వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– కోపల్లె విజయప్రసాదు (వియోగి)

ఆరు సంవత్సరాల తరువాత దసరా పండుగకు సరదాగా మా ఊరు వచ్చాను. అమ్మా, నాన్నా నా కోసం ఎదురు చూస్తూ పలవరిస్తూ ఉండటంతో ఒక వారం సెలవు మంజూరు చేయించుకుని భార్యా,పిల్లలతో వచ్చాను. సునందకు పల్లెటూరి వాతావరణం నచ్చదు. ఆమె పుట్టి పెరిగింది పట్టణాల్లో ! అందుకే పిల్లలతో మా ఊరికి రావాలంటే యిష్టపడదు. పచ్చటి పల్లెటూరు అయినా రహదారులు గతుకులమయం. మెయిన్‌ ‌రోడ్డుకు పాతిక కిలోమీటర్ల దూరంలో వుంది. అందుకే అది వృద్ధి చెందలేదు. అయినా మా ఊరు డెవలప్‌ ఎలా అవుతుంది, అక్కడి పిల్లలు నాలాగా చదువుకుని ఉద్యోగాలకు విదేశాలకు, సిటీలకు వలస పోతూంటే!

సిటీలో అలవాటైన నిద్ర! అందులో ప్రయాణ బడలిక! మధురమైన మురళీనాదంతో మెలకువ వచ్చింది. ఏమిటాని గదిలోంచి బయటకొచ్చి చూశాను.

మా అరుగుల ముందు పగటి వేషగాళ్లు దర్శనం ఇచ్చారు. పంచ పాండవులు, శ్రీకృష్ణుడు నిల్చోని ఉన్నారు. శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నాడు. ఒక పాత సినిమా పాట మధురంగా వినిపిస్తున్నది. భీముడు గదని ఆడిస్తున్నాడు. అర్జునుడు ధనుస్సును ఎక్కుపెడుతున్నాడు. ధర్మరాజు పాచికలు పైకి విసురుతున్నాడు. నకులసహదేవులు కత్తి డాలుతో నిల్చుని ఉన్నారు. ద్రౌపది కనపడలేదు.

నిద్రపోతున్న నానిగాడిని, బుజ్జిని లేపి బయటకు తీసుకొచ్చాను. బుజ్జికి ఆరేళ్లు ఉంటాయి. నానికి నాలుగేళ్లుంటాయి. ఆ విచిత్ర వేషధారులను చూసి గంతులేశారు.

ఇంతలో అమ్మ చాటలో బియ్యం పోసి తెచ్చింది. నాన్న ఒక పచ్చనోటును తీసి ఆ చాటలో పెట్టారు.

ఆ సంభావనలు చూసే సరికి శ్రీకృష్ణుడి పాత్రధారికి హుషారొచ్చింది. ‘చెల్లియో చెల్లకో-‘ అంటూ ఒక పద్యం అందుకున్నాడు. ఆలాపన అదరకొట్టాడు.

భీముడు ఆవేశపడ్డాడు ‘ఆ దుష్టదుర్యోధనుణ్ణి నా గదాదండంతో హత మారుస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ!’

అర్జునుడు, విల్లులో బాణం సంధించి ‘‘దుర్యోధనుడి వాలం పట్టు ఓరీ నీచ కర్ణా ! ఇదే నా పాశుపతాస్త్రంతో నిన్ను యమపురికి పంపుతాను కాచుకో!’’ అంటూ చిందులు తొక్కాడు.

ధర్మరాజు సంచీలోంచి శంఖం తీసి యుద్ధం కోసం సిద్ధం అంటూ దానిని పూరించాడు. శంఖ నినాదం పిల్లలకు చాలా కొత్తగా ఉంది.

‘‘మనవడు, మనవరాలు వచ్చినట్లున్నారు! చిరంజీవ! చిరంజీవ!’’ అంటూ శ్రీకృష్ణుడు ఆశీర్వదించాడు పిల్లలను నాన్న వంక చూస్తూ.

ఆ పగటివేషగాళ్లు మా కాంపౌండు దాటి వెళ్లిపోయారు. ‘‘చూశావా! బుజ్జీ! శ్రీకృష్ణుడు ఎంత బాగున్నాడో?’’ నాన్నగారు అడిగారు.

‘‘ఆ! తాతయ్యా! శ్రీకృష్ణుడు అడుక్కోవడం ఏమిటి? ఆయనే అందరికీ వరాలు ఇస్తాడని మా టీచరు చెప్పింది.’’అంది గడుసు పిల్ల బుజ్జి.

‘‘ఆ! ఆ! మన దగ్గర తీసుకున్న దానికి వంద రెట్లు యిస్తాడు’’ అమ్మ చెప్పింది.

స్నానపానాలు అయింతర్వాత వీధిలో పడ్డాను. గ్రామంలో పెద్దగా మార్పులు కనపడలేదు. అవే పాతకొంపలు, పూరిళ్లు, అవేరొచ్చు రోడ్లు, రోడ్డు పక్కన మురికి చెత్తకుప్పలు! నా స్నేహితులు చాలా మంది పొట్టకోసం వలస పోయారు నాలాగా! కాని నాకు తెలిసి మహానంది వ్యవసాయం నమ్ముకుని అదే వూరిలో బతుకుతున్నాడు.

వాడిని వెతుక్కుంటూ వెళ్లాను. ఇంట్లో వాళ్లావిడ ఉంది. కూర్చోమంది. కానీ మళ్లీ వస్తానని దగ్గరలోని రామాలయానికి వచ్చాను. ప్రధాన ఆలయం మూసేసి ఉంది. కానీ లోపల కాంపౌండు తెరిచే ఉంది. లోపల చాలా విశాలంగా ఉంది. పెద్ద మండపం. మెట్లు ఎక్కి ఒక స్తంభం వెనుక కూర్చున్నాను. ఇంతలో పగటివేషగాళ్లు వచ్చి ఇంకో పక్కన కూర్చున్నారు. ఒక స్తంభం చాటున ఉన్న నా ఉనికిని వారు గమనించినట్లు లేరు. పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.

‘‘ఒరే! ప్రజల్లో ధర్మబుద్ధి నశించి పోతున్నది.’’ శ్రీకృష్ణుడు అన్నాడు. ‘‘అవునవును.. పుణ్యం మూట కట్టుకుందామన్న సద్భుద్ధి తగ్గిపోయింది.’’ ధర్మరాజు పలికాడు.

‘‘ఈ ఊరు లాభం లేదు. రేపు మనం పక్కూరుకు పోదాము. అక్కడ కొంచెం దానధర్మాలు చేసే పెద్దలున్నారు.’’ భీముడు అన్నాడు.

‘‘అదేంటో… దసరా పండుగకు కూడా ఖర్చు పెట్టాలంటే ప్రజలు భయపడు తున్నారు. అది వరకు కొందరు మనకు వస్త్రాలు పెట్టేవాళ్లు. అటువంటి దాతలు యిప్పుడేరి?’’ అర్జునుడి బాధ.

‘‘కాలం మారింది సోదరా! కలికాలం ప్రవేశించింది.’’ నకులుడు అన్నాడు. ‘‘స్వార్థం పెరిగి పోయింది.’’ సహదేవుడు వంత పాడాడు. నాకు కోపం వచ్చి స్తంభం చాటునుంచి బయటకొచ్చాను. ‘‘అది కాదు, ఇలా అందరినీ యాచించక పోతే మంచిగ ఏదో పని చేసుకుని బ్రతకొచ్చుగా!’’

‘‘తమరా బాబు! మీరు యాచన అని తేలిగ్గా తీసి పారవేశారు కానీ దీనికి మేము ఎంత కష్టపడాలో మీకేం తెలుసు? ఒంటినిండా రంగులు కొట్టుకుని, ఈ ముతక ఉక్కబోసే దుస్తులు ధరించి ఎండలో వీధివీధి తిరగాలంటే ఎంత కష్టం? అక్కడక్కడ వెంటబడే కుక్కలను తరుముకుంటూ, వాటి బారి నుండి తప్పించుకు తిరుగుతూ ఎంత కష్టపడు తున్నామో మీకు తెలుసా?’’ ధర్మరాజు అడిగాడు.

‘‘అదే నేను చెప్పేది. ఎందుకు ఇంత కష్టపడి అడుక్కోవడం అని?’’ నాకు కోపం వచ్చి మళ్లీ అడిగాను. ‘‘చదువుకున్న బాబులు మీరు కూడా అలాగే అంటే ఎలా సారూ? ఇవి పగటి వేషాలు -జానపదకళలు. ఇవి మనకు వందల సంవత్సరాలుగా వారసత్వంగా వచ్చాయి. ఇప్పుడంటే సినిమాలు వచ్చాయి కానీ అంతకు ముందు మన పిల్లలకు మన భారత రామాయణ, భాగవతాల పట్ల ఆసక్తిని కలిగించేవి మా వేషాలేగా! మా వేషాలను చూసి చాలా మంది పిల్లలు మా పాత్రల చరిత్రలు అడుగుతారు. అక్షరం ముక్క వచ్చినవాళ్లు వారి కథలను చదువుకుని ఆనందిస్తారు.’’ శ్రీకృష్ణుడు చెప్పాడు.

‘‘తెరమీది పాత్రలు కాసేపే గుర్తుంటాయి. ప్రత్యక్షంగా చూసే పాత్రలు జీవితాంతం గుర్తుం టాయి. పిల్లల మనస్సుల్లో నాటుకు పోతాయి.’’ ఈ సారి భీముడు గదనేలకు తాటిస్తూ చెప్పాడు.

‘‘హూ! మన సంస్కృతి ఇంకా జీవించి ఉందంటే రామాయణ, భారత, భాగవతాల వల్లనే! ఆ సంస్కృతికి మూలం మా జానపద కళారూపాలు! పాత్రల్లో జీవిస్తూ ఉంటే ఆ తృప్తి వేరు! ’’ అర్జునుడు బాణం నా వంక చూపిస్తూ చెప్పాడు. అప్పటికే ధనుస్సు, అంబులపొది కింద పెట్టాడు.

‘‘ఆహా! అయితే మీరు మీ వేషాలతో దేశాన్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారు? మీ కంటే నాటకాల వాళ్లు ఎంతో మేలు! ఎంతో కష్టపడి అభ్యాసం చేసి రోజుల తరబడి ఆడతారు. వాళ్ల ముందు మీరు ఎంత?’’ ఈసడించాను.

‘‘అయ్యా! నాటకం చూడాలంటే ఒక్కోసారి టికెట్టుకొని వెళ్లాలి. ఉచితంగా ప్రదర్శించినా ఆ స్టేజి దగ్గరికి ఇళ్లు, పిల్లా పీచు అందరూ రాలేరు. మేము అలా కాదు. గడపగడపకు వెళతాం!’’ శ్రీకృష్ణుడు చెప్పాడు.

‘‘మా వెనకాల బోల్డు మంది పిల్లలు గుంపుగా వస్తారు. నాటకాలోళ్ల వెనకాల వస్తారా? ’’ సహదేవుడు అడిగాడు.

‘‘ఏదిఏమైనా మీ వేషాలు కొన్ని రోజులే గదా! దసరా పండుగలాంటి పర్వ దినాల్లోనే కదా! మహా అయితే తిరునాళ్లల్లో! మిగతా రోజులు మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎలా బ్రతుకుతారు?’’ సాలోచనగా అడిగాను.

‘‘తప్పదుగా బాబయ్యా! చిన్ని చిన్ని పనులు చేస్తూ ఉంటాము. మరి ఉదర పోషణార్థం తప్పదుగా. వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు.’’ భీముడు అన్నాడు చెయ్యి చాస్తూ.

జేబులోకి జొనిపిన చెయ్యిని వెనక్కి తీసు కున్నాను. ఇప్పుడు నేను ఏం దానం చేసినా వారి దృష్టిలో గాడిదనవుతాను.

‘‘ఇంతకీ తమరు ఏం చేస్తూంటారు?’’ శ్రీకృష్ణుడు అడిగాడు. ‘‘ఢిల్లీలో బ్యాంకులో ఆఫీసరుగా పని చేస్తున్నాను.’’ గర్వంగా చెప్పాను.

‘‘మంచిది బాబయ్యా! మేము యింకా కొన్ని వీధులు తిరగాలి!’’ అంటూ ధర్మరాజు అందరినీ లేపి బయలు దేరాడు. వారి నడక చాలా హూందాగా ఉంది.

నేను కూడా మా ఫ్రండు మహానంది కోసం వాళ్లింటికి బయలు దేరాను. దారిలో పులి వేషగాళ్లు ప్రేక్షకులను అలరిస్తున్నారు తమ ఆటలతో. ఆ ఎండలో, రోడ్డు మధ్యలో, పులుల్లాగా ఘీంకరిస్తూ, పంజాలు విసురుతూ అటూ యిటూ గెంతులేస్తూ పులివేషధారులు ఆడుతున్నారు.

పిల్లలు ఈలలు వేసి చప్పట్లు కొడుతున్నారు, వాయిద్యాల మోత!

నేను మహానంది ఇంటికొచ్చాను. వాళ్లావిడ మంచం వేసి కూర్చోమంది. ‘‘ఎక్కడికి పోయాడు వీడు?’’ విసుగ్గా అడిగాను.

‘‘మీకు దారిలో కనిపించలేదా?’’

 ‘‘కనిపిస్తే ఇటెందుకు వస్తాను? అటే లాక్కుపోయేవాడిని.’’

 ‘‘మీకు దారిలో పులి ఆటగాళ్లు కనిపించలేదా!’’ అడిగింది.

‘‘ఆ! ఏదో ఆడుతున్నారు, అది చూడ్డానికి గాని వెళ్లాడా? అడిగాను.

 ‘‘లేదు, ఆయన ఒక పులి వేషం కట్టారు.’’ చెప్పింది. ఆశ్చర్యపోయాను. వీడికిదేం పోయేకాలం! కాసేపటికి పులి ఇంటికి వచ్చింది. నన్ను చూసి నవ్వింది.

‘‘ఒరే! నీకిదేం బుద్ధిరా! ఈ పులి వేషం ఏమిటి? ఎండలో పడి ఆడటం ఏమిటి?!’’ ఆశ్చర్యంగా, అసహ్యంగా అడిగాను మహానందిని చూసి.

‘‘ఆ మధ్య జబ్బు చేస్తే మొక్కుకున్నానురా అమ్మవారికి ఈ దసరాకు పులివేషం కడతానని. అందుకని ఆడుతున్నాను’’ చెప్పాడు.

‘‘జబ్బు చేస్తే డాక్టరు దగ్గరికి పోవాలి కాని, ఇవేం మొక్కులురా! టెంతు పాసయ్యావు, ఆ మాత్రం తెలివి లేదా?’’ కోపంగా అడిగాను. ‘‘

‘‘ఎవరి సెంటిమెంటు వాళ్లది. కొందరు వెంక టేశ్వర స్వామికి కాలినడకన కొండమెట్లు ఎక్కి వస్తా మని మొక్కుకుంటారు. శ్రీశైలం మల్లన్నకు, భ్రమరాంబకు అయితే కొన్ని వందల కిలోమీటర్లు దూరం కర్నాటక నుండి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తామని మొక్కుకుంటారు. దానికే మంటావు?’’ అడిగాడు మహానంది.

ట్రాన్సుఫర్‌ ‌వస్తే నేను కూడా షిర్డీకి వస్తానని సాయిబాబాకు మొక్కుకొని ఉన్నాను. ‘‘సరేలే! ఇంతకీ ఎలా వున్నావు? పంటలు బాగా పండుతున్నాయా?’’ అడిగాను మహానందిని. ‘‘నువ్వు ఇండియాలోనే గదా ఉంది? రైతు కష్టాలు మీకు తెలియనివా? మా పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టులాగుంది.’’ చెప్పాడు జీవం లేని నవ్వు నవ్వుతూ.

కాసేపు మాట్లాడి లేచాను. జేబులోంచి ఓ రెండు వేలు తీసి వాడిచేతిలో పెట్టాను పండక్కి బట్టలు కొనుక్కోమని. వాడు సిగ్గుతో తీసుకోలేదు. బలవంతం చేసి యిచ్చాను వాళ్లావిడకి.

ఆ సాయంత్రం పిల్లల్ని రామాలయం తీసుకెళ్లాను. అక్కడ చెక్కభజన జరుగుతున్నది. పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టారు.

‘‘తక్కువేమి మనకు, రాముడు ఒక్కడుండగా, తక్కువేమి మనకు’’ ఆ భక్తులు లయబద్ధంగా నాట్యం చేస్తూ భజనలు చేస్తూ ఉంటే ఒక భక్తి రస వాతావరణం అక్కడ వ్యాపించింది.

చివరన హారతి పళ్లెంలో అయిదువందలు ఉంచాను. వాళ్లు ఆశ్చర్యపోయి మనసారా ఆశీర్వదించారు.

నాన్నగారిది అంటే తాతగారు కట్టించింది విశాలమైన ఇల్లు. తోట, ఇల్లు కలిపి అర ఎకరా పైన ఉంటుంది. లక్కపిడతల్లాంటి అపార్టుమెంట్లలో సిటీలో వున్న మాకు అంత విశాలమైన ఇల్లు ఎంతో సంతోషం కలిగించింది. ముఖ్యంగా మా పిల్లలు అటు యిటు పరుగులు పెడుతూ ఆడుకున్నారు. నానమ్మ, తాతయ్యలతో గంతులేశారు.

పొలం నుండి కొబ్బరి బోండాలు, తాటికాయలు మోసుకొచ్చారు జీతగాళ్లు . కొడవలితో బోండాను కొట్టి యిస్తూ ఉంటే ఒకటికి రెండు తాగుతున్నాము. తాటికాయలు కొట్టి, కొడవలితో లేత ముంజలు తీసి చేతుల్లో పెడుతూంటే గుటుక్కున మింగుతున్నాము. ఇంత వైభోగం మా సిటీలో ఎందుకొస్తుంది?

ఆ రోజు సాయంత్రం కళ్యాణమండపంలో బుర్రకథ చెబుతూంటే అందరం వెళ్లాం. ‘తందాన తాన’ అంటూ వంతగాళ్లు పాడుతూంటే ప్రధాన కథకుడు రామకథను రంజుగా చెబుతున్నాడు. చక్కటి శ్రుతితో పాడుతూ, చక్కగా అడుగులేస్తూ, భక్తి భావంతో కథ చెబుతూ, మధ్యమధ్యలో ప్రేక్షకుల్ని హుషారుగా గొలిపేందుకు పిట్టకథలు చెబుతూ బుర్రకథను బాగా రక్తి కట్టించారు. ఇంక మా పిల్లలు ఆ మరునాటి నుండి ఏం చెప్పినా ‘తందాన తాన’ అంటూ నృత్యం చెయ్యడం మొదలెట్టారు. గురవయ్యలు వచ్చి వీధిలో నృత్యం చెయ్యడం మా పిల్లలకు యింకొంచెం హుషారును యిచ్చింది.

ఈ మా రాక అమ్మకు, నాన్నకు బోలెడు ఆనందం కలిగించింది. వారి వయసు వెనక్కి మళ్లినట్లయ్యింది. సునందకు వసతులు సరిగా లేవనిపించినా వంటింట్లో రకరకాల పిండివంటలు వండుతూంటే వాటిని ఆసక్తిగా చూస్తూ నేర్చు కుంటున్నది. ప్రతిరోజు రెండు మూడు రకాల కూరలు, రెండు పచ్చళ్లు, ముద్దపప్పు, సాంబారు, గడ్డ పెరుగుతో పాటు ఊరమిరపకాయలు, అప్పడాలు, వడియాలు చేస్తున్నారు. ఘుమఘుమలాడే నెయ్యి వడ్డిస్తున్నారు.

బుజ్జి, నానికి అప్పడాలు, వడియాలు బాగా నచ్చాయి.

సునందకు ఊరమిరపకాయలు, మజ్జిగ పులుసు లాంటి వంటకాలు బాగా నచ్చాయి. అమ్మ కొన్ని పచ్చళ్లు చేసి జాడీల్లో పెట్టి పార్సిలు యిస్తానంది వద్దు వద్దంటున్నా వినకుండా. ఈ వారం రోజుల్లో మా బుజ్జికి, నానికి కొన్ని మంచి పద్యాలు, పాటలు వచ్చేశాయి. చక్కగ తెలుగు పదాలు నోటికి వచ్చాయి. చేతిలో వెన్నముద్ద లాంటి పాటలు వచ్చాయి.

సరదా సరదాగా దసరా గడిచిపోయింది. ఇంక సెలవులు అయిపోయి డ్యూటీకి పోవలసిన సమయం ఆసన్నమయ్యే సరికి కొంచెం దిగులు పుట్టింది. ఇంక నానీ, బుజ్జీలు అయితే నానమ్మను, తాతయ్యను వదల్లేక ఏడుపులు లంకించుకున్నారు.

సునంద కూడా అత్తారింటి ఆప్యాయతకు కరిగింది. ఆమెకు మంచి చీరలు లభించాయి, పిల్లలకు నాకు కొత్త దుస్తులు కొన్నారు.

రైల్లో వస్తూంటే ఒక గుడ్డివాడు అన్నమయ్య పదాలు, రామదాసు కీర్తనలు, ఘంటసాల పాటలు శ్రావ్యంగా పాడి చెవులకు పట్టిన తుప్పు వదల గొడుతున్నాడు. వాడికి తోడు వాడి భార్య కొన్ని జానపద గీతాలు పాడుతున్నది మధ్యమధ్యలో. ఇద్దరూ అంధులే! కాని వారి గొంతులు మటుకు కంచుకంఠాలు! వారి జ్ఞాపక శక్తి అపారం! అన్ని పాటలను సాహిత్యంతో సహా గుర్తుపెట్టుకుని తప్పులు లేకుండా పాడుతున్నారు. రెండొందల నోటు తీసి యిచ్చాను. ఇద్దరూ నమస్కరించి పక్క కంపార్టు మెంటుకు వెళ్లిపోయారు.

మా బుజ్జికి సందేహం వచ్చి అడిగింది. ‘‘నాన్నారు! మనం చూసిన పద్యాలు, పాటలు, వేషాలు మన సిటీలో కనపడవేమి? అక్కడంతా పరుగులే కదా?!’’

‘‘నిజం! మన గ్రామాలు మన సంస్కృతికి పట్టుగొమ్మలు. భారత దేశంలో మన సంప్రదాయాలు యింకా బ్రతికి ఉన్నాయంటే కారణం మన పల్లెటూళ్లే! అక్కడ నివసిస్తున్న జానపద కళాకారులు!

జానపద కళాకారులు మన సంస్కృతిని గుర్తు చెయ్యకపోతే అందరం మన మూలాలు మర్చిపోయి కోతుల్లాగా పాశ్చాత్య దేశాలను అనుకరిస్తాము.’’ నా శ్రీమతి సునంద పిల్లలకు చెప్పింది.

అవును… కోయిల ఏమి ఆశించి పాడుతుంది? నెమలి ఏమి ఆశించి నాట్యం చేస్తుంది?

ఏమి ఆశించి మన జానపద కళాకారులు మన సంస్కృతిని భుజాన మోస్తున్నారు? వీరందరి పట్ల సానుభూతి ప్రదర్శించటం మనందరి బాధ్యత అనిపించింది.

కోటి విద్యలు కూటి కొరకే కాదు, తరతరాల సంస్కృతిని నేటితరం వారికి అందించే ఒక గొప్ప జానపద ప్రయత్నం.

About Author

By editor

Twitter
Instagram