జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్‌. ఈ ‌లెక్కలు, సర్వేల మాట వినగానే సందేహాలు వెల్లువెత్తుతాయి. ఈ లెక్కలూ, సర్వేలూ చెప్పని కొన్ని అంశాలు ఉంటాయి. అవి జనాభా పెరుగుదలలోని అసమతౌల్య ధోరణులు. దానితో వచ్చే ప్రమాదాలు. మతం పేరుతో దేశాలు ఏర్పడిన చరిత్ర ప్రపంచంలో ఉంది. జనాభా పెరుగుదల వరమా? శాపమా? జనాభాతో మనం అతి పెద్ద మార్కెట్‌గా అవతరించామా? కొత్త సమస్యలు ఏమిటి? ఆహార భద్రత ఎలా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో అసమతౌల్యంతో వచ్చే ప్రమాదాల గురించి కూడా చర్చించాలి. కచ్చితంగా జనాభా మీద స్పష్టమైన విధానం రావాలి. అది అందరూ ఆమోదించేదై ఉండాలి.

యునైటెడ్‌ ‌నేషన్స్ ‌పాపులేషన్‌ ‌ఫండ్‌ ‌తాజా సమాచారం ప్రకారం జనాభా పరంగా మనదేశం మొట్టమొదటిసారి చైనాను వెనక్కి నెట్టేసింది. దీని ప్రకారం ప్రస్తుత మనదేశ జనాభా 142.86కోట్లు. చైనా జనాభా ప్రస్తుతం 142.57 కోట్లు! ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదని ప్రశ్నిస్తే… ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన చైనాకు బదులు ఇక ఇండియా అని చెప్పాలి. 1950లో మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి (యు.ఎన్‌.) ‌ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాను తయారుచేసింది. అప్పటి నుంచి యు.ఎన్‌. ఎప్పుడు ఈ జాబితా విడుదల చేసినా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ప్రథమ స్థానం చైనాదే. ఇప్పుడు మనదేశం చైనాను తోసిరాజని ముందుకు దూసుకెళ్లింది. భారత్‌లో జననాల రేటు ఇటీవలి సంవత్సరాల్లో బాగా తగ్గినప్పటికీ, ‘పనిచేసే వయసున్న వారు’ మొత్తం జనాభాలో 75% ఉండటం సానుకూలాంశం. భారత్‌లోని ఈ శ్రామిక సంభావ్య శక్తి ద్వారా రానున్న కాలంలో, ఇప్పటికే చైనా పడుతున్న ఇబ్బందులను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలే ఎక్కువ. అయితే ఇక్కడ శ్రామిక జనాభా అధికంగా ఉండటం అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పెరుగుతున్న వీరి జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే అది ప్రతికూలాంశంగా మారడం తథ్యం.

ఫలితమిచ్చిన కుటుంబ నియంత్రణ

1901లో భారత జనాభా 23 కోట్లు. 1951 వరకు ఈ జనాభా పెరుగుదల చాలా నిదానంగా సాగింది. తర్వాతి ఐదు దశాబ్దాల కాలంలో మూడు రెట్లు పెరిగి 2001 నాటికి మనదేశ జనాభా 102 కోట్లకు ప్రస్తుతం 1.4 బిలియన్లకు చేరుకుంది. యు.ఎన్‌. ‌డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అం‌డ్‌ ‌సోషల్‌ అఫైర్స్ అం‌చనా ప్రకారం 2030 నాటికి 1.5 బిలియన్‌, 2050 ‌నాటికి 1.64 బిలియన్లకు మనదేశ జనాభా చేరుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత జనాభా దాదాపు 350 మిలియన్లు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ప్రభుత్వం 1952లో మొట్టమొదటిసారి కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టింది. అప్పట్లో సగటున ఒక స్త్రీ ఆరుగురు సంతానాన్ని కలిగి ఉండేది. అప్పటి నుంచి వరుసగా వచ్చిన ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ఇప్పటికి ‘‘ఇద్దరి’’కి పరిమితం చేయగలిగింది. దేశంలో కుటుంబనియంత్రణ అమలుకు ప్రపంచ బ్యాంకు అప్పట్లో 66 మిలియన్‌ ‌డాలర్లు రుణ సహాయం చేసింది. 1950 నుంచి 1990 వరకు దేశ ఆర్థిక ప్రగతి సగటున 4%గా కొనసాగింది. 1990ల్లో పి.వి. నరసింహారావు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమాని దేశ ప్రగతి 5.5% తర్వాత 2000 సంవత్సరం నుంచి సగటున దేశ వృద్ధిరేటు 7.7శాతం నమోదు చేస్తూ వచ్చింది. అప్పటినుంచి జనాభాపై విధానకర్తల అభిప్రాయంలో మార్పు రావడం మొదలైంది. 15-64 సంవత్సరాల మధ్య వయస్కులను ‘పనిచేసే’ వారిగా పరిగణిస్తూ, వీరిని ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా పేర్కొంటూ వచ్చారు. దీన్నే ‘డెమోగ్రాఫిక్‌ ‌డివిడెండ్‌’‌గా వ్యవహరి స్తున్నారు. ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే ప్రపంచంలోని వివిధ దేశాలు అభివృద్ధి చెందింది కేవలం ఈ ‘డెమోగ్రాఫిక్‌ ‌డివిడెండ్‌’ ‌వల్లనేనన్న సత్యం వెల్లడవు తుంది. 1990 నుంచి భారత్‌ ‌కూడా దీనివల్ల సానుకూల ఫలితాలు పొందింది.

భయపెడుతున్న నిరుద్యోగం

అధికారిక గణాంకాల ప్రకారం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.7శాతంగా ఉన్న నిరుద్యోగం, 2017-18 నాటికి 6.1శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వార్షిక సమాచారం ప్రకారం 2021-22లో ఇది 4.1శాతానికి తగ్గడం కొద్దిగా ఉపశమనం కలిగించినా, సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటర్‌ ఇం‌డియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం గత మార్చిలో దేశలో నిరుద్యోగరేటు 7.8శాతంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అధికారిక అంచనాల ప్రకారం ఏటా దేశంలో ఐదు మిలియన్ల మంది శ్రామిక మార్కెట్‌లోకి కొత్తగా చేరుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో 18-35 మధ్య వయస్కులు 600 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 65%. వీరిలో వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచడంలోనే ఆర్థిక ప్రగతితో పాటు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ముడిపడివుంది.

స్థిరీకరణ దశకు జనాభా

జనాభా శాస్త్రవేత్తల ప్రకారం సగటున స్త్రీల ‘మొత్తం గర్భధారణ రేటు’ (టోటల్‌ ‌ఫెర్టిలిటీ రేట్‌- ‌టీఎఫ్‌ఆర్‌) 2.1‌గా నమోదైనప్పుడు ఒక దేశ జనాభా స్థిరంగా ఉంటుంది. అంటే ఇందులో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల సంఖ్యను స్థిరంగా ఉంచడాన్ని, 0.1 పిల్లల్లో సంభావ్య మరణాలను సూచిస్తుంది. దీన్నే యు.ఎన్‌. ‌పాపులేషన్‌ ‌డివిజన్‌ ‘‌రీప్లేస్‌మెంట్‌- ‌లెవెల్‌ ‌ఫెర్టిలిటీ’ అని వ్యవహరిస్తుంది. ఇంతకూ చెప్పొచ్చేదే మంటే భారత్‌ ఈ ‌టీఎఫ్‌ఆర్‌కు అత్యంత సమీపానికి చేరుకుంది. అంటే జనాభా స్థిరీకరణ దశకు చేరుకున్నదని అర్థం. మనదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ టీఎఫ్‌ఆర్‌ ‌రేటు 2.1 కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ప్రముఖ డెమోగ్రాఫర్‌, ‌సామాజిక శాస్త్రవేత్త షిరీన్‌ ‌జెజీభోయ్‌ ‌ప్రకారం భారత్‌లో మొత్తం 28 రాష్ట్రాల్లో 17, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 8 ‘రీప్లేస్‌మెంట్‌ ‌దశ’కు చేరుకున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఒకవేళ మనదేశం జనాభా స్థిరీకరణ దశకు చేరుకోకపోతే జనాభా ఎంతలా పెరిగిపోయేదో ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తుం ది. దేశంలో జనాభా పెరుగుదలరేటు క్రమంగా తగ్గడమే ఈ స్థిరీకరణకు కారణం. ఉదాహరణకు 1972 నుంచి 1983 మధ్యకాలంలో వార్షిక జనాభా పెరుగుదల రేటు 2.3%గా ఉండేది. 2011 నాటికి ఇది 1.37 శాతానికి, 2017లో 0.98%కి 2023లో 0.81%కు పడిపోయింది. ఇదిలావుండగా సి.ఐ.ఎ. వరల్డ్ ‌ఫ్యాక్ట్‌బుక్‌ ‌జనాభా గణాంకాల అంచనా ప్రకారం 2022లో మనదేశ జనాభా వృద్ధి రేటు 0.67% మాత్రమే. ఇక మనకున్న మరో సానుకూలాంశం డిపెండెన్సీ రేటు కేవలం 0.4శాతం. దశాబ్దకాలం క్రితం మనదేశంలో చిన్నపిల్లల జనాభా అత్యధికంగా నమోదుకాగా ఇప్పుడది పడిపోతుండటం గమనార్హం. 1951లో దేశ జనాభాలో హిందువుల జనాభా 84.1% కాగా ముస్లింలు 2.3% మాత్రమే. అదే 2011 నాటికి హిందువుల జనాభా 79.80%కు తగ్గి, ముస్లింల జనాభా 14.23%కు పెరగడం గమనార్హం. అంటే హిందూ జనాభా వృద్ధిరేటు 16.8% (2001- 2011 మధ్యకాలంలో) కాగా ఇదే కాలంలో ముస్లింల వృద్ధిరేటు 24.6%. మిగిలిన మతాల జనాభావృద్ధి గమనించదగ్గ స్థాయిలో లేదు. 1991-2001 మధ్యకాలంలో ముస్లిం జనాభా వృద్ధిరేటు 29.52%గా ఉండగా 24.6%కు పడిపోయింది. అదేవిధంగా హిందువుల జనాభా వృద్ధిరేటు 19.92% నుంచి 16.8%కు పడిపోవడం గమనార్హం.

తయారీరంగమే కీలకం

 ప్రస్తుతం భారత్‌లో 800 మిలియన్ల శ్రామిక శక్తి ఉండగా, రాబోయే మూడు దశాబ్దాల కాలంలో ఈసంఖ్య మరో 200 మిలియన్లకు పెరగనుంది. ప్రస్తుతం తయారీరంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య 50 నుంచి 60 మిలియన్ల వరకు ఉంటుంది. 2047 నాటికి 3.5 ట్రిలియన్‌ ‌డాలర్లకు తయారీరంగ ఉత్పత్తులు చేరుకుంటాయన్నది అంచనా. అప్పటికి 85 మిలియన్లమంది ఈ రంగంలో ఉపాధి పొందుతారు. అదే 4.5 ట్రిలియన్‌ ‌స్థాయికి ఉత్పత్తులు చేరుకుంటే, 90 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తుంది. ఏ విధంగా చూసినా తయారీ రంగమే ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తుందనేది తిరుగులేని సత్యం. అయితే గడచిన రెండుదశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే, తయారీరంగం పెద్దగా పుంజుకో లేదు కానీ సేవారంగం విపరీతమైన అభివృద్ధి నమోదు చేసింది. మొత్తం దేశ స్థూల జాతీయో త్పత్తిలో సేవారంగం వాటా 45 నుంచి 55 శాతానికి చేరుకోగా తయారీరంగం వాటా 2017లో 15 శాతానికి, 2022లో కేవలం 17శాతానికే పరిమితం కావడం గమనార్హం. 2047 నాటికి భారత్‌ ఆర్థిక వ్యవస్థను 26 ట్రిలియన్‌ ‌డాలర్ల స్థాయికి తీసుకొని వెళ్లాలన్న లక్ష్యం నెరవేరాలంటే తయారీరంగం 4.5ట్రిలియన్‌ ‌డాలర్ల స్థాయికి ఎదగాలి. అప్పుడు జీడీపీలో దీని వాటా 22 శాతంగా ఉంటుంది. తయారీరంగ ప్రాధాన్యం గుర్తించిన కేంద్రం వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ), ఈజ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల వంటి సంస్కరణలను ముందుకు తెచ్చింది.

ప్రభుత్వ చర్యలు

పెరుగుతున్న నిరుద్యోగాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ‘‘మినిస్ట్రీ ఆఫ్‌ ‌స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ అం‌డ్‌ ఎం‌టర్‌‌ప్రెన్యూర్‌షిప్‌’’‌ను ఏర్పాటుచేసింది. వ్యక్తులు, సంస్థల్లో నైపుణ్యాభివృద్ధితో పాటు అవసరమైన నిధులను ఇది మంజూరు చేస్తుంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి ముద్రాయోజన (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారులు, మైక్రో ఎంటర్‌‌ప్రైజెస్‌కు రుణాలు మంజూరు చేయడం ద్వారా వారి వ్యాపార విస్తరణకు సహాయపడుతోంది. ఇదే సమయంలో ఎస్సీ/ఎస్టీ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరమైన మద్దతు కల్పనకు ‘స్టార్టప్‌ ఇం‌డియా’ను ప్రారంభించింది. మౌలికసదుపాయాల కల్పనకు కేంద్రం ప్రాధాన్యతనిస్తూ మొత్తం 1423 ప్రాజెక్టులను చేపట్టగా వీటి అంచనా వ్యయం రూ.20.38 లక్షల కోట్లు. అయితే పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఈ అంచనా రూ.24.85లక్షల కోట్లకు చేరుకుంది. మౌలిక సదుపాయాలు ఏర్పడుతుండటంతో దేశంలో చిన్న వ్యాపారాలు, మైక్రో ఎంటర్‌‌ప్రైజెస్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆశాజనక పరిణామం. నేషనల్‌ ‌శాంపిల్‌ ‌సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ‌సర్వే ప్రకారం దేశంలో 59.5% శాతం మంది చిన్నపిల్లలు మాత్రమే అక్షరాస్యులని తేలింది. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించేం దుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ గణాంకాలు దేశ ఆర్థిక ప్రగతికి పెద్ద అడ్డంకి. దీన్ని అధిగ మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2015-18 మధ్యకాలంలో దేశంలో 150 కొత్త విశ్వవిద్యా లయాలు, 1570 కళాశాలల నిర్మాణం జరిగింది. అంతేకాకుండా మరో ఏడు ఐ.ఐ.టి.లు, ఏడు ఐ.ఐ.ఎం లకు ఆమోదం లభించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం మూడు దశాబ్దాల తర్వాత 2020లో నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, తగిన రీతిలో ఉపాధ్యాయ శిక్షణపై దృష్టిపెట్టింది.

మేకిన్‌ ఇం‌డియా కార్యక్రమం కింద, ఉత్పత్తి- అనుసంధాన ప్రోత్సాహకాల తోపాటు ఇతర పథకాలు దేశంలో ప్రస్తుతం పెద్దఎత్తున ఎలక్ట్రానిక్స్, ఆటో విడిభాగాలు, టెక్స్‌టైల్‌ ‌పరిశ్రమల ఏర్పాటును ఆకర్షిస్తున్నాయి. కంపెనీల అవసరాలకు అను గుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం కూడా ‘స్కిల్‌ ఇం‌డియా’ కింద ప్రభుత్వం చేపడుతున్న మరో కార్యక్రమం. వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం ప్రకారం దేశంలో పెద్దసంఖ్యంలో యువత ఉన్నప్పటికీ వీరిలో కేవలం 5% మందికి మాత్రమే అవసరమైన నైపుణ్యాలున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మనదేశంలోని కళాశాలల్లో విద్య కేవలం థియరీ ఆధారంగా ఉండటమే. ఇదికూడా యువతలో నైపుణ్యాలు కొరవడటానికి మరో కారణం. ప్రపంచ అసమానతల గణాంకాల ప్రకారం దేశంలో కేవలం 10శాతం మంది చేతిలో 60 శాతం సంపద కేంద్రీకృతమై ఉండగా, 50 శాతం మందిలో ఉన్నది 6 శాతం మాత్రమే. మరి ఇందుకు ప్రధాన కారణం నైపుణ్యాలు కొరవడటం. మొత్తం జనాభాలో గ్రామీణ యువత 65%. మరి వీరికి వర్తమాన అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు అందిస్తేనే ఆర్థిక ప్రగతి సాధ్యం. అప్పుడు మాత్రమే ‘డెమోగ్రాఫిక్‌ ‌డివిడెండ్‌’ ‌వల్ల ప్రయోజనం.

ఆసియా-యూరప్‌ల్లో పెరుగుతున్న వృద్ధులు

ఆసియా, యూరప్‌ ‌దేశాల్లో వృద్ధుల జనాభా బాగా పెరిగిపోవడం ఆయా దేశాలను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య. ఈవిషయంలో భారత్‌ ‌మెరుగైన స్థితిలోనే ఉంది. 28% వృద్ధుల జనాభాతో జపాన్‌ ‌ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా, 23%తో ఇటలీ రెండోస్థానంలో ఉంది. ఫిన్లాండ్‌, ‌పోర్చుగల్‌, ‌గ్రీస్‌లు 22% కంటే తక్కువ వృద్ధుల జనాభాతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ యూరప్‌ ‌దేశాలైన క్రొయేషియా, గ్రీస్‌, ఇటలీ, పోర్చుగల్‌, ‌సెర్బియా, స్లొవేనియా, స్పెయిన్‌ ‌దేశాల్లో 65 సంవత్సరాలు దాటినవారి జనాభా 21%గా నమోదైంది. అదే చైనాలో 65 ఏళ్లు దాటినవారి జనాభా 12% కాగా, యుఎస్‌లో 16%, ఇండియాలో 6%, నైజీరియాలో 3%. క్రీ.శ.1800 నాటికి ప్రపంచ జనాభా ఒక బిలియన్‌కు చేరడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడితే, కేవలం వంద సంవత్సరాల కాలంలోనే అది రెట్టింపయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జనాభా వృద్ధి క్షీణి స్తుండటంతో క్రమంగా ఆయా దేశాల్లోని శ్రామికశక్తి, వృద్ధాప్య దశకు చేరుకుంటోంది. భారత్‌లో ప్రస్తుతం మధ్యస్థ వయసు (మీడియమ్‌ ఏజ్‌) 28.4 ఉం‌డగా, యు.ఎస్‌.‌లో 38.3, చైనాలో 38.4, యు.కెలో 40.5గా నమోదైంది. అదే ప్రపంచ మధ్యస్థ వయస్సు 30.4. మధ్యస్థ వయస్సు తక్కువగా ఉండటమే భారత్‌కు అనుకూలాంశం. అయితే ఒక అంచనా ప్రకారం భారత్‌లోని యువత ఎప్పటి కప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమను తాము మార్పు చేసుకునే సామర్థ్యం ఎక్కువ. ఇది మనదేశానికి ఒక వరం లాంటిదనే చెప్పాలి. ఇదిలావుండగా ప్రపంచ జనాభాలో మనదేశ జనాభా 16శాతం. ఇంత జనాభా కేవలం ప్రపంచ భౌగోళిక స్వరూపంలో కేవలం 2.45 శాతం భౌగోళిక విస్తీర్ణంలో ఉండటం గమనార్హం. ప్రపంచ నీటి వనరుల్లో 4% మాత్రమే మనదేశంలో ఉన్నాయి. అయినప్పటికీ అభివృద్ధిలో భారత్‌ ‌ముందుకు దూసుకెళుతుండటం విశేషం.

చైనా దుగ్ధ

ప్రస్తుతం జనాభాపరంగా చైనా రెండోస్థానంలో ఉన్నప్పటికీ, ‘శ్రామికశక్తి’ తగ్గిపోవడం పెనుశాపంగా మారింది. మరోమాటలో చెప్పాలంటే అక్కడ వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోయింది. దేశంలో 60ఏళ్లు దాటిన వారి సంఖ్య 20శాతం ఉండగా ఇది 2035 నాటికి 30 శాతానికి చేరుతుందని అంచనా. అయితే భారత్‌లో ‘శ్రామికశక్తి’ గణనీయంగా ఉండటం ఆ దేశానికి కొరుకుడు పడటం లేదు. తన ఈర్ష్యను దాచుకోలేదు కూడా. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ ‌వెన్‌బిన్‌ ‌మాట్లాడుతూ ‘‘కేవలం జనాభా పరంగా ముందుంటే సరిపోదు. ‘రాసి’ కంటే ‘వాసి’ ముఖ్యం’’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. ‘చైనా మొత్తం 1.4బిలియన్‌ ‌జనాభాలో 900 మిలియన్ల మంది ‘‘పనిచేసే వయసు’’లో ఉన్నారు. వీరిలో సగటున 10.9 సంవత్సరాలు విద్యను అభ్యసించిన వారని చెప్పడం ద్వారా తమదేశంలో ‘నాణ్యత’ ఎక్కువ అని స్వోత్కర్షకు పోయారు.

నిజం చెప్పాలంటే గత దశాబ్దాల్లో చైనా ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందడానికి కారణం ‘వాసి’ లేదా నిపుణులైన పనివారు కాదు, తక్కువ ఖర్చుకే శ్రామికులు లభ్యం కావడం అంటూ అంతర్జాతీయ పరిశీలక గ్రూపు ‘‘రెడ్‌ ‌లాంటెన్‌ అనెలిటికా’’ స్పష్టం చేసింది. నిజం చెప్పాలంటే చైనా చేసిన ప్రకటనలో ‘అభద్రతాభావం’ కనిపిస్తోంది. ఇక్కడ గుర్తించాల్సిన మరో ముఖ్య విషయం ఒకటుంది. ప్రపంచంలోని ఫార్చూన్‌ 500 ‌కంపెనీలకు అధినేతలుగా భారతీయులే ఉండటం! మరి దీన్ని ‘రాసి’ అనాలా? లేక ‘వాసి’ అనాలా? మరో విషయం ఏంటంటే, చౌకగా లభించే చైనా ఉత్పత్తులు ఎంత నాసిరకంగా ఉంటాయో ప్రపంచ దేశాలన్నింటికీ అనుభవమే! మరి ‘నిపుణులైన’ పనివారుంటే ఇది జరుగుతుందా… అంటూ రెడ్‌ ‌లాంటెన్‌ అనెలిటికా ప్రశ్నించింది. అంతేకాదు అవినీతి, వ్యాపారంలో అనైతికత, ఉన్నత స్థాయిలోని వారి నిరంకుశత్వం వంటివి కూడా చైనా ఉత్పత్తుల్లో నాణ్యత కొరవడటానికి మరో కారణం. ‘న్యూయార్క్ ‌టైమ్స్’ ‌సరిగ్గా దీన్నే ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో భారత్‌లో జనాభా పెరుగుదలపై ‘నాణ్యత’ అంశాన్ని లేవనెత్తడం కేవలం చైనా కమ్యూనిస్టు పార్టీ గురివిందతనాన్నే వెల్లడిస్తున్నదని రెండ్‌ ‌లాంటెన్‌ అనెలిటికా దెప్పిపొడిచింది. పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా ఏడవ జనగణన ప్రకారం వచ్చే దశాబ్దకాలంలో వార్షిక ‘శ్రామికశక్తి’ లోటు 11.8మిలియన్లుగా అంచనా వేసింది. చైనాలో ప్రస్తుతం ‘అత్యున్నత నైపుణ్య’ రంగాల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆర్థిక ఫోరం నివేదిక ప్రకారం చైనాలో 170 మిలియన్ల నిపుణులైన పనివారున్నప్పటికీ, మొత్తం ఉపాధి పొందుతున్న వారిలో అత్యున్నత నైపుణ్యం కలిగి సంక్లిష్టమైన టాస్క్‌లను పరిష్కరించ గలిగే సామర్థ్యమున్నవారు కేవలం 7% మాత్రమే. అందువల్ల చైనా ఎంతగా గొప్పలు చెప్పుకున్నా అక్కడి శ్రామికశక్తి నాణ్యత అంతంత మాత్రమే అన్నది సుస్పష్టం.

పోటీని అధిగమించాలి

వేగంగా మార్పు చెందే ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెరగడం ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు. ఇందుకు సుదీర్ఘ ప్రణాళిక, ప్రభుత్వ ముందుచూపు అవసరం. దురదృష్టవశాత్తు గత 75 ఏళ్లుగా మన దేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఇదే. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాభి వృద్ధిపై దృష్టిపెట్టి, ఆ దిశగా పథకాలను అమలు చేస్తోంది. దేశంలో యువత సంఖ్య అధికంగా వుండటం మనకు కలిసొచ్చిన అదృష్టం.

ఇటీవలి కాలంలో తయారీరంగ హబ్‌గా వేగంగా వృద్ధి చెందుతూ మనకు గట్టి పోటీ ఇస్తున్న వియత్నాంలో కూడా వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మరోదేశం ఫిలిప్పీన్స్‌తో పోలిస్తే భారత్‌లో 15-64 సంవత్సరాల మధ్య వయస్కుల సంఖ్య కొద్దిగా అధికం. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో చైనాకు గట్టిపోటీ ఇవ్వగల మరో దేశంగా ఫిలిప్పీన్స్ ఎదుగుతోంది. విస్తారమైన మార్కెట్‌ ‌కలిగిన భారత్‌లో పెరుగుతున్న విదేశీపెట్టుబడులకు అనుగుణమైన ‘నైపుణ్య శ్రామికశక్తి’ ఇప్పుడు తక్షణావసరం. పెట్టుబడులను ఆకర్షించడంలో వియత్నాం, ఫిలిప్పీన్స్ ‌వంటి దేశాలు ముందుండటాన్ని భారత ప్రభుత్వం ముఖ్యంగా గమనించాలి. పెట్టుబడులు రావాలంటే సత్వర నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకం. ఈ విషయంలో మనదేశం మరింత మెరుగు పడితేనే నేటి పోటీ ప్రపంచంలో నిలబడటం సాధ్యం.

——————————————————

నాలుగు సమస్యలు

జనం కూడా జలం వంటిదే అంటాడు ఆధునిక కవి. జన విస్ఫోటనం విపత్తు వరకు పోకుండా జాగ్రత్తపడితే అది వరమే అవుతుంది. లేకుంటే కొన్ని సమస్యల గురించి ముందుగానే ఆలోచించాలి.

  1. గతంలో వలె ఇప్పుడు జననాల రేటు, మరణాల రేటు అత్యధికంగా లేవు. పైగా ఆధునిక పరిజ్ఞానం, సదుపాయాల కారణంగా మరణాల రేటు తగ్గింది. చాలా వర్గాలు కుటుంబ నియంత్రణను నిజాయితీగా పాటించడం లేదు. జనాభా పెచుతున్నారు. దీనితో గ్రామీణ ప్రాంతాలలో యువతరం ఎక్కువ సంఖ్యలో తయారువుతుంది. వీరి జీవనానికి అవకాశాలు కల్పించడం పెద్ద సమస్య. ఇప్పటికే జనాభాలో 25 మిలియన్లు ఇళ్లు లేనివారు. 171 మిలియన్లు మంచినీటి వసతి లేనివారు.
  2. దేశంలో జనాభా పెరుగుదల సమస్యలో నిగూఢంగా ఉండిపోతున్న అంశం స్త్రీపురుష నిష్పత్తిలో తేడా. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వేయి మంది పురుషులకు 940 మంది మహిళలే ఉంటున్నారు. నిజానికి చాలా దేశాలలో పురుషు జనాభా తక్కువ. స్త్రీ జనాభా ఎక్కువ. ఇక్కడ అందుకు భిన్నంగా పురుష జనాభా పెరుగుతోంది. ఇది పెద్ద సాంఘిక సమస్య.
  3. జనాభా పెరుగుదలతో పాటు, వారి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోకపోతే వచ్చే ప్రమాదం- జీవన ప్రమాణాలు పడిపోతాయి. ఇంకా చెప్పాలంటే జనం పౌష్టికాహార లోపం బారిన పడతారు. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికే భారత్‌లో పౌష్టికాహార లోపం సమస్య కొంచెం గట్టిగానే ఉంది. కాగా, రోజులు మారేకొద్దీ మూఢ నమ్మకాలు పోతాయనీ, ఆదాయాన్ని పద్ధతి ప్రకారం వ్యయం చేసుకునే అలవాటు వస్తుందని నమ్మకం పెట్టుకోవడం దురాశేనని తేలిపోయింది. కాబట్టి కొన్నేళ్ల తరువాత కూడా అవే సమస్యలు ఉంటాయి. అంటే అదే పౌష్టికాహార లోపం, అదే తక్కువ రకం జీవన ప్రమాణాలు దేశంలో చాలామంది ఎదుర్నొవలసిన స్థితిలో ఉంటారు.
  4. ఇది ఇంకాస్త ప్రమాదకరమైన పరిణామం. జనాభా పెరుగుదల మీద అదుపు లేకపోతే మొదట ఎదురయ్యేది నిరుద్యోగ సమస్య. వయస మీద పడినా ఉద్యోగం దొరకనివారి సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి యువతరం సమాజానికి బరువుగానే కాదు, ప్రమాదకరంగా కూడా పరిణమిస్తుంది. అవాంఛనీయ పోటీకి దారి తీస్తుంది. దీనితో చాలామంది అసాంఘిక శక్తులుగా తయారయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకొనే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. దేశంలో రోజు రోజుకూ వ్యవసాయానికి దూరమైపోతున్న తరాలు పెరుగు తున్నాయి. కానీ ఇప్పటికీ సేద్యమే భారత జీవనాధారం. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు మరీ తక్కువ. అలాగే ప్రైవేటు, సేవా రంగాలు కూడా పూర్తి స్థాయిలో ఆదుకునే సామర్ధ్యం కలిగి ఉండవు. పట్టణాలు, నగరాలు మరింత రద్దీగా తయారవుతాయి.

మతాంతరీకరణలు, చొరబాట్లు జనాభా సమతౌల్యాన్ని చెడగొడుతున్నాయి!

దేశ జనాభా ఎంత? పురుషులు ఎందరు? మహిళలు ఎందరు? ఏ వయసు వారు ఎందరు? ఉత్పాదక సామర్థ్యం కలిగిన వారు ఎంతమంది? వృద్ధులు ఎంతమంది? విద్యావంతులు ఎందరు? వృత్తి నిపుణులు ఎందరు? గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయా? ఇవన్నీ జనగణనలో సర్వ సాధారణమైన అంశాలు. అలాగే పెరిగిన జనాభా వరమా? శాపమా? అని చర్చించడం కూడా కీలకమే. కానీ అంతకు మించి జనాభా విషయంలో గుర్తించి తీరవలసిన అంశాలు చాలా ఉన్నాయని కొన్ని సంస్థలు, వ్యక్తులు కూడా గట్టిగా భావిస్తారన్న విషయాన్ని విస్మరించలేం. అది విస్మరిస్తే వచ్చే సమస్య అతి ప్రమాదకరమైనది కూడా. జనాభా అంశం మీద ప్రధానంగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌లేవనెత్తే అంశాలను ఎప్పటికీ దృష్టి పెట్టవలసినవే. ప్రపంచ రాజకీయాలు, కొన్ని మత విశ్వాసాల వారి విస్తరణ కాంక్ష, చాపకింద నీరులా సాగే కుట్రలు భారతీయ సమాజం గుర్తించవలసి ఉంటుందనేది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిశ్చితాభిప్రాయం. హిందూ జనాభా ఉనికి గుర్తించి సంస్థ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి.
దేశాలు, నాగరికతల వృద్ధిక్షయాలు జనాభాలో వచ్చే అసమతౌల్యంతో తారుమారవుతాయన్నది నిజం. ఇదే ప్రపంచదేశాల చరిత్రలో కనిపించే వాస్తవం. అందుకే ఆధునిక కాలంలో జనాభా పెరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయ పడుతున్నారు. ఇందుకు తగ్గట్టే సమాజం కూడా స్పందించవలసి ఉంటుంది. ఈ విషయంలో ముస్లింల అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. జనాభా పెరుగుదలను హిందూ-ముస్లిం సమస్యగా చూడ వద్దని ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ ‌ఖురేషీ తన పుస్తకంలో స్పష్టంగానే చెప్పారు. ముస్లింలు కూడా కుటుంబ నియంత్రణ పాటించాలని కోరారు. కానీ ఇందుకు ఆ వర్గం సిద్ధంగా ఉందని చెప్పడానికి నిర్దిష్టమైన ఆధారాలు ఉండవు. ఇక్కడ ముస్లింల జనాభా పెరుగుదలను మాత్రమే కాకుండా, బెంగాల్‌, అస్సాం, నేపాల్‌తో మన సరిహద్దులలో పెరిగిన ముస్లిం జనాభాను కూడా గమనంలోకి తీసుకోవాలని ఆయన అంటారు. అలాగే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో హిందూ జనాభాలో రెండు శాతం తగ్గుదల కనిపించింది. ఆ మేరకు ముస్లిం జనాభా పెరిగింది.

భారత్‌ ‌వంటి దేశంలో జనాభా పెరుగుదలలో అసమతౌల్యం సుస్పష్టం. ఇక్కడి మెజారిటీ ప్రజల ఉనికి, అస్తిత్వాలకు సంబంధించిన ప్రశ్న అందులో ఉంది. జనభా పెరుగుదలలో అసమతౌల్యం పెద్ద సమస్యేననీ, జనాభా విషయంలో ఒక సుస్థిర విధానం ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆది నుంచి కోరుతున్నది. అందరికీ ఆమోదయోగ్యమైన విధానం ద్వారా జనాభాలో అసమతౌల్యానికి చోటు లేని విధంగా చట్టాలు చేయాలని అక్టోబర్‌ 6, 2022‌న నాగపూర్‌లో జరిగిన సమావేశంలో సర్‌సంఘ్‌ ‌చాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌సుస్పష్టంగా కోరారు. భారతదేశం తన సహజత్వాన్ని, ఉనికిని కోల్పో కుండా ఉండాలంటే హిందువుల జనాభా తగ్గి, ఇతర మతాల వారి జనాభా పెరిగితే సాధ్యం కాదని నిర్మొహమాటంగానే చెప్పారు. అక్టోబర్‌ 20, 2022‌న ప్రయాగరాజ్‌లో జరిగిన అఖిల భారతీయ కార్యకారి మండలి బైఠక్‌ల సందర్భంగా సర్‌ ‌కార్యవాహ్‌ ‌దత్తాత్రేయ హొసబళె ఇదే విధంగా అభిప్రాయపడిన సంగతి గుర్తుచేసు కోవాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆం‌దోళన వెనుక ఉన్న హేతువును పరిగణనలోనికి తీసుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ ఏడున్నర దశాబ్దాలలో హిందువుల జనాభా తగ్గింది. ముస్లింల జనాభా గణనీయంగా పెరిగింది. దేశంలో మతాంతరీకరణలు, చొరబాట్లు ప్రమాదకర స్థాయిలో సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్‌ ‌నుంచి భారత్‌కు వచ్చి తిష్ట వేసిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. అలాగే రొహింగ్యాలు. వీరికి ఆధార్‌కార్డులు, ఓటర్‌ ఐడీలు, రేషన్‌ ‌కార్డులు ఇచ్చి ఓటు బ్యాంకును బలపరుచుకునే రాజకీయ పార్టీలు కూడా మనకు ఎక్కువే. హిందూ సమాజంలోని లోటుపాట్లే ఆయుధంగా మతాంతరీకరణలు జరుగుతున్నాయి. దానికి ఏకైక కారణం హిందూ జనాభాను తగ్గించడమే. అంతేతప్ప ఇక్కడి పేదలను ఉద్ధరించడానికి కాదు. గడచిన నాలుగైదు దశాబ్దాలుగా అనుసరిస్తున్న జనాభా విధానం వల్ల కొన్ని కుటుంబాలలో సభ్యుల సంఖ్య 3.4 నుంచి 1.9కి తగ్గిపోయింది. ఇలాంటి తగ్గుదల అన్ని వర్గాలలోను కనిపించదన్నది వాస్తవం. దీనితో అసమతౌల్యం సమస్యే కాదు, కొన్ని దశాబ్దాలలో వృద్ధుల సంఖ్య హెచ్చుగాను, యువతరం సంఖ్య తక్కువగాను నమోదవుతుందని హొసబళె చెప్పారు. నిజానికి ఇవాళ చైనాలో కనిపిస్తున్న వాస్తవం ఇదే. అందుకే తమ సంస్థ 2004 నుంచి 2015 వరకు కూడా అనేక సమావేశంలోను ఇందుకు సంబంధించిన తీర్మానాలను ఆమోదిస్తూనే ఉన్నదని ఆయన గుర్తు చేశారు.
ముస్లిం జనాభా పెరుగుదల దేశంలో ఒక వాస్తవం. అంటే జనాభా పెరుగుదలలో అసమతౌల్యం తిరుగులేని నిజం. 1951లో దేశంలో ముస్లిం జనాభా 9.8 శాతం. 2011 నాటికి అది 14.2 శాతానికి ఎగబాకింది. అలాగే క్రైస్తవ జనాభా కూడా పెరిగింది. ఈ జనాభాకు మూలం మతాంతరీకరణలు. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లో 2001లో 18.72 శాతం ఉన్న క్రైస్తవులు 2011 నాటికి 30.26 శాతానికి చేరుకున్నారు. మేఘాలయలో వారి జనాభా 2001లో 70.25 శాతం. 2011 నాటికి 74.59 శాతం. ఈశాన్యంలో ఎక్కడ చూసినా 2001-2011 మధ్య క్రైస్తవ జనాభా పెరుగుదల మూడు నుంచి నాలుగు శాతం పెరిగింది. ఆఖరికి పంజాబ్‌లో కూడా వారి జనాభా పెరిగింది. అయితే వీరిని క్రిప్టో క్రిస్లియన్లు అంటున్నారు. అంటే బయటికి సిక్కు మతాను అనుసరించేవారిగానే ఉంటారు. కానీ ఆచరణ మాత్రం క్రైస్తవం. నిజానికి భారతదేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇలాంటి క్రైస్తవులే అధికం. పంజాబ్‌లో పెరిగిన క్రైస్తవ జనాభా మీద స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోవడానికి కారణం కూడా ఇదే.
ముస్లిం మతోన్మాదం, కొన్ని క్రైస్తవ వర్గాలు, కొందరు దారి తప్పిన సిక్కులు ప్రత్యేక దేశం నినాదాలు వినిపిస్తున్న తరుణంలో జనాభా సమతౌల్యం మీద చట్టాలు తేవడం అత్యవసరం. 1947లో ఈ దేశాన్ని మత ప్రాతిపదికగానే విభజించారు. దానికి ఇప్పటికీ భారతదేశం మూల్యం చెల్లించుకుంటున్నది. అలాంటి కుట్రలకు మళ్లీ మళ్లీ అవకాశం ఇవ్వవలసిన అవసరం లేదు. తమ మతస్థుల సంఖ్యను పెంచుకుని ప్రత్యేక దేశం కోరే కుట్రలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. అందుకు భారతదేశం కేంద్రబిందువుగా మారిపోయింది. దీనిని ఎదుర్కొనవలసి అవసరం ఉందనేదే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విధానం.
– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram