సంపాదకీయం

శాలివాహన 1945 వైశాఖ శుద్ధ చవితి – 24  ఏప్రిల్‌ 2023, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


హిందూద్వేషం, మైనారిటీల బుజ్జగింపు, వేర్పాటువాదం, పిడివాదం కలగలసిన విధ్వంసక ధోరణి పేరే ద్రవిడవాదం. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), స్టాలిన్‌ ‌నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఈ వాదానికి చిరకాలంగా రాజపోషకులు. హిందూ వ్యతిరేకతే పరమావధిగా అవి దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్నాయి. అందుకే హిందువుల ఐక్యత కోసం, హక్కుల కోసం పోరాడుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ఒక్క ప్రదర్శన (పథసంచలనం) అనుమతికోసం ఆరుమాసాలు పడిగాపులు పడవలసివచ్చింది. ఈ దేశంలో హిందువుల కోసం పనిచేసే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏటా జరుపుకునే  కార్యక్రమం కోసం హైకోర్ట్, ‌సుప్రీం కోర్ట్‌ల చుట్టూ తిరగవలసి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్టోబర్‌ 2, 2022‌న తమిళనాట జరగవలసిన పథ సంచలనం సుప్రీంకోర్ట్ అనుమతించిన తరువాత ఎట్టకేలకు ఏప్రిల్‌ 16‌న 45ప్రాంతాలలో జరిగింది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రబోధించే జాతీయవాద విజయం.

చెన్నై, మధురై, కాంచీపురం, చెంగల్పట్టు ప్రాంతాలలో పథ సంచలనం  జరిగింది. ఇంత బృహత్తర కార్యక్రమం నిర్వహించినప్పటికి ఒక్క అవాంఛనీయ ఘటన కూడా జరగలేదు. ప్రతి పథ సంచలనంలోను 400 నుంచి 500 మంది స్వయంసేవకులు గణవేష్‌తో పాల్గొన్నారు. కానీ ఏదో ఉపద్రవం పొంచి ఉన్నదన్న భయాలను రేకెత్తిస్తూ డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని ఖాకీవనం చేసేసింది. తిరుచిరాపల్లి పథ సంచలనంలో 500 మంది స్వయంసేవకులు పాల్గొంటే, 1200 పోలీసులు మోహరించారు. ఈ పథ సంచలనంలోనే శివాజీ 350వ పట్టాభిషేక కార్యక్రమం, వల్లలార్‌ 200‌వ జయంతి, డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌జయంతి ప్రదర్శనలను కూడా జోడించారు.

విజయదశమికి ఏటా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పథ సంచలనం నిర్వహించడం దేశ మంతటా ఉంది. కొవిడ్‌ ‌వల్ల 2020, 2021 సంవత్సరాలలో  నిర్వహించ లేదు. ఇదే సాకుగా ఎంకే స్టాలిన్‌ ‌ప్రభుత్వం 2022 సంవత్సరంలో తలపెట్టిన పథ సంచలననానికి అనుమతి నిరాకరించింది. దీనితో న్యాయపోరాటం తప్పలేదు. డీఎంకే ప్రభుత్వం పెట్టిన అడ్డంకులను చెత్తబుట్ట దాఖలు చేసిన మద్రాస్‌ ‌హైకోర్ట్ ‌సెప్టెంబర్‌ 22, 2022‌న పథ సంచలనానికి అనుమతించ వచ్చునని తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్కారుకు అక్కడా తల బొప్పికట్టింది. హైకోర్ట్ ఆదేశాలు సరైనవేనని ప్రకటిస్తూ, జస్టిస్‌ ‌వి. రామ సుబ్రమణియన్‌, ‌జస్టిస్‌ ‌పంకజ్‌ ‌మిట్టల్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పథ సంచలనానికి అనుమతిస్తూ  ఏప్రిల్‌ 11‌న ఆదేశాలు జారీ చేసింది. ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదంటూ  తమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పీలు,  అందులో చెప్పిన కారణాలు ఎంత హాస్యాస్పదమో, జుగుప్సాకరమో సుప్రీం కోర్ట్ ‌వ్యాఖ్యలతోనే అర్ధమవుతుంది. నిషిద్ధ పీఎఫ్‌ఐ ‌వల్ల ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సభ్యులకు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది కాబట్టి అనుమతించబోమని ప్రభుత్వ వాదన. నిషిద్ధ సంస్థ వల్ల బాధితులు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారే అని చెబుతూనే వారి మీదే తిరిగి నిషేధాస్త్రం ప్రకటించడం ఇక్కడి విశేషం. ఇదంతా పీఎఫ్‌ఐ ‌నిషేధంతో దిగాలుపడిపోయిన ముస్లిం మతోన్మాదులను సంతృప్తి పరచడానికి డీఎంకే ప్రభుత్వం నిస్సిగ్గుగా తీసుకున్న నిర్ణయం. ఈ అంశాన్ని సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం గమనంలోకి తీసుకున్నది. మొదట అనుమతి కోరిన అక్టోబర్‌ 2, 2022‌న క్రైస్తవులు ఎక్కువగా చర్చికి వెళతారు కాబట్టి పథ సంచలనానికి అనుమతించలేమని ప్రభుత్వం చెప్పడం చూస్తే ఈ ద్రవిడవాదాలు, కమ్యూనిజాలు, మానవహక్కుల ఉద్యమాలు హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతి పెద్ద సంస్థకు ఇచ్చిన మర్యాద ఏమిటో అర్థం కావడం లేదా? స్వతంత్ర భారతదేశంలోనూ హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులు మాత్రమేనని గుర్తు చేయడం కాదా?  నిజానికి పథ సంచలన్‌ ‌స్వయంసేవకులకు ఇచ్చే తర్ఫీదులో భాగంగా సామర్ధ్యం పెంపునకు ఉద్దేశించినదేనని ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. స్వయం సేవకులలో అన్ని వర్గాలవారు, అన్ని స్థాయిలలోని వారు ఉంటారని  వెల్లడిం చింది. రోజు కూలీలు, విద్యార్థులు, కార్మికులు, ఉన్నత పదవులలో ఉన్నవారు స్వచ్ఛందంగా భాగస్వాములవుతారని ఆ ప్రకటనలో ఉంది. సంఘ్‌ ‌పథ సంచలనం అంటే అసాధారణ క్రమశిక్షణను పాటిస్తూ ప్రజలకోసం నిర్వహించే ప్రదర్శన. హిందూ ఐక్యతను చాటడమే పథ సంచలనం అసలు లక్ష్యం. హిందూ సమాజం క్రమశిక్షణతో, సమయ పాలనను అనుసరిస్తూ, వ్యవస్థీకృ తంగా నడవగలదని ప్రజానీకానికి వెల్లడించడం కూడా దీని ఉద్దేశమే.

హైకోర్ట్, ‌సుప్రీం కోర్ట్ అనుమతించినా కొన్ని ఆంక్షల నడుమ పథ సంచలన్‌ ‌నిర్వహించవలసి వచ్చింది. ముస్లింల అడ్డాల గుండా ప్రదర్శన సాగరాదన్నది వాటిలో ఒకటి. అక్కడ ఉన్న ముస్లిం ప్రార్థనామందిరాల మీద స్వయంసేవకులు రాళ్లు విసురుతారట. అవన్నీ మాకు అనవసరం, శాంతిభద్రతలు కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని నిక్కచ్చిగా సుప్రీంకోర్ట్ ‌తెగేసి చెప్పింది. దేశంలో ఎక్కడైనా ఏ మతం వారైనా, వర్గం వారైనా ప్రదర్శన నిర్వహించుకోవచ్చునని పునరుద్ఘా టించింది. 2017నుంచి ఇలాంటి పథ సంచలనాలు జరుగుతున్నాయి. రాళ్లు విసిరిన ఒక్క ఉదంతం చూపమని బీజేపీ ప్రతినిధి అడిగితే ద్రవిడవాదులు తెల్లముఖాలువేశారు. పీఎఫ్‌ఐ ఉ‌గ్రవాదసంస్థ అని, అది తప్పుచేసిందనీ ఒప్పుకుంటున్న డీఎంకే ప్రభుత్వం ఆ సంస్థను నిషేధించమని ఏనాడూ అడగలేదు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రదర్శన మీద ఆంక్షలు విధించింది. ఇదంతా మైనారిటీలలో ఉన్న ఆధిపత్య భావనను భద్రంగా కాపాడడం కాదా? పీఎఫ్‌ఐ ఉపయోగించిన తుపాకుల కంటే, స్వయంసేవకులు ధరించే ‘దండ’తోనే ఎక్కువ ప్రమాదమని భావించే ఈ చెత్తబుర్రలకు మరమ్మతు తక్షణావసరం.

About Author

By editor

Twitter
YOUTUBE