బీజేపీ ఏలుబడిలో మత కల్లోలాలు లేవు. అడపాదడపా వాటి జాడలు కనిపించినా ఉక్కుపాదం మోపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అలాంటి అల్లర్లకు మరొక ప్రయత్నం జరిగింది. ఉత్తరాఖండ్‌ లోని హల్ద్వానీలో అక్రమంగా కట్టిన మసీదును, మదరసాను రాష్ట్ర ప్రభుత్వం తొలిగించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ముస్లింలు బీభత్సం సృష్టించారు. హిందువులు దేవభూమి అని ఎంతో పవిత్రంగా భావించే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనాకాలంలో అక్రమ చొరబాటుదారులైన రొహింగ్యా ముస్లింలు సహా ఇతర ముస్లింలు  ప్రవేశించడమే కాదు, ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని కూర్చున్నారు.

ఒకటి రెండు దశాబ్దాల కింద ఏక సంఖ్య శాతంలో ఉన్న వారి జనాభా 2024నాటికి 20 శాతానికి చేరినట్టు తెలుస్తోంది. హిందూత్వ బూచిని చూపిస్తూ మైనార్టీ నాయకులు తమ వర్గాన్ని రెచ్చగొడు తున్న తీరు దేశంలో పలుచోట్ల హింసాత్మకంగా మారుతున్నది. యథేచ్ఛగా అక్రమ చొరబాటు దారులకు ఆశ్రయమిస్తూ, తమ సంఖ్యను పెంచుకుంటున్న ‘మైనార్టీ’లు ఇటీవల ఉత్తరాఖండ్‌లో పాల్పడిన హింసను చూసి దేశం నివ్వెరపోయింది.

ప్రభుత్వ భూమిపై హల్ద్వానీ జిల్లాలోని బన్‌భూల్‌ పురాలో అక్రమంగా నిర్మించిన మసీదును, మదరాసాను తొలిగించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో దాదాపు ఐదుగురు వ్యక్తులు మరణించగా, డజను మందికి పైగా వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులని కూడా చూడకుండా రాళ్లు రువ్వడం, పెట్రోలు బాంబులను ఉపయో గించడం, వాహనాలకు నిప్పంటించడం, పోలీసు స్టేషన్‌ను అల్లరిమూకలు చుట్టుముట్టడం ద్వారా పోలీసులు సహా ప్రజలను భయభ్రాంతులను చేసే ప్రయత్నం జరిగాయి. ఇంత నిర్భయంగా చేస్తున్నా రంటే, వారి వెనుక ఎంత బలమైన శక్తులుండి ఉంటాయన్న అనుమానం రాక మానదు. ఈ పరిణామాల  పట్ల ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ కఠినంగా స్పందిస్తూ, కనిపిస్తే కాల్చి వేతకు ఉత్తర్వులు జారీచేయడంతో హిందువులు కాస్త ధైర్యంగా ఊపిరి తీసుకున్నారు. వాస్తవానికి మసీదు కూల్చివేత నిర్ణయం జిల్లా యంత్రాంగం తామంతట తాము తీసుకున్నది కాదు, కోర్టు జారీ చేసిన ఉత్తర్వు లకు అనుగుణంగా,  మసీదుకు సంబంధించిన వారికి ముందస్తుగానే నోటీసులు జారీచేసి, మరీ తీసుకున్నది.

అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన కూల్చివేత బృందం, పోలీసులు, జిల్లా కలెక్టరుపై అల్లరిమూకలు ఒక్కసారిగా పోగై రాళ్లు రువ్వడమన్నది ఏదో క్షణికావేశంలో జరిగిన ఘటన కాదు. ఒక పథకం ప్రకారం రాళ్లను సమకూర్చుకుని పెట్టుకుని, మహిళలను బురఖాలలో తీసుకువచ్చి ప్రభుత్వ అధికారులపై వేయించిన తీరు చూస్తే, గతంలో కశ్మీరులో జరిగిన ఘటనలు గుర్తురాక మానవు. దేశ వ్యతిరేక శక్తుల కార్యకలాపాల పద్ధతి మారలేదన్న విషయం తెలిసిపోతోంది. జిల్లా కలెక్టర్‌ వందన వివరణ ప్రకారం, పోలీసు స్టేషన్‌లో చిక్కుకుని ఉన్న పోలీసు సిబ్బందిని సజీవంగా దహనం చేసేందుకు స్టేషన్‌ను చుట్టుముట్టిన అల్లరిమూకలు ప్రయత్నించాయి. పోలీసులు, పాలనా సిబ్బందిపై హత్యాయత్నం చేశారని సాక్షాత్తు ముఖ్యమంత్రే పేర్కొన్నారంటే, అక్కడ జరిగిన బీభత్సం ఏ స్థాయిలో ఉండి ఉంటుందో ఊహించవచ్చు. అందుకే రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అల్లరి మూకలపై నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. దీనితో పాటుగా హల్ద్వానీ జిల్లాలో కర్ఫ్యూ విధించడమే కాక ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసి, దాదాపు 1,100మంది పోలీసులను ప్రతి రోడ్డు మలుపులోనూ మోహరించారు.

అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో గాయపడిన పోలీసు సిబ్బంది ప్లాస్టర్లు, బ్యాండేజీలు ధరించి విధులకు హాజరుకావడం కూడా అక్కడ ఏ స్థాయిలో అరాచకం జరిగిందో చెప్పకనే చెప్తుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సాయంత్రం 4.30కు ప్రారంభమైన కూల్చివేత 5.30కు పూర్తి అయింది. వెంటనే రాళ్లు రువ్వడంతో ప్రారంభమైన గొడవలు పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టడం, వాహనాలను దహనం చేయడం వరకు వెళ్లింది. ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటాయని ఊహించని పోలీసులు తక్కువ సంఖ్యలోనే అక్కడకు వెళ్లడంతో వారిని నియంత్రించడంలో విఫలమయ్యారు. అదనపు బలగాలు వచ్చేవరకూ అంటే దాదాపు నాలుగు గంటలపాటు అల్లరి మూకలు యధేచ్ఛగా వీరవిహారం చేయడంతో, స్థానిక హిందువులు భయంతో వణికిపోయారు. మసీదు కూల్చివేత పూర్తి కావడం ఏమిటి, వీధులలో రాళ్ల వర్షం కురిసిందని, అవి కూడా రైలుపట్టాలవద్ద లభించే కంకర రాళ్ల వంటివని మరొక ప్రత్యక్ష సాక్షి చెప్పడం, వింటే అల్లరిమూకలు ఎంత ప్రణాళికాబద్ధంగా ఈ హింసకు పాల్పడ్డాయో అర్థం అవుతుంది.

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ‘దేవభూమి’ ఉత్తరాఖండ్‌లో  ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా మెజారిటీ హిందువులను భయభ్రాంతులను చేయాలని, తాము అణచివేతకు గురవుతున్నామని చెప్పుకునే మైనార్టీలు కుట్రపన్నిన విషయం ఈ ఉదంతం ద్వారా స్పష్టమైపోయింది. అందుకే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ ఆధారంగా నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటా మని ముఖ్యమంత్రి ధామీ ప్రకటించారు. దానితో పాటుగా, ప్రభుత్వ, ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన వారి చేత, ప్రభుత్వ సిబ్బందిని గాయపరిచిన వారిచేత నష్టపరిహారం కట్టించి తీరుతామని అన్నారు.  కూల్చివేసిన మసీదు, మదరసా రెండూ కూడా ప్రభుత్వ భూమిపై ఉండటమే కాదు, ఎక్కడా రెవిన్యూ రికార్డులలో వాటి ప్రస్తావన లేదని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులపై అక్రమ నిర్మాణాలను తాము గత 15`20 రోజులుగా కూల్చివేస్తున్నామని, తద్వారా రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌లను నివారిస్తున్నామని ఆమె తెలిపారు.

మదరసాకు సంబంధించిన యాజమాన్య పత్రాలను మూడురోజులలోపు తమకు సమర్పించా లని లేదా దానిని కబ్జాగా భావించి కూల్చివేస్తామని జనవరి 30నే నోటీసులు జారీ చేసినట్టు పాలనా యంత్రాంగం చెప్తోంది. ఫిబ్రవరి 3వ తేదీన పలువురు స్థానికులు నగర నిగమ్‌ కార్యాలయానికి చర్చల కోసం వచ్చి, కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ, హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారని, అయితే వారికి తగినంత సమయానికి మించే ఇచ్చినందుకు వారు కోరినట్టు మరింత సమయాన్ని ఇవ్వలేదని కలెక్టరు వివరించారు. మరురోజు కూల్చివేస్తామనగా, రాత్రి భద్రతా దళాలు ఫ్లాగ్‌ మార్చి నిర్వహించాయి. స్థానికులు హైకోర్టు నుంచి తక్షణ స్టే కోరినప్పటికీ, అందుకు కోర్టు నిరాకరించిందని, దానితో కూల్చివేతకు సిద్ధంగా ఉన్న తమ సిబ్బంది దానిని చేపట్టాయని కలెక్టరు తెలిపారు. చట్టపరంగానే కూల్చివేత జరిగిందని, మదరాసా అనే కట్టడంలో ఎవరూ ఉండటం లేదని ఖరారు చేసుకున్న తర్వాతే ఏకాభిప్రాయంతోనే దాన్ని కూల్చివేశామని వివరణ ఇచ్చారు.

ఇంత ప్రక్రియను ప్రభుత్వం చేపట్టినప్పటికీ, అక్కడ ముస్లిం నాయకులు మాత్రం తమకేదో అన్యాయం జరిగినట్టుగా మాట్లాడడం, తాము మైనార్టీలం కనుకనే తమపై దౌర్జన్యాలు జరుగు తున్నాయని ఎప్పటిలానే విక్టిమ్‌ (బాధిత) కార్డును వాడుకుంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి ధామీ, అక్రమంగా కట్టిన కట్టడాన్ని కూల్చివేసిన స్థలంలో పోలీసుస్టేషన్‌ను నిర్మిస్తామంటూ, ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం ఐదువేలమంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసును నమోదు చేసి ముప్పైమంది నిందితులను సిసిటివి ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. బుర్ఖా ధరించి వచ్చి రాళ్లు రువ్విన మహిళలను గుర్తించడమే పోలీసులకు కొద్ది ఇబ్బందిగా మారింది. అరెస్టు చేసిన వారిలో సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి అబ్దుల్‌ మతీన్‌ సిద్దికీ సోదరుడు జావేద్‌ మతీన్‌ కూడా ఉండటం గమనార్హం. కౌన్సిలర్లు మెహబూబ్‌ ఆలమ్‌, జీషాన్‌ పర్వేజ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. దోషుల నుంచి స్థానికంగా తయారు చేసిన ఆయుధాలను, ముడి బాంబుల వంటివాటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ క్రమంలోనే, నాలుగు అదనపు పారామిలటరీ దళ యూనిట్లను మోహరించి, పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.

కాగా,  ప్రధాన నిందితుడు అబ్దుల్‌ మాలిక్‌ ఈ హింసాత్మక ఘటన వెనుక ఉన్నాడని పోలీసులు చెపుతున్నారు. అతడిని ఢల్లీిలో అరెస్టు చేశారని కొన్ని  పత్రికలలో వార్తలు కూడా వచ్చాయి. కాగా, అతడిని ఇంకా అరెస్టు చేయడంలేదని నైనితాల్‌ పోలీసులు చెబుతున్నారు. ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలపై ఉక్కుపాదం మోపడం హర్షణీయం.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
Instagram