ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

– పాలంకి సత్య

పారసీక సేన రెండు రోజులకే లొంగి పోయింది. పార్ధియను వంశస్థుడైన రాజు తాను ఓడి పోతున్నట్లుగా అంగీకరించి, సంధికై విక్రమాదిత్యుని వద్దకు రాయబారులను పంపాడు. అటు తర్వాత పాలకుల మధ్య చర్చ జరిగింది. ఎట్టి పరిస్థితిలోనూ భరతభూమిపై దండెత్తబోమనీ, విక్రమాదిత్యునికి యుద్ధ నిమిత్తమయిన వ్యయాన్నీ, వేయి పారసీక అశ్వాలను సమర్పించుకుంటాననీ రాజు భరత చక్రవర్తికి విన్నవించాడు.

‘‘అంతేకాదు… మా కుమార్తెను మీకిచ్చి వివాహం చేయగలను’’.

విక్రమాదిత్యునికి తన పట్ట మహిషి పలుకులు గుర్తుకు వచ్చి పెదవులపై చిరునవ్వు మెరసింది.

చక్రవర్తి నవ్వుకు కారణం తెలియని పారసీక రాజు ‘‘విజేతలకు కన్యను సమర్పించడం పరిపాటి అని విన్నాను. ఇదివరలో పారసీక రాజ్యాన్ని తమ అధీనంలోనికి తెచ్చుకుని యవనులు ఏలినారు. గ్రీకు రాజు సెల్యూకస్‌ ‌తన కుమార్తె హెలీనాను మగధ చక్రవర్తికిచ్చి వివాహం చేసిన మాట వాస్తవమే కదా!’’ అన్నాడు.

‘‘కన్యను ఆమె అంగీకారం లేకుండా వివాహం చేసుకోవడం ధర్మం కాదు. ఆమె అంగీకారం ముఖ్యం. మా పండితులతో, మంత్రి మండలితో చర్చించి మా నిర్ణయం తెలియజేయగలం!’’

పారసీక రాజు సెలవు తీసికొని వెళ్లిన తర్వాత విక్రమాదిత్యుడు మిహిరుని వైపు చూశాడు. అంతవరకూ వరాహమిహిరుడు పారసీక భాష తెలిసినందున ఇరువురికీ ఒకరి మాటలు ఒకరికి భాషాంతరీకరణం చేసి చెప్పాడు. మిత్రుడు తన అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాడా లేదా అన్నది మిహిరునికి తెలియలేదు. మనసులోని భావాలను వెలువరించకుండా ఉండగలగడం ప్రభువులకు వెన్నతో పెట్టిన విద్య.

‘‘మిహిరా! ఏమంటావు?’’

‘‘ఈ విషయంలో నేనేమి అనగలను? మిత్రునిగా అభిప్రాయం చెప్పే సమయం కాదు. చక్రవర్తిగా నీవు తీసికొనవలసిన నిర్ణయం’’.

ఖనా వివాహం విషయంలో మా ఆమోద ముద్ర అవసరమని గురువర్యులు ఆదిత్యదాసు అన్నారు. నా విషయములో నిర్ణయాధికారమెవరిది?’’

ఖనా పారసీకుల ఇంట పెరిగినదే కానీ ఆమె భారతీయ కన్య. ఆమె జన్మ రహస్యం తక్కువ మందికే తెలుసు. నేడు బహిర్గత మవనేల? వరాహమిహిరుడు ‘‘నీవు పండితులతో, మంత్రి మండలితో చర్చించి నిర్ణయించడం మేలు’’ అన్నాడు.

మంత్రుల పారసీక రాజకన్యతో వివాహం రాజ్యానికి  శ్రేయోదాయకమన్నారు.  పారసీక రాజకన్య పట్టమహిషి కాబోదు కనుక అభ్యంతర ముండదన్నారు.

వివాహం జరిగిన తర్వాత నూతన వధువును సఖీ, పరిచారికా సమేతంగా ఉజ్జయినికి పంపే ఏర్పాటు చేసిన అనంతరం విక్రమాదిత్యుని సేన పశ్చిమ దిశగా కదలింది. పారసీక పంచతంత్ర గ్రంథాన్ని తమ భాషలో రచించమని వరాహ మిహిరుని కోరాడు. మిహిరుడు అంగీకరించాడు.

 * * * * * *

విక్రమాదిత్యుని సేన అనేక చిన్న రాజ్యాలను జయిస్తూ, పశ్చిమ మెసపటోమియా ముఖ్య నగరం బాబిలాను చేరుకున్నది. ఆ నగరమూ, పరిసర ప్రాంతాలూ గ్రీకుల అధీనంలో ఉన్నాయి. సెల్యూకసు అనంతరం పాలకులు ఎవరూ గొప్పవీరులు కానందున అతని సామ్రాజ్యం విచ్ఛినమై కొంత భాగం ఏలుతున్న బలహీనుడైన రాజు విక్రమాదిత్యు నికి లొంగిపోయి, శరణుజొచ్చాడు. విక్రమాదిత్యుని తన నగరంలో కొంత కాలం ఉండమని కోరాడు. సేన విశ్రాంతికీ, నగర విశేషాలను చూడడానికీ విక్రమాదిత్యుడు ఆ ఆహ్వానాన్ని మన్నించి నగర ప్రవేశం చేశాడు.

 * * * * * *

ఉజ్జయినీ నగరమంతా అట్టుడికినట్లుగా ఉన్నది. ఎవరి నోట విన్నా ఒక్కటే మాట. మహాకవి, చక్రవర్తి గౌరవించి, ఆస్థానకవిగా చేసిన కవికి, కవి కులగురువుకు ఇంత అవమానమా? ఒక సాధారణ వ్యక్తి కాళిదాసు మహాకవిని క్షురకునితో పోల్చడమా?

మహాకవికి మాత్రం వార్త చేరినట్లు లేదు. చేరినా ఆయన పట్టించుకోలేదో! కుమార సంభవమనే మహా కావ్య రచనలో నిమగ్నడై ఉన్నాడు. వార్త పట్టమహిషి  వీరలక్ష్మీదేవికి తెలిసింది. ఆమె చారులను పిలిచి విషయ సేకరణ చేసింది. కుమార సంభవ కావ్యంలో మహాకవి హిమవంతుని వర్ణిస్తూ శ్లోకాన్ని రచించాడు.

అనంత రత్న ప్రభవస్య యస్య

హిమం న సౌభాగ్య విలోపి జాతం

ఏకోహి దోషో గుణ సన్నిపాతే

నిమజ్జతీందోః కిరణేష్వివాంకః

రత్నముల వంటి అనేక శ్రేష్ట వస్తువులను కలిగిన పర్వత రాజుకు మంచు వలన సౌభాగ్యం తగ్గలేదు. అనేక గుణాలున్నచోట ఒక్క దోషం చంద్ర కిరణాలలో మచ్చవలె కనిపించకుండా పోతుంది.

పై శ్లోకం సత్రంలో కూర్చున్న ఒక వ్యక్తి కాళిదాసును స్తుతిస్తూ చదివాడట. సత్రానికి భోజనార్ధమై వచ్చిన ఒక పేద బ్రాహ్మణుడు మహాకవిని నిందిస్తూ ఒక శ్లోకం చెప్పాడట.

ఏకోహి దోషో గుణ సన్నిపాతే

నిమజ్జతీందోరితి యో బభాషే

నూనం నదృష్టం కవినాపితేన

దరిద్ర దోషో గుణరాశి నాశి

అనేక గుణాలున్న చోట ఒక దోషం చంద్రునిలో మచ్చ వలె కనిపించదని ఎవరు అన్నారో కానీ వారికి దరిద్ర దోషం అన్ని గుణాలకూ నాశనకారి అని కనిపించలేదు కదా అని భావం.

అంతవరకూ బాగానే ఉన్నది. ఆ బ్రాహ్మణుడు కవి నాపితుడనే పద ప్రయోగం చేశాడు. నాపితుడన్న మాటకు క్షురకుడని అర్థం కదా. ఆ పదాలే ఉజ్జయినీ వాస్తవ్యులను కోపితులను చేశాయి.

పట్టమహిషికి శ్లోక భావం కన్నా శ్లోక కర్త గురించిన వివరాలు ఆశ్చర్యం కలిగించాయి. యాత్రికుల కోసం, ఉజ్జయినీ నగరానికి కార్యార్ధమై వచ్చే వారికీ సత్రమున్నది. అక్కడ ఎవరైనా భుజించవచ్చును. కానీ శ్లోక కర్త పేదవాడట. అతని దుస్తులు చీలిక పీలికలై ఉన్నవట. తన ప్రాణేశ్వరుడు, భరతఖండ చక్రవర్తి విక్రమాదిత్యుల పరిపాలనలో పేదరికమన్నమాట వినబడరాదే.

ఆమె బ్రాహ్మణుని తన ప్రాసాదానికి పిలిపించింది. ఆమెను ఆశీర్వదించిన అనంతరం అతడు ఆమె చూపించిన ఆసనం మీద కూర్చున్నాడు.

‘‘మీరు రచించిన శ్లోకం మేం విన్నాం. కవికుల గురువును దూషింపతగునా?’’

‘‘చక్రవర్తిని మన్నించాలి. నేను ఎవరినీ దూషించలేదు. కాళిదాసుల కవిత్వం గొప్పది. కానీ దరిద్రుల విషయంలో గుణసంపద వలన ప్రయోజనం లేదని వారు గుర్తించలేదన్నాను.’’

‘‘పద్య భావం వివరించగలరా?’’

‘‘మహారాజ్ఞీ! తమకు వివరించవలెనా? కానీ నేను, కవినాపితేన, అన్న చోట ప్రజలు విపరీతార్ధం గ్రహించి, నన్ను దూషించసాగారు. సత్ర నిర్వాహకుడు నాకు భోజనం పెట్టించడానికి కూడ ఇష్టపడలేదు. అమ్మా, కవినాపితేన అన్న పదాలను కవినా, అపి, తేన అని విడగొట్టాలి. అంతటి కవికి కూడా అన్న అర్ధంలో నేను ప్రయోగించినాను. కవి, నాపితేన అని విడగొట్టి నన్ను దూషించుట నా దురదృష్టం. జన్మించిన నాటి నుంచి శోకమయమైన జీవితమే. నేడు వేరొక రకంగా ఉండజాలదు’’.

‘‘ఆ విషయం అడగడానికే మిమ్ము పిలిపించినది. భరతఖండాన్ని విక్రమాదిత్య చక్రవర్తి ఏలుతుండగా, దారిద్య్రమన్న మాట వినిపించరాదే’’.

‘‘చంద్రునిలో మచ్చవలె సార్వభౌముల పాలనలో నావంటివారు కొందురుడుట ఆశ్చర్యం కాదు’’.

‘‘మీ వివరాలు……’’

‘‘చక్రవర్తినీ! నా నామధేయం ఘటకర్పరుడు’’.

‘‘ఘటకర్పరుడంటే  విరిగిన కుండ అని అర్థం. అదేమి పేరు?’’

‘‘నేను జన్మించిన సమయంలో నాతల్లి ప్రసూతి వ్యాధితో మరణించినదట. తన ప్రియసతి మరణానికి నేనే కారణమన్న కోపంతో నా తండ్రి నాకు ఘటశ్రాద్ధం చేసినాడట. నాకు నామకరణాది కార్యములేవీ ఆయన చేయలేదు. బంధువులు ఘటకర్పరుడని వెక్కిరించేవారు. అదే నా పేరుగా మిగిలినది. గురువుల దయ వలన చదువుకున్నాను. కరుణ కలిగిన తల్లులు పెట్టిన అన్నంతో పెరిగాను. రాజధానికి వచ్చి జీవనోపాధికై ప్రయత్నిస్తున్నాను’’.

‘‘మీరు రచించిన శ్లోకం మెచ్చతగినదే. మా కోసం ఒక లఘు కావ్యం రచింపమని కోరిక. దూర దేశాలలో ఉన్న భర్తకు అతని ప్రియసతి పంపిన సందేశం కావ్య రూపంలో రచించగలరు. అంతవరకూ నగరంలోనే మీకు భోజన వసతులు కల్పిస్తారు.

‘‘మహాదేవీ, కృతజ్ఞణ్ణి’’

 * * * * * *

విక్రమాదిత్య, వరాహమిహిరులు బాబిలోని యాను పర్యటించేందుకు ఆ దేశాధీశుడు ఏర్పాట్లు చేసినాడు. ఆ దేశంలో యవనుల రాకకు ముందు మట్టి పలకలపై లిఖించేవారట. వారి లిపిని క్యూని ఫారం అంటారని తెలిసింది. అక్కడ దేవతారాధనా విధానాలను గమనించిన తర్వాత రాజభటులు వారిని పర్వతాకారంలో నిర్మించిన ప్రాచీన ప్రాసాదం చూపేందుకు తీసికొని వెళ్లినారు.

ఆ రాజ ప్రాసాదాన్ని నెబుకడ్నజర్‌ అనే రాజు తన భార్య కోసం నిర్మించాడట. ఆమె పర్వత ప్రాంతమైన మిడియా దేశపు రాజ కుమార్తె. నదీ తీరంలోనున్న బాబిలాను నగరానికి వచ్చిన ఆమె పర్వత శిఖర దర్శనం కోసం తహతహలాడినది. మహారాజు తన ప్రియసతి ఆనందం కోసం పర్వతాకారంలో ఒక ప్రాసాదం నిర్మించినాడు. పర్వతం రూపంలో భవనం ఉంటే సరిపోతుందా? పర్వతం మీద మహావృక్షాల మాటటేమిటి? ఎత్తైన రాతి స్తంభాలను ఒక్కొక్క అంతస్తులో కట్టించి, రాతి స్తంభములను దొలిపించి, మట్టితో నింపినాడు. తాటి చెట్టంత ఎత్తుగా ఉన్న స్తంభాలను దొలచటం, వాటిని మట్టితో నింపడం కష్టమే అయినా పని నడిచింది. ఆ మట్టిలో వృక్షాలు పెంచారు. పదిహేను అంతస్తులతో ఎత్తైన భవనం. పక్కనే ఉన్న యూఫ్రటీస్‌ ‌నదీ జలాలతో సాగు జరుగుతున్నది.

రాజభటులు యవన భాషలో చెప్పిన దానిని వరాహమిహిరుడు విక్రమాదిత్యునికి సంస్కృతంలో వివరించి, భవన ప్రాంతాన్ని వ్రేలాడే వనాలని   అంటారనీ, యవనులు ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా లెక్కిస్తారనీ అన్నాడు.

‘‘ఉద్యానవనాలు వ్రేలాడడమేమిటి? పైకి పెరుగుతున్నవి కదా!’’

‘‘భాషాంతరీకరణంలోని కష్టమదే. యవన భాషా పదం క్రెమస్టాస్‌, ‌దీనికి మన భాషలో అంతకన్న మంచి పదం దొరకలేదు’’.

‘‘పంచతంత్రాన్ని పారసీక భాషలో రాయడం నీకు సులభంగానే ఉన్నట్లున్నది.’’

‘‘రెండు రాజ్యాల సంస్కృతీ, సంప్రదాయాలు ఒక తీరుగనే ఉన్నాయి కదా!’’

‘‘ఆ మాట నిజమే’’ అన్న విక్రమాదిత్యుని మనసులో నూతన వధువు పారసీక రాకుమారి మెదలింది. అదే సమయంలో అతని వద్దకు వచ్చిన ఉజ్జయినీ రాజదూతలు ప్రభువుకు నమస్కరించి, కొన్ని పత్రాలను సమర్పించారు.వాటిని చూసిన విక్రమాదిత్యునికి వాటిని పట్ట మహిషి పంపిందని అర్థమైంది. చక్రవర్తి కనుసన్నపై దూతలు నిష్క్రమించారు. బాబిలోనియా రాజభటులు దూరంగా వెళ్లి నిలిచారు.

అక్కడ ఉన్న రాతి తిన్నెపై కూర్చుని విక్రమా దిత్యుడు పత్రాలను పరిశీలించాడు. పట్టమహిషి ఆజ్ఞపై ఆస్థాన లేఖకునిచే లిఖితము అని ఉంది. వీరలక్ష్మీదేవి రాజ్యంలోని కొన్ని విశేషాలను తెలియజేసిన అనంతరం ఘటకర్పరుని గురించిన వివరాలు రాయించింది. కాళిదాస మహాకవి రఘు వంశ కావ్యం పూర్తిచేసి, కుమార సంభవ మారంభించిన సంగతినీ,   మిగిలిన సంఘటనలను తెలిపింది.

‘‘మహాప్రభూ! నేనాతనిని ఒక సందేశ కావ్యం రచించమని కోరాను. ఆ లఘు కావ్యాన్ని  ఈ లేఖతో పంపుతున్నాను. చిత్తగించవలెను’’.

తన ప్రియసతి లేఖను చదివిన విక్రమాదిత్యుడు కావ్యాన్ని పరిశీలించాడు. ఇరువది రెండు శ్లోకములున్న చిన్న గ్రంథం. దేశాంతరాలలోనున్న ప్రియునికి ఒక స్త్రీ తన విరహ వేదనను వర్ణిస్తూ పంపిన సందేశమది. వీర ఈ గ్రంథాన్ని ఎందుకు రచింపచేసి, తనకు పంపిందో తెలుస్తూనే ఉంది.

విక్రమాదిత్యుని పెదవులపై చిరునవ్వు మెరిసినది. ‘‘వీరా’’ అని మనస్సులోనే తన భార్యను స్మరించి, ఒకసారి తల ఎత్తి వరాహమిహిరుని వైపు చూశాడు. మిహిరుడు తన పంచతంత్ర గ్రంథానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు.

‘‘మిహిరా!’’ అని పిలిచి, విక్రముడు ‘‘ఉజ్జయినికి ఒక కవీశ్వరుడు ఈ మధ్యకాలంలోనే వచ్చినాడట. అతడు రచించిన లఘు కావ్యాన్ని దూతలు తెచ్చినారు. పరీక్షించి, నీ అభిప్రాయం చెప్పు!’’ అని పత్రాలు ఇచ్చినాడు.

వరాహమిహిరుడు శ్లోకాలు చదివినాడు. కవీశ్వరుడు కవిత్వ శక్తి కలవాడని గుర్తించి, ఆ విషయమే విక్రమునికి చెప్పినాడు. సందేశ కావ్యమతనికి ప్రియకాంతను గుర్తు తెచ్చినది. ‘ఖనా! నన్ను విడిచి ఎట్లున్నదో. తాను వస్తానని అన్నది. యుద్ధ యాత్ర ముగిసేదెప్పుడు? తాను విద్యార్జన పూర్తి చేసి తిరిగి వెళ్లేదెప్పుడు?’’

మిహిరుని ముఖ కవళికలను బట్టి అతని మనసును గ్రహించిన విక్రముడు ‘‘లేఖలో నీ జననీ, జనకులు, మామగారు కుశలముగా ఉన్నారని ఉన్నది. పారసీక రాజకన్యకు సంస్కృత భాషనూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయములనూ నీ ధర్మపత్ని నేర్పుతున్నట్లు తెలియవచ్చినది. నీ కుమారుడు చక్కగా మాటలాడుతున్నాడు. చిన్నచిన్న  శ్లోకాలు అప్పగించడమే కాక నవగ్రహాల పేర్లను సైతం నేర్చుకున్నాడట’’ అన్నాడు.

మిహిరుడు ‘‘నీవు అంగీకరిస్తే నేను అలెక్సాండ్రియా వెళ్లగలను. పారసీకంలోని యవన భాషకూ, ఇక్కడ మాట్లాడే యవన భాషకూ భేదమున్నది. పశ్చిమానికి  వెళ్లిన కొలదీ తేడా ఎక్కువ కావచ్చును. నా కన్నా మేలైన ద్విభాషా పండితులను నీవు వినియోగించుకొనవచ్చును’’ అన్నాడు.

‘‘యవన భాష అంతటా ఒకటిగా ఉండదా? ఆశ్చర్యమేమి? ప్రాకృత భాషలో మహారాష్ట్రీ, అర్ధమాగధీ, శౌరసేనీ, పైశాచీ వంటి భేదాలున్నాయి కదా! ఆ సంగతికేమి కాని, జూడియా దేశం మీద దండయాత్రకు వెళ్లాలి. ఆపైన నేను సేనతో భరత ఖండానికి తిరిగి పోగలను. నీవు అలెక్సాండ్రియాకు వెళ్లవచ్చును’’.

మిహిరుడు అంగీకరించి పారసీక భాషలో తన పంచతంత్ర రచన పూర్తి కావచ్చినదనీ, విక్రముడు తిరుగు ప్రయాణంలో పారసీక రాజుకు అందజేయ వచ్చుననీ అన్నాడు.

About Author

By editor

Twitter
Instagram