– పాలంకి సత్య

ఆనాటి రాత్రి ఎంత ప్రయత్నించినా మిహిరునికి నిద్ర రాలేదు. ఖనా గురించిన ఆలోచనలు ఒకవైపు, ఆమె గురించి తలపులు తప్పు అన్న భావమొకవైపు అతని కనురెప్పలు వాలనీయలేదు.

ఖనా నలుపు రంగులో ఉండడానికి కారణ మేమిటి? ఆమె తండ్రి తెలుపు. తల్లి నలుపేమో? వర్తక రీత్యా భరతభూమికి ఎన్నోసార్లు వెళ్లిన డేరియస్‌ ఆ ‌దేశ స్త్రీని వివాహం చేసికొని ఉండవచ్చును. ఇంతకూ ఖనా అన్న పదానికి అర్థమేమిటి? పారశీక భాషలో ఆ పదం లేదు. సంస్కృత భాషలో లేదు. గ్రీకు భాషలో కూడా వినలేదు.

ఆలోచన ఏల? ఆ పదం అర్థాన్ని డేరియస్‌ని అడిగి తెలుసుకొంటే మేలు.

మిహిరుని నిద్రాదేవి కరుణించే సమయానికి తూర్పున వెలుగురేఖలు కనిపించినాయి. అతడు లేచి, దినచర్యను ప్రారంభించినాడు.

*******

నాలుగు దినముల తర్వాత మిహిరుని డేరియస్‌ని ప్రశ్నించే అవకాశం వచ్చింది. ఆనాడు ఖనా తన స్నేహితుల ఇంటికి వెళ్లిన కారణంగా ఖగోళశాస్త్ర బోధన లేదు. మిహిరుడు తన సందేహాన్ని డేరియస్‌ ‌ముందుంచినాడు.

‘‘ఖనా అన్న పదానికి అర్థమేమిటి?’’

‘‘నాకును అంతగా తెలియదు. నేను విన్నది నిజమో, కాదో!’’ ఆశ్చర్యంగా చూసిన మిహిరునితో డేరియస్‌ ‘‘ఆమె పేరు గురించి వచ్చిన సందేహం ఆమె శరీర వర్ణం గురించి రాలేదా?’’ అని అడిగి నాడు.

మిహిరుడు మౌనం వహించినాడు. తనకు సందేహం వచ్చిన మాట నిజమే… కానీ అడగడం మర్యాద కాదు.

‘‘ఈ విషయమిదివరలో ఎవరికీ చెప్పలేదు. నా పుత్రులకు కూడా తెలియదు. మీరు పర రాజ్య  వాసులు కావడం చేత మనస్సు విప్పి చెప్పగలుగుతున్నాను’’.

మిహిరుడు ఏమీ మాట్లాడలేదు. డేరియస్‌ ‌చెప్పసాగాడు.

‘‘నేను వర్తకుడని మీకు తెలుసును. దక్షిణ భారతదేశంలో ఇనుము కొని, డమాస్కస్‌ ‌నగరంలో విక్రయించేవాడను. డమాస్కస్‌ ‌కత్తులకు ప్రసిద్ధి. అక్కడ తయారుచేసిన కత్తుల పదును విశ్వవిఖ్యాతం. ఒక వెంట్రుకను క్రిందకు వదలి, దాని దారిలో డమాస్కస్‌ ‌కత్తి ఉంచితే, వెంట్రుక తెగిపోతుంది. అంత పదునైన కత్తుల నిర్మాణానికి నేను ఇనుము అమ్మేవాడను.’’

‘వెంట్రుక తెగిపోతుందా? అతిశయోక్తి కాబోలును. ఇంతకూ ఈ నగరమెక్కడ ఉన్నదో!’ మిహిరుడికి లోలోపల సందేహం

‘‘ఒకసారి దక్షిణ భారతదేశంలో ఇనుము కొని, ఓడలోకి ఎక్కించే ప్రయత్నంలో ఉండగా ఒక వింత దృశ్యం కనబడినది. ఒక యువతి పసిబిడ్డతో పరుగెత్తుకొని వచ్చి, ఆ పసికందును సముద్రంలో పారవేయబోయింది. ఆమె వెనుకనే వృద్ధ దంపతులు పరుగున వచ్చి ఆమెను ఆపే ప్రయత్నం చేయ సాగినారు. నా ప్రక్కనే ఉన్న నా భార్య అక్కడకు వెళ్లి, ఆమె చేతిలోని బిడ్డను బలవంతంగా తీసికొని నా వద్దకు వచ్చింది’’.

మిహిరుడు వింటూ ఉండిపోయినాడు.

‘‘పారశీక భాష, దక్షిణ దేశ భాష తెలిసిన వారి సహాయంతో మా మధ్య సంభాషణ నడచింది. పసిబిడ్డ జన్మ చక్రం చూసిన జ్యోతిష్కులు ఆ పాప అల్పాయుష్కురాలని తెలియచేసినారట. కన్నబిడ్డ మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉండటం తన వల్ల కాదనీ, ఇప్పుడే చంపివేస్తాననీ బాలెంత తన బిడ్డతో వచ్చింది. తల్లిదండ్రులు ఆపే ప్రయత్నం చేశారు’’.

మిహిరుడు నిట్టూర్చినాడు. ఎట్టి పరిస్థితిలోనూ ఒక వ్యక్తి ఆయుః పరిమాణం కానీ, మరణ సమయం కానీ చెప్పరాదు. ఎందరు జ్యోతిష్కులకు ఆ నియమం గురించి తెలుసు? తెలిసినా పాటించే వారెందరు?

డేరియస్‌ ‘‘ఆ ‌బాలెంత ప్రవర్తన ఎంతకూ అర్థం కాలేదు. బిడ్డ చనిపోతుందో, బతికే ఉంటుందో… ఒకవేళ జ్యోతిష్కుడు నిజమే చెప్పినా పసికందును చివర ఘడియల వరకూ ప్రేమగా సాకవలసిన బాధ్యత తల్లికి లేదా?’’ అని అన్నాడు.

మిహిరుడు ‘‘ప్రసవించిన స్త్రీల శరీరంలో వచ్చినట్టే, మనసులోనూ అనేకమైన మార్పులు రాగలవు. ఆమెలో ఆందోళనను, నిరాశా నిస్పృహ లను ఔషధ పక్రియ ద్వారా తగ్గించవచ్చును’’ అన్నాడు.

డేరియస్‌ ఆశ్యర్యంగా ‘‘మిహిరాచార్యా! మీకు వైద్యశాస్త్రంలో కూడా ప్రవేశమున్నదా?’’ అని అడిగినాడు.

‘‘ఆచార్య శబ్దం వలదని మనవి. నేను విద్యార్థినే. జ్యోతిశ్శాస్త్రమునకు అనుబంధంగా ఉన్న వైద్య విశేషాలను నేర్చుకున్నాను.’’

డేరియస్‌ ‌పాత సంగతులు తెలియజేస్తూ ‘‘బాలెంత నా భార్య ఒడిలో తల పెట్టుకుని దుఃఖించింది. ఎంతో గొప్ప జీవితం గడపగలదన్న ఆశతో బిడ్డకు ఖనా అన్న పేరు పెట్టుకున్నదట. ఖనా అంటే గొప్ప అని అర్థమట కదా!’’ అని అన్నాడు.

ఖనా అని కాకుండా ఘనా అని అనవలెనన్న మాట. దక్షిణ ప్రాంతంలోని తమిళ భాషలో క, ఖ, గ, ఘ లను తేడా లేకుండా పలుకుతారు. సంస్కృత పండితులైతే సరిగా చెప్పగలరు. ఏ పురోహితులనో అడిగి పేరు పెట్టినట్లున్నది.

డేరియస్‌ ‘‘ఇం‌తకూ పసికందు మరణం సమీపంలోనే జరగగలదని చెప్పినది బాలెంతరాలి మేనమామయేనట. ఆయన జ్యోతిశ్శాస్త్రవేత్తట. ఆయన చెప్పిన విషయాలేవీ తప్పలేదట’’ అన్నాడు.

‘‘నా భార్య ఆ యువతితో బిడ్డను సముద్రంలో పారవేయవలదనీ, తాను పెంచుతాననీ, పసికందు మరణం చూసినా ఆ దుఃఖం భరించలేననీ అన్నది. యువతి వెంటనే అంగీకరించింది. ఆమె గర్భవతి అయిన నెలనాళ్లకే ఆమె భర్త గతించి నాడట. కొందరి జీవితాలు దురదృష్టంతోనే మొదలవు తాయి కాబోలు. నేను వృద్ధ దంపతులతో మా ఓడ కదిలేందుకు ఇంకా పదిరోజుల సమయం ఉందనీ, ఈలోగా ఎప్పుడయినా వచ్చి శిశువును తీసికొని పోవచ్చుననీ చెప్పాను. వారు రానే లేదు. అటువంటి మనుషు లుంటారంటే నమ్మశక్యం కాలేదు’’.

‘‘మానవ ప్రకృతి విచిత్రమైనది. ఎన్నటికీ అర్థం కానిది మనుష్య మనస్తత్వమే’’.

‘‘పసిబిడ్డతో నేనూ, నా భార్యా వ్యాపార కార్యక్ర మాలన్నీ ముగించుకుని రెండేళ్ల తర్వాత పారశీక రాజ్యానికి తిరిగి వచ్చాం. ఈ నగరంలోనే చదువు కుంటున్న నా పుత్రులు ఖనా తమ చెల్లెలు అనే అనుకున్నారు. బంధు మిత్రులందరూ ఖనా మా కన్నబిడ్డ అనే భావించారు. దక్షిణ భరతభూమి ఉష్ణదేశం కనుక నల్లని బిడ్డ కలిగిన దనుకున్నారు. ఈనాడెందుకో మీకు మాత్రమే నిజం చెప్పాను.’’

మిహిరుడు మాట్లాడలేదు.

‘‘నా భార్య రెండేళ్ల క్రిందట మరణించినది. నా పుత్రుల వ్యాపారం కోసం దేశ దేశాలకు వెళ్లి రావడం పరిపాటి. మీరు మా ఇంట ఉండడం నాకు ఆనందదాయకం. ప్రస్తుతం ఇంట ఇద్దరమే నేనూ, ఖనా.’’

చీకటి పడసాగింది. మిహిరుడు నక్షత్రపటం రాయాలన్న ఉద్దేశంతో లేచినాడు.

డేరియస్‌ ‌నెమ్మదిగా ‘‘ఖనాకు వివాహ ప్రయత్నం ప్రారంభించాలి. ఖనా శ్యామలాంగి. పారశీక యువకులు నలుపు రంగును ఇష్టపడరేమో! పారశీక రాజ్యంలో పెరిగిన యువతిని భరత ఖండపు పురుషులు అంగీకరించగలరా? అహుర మజ్ద అనుగ్రహించుగాక’’ అని అన్నాడు.

ఆయన తనలో తాననుకున్నాడా, లేక తనతో చెప్పినాడా అన్న సందేహం మిహిరునికి కలిగింది.

*******

రెండు నెలల తర్వాత ఒకనాటి ఉదయము డేరియస్‌ ‌మిహిరునితో ‘‘మా చిన్న కుమారుడు త్వరలోనే ఇక్కడకు రాగలడు. నిన్ననే అతని నౌక రేవు పట్టణం చేరినదని వార్త అందింది. దక్షిణ భారతంలోని మసూలియాలో వస్త్రాలు కొని రోమ్‌ ‌నగరంలో విక్రయించే వ్యాపారమతనిది. నా జ్యేష్ఠ పుత్రుడు డమాస్కస్‌ ‌నగరంలో ఇనుము అమ్మే వ్యక్తిని స్వీకరించినాడు’’ అన్నాడు.

‘‘మీ కుమారుని చూడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని అన్న మిహిరుడు ‘‘రోమ్‌ ‌నగరమెక్కడ ఉన్నదో’’ అని అనుకున్నాడు.

(మసూలియా=నేటి మచిలీపట్టణ ప్రాంతం, మస్లిన్‌ ‌వస్త్రాలన్నమాట మసూలియా నుంచే వచ్చినది)

*******

ఆనాడు అతని ఉపాధ్యాయుడు ‘‘నేను నేర్పగలిగిన యవన ఖగోళ శాస్త్రమంతా నేర్పినాను. నేను బోధించిన గ్రీకు జ్యోతిష్యం కన్నా నీ వద్ద నేర్చుకున్న భారతీయ జ్యోతిషమే ఎక్కువ’’ అన్నాడు.

మిహిరుడు వినయంగా ‘‘అదెంతటి మాట? మీ వద్ద నేను చాలా నేర్చుకున్నాను’’ అన్నాడు.

‘‘నీకు నేను ప్రాథమిక విషయాలే నేర్పినాను. నీకు విశేషాంశాలు నేర్చుకొనాలని ఉంటే గ్రీకుల విద్యా రాజధానికి వెళ్లడం మంచిది. అక్కడ ఉన్న గ్రంథాలయం ప్రసిద్ధి చెందినది. విద్యావేత్త లనేకులున్నారు.’’

‘‘ఏధెన్సు నగరమా?’’ విద్యాభ్యాస సమయంలో మిహిరునికి ఏధెన్సులో శాస్త్రవేత్తలెక్కువగా ఉండే వారనీ, స్పార్టానగరం వీరులకు నివాసమనీ తెలిసింది.

గురువు నిర్వేదంతో నవ్వి ‘‘ఎప్పటి ఏధెన్సు నగరం? రోమ్‌ ‌పాలకులు గ్రీసును జయించిన తర్వాత ఆ నగరంలో శోభ లేనే లేదు. ప్రస్తుతం పంగితులకు అలెక్సాండ్రియా ఆలవాలం’’ అన్నాడు.

 రోము నగరం పేరు ఈనాడు రెండవసారి వినబడినది. ఇంతవరకు ఆపేరే వినలేదు. డమాస్కస్‌, అలెక్సాండ్రియా పేర్లు మాత్రం తనకు తెలియదా? ఆకాశ మార్గాన పయనించే తారల గురించి నేర్చుకొనటమే కానీ భూమిపై ఉన్న రాజ్యాలు, నగరాలు తనకు తెలియనే తెలియవు.

మిహిరుని ముఖంను పరిశీలనగా చూసిన అతని గురువు, ‘‘నీకు గ్రీసు చరిత్ర తెలిసినట్లు లేదు. గ్రీకు జాతి బహు ప్రాచీనమైన నాగరిక జాతి….’’ అంటూ కొన్ని వివరాలు చెప్పి ఆ తర్వాత అలెక్సాండరు దండయాత్రలను వర్ణించి చెప్పాడు.

‘‘అలెక్సాండరు తర్వాత అతడు స్థాపించిన సామ్రాజ్యం నాలుగు ముక్కలుగా విడిపోయింది. ఆ ముక్కలలో రెండింటిని – ఏధెన్సు, అనటోలియాలను రోమ్‌ ‌పాలకులు జయించారు. పారశీక సామ్రాజ్యం మూడవ ముక్క. అందులో మనమున్న భాగాన్ని పారశీకులు తమ వశం చేసికొన్నారు. మిగిలిన భాగం గ్రీకుల క్రిందే ఉన్నది. నాలుగవది ఈజిప్టు మాత్రమే పూర్తిగా గ్రీకులదిగా ఉన్నది. ఈజిప్టులోనే అలెక్సాండ్రియా నగరమున్నది. రోమ్‌ ‌పాలకులు ఈజిప్టును జయించే ప్రయత్నంలో ఉన్నారని విన్నాను. నీవు ఇంకను విద్యను అభ్యసించ వలెననుకుంటే త్వరలోనే అలెక్సాండ్రియా వెళ్లడం మంచిది’’.

‘‘చిత్తం.’’

మిహిరుడు ఉపాధ్యాయుని వద్ద సెలవు తీసికొని, ఇంటికి వస్తూ రోమ్‌ ‌పాలకులు దుర్మార్గుల వలె ఉన్నారు. తాము జయించిన రాజ్యాలలో కప్పం స్వీకరించడం రాజధర్మం కానీ, నగరాలను నాశనం చేయతగునా? భారతీయ ధర్మానికీ, ఇతర రాజ్య సంప్రదాయాలకూ పోలిక లేదేమో! అనార్యులన్న మాట అందుకే వాడుతున్నారా? ఆకాశం నుండి భూమి వైపునకు దృష్టి సారించి, రాజ్యాల గురించీ, రాజుల గురించీ తెలిసికోవడం మంచిది’’ అనుకున్నాడు.

*******

రోమ్‌ ‌నగరం. జూలియస్‌ ‌సీజర్‌ ‌తన గృహంలో ఆలోచనామగ్నుడై ఉన్నాడు. ధనహీనులు నివసించే ప్రాంతంలో సాధారణమైన ఇల్లు ఎక్కడ, జూపిటర్‌ ‌దేవుని ప్రధాన పూజా నిర్వహకుడి కుమారునిగా నివసించిన విలాస భవనమెక్కడ? తాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించి రాజ్యాధికారం కోసం ప్రయత్నించకుండా ఉండవలసినదా? ఏమి, ఇటువంటి ఊహలు మనసులో ప్రవేశిస్తున్నాయి? తాను ఏనాటికైనా అధికారం చేపట్టవలసినదే. తన వంటి మహావీరుడు రాజ్యం ఏలాలి కానీ, పూజలు చేయరాదు.

జూలియస్‌ ‌సీజర్‌ ఆలోచనలను భగ్నం చేస్తూ అతని భార్య కొర్నీలియా ‘‘ఏనాడైనా మీకు తండ్రి ఆజ్ఞను ధిక్కరించినందుకు పశ్చాత్తాపం కలిగినదా?’’ అని అడిగింది.

ఈమె నా హృదయంలో ప్రవేశించగలిగినదా అని ఆశ్చర్యపడిన జూలియస్‌ ‌సీజర్‌ ‘‘అదేమి ప్రశ్న’’ అన్నాడు.

‘‘మీ జనకులు నిశ్చయించిన స్త్రీతో పెళ్లి జరిగి ఉంటే మీ జీవితనౌక హాయిగా సాగిపోయి ఉండేది కదా!’’

‘‘కొర్నీలియా, నీ మాటలు నాకు అర్ధం కావడం లేదు’’

‘‘ఈనాడు కొస్సీషియా మన ఇంటికి వచ్చింది. నాలుగు గుర్రాలు లాగే రథంలో దాసదాసీ జనంతో వచ్చి తానెవరో నాకు చెప్పింది. మీ తండ్రిగారి మాటను కాదని మీరు నన్ను వివాహం చేసుకున్న విషయం తెలిసినప్పుడు చాలా బాధపడినదట. నేడు మీ దీన స్థితిని చూసి మీతో వివాహం కాకపోవడమే మేలనుకుంటున్నదట’’.

‘‘నీ మీద నాకు ప్రేమ కలిగింది. మన వివాహం జరిగింది. ఆమె దుఃఖంతో కానీ, ఆనందంతో కానీ మనకేమి?

‘‘ఆమె మీ భార్య అయితే, భోగభాగ్యాలతో సుఖంగా ఉండే వారు కదా’’.

‘‘అదే మాట నేనంటే నీకెలా ఉంటుంది? ప్రేయసీ, కొర్నీలియా, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను వదలి ఇదివరలో ఉండలేదు. ఇకపై ఉండలేను. నా సర్వస్వమూ నీ పాదాక్రాంతము చేసిన సంగతి నీకు తెలియదా?’’

కొర్నీలియా అతని ప్రక్కనే కూర్చుని ‘‘నాకు తెలుసు. అయినా ఎందుకో భయం వేసింది’’ అన్నది.

‘‘నా ప్రేమ ఎంత గాఢమైనదో ఈ రాత్రి నీకు మరొకసారి రుజువు చేయగలను’’ అని అన్నాడు.

కొర్నీలియా ముఖం మీద సిగ్గుతో కూడిన మందహాసం మెరిసింది.

*******

ఆనాటి సాయంకాలం జూలియస్‌ ‌సీజర్‌కు లేఖ వచ్చింది. ‘రోమ్‌ ‌నగరానికి నీవు వచ్చిన వార్త వినటమే కానీ నీ దర్శనభాగ్యం కలుగనేలేదు. నన్ను చూడాలన్న కోరిక నీకు లేకపోవచ్చును కానీ, కుమారుని చూడడానికైనా వచ్చి ఉండవచ్చును కదా! నా భర్త ఊరిలో లేడు. ఇంతకుమించిన మంచి సమయం నీకు ఇప్పటిలో లభించదు.’

తన ప్రేయసి సెర్విలియా లేఖను రాసినదని జూలియస్‌ ‌సీజర్‌ ‌గ్రహించినాడు. వివాహమైన తర్వాత తానామెను మరచిపోయినాడా? లేదు. తన హృదయంలో ఆమె కదలాడుతూనే ఉన్నది. రోమ్‌ను తాను వదలిపోవలసి వచ్చింది. ఆపైన అనేక కష్ట నష్టాలను అనుభవించి తిరిగి రాగలిగినాడు. ఆమెను అనునయించడం ఆవశ్యకం. అంత కన్నా ముఖ్య మైనది తన కుమారుని చూడడం. పుత్ర పరిష్వంగ సౌఖ్యానికి మించినదేముంది?

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram