– తురగా నాగభూషణం

వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేల్లో ఏర్పడిన అసంతృప్తి రగులుతున్న అగ్నిపర్వతంలా కనిపిస్తోంది. ఏ క్షణాన్నైనా భళ్లున బద్దలై అధిష్టానంపై తిరుగుబాటు చేయవచ్చని జరుగుతున్న పరిణామాలనుబట్టి తెలుస్తోంది. ఇందుకు బోలెడు కారణాలు. పాలనలో అధికారపార్టీ పూర్తిగా విఫలమైంది. అవినీతి, వనరుల దోపిడీ, రౌడీయిజం, గూండాయిజం, అభివృద్ధి చేయకపోవడం, సమస్యలు పరిష్కరించక పోవడం, పెరుగుతున్న ధరలను అదుపు చేయక పోవడం వంటివి ప్రభుత్వం ఎదుర్కొంటోంది. సొంత మనుషులు తయారుచేస్తున్న నాసిరకం మద్యాన్ని రెండు రెట్లు అధిక ధరలకు అమ్ముతున్నట్లు, ఇసుక సరఫరాలో అవినీతి ఆరోపణలు కూడా ప్రభుత్వంపై వచ్చాయి. సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసి నగదు పంపిణీ చేయడం, ఆదాయం కోసం పన్నులు భారీగా వడ్డించడం, కరెంటు, బస్సు ఛార్జీల పెంపు వంటి ఆర్ధిక భారాలతో ప్రజలు ప్రభుత్వంపై మండి పడుతున్నారు. రైతులు, యువత, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు.. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలలో ఏర్పడిన వ్యతిరేకతతో ఇక ఈ ప్రభుత్వం ఓడిపోనుందని అందరికీ అర్థం అయిపోయింది.

అభివృద్ధి పనులకు దూరంగా ఉండటం, అధికారం కేంద్రీకృతం కావడం, సంక్షేమ జపం లోనూ గ్రామ సచివాలయాకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఎమ్మెల్యేలకు పనిలేకుండా పోయింది. దానికి తోడు జిల్లా ఇన్‌ఛార్జులు, రీజినల్‌ ఇన్‌ఛార్జుల పెత్తనంతో తమ ఆదాయానికి అడ్డుపడుతున్నారని కొందరు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఆదాయం రాని వారంతా తీవ్ర అసంతృప్తి చెంది తిరుగుబాటుకు సిద్ధంగా వున్నారు. అక్కడక్కడ నిరసన గళం విప్పుతు న్నారు. దీంతో తమకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యే లపై అధిష్టానం నిఘా పెట్టినట్లు కూడా ఆరోపణలు వింటున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం నివురు గప్పిన నిప్పులా ఉన్నా నెల్లూరు జిల్లాలో మాత్రం అసంతృప్తి భగ్గుమంది. తమపై నిఘా పెట్టినట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ మీడియా ముందు మాట్లాడి పార్టీ పట్ల తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తమతమ నియోజకవర్గాలలో ఒక్క పనీ జరగకపోగా, మూడేళ్లుగా సమస్యలను కూడా పరిష్కరించ లేని తాము ఉండి ప్రయోజనం ఏమిటని మరికొందరు ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో ప్రజలు తమను విమర్శించినా ఏం చేయలేక వెను తిరిగిపోతున్నారు. కొందరైతే ఈ కార్యక్రమానికి వెళ్లడం మానేశారు.

కోల్పోయిన ప్రాధాన్యం

వైసీపీ ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యే లున్నారు. వీరిలో పార్టీకి వీరాభిమానులు సగం మందికి పైగా ఉండగా, కొందరు కాంగ్రెస్‌ ‌నాయకులు, కొత్తగా ఎన్నికైనవారు మరికొందరు. కాని తమ వల్లే ఈ 150 మంది గెలిచారనే అభిప్రాయం అధిష్టానానికి ఉన్నట్లు ఈ మూడున్నరేళ్ల ప్రస్థానంలో తమకు అర్థ్ధం అయినట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు సీ•ఎంకు మధ్య ఎన్నో అడ్డుగోడలు ఏర్పడ్డాయి. మూడు ప్రాంతాలకు ముగ్గురు ఇన్‌ఛార్జులు, సలహాదారులు, ఆ తర్వాత జిల్లా ఇన్‌ఛార్జులున్నారు. వీరంతా ఒకరిపై ఒకరు పెత్తనంచేస్తారు. చివరగా మిగిలింది మాత్రం ఎమ్మెల్యేలు. సమస్యలు వస్తే ఇన్‌ఛార్జికే చెప్పాలి. ముఖ్యమంత్రిని కలవడం అనేది అసాధ్యం అయి పోయిందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అభివృద్ధి పనులు ఒక్కటీ ప్రారంభించ లేదనుకుంటే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కూడా ఒట్టిమాటగానే మిగిలి పోయింది. దాదాపు అన్ని నియోజక వర్గాల్లో రోడ్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ధ్వంసమైన రోడ్లు వేయడం అటుంచి కనీసం మరమ్మతులు కూడా లేవు. 2019 సమయంలో ప్రారంభమైన కొత్త రోడ్ల పనులు ఇప్పటికీ పూర్తికాకుండా వదిలేసినవి ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీ ప్రాంతాల్లో పాత బిల్లులు చెల్లించక పోవడంతో కొత్త రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. వైసీపీకి చెందిన కొందరు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినా వారికీ బిల్లులు సరిగా చెల్లించక పోవడంతో వెనక్కి పోతున్నారని ఆరోపణలు వస్తు న్నాయి. పలు ప్రాంతాల్లో అవసరమైన వంతెనలు, రోడ్డు అండర్‌ ‌బ్రిడ్జిల పనులు ఆగిపోయాయి. ట్రాఫిక్‌ ‌సమస్యలు తీవ్రమైపోయాయి. అద్దెకుంటున్నవారు రోడ్ల సమస్య ఉన్న ప్రాంతాల నుంచి ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మంచినీటి సదుపాయం, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలు వేధిస్తున్నాయి. దోమల సమస్యను ఈ ప్రభుత్వం పరిష్కరించడం లేదు. ఇవి కాక సంక్షేమం పేరుతో ప్రభుత్వం చేసే నగదు పంపిణీలో గ్రామ సచివాలయాలు కేంద్ర బిందు వయ్యాయి. పథకాల అమలుకే వీటిని ఏర్పాటు చేయడంతో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్‌ ‌మాత్రమే పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేల అవసరం లేకుండా పోయింది. గ్రామాల్లో కూడా సర్పంచ్‌ ‌పరిస్థితి ఎమ్మెల్యేల మాదిరిగానే ఉంది. పథకాలు అందని వారు, తెల్లరేషన్‌ ‌కార్డులు తీసేసిన వారంతా ఆయా ప్రాంతాల్లోని సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలను తిట్టిపోస్తున్నారు.

ఆదాయానికి అడ్డుగా

గతంలో ఎమ్మెల్యేలకు బార్లు, వైన్‌షాపులు, ఇతర ఆదాయం వచ్చే కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉండేది. బార్లు, వైన్‌ ‌షాపులే ప్రధాన ఆదాయ వనరు. కాని మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించడం, బార్లు ఉన్నా మద్యంపై అధిక ధరల భారం వేయడంతో వీరి ఆదాయానికి గండి పడింది. కేవలం కాలవలు, నదీ తీరాలు, ఏరులు ఉన్న ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులు మాత్రమే ఇసుకను అమ్ముకుంటూ సంపాదించుకుంటున్నారని, తమకు అలాంటి అవకాశం లేదని మిగతా ప్రాంత ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇంటి స్థలాల పంపిణీ పథకానికి స్థల సేకరణ కోసం భూములు కొనుగోళ్లలో కొందరు ఎమ్మెల్యేలు బాగా సంపాదించారని అన్ని పార్టీలు ఆరోపించాయి. ఈ అవకాశం రాని వారు మాత్రం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు అధిష్టానానికి చెప్పు కుందామంటే మధ్యలో ఇన్‌ఛార్జిలు, సలహాదారులు, ఆపై రీజినల్‌ ఇన్‌ఛార్జులను దాటుకుని వెళ్లాలి. మూడున్నరేళ్లుగా ఈ తరహా విధానం అమలులో ఉండటంతో ఎమ్మెల్యేలు విసిగిపోయారు. సమస్యలు పరిష్కరించక, అభివృద్ధి పనులు చేయక, తమకు అధికారం ఉందో లేదో తెలీక చివరికి అధిష్టానం అంటే ఏవగింపు స్థితికి వచ్చేశారు.

అంతర్గత కుమ్ములాటలు

ఇక పార్టీలో అంతర్గత కుమ్మలాటలు పెరిగి పోయాయి. పలు నియోజకవర్గాల్లో ఆదాయం, అధికారం కోసం ద్వితీయ స్థాయి నేతలు కుమ్ములాడు కుంటున్నారు. తమదే పైచేయి కావాలని రౌడీయిజం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కలెక్షన్లు, కమిషన్ల కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారని, కొందరు ఎమ్మెల్యేల భార్యలు ఈ విషయంలో చురుగ్గా ఉన్నారని వైసీపీ ప్రభుత్వం నియమించిన సర్వే సంస్థ పేర్కొన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. 52 మంది ఎమ్మెల్యేలు అవినీతి రొచ్చులో కూరుకు పోయారనేది ఆరోపణ. ఈ నేపథ్యంలో 135 నియోజకవర్గాల్లో ఈ కుమ్ములాటలు, గొడవలు తార స్థాయికి చేరాయంటున్నారు. డబ్బు అందనివారు, సొంత పార్టీలోనే దెబ్బతిన్నవారంతా గ్రూపులుగా మారిపోయి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తమకు సన్నిహిత స్నేహితులు, తమలా ఆదాయం పొందని ప్రజా ప్రతినిధులతో తమ గోడు వెళ్లబోసు కుంటున్నారు. ఈ వ్యవహారం అధిష్టానం చెవిన బడింది. వారి తీరుతో ప్రతిపక్షాలు బలపడే అవకాశం ఉండడంతో తమకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించి వారిపై నిఘా పెట్టినట్లు రాజకీయపార్టీలు ఆరోపిస్తు న్నాయి. ఈ నిఘాలో ఒకటైన టెలిఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వ్యవహారాన్ని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే మీడియా ముందుకు తెచ్చారు.

అసంతృప్తి వెల్లువ

సొంత ఎమ్మెల్యేల ఫోన్‌లనే ట్యాపింగ్‌ ‌చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో కలకలం రేపాయి. తాము కుట్ర పన్నుతున్నామనే అనుమానంతో అధిష్టానం ఇలా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రేగడం తీవ్రమైన విషయం. ఇప్పటికే సీనియర్‌ ‌నేత ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేయడం, అధిష్టానం వెంటనే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గానికి మరో నేతను ఇన్‌ఛార్జిగా నియమించడం తెలిసిందే. ఇదిలా ఉంటే, కొద్దికాలంగా అసంతృ ప్తితో రగిలిపోతున్న నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ ‌రెడ్డి కూడా ఆనం బాటపట్టారు. ఆయనైతే తన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేస్తున్నారని నేరుగా ప్రభుత్వ పెద్దలనే వేలెత్తి చూపారు. ప్రభుత్వ సలహాదారు పేరు ప్రస్తావిస్తూ విమర్శిం చారు. పర్యవసానంగా తనపై కిడ్నాప్‌ ‌కేసు నమోదు చేయడంతోపాటు చంపుతా మని బెదిరించారంటూ, సంబంధిత ఆధారాలను కోటంరెడ్డి మీడియా ముందు బయటపెట్టారు. పోలీస్‌ ‌డీఐజీ తనకు నేరుగా ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై బెదిరింపు కాల్‌ ‌చేశారని ఆరోపించడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేసినట్లు మరో 30 మంది కూడా ఆరోపించడంతో ఆ జాబితాలో తామూ ఉన్నామా? అని కొందరు భుజాలు తడుముకుంటు న్నారు. ఇక ప్రభుత్వానికి ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో తెలియజేయడానికి వైసీపీ అధి•ష్ఠానం చేసిన ఈ ప్రయత్నాన్ని లెక్కచేయకుండా, నెల్లూరు నగర మేయర్‌ ‌పొట్లూరి స్రవంతి కోటంరెడ్డికి తన బహిరంగ మద్దతునిస్తూ, ‘కోటంరెడ్డి మా ఊపిరి, ఆయనతోనే మా ప్రయాణం. ఆయన కోసం అవసరమైతే మేయర్‌ ‌పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధం. ఆయనతోనే మా రాజకీయ ప్రయాణం’ అని స్పష్టం చేశారు.

ఈ వరుస పరిణామాలు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రతీ జిల్లాలోనూ అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉందని, నెల్లూరు జిల్లా తరహాలో ఏ రోజైనా భగ్గుమనే అవకాశం ఉందని వైసీపీ నేతల్లోనే చర్చ సాగుతోంది. ప్రజలు, రాజకీయ పార్టీలు తమపై తీవ్రంగా విరుచుకు పడడం, మరోవైపు ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే సొంత పార్టీ నేతలే ఎదురు తిరగడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram