తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణంగా ఇప్పటికీ విశ్లేషించుకునే కాళేశ్వరం ప్రాజెక్టు ఆ పార్టీ అధినేతల మెడకు చుట్టుకోబోతోందా? విచారణ కమిషన్‌ ముందు ముఖ్యనేతలంతా దోషులుగా నిలబడాల్సిన సమయం వస్తోందా? తమ హయాంలో జరిగిన పొరపాట్లను తేలిగ్గా తీసిపారేయలేని పరిస్థితులు ఎదురవుతున్నాయా? జరుగుతున్న పరిణామాలను చూస్తే.. నిజమే అనిపిస్తోంది. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నిజాల తవ్వకాలు సాగిస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ ఇలా.. ఎవరినీ వదిలిపెట్టకుండా గుట్టంతా బయటకు లాగుతోంది. నాటి సర్కారు పెద్దలైన కె.చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీష్‌రావుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులను, నిపుణులను, అధికారులను కమిషన్‌ ప్రశ్నించింది. తాజాగా మాజీ ఈఎన్సీ నరేందర్‌రెడ్డి, అప్పటి సీడీవో ఫజల్‌ వాంగ్మూలాలను సేకరించింది. వీళ్లిద్దరూ ఇచ్చిన వాంగ్మూలాలు కేసీఆర్‌ బృందాన్ని ఇరుకునే పెట్టేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే తప్పిదాలు జరిగాయని ఇద్దరు ఉన్నతాధికారులూ కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం తాము మొదట పలు డాక్యుమెంట్లపై సంతకాలు చేయలేదని, కానీ, ప్రభుత్వ పెద్దల ఒత్తడితో తర్వాత సంతకాలు చేసి ఆమోదం తెలపాల్సిన అవసరం వచ్చిందని ఈ ఇద్దరు అధికారులు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్నారు. పైనుంచి ఉన్న ఒత్తిళ్ల కారణంగా సరిగా క్వాలిటీ కంట్రోల్‌ కూడా చేయలేకపోయామని చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడి తోనే హడావిడిగా అన్ని అప్రూవల్‌ సంతకాలు చేయాల్సి వచ్చిందని కూడా కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. అసలు బ్రిడ్జిల నిర్మాణ స్థలాన్ని కూడా పరిశీలించకుండానే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఆమోదాలు ఇచ్చేశామన్న భయంకర వాస్తవాలు కమిషన్‌ ముందు వెల్లడిరచినట్లు చెబుతున్నారు.

గుట్టు విప్పిన మురళీధర్‌

క్వాలిటీ కంట్రోల్‌లో లోపాలు.. పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్లు జారీచేయడం.. పని పూర్తయి నట్లు సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత చెల్లింపులు చేయడం.. అంచనాలు, డిజైన్లలో మార్పులకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవడం.. ఇలా అనేక అంశాలు కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ క్వాలిటీ, ఇన్స్‌పెక్షన్‌కు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ విభాగం వద్ద కేవలం ఒకే ఒక పరిశీలన నివేదిక ఉందని జస్టిస్‌ ఘోష్‌ పేర్కొనగా… రెగ్యులర్‌గా తనిఖీలు చేసి లోపాలుంటే నివేదించాల్సి ఉంటుంది. 15 రోజులకోసారి అయినా నాణ్యతా తనిఖీలు చేయాలి. అలా జరగకపోతే అది ఒక ప్రధాన లోపమవుతుందని కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ అభిప్రాయపడ్డారు. నాణ్యత పరీక్షలు చేసి ధ్రువీకరించకుండానే బిల్లులు చెల్లించడం క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో వెలుగు చూసింది. ఇంజినీర్లు అంచనాలు తయారు చేసిన తర్వాత చివరకు ఆమోదం తెలిపేది ప్రభుత్వమేనని ఆయన పేర్కొనగా, ప్రభుత్వంలో ఏ స్థాయిలో జరుగుతుందని జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలోనేనని మాజీ ఈఎన్సీ సమాధానమిచ్చారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు ఏర్పడిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా సుమారు 50 మందికి పైగా ఇంజినీర్లు, ఐఏఎస్‌ అధికారులు, గుత్తేదారుల నుంచి అఫిడవిట్లు తీసుకొన్న కమిషన్‌.. ఇప్పుడు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రారంభించింది. మాజీ ఈఎన్సీ మురళీధర్‌ వరుసగా రెండు రోజులు జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఎదుట హాజరై పలు కీలక అంశాలను తెలియజేశారు. బీఆర్‌ఎస్‌ సర్కారు ఆదేశాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర నివేదికలో మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చిందని మురళీధర్‌ అంగీకరిం చారు. బ్యారేజీల వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్‌ కూడా కారణమే అని, బ్యారేజీల నిర్మాణం జరిగిన నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే తనిఖీలు చేయడం తప్పేనని ఒప్పుకున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజా ధనంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతుంటే.. ఎప్పటికప్పుడు ఎందుకు తనిఖీలు చేయలేదని మురళీధర్‌ను కమిషన్‌ నిలదీసింది.

2016 నుంచి 2020 దాకా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం జరిగితే వరంగల్‌ లోని క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఒక్కసారి మాత్రమే తనిఖీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. 3 నెలలకు ఒకసారి క్వాలిటీ కంట్రోల్‌ తనిఖీలు చేసి, పనులు నాణ్యతా ప్రమాణాలకు లోబడే జరుగుతున్నాయా? లేదా ? అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉండగా, నాలుగేళ్లు కేవలం ఒక్కసారి మాత్రమే తనిఖీలు చేసి, పనులు క్వాలిటీగా జరిగాయని ఏ విధంగా నిర్ధారించారని కమిషన్‌? ప్రశ్నించింది. దానికి మురళీధర్‌ బదులిస్తూ బ్యారేజీల వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్‌ వైఫల్యం కూడా కారణమని, 2 వారాలకు ఒకసారి తనిఖీలు జరగాల్సి ఉండగా ఆ పని చేయలేదని మురళీధర్‌ సమాధానం ఇచ్చారు. క్వాలిటీ కంట్రోల్‌ పరీక్షలు చేయించకుండా చెల్లింపులు చేశారా? రూ.1,342.72 కోట్ల పనులకు ఏ ప్రాతిపదికన చెల్లింపులు జరిపారు? రిజిస్టర్లలో ఎందుకు మార్పులు చేశారు? అని కమిషన్‌ ప్రశ్నించింది. బిల్లుల చెల్లింపుల్లో కూడా ఎందుకు మార్గదర్శకాలు పాటించలేదని నిలదీసింది. హైపవర్‌ కమిటీ వేసిన తర్వాతే కాళేశ్వరంపై నిర్ణయం తీసుకున్నారా? కాళేశ్వరం డీపీఆర్‌ను అనుమతి కోసం సీడబ్ల్యూసీలో దాఖలు చేశాక.. ఎవరి ఆదేశాల మేరకు మార్పు చేశారు? అని కమిషన్‌ ప్రశ్నించింది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రీ డిజైన్‌ చేసి, కాళేశ్వరం లిఫ్టు స్కీమ్‌ను అప్పటి ప్రభుత్వం చేపట్టిందని డీపీఆర్‌ను వ్యాప్కోస్‌ సంస్థ తయారు చేసిందని మురళీధర్‌ సమాధానం ఇచ్చారు.

 కేంద్ర జలవనరుల సంఘంలోని పలు విభాగాలు 17 రకాల అనుమతులు ఇచ్చాకే కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ప్రాజెక్టుకు క్లియరెన్స్‌ ఇచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకే డీపీఆర్‌లో మార్పులు జరిగాయని మురళీధర్‌ బదులి చ్చారు. మరి.. 2020 జూన్‌ 29న బ్యారేజీల నిర్మాణం పూర్తయితే.. 2019 సెప్టెంబర్‌లోనే సబ్‌ స్టాన్షియల్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారని కమిషన్‌ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణం పూర్తికాక పోయినా, వినియోగానికి సరిపడేంత పని జరిగిందని నిర్ధారిస్తూ సబ్‌ స్టాన్షియల్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వవచ్చా? టెండర్‌ నిబంధనలకు సంబంధించిన క్లాజుల్లో దీని ప్రస్తావన ఉందా? బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఏయే రిజిస్టర్లను నిర్వహించాల్సి ఉంటుంది? పనులు పూర్తి కాకున్నా.. వినియోగానికి సరిపడేంత పని జరిగిందని సర్టిఫికెట్లు ఇచ్చే మార్గదర్శకాలు ఉన్నాయా? ఉంటే చూపించండి అంటూ కమిషన్‌ నిలదీసింది. ఈఈ సర్టిఫికెట్‌ జారీ చేస్తే.. దానిపై ఎపీఈ చీఫ్‌ ఇంజినీర్‌ కౌంటర్‌ సంతకాలు చేస్తారా? అని ప్రశ్నించింది. ఇండియన్‌? స్టాండర్డ్‌ కోడ్‌ అనుసరించి కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరిగిందా? అని అడిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎవరు అనుమతి చ్చారు? ఒక్కో కాంపోనెంట్‌ అంచనాలను ఎవరు తయారు చేశారు? పరిపాలన అనుమతులకు హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ కారణమా? అని కమిషన్‌ ప్రశ్నించింది. పరిపాలనా పరమైన అనుమతులను హెచ్‌ఓడీఏ ఇచ్చిందని సంబంధిత ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్లే కాంపోనెంట్‌ వారీగా అంచనాలను తయారు చేశారని, సబ్‌ స్టాన్షియల్‌ సర్టిఫికెట్‌ ఇచ్చే అధికారం కానీ, క్లాజు కానీ లేదని మురళీధర్‌ స్పష్టం చేశారు.

ఫజల్‌ విచారణతో క్లారిటీ

మరోవైపు.. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై బ్యారేజిల నిర్మాణ స్థలాలను పరిశీలించకుండానే వాటిని ఆమోదించినట్టు నీటిపారుదల శాఖకు చెందిన సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ సూపరిండెంట్‌ ఇంజనీర్‌ ఫజల్‌, జస్టిస్‌ ఘోష్‌ కమీషన్‌కు వెల్లడిర చారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో సీకెంట్‌ ఫౖౖెల్స్‌కు వెళ్లాలని ఎన్‌ఐటీ వరంగల్‌ సిఫార్సుల మేరకు అప్పటి కాళేశ్వరం సీఈ చెప్పారని తెలిపారు.

కాళేశ్వరం సీఈ నివేదిక ఆధారంగానే ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే క్రాస్‌ సెక్షన్స్‌ ఆమోదించినట్లు కూడా స్పష్టం చేశారు. సుందిళ్ల ఆనకట్ట రెండో బ్లాక్‌ ఏలో అదనపు ఆరు వెంట్లు డిజైన్స్‌లో మొదట లేవని, ఆ తర్వాత డిజైన్లు మార్పులు చేసి కొత్త వెంట్లను చేర్చినట్లు తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం మేరకే అదనపు వెంట్ల నిర్మాణం జరిగిందని వెల్లడిరచారు.

ఇంజనీర్ల అంతర్మథనం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అన్ని కోణాల్లో న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ఇరిగేషన్‌ ఇంజనీర్లు కొందరు అంతర్మథనానికి లోనవు తున్నారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు అట్టహాసంగా చేపట్టి, నిర్మాణం కూడా శరవేగంగా పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు అక్రమాలపై ప్రస్తుత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్టోబర్‌ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలు జరిగా యన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ విభాగం మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన అవకతవకలపై క్షేత్ర స్థాయి విచారణ చేపట్టింది. ఈ విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను జస్టిస్‌ ఘోష్‌ కమిటీకి అందజేశారు.

గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు రీ డిజైన్‌ చేసినకేసీఆర్‌ సర్కార్‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు బ్యారేజీలు, కన్నెపల్లి, సిరిపురం, గోలివాడల వద్ద మూడు పంప్‌ హౌజుల నిర్మాణం చేపట్టింది. అయితే అప్పుడు క్షేత్ర స్థాయిలో ఉంటూ వేగవంతంగా పనులు చేయించిన ఇంజ నీర్లకు సరైన గుర్తింపు రాలేదన్న ఆవేదన వ్యక్తం అయింది. ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారుల వద్ద కొంతమంది సీనియర్‌ ఇంజనీర్లు క్రెడిట్‌ తమదే నని చెప్పుకున్నారని, దీంతో అప్పుడు నిర్విరామంగా శ్రమించిన తమకు ఎలాంటి గుర్తింపు రాకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం అయింది.

తాజాగా విజిలెన్స్‌ విభాగం అధికారులు జస్టిస్‌ ఘెష్‌ కమిటీకి ఇచ్చిన నివేదికలో 21 మంది ఇంజనీర్ల వైఫల్యాలే కారణమని తేల్చినట్టుగా వెలుగు లోకి రావడంతో ఈ ఉచ్చులో తాము ఇరుక్కుంటున్నా మన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సర్కారు లక్ష్యా లకు అనుగుణంగా పనిచేయడంలో కృతార్థులమై నప్పటికీ ఫలితం లేకపోగా నిర్మాణంలోని అవక తవ కలకు తమనే బాధ్యులను చేసే పరిస్థితి వస్తోందా? అన్న భయం ఇంజనీర్లను వెంటాడు తోంది.

మరో వైపున జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్‌ అధికారులను ఆదేశించడంతో ఇప్పటి వరకు మేడిగడ్డకే పరిమితం అయిన విచారణ నివేదిక త్వరలో ఆ రెండు బ్యారేజీలపై కూడా సిద్దం కాక తప్పేలా లేదు.

దీంతో మరికొంతమంది ఇంజ నీర్లు కూడా ఈ వ్యవహారంలో ఇరుక్కునే ప్రమాదం ఉంటుందేమో నన్న చర్చ కూడా సాగుతోంది. దీంతో ఎటువైపు నుంచి ఉపద్రవం ముంచుకొస్తుం దోనన్న ఆందోళన కాళేశ్వరం ఇంజనీర్‌ వర్గాలను వెంటాడుతోంది.

– సుజాత గోపగోని, సీనియర్‌ జర్నలిస్ట్‌, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE