‌ప్రభుత్వ ఉత్తర్వు. గవర్నమెంట్‌ ఆర్డర్‌ (‌జీవో). ప్రజలు ఎన్నుకున్న   ప్రభుత్వం  తీసుకునే నిర్ణయాధికారాలకు సంబంధించి జారీచేసే ఈ ఉత్తర్వులకు భయపడ వలసిన అవసరం లేదు. అదే సమయంలో  వాటిని  దాచవలసిన అవసరం అంతకన్నా లేదు. ప్రజాప్రభుత్వం అంటేనే ప్రజల బాగోగుల బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించేది. అలాంటిది, ఇప్పుడు ప్రభుత్వ తీరు గోప్యమవుతోంది.  ధైర్యంగా బయటకు చెప్పాల్సిన అంశాలు కూడా చాటున ఉండి పోతున్నాయి. అంటే… తాము తీసుకునే నిర్ణయాలు అసంబద్ధం, స్వార్థంతో కూడుకున్నవని, కేవలం కొన్ని  ప్రయోజనాల కోసమేనని అంగీకరించి నట్లవుతోంది. ఈ ఉత్తర్వులు  బహిర్గతమైతే తన స్వార్థపూరిత చర్యలు బయటపడతా యన్న భయం  ప్రభుత్వంలో  కనిపిస్తోంది. రాష్ట్ర ఖజానాకు గండికొట్టే జీవోలపై విపక్షాలు, ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి.

 ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు అని చదువుకున్నాం. రాజ్యాంగంలోనూ అదే ఉంది. ప్రభుత్వం జారీ చేసే ఏ ఉత్తర్వు అయినా ప్రజలకు తెలియవలసి ఉంది. వారు చూడడానికి, పరిశీలించ డానికి అవి అందుబాటులో ఉండాలి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుత జీవోలను అప్‌లోడ్‌ ‌చేసే వెబ్‌సైట్‌.. ఒక డార్క్ ‌వెబ్‌సైట్‌ ‌మాదిరిగా తయా రైంది. ప్రభుత్వం జారీ చేసే ప్రతి ఉత్తర్వు అందులో కనపడాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వానికి ఏ ఇబ్బందీ కలిగించని, సాధారణ జీవోలు మాత్రమే ఆ వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. బదిలీలు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, కొన్ని పదవులకు సంబంధించిన నియామ కాలు లాంటి కీలక ఉత్తర్వులు అందులో కనిపించడం లేదు. వాటి అవసరం ఉన్నవారికి మాత్రమే అవి వెళుతున్నాయి. మిగతావాళ్లకు కనీస సమాచారం కూడా తెలియడం లేదు.

 ఇప్పుడే కాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే తీరు. ప్రభుత్వ పథకాలు, భూసేకరణ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ‌బదిలీలు, నియామకాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిధుల విడుదల…లాంటి కీలకాంశాల జీవోలను ప్రభుత్వం దాచి పెడుతోంది. వాట్సాప్‌ ‌గ్రూపుల్లో , లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన వాట్సాప్‌ ‌గ్రూపు ద్వారా మాత్రమే వాటిని సర్క్యులేట్‌ ‌చేస్తోంది. అదీ, ప్రభుత్వానికి ఇబ్బందులు లేవనుకునే ఉత్తర్వులను మాత్రమే. కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

పారదర్శక పరిపాలన లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉత్తర్వులను చాలాకాలం నుంచి వెబ్‌సైట్‌లలో పెట్టడం ప్రారంభించాయి. ఈ కోవలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా జీవోలను అప్‌లోడ్‌ ‌చేయడం ద్వారా ప్రజలందరికీ అందు బాటులో ఉంచేందుకు ‘http://goir.telangana. gov.in’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో 32 శాఖలకు సంబంధించిన జీవోలను అప్‌లోడ్‌ ‌చేయాల్సి ఉంటుంది. ఈ శాఖలన్నింటి నుంచీ యేటా 6వేల నుంచి 8 వేల దాకా ఉత్తర్వులు వెలువడుతుంటాయి. వీటిలో.. ప్రభుత్వ పథకాలు, నిధుల మంజూరు, ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు మార్పులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పదవీ విరమణలు, ముఖ్యమైన నియామకాలు, వివిధ కమిషన్ల ఏర్పాటు, ఐఏఎస్‌లు/ ఇతర అధికారుల బదిలీలు, పదవీ బాధ్యతల అప్పగింత, వివిధ రకాల అనుమతులు, అంశాలకు సంబంధించిన ఉత్తర్వులు ఉండాలి. కానీ, కొన్ని ముఖ్యమైన జీవోలు ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌కావడం లేదు.

 ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రసమితి-టీఆర్‌ఎస్‌ (‌నేటి భారత రాష్ట్ర సమితి- బీఆర్‌ఎస్‌) ‌మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకుంది. నాటినుంచి వివాద రహితమైన, సాధారణ పరి పాలనకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేస్తోంది.

ఈ క్రమంలోనే పేరాల శేఖర్‌రావు అనే సామాజిక కార్యకర్త 2019లో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) ‌దాఖలు చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన జూన్‌ 2, 2014 ‌నుంచి ఆగస్టు 15,2019 వరకు మొత్తం లక్షా 4 వేల 171 ఉత్తర్వులు జారీకాగా, వాటిలో 43వేల 462 జీవోలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌కాలేదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, ‘ప్రజలకు తెలియాల్సిన ప్రభుత్వ ఉత్తర్వులను ఎందుకు దాచిపెడుతున్నారు?’అని అడ్వొకేట్‌ ‌జనరల్‌(ఏజీ)ని ప్రశ్నించింది. ఆ ఐదేళ్లలో కనిపించకుండా పోయిన జీవోలన్నిటిని జీవోఐఆర్‌ ‌వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేయాలని కూడా ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యపెట్టలేదు. దీంతో ‘వాచ్‌ ‌వాయిస్‌ ఆఫ్‌ ‌పీపుల్‌’ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిల్‌ ‌దా•లు చేసింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అభ్యంతరకరమని వాదించింది. కేసీఆర్‌ ‌తన మానస పుత్రికగా చెప్పుకునే, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దళితబంధు పథకానికి సంబంధించిన జీవో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌కాలేదంటూ ఆ సంస్థ ఆరోపించింది. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, దళితబంధు జీవోను 24 గంటల్లోగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేయాలంటూ 2021 ఆగస్టులో ఆదేశించింది. అయినా ప్రభుత్వ తీరులో ఎలాంటి మార్పూ కనిపించలేదు.

ఇక, తాజా పరిణామాలు గమనిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌ 1‌వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు (35 రోజుల్లో) బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సుమారు 250 ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వాటిలో వివాదరహితం, ఎవరికీ ఇబ్బంది కలిగించని, సాధారణమైనవి 163 మాత్రమే వెబ్‌సైట్‌లో కనిపిస్తు న్నాయి. విపక్షాలు, సామాజిక సంస్థలు, ప్రజల నుంచి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు వచ్చే అవకాశం లేదని నిర్ధారించుకున్న ఉత్తర్వులను మాత్రమే వెబ్‌సైట్‌లో పొందుపరిచి చేతులు దులుపుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో గత రెండేళ్ల కాలంలో వేల సంఖ్యలో జీవోలు జారీకాగా, వెబ్‌సైట్‌లో పదుల సంఖ్యలోనే దర్శనమిస్తున్నాయి. రవాణా శాఖకు సంబంధించి ఒక్క కీలక జీవో కూడా కనిపించడం లేదు. సాధారణ పరిపాలన, ఆర్థిక, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి ముఖ్యమైన శాఖలకు సంబంధించిన కీలక జీవోలు కూడా అప్‌లోడ్‌ ‌కావడం లేదు. రాష్ట్రంలో 80,039 పోస్టులను నేరుగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఆర్థిక శాఖ ఇప్పటి వరకు దాదాపు 62 వేలకు పైగా పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. కానీ. వీటికి సంబంధించి చాలా జీవోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేయడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కాంట్రాక్టుపై సేవలు అందిస్తున్న 11,103 మందిని క్రమబద్ధీక రిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శాసనసభ వేదికగా చేసిన ప్రకటన మేరకు పది శాఖలకు సంబంధించి 5,544 మంది సర్వీసులను ప్రభుత్వం క్రమబద్ధీకరిం చింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఏప్రిల్‌ 30‌వ తేదీన జీవో నంబర్‌ 38‌ను జారీ చేసింది. అయితే ఇదీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు.

ఐఏఎస్‌ అధికారులు కోరెం అశోక్‌రెడ్డి, బి.గోపి, ఆశిష్‌ ‌సంగ్వాన్‌లను బదిలీ చేస్తూ , కె.హైమావతి, ఎం.సత్యశారదా దేవి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలంటూ సాధారణ పరిపాలన శాఖ ఏప్రిల్‌ 28‌న జారీ చేసిన ఉత్తర్వు (జీవో నంబర్‌ 613) ‌కూడా వెబ్‌సైట్‌లో గల్లంతయ్యింది. మహారాష్ట్రకు చెందిన శరద్‌ ‌మర్కడ్‌ను ముఖ్య మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా నియమిస్తున్నట్లు మే 2వ తేదీన జీవో (నంబర్‌ 647) ‌జారీ కాగా మే 5వ తేదీన వాట్సప్‌ ‌గ్రూపుల ద్వారా బయటకు వచ్చింది. ఈ జీవో ప్రకారం.. అతనికి నెలకు లక్షా యాభైవేల వేతనం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది.

ఉత్తర భారత్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ ‌ఝా అనే వ్యక్తిని సరిగ్గా యేడాది క్రితం సీఎం కేసీఆర్‌ ‌పీఆర్‌ఓగా నియమించారు. అందుకు సంబంధించి జీవో (నెంబర్‌ 601) ‌గత ఏడాది ఏప్రిల్‌ 6‌న జారీ అయ్యింది. ఆయనకు నెలకు రెండు లక్షలరూపాయల జీతంతో పాటు ప్రభుత్వ ఖర్చులతో ఢిల్లీలో బంగ్లా, కారు సమకూర్చారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ ‌జిల్లా నివ్‌ ‌దుంగే గ్రామానికి చెందిన శరద్‌ ‌మర్కడ్‌ అనే యువకుడు ఏప్రిల్‌ 1‌న బీఆర్‌ఎస్‌లో చేరారు. ఏడాదికి రూ.18 లక్షల జీతంపై అతనిని ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌ప్రైవేటు సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల (మే) 2న జీవో జారీచేశారు (మర్కడ్‌ అప్పటికే అక్కడ ఉద్యోగి). అదే ఇప్పుడు రాష్ట్రంలో అగ్గిని రాజేసింది. నిజానికి, సీఎం కేసీఆర్‌ ‌దగ్గర ఇప్పటికే నలుగురు పీఏలు, ముగ్గురు పీఆర్వోలు పని చేస్తు న్నారు. మరొకరిని నియమించుకోవడం ముఖ్య మంత్రి విచక్షణాధికారమే అయినప్పటికి, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వ్యవహారాలు చూసే వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వ ఖజానానుంచి జీతాలు చెల్లించడంపై విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుండగా, పార్టీకి పనిచేసే వాళ్లకు ప్రభుత్వం నుంచి జీతం ఎలా చెల్లిస్తారని ప్రధానంగా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి జీవోలు ఇవి మచ్చుకు మాత్రమే. వెలికి చూడని అంశాలు ఇంకెన్నెన్నో! ఎన్నెన్నో ఇలాంటి జీవోలు గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర ఖజానాకు చిల్లులు పెడుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలు…అనే మూడుఅంశాలపైనే తెలంగాణ ఉద్యమంనడిచింది. కానీ, ఆ కీలక లక్ష్యాలు కను మరుగైపోయాయన్న వాదనలు ఎక్కువయ్యాయి. ఉద్యమ సమయంలో మన కొలువులు మనకేనని చెప్పిన కేసీఆర్‌, అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో స్థానికులను విస్మరించి ఇప్పటికే కొలువులున్న మహారాష్ట్రవాసులకు మరిన్ని అవకాశాలు కల్పి స్తున్నారని, ప్రజాధనాన్ని పార్టీ కార్యకలాపాల కోసం వాడుతున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

సొంత రాష్ట్రంలో కొలువులు భర్తీ చేయని సీఎం.. పక్క రాష్ట్రం వారికి ఉద్యోగాలు ఇస్తూ, బీఆర్‌ఎస్‌ ‌విస్తరణ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. వివిధ అంశాలకు సంబంధించిన ఉత్తర్వులను రహస్యంగా ఉంచడం వెనుక మర్మం ఏమిటి? అని నిలదీస్తున్నారు. జీవోలను పబ్లిక్‌ ‌డొమైన్‌లో పెట్టాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. దీనిపై నిరుద్యోగులకు కేసీఆర్‌ ‌సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. పార్టీలో చేరినందుకు నజరానాగా శరద్‌ ‌మర్కడ్‌కు ఉద్యోగం ఇచ్చిన కేసీఆర్‌.. ‌టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగ నియామక ప్రశ్నపత్రం లీకేజీతో నష్టపోయిన లక్షలాది మంది నిరుద్యోగులకు ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.

 జీవోలను ప్రజలకు తెలియకుండా దాచి పెట్టడం వారి హక్కులను కాలరాసినట్లేనని రాజకీయ, ఆర్థిక నిపుణులు అంటున్నారు. అధికారిక రహస్యాల చట్టం పరిధిలోకి వచ్చే అంశాలకు సంబంధించిన జీవోలను మాత్రమే రహస్యంగా ఉంచాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని, లేదంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ)‌ను ఉల్లంఘించ డమే అవుతుందని పేర్కొంటున్నారు. సమాచార హక్కు చట్టంలోని చాప్టర్‌ 2, ‌సెక్షన్‌ 2, 4 ‌నిబంధనల ప్రకారం ప్రతి అంశాన్నీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని, ప్రభుత్వం విధిగా సమాచారాన్ని వెల్లడించాలని ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ.. హైకోర్టు ఆదేశించినా, చట్టాలు ఘోషిస్తున్నా, ప్రతి పక్షాలు విమర్శిస్తున్నా, ప్రజలు అడుగుతున్నా. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మాత్రం తనదైన పంథాలోనే సాగిపోతోందని, తన ధోరణిని మాత్రం మార్చు కోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్‌

By editor

Twitter
Instagram