జనవరి 2 ముక్కోటి ఏకాదశి

సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి’, ‘ముక్కోటి ఏకాదశి’, మోక్ష• ఏకాదశి’, ‘స్వర్గ ఏకాదశి’ అంటారు. ఏడాదిలో వచ్చే ఇరవై ఏకాదశి తిథుల్లో దీనిని మాత్రమే సౌరమానం ప్రకారం గణిస్తారు. శ్రీమన్నారాయణుడు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు యోగనిద్రను (శయన ఏకాదశి) ఆరంభించి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని (ఉత్థాన ఏకాదశి)ధనుః ఏకాదశి నాడు శ్రీదేవి, భూదేవి సమేతంగా గరుడ వాహనారూఢుడై వైకుంఠ ఉత్తర ద్వారం వద్ద ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడట. అందుకే ‘ముక్కోటి ఏకాదశి’గా వ్యవహారంలోకి వచ్చింది. వైష్ణవ సంప్రదాయంలో జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి. ఈరోజున విష్ణ్వాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. హరిహర అభేదానికి నిదర్శనంగా శైవక్షేత్రాలలోనూ ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, శ్రీశైలం, శ్రీకాళహస్తితో పాటు ప్రసిద్ధ శివాలయాలలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

నెలకు రెండు చొప్పున ఏడాదికి 24 ఏకా దశులు, అధికమాసంలో మరో రెండు వస్తాయి. అన్ని ఏకాదశులను చంద్రమానం ప్రకారం గణిస్తే ఈ ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానంతో గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయనంలోకి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. వైష్ణవ క్షేత్రాలలో ఉత్తరద్వార దర్శనం విశిష్ట ఉత్సవం, పెద్దపండుగ. దక్షిణాభి•ముఖుడైన స్వామిని ఉత్తరం వైపు నిలిచి సేవిస్తే సద్యోముక్తి లభిస్తుందని వైష్ణవ ఆగమాలు చెబుతున్నాయి. అందుకు శ్రీరంగంలోని రంగనాథ దర్శనాన్ని ఉదాహరణగా చెబుతారు. నిత్యం ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహించే మహాక్షేత్రం శ్రీరంగం. అక్కడి సంప్రదాయం అన్ని వైష్ణవ ఆలయాలు వైకుంఠ ఏకాదశి నాడు ఆచరిస్తున్నారు.

‘ప్రణమ్య సర్వలోకేశం దేవ దేవేశ్వరం విష్ణుం

ఆర్యధర్మాన్‌ ‌ప్రవక్ష్యామి సర్వ శాస్త్రార్థ సమ్మతం’ (సమస్త లోకాలకు ప్రభువు, దేవ దేవేశ్వరుడైన విష్ణు వుకు ప్రణమిల్లి, శాస్త్ర సమ్మతమైన ఆర్య ధర్మాలను ప్రవచిస్తున్నాను)

పురాణగాథను బట్టి దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి)నాడు యోగనిద్రకు ఉపక్ర మించి, కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) నాడు మేల్కొన్న శ్రీమహావిష్ణువు మార్గశిర శుద్ధ ఏకాదశి (ముక్కోటి/వైకుంఠ) నాడు సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి సమేతంగా గరుడావాహనరూఢుడై వైకుంఠానికి చేరుకుని ఉత్తరద్వార దర్శనమిస్తాడు. ఈ దర్శనం ద్వార ‘మోక్షం’లోకి వ్రవేశిస్తారు కనుక ఈ ఏకాదశిని ‘మోక్షోత్సవ’ దివసమనీ వ్యవహరిస్తారు. దక్షిణాయనంలో కాలంచేసిన పుణ్యజీవులు ఇదే రోజున స్వర్గారోహణ చేస్తారనే విశ్వాసం నేపథ్యంలో ఈ తిథి ‘స్వర్గ ద్వారం’గా ప్రసిద్ధమైంది. భద్రాతి రాజు సుకేతు దంపతులు ముక్కోటి ఏకాదశి వ్రతం ఆచరించి పుత్రసంతతిని పొందినందున దీనికి ‘పుత్ర ఏకాదశి’ అనే పేరు వచ్చిందట.

గరుడవాహనారూఢుడై ఉత్తర ద్వార దర్శనమిచ్చే దివ్యసుందరమూర్తి శ్రీమహావిష్ణువును సేవించుకునేం దుకు దేవతలు భువికి దిగి వస్తారట. మూడు కోట్ల దేవతలను ఉద్దేశించినది కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఒక మన్వంతరంలో ‘వికుంఠ’ అనే పుణ్యస్త్రీకి శ్రీమహావిష్ణువు పుత్రుడిగా జన్మించినందున ఆయనకు ‘వైకుంఠుడు’ అనే పేరు స్థిరపడిందని అమరకోశం పేర్కొంటోంది. మురాసుర సంహారం కోసం ఆయన వైకుంఠం నుంచి తరలి వచ్చిన తిథి కనుక ‘వైకుంఠ ఏకాదశి’ అనే మరో పురాణ కథనం. తన అరచేయి తాకిన వెంటనే భస్మమైపోవాలని బ్రహ్మవరం పొందిన మురాసురుడు వైకుంఠనాథుడిపై యుద్ధం ప్రకటించాడు. ‘నీతో యుద్ధం ఆహ్వానింపదగినదే. అయితే యుద్ధ భయంతో నీ గుండె వేగంగా కొట్టుకుంటోదేమి?’ అన్న శ్రీహరి ప్రశ్నకు, ‘అదేమి లేదంటూ’నే చేతిని గుండెపై వేసుకున్న మురాసురుడు (భస్మాసరు వృత్తాంతం లాంటిదే) అంతమయ్యాడు. ఈ సంఘ టన చోటుచేసుకున్నదీ ఈ తిథినాడే. మధుకైటభులు అనే దానవులు ఈ తిథి నాడే విష్ణు సాయుజ్యం పొందారు. శాపవిమోచనం పొంది దివ్యరూపులైన వారు ‘దేవా! మాకు నిజరూపాలు కలిగిన ఈరోజు చరిత్రలో నిలిచేలా వైకుంఠంలాంటి మందిరాన్ని నిర్మించి ఈ రోజున ఉత్తర ద్వారంలో నిన్ను దర్శించి అర్చించే వారికి వైకుంఠప్రాప్తి ప్రసాదించు’ అని ప్రార్థించారని పురాణగాథ. ఈ తిథికి ‘హరివాసం, వైకుంఠ దినం’ అనీ పేరు. దేవాసురులు జరిపిన క్షీరసాగర మథనంలో హాలాహలం, అమృతం పుట్టింది ముక్కోటి నాడేనని ఐతిహ్యం.

భూలోక వైకుంఠం శ్రీరంగం

శ్రీరంగం క్షేత్ర పురాణం ప్రకారం, మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయన ఆరాధిస్తున్న శ్రీరంగనాథుడి ప్రతిమను పొందారు. అది శ్రీరాముడి ద్వారా విభీష ణుడికి అందిన అపురూప కానుక. శ్రీరామ పట్టాభి షేకానంతరం లంకకు తిరుగు ప్రయాణ సమయంలో శ్రీరామ వియోగాన్ని భరించలేక బాధ పడుతున్న ఆతనికి రాముడు తనకు గుర్తుగా రంగనాథ విగ్రహాన్ని అనుగ్ర హించాడు. ఆ ప్రతిమతో బయలు దేరిన విభీషణుడు ఉభయ కావేరుల మధ్యకు చేరే సరికి సంధ్యావందనం సమయమైంది. విగ్రహాన్ని కింద ఉంచి నదికి వెళ్లి తిరిగి వచ్చే సరికి రంగనాథుడు అక్కడే ప్రతిష్ఠితులు కావడంతో ఖిన్నుడయ్యాడు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ధర్మచోళుడు అతనిని ఓదార్చి, విగ్రహం ఉన్న చోటనే ఆలయాన్ని నిర్మించాడు. విభీషణుడి కోరిక మేరకు స్వామి దక్షిణ దిక్కుకు (లంక ఆ దిక్కునే ఉంది కనుక) తిరిగాడని ప్రతీతి. శ్రీరంగ దివ్య క్షేత్రంలో ఈ తిథి నుంచి 21 రోజులు పగలు( పగల్‌ ‌పాథ్‌), ‌రాత్రి (ఇరుల్‌ ‌పాథ్‌) ‌విష్ణునామ సంస్మరణాత్మక దర్శనభాగ్యం కలిగిస్తారు.

ఉత్తర ద్వార మాసీనం/ఖగస్థం రఘునాయకమ్‌/‌య: పశ్త్యతి స భదాద్రౌ

యాతివై పరమాం గతిమ్‌’ (‌భదాద్రిలో గరుడారూఢుడైన శ్రీ సీతా రామచంద్ర స్వామిని ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నవారికి సకల భోగాలు,విష్ణు సాయుజ్యం లభిస్తుంది’ అని స్థల పురాణం.

కురుకుల పితామహుడు భీష్ముడు తండ్రి శంతనుడు ప్రసాదించిన ‘స్వచ్ఛంద మరణం’ వరంతో ఉత్తరాయణం ప్రవేశించిన తరువాతనే దేహత్యాగం చేశాడు. దక్షిణాయనంలో మొదలైన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాహతుడైన ఆయన అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షించాడు. ఈ మధ్యకాలం ధర్మరాజాదులకు విష్ణు సహస్రనామం ఉపదేశించారు. పూర్వం విఖాసనుడు అనే రాజు పర్వత మహర్షి హితవు ప్రకారం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, పితృదేవతలకు నరకలోకం నుంచి స్వర్గలోక ప్రాప్తి కలిగించాడట.

 ముక్కోటి నాడు ‘ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహ మపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుతే’ అనే మంత్రంతో విష్ణువును పుష్పాలతో అర్చిస్తారు. శ్రీమహావిష్ణువు అలంకార, సామగానలోల ప్రియుడు. వైకుంఠ ఏకాదశి నాడు ఆలయంలో కానీ, ఇంటి వద్ద కానీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలతో అలంకరిస్తారు. అష్టాక్షరీ జపంతో పాటు స్తోత్రాలు మననం చేస్తారు. ఇలా అర్చన, జపం,ధ్యాన సాధానాల ద్వారా వైకుంఠపతి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు.

తిరుమలలో

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని మహావైభవంగా నిర్వహిస్తారు. ఏకాదశికి ముందువచ్చే మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమం జనం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు మలయప్పస్వామి ఉభయ దేవేరుల సహితంగా భక్తుల గోవింద ఘోషలనడుమ బంగారుతేరుపై పురవీధులలో దర్శనమిస్తారు. ముక్కోటి ఉత్సవం ముగింపుగా పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు స్నానం చేయిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు సకల పుణ్య తీర్థాలు సూక్ష్మ రూపంలో స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని, సకల దేవతలు అక్కడ ఆవహిస్తారని పెద్దల మాట. అందుకే చక్రస్నానానికి అంత విశిష్టత.

‘మంగళం భగవాన్‌ ‌విష్ణు: మంగళం గరుడధ్వజా

మంగళం కమలాకాంతమ్‌ ‌త్రైలోక్యం మంగళమ్‌ ‌కురు’

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram