– తురగా నాగభూషణం

రాష్ట్రంలోని అవినీతి, కుటుంబ, వారసత్వ ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలకు ముప్పు ఏర్పడిందని, కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యంగా పని చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో స్పష్టంచేసింది. జనవరి 24న భీమవరంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాంతీయ పార్టీల తీరు, ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలు, అభివృద్ధి నిరోధక చర్యలు, అవినీతి, వ్యవస్థీకృత దోపిడీపై చర్చ జరిగింది. ప్రాంతీయ రాజకీయ పార్టీలకు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి లేదని, స్వప్రయోజనా కోసం ప్రజలను పీడించుకు తింటున్నాయని బీజేపీ మొదటి నుంచి విమర్శిస్తూనే ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చక, సమస్యలను పరిష్కరించక జేబులు నింపుకోవడమే మార్గంగా ప్రాంతీయ పార్టీలు పని చేస్తున్నాయని, ప్రజాప్రతినిధుల నుంచి నాయకుల వరకు భూకబ్జాలు, వనరుల దోపిడీకి పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

అవినీతిని ప్రశ్నించిన వారిని వేధించి, బాధించి అక్రమకేసులు పెట్టి హింసకు గురిచేసి ఇబ్బందులు పెడుతోందని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో వైఫల్యం చెందిందని, సమస్యలు పరిష్కారం కాక, అభివృద్ధి జరగక, ఉపాధి లేక, ధరల భారంతో, శాంతిభద్రతలు క్షీణించి అన్ని విధాల వెనుకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదాయం చాలక, అప్పులు కూడా చేసి నగదును పంచుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీసే స్థాయికి తీసుకెళ్లిందని స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రానికి ఏర్పడిన ప్రమా దాన్ని తక్షణం తొలగించాల్సిన ఆవశ్యకతను చర్చిస్తూ, ప్రజల తరఫున బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చింది. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీకి ఓటేసి గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిపై పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చింది.

పరిష్కారం కాని హామీలెన్నో!

వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు బుట్ట దాఖలు చేసింది. విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని లేదు. తెదేపా ప్రభుత్వం అమరా వతిని రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రక టించడం, శాసనసభలో తీర్మానం చేయడంతో, నాటి ప్రతిపక్ష వైసీపీ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి 7,500 కోట్ల ఆర్ధిక సహాయం చేసింది. తెదేపా ప్రభుత్వం అలసత్వం వల్ల రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో తెదేపా ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అవినీతిలో కూరుకుపోయిందని పుస్తకాలు ప్రచురించి తాము అధికారంలోకి వస్తే విచారణ చేస్తామని వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ ‌జగన్‌ ‌మోహనరెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రతి నియోజకవర్గంలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ పాదయాత్రలో ఆయనను నిరుద్యోగులు కలిశారు. మొత్తం 2.40 లక్షల ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించడం ద్వారా వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేస్తామని, పోలీసు కానిస్టేబుల్‌ ‌ఖాళీలు భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రభుత్వోగులు తమకు పాత పెన్షన్‌ ‌విధానాన్ని అమలుచేయాలని కోరగా అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లో వారి కోరిక తీరుస్తానన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాన న్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు రెగ్యులర్‌ ‌చేస్తామ న్నారు. ఇవి కాక వివిధ కులాలకు చెందిన వారి సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పెరిగిన ధరలు తగ్గిస్తామని పేర్కొంటూ ‘బాదుడే బాదుడు’ అనే నినాదం కూడా ఇచ్చారు. పల్లె ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస పోనవసరం లేకుండా వారికి గ్రామాల్లోనే ఉపాధి కల్పిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. మద్యం నిషేధిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, అవినీతిని వెలికి తీస్తామని చెప్పారు. ఇవి కాక నవరత్నాల పేరుతో నగదు బదిలీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాని అధికారంలోకి వచ్చాక ఏ హామీని అమలు చేయలేదు. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని శాసన సభలో తీర్మానం చేశారు. అమరావతి నిర్మాణం ఆపేశారు. పోలవరం నిర్మాణం కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేసినా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని, ఈ విషయంలో రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందంపై ప్రతిపక్షాలు బహిరంగంగా ప్రశ్నిస్తు న్నాయి. పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌ ‌చదివిన విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌ ఆపివేశారు. జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించలేదు. ఉద్యోగులకు పాత పెన్షన్‌ ‌విధానం అమలు చేయలేదు. మెగా డీఎస్సీ లేదు. నిరుద్యోగుల పోరాటంతో దిగివచ్చి ఇటీవల పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ ‌చేయలేదు. ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తున్నారు. నవరత్నాల పథకాలు అమలు కోసం వార్డు సచివాలయ ఉద్యోగాలు ప్రకటించి భర్తీ చేశారు. పెరిగిన వస్తువుల ధరలు అదుపు చేయలేదు సరికదా రెట్టింపయ్యాయి. మద్యం నిషేధించ లేదు సరికదా ప్రభుత్వమే నాసిరకం మద్యం విక్రయిస్తోంది. పైగా మద్యంపై వచ్చే ఆదా యాన్ని 15 ఏళ్లపాటు తాకట్టుపెట్టి అప్పు తెచ్చింది.

స్వప్రయోజనాలే ముఖ్యమా?

మూడున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వ పనితీరును గమనిస్తే అందరికీ అర్ధం అయ్యేది ఒక్కటే. ఆ పార్టీకి అధికారమే తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు. 2019లో అధికారంలోకి వచ్చింది మొదలు మరలా 2024 ఎన్నికల్లో ఎలా గెలవాలన్న ఆలోచనే తప్ప మరోటి లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం, సమస్యలు పరిష్కరించడం, ధరలు అదుపు చేయడం వల్ల ప్రజలు ఉపశమనం పొందుతారు. జరుగుతున్న పలు రకాల ప్రాజెక్టులు పూర్తిచేయడం వల్ల మౌలిక సదుపాయాలు అందు బాటులోకి వస్తాయి. కొత్తగా పరిశ్రమలు ఏర్పడితే రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది. కాని ఇవేమీ పట్టించుకోవడం లేదు.

అభివృద్ధి చేస్తే ఓట్లు వస్తాయనే నమ్మకం ప్రభుత్వానికి లేనట్లు ఆ పార్టీ నాయకుల సంభాషణల్లో తెలుస్తోంది. డబ్బు మాత్రమే ఓట్లు వేయించగలదని ఆ పార్టీ నమ్ముతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నవరత్నాల పథకాల పేరుతో డబ్బు పంపిణీని మూడున్నరేళ్లుగా కొనసాగిస్తోంది. ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్ల నగదును లబ్ధిదారులకు పంపిణి చేసినట్లు మంత్రులు, ముఖ్యమంత్రి సభల్లో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. నగదు బదిలీల ముఖ్య ఉద్దేశం ఓట్లు కొనుగోలు చేయడమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ పథకాలకు నిధుల కోసం పన్నులు, కరెంటు ఛార్జీలు అయిదు సార్లు పెంచారు. బస్సు ఛార్జీలు పెంచారు. పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు కేంద్రం తగ్గించినా రాష్ట్రం తగ్గించలేదు. మద్యం ధరలు మూడింతలు పెంచింది. పాలసీ పేరుతో ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి ఆరు నెలల పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని దూరం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా వారికి ఆర్ధిక సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు అండడం లేదు. ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరగక రైతులు మిల్లర్లకే తక్కువ ధరకు అమ్ము కుంటున్నారు. రైతులకు సబ్సిడీపై ఇచ్చే యంత్ర పరికరాలు, ఉద్యాన రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను మూడేళ్లుగా అమలుచేయక, ఇటీవల తూతూ మంత్రంగా అయిందనిపించారు. ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ ‌ప్లాన్‌ అమలుచేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల జీవనోపాధి, స్వయం ఉపాధి పథకాలు, కేంద్ర భాగస్వామ్య పథకాలు మూడున్నరేళ్లుగా నిలిపి వేయడంతో ఆయా వర్గాలు అసంతృ ప్తికి లోనైనట్లు బీజేపీ కార్యవర్గ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు.

కొత్త సమస్యలు

ఇక సమస్యలను ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కార్యవర్గం విమర్శించింది. రాష్ట్రంలో మూడున్నరేళ్ల నుంచి రహదారుల నిర్మాణం జరగలేదు. దెబ్బతిన్న రహదారులకు కూడా కనీసం మరమ్మతులు చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులకు చెల్లించక పోవడంతో రోడ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం మారే వరకు రోడ్ల నిర్మాణం చేపట్టబోమని కొందరు కాంట్రా క్టుర్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఇది కాక పంచాయతీల్లో అయితే అసలు పనులే జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు పంపిన నిధులను దారిమళ్లిస్తోంది. వాలంటీర్లను ఏర్పాటుచేసి పనులన్నీ వారితో చేయించడంతో సర్పంచులకు పనిలేకుండా పోవడంతో వారు ప్రభుత్వంపై ఉద్యమానికి దిగారు. జీతాలు పెంచక పోవడం, పాత పెన్షన్‌ ‌విధానం అమలు చేయక పోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమం చేశారు.

అభివృద్ధిపై చిత్తశుద్ధి ఏదీ?

వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని బీజేపీ కార్యవర్గం విమర్శించింది. ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులు తప్ప మరే విధమైన అభివృద్ధి పనులు జరగడం లేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు ఇవ్వక పోవడంతో ముఖ్యమైన నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి- నరసాపురం మధ్య నూతన లైను నిర్మాణం ఆగిపోయింది. ఇక కేంద్రం పది ఫిషింగ్‌ ‌హార్బర్ల నిర్మాణానికి అనుమతిని ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగింటికి మాత్రమే శంకుస్థాపనలు చేసింది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, ‌కాకినాడ పెట్రోకెమికల్‌ ‌సమూహం, శ్రీకాళహస్తి ఎలక్ట్రానిక్స్ ‌పారిశ్రామిక క్లస్టర్‌, ‌బెంగుళూరు-చెన్నై పారిశ్రామిక క్లస్టర్‌, ‌శ్రీసిటి పారిశ్రామిక సమూహం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో రెండు సమీకృత పారిశ్రామిక టౌన్‌షిప్‌ (‌నేషనల్‌ ఇన్వెస్ట్ ‌మెంట్‌ ‌మ్యానుఫాక్చరింగ్‌ ‌జోన్‌)‌ల ఏర్పాటుకు కేంద్రం అనుమతిని ఇస్తే భూసేకరణ చేయకపోవడంతో పరిశ్రమలు ఏర్పడక, ఇవి అందుబాటులోకి రాలేదు. ఫలితంగా యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని కార్యవర్గం ఆందోళన వెలిబుచ్చింది.

శాంతిభద్రతలపై ఆందోళన

వైసీపీ ప్రభుత్వం స్టేట్‌ ‌టెర్రరిజానికి పాల్పడుతు న్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాలనా వైఫల్యాన్ని, అవినీతిని, రౌడీయిజాన్ని ప్రదర్శిస్తోన్న ప్రభుత్వం తనను ప్రశ్నిస్తోన్న పార్టీలు, ప్రజలు, ఉద్యమకారులకు సమాధానం చెప్పలేక, సమస్యలు పరిష్కరించక, కార్యకర్తలు, పోలీసులచే ఎదురుదాడు లకు దిగుతోందనేది విపక్షాల వాదన. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాల విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది.

ప్రతిపక్షాలను ఉద్యమాలు చేయనీయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబరు 1ను తక్షణం రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ ‌చేసింది. రాష్ట్రంలో 65 ఏళ్లలో జరగని అభివృద్ధిని మోదీ ప్రభుత్వం 9 ఏళ్లలో చేసి చూపించిందని, పలు జాతీయ విద్యాసంస్థలు, లక్ష కోట్లతో రహదారులు, పైవంతెనలు, రైల్వేప్రాజెక్టులు, ఓడరేవులు నిర్మిస్తోందని, పోలవరం నిర్మాణానికి పూర్తి నిధులిస్తోందని, పేర్కొంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram