– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత ఒకవైపు, సైన్యం హెచ్చరికలు, పాక్‌ ‌నాయకులను ఎవరినీ బతకనివ్వబోమని ఆప్ఘనిస్తాన్‌ ‌తాలిబాన్‌ ‌నాయకుల బెదిరింపులు మరోవైపు పాకిస్తాన్‌ను గడగడలాడిస్తున్నాయి. రెండు రొట్టె ముక్కలు చేసుకోవటానికి గోధుమ పిండిలేక తొక్కిసలాడుకుంటూ ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్నారు జనం. రేపేమవుతుందో అంతుచిక్కని పరిస్థితి. ఇంతకీ పాక్‌ ‌కు ఏమైంది? ఇలాంటి పరిస్థితిలోకి ఎందుకు దిగజారింది? అదంతా స్వయంకృతం. వరుస దురాగతాల వికృత ఫలితం. ఒకప్పటి పాపాలే నేడు శాపాలుగా మారి ఆ దేశాన్ని వెంటాడుతున్నాయి.

పాక్‌ ‌దివాలా అంచుకు చేరుకుందా? అక్కడ ఆకలిచావులు తప్పేలా లేవా?

దాని వల్ల రేపోమాపో అంతర్యుద్ధం చోటుచేసు కుంటుందా?.. అంతర్జాతీయ సమాజాన్ని కలవర పరుస్తున్న ప్రశ్నలివి.

అక్కడ కొత్తగా పుట్టిన పిల్లలకు పాలు లేవు. విద్యుత్తు సౌకర్యం అందుబాటులో లేదు. చాలా ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి. హాస్పిటళ్లలో ముఖ్యమైన ఇన్సులిన్‌, ‌మధుమేహానికి సంబంధించిన మందులు కూడా దొరకటం లేదు. పాలు నుంచి పెట్రోలు వరకూ అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. గోధుమ పిండి కోసం జనం షాపుల ముందు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం పొదుపు చర్యలకు దిగింది. కార్యాలయాల్లో విద్యుత్‌ ‌వాడకాన్ని నియంత్రించారు. షాపులు, మాల్స్‌ను రాత్రి 8.30కే మూసివేస్తున్నారు. పాక్‌లో దైనందిన జీవితం ఘోరంగా మారిపోయింది. దాంతో ఆకలి చావులు, రేపో మాపో అంతర్యుద్ధం ప్రమాదం పొంచి ఉందన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

పాకిస్తాన్‌లో కొంత భాగం విడిపోయింది. మరో నాలుగు ప్రాంతాలు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. తెహ్రీక్‌-ఈ-‌తాలిబాన్‌ ‌సమాంతర ప్రభుత్వం నడుపుతోంది. ఇస్లామాబాద్‌ ‌ప్రభుత్వం తమ ఉనికిని చాటుకోవటానికి తరచూ ఇక్కడ సైన్యాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ఈ ‌ప్రాంతంపై బాంబు దాడులు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదే జరిగితే, దానివల్ల భారత్‌కే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలకూ అదో పెద్ద సమస్యగా మారుతుంది.

ఒకప్పుడు పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండేది. అక్కడ పాలన ఎలా సాగుతోందో అధ్యయనం చేయటానికి, 1970 ప్రాంతాల్లో అరబ్‌, ఆ‌ఫ్రికా దేశాల ప్రతినిధులు అక్కడికి వెళుతుండేవారు. జనరల్‌ ‌మహమ్మద్‌ ‌జియా ఉల్‌ ‌హక్‌ ‌హయాం వచ్చేసరికి అంతా మారిపోయింది. భారత్‌తో యుద్ధానికి సిద్ధమయ్యారు. అతని హయాంలోనే పాక్‌ ఆటంబాంబును సిద్ధం చేసుకుంది. ఒకవేళ పాకిస్తాన్‌ ‌లో అంతర్యుద్ధం మొదలయితే, ప్రత్యేక స్థానాల కోసం పోరాటం మొదలయితే, భారత్‌ ‌మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడుతుంది. ఈ అణ్వాయుధాల్లో ఏ కొన్నో తీవ్రవాదుల చేతుల్లో పడితే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భయాన్ని అడ్డం పెట్టుకునే పాకిస్తాన్‌ ‌ధనిక దేశాల నుంచి ఇప్పటి వరకూ సాయం గుంజుకుంటోంది. కొవిడ్‌, ఉ‌క్రెయిన్‌ ‌యుద్ధం అంతర్జాతీయ సమాజం చేతులు కట్టేశాయి. ఇప్పుడదే సమస్యగా మారింది.

భారీ వరదలతో ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం

గత ఏడాది వచ్చిన భారీ వరదలు పాక్‌ ఆర్థిక పరిస్థితిని దారుణంగా దెబ్బతీశాయి. 15 శాతం జనాభాపై దీని ప్రభావం పడింది. 20 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. 1739మంది చనిపోయినట్టు ప్రభుత్వమే ప్రకటించింది. వరదలవల్ల పాక్‌కు సంభ వించిన నష్టం 30 బిలియన్‌ ‌డాలర్లుగా అంచనా వేశారు. ఈ వరదల వల్లనే పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిందని స్వయంగా ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ‘పాక్‌ ఆర్థికాభివృద్ధి మరింత తగ్గి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 శాతానికి పడి పోతుంది. అది జూన్‌ 2022‌లో అంచనా వేసిన దానికంటే రెండు శాతం తక్కువ’ అని తన అధ్యయన నివేదికలో స్పష్టం చేసింది. ‘ప్రాంతీయంగా కూడా పాకిస్తాన్‌ ‌ప్రభావం ఇండియా, మాల్దీవులు, నేపాల్‌ ‌పైన పడుతుంది. ఆప్ఘనిస్తాన్‌, ‌శ్రీలంకలలో రాజకీయ ఆర్థికసంక్షోభాలకు ఇదేకారణం. దీనివల్ల అంతర్జా తీయవృద్ధి 1.7 శాతంగా ఉంటుంది’ అని వివరంగా పేర్కొంది.

పాకిస్తాన్‌ ‌విదేశీ నిల్వలు (ఫారెన్‌ ఎక్స్ ‌ఛేంజి రిజర్వ్) ‌వేగంగా తరిగిపోతున్నాయి. తాజా సమా చారం ప్రకారం అవి ప్రస్తుతం 4.3 బిలియన్‌ ‌డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం మూడు వారాల ఎగుమతులకు సరిపోతాయి. ప్రపంచ దేశాల నుంచి పాక్‌ ‌దాదాపు 100 బిలియన్‌ ‌డాలర్లను అప్పుగా తెచ్చింది. ఇందులో 21 బిలియన్‌ ‌డాలర్లను ఈ ఏడాదే చెల్లించాలి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు ఇచ్చేవాళ్లు లభిస్తే తప్ప అది బయటపడటం కష్టం. ఇంతకు ముందు ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్‌.) ‌దాన్ని ఒడ్డున పడేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాకిస్తాన్‌ ‌ప్రధాని షెహ్‌ ‌బాజ్‌ ‌షరీఫ్‌ ‌సాయం కోసం అర్థించి నప్పుడు, ఐఎంఎఫ్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌క్రిస్టలినా జార్జెవా సానుకూలంగా స్పందించ లేదు. గత ఏడాది ఇచ్చిన ఆరు బిలియన్‌ ‌డాలర్ల రుణానికి సంబంధించి ఇచ్చిన మాటను నిలుపుకోలేదని ఆరోపించారు కూడా. విదేశీనిల్వలను నియంత్రించటంలో సెంట్రల్‌ ‌బ్యాంకు జోక్యం తగ్గించాలని, పన్ను విధాలను సరళీక రించాలని, బడ్జెట్‌ ‌లోటు తగ్గించాలని అప్పట్లో ఐఎం ఎఫ్‌ ‌షరతు విధించింది. ‘పాకిస్తాన్‌ ఆర్థికంగా సుస్థిరతను సాధించాలని కోరుకుంటున్నాం’ అని అమెరికా ప్రతినిధి వ్యాఖ్యా నించటం తప్ప వీసమెత్తు సాయం చేయటానికి ముందుకు రాలేదు. సౌదీ అరేబియా ఇంతకుముందు అందించిన రెండు బిలియన్‌ ‌డాలర్ల సాయానికి అదనంగా మరో బిలియన్‌ ‌డాలర్లు అందించేందుకు ముందుకు వచ్చింది. దుబాయ్‌ ఒక బిలియన్‌ ‌డాలరు ఇచ్చేందుకు అంగీకరించినట్టు వార్తలొచ్చాయి. దీనితో సంక్షోభం నుంచి తేలిగ్గా గట్టెక్కుతామన్నది పాక్‌ అభిప్రాయంగా ఉంది.

‘‘పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించ కూడదు. చివరికి అవి వారిని కూడా కాటేస్తాయి’’ అని దశాబ్దం క్రితం హిల్లరీ క్లింటన్‌ ‌పాకిస్తాన్‌లో పర్యటించినప్పుడు ఓ వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం పాక్‌లో పరిణామాలు చూసినప్పుడు ఆ మాటలు అక్షరసత్యం అనిపించకమానవు. ఎందరో అంతర్జా తీయ తీవ్రవాదులకు పాక్‌ ఆ‌శ్రయం కల్పించింది. ఒసామా బిన్‌ ‌లాడెన్‌ ‌పాక్‌లోనే రక్షణ పొందారు. భారత్‌లో కీలకమైన ఉగ్రవాదదాడులను పర్య వేక్షించిన అబ్దుల్‌ ‌రహమాన్‌ ‌మక్కీ ఉండేది పాకిస్తాన్‌ ‌లోనే. దావూద్‌ ఇ‌బ్రహీం ఇప్పటికీ అక్కడే మకాం ఉన్నారు. పైకి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నా, పాక్‌లో వ్యవహారాలు నడిపించేది సైన్యమే. పాక్‌ ‌చరిత్రలో హత్యలు, తిరుగుబాట్లు సర్వసాధారణం. 1947లో భారత విభజన తర్వాత పాకిస్తాన్‌ ‌మొదటి ప్రధానిగా ఉన్న లియాఖత్‌ అలీఖాన్‌ ‌నుంచి నిన్న మొన్నటి ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌వరకూ ఇదే పరిస్థితి. మనకు, పాకిస్తాన్‌కు మధ్య మూడు మార్లు (1948, 1961, 1975) యుద్ధాలు సంభవించాయి. పాలకులు, సైన్యాధ్యక్షులు మారుతున్నారు. కానీ వారి వ్యవహార శైలిలో, భారత్‌ ‌పట్ల వారి వైఖరిలో పెద్దగా మార్పు కనిపించటం లేదు. ఈ మధ్యనే పాక్‌ ‌ప్రధాని షెహబాజ్‌ ‌చిలకపలుకులు పలికారు. ‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. అది మాకు ఇచ్చింది ఏదైనా ఉంటే అది పేదరికం, మరిన్ని కష్టాలు, ఇంకాస్త నిరుద్యోగం’ అని ఆవేదన వ్యక్తం చేయటమే కాదు. ‘యుద్ధాలతో మాకు బుద్ధొచ్చింది. మేం భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం’ అన్నారు. ఇది నమ్మదగిన మాట కాదన్న విషయాన్ని పాక్‌ ‌తీరు తెలిసిన వాళ్లెవరయినా అంగీకరిస్తారు. రిపబ్లిక్‌ ‌డే ముందర ఢిల్లీలో టెర్రరిస్టు దాడికి వ్యూహం పన్నిన ఇద్దరు అనుమానితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాకిస్తాన్‌ ‌టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని ప్రకటించటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. పాక్‌ ఆగడాలను అంతర్జాతీయ వేదికల పైన భారత్‌ ‌దునుమాడుతూనే ఉంది. ‘కొన్ని దేశాలు తమ విదే శాంగ విధానం మేరకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే, మరికొన్ని దేశాలు టెర్రరిస్టులపై చర్యలు తీసుకోకుండా పరోక్షంగా దాన్ని ప్రోత్సహిస్తున్నాయి’ అని భారత ప్రధాని మోదీ పాక్‌, ‌చైనాలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారత అధ్యక్షతన నిర్వహించిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో, జీ 20 సమావేశాల్లో, టెర్రర్‌ ‌ఫండింగ్‌ ‌పైన నిర్వహించే సమావేశాల్లో ఇదే కీలక అంశంగా నిలుస్తోంది.

భారత్‌ ఒక్కటే భద్రం

ఒకప్పుడు బ్రిక్స్ ‌దేశాలైన బ్రెజిల్‌, ‌రష్యా, ఇండియా, చైనా, దక్షి ణాఫ్రికాలు భవిష్యత్తు ఆశా దీపాలనే భావన ఉండేది. బ్రెజిల్లో ఏం జరిగిందో నిన్న మొన్న చూశాం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయిన ట్రంప్‌నకు మద్దతుగా ఆయన అనుచరులు కేపిటల్‌ ‌హిల్‌ ‌పైన దండెత్తినట్టు, బొల్సనోరా అనుచరులు బ్రెజిల్‌ ‌పార్లమెంటును చుట్టుముట్టారు. దాంతో ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడయిన లులా రోడ్డెక్క వలసి వచ్చింది. రష్యా పరిస్థితి నానాటికి బలహీన మవుతోంది. జీరో కొవిడ్‌ ‌పాలసీ వల్ల చైనా ఆర్థిక స్థితి పైకి కనిపించనంత దారుణంగా దెబ్బతిందన్న వార్తలు వస్తున్నాయి. మనకు పాకిస్తాన్‌ ఒకవైపు, శ్రీలంక మరోవైపు ఉన్నాయి. రెండూ సంక్షోభంతో తల్లడిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ ‌స్థిరంగా ఉండటం ఒక్కటే మనకు ఊరటనిచ్చే అంశం.

అం‌కెల్లో పాక్‌

‌పాక్‌ ‌జనాభా 24 కోట్లు. అందులో 35.7 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.

గ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్‌లో 121 దేశాల్లో, ఆ దేశం 99వ స్థానంలో ఉంది.

జీడీపీ 376 బిలియన్‌ ‌డాలర్లు. అందులో వ్యవసాయం వాటా 19శాతం. ఆహార ధాన్యాల అవసరం ఆ దేశానికిప్పుడు అత్యధికంగా కనిపిస్తోంది.

పాక్‌ ‌విస్తీర్ణం 19 కోట్ల 67 లక్షల ఎకరాలు. అక్షరాస్యత 58శాతం

మన దేశం కంటే ఒక రోజు ముందు అంటే, ఆగస్టు14,1947న స్వాతంత్య్రం పొందింది.

 

 

About Author

By editor

Twitter
Instagram