• డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

దేశంలో కుంభమేళా తరువాత నిర్వహించేది తెలంగాణలోని మేడారం సమక్క సారలమ్మ జాతర. ప్రజాశ్రేయస్సు కోసం కాకతీయులతో జిరిగిన సమరంలో ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన తల్లీకూతుళ్ల స్మారక ఉత్సవాన్ని ‘గిరిజన కుంభమేళా’గా అభివర్ణిస్తారు. సుమారు ఎనిమిది దశాబ్దాలకు పైబడి రెండేళ్లకు ఒకసారి (ఈ నెల 21 నుంచి) నాలుగు రోజుల పాటు జరిగే  ఉత్సవంలో గిరిజనేతరులు కూడా విశేష సంఖ్యలో పాల్గొంటారు. ఆ సమయంలో  మేడారం భక్తజన సంద్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (1996) దీనిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. జాతీయ ఉత్సవంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి.

తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో ప్రకృతి అందాలతో నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండే ఈ కుగ్రామం ఈ ఉత్సవ సమయంలో కాలు కదపలేనంతగా భక్తజనంతో కిక్కిరిసి పోతుంది. యుద్ధంలో వీర మరణం పొందిన తల్లీకూతుళ్లు సమ్మక్క, సారలమ్మ విగ్రహాలు లేని దేవతలుగా పూజలు అందుకుంటున్నారు. మాఘ పూర్ణిమకు నాలుగు రోజుల ముందు ఈ జాతర ప్రారంభమవుతుంది.

సమ్మక్క జననానికి సంబంధించి కొద్దిపాటి మార్పులతో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె భూమిలో ఒకపెట్టెలో లభ్యమైనట్లు ఒక కథ ప్రచారంలో ఉండగా, 12 శతాబ్దంలో కోయదొరలకు అడవిలో పెద్దపులుల కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న పసిపాప దొరికినట్లు మరో కథనం. కొండదేవత చిన్నారిగా అవతరించిందని, ఆమెను దైవప్రసాదంగా భావించిన పొలవాసకు చెందిన గిరిజన దొర మేడరాజు దంపతులు సమ్మక్క అనే పేరుతో గారాబంగా పెంచారు. తన మేనల్లుడు, మేడారం పాలకుడు పగిడిద్దరాజుతె పెళ్లి చేశారు. సమ్మక్క,పగిడిద్ద దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే కూతుళ్లు, జంపన్న అనే కుమారుడు.

భరిణగా సమ్మక్క

కాకతీయ ప్రతాపరుద్రుడు రాజ్యవిస్తరణ జైత్రయాత్ర చేపట్టగా ఆయన ధాటికి తట్టుకోలేని మేడరాజు, ఆయన పరివారం మేడారంలో అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో అనావృష్టి కారణంగా పగిడిద్దరాజు (కాకతీయుల సామంతరాజు) కప్పం కట్టలేకపోగా, స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడం, మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం ప్రతాపరుద్రునిలో ఆగ్రహాన్ని రగిల్చింది. తన ప్రధానమంత్రి యుగంధురుడి (నాగయ్యగన్నుడు) సారథ్యంలో మేడారంపైకి సైనిక పటాలం పంపాడు. ఆ యుద్ధంలో కాకతీయులకు అపారంగా నష్టం వాటిల్లడంతో పాటు మేడారం మొత్తం నేలమట్ట మైంది. సమ్మక్క తన సంతానంతో పాటు అల్లుడు కొండాయి ప్రభువు గోవిందరాజు వేరువేరు ప్రాంతాల నుంచి శత్రుసైన్యాన్ని ఎదుర్కొన్నారు. అయినా ఆ సేనలను నిలువరించ లేకపోయారు. ఓటమి పరాభవాన్ని తట్టుకోలేని జంపన్న సమీపంలోని సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి సంపెంగ వాగే నేటి జంపన్న వాగు. (జంపన్న ఆత్మహత్య చేసుకోలేదని, తన గాయాల రక్తాన్ని వాగులో శుభ్రం చేసుకోవడం వల్ల దానికి జంపన్న వాగు అని పేరు వచ్చిందని కొందరు అంటారు).

అయినవారు అసువులు బాయడంతో సమ్మక్క అపర కాళిలా విజృంభించి కాకతీయ సేనలకు ముచ్చెమటలు పట్టించారు. భీతిల్లిన కాకతీయ సేనలోని ఒకడు ఆమెను బల్లెంతో దొంగదెబ్బ తీశాడు. రక్తసిక్తమైన దేహంతో ఆమె మేడారానికి ఈశాన్యదిశగా చిలకలగుట్టవైపు గుహలోకి వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెదుకుతూ వెళ్లిన అను చరులకు నాగవృక్షం సమీపంలోని పుట్ట వద్ద పసుపు`కుంకుమలతో భరిణెగా కనిపించింది. దానినే సమ్మక్కకు ప్రతిరూపంగా భావించారు. నాటి నుంచి ఆ భరిణె సమ్మక్కగా పూజలు అందుకుం టోంది.

ప్రతాపరుద్రుడి పశ్చాత్తాపం

 సమ్మక్క, ఆమె కుటుంబంపై అశేష జన వాహినికి గల ఆరాధనను, భక్తి భావనను గ్రహించిన ప్రతాపరుద్ర చక్రవర్తి తన అపరాధానికి పశ్చాత్తా పం చెందాడు. పరిణామాలకు క్షమాపణ చెప్పి, మేడారంను కోయదొరల స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తాడు. సమ్మక్క`సారలమ్మ పేరుతో రెండు సంవత్సరాలకు ఒకసారి జాతరను వైభవంగా జరుపుకునేలా, సమ్మక్క పేరిట ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు ముత్తయిదువుల పండుగా జరిగేలా కట్టడి చేశాడు. అందుకు అవసరమైన నిధులు కేటాయించి, తాను కూడా భక్తుడయ్యాడని చారిత్రక కథనం. మేడారానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని బయ్యక్కపేట గ్రామానికి చెందిన గిరిజనుడి ఆధ్వర్యంలో మొదటి జాతర జరిగినట్లు తెలుస్తోంది.

గద్దెలే ఆలయాలు…

మేడారంలో రెండు చెట్ల చుట్టూ ‘గద్దెలు’ తప్ప ఎలాంటి ఆలయం ఉండదు. ఆ గద్దెలను సమ్మక్క, సారలమ్మ దేవతలుగా భావిస్తారు. వాటిని ‘పెద దేగి’, ‘తునికి’ అని వ్యవహరిస్తారు. ఇంకో మూలగా మరో చిన్న గద్దెపై గుర్రపు తల ఆకారంలో ఉన్న ‘లక్ష్మీ దేవర’ ప్రతిమను ఏర్పాటు చేస్తారు. జాతర సమయంలో కోయ పూజారులు సమ్మక్క అమ్మవారిని తీసుకువస్తున్నట్లు గుర్తుగా సమీపంలోని గుట్ట నుంచి కుంకుమ భరణి, వెదురు ముక్కలు తెస్తారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును గద్దెలపైకి తెస్తారు. రెండవ రోజు చిలకలగుట్ట నుంచి భరిణె రూపంలో ఉండే సమ్మక్కను తీసుకు వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.  సమ్మక్క చేరిక సమయంలో కోడి పుంజులను గాలిలోకి ఎగురవేసి ఆరగింపు చేస్తారు. పోలీస్‌ ఉన్నతాధికారి గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరుపుతారు. మూడో నాడు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. మొక్కుబడిగా సమర్పించే బెల్లాన్ని ‘బంగారం’ అంటారు. అనుకున్న కోరికలు తీరితే నిలువెత్తుల ‘బంగారం’ సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. నాలుగవ రోజు యథాస్థానికి అమ్మవార్లను (వనప్రవేశం) తరలిస్తారు.

‘వర’దేవతలు

ఈ వనమాతలను భక్తులు ‘వర’దేవతలుగా భావిస్తారు. కోర్కెలు తీర్చే దైవాలని,వారి ఆశీర్వాద బలంతో సంతాన ప్రాప్తి, దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. గద్దెలకు ప్రదక్షిణలు చేసి సంతానవతులైన వారు మరుసటి జాతరకు వచ్చి గద్దెల వద్ద తొట్టె (ఊయల)కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవార్లు గద్దెలపైకి వస్తున్న సమయంలో మొక్కితే సంతానయోగం ఉంటుందని కూడా భావిస్తారు. గద్దెమీది బెల్లం స్వీకరిస్తే దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని, అక్కడి కుంకుమ పొందితే సంతానప్రాప్తి కలుగు తుందని భక్తుల నమ్మకం. సమ్మక్కను తీసుకువస్తున్న వారికి అడ్డంగా పడుకొని, పూజారులు తమ మీదుగా నడచివెళితే జన్మతరించినట్లుగా భావిస్తారు. పిల్లలకు ఆ దేవతల పేర్లు పెట్టుకుంటారు. ఆడశిశువులకు సమ్మక్క`సారలమ్మ అని, మగశిశువులకు జంపన్న అని పేరు పెట్టుకోవడం తరుచుగా కనిపిస్తుంది.

‘బంగారం’ముడుపు

భక్తులు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని ముడుపుగా చెల్లిస్తారు. అనుకున్నవి నెరవేరినవారు బెల్లంను తులాభారంగా సమర్పించుకుంటారు. అలా నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని భక్తులందరికి పంచుతారు. బియ్యం, కొబ్బరికాయలు, పసుపు`కుంకుమలు, వస్త్రాలు,బోనాలు తదితరాలనూ సమర్పించు కుంటారు. కోడెలను కానుకగా సమర్పించడం ఈ జాతరలో మరో ప్రత్యేకత. ఈ జాతరలో శివశక్తులు (పూనకాలు) ప్రధాన ఆకర్షణగా నిలిచి ఉత్కంఠ కలిగిస్తాయి. కొత్తచీర, రెండు రవికలు ధరించి, చేతుల నిండా గాజలు, బొట్టు (మగవారు కూడా), ఒడి బియ్యంతో, తల వెంట్రుకలు విరబూసుకుని శివాలూగుతూ పలికే మాటలను సాక్షాత్తు ఆ అమ్మల పలుకులుగానే విశ్వసిస్తారు.

మద్య మాంసాలు లేకపోతే సమ్మక్క, సార లమ్మలు మెచ్చరని భక్తుల విశ్వాసం. అందుకే జాతర సమయంలో వాటిని ఆస్వాదించడాన్ని గిరిజనులు పవిత్ర కార్యంగా భావిస్తారు. మద్యంపానం, మాంసభక్షణలకు మొక్కుబడులు చెల్లించేంత ప్రాధాన్యం ఉందని వారి వాదన.

జాతరలో మరికొన్ని విశేషాలు

– జంపన్నవాగులో స్నానమాడితే పునీతులమవు తారని భక్తులు భావిస్తారు. భక్తులు అక్కడ స్నానం చేశాకే వన దేవతలను దర్శించుకోవడం ఆన వాయితీ వస్తోంది.

– స్నానానంతరం కొందరు తలనీలాలు అర్పిస్తారు.

– గద్దె సమీపంలోని జువ్వి చెట్టుకు విశేష మహిమలు ఉన్నట్లు పరిగణించి, సమ్మక్కతో సమానంగా పూజిస్తారు.

– ఒక్కొక్క ఆదివాసి తెగకు ఒక్కో జంతువు లేదా పక్షి సంకేతంగా ఉంటాయి. వాటిని తమ వంశ మూలకర్తగా భావిస్తారు. సమ్మక్కకు నాగసర్పం, సారక్కకు పెద్దపులి, పగిడిద్దరాజుకు తాబేలు సంకేతాలు. పూనకం వచ్చిన వారు పులి మాదిరిగా గాండ్రిస్తారు.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram