జనవరి 12, జనవరి 17, జనవరి 22… ఎక్కడో ఆస్ట్రేలియాలో కొద్దిమంది హిందువులు పూజాపునస్కారాలు చేసుకునే మూడు గుళ్ల మీద ఆ తేదీలోనే అంటే నెల రోజులు లోపునననే ఈ దాడులు జరిగాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇంగ్లండ్‌ అం‌తటా హిందువులు మీద, వారి సంస్కృతి మీద నీచమైన పద్ధతిలో దాడులు చేస్తున్నారు. హిందుత్వను కూకటివేళ్లతో పెకలించాలంటూ అమెరికాలో ఒక అంతర్జాతీయ సదస్సునే (డిజ్‌మ్యాంటిలింగ్‌ ‌గ్లోబల్‌ ‌హిందుత్వ) నిర్వహించారు. కొన్నిచోట్ల ముస్లింలు, కొన్నిచోట్ల ఖలిస్తానీ ఉగ్రవాద మద్దతుదారులు ఈ పనికి పాల్పడుతున్నారు. ఈ అంతటికీ అదే కారణమా అంటే, కావచ్చును, కానీ, అంత తేలిగ్గా తీసుకునే విషయం అయితే కాదు. అవును, ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు, ఉగ్రవాద మద్దతు దారులు హిందూ దేవాలయాలపై సాగిస్తున్న వరస దాడులకు, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మళ్లీ బీజేపీ/ ఎన్డీఎ అధికారంలోకి వస్తుందనే, హ్యాట్రిక్‌ ‌సాధిస్తుందనే భయం ఒక కారణం అయితే కావచ్చును. కానీ, భారత దేశ విచ్ఛితికి విఫల ప్రయత్నాలు చేస్తున్న, జాతీయ విజాతీయ శక్తులు, కాంగీ, కమ్మీ ఇత్యాది కుహనా లౌకికవాద పార్టీలు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, ఏపీ నుంచి ఆస్ట్రేలియా వరకు హిందూ దేవాలయాలపై ఉమ్మడిగా  సాగిస్తున్న దాడులను, విరజిమ్ముతున్న విషాన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. తస్మాత్‌ ‌జాగ్రత్త  

ఆంధప్రదేశ్‌లో ఏమి జరుగుతోంది? ‘పిచ్చోళ్లు’ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. చిత్రంగా అవన్నీ హిందూ దేవాలయాలే. ఆ విగ్రహాలన్నీ హిందూ దేవీ దేవతలవే. పిచ్చోళ్ల మీద ఏం చర్యలు తీసుకుంటా మని, సెక్యులర్‌ ‌ప్రభుత్వం, సెక్యులర్‌ ‌రాజకీయ పార్టీలు మౌనంగా చూస్తూ ఉండిపోయాయి. ఒక్క ఆంధప్రదేశ్‌లో మాత్రమే కాదు, పొరుగున ఉన్న తమిళనాడులో, మరో రాష్ట్రంలో, దేశంలో ఎక్కడంటే అక్కడ హిందూ దేవాలయాలు దాడులకు గురవు తున్నాయి. హిందూ వ్యతిరేక కుహనా లౌకికవాద శక్తులు,సెక్యులర్‌ ‌రాజకీయాల ముసుగులో సాగిస్తున్న ఈ దాడుల వెనక విదేశీశక్తుల కుట్రలు ఒక వాస్తవం.

అలా అని ఇది ఎవరికీ తెలియని రహస్యం కాదు. అందరికీ తెలిసిన పచ్చి నిజం. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలలో భాగంగా ఈ విధమైన దాడులు జరుగుతున్నాయి. అలాగే, అంతర్జాతీయ ఉగ్రవాదసంస్థలతో భారతీయ రాజకీయ పార్టీలకు, మరీ ముఖ్యంగా ఖలిస్తాన్‌ ‌మద్దతుదారులు, ఉగ్రవాదులతో ఉన్న సంబంధాల గురించి కూడా వేరే చెప్పనక్కరలేదు. ఢిల్లీ ముఖ్య మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదులతో సంబంధా లున్నాయన్న ఆరోపణలున్నాయి. ఆరోపణలు చేసింది ఎవరో కాదు, ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితునిగా ఉన్న కుమార్‌ ‌బిశ్వాస్‌. ‌నిజానికి, స్వయంగా కేజ్రీవాల్‌, ‘అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి నవుతా, లేదంటే దేశాన్ని రెండుముక్కలు చేసి ఒక ముక్కకు ప్రధానమంత్రినవుతా’ నంటూ తనతో అన్న మాటలను ఉటంకిస్తూ బిశ్వాస్‌ ఈ ‌విమర్శ చేశారు. అంతేకాదు, తనకు ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదులతో సంబంధం లేదని కేజ్రీవాల్‌ ‌బహిరంగ ప్రకటన చేయాలని కుమార్‌ ‌బిశ్వాస్‌ ‌సవాలు చేశారు. కేజ్రీవాల్‌ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు కానీ, తాను, ప్రజలకు మేలు చేసే ‘స్వీట్‌టెర్రరిస్టు’ ను అని ప్రకటించారు.

ఇప్పుడు ఇదే ఖలిస్తాన్‌ ‌మద్దతుదారులు ఆస్ట్రేలి యాలో దేవాలయాపై దాడులకు పాల్పడుతున్నారు. పక్షం రోజుల వ్యవధిలో మూడు ప్రసిద్ధ హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు పాల్పడింది ఎవరో కాదు, మనదేశంలో కుహన లౌకికవాదులు పెంచి పెద్దచేసిన ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు. ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేసిన హిందూ దేవాలయాల గోడలపై, రాసిన రాతలే అందుకు సాక్ష్యం. ఆస్ట్రేలియాలో దాడులకు గురైన మూడు హిందూ దేవాలయాల గోడలన్నీ, ‘ఖలిస్తాన్‌ ‌జిందాబాద్‌’, ‘‌హిందుస్తాన్‌ ‌ముర్దాబాద్‌’ అన్న నినాదాలతో నింపేశారు.

అలాగే, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, భారతదేశంపై విద్వేషం వెదజల్లే నినాదాలు రాశారు. తాజాగా, ఖలిస్తానీ మద్దతుదారుల దాడికి గురైన ఒక దేవాలయం మెల్‌బోర్న్‌లోని ఆల్బర్ట్ ‌పార్క్‌లో ఉంది. అంతకు ముందు, ఖలిస్తానీ మద్దతుదారులు కారమ్‌ ‌డౌన్స్‌లోని శ్రీ శివ విష్ణుదేవాలయం, మిల్‌ ‌పార్క్‌లోని బీఏపీఎస్‌ ‌స్వామినారాయణ మందిరం పై దాడులు చేశారు. విధ్వంసం సృష్టించారు. ఆ రెండు ప్రసిద్ధ ఆలయ ప్రాంగణాలలోని గోడలను కూడా హిందూ వ్యతిరేక, భారతదేశ వ్యతిరేక నినాదాలు, చిహ్నాలతో నింపేశారు. భారతదేశానికి, భారత ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విద్వేషపూరిత సందేశాలతో గోడలు నిండిపోయాయి. అంతే కాదు, వేలమందిని పొట్టన పెట్టుకున్న ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాది భింధ్రెన్‌వాలేపై ప్రశంసలు కురిపించారు. (భింధ్రెన్‌వాలా ఎవరు ఏమిటి, అది వేరే చరిత్ర (కాంగ్రెస్‌ ‌పార్టీ అంతర్గత కుమ్ములాటలకీ, అధికార దాహానికీ కలిగిన అక్రమ సంతానమే భింధ్రెన్‌వాలా). హిందూ దేవాలయాలపై ఇలా వరుస దాడులు అక్కడి హిందువులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఈ విషయాన్ని భారత్‌ అం‌త సులభంగా తీసుకునే అవకాశం ఉండదు. భింధ్రెన్‌వాలాకీ, అతడిలోని రాక్షసుడికి ప్రాణ ప్రతిష్ట చేయాలన్న ఆశతో హిందూ దేవాలయాల మీద దాడులకు దిగితే సహించే విషయం కాబోదు. భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ ఈ ‌ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. మెల్‌బోర్న్‌లోని రెండు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఈ విషయంపై ఉభయ దేశాల మధ్య ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ ‌బాగ్చి తెలిపారు. ఇండియన్‌ ‌కాన్సులేట్‌ ‌జనరల్‌ ‌మెల్‌బోర్న్ ‌పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆలాగే, స్థానిక ఎంపీ బ్రాడ్‌ ‌బట్టిన్‌ ‌నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు.

మిల్‌ ‌పార్క్‌లోని బీఏపీఎస్‌ ‌స్వామి మందిరంపై జనవరి 12న, కారమ్‌ ‌డౌన్స్‌లోని శ్రీ శివ విష్ణు మందిరం, జనవరి 16 మధ్య రాత్రి సమయంలో  దాడులు జరిగాయి. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కానీ, ఇంతలోనే మెల్‌బోర్న్‌లోని ఆల్బర్ట్ ‌పార్క్‌లో ఉన్న మరో మందిరం పై దాడి జరిగింది. నిజానికి, ఒక ఆస్ట్రేలియాలో మాత్రమే కాదు, బ్రిటన్‌, ‌కెనడా దేశాల్లోనూ గత కొంత కాలంగా ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదుల మద్దతు దారులు వరస దాడులకు పాల్పడుతున్నారు. అమెరికాలో (జనవరి 11 న) టెక్సాస్‌ ‌రాష్ట్రంలోని బ్రజోస్‌ ‌పట్టణంలోని శ్రీ ఓంకారనాథ్‌ అలయంలో దొంగలు పడి, విలువైన వస్తువులను దోచుకున్నారు.

ఇక పాకిస్తాన్‌లో పరిస్థితిని ప్రత్యేకించి చెప్ప వలసిన అవసరం లేదు. సింధ్‌ ‌ప్రావిన్స్‌లోని శివారు ప్రాంతాల్లో హిందూ యువతులు, మహిళల్ని కిడ్నాప్‌లు చేయడం, బలవంతంగా మతం మార్చడం గురించి తరచూ వార్తలు వస్తున్నాయి. అది అక్కడ నిత్యకృత్యంగా మారింది. హిందువులు అత్యధికంగా ఉండే థార్‌, ఉమర్‌కోట్‌, ‌మిర్‌పుర్‌ఖాస్‌, ‌ఘోట్కి, ఖైరాపూర్‌ ‌వంటి చోట్ల ఈ పరిస్థితి మరీ దారుణం. నిజానికి ఈ సంఘటనలను విడివిడిగా చూస్తే, వేటికవి చిన్ని సంఘటనలు, లేదంటే ‘పిచ్చోళ్ల’ చేష్టలు అనిపించవచ్చును, కానీ, వాస్తవం అది కాదు. ఒక పథకం ప్రకారం కుహనా లౌకికవాద దేశీయశక్తులు అంతర్జాతీయంగా సాగిస్తున్న కుట్రలో భాగంగానే, దేశంలో విదేశాల్లో దేవాలయాలపై దాడులు జరుగు తున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగిన, జరుగుతున్న దాడుల విషయానికివస్తే, ఈ దాడులు ఎవరు చేస్తున్నారు అనేది కాదు, (అది స్పష్టంగా దేవాలయాల గోడల మీది రాతలతోనే తేలిపోయింది) ఎందుకు చేస్తున్నారు? అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అయితే, అది కూడా అంత చిక్కు ప్రశ్న కాదు.

గుజరాత్‌ అల్లర్లకు అగ్గిరాజేసిన 59 మంది కరసేవకుల సజీవ దహనం సంఘటనను వదిలేసి అనంతర పరిణామాలను వక్రీకరించి, బీబీసీ ఇప్పుడు.. ఇన్నేళ్ల తర్వాత, డాక్యుమెంటరీ ఎందుకు తీసింది? ఎందుకు ఇప్పుడే విడుదల చేసింది? నిజానికి, 20 ఏళ్ల క్రితం 2002 ఫిబ్రవరి నెలలో గోధ్రా రైల్వే స్టేషన్‌లో నిలిచిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ‌రైలు ఎస్‌-6 ‌బోగీకి దుండగులు నిప్పంటించడంతో దాదాపు 59 మంది సజీవదహన మయ్యారు. గోధ్రా అనంతరం జరిగిన అల్లర్లలో వెయ్యి మంది వరకు చనిపోయారు. కానీ, ఈ మారణకాండకు అప్పటి గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యులు కాదని, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా, బీబీసీ ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ఎందుకు తెచ్చింది? దేశంలోని కుహనా లౌకిక వాదులు ఎందుకు చంకలు గుద్దుకుంటున్నారు? ఎన్నికల సంవత్సరం కాబట్టి. ఈ సమయంలో మత ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకు బీబీసీ ముసుగులో ఈ వికృత క్రీడకు తెర తీశారా? లేకుంటే ఎందుకీ ప్రయత్నం? జాతీయంగా, అంతర్జాతీయంగా హిందూ వ్యతిరేకత, మోదీ వ్యతిరేకత, దీనికి తోడుగా ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించేందుకు, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, ‌కెనడా దేశాల్లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.

ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో నాడు భారత్‌ ‌భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చిందనే విషయాన్ని, దేశప్రజలు ఎప్పటికీ మరిచిపోరాదు. పంజాబ్‌లో దాదాపు 1,1694 మంది సాధారణ పౌరులు, 1784 మంది భద్రతా సిబ్బంది ఉగ్రవాదా నికి బలయ్యారు. 8000 కు పైబడి ఉగ్రవాదులు భద్రతాదళాల చేతులలో హతమయ్యారు. ఒక ప్రధాని, ఒక ముఖ్యమంత్రిని ఖలిస్తానీ ఉగ్రవాద మూకలు మింగేశాయి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన ఉగ్రవాదం పంజాబ్‌ను యాభై సంవత్సరాలు వెనక్కు నెట్టింది. ఇప్పడు మళ్లీ ఉగ్రవాద భూతం జడలు విప్పుకోవడం, పంజాబ్‌కే కాదు దేశానికి ఎంతమాత్రం క్షేమం కాదు. అందుకే, మనల్ని మనం తస్మాత్‌ ‌జాగ్రత్త అని అప్రమత్తం చేసుకోక తప్పదు. ఖలిస్తాన్‌ ‌భూతాన్ని తిరిగి ఆవాహన చేస్తే అది బీజేపీకో, ఆరెస్సెస్‌కో, హిందువులకో మాత్రమే ప్రమాదం కాదు. దేశంలోని అన్ని మతాలకి, అన్ని వర్గాలకి. ఇది కాంగ్రెస్‌ ‌వంటి విధ్వంసక పక్షాలు గుర్తించడం అవసరం. తమ పార్టీ నేత, ఈ దేశ ప్రధానిని చంపిన చరిత్ర వారికి ఉన్నా ఫర్వాలేదు. మోదీని దించడానికి మాత్రం వాళ్లని ఉపయోగించుకోవచ్చునన్న నీచపు బుద్ధి కాంగ్రెస్‌ ‌ప్రదర్శిస్తున్నది. ఢిల్లీలో రైతు ఉద్యమం పేరుతో తిష్టవేసిన ఖలిస్తానీ ఉగ్రవాదులక• మళ్లీ చేయి అందించి ఇంతవరకు తీసుకువచ్చిన పాపం విపక్షాలది కాదని ఎలా అనగలం? ఆస్ట్రేలియాలోనే కావచ్చు. లేదా భారత్‌లోనూ కావచ్చు. ఆ ఘటనలతో హిందువుల మనోభావాలు అంతగా గాయపడినా ఒక్క రాజకీయ పార్టీ కూడా నోరు విప్పదేం?

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram