దేశ విభజన గాయాలు 78 సంవత్సరాలైనా భారత్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. బ్రిటిష్‌ పాలకుల కుట్రతో ఏర్పడిన పాకిస్తాన్‌ భూతంతో నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నాం. పాలకుల దమనకాండతో తూర్పు పాకిస్తాన్‌లో తిరుగుబాటు చేసిన వారికి చేదోడుగా నిలిచి బాంగ్లాదేశ్‌ ఏర్పాటులో క్రియాశీలపాత్ర పోషించాం. పాకిస్తాన్‌ చీలిపోవడంతో ఆ దేశం బలహీన పడుతుందనే మన పాలకుల అంచనాలు తప్పాయి. మతతత్వంతో బాంగ్లాదేశ్‌ కూడా పాకిస్తాన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా భారత్‌ను తరచూ చికాకుపరుస్తూనే ఉంది. అయినా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సెక్యులర్‌ పేరుతో కొనితెచ్చుకున్న ముసుగుతో మనల్ని మనమే ద్రోహం చేసుకుంటూ నష్టపోతున్నా, స్పందించాల్సిన సమయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాం. ఎవరో ఏదో అనుకుంటారని అనవసర సహనంతో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాం.

బాంగ్లాదేశ్‌లో ఇటీవల జరుగుతున్న పరిణా మాలను ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషించు కుంటున్నారు. ప్రజలు తిరుగుబావుట ఎగురవేశారని, ముఖ్యంగా విద్యార్థి, యువత ఆగ్రహానికి దేశ ప్రధాని షేక్‌ హసీనా కట్టుబట్టలతో దేశం విడిచి పలాయనం చిత్తగించారని మేధావులుగా చెప్పుకునే వారు దీన్నో విప్లవంగా అభివర్ణిస్తున్నారు. నిరుద్యోగంతో అల్లాడు తున్న యువత వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని పడ గొట్టారని, దీన్నో చారిత్రాత్మక ఘట్టంగా కీర్తిస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి ప్రజా వ్యతిరేకత పరాకాష్టకు చేరితే ఇలానే జరుగుతుందని, పదేళ్లుగా అధికారంలో ఉండి మూడో పర్యాయం ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోదీ ప్రభుత్వానికి కూడా ఇది ఒక హెచ్చరికలాంటిదని విపరీత భాష్యం చెబుతున్నారు. అక్కడ జరిగిన ఘటనలు, ఉద్యమాలు, విప్లవాలను వారి అంతర్గత విషయాలుగా భావించి ఒక సరిహద్దు దేశంగా మనం గమనిస్తూ ఉంటే సరిపోతుంది. అయితే అంతిమంగా అక్కడి హింసాత్మక ఘటనలకు మతం రంగు పులిమి ముఖ్యంగా హిందువులే లక్ష్యంగా సాగుతుండడంతో భారతదేశం ఆందోళన పడాల్సిన పరిస్థితులు ఏర్పడు తున్నాయి. అంతేకాక భారత్‌పైన కక్షగట్టిన విదేశీ శక్తులు బాంగ్లాదేశ్‌ను మనకు వ్యతిరేకంగా ఒక పావుగా వాడుకుంటున్నాయి.

బాంగ్లాదేశ్‌లో పరిణామాలు ఉద్యమంగా రూపాంతరం చెందడం నాణానికి ఒక వైపు మాత్రమే. అదే నాణానికి మరోవైపు మతతత్వ పైశాచికం కనిపిస్తుంది. బాంగ్లాదేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారికి కల్పిస్తున్న 30 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం పలు మలుపులు తిరిగింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లను ఐదు శాతానికి తగ్గించడంతో పరిస్థితులు కుదుటపడ్డట్టు కనిపించినా అది తాత్కాలికమే అయింది. మన మేధావి వర్గం వారు చెబుతున్నట్టు అది నిరుద్యోగ ఉద్యమం అయితే సుప్రీం కోర్టు తీర్పు అనంతరం వాతావరణం చక్కబడాలి. దీనికి భిన్నంగా హింసాత్మక ఘటనలు రెట్టింపయ్యి ప్రధానిని గద్దె దింపడమే లక్ష్యంగా సాగింది. దీన్ని కూడా సమర్థించే వారున్నారు. షేక్‌ హసీనా నియంతృత్వ పాలన సాగించారని, ప్రతిపక్షాలను అణిచేశారని, ప్రత్యర్థి నేతలను జైలుపాలు చేశారని, ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారని, దీనికి నిరసనగా ప్రజాగ్రహం పెల్లుబికిందని చెబుతున్నారు. అవామీలీగ్‌ కార్యకర్తలను, మైనార్టీలైన హిందువులను లక్ష్యంగా చేసుకొని హింసాత్మక దాడులు చేశారు. రాజకీయ దాడులకు పాల్పడ్డారు. అంటే ఇది ఫక్తు రాజకీయ లక్ష్యంతో జరిగిన అల్లర్లే. షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆ దేశ ప్రతిపక్షాలకు సైన్యం, విదేశీ శక్తులు తోడయ్యాయి. ఇందులో విద్యార్థులు పావుగా మారారు. అమాయక హిందువులు బలయ్యారు.

బాంగ్లాదేశ్‌లో జరిగిన ఘటనలు వారి అంతర్గత విషయం అని వదిలేయడానికి ఏ మాత్రం వీలులేదు. ఆ దేశంలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అవామీలీగ్‌ ప్రభుత్వం భారతదేశం పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందని కొన్ని విదేశీ శక్తులు కక్షగట్టాయి. ఇప్పటికే చైనా, పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో నరేంద్ర మోదీ సర్కారు నయానో, భయానో బాంగ్లాదేశ్‌ను దారిలోకి తెచ్చుకొని మరో దేశం పక్కలో బల్లెంలా తయారవ్వ కుండా చూసుకుంది. షేక్‌ హసీనా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తుండడంతో ఆధిపత్యం చెలాయించేందుకు కాచుకుని కూర్చున్న చైనా భారత్‌ను ఏమీ చేయలేక బాంగ్లాదేశ్‌లో అనిశ్చితికి తెరలేపింది. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన షేక్‌ హసీనా భారత దేశానికి వ్యతిరేకంగా ఉండాలనే ఆ దేశ ఒత్తిడిని తట్టుకోలేక మధ్యలోనే తిరుగు పయానమయ్యారు. దీంతో బాంగ్లాదేశ్‌లో తన చెప్పు చేతుల్లో ఉండే ఒక బలహీనమైన ప్రభుత్వం ఉండాలనే లక్ష్యంగా చైనా అక్కడ రిజర్వేషన్ల ఉద్యమాన్ని పావుగా వాడుకొని అల్లర్లను ప్రేరేపించింది.

మరోవైపు జమ్ము కశ్మీర్‌ ప్రాంతం నుండి మన దేశంలోకి నిత్యం ఉగ్రవాదులను పంపించే పాకిస్తాన్‌కు మోదీ పాలనలో కట్టడి కావడంతో ప్రత్యామ్నాయంగా బాంగ్లాదేశ్‌ నుండి భారత్‌ ఈశాన్య ప్రాంతాల నుండి టెర్రరిస్టులను పంపాలనే కుట్రకు తెరదీసి, బాంగ్లాదేశ్‌లో అశాంతిని రగల్చి ఉద్యమం ముసుగులో పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఉగ్రవాదులను ప్రోత్సహించింది. భారత్‌పై కక్షతో పాటు బాంగ్లాదేశ్‌ను కూడా తమ చెప్పుచేతల్లో ఉంచుకునేలా పాకిస్తాన్‌ ఉద్యమాన్ని ఉసిగొల్పింది. ఇక ప్రపంచంలో ఎక్కడైనా ఆధిపత్యం కోసం పాకులాడే అమెరికా బాంగ్లాదేశ్‌లో ఒక వ్యూహాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలనే యోచనతో 3 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉండే సెంట్‌ మార్టివ్స్‌ ద్వీపంపై కన్నేసింది. ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఏషియాలో చైనాతో పాటు భారత్‌ను కూడా బెదిరించాలని చూసింది. ఇందుకు షేక్‌ హసీనా సానుకూలంగా లేకపోవడంతో కక్ష పెంచుకున్న అమెరికా కూడా అక్కడ ప్రభుత్వ కూల్చివేతకు తనవంతు సాయం చేసింది. అందుకే పదవి కోల్పోయిన షేక్‌ హసీనా అమెరికాకు లొంగుంటే తన ప్రభుత్వం పడిపోయేది కాదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోవడంలో భారతదేశ వ్యతిరేక శక్తులు ఎంత క్రియాశీలంగా పనిచేశాయో తెలు స్తుంది. ఉద్యమం చేపట్టిన యువతను పక్కదారి పట్టించి షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి తమ చేతిలో కీలుబొమ్మగా ఉండే ప్రభుత్వం ఏర్పడాలని విదేశీ శక్తులు బంగ్లాదేశ్‌లో కుట్రలు చేశాయి. దేశం విడిచి భారత్‌కు వచ్చిన షేక్‌ హసీనా అమెరికా, బ్రిటన్‌ దేశాలకి వెళ్లాలని కోరుకుంటున్నా ఆ దేశాలు అనుమతులు ఇవ్వకపోవడమే ఇందుకు ఉదాహరణ.

పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ బాంగ్లాదేశ్‌ అల్లర్లకు మతం రంగు పులిమి హిందువులపై జిహాదీలను రెచ్చగొట్టింది. హిందూ వ్యతిరేక భావ జాలాన్ని ప్రేరేపించి సనాతన ధర్మాన్ని అనుసరించే హైందవుల ఇళ్లపై, దేవాలయాలపై దాదాపు 200కు పైగా దాడులు జరిగాయి. ప్రధానంగా 30 శాతంకు పైగా హిందువులు ఉండే 4 జిల్లాలతో కూడిన సిరిగురి కారిడార్‌లో అధికంగా దాడులు జరిగాయి. హిందూ ప్రజాప్రతినిధులను వెంబడిరచి హత్య చేశారు. అక్కడి అల్లర్లు నిజంగా నిరుద్యోగంతో రగిలిన కడుపు మంట ఉద్యమమే అయితే హిందువుల లక్ష్యంగా దాడులు ఎందుకు జరిగాయి? అవి మతతత్వ దాడులు కావని మన సెక్కులరిస్టులు హిందువులను రక్షించిన ముస్లింలు అంటూ ఒకటి అర ఉదాహరణలను పతాక శీర్షికలుగా చేర్చి మనల్ని వంచిస్తారు కానీ ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? వీటి వెనుక ప్రేరేపితులు ఎవరు అని మాత్రం విశ్లేషించరు. తెలిసినా మన లౌకికతత్వం పొరలు కళ్లను కప్పేస్తాయి. చివరికి మన బుజ్జగింపు రాజకీయాలతో దాడులను ఖండిరచే ధైర్యం కూడా లౌకికవాదులు చేయకపోవడం మన దౌర్బాగ్యం.

కట్టుబట్టలతో శరణార్థిగా వచ్చిన షేక్‌ హసీనాకు ఆశ్రయం ఇవ్వడాన్ని కూడా అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు కొందరు కుహనా సెక్యులరిస్టులు తప్పుపడుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో, అస్సాం, హైదరాబాద్‌లో, దేశంలో ఇతర ప్రాంతాలలో అక్రమంగా చొరబాటుదారులుగా వచ్చిన బాంగ్లాదేశీ యులకు, రొహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని డిమాండ్‌ చేసే వీరు ప్రాణభిక్ష కోసం వచ్చిన మహిళకు ఆశ్రయం ఎందుకిచ్చారని ప్రశ్నించడం వీరికే చెల్లింది. వీరు ఓట్లే లక్ష్యంగా ఎంతమంది అక్రమ చొరబాటుదారులకు దొంగ గుర్తింపు కార్డులిప్పించారో, చొరబాటుదారులతో హైదరాబాద్‌ నగర శివార్లలో ఎన్ని అక్రమ కాలనీలు వెలిశాయో మన భాగ్యనగరంలో ఎవరిని అడిగినా చెబుతారు. తన ఇంటిపై దాడి జరుగుతుందని వార్త తెలిసిన హసీనా భారత్‌కు పారిపోయి వచ్చారు. అనంతరం అల్లరి మూకలు ఎంత దారుణంగా ఆమె ఇంటిపై దాడులు చేశాయో బహిరంగ రహస్యమే. ఇది కూడా ప్రజా ఉద్యమమే అని అంటారేమో మన మేధావులు. ప్రాణాపాయంతో శరణు కోరి వచ్చిన వారికి రక్షణ ఇవ్వడం కూడా తప్పేనా? ఒకవేళ ఆమె రాకను నిరాకరించి ఉంటే భారత ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగి ఒక మహిళకు కనీస రక్షణ ఇవ్వలేదని వీరే విమర్శిస్తారు.

మరోవైపు ప్రజావ్యతిరేకత కట్టలు తెచ్చుకుంటే భవిష్యత్‌లో భారత్‌లో కూడా ఇలాంటి ఉద్యమాలు పుడతాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు భారత్‌కు బాంగ్లాదేశ్‌కు పోలికేంటో వారికే తెలియాలి. హసీనా నియంతలా వ్యవహరిస్తూ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించే వీరు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడాన్ని, ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో ‘ఇండి’ కూటమికి చెప్పుకోదగ్గ ఫలితాలు రావడాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఒకవేళ మోదీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తే ఈ ఫలితాలు వచ్చేవా? వీరి బాంగ్లాదేశ్‌లో ఉన్నట్టు ఇక్కడ కూడా సైనిక పాలనను సమర్థిస్తారా?

బాంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘటనలు పైకి ఒక ప్రజా ఉద్యమంలా కనిపించినా అంతర్గతంగా అనేక శక్తులున్నాయి. ముఖ్యంగా భారత వ్యతిరేక శక్తులు మన దేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ అల్లర్లను అస్త్రంగా వాడుకుంటున్నాయి. మతోన్మాద శక్తులు హిందువుల లక్ష్యంగా జిహాదీ దాడులు చేస్తున్నాయి. ప్రత్యేకించి మనకు వ్యతిరేకంగా ఇన్ని శక్తులు కూడగట్టుకొని ఉద్యమం పేరుతో అల్లర్లను ప్రేరేపిస్తున్నా మన దేశంలోని రాజకీయ పార్టీలు, మేధావులు దీన్ని ఒక ఉద్యమంగా సమర్థించడం, అదే సమయంలో హైందవులపై దాడులను ముక్త కంఠంతో ఖండిరచకపోవడం వారి అవకాశవాద రాజకీయాలకు పరాకష్ట.

– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE