మే 6 అన్నమాచార్య జయంతి

రాజాశ్రయం లేనిదే కవిత్వం వెలుగుచూసేది కాదు. చాలా మంది పూర్వకవులు రాజాస్థానాలను ఆశ్రయించారు. రాజే వారికి ప్రత్యక్ష దైవం. వారి కీర్తనమే వారి నిత్యకృత్యం. వారు ఇచ్చే విలువైన కానుకలు, మడిమాన్యాలతో విలాసవంతం, భోగలాలస జీవితం గడిపిన కవుల గురించి సాహిత్య చరిత్ర చెబుతోంది. వారికి భిన్నంగా, రాజా స్థానాలను కాదని ‘ఆలయాస్థాన’ కవులుగా ప్రసిద్ధులైన వారు ఉన్నారు. దైవాన్నే నమ్మి, రచనలను ‘అమ్ము’కోని కవులు కొందరు చ•రిత్రలో కనిపిస్తారు. వారు కవితా కళను దివ్యార్చనకళగా చేసుకున్నారు. వారి సంఖ్య అల్పమే అయినా, వారి ఆదర్శం అనల్పం. అలాంటి వారిలో అగ్రగణ్యుడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు.  తనపై కీర్తనలు చెప్పలేదన్న ఆగ్రహంతో ఏలిక పెట్టిన బాధలను భరిస్తూ, ‘హరిముకుందని కొనియాడే నా నాలుక నరుడైన నిన్ను కొనియాడనేరదు’అని, ‘తన సంకీర్తనలను తిరులేశునికి అంకితం చేశారు తప్ప రాజు ఒత్తిడికి లోనుకాలేదు.

సంగీత సాహిత్యాలను మేళవించి సూక్తిరత్నా లను అందించిన వాగ్గేయకారులలో అన్నమయ్య అగ్రగణ్యులు. ఆయన కేవలం భక్తి కవి కాదు. భక్తి ద్వారా సంఘ సంస్కరణకు, సామాజిక చైతన్యానికి పాటుపడిన ప్రజాకవి. జనులలో భక్తిభావాన్ని పెంపు చేస్తూనే సామాజిక చైతన్యం తీసుకురావాలని ఆరాడ పడ్డారు. శిష్ట,జానపద సంస్కృతిని కాపాడుతూనే జనజీవననానికి సంబంధించి ఎన్నో సంకీర్తనలు రాశారు. సుమారు 32 వేల పద కవితలు రాసి, ఆలపించి ‘పదకవితా పితామహుడి’గా వినుతికెక్కారు.  తాను త్రికరణశుద్ధిగా విశ్వసించిన తిరుమలేశునికి అక్షరార్చన చేశారు. తన సంకీర్తనలలో స్వామి ఘనతను, ఆయన ఉత్సవాది విశేషాలను పేర్కొంటూనే సామాజికా అంశాలను సందర్భానుగుణంగా ప్రస్తావించారు.

జీవితంలో హెచ్చుతగ్గులు మానవ కల్పితాలు. పరమాత్మ సృష్టిలో, దృష్టిలో సర్వులూ సమానులే. ‘నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే/అండనే బంటు నిద్ర అదియు నొకటే’… రాజు హంసతూలికా తల్పంపై శయనిస్తే, బంటు కటికనేల మీద పడుకుంటాడు. పడుకునే తీరులో తేడాలు ఉండవచ్చు కానీ నిద్ర ఇద్దరికీ సమానమే. కుబేర సమానులకు, నిరుపేదలకు రేయిపగలు, వాటి పరివర్తనం ఒకటే. ధనికులు,పేదలు తీసుకునే ఆహారంలో వ్యత్యాసం ఉన్నా ‘ఆకలి’ సామాన్య లక్షణం. ఈ చరాచర సృష్టిలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా పరబ్రహ్మం ఒక్కటే నిత్యం, సత్యం. దేవదేవుడు సమస్త జీవకోటిపై ఒకే విధమైన వాత్సల్యాన్ని ప్రదర్శిస్తాడని ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే…’ అని ప్రపంచానికి చాటిచెప్పారు. కులమతవర్గవర్ణవిచక్షణ రహితంగా సమదృష్టిని అలవరచు కోవాలని ఈ సంకీర్తన ద్వారా చాటి చెప్పారు.

అన్నమయ్య సంస్కరణాభిలాషి. ఆయన జీవితం, సారస్వతం వేంకటపతి చుట్టూ పరిభ్రమించినా భక్తి బోధకమైన ఆ కమనీయ సంకీర్తనలు లోకహితాన్ని కోరేవి. ఉదారతత్వాన్ని, సమతను ప్రబోధించేవి. అజ్ఞాను లకు జ్ఞానప్రబోధకాలు. ప్రతి తాత్విక సంకీర్తనలోనూ ఎన్నో జీవనసత్యాలు ఉన్నాయి. ‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన/నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’ కీర్తనలో… హరి భక్తిలేని వేదాధ్యాయనపరుల కంటే సదా విష్ణుపాదాలను ఆశ్రయించే చదువులేని తక్కువ కులజుడు ఉన్నతుడు. వేదాంతాన్ని అధ్యయనం చేసి హరి భక్తిలేని సన్యాసి కంటే నిరంతరం విష్ణువును స్మరించే అణగారిన వర్గాలు వారు మిన్న’ అని గట్టిగా చెప్పారు.

‘ఏ కులజుడేమి యెవ్వడైన నేమి/ఆకడ నాతడె హరి నెరిగినవాడు’ సంకీర్తనలో భగవంతుడి దాస్యానికి సామాజిక భేదం అడ్డుకాదని, హరిని తెలుసుకున్న వాడే ఉన్నతుడని ప్రకటించారు. ఏ మతమైనా, ఏ కులమైనా భగవత్‌ ‌సంకల్పంతోనే ప్రవర్తిల్లు తున్నాయని, మధ్యలోని భేదభావాలు మానవ కల్పితాలని అభిప్రాయపడ్డారు. తన సంకీర్తనలలో లోకనీతిని, మానవజీవన రీతిని వర్ణించి మహితమైన హితోపదేశం చేశారు ‘కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై/పడని పాట్ల నెల్ల పడి పొరలనేలా’ కీర్తన మనిషి దురాశను ఎత్తిచూపుతూ, పట్టెడన్నం పట్టే కడుపు కోసం పుట్టెడు కష్టాలను తలకెత్తుకోవడం ఎందుకు? అనే సందేశాత్మక ప్రబోధాన్ని అందిం చారు. ‘అరయ నాపన్నునికి అభయమ్మీవలె గాక/ఇరవైన సుఖిని కావనేల’…. కష్టాలలో ఉన్నవారికి అండగా నిలవాలి తప్ప సుఖాలలో తేలియాడే వారికి చేయూత అవసరం లేదంటూ ఆపన్నులను ఆదుకో వలసిన ఆవశ్యకతను చాటి చెప్పారు. ‘చీకటిలోని వారికి దీపంతో దారి చూపాలి కానీ కాంతి ఉన్నచోట దానితో పనేముంది?’ (తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద /వెలుగు లోపలికి వెలుగేల)అని ప్రశ్నించారు.

‘నానాటి బతుకు నాటకము’ సంకీర్తనలో పుట్టడం, పోవడం నిజం. జనన, మరణాల మధ్య జరిగేదంతా నాటకం. కైవల్యం శాశ్వతం. తినే అన్నం, కట్టే వస్త్రం మినహా ఇతర తాత్కాలిక భోగాల కోసం పడే పాట్లు నాటకం. వీటిని అధిగమించ గలినప్పుడే కైవల్యం. జ్ఞానదృష్టి కలిగిన వారికి ఈ బతుకు కల లాంటిది. ఈ తత్వాన్ని తెలుసుకుంటే మోక్షం. లేదా బంధాలలో కొట్టు మిట్టాడక తప్పదు (తెలిసితే మోక్షము తెలియకున్న బంధము/కలవంటిది బతుకు ఘనునికిని) అని వివరించారు. అంటే ఈ దేహం మీద ఆశ, మమకారంలేని వారికి సుఖ దుఃఖాలు సమానం. నిష్కామకర్ములకు పాప పుణ్యాలతో నిమిత్తంలేదు.

ప్రజల భాషకు సాహిత్య గౌరవం కలిగించిన తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య. జానపదులకు ప్రాణప్రదుడు. వారి జీవభాషను తన సంకీర్తనలలో ప్రాణశ్వాసంగా నిలిపిన సాహితీమూర్తి. ఆయన సంకీర్తనలను కేవలం భక్తిభావంతో కాక అందులోని సామాజిక అంశాల పట్ల దృష్టి సారిస్తే, ఆయన దీర్ఘదర్శిత్వం, నేటి సమాజానికి ఆయన సంకీర్తనల అవసరం ఎంతో అవగతమవుతుందంటారు సాహితీ విశ్లేషకులు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram