– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ

అధికారం కోసం ప్రజలకు వైసీపీ లెక్కలేనన్ని హామీలిచ్చింది. అందులో ముఖ్యమైనది సంపూర్ణ మద్యపాన నిషేధం. ‘మద్యపానం కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 స్టార్‌ ‌హోటల్స్‌కి మాత్రమే పరిమితం చేస్తాం’ – 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ ఇచ్చిన హామీ ఇది. ఆ హామీని నమ్మి ఓటేసి గెలిపించినందుకు అక్రమ సంపాదన కోసం మాట తప్పి, తన బినామీల చేత నాసిరకం మద్యం తయారు చేయించి, అమ్ముతూ తమ కుటుంబాలను నట్టేట ముంచాడని మహిళలు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల నోటి కాడ కూడు లాగేసుకుంటున్నారని, తమ పుస్తెలనే తెంచుతున్నారని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నిర్వహిస్తున్న ఛార్జిషీట్‌ ‌కార్యక్రమంలో అభియోగాలు నమోదుచేస్తున్నారు.

అధికారం సాధిస్తే ఇక సంపాదనకు లైసెన్సు ఇచ్చినట్లే అన్నట్లు వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. నాలుగేళ్ల పాలనను చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది. ఈ నాలుగేళ్లలో పాలన మాట పక్కనపెట్టేసి సొంత ఆదాయం సంపాదించే పనిలో పడిందనేది రాష్ట్రవ్యాప్తంగా తెలిసిన విషయమే. ముఖ్యంగా మద్యం అమ్మకాలకు ఉన్న డిమాండ్‌ను ఆధారంగా చేసుకున్న వైసీపీ ప్రభుత్వం దానిని తమ సొంత ఆదాయ వనరుగా మార్చుకుంది.

నిరంతర ఆదాయ వనరు

ప్రస్తుత కాలంలో మద్యం వ్యాపారం నిరంతర ఆదాయ వనరుగా మారింది. ఏ వ్యాపారానికి అయినా నష్టాలుంటాయి కాని మద్యం వ్యాపారానికి మాత్రం నష్టాలు రావు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల దీనినే ఆయుధంగా చేసుకుని డబ్బు సంపాదించాలని వైసీపీ నాయకులు భావించారు. బ్రాండెడ్‌ ‌మద్యం అమ్మితే కొంత వాటా మాత్రమే దక్కుతుంది. కాబట్టి తామే డిస్టిలరీలు నడపాలని, రాష్ట్రంలో మద్యం దుకాణాలు మొత్తం తమ ఆధ్వర్యంలోనే ఉండాలని వైసీపీ అనుకుని ఈ విధమైన నిర్ణయం తీసుకుంది.

అంతా దోపిడీ

గెలవగానే ఏడాదికి కొన్ని చొప్పున మద్యం దుకాణాలు రద్దుచేస్తామని ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించింది. మద్యం దుకాణాలు, బార్ల లైసెన్సులు రెన్యూవల్‌ ‌చేయలేదు. మద్యం తామే అమ్ముతామని ప్రకటించింది. తొలిరోజు దుకాణాలకు వెళ్లిన మందుబాబులు హతాశులయ్యారు. అక్కడున్న బ్రాండ్లు, ధరలు చూసిన వారికి కళ్లు బైర్లు కమ్మాయి. గతంలో లభ్యమైన బ్రాండ్లు లేవు. ఏపీలోనే తయారుచేసినట్లు తెలిపే లేబుళ్లలో కొత్త కంపెనీలు, కొత్త బ్రాండ్లతో రెండు రెట్లు అధిక ధరలతో మద్యం బాటిళ్లు కనిపించాయి. ఏ బ్రాండు అడిగినా లేదని ఇవే ఉన్నాయని, వేరేవి రావని చెప్పడంతో వినియోగదారులు చేసేది లేక వాటినే కొనుగోలు చేశారు.

నాణ్యత లేని సరుకు

ప్రభుత్వం అమ్మే దుకాణాల్లోని మద్యంలో నాణ్యత లేదని వినియోగదారులు విమర్శిస్తున్నారు. చీప్‌ ‌లిక్కర్‌ ‌తయారుచేసి దానిని రెండు రెట్లు అధిక ధరకు అమ్ముతున్నారని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో బ్రాండెడ్‌ ‌క్వార్టర్‌ ‌బాటిల్‌ ‌మద్యాన్ని రూ.200ల నుంచి దుకాణాల్లో అమ్మితే, ఈ ప్రభుత్వం తమ దుకాణాల్లో నాసిరకం మద్యాన్ని రూ.300ల నుంచి ఇంకా హెచ్చుధరలకు అమ్ముతున్న విషయం తెలిసిందే. ఈ నాసిరకం మద్యం తాగిన వారు అతి కొద్ది రోజుల్లోనే అనా రోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మద్యంలో విషరసాయ నాలు ఉన్నట్టు చెన్నైలోని ఎస్‌జీఎస్‌ ‌ల్యాబ్‌ ‌పరీక్షల్లో వెల్లడైనట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ నాయకుల ధనదాహంవల్ల తమ కుటుంబాలు బజారున పడుతున్నట్లు నాసిరకం మద్యం తాగి మరణించిన వారి కుటుంబ సభ్యులు శాపనార్ధాలు పెడుతున్నారు. మద్యం ధరలు అమాంతం పెంచ డంతో ఏజన్సీ ప్రాంతాల్లో నాటుసారా తయారీ భారీగా జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఇలా నాటుసారా తాగి మరణించిన వారి కుటుంబాలు అనాథలైపోయాయి. ఈ నాటుసారా తయారీదారులు కూడా వైసీపీ నాయకులేనని బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక మద్యం మత్తులో జరుగుతున్న అత్యాచారాలు, గ్యాంగ్‌ ‌రేప్‌లు, హత్యలకు కొదవేలేదు.

డిస్టిలరీల ద్వారా మద్యం తయారీ

బ్రాండెడ్‌ ‌మద్యం కంపెనీల నుంచి భారీగా కమీషన్‌ను అడిగితే వారు ఇవ్వలేమని చెప్పడంతో తామే మద్యం తయారు చేసి అమ్ముకునేందుకు వైసీపీ నిర్ణయించుకున్నట్లు రాష్ట్రం మొత్తం కోడైకూస్తోంది. ఆ పార్టీ నేతలు ఇక్కడున్న డిస్టిలరీల యాజ మాన్యాలను ఏదొక రీతిలో లొంగదీసుకుని వాటిని తామే అద్దెకు తీసుకుని నాసిరకం మద్యం తయారు చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో డిస్టిలరీల నుంచి ఒక క్వార్టర్‌ ‌మద్యం బాటిల్‌ను రూ. 7.30కి కొంటే నేడు వైసీపీ ప్రభుత్వం సరాసరి రూ.33కి కొంటోందని సమాచారం. అంటే రూ. 25.70 పెంచింది. ఇలా కొంటున్నందుకు సగానికి పైగానే కమీషన్‌ ‌రూపంలో అధినేత జేబుల్లోకి వెళ్లిపోతుందనేది ప్రధాన ఆరోపణ. నాసిరకం మద్యాన్ని ఎందుకు మూడేసి రెట్లు అధిక ధరకు అమ్ముతున్నారని విపక్షాలు వేసిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

అంతా సొంత జేబులోకే

ప్రస్తుతం రాష్ట్రంలో మద్యంషాపులు 2,934. మద్యం మాల్స్ 300. ‌మొత్తం కలిపి 3,234 నడుస్తున్నాయి. వీటితో పాటు మెబైల్‌ ‌బెల్ట్ ‌షాపులు 3 లక్షలకు పైగా ఉన్నాయి. ఇవన్నీ వైసీపీ నేతలు నడుపుతున్నారని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు చెబుతున్నారు. గ్రామాల్లో రోజుకు ఒక వైన్‌ ‌షాపులో లక్ష రూపాయలు, పట్టణాల్లో రూ.3 లక్షలు, నగరాల్లో రూ. 5 లక్షలకు తగ్గకుండా అమ్మకాలు జరుగు తున్నాయని చెబుతున్నారు. అంటే ఒక్కో మద్యం షాపు ద్వారా ఒక రోజుకు సగటున 3 లక్షల రూపాయల విలువ గల మద్యం విక్రయిస్తున్నారని భావించవచ్చు. దీనిని బట్టి రాష్ట్రంలో ఉన్న 2,934 షాపుల ద్వారా ఒక ఏడాది మద్యం విక్రయాల విలువ రూ.31,687 కోట్లుగా ఉంటుందని విపక్షాలంటు న్నాయి. కానీ, ప్రభుత్వం చూపుతున్న విక్రయాల విలువ మాత్రం సగటు రూ.24 వేల కోట్లు మాత్రమే ఉంది. రూ.7 వేల కోట్ల విక్రయాలు బయటకు తెలీనివ్వడం లేదంటున్నారు. ఈ అమ్మకాల డబ్బును నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు పంపుతున్నట్లు ఎందరు ఆరోపణలు చేసినా వారు మాత్రం పెదవి విప్పడం లేదు. వైసీపీ పాలనలో 1 జూన్‌ 2019 ‌నుంచి మార్చి 2023 వరకు ఏడాదికి రూ.24 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ. 94,240 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపారు. అమ్మకాలు చూపని రూ.7 వేల కోట్లు కలిపితే ఏడాదికి రూ.31 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లకు రూ.1,22,000 కోట్లు విలువ కలిగిన మద్యం అమ్మినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఒక క్వార్టర్‌పై రూ.25 చొప్పున కమీషన్‌ ‌తీసుకుంటూ ఈ నాలుగేళ్లలో 40 వేల కోట్లకు పైగా వెనకేసు కున్నట్లు ప్రధాన పార్టీలు ఆరోపిస్తున్నాయి. నాలుగేళ్ల నుంచి ఈ ప్రభుత్వంపై విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా పెదవి విప్పడం లేదు. దీనిని బట్టి నిజంగానే పార్టీ అధినేతలు కమీషన్‌లకు కక్కుర్తిపడి ఈ తతంగాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రజలు నమ్ముతున్నారు.

ఇక అమ్మఒడి పథకానికి వైసీపీ ఎంత ప్రచారం చేసిందో నాన్న బుడ్డి పేరుతో దీనికి వ్యతిరేకంగా ప్రజలు ప్రచారం చేస్తున్నారు. అమ్మఒడి పేరుతో ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం రూ.14 వేలే ఇస్తోంది. అది కూడా ఈ నాలుగేళ్లలో ఇప్పటికి మూడు సార్లు మాత్రమే ఇచ్చింది. కాని అంతకు కొన్ని రెట్ల డబ్బును మద్యం తాగే కుటుంబాల నుంచి లాగేసింది. ప్రభుత్వం అమ్మే మద్యం దుకాణంలో ఒక్కో వ్యక్తి తాగే క్వార్టర్‌ ‌బాటిల్‌ ‌మద్యంపై కనీసం రూ.వంద నుంచి రూ.150 వరకు అదనపు భారం వేశారు. అంటే ఒక్కో కుటుంబంపై నెలకు రూ.3 వేల నుంచి రూ.4,500 వరకు అదనపు భారం పడింది. అంటే ఏడాదికి రూ.36 వేల నుంచి రూ.50 వేలను పేదల నుంచి ఈ ప్రభుత్వం లాగేసుకుంటోంది. అమ్మఒడి పేరుతో ఇచ్చేది ఏడాదికి రూ.14 వేలు. తీసుకునేది మాత్రం దానికి మూడింతలు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం నాలుగేళ్ల అమ్మకాలు 94,240 కోట్లు, అనధికార అమ్మకాల ప్రకారం అయితే రూ.1,22,000 కోట్లు ప్రజల జేబులు ఖాళీచేసి వసూలు చేసినవే.

About Author

By editor

Twitter
YOUTUBE