద్దిరోజులనుంచి హైదరాబాద్‌లోనే కాదు.. తెలంగాణ అంతటా ఎక్కడ చూసినా హైడ్రా గురించే హాట్‌హాట్ చర్చలు సాగుతున్నాయి. ఏ నలుగురు కలుసుకున్నా దీనిమీదే ముచ్చటించుకునే స్థాయిలో హైడ్రా యాక్షన్ కొనసాగుతోంది. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా వ్యూహా త్మకంగా ముందుకు వెళ్తోంది. తెల్లవారుజామున ఆక్రమణల కూల్చివేతలు మొదలుపెట్టి రెండు రోజులైనా సరే మొత్తం భవనాలను నేలమట్టం చేసి గానీ సిబ్బంది వెనుదిరిగి రావడం లేదు. చెరువులు ఉన్న చోట, చెరువులకు సంబంధించిన బఫర్‌జోన్ ప్రాంతాల్లో, చెరువుల ఫుల్‌ట్యాంక్ లెవెల్ పరిసరాలకు హైడ్రా సిబ్బంది, అధికారులు చేరుతున్నారు. అవసర మైతే భారీ బందోబస్తును వెంట తీసుకెళ్తున్నారు. రాత్రి నిద్ర పోయిన వాళ్లు.. తెల్లవారి కళ్లు తెరిచేలో గానే హైడ్రా కూల్చివేతలు పూర్తి చేసేస్తోంది.
ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు చూస్తున్నారు. కానీ.. కోర్టుల్లో పిటిషన్ వేసే లోగానే హైడ్రా పని కానిచ్చేస్తోంది. ఒకవేళ న్యాయస్థానాలు స్టేలు ఇచ్చినా.. అప్పటికే కూల్చివేతల పర్వం పూర్తయి పోతోంది. సినీ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలోనూ ఇదే జరిగింది. తెల్లవారు జామున 5 గంటలకే రంగంలోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్‌ను నేల మట్టం చేసింది. ఈ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసేసరికే.. పావు వంతు కూల్చివేతలు అయిపోయాయి. ఇక, నాగార్జున మేల్కొని హైకోర్టుకు వెళ్లి.. స్టే తెచ్చుకునే సరికి హైడ్రా తన పని పూర్తి చేసేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రాకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. సోషల్ మీడియాలో హైడ్రాపై ఓ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. కానీ, గత ప్రభుత్వంలో అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే తాము నిర్మించామని.. తప్పు తమది కాదంటూ, తమకు కనీసం సమయం ఇవ్వకుండా ఇంత దూకుడు అవసరమా? అని వాపోతున్నారు. పైగా న్యాయ పోరాటానికి కూడా సమయం ఇవ్వకుండా చేయడాన్ని నిరసిస్తున్నారు.
అప్పుడు పాక్షికం.. ఇప్పుడు సంపూర్ణం
కొన్నేళ్లుగా చూస్తే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు అక్రమ భవనాలు కూల్చివేతలు పాక్షి కంగా చేపట్టేవారు. కొన్ని గోడలను కూల్చివేయడం, స్లాబులకు రంధ్రాలు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని ప్రకటించేవారు. ప్రస్తుతం హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు సాదాసీదాగా ఉండటం లేదు. ఎంతటి నిర్మాణాలనైనాసరే పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఎర్రకుంట చెరువులో రెండు రోజులపాటు శ్రమించి 3 భారీ భవనాలను నేల మట్టం చేశారు. సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రిపురంలోని బూమ్‌రుఖా ఉద్ దవాళ చెరువులో అక్రమంగా నిర్మించిన పలు భవనాలు, ప్రహరీ గోడలను, అక్రమంగా వేసిన లేఅవుట్లను కూకటి వేళ్లతో పెకలించేశారు. చెరువు ఎఫ్‌టీఎల్‌కు సంబం ధించి పదెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.
మొదలుపెట్టారంటే నేలమట్టం చేసుడే
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని దేవేంద్రనగర్ చెరువు బఫర్ జోన్‌లోని 51 అక్రమ నిర్మాణాల పునాదులను కదిలించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ తుమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను ఆరు గంటలలో పూర్తిగా నేలమట్టం చేశారు. నెల రోజుల వ్యవధిలోనే హైడ్రా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలోని ఆక్రమణలను తొలగించింది. ఇలా ఆక్రమణలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఎక్కడ, ఎప్పుడు కూల్చివేతలు మొదలు పెడతారో ఏ ఒక్కరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ నిబంధనలు అతిక్రమించి కట్టిన కట్టడాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. హైడ్రా నుంచి కూల్చివేతలకు సంబంధించిన ముందస్తు సమాచారం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. పెద్ద పెద్ద నిర్మాణాలను కూల్చాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి సిబ్బందిని, యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. వీరంతా ఎక్కడికి వెళ్లాలో ఆఖరి నిమిషం దాకా చెప్పడం లేదు. ఉదయమే కూల్చివేతల ప్రాంతాలకు తీసుకెళ్లి విరామం లేకుండా పనులు సాగిస్తున్నారు. హైడ్రాకు ఇంకా పూర్తి స్థాయిలో సిబ్బంది కేటాయింపు కాకపోవడంతో డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి వంతుల వారీగా విధులను అప్పగిస్తున్నారు. వారంలో ఐదు రోజులు అక్రమ నిర్మాణాల తనిఖీ, వాటిపై ఉన్న ఫిర్యాదులు, కోర్టు వివాదాలు, ఇతర ముఖ్య అంశాలను పరిశీ లించి, ఆ తర్వాత శని, ఆదివారాల్లో కూల్చివేతల పక్రియ చేపడుతున్నారు.
కూల్చివేతలకు ముందే చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా నోటీసులు జారీచేయడం లేదంటే, ఇప్పటికే నోటీసులు జారీచేసినా నిర్లక్ష్యంగా ఉన్న నిర్మాణాలపై నేరుగా కూల్చివేతలకు సిద్ధపడుతు న్నారు. ఇక, తాజాగా హైడ్రా అధికారులు సికింద్రా బాద్ నడిబొడ్డున ఉన్న రాంనగర్‌పై పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని అడిక్‌మెట్‌లో నాలా లను ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ.. వాటిని తెల్లవారు జామునుంచే కూల్చివేయడం ప్రారంభిం చారు. వాస్తవానికి ఈ నిర్మాణాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూసి వెళ్లిన రెండు రోజుల్లోనే కూల్చి వేతలు చేపట్టారు. వాస్తవానికి సదరు నిర్మాణాల యజ మానులు.. ‘నోటీసులు ఇస్తారు లే.. అప్పుడు చూసు కుందాం..’ అని భావించారు. కానీ.. ఉరుములు లేని వర్షంలా హైడ్రా ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉదయం ఈ వార్త బయటకు వచ్చే సరికే నిర్మాణాల కూల్చివేతలు పూర్తయ్యాయి. అయితే.. ఈ వ్యవహారంపైనా మిశ్రమ స్పందన వస్తుండడం గమనార్హం. నాలాలు, చెరువులు, సరస్సులు ఆక్ర మించుకుని కట్టుకున్నవారికి తగిన శాస్తి జరిగిందని కొందరు ఆనందం వ్యక్తం చేస్తుం డగా, తమకు అవకాశం ఇవ్వకుండానే ఇలా చేయడం ఏమిటి? అని యజమానులు అంటున్నారు..
హైడ్రా మొగ్గు ఎవరివైపు?
మరోవైపు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థల నిర్మాణాలు కూడా చెరువులను ఆక్రమించుకొని జరిగినవేనని విమర్శలు మొదలయ్యాయి. పాతబస్తీకి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నిర్వహిస్తోన్న ఫాతిమా కాలేజీ కూడా పూర్తిగా చెరువులోనే కట్టారన్న ఆధారాలు బయటకు వచ్చాయి. వీటితో పాటు.. పలువురు ప్రజా ప్రతినిధులు, ఏకంగా కీలకస్థానాల్లో ఉన్న మంత్రులకు సంబంధించిన నిర్మాణాలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కానీ, హైడ్రా మాత్రం తాను అనుకున్నది చేసుకుంటూ వెళుతోంది. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సి టీని పరిశీలించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ, ఎంఐఎంకు చెందిన ఒవైసీల ఆక్రమణ లపై కిమ్మనడం లేదన్న విమర్శలు అప్పుడే ఓవైపు హైడ్రాను, మరోవైపు ప్రభుత్వాన్ని చుట్టు ముట్టాయి. తమ విద్యాసంస్థను కూల్చివేయొద్దని, అవసరమైతే తనపై బుల్లెట్లు కురిపించాలని, గతంలో మాదిరిగా తనను కత్తులతో పొడిపించినా పర్వాలేదని, విద్యాసంస్థ జోలికి మాత్రం రావొద్దని అక్బరుద్దీన్ ఒవైసీ మీడియా సాక్షిగా వేడుకున్నారు. అంటే, చెరువును ఆక్రమించుకున్నట్లు అక్బరుద్దీన్ అంగీకరించినట్లే అన్నది మాత్రం సుస్పష్టం. దీనిపై బీజేపీ నాయకులు ఫిర్యాదులు చేసినా, హైడ్రా మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం చర్చ నీయాంశమవుతోంది. ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా, విద్యాసంస్థల జోలికి వెళ్లడానికి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించారు. అదే నిజమైతే బీఆర్‌ఎస్ నేత పల్లా విద్యాసంస్థల వైపు ఎందుకు వెళ్లారన్నది విమర్శలకు తావిస్తోంది. అంటే.. హస్తిన పెద్దల ఒత్తిడితోనే ఒవైసీల వైపు హైడ్రా వెళ్లడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. అటువైపు చూస్తే కేటీఆర్‌కు చెందిన జన్వాడ ఫామ్‌హౌజ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని అధికారులు నిర్ధారించిన తర్వాత కూడా హైడ్రా బుల్డోజర్లు అటువైపు చూడకపోవడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీల మధ్య వైరం నాయకుల మీదకు మళ్లిందా?లేక నాయకుల మధ్య ముదిరిన యవ్వారం పార్టీలకు పాకిందా? అనేది తెలియదు గానీ హైడ్రా అంటేనే హడలెత్తిపోతున్నారు. ఎప్పుడేం జరుగు తుందో, ఎవరిపైన విరుచుకు పడు తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. తామేం చేసినా లోకకల్యాణం కోసమే అన్నట్టుగా అధికార కాంగ్రెస్ సమాధానమిస్తోంది. అటు.. హైడ్రా వ్యవహారంపై అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య వైరం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రతిపక్షాలు అధికార పక్షంపై ఆరోపణలు చేయడం సహజం. ఇప్పుడు తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికార కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని బీఆర్‌ఎస్ పార్టీ విమర్శి స్తుండగా.. కాంగ్రెస్ పార్టీతో బీఆర్‌ఎస్ అంటకాగు తోందని బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తు న్నారు. ఈ విమర్శలే అతి విచిత్రంగా తోస్తున్నాయి.
-సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్