– రాజేశ్వర్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్‌

‌నేషనలిస్టు కాంగ్రెస్‌ ‌పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి శరద్‌పవార్‌ ‌రాజీనామా, వెనక్కి తీసుకోవడం ప్రహసనాన్ని తలపిస్తోంది. పవార్‌ ఇం‌తటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, మళ్లీ ఎందుకు వెనక్కి తగ్గారో ఎవరికీ అర్థం కాదు. సాధారణంగా పార్టీలో తమ మాట చెల్లుబాటుకాని పరిస్థితుల్లో,  తమ అస్థిత్వానికి ముప్పు ఏర్పడుతున్న తరుణంలోనో, వేరొక నాయకుడి నుంచి ప్రతిఘటన ఎదురవుతుందన్న అనుమానం  కలిగినప్పుడో… అధినేతలు ఇటువంటి ఎత్తుగడలు ప్రయోగిస్తుంటారు. చివరికి వందిమాగధుల వీరాభిమానం, నిర్ణయాన్ని  వెనక్కి తీసుకోవాలన్న తీర్మానాలు, సీనియర్‌ ‌నేతల విజ్ఞప్తులు, వినతులు వచ్చినప్పుడు పార్టీ ప్రయోజనాల కోసమంటూ అధినేతలు వెనక్కి తగ్గుతుంటారు. ఇది దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల్లోను జరిగే  తంతే. ఇప్పుడు పవార్‌ ‌పార్టీలోనూ ఇదే పరిస్థితి. తరువాత హడావిడి సద్దుమణిగింది.  ఇది ఊహించని పరిణామం ఏమీ లేదు.

ఇటీవల కొంతకాలంగా పార్టీలో తెరవెనుక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మేనల్లుడు అజిత్‌పవార్‌, ‌కన్నకూతురు సుప్రియా సూలే రూపంలో ఇద్దరు రాజకీయ వారసులు ఉన్నారు. ఇద్దరు పార్టీ పగ్గాలు కావాలని కోరుకుంటున్నారు. ‘నీటి కన్నా రక్తం చిక్కనిది’ అన్నది  సామెత. సహజంగానే పవార్‌ ‌చూపంతా కూతురు సుప్రియ సూలే పైనే ఉంది. అజిత్‌ ‌పవార్‌కు పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన లేదు. 1969లో జన్మించిన సుప్రియ సూలే తొలుత రాజ్యసభ సభ్యురాలిగా రాజకీయ అరంగ్రేటం చేశారు. ప్రస్తుతం ఆమె ‘బారామతి’ ఎంపీ. ఆ నియోజకవర్గం పవార్‌ ‌కుటుంబానికి పెట్టని కోట వంటిది. ఆమె అక్కడి నుండి లోక్‌సభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. అక్కడి నుంచి పలుమార్లు నెగ్గిన పవార్‌ ‌తన స్థానాన్ని కూతురికి వారసత్వంగా కట్టబెట్టారు. ఆమె ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. పార్టీలో కొంతకాలంగా తెరవెనుక జరుగుతున్న పరిణామాలను తండ్రి, తనయ గమనిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అజిత్‌పవార్‌ ‌కుట్రలు, ఎత్తుగడపై ఒక కన్నేసి ఉంచుతున్నారు.

వీటిని దృష్టిలో ఉంచుకునే ఇటీవల సుప్రియా సూలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో, ముంబయిలో త్వరలో రెండు రాజకీయ పేలుళ్లు జరుగుతాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అజిత్‌ ‌పవార్‌ను దృష్టిలో పెట్టుకునే ఆమె ఆ ప్రకటన చేశారనే వాదన రాజకీయవర్గాల్లో వినపడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని తన ‘ఆత్మకథ’ ఆవిష్కరణ సందర్భంగా పవార్‌ ‘‌రాజీనామా’ అంటూ సంచలన ప్రకటన చేశారన్న వాదనలు వినపడుతున్నాయి.

ఇక్కడ అజిత్‌పవార్‌ ‌గురించి చెప్పుకోవలసి ఉంది. పుణెకు చెందిన ఆయన మరాఠా రాజకీయాల్లో తలపండిన నేత. అపరచాణక్యుడు. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్ట. రాజకీయ వ్యూహ రచనలో మామ పవార్‌ను మించిన ఘనుడు. 8 సార్లు రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవశాలి. ఆర్థిక, ప్రణాళిక వంటి అనేక కీలకశాఖలకు సారథిగా పనిచేసిన దీటైన నాయ కుడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించా లన్నది ఆయనది చిరకాల వాంఛ. ఇప్పటి వరకు ఆ పదవి కోసం అనేకసార్లు ప్రయత్నించి చివరి క్షణంలో విఫలమయ్యారు. ఇక మేనమామ మాదిరిగా ఆయనకు సిద్ధాంతపరమైన బాదరబందీ అంటూ ఏమీ లేదు. పూర్తి ఆచరణాత్మకవాది. అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా పావులు కదపడంలో దిట్ట. పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు దన్నుగా ఉన్నారు. పవార్‌ ‌నీడలో తాను రాజకీయంగా ఎదగలేనన్న భావన ఉంది. పవార్‌ ‌తన కుమార్తె రాజకీయ జీవితానికే ప్రాధాన్యమిస్తారు తప్ప తన గురించి ఆలోచించరన్నది అజిత్‌పవార్‌ అభిప్రాయం. అందుకే పవార్‌ ‌రాజీనామా నిర్ణయాన్ని ప్రక టించగానే ఉపసంహరించుకోవాలని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో కోరినా, అజిత్‌పవార్‌ ‌మాత్రం మౌనంగా ఉండిపోయారు. పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్నది ఆయన ఆలోచన. ఆయన ఏడు పదుల వయస్సుకు దగ్గరలో ఉన్నారు రాజకీయంగా అనామకులైన ఎంతోమంది అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సందర్భాలు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయి. ఇప్పటి ముఖ్యమంత్రి ఏకనాథ్‌ ‌షిండే తన కన్నా గొప్ప నాయకుడు ఏమీ కాదని ఆయన అభిప్రాయం.  వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే అజిత్‌పవార్‌ ‌రాజకీయంగా పావులు పార్టీలు కదిపినట్లు  విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎత్తుగడ ఫలించినట్లు లేదు. దీంతో ఆయన తాత్కాలికంగా వెనక్కి తగ్గారు.

అజిత్‌ ‌పవార్‌ ‌రాజకీయ వ్యూహాలను గమనించే పవార్‌ ‌ముందుజాగ్రత్తగా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారన్న వాదన వినపడుతోంది. ఎనిమిది పదుల వయసు దాటిన శరద్‌ ‌పవార్‌ ‌రాజకీయాల్లో అపర చాణక్యుడు. పూర్తిగా ఆచరణవాది. తనకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని అనుకుంటే ఎలాంటి అడుగులు వేయడానికైనా వెనుదీయని వ్యక్తి. మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, పీవీ నరసింహారావు మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా, 2004లో యూపీఏ పాలనలో మన్మోహన్‌సింగ్‌ ‌మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా, అనంతరం భారత క్రికెట్‌ ‌నియంత్ర మండలి (బీసీసీఐ)కి అధ్యక్షుడిగా పని చేశారు. అయితే రాజకీయంగా ఎంత మాత్రంగానూ నమ్మదగ్గ వ్యక్తి కాదన్న పేరుంది. 1999లో సోనియాగాంధీ విదేశీవనిత అంటూ అభ్యంతరం వ్యక్తంచేసి పార్టీని వీడి నేషనలిస్టు కాంగ్రెస్‌ ‌పార్టీ పేరిట సొంత కుంపటి పెట్టారు. అప్పటి నుంచి మళ్లీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ పెద్ద ప్రభావం చూపలేక, ఉప ప్రాంతీయ పార్టీగానే మిగిలి పోయింది. 1999 నుంచి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్పటికీ రెండో స్థానానికే పరిమిత మవుతోంది. దీంతో ఉప ముఖ్య మంత్రి పదవితోనే సరిపెట్టు కోవలసి వస్తోంది.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన శరద్‌పవార్‌కు రాజకీయంగా భారీ ఆశలే ఉన్నాయి. ఏనాటికైనా ప్రధాని కావాలన్నది ఆయన చిరకాల వాంఛ. సమీప భవిష్యత్తులో ఆ కల నెరవేరే అవకాశం లేదని ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అయితే 2024 ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రధాని పదవికి తన పేరు ప్రక టిస్తారన్న ఆశ ఎక్కడో మారుమూల దాగి ఉంది. లేనట్లయితే కనీసం రాష్ట్రపతి పదవికైనా తన పేరు పరిశీలిస్తారన్న ఆశ ఉంది. అందుకనే ఇటీవల కాలంలో విపక్షాల ఐక్యత గురించి అదేపనిగా హడావిడి చేస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఆయన విశ్వసనీయత గురించి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ అవినీతి వ్యవహారాల గురించి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ అదేపనిగా ప్రచారం చేస్తూండగా, పవార్‌ ఇటీవల అదానితో భేటి కావడం అనేక అనుమానాలకు ఆస్కారమిచ్చింది.

అలాగే, అదానీపై ఆరోపణ గురించి జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గురించి కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తుండగా, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండబోదని పవార్‌ ‌చేసిన వ్యాఖ్యలు గందరగోళం సృష్టించాయి. గతంలో బోఫోర్స్ ‌వ్యవహారంపై  కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ‌నాయకుడు శంకరానంద్‌ ‌నాయకత్వంలో జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పీవీ హయాం 1992లో చోటు చేసుకున్న హర్షద్‌ ‌మెహతాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్‌ ‌నాయకుడు రామ్‌నివాస్‌ ‌మీర్థా నాయకత్వంలో జేపీసీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇవన్నీ తెలిసినప్పటికీ అదానీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ చాలంటూ పవార్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి. తాజాగా రాజీనామా ఎత్తుగడ కూడా కూతురు సుప్రియా సూలే రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిందేనన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక అదే సమయంలో రాజీనామా ప్రకటన కూడా మేనల్లుడు అజిత్‌ ‌పవార్‌ ‌దూకుడును అడ్డుకునేందుకేనన్న వాదన రాజకీయ వర్గాల్లో వినబడుతోంది.

About Author

By editor

Twitter
Instagram