– గన్నవరపు నరసింహమూర్తి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘ఏమండోయ్‌…. ‌వారం రోజుల్లో శ్రీరామనవమి వస్తోంది… మనం భద్రాచలం వెళ్లాలంటే రేపే మంచిది… ఆ తరువాత వెళితే భక్తుల రద్దీ పెరిగి దర్శనం కష్టం అవుతుంది’’ నా శ్రీమతి సుశీల ఉదయాన్నే నాకు కాఫీ అందిస్తూ చెప్పింది.

నేను చదువుతున్న పేపర్ని పక్కన పెట్టి కాఫీ అందుకొని ‘‘సరే రేపే బయలుదేరుదాం… డ్రైవర్‌ అప్పన్నకి స్కార్పియో రెడీ చెయ్యమని చెబుతాను’’ అన్నాను.

సుశీల భద్రాచలం వెళదామనీ చాలా రోజుల నుంచి నన్ను పోరుపెడుతున్నా నేనే ఉద్యోగంతో తీరిక లేక వాయిదా వేస్తూ వచ్చాను.

నేను రాష్ట్ర ప్రభుత్వంలోని నీటిపారుదల విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌గా పని చేస్తున్నాను. మా పిల్లలిద్దరికీ వివాహాలై విదేశాల్లో ఉంటున్నారు.

ప్రస్తుతం ఇంట్లో నేనూ, సుశీల ఉంటున్నాము. నా తల్లితండ్రులు మా పల్లెలో ఉంటారు. నేనే సంవత్స రానికి రెండుసార్లు వెళ్లి వాళ్లని చూసి వస్తుంటాను. వాళ్లిద్దరూ డెబ్భై ఏళ్లు పైబడినవారే. వారిని మా ఇంటికి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశాను కానీ ‘వాళ్లకు నేను సేవ చెయ్యలేను… అంతగా ఇబ్బందైతే వృద్ధాశ్రమంలో చేర్పించండి’’ అని సుశీల ఒక ఉచిత సలహా పారేసింది.

ఆమెని ఎదిరించి వాళ్లనిక్కడికి తెచ్చే పరిస్థితి లేదు. సుశీలని ఏదైనా అంటే మా పిల్లలిద్దరూ ఫోన్లో ‘‘అమ్మని ఎందుకంటావు?’’ అంటూ నాకు క్లాసు తీసుకుంటారు. అప్పటికే ఒకసారి ‘‘మీ అమ్మంటే మీకంత ప్రేమ ఉంటే మా అమ్మానాన్నా మీద నాకుండదా? ఇదేం న్యాయం’’ అనీ ఇద్దరితో చెప్పినా, బధిర శంఖారావమే… వాళ్లకి తాత, మామ్మల అనుబంధాలు తెలియవు. 5వ తరగతి నుంచీ వాళ్లని దూరంగా పబ్లిక్‌ ‌స్కూళ్లలో చదివించి తప్పు చేశాను. దాని ఫలితం ఇప్పుడనుభవిస్తున్నాను…

అందుకే వాళ్లకి ఒక వంటావిడను, పనిమనిషి కుదిర్చి ఏ సమస్యా లేకుండా చేశాను. వాళ్ల బాధ్యతని మా రైతు సీతన్నకప్పచెప్పాను. నా చిన్నప్పుడు మా తాత మంచం పట్టేసినప్పుడు మా అమ్మ కోడలిగా రెండు సంవత్సరాల పాటు ఎంతో సేవ చెయ్యడం నాకింకా గుర్తు… కానీ ఇప్పటి స్త్రీలు విద్య, నాగరికత, సమానత్వం పేరిట వృద్ధులకు సేవ చెయ్యటం లేదు.

అనుకున్నట్లుగానే వారం రోజుల తరువాత భద్రాచలం స్కార్పియోలో బయలుదేరాము. ఈ ప్రయాణం గురించి నా స్నేహితుడు రమణతో ప్రస్తావించి నపుడు భద్రాచలం ఎలా వెళ్తే దగ్గరో వివరంగా చెప్పాడు.

విశాఖపట్నం నుంచి బయలుదేరి జగ్గంపేట దగ్గర కుడి వైపు టర్న్ ‌తీసుకొని రాజమండ్రి భద్రాచలం రోడ్డుకి అరగంటలో చేరుకున్నాము.

పచ్చటి చేల మధ్య జీపు ప్రయాణం ఆహ్లాద కరంగా ఉంది. ఎప్పుడూ ఇంతటి పచ్చదనాన్ని నేను చూడలేదు. కాలుష్యం లేని వాతావరణం.

గంట తరువాత రంపచోడవరం చేరుకున్నాం. అది ఓ మోస్తరు చిన్న పట్నం. ఆ ఊరు దాటితే ఇంక భద్రాచలం వెళ్లే దాకా భోజనం దొరకటం కష్టం అనీ డ్రైవర్‌ ‌చెప్పటంతో అక్కడ ఉన్న ఓ హోటల్లో భోజనం చేసాము. సుశీలకు ఆ భోజనం పెద్దగా నచ్చలేదు…

అరగంట తరువాత స్కార్పియో మళ్లీ బయలు దేరింది. గంట తరువాత మారేడుమల్లి చేరుకొంది. అది ఓ చిన్న ఊరు. అక్కడ నుంచి దట్టమైన అడవి ప్రారంభమైంది. ఎన్నోసార్లు మారేడు మల్లి అడవి గురించి విన్నా దాన్ని ఈ రోజు స్వయంగా చూస్తున్నాను.

ఆ ఊరు దాటగానే ఘాట్‌ ‌రోడ్డు ప్రారంభమైంది. ఆకాశాన్నంటే కొండలు, పచ్చటి అడవి మధ్యగా స్కార్పియో దూసుకుపోతోంది.

మధ్యమధ్యలో కొండల మీద నుంచి దూకే జలపాతాలు, అడవిలోంచి మృదుమధుర సంగీతంలా వినిపిస్తున్న పక్షుల కిలకిల రావాలు, కొండ వాలు ల్లోంచి కిందకు దిగుతున్న గిరిజనులు… ఆ దృశ్యాలు మనోహరంగా గోచరిస్తున్నాయి.

రెండు గంటల తరువాత చింతూరు చేరుకు న్నాము. ఘాట్‌ ‌రోడ్డు బాగా దెబ్బతిని ఉండటం వల్ల ప్రయాణం ఆలస్యం అయింది.

ఎలాగైతేనేం ఒంటిగంట ప్రాంతానికి భద్రాచలం చేరుకున్నాము.

చూడటానికి ఊరు జనసమ్మర్థంగా ఉంది. మా డ్రైవర్ని ముందుగా గోదావరి వంతెన మీదికి తీసుకెళ్లమని చెప్పాను.

వాడు మెయిన్‌ ‌రోడ్డుకి అరకిలోమీటరు దూరంలో ఉన్న వంతెన మీదికి తీసికెళ్లాడు.

వంతెన కింద అమా యకంగా పారుతున్న నాకెంతో ఇష్టమైన గోదావరి… దాన్ని చూడగానే నా మనసు పులకించింది. పక్కనే కొత్త వంతెన కడుతున్నారు.

ఆ తరువాత గుడి ఉన్న ప్రదేశానికి దగ్గర్లోనే ముందుగా బుక్‌ ‌చేసిన హోటల్కి వెళ్లాం. కింద గదిని మాకిచ్చారు.

శ్రీరామనవమి ఇంకా వారం రోజులుండటంతో దర్శనం కష్టం అవుతుందనుకున్నాను కానీ హోటల్‌ ‌వాళ్లు దర్శనం పది నిమిషాల్లో అయిపోతుందని చెప్పటంతో నా మనసు స్థిమితపడింది.

ఏడు గంటల జీపు ప్రయాణంవల్ల బాగా బడలికగా ఉండటంతో ఇద్దరం వేడినీళ్లతో  స్నానం చేసాము.

గది శుభ్రంగా ఉంది. విశాలమైన మంచం, తెల్లటి దుప్పట్లు, ఎదురుగా పెద్ద టీవీ…

నేను టీవీ చూస్తూ కూర్చున్నాను.

ఒక అరగంట తరువాత మా డ్రైవర్‌ ‌మా ఇద్దరికీ భోజనాలు తెచ్చాడు. భోజనం వేడిగా ఉండటం, కడుపు ఆకలితో ఉండటంతో ఆవురావురుమంటూ ఇద్దరం సంతృప్తిగా భోజనం చేసాము.

4 గంటల దాకా పడుకొని ఆ తరువాత మేమిద్దరం కాలినడకన సీతారామ చంద్రస్వాముల గుడికి బయలుదేరాము.

వీధి సన్నగా ఉంది… దూరంగా ఎత్తులో గుడి గోపురం ఠీవిగా కనిపిస్తోంది… ఎన్నోసార్లు దాన్ని టీవీలో చూసినా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుండడం వల్ల వింత అనుభూతి కలుగుతోంది. ఎత్తున

మేము గుడికి చేరుకొనే సరికి పెద్దగా భక్తులు లేరు. వెంటనే టికెట్స్ ‌తీసుకొని సీతారాముల్ని దర్శనం చేసుకు న్నాము.

శ్రీరాముడి వామభాగాన సీతమ్మ తల్లి, పక్కన లక్ష్మణుడు ఉన్న ఆ గర్భగుడిని చూడగా నాలో భక్తి భావన పొంగి పొరలింది. ఇక సుశీలైతే తాదాత్మ్యంతో కళ్లు మూసుకుంది.

ఎన్నో వందల ఏళ్ల క్రితం పోకల దమ్మక్కకు దొరికిన ఈ విగ్రహాలకు రామభక్తుడైన రామదాసు ఇక్కడ గుడి కట్టి తన భక్తిని చాటుకున్నాడు. ఆ తరువాత అతను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా శ్రీరాముడు ఆ భక్తుణ్ణి రక్షించి తాను భక్తవల్లభుడని నిరూపించుకున్న సంగతి నాకు గుర్తుకొచ్చింది. సీతమ్మ మెడలోని చింతాకు పతకం చూడగానే నా కళ్లు చెమర్చాయి.

ఆ సమయంలో దూరంగా మైకులో ‘‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము రాయగా’’ అన్న పాట మధురంగా వీనులకు విందు చేస్తోంది.

అరగంట తరువాత దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చాము.

ఎదురుగుండా ఎత్తైనా కరకట్ట పక్కనే నిండు ముత్తైదువులా పావన గోదావరి, అప్పుడప్పుడు గోదావరి వరద రూపంలో రాముడి పాదాలను ముద్దాడుతుంటుంది.

ఆ రాత్రి అక్కడే బస చేసి మర్నాడు తెల్లవారు జామున ఆ దివ్యమూర్తిని మళ్లీ దర్శనం చేసుకొని అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని పర్ణశాలకి వెళ్లాము…

గోదావరి ఒడ్డున ఉన్న పర్ణశాలని చూడగానే నేను చదివిన రామాయణం గుర్తుకు వచ్చింది. అందులోని దండకారణ్యం, రామునికి ఎంగిలి పళ్లిచ్చిన భక్తురాలు శబరి, లక్ష్మణ రేఖలు, హా లక్ష్మణా… అన్న మారీచుడు, మారువేషంలో వచ్చిన రావణుడు గుర్తుకొచ్చారు.

ఒక గంట తరువాత మళ్లీ భద్రాచలం వెళ్లి భోజనం చేసి హోటల్కి వచ్చి దాన్ని ఖాళీ చేసి విశాఖపట్నం బయలుదేరాము.

స్కార్పియో భద్రాచలం దాటగానే ఒక్కసారి భద్రాచలం వైపు చూసాను. ఎందుకో నాకు ఆ పవిత్రభూమిని వదలి వెళ్లాలనిపించలేదు…

కొద్ది సేపటి తరువాత చింతూరు వచ్చింది. ఆ ఊరి ముందరే శబరి నదిని చూడగానే మళ్లీ శబరి గుర్తుకొచ్చింది.

స్కార్పియో అరగంట తరువాత ఓ పల్లె చేరింది. డ్రైవర్‌ ‌దాన్ని రోడ్డు పక్కన ఆపి బాయినెట్టుని ఎత్తి ఇంజన్ని చూసాడు.

‘‘సార్‌… ఇం‌జను బాగా వేడెక్కి నీళ్లు పూర్తిగా ఆవిరైపోయాయి. నీళ్లు తెస్తాను’’ అంటూ ఓ బకెట్‌ ‌తీసుకొని శబరి నదివైపు బయలుదేరాడు.

నేనూ, సుశీల జీపు దిగి దగ్గరలోని ఊళ్లోకి  బయలుదేరాము. ఊరు ముందర ‘శబరిపల్లి’ అన్న బోర్డు కనిపించింది.

చూడటానికి అది గిరిజన పల్లెలా లేదు. అన్నీ శ్ల్లాబు ఇళ్లు. రోడ్డు పక్కన పెద్ద పెద్ద దుకాణాలు…

ఎదురుగా గ్రామ సచివాలయం…

ఊళ్లోకి ప్రవేశించగానే నా దృష్టి ఒక దుకాణాన్ని ఆకర్షించింది. ఆ దుకాణం ఒక పెద్ద ఇంట్లోని వరండాలో ఉంది… కొన్ని సామాన్లు రోడ్డు మీద కూడా బల్లల మీద పెట్టి ఉన్నాయి. రోడ్డు మీద ఐదారు కార్లు ఆగి ఉన్నాయి.

నేనూ సుశీలా దుకాణం దగ్గరికి వెళ్లాము. అక్కడ ఒక నలభై ఏళ్ల స్త్రీ కూర్చొని ఉంది. అప్పటికే దుకాణంలో పదిమంది దాకా సామాన్లను కొంటున్నారు.

ఆమెను చూస్తే చదువుకున్న నాగరిక స్త్రీమూర్తిలా కనిపించింది. కస్టమర్లకి ఓపిగ్గా సమాధానం చెబుతూ వస్తువులను విక్రయిస్తోంది. ఆ పక్కనే ఆమె ఇల్లు. లోపల ఇద్దరు వృద్ధులు కనిపిస్తున్నారు.

ఇంతకీ ఆ సామానులు ఏంటంటే కంది పప్పు, పెసరపప్పు, మినపప్పు, చింతపండు, గసగసాలు, బొబ్బర్లు, అలసందలు, మిల్లెట్స్, ‌కొర్రలు, సాములు, ఊదలు, కరక్కాయలు, కుంకుడు కాయలు, సీకాకాయలు, చీపుర్లు, ఉసిరి కాయలు…ఇలా గిరిజనులు పండించిన అన్ని అక్కడ ఉన్నాయి.

నేను దగ్గరికి వెళ్లి ఆమెతో ‘‘ఏవమ్మా! ఇవన్నీ అన్ని చోట్లా దొరికేవే కదా? ఏమిటి వీటి ప్రత్యేకత’’ అడిగాను…

‘‘ఇవి అవీ ఒకటి కాదు సార్‌! ఇవి మేము పండిస్తున్న ఆర్గానిక్‌ ‌పంటలు, దినుసులు. ఏ ఎరువులు వెయ్యకుండా వీటిని పండిస్తాము. అందుకే ఇవి ఆరోగ్యానికి మంచివి. రోజూ వీటిని చాలా మంది మీలాంటి ప్రయాణీకులు కొంటూ ఉంటారు’’ … చెప్పింది.

ఆమె మాటలు వినగానే నాకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది.

వెంటనే నేనూ, సుశీలా వాటిని చూడటం మొదలు పెట్టాము.

‘‘ఏవమ్మా! మీది ఈ ఊరేనా? వీటిని మీరే పండిస్తారా? లేక ఎక్కడ నుంచైనా తెస్తారా?’’ అని అడిగాను.

‘‘మాది ఈ ఊరే… నేనిక్కడే పుట్టాను. ఇక్కడే చదువుకున్నాను. ఒకప్పుడు రాష్ట్రం విడిపోక ముందు ఈ ప్రాంతం తెలంగాణాలో ఉండేది. విడిపోయిన తరువాత ఇప్పుడు ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపేసారు. ఈ పప్పులను, మిగతా దినుసుల్ని మా పొలాల్లోనే పండిస్తాం. మేమే కాదు ఈ చుట్టుపక్కల గిరిజన గ్రామాలన్నింటిలోనూ పండిస్తారు… ఎవ్వరూ ఎరువులు వెయ్యరు’’ అని చెప్పింది.

ఆమె మాటలు స్పష్టంగా సూటిగా ఉన్నాయి. ఉచ్ఛారణ కూడా మేము మాట్లాడినట్లే ఉంది…

ఆమె మాటలు విన్న తరువాత నాకు గురి కుదిరింది.

మేము కందిపప్పు, పెసర, చింతపండు, ఉలవలు, కుంకుడుకాయలు, కరక్కాయలు… ఇలా చాలా వస్తువుల్ని కొన్నాము. చాలా రోజుల్నించి సేంద్రియ దినుసుల్ని కొందామనుకొంటున్నాం కానీ మా పట్నాల్లో దొరకటం లేదు. ఒకవేళ దొరికినా అవి కల్తీవి…

కానీ ఇక్కడ ఉన్న వస్తువులన్నీ స్వచ్ఛమైనవి, కల్తీలేనివి.

ఆ సమయంలో లోపల్నించి దగ్గు వినిపించ డంతో ఆ స్త్రీ లోపలికి పరుగున వెళ్లింది..

ఇంతలో ఆ దుకాణం ముందు మరో రెండు కార్లు వచ్చి ఆగాయి… అంటే చాలా మందికి ఈ దుకాణం చిరపరిచయంలా ఉంది.

కొద్ది సేపటికి ఆమె మళ్లీ వచ్చింది. ‘ఎంత డబ్బు ఎంత ఇవ్వాల’ని ఆమెను అడిగాను.

ఆమె ఒక కాగితం మీద లెక్కవేసి ‘‘పదహారు వందలనీ చెప్పింది.

నేను ఆమెకి డబ్బులిస్తూ

‘‘ఏమ్మా! నువ్వు చదువుకున్నావా?’’ అని అడిగాను.

‘‘బియ్యే భద్రాచలంలో చదివాను సార్‌’’ ‌చెప్పింది.

‘‘నువ్వొక్కర్తివేనా! నీకెవరైనా సహాయకులు న్నారా?’’

ఆమె నా మాటలు వినీ కొద్దిసేపు మౌనం దాల్చింది.

‘‘సార్‌! ‌పదిహేనేళ్ల క్రితం నాకు పెళ్లయింది. నా భర్త నేను ఈ దుకాణాన్ని పెట్టాము. మా కిద్దరు పిల్లలు… మా అత్తా, మామలిద్దరూ మాతోనే ఉండేవారు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల ఉనికి ఎక్కువ. ఒకసారి నక్సలైట్లు ఓ పోలీసు జీపుని పేల్చేసారు. అప్పుడు పోలీసులు ఓ రాత్రి మా ఇంటికొచ్చి నక్సలైట్లకు నా భర్త ఆశ్రయం ఇస్తున్నాడని చెప్పి తీసికెళ్ళిపోయారు. అంతే… వారం తరువాత అతని శవం తిరిగి వచ్చింది’’ చెబుతూ ఆగింది…

నేను ఆమెవైపు చూసాను.

ఆమె కళ్లలో నీరు…

ఆమె సన్నగా ఏడుస్తోంది.

‘‘అలా నా భర్త నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు. నేను కొన్నాళ్ల పాటు మనిషిని కాలేకపోయాను. కానీ పిల్లల్ని మా అత్తమామల్ని చూసి మనసు కుదుట పరచుకున్నాను.

‘‘అప్పట్నుంచీ ఈ దుకాణాన్ని నేనొక్కర్తినే నడుపుతున్నాను. ఇప్పుడు మా పరిస్థితి బాగుంది. పిల్లలిద్దరూ చింతూరు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు’’ అపి తన కథ చెప్పింది.

‘‘మీ అత్తామామల్ని ఏ వృద్ధాశ్రమంలోనో చేర్పించక నీతో ఎందుకు ఉంచుకున్నావు?’’ అడిగాను. పెళ్లయిన స్త్రీ ‘‘భర్త బాధ్యతలు, కష్టాలు, సుఖాలు అన్నీ పంచుకోవాలి. నా భర్త చనిపోయాడనీ వాళ్లని వదిలేస్తే నా కన్నా ద్రోహు లెవరూ ఉండరు. నా భర్తకు తల్లిదండ్రులంటే చాలా ప్రేమ. ఆయన ఉన్నా లేకపోయినా అతని బాధ్యతలు నేను నెరవేర్చక తప్పదు. నేను వాళ్లని ఈ ముసలి వయసులో వదిలేస్తే నా భర్త ఆత్మ బాధపడుతుంది. రేపొద్దున్న నా పిల్లలు కూడా నన్ను ఆ పనే చేస్తారు. అయినా ఇంట్లో పెద్దవాళ్లు ఉండాలి. అప్పుడే ఆ ఇంటికి శోభ, గౌరవం. మీరైతే మీ తల్లిదండ్రుల్ని అలాగే చేస్తారా?’’ అనీ నన్ను అమాయకంగా అడిగింది…

ఆమె కథ వినీ నేను చాలాసేపటి వరకు మనిషిని కాలేకపోయాను. ఒక గిరిజన అయినా ఎంతటి ఉదాత్త! కుటుంబం పట్ల, వృద్ధుల పట్ల ఎంతటి నిబద్ధత?

ఆమెని చూస్తుంటే నాకు సిగ్గు వేస్తోంది.

ఆమెకు ఏం సమాధానం చెప్పాలో నాకర్థం కాలేదు.

‘‘నా తల్లితండ్రులను నా భార్య సుశీల కోరిక మీద వృద్ధాశ్రమంలో చేర్పించానని చెప్పడానికి సిగ్గుపడ్డాను.’’

ఆమె మాటలు విని సుశీల ముఖంలో రంగులు మారడం గమనించాను.

ఇంక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ది కాలేదు.

నా అదృష్టం కొద్దీ స్కార్పియో వచ్చేసింది. డ్రైవర్తో చెప్పి కొన్న సామాన్లను జీపులో పెట్టించాను. తరువాత జీపు మెల్లగా కదిలింది. రానురాను ఆమె మాకు దూరం కాసాగింది.

కానీ చాలాసేపటి వరకు ఆమె మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ నా అంతః చక్షువుల్ని తెరిపించాయి.

ఆ తండ్రిమాట జవదాటని శ్రీరాముణ్ణి చూడటానికి వచ్చిన నేను ఆ దాశరథి బాటలో నడవలేక పోయినందుకు చింతించాను. బహుశా ఆ రాముడే ఆమె రూపంలో నాకు కర్తవ్యాన్ని బోధించాడేమోనన్న ఊహ నా మనసులో మెదిలింది.

‘‘గౌతముడి శాపంతో శిలగా మారిపోయిన అహల్యకు రామపాదం సోకే వరం’’ కలిగినట్లు నాకు ఈ ప్రయాణంలో చేసిన తప్పుని దిద్దుకునే అవకాశం ఓ వరం లా కలిగిందేమో అనిపించింది.

ఈ ఆలోచన రాగానే నా మనసులో ప్రశాంతత ఆవహించింది.

మా స్కార్పియో వేగం అందుకుంది…

By editor

Twitter
Instagram