– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం


రెండేళ్ల పాటు నాలుగు గోడల మధ్య బందీ అయిన జనం రెక్కవిప్పుకున్న పక్షుల్లా ఎగురుతున్నారు. ఎన్నో కొత్త ప్రదేశాల్లో వాలుతున్నారు. కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకూ వివిధ ప్రాంతాలు ఇప్పుడు పర్యాటకులతో నిండిపోతున్నాయి. పుణ్యక్షేత్రాలు, పురాతన కోటలు, రాజమహళ్లు, మ్యూజియాలు, ఉద్యానవనాలు, బీచ్‌లు, వన్యప్రాణుల అభయారణ్యాలు కళకళలాడుతున్నాయి. విమానాశ్రయాలు రద్దీగా కనిపిస్తున్నాయి. హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ పర్యాటక అనుభూతిని కొల్లగొట్టాలన్న ఆరాటం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది పర్యాటక రంగానికి మహర్దశ అని నిపుణులు భావిస్తున్నారు.

కరోనా ప్రభావం పడని రంగం ఏదీ లేదు. మిగతా రంగాల కంటే అది పర్యాటక రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. విమానయానం, రవాణా, హోటళ్లు, ఆతిథ్యరంగం, టూర్‌ ఆపరేటర్లు… పర్యాటక రంగానికి సంబంధించిన ప్రతిదీ ప్రతికూల ప్రభావాన్నే చూసింది. మన దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. గత ఏడాది నుంచి పరిస్థితులు మెరుగుపడ్డాయి. మెల్లమెల్లగా కాలూచేయి కూడదీసుకుని పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది భారత్‌కు ప్రత్యేకం. జీ20 అధ్యక్ష హోదాను దక్కించుకున్న దేశం ఈ ఏడాది ఎన్నో సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. దేశ, విదేశాలకు సంబంధించిన ఎందరో అతిథులు మనదేశానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సురక్షిత, టూరిస్టు హిత గమ్యమైన ప్రదేశంగా భారత్‌ను ప్రపంచ దేశాలు గుర్తించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. వివిధ నగరాల్లో దాదాపు 300 వరకూ సమావేశాలు ఏర్పాటవుతాయని అంచనా. దేశంలోని ప్రసిద్ధ హోటళ్ల ప్రాంగణాలు ఇందుకు వేదికలు కానున్నాయి. భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా, సేవల్లో ‘అతిథి దేవోభవ’ అన్న సంస్కారం ప్రదర్శించేందుకు ఆతిథ్యరంగం తన శాయశక్తులూ ఒడ్డుతోంది. హోటళ్లు, రిసార్టులు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. వాటికి అనుబంధంగా మౌలిక సదుపాయాల కల్పనకూ రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు కదులుతున్నాయి.

టూరిజం అనేది ఆర్థిక రంగానికి చుక్కాని. అది ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ రంగాలను ప్రభావితం చేస్తుంది. ఉపాధి కల్పనకు అవకాశమిస్తుంది. ప్రపంచాన్ని కొత్తగా చూడటం ఎలాగో నేర్పుతుంది. అంతేకాదు. ‘క్రాస్‌ ‌కల్చరల్‌ ఇం‌టరాక్షన్‌’-అం‌టే వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, నేపథ్యాలు ఉన్నవారి మధ్య బంధం బలపడేలా చేస్తుంది. తాము సందర్శించిన ప్రదేశాలు మిగిల్చిన అనుభూతులు ఆయా ప్రాంతాలు, అక్కడి వ్యక్తుల పట్ల ఏదో తెలియని అభిమానం, మమకారం ఏర్పరుస్తాయి. దీనివల్ల ప్రాంతాల మధ్య, దేశాల మధ్య పరస్పర అవగాహన, మైత్రి సాధ్యపడుతుంది. దానివల్ల శాంతియుత వాతావరణానికి   అవకాశం ఉంది. ఒక దేశం బ్రాండ్‌ ఇమేజిని పెంచేది పర్యాటకమే. వాణిజ్య కార్యకలాపాలకు అది ఊతమిస్తుంది. రెవెన్యూ పెరుగుతుంది. విదేశీమారక ద్రవ్యం సంపాదించి పెడుతుంది. ఇకపోతే, ఉపాధి కల్పన పరంగా ఈ రంగం విశిష్టమైనది. ప్రతి హోటల్‌ ‌గది ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఐదు నుంచి ఏడు రకాల ఉద్యోగాలను కల్పిస్తుంది. అలాగే రియల్‌ ఎస్టేట్‌, ఇ‌న్ఫాస్ట్రక్చర్‌ ‌రంగాలపైన ప్రభావవంతమైన పాత్రను పోషిస్తుంది. పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రహదారులు, రైల్‌, ‌రోడ్డు వసతి, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, యుటిలిటీస్‌ (‌తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్య) సేవల్లో నాణ్యతను మెరుగు పరిచేందుకు కృషి చేస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటుంది. యాత్రికుల రద్దీ పెరగటం వల్ల హోటళ్లు, రిటైల్‌ ‌షాపులు, ట్రాన్స్‌పోర్టు సర్వీసులు, వినోద ప్రదేశాలు లబ్ధి పొందుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పర్యాటక రంగం అనేది.. వివిధ సమాజాలను ఒకటిగా చేసి మూసధోరణుల నుంచి బయటపడటానికి, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలకు, ప్రపంచ స్థాయిలో భౌగోళిక గుర్తింపులతో దేశం అభివృద్ది చెందటానికి ఉపకరిస్తుంది. అది జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది కూడా. కొంతమందికి ట్రావెలింగ్‌ అనేది ఒక ఫ్యాషన్‌. అభిరుచి అని చెప్పవచ్చు. మానసిక వికాసానికే కాదు. అంతర్గత ప్రేరణతో తమ వృత్తులలో రాణించటానికి అవసరమైన ఉత్సాహాన్ని ప్రోది చేసుకోవటానికి కూడా పర్యటనలు చేస్తూంటారు.

భారత ఆర్థికవ్యవస్థ ఎదుగుదల, వృద్ధిలో పర్యాటక రంగం కీలకపాత్ర పోషిస్తోంది. వరల్డ్ ‌ట్రావెల్‌ అం‌డ్‌ ‌టూరిజం కౌన్సిల్‌ (‌డబ్ల్యుటీటీసీ) అంచనాల ప్రకారం, టూరిజం రంగం 13.2 లక్షల కోట్ల రూపాయలను (170 బిలియన్ల అమెరికన్‌ ‌డాలర్లు) సంపాదించి పెట్టింది. ఇది జీడీపీలో 5.8 శాతం. అంతేకాదు. దీనివల్ల మూడు కోట్ల 21 లక్షల ఉద్యోగాలు సృష్టికి వీలయ్యింది. ఈ గణాంకాలు 2021 నాటివి. గత ఏడాది పర్యాటకం అంతకు ముందు ఏడాది కంటే పుంజుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగి ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. టూరిజం రంగం మొత్తం నాలుగు కోట్ల 26 లక్షల ఉద్యోగాలను కల్పించిందని ఒక ప్రయివేటు సంస్థ తన అధ్యయనంలో పేర్కొంది. అంటే మొత్తం ఉద్యోగాలలో 8.1 శాతం. ‘పర్యాటక రంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలనేది ప్రభుత్వ విధానం. ఇందుకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమా లను చేపడుతోంది’ అని పేర్కొన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌ ‌రెడ్డి. జీ 20 నేతృత్వం అనేది అన్ని శాఖలకు కీలకం. దానిని దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. ప్రపంచం అంతా భారత్‌ను చూడాలని ఆశిస్తోంది. వాళ్లు మనకు కేవలం టూరిస్టులు కారు. భారత్‌ను ప్రభావితం చేసేవాళ్లు అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా, ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌లో భాగంగా భారతదేశ సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక వైభవాలను ప్రదర్శించటానికి రివర్స్ ‌క్రూజింగ్‌ ‌వంటి వినూత్న పర్యాటక వనరులను, ఉత్పత్తులను అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

వచ్చే దశాబ్దంలో పర్యాటక రంగం అంతర్జా తీయంగా 2 కోట్ల 60 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది. ఇందులో 20 శాతం భారత ఉపఖండం నుంచే లభిస్తాయి. దీనిని సాధించేందుకు ప్రభుత్వ సహకారం అవసరం అవుతుంది. ప్రస్తుతం భారతీయ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో సానుకూల ఫలితాలు సాధిస్తూండటంతో అది అసాధ్యం కాదనే విషయం స్పష్టమవుతోంది. అంతేకాదు, విపత్తు ముందున్న నాటి పరిస్థితులకు మూడు రెట్లు అధికమై, 2030 నాటికి 250 బిలియన్‌ ‌డాలర్ల స్థాయికి చేరుతుందంటున్నారు. అది క్రమంగా అధికమై 2047 నాటికి ఒక ట్రిలియన్‌ ‌డాలర్‌ ‌స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఆయా దేశాలు సాధించిన ఆర్థిక ప్రగతితో పాటు మరికొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరం (డబ్ల్యుఈఎఫ్‌) ‌దైవార్షికంగా ట్రావెల్‌ అం‌డ్‌ ‌టూరిజం ఇండెక్స్ (‌టీటీడీఐ)ను ప్రకటిస్తుంది. 2021లో దాదాపు 117 దేశాల స్థితిగతులను పరిగణించిన అనంతరం భారత్‌ 54 ‌స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. దాదాపు 17 అంశాలకు సంబంధించి 112 ఇండికేటర్లపైన అభిప్రాయ సేకరణ చేసింది. వాటన్నింటిని క్రోడీకరించిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తుంది. ఇందులో భద్రత (సేఫ్టీ సెక్యూరిటీ), పర్యావరణ స్థిరత్వం (ఎన్వి రాన్మెంట్‌ ‌సస్టెయినబిలిటీ), ట్రావెల్‌, ‌టూరిజం, ఎయిర్‌ ‌ట్రాన్స్‌పోర్టు, మౌలిక సదుపాయాల కల్పన వంటి ఐదు కీలక అంశాలున్నాయి. అద్భుతమైన పనితీరు కనబరిచే దేశాలలో జపాన్‌ ‌మొదటి స్థానంలో, అమెరికా ద్వితీయ స్థానంలో, స్పెయిన్‌ ‌మూడో స్థానంలో ఉండగా… జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఆ‌స్ట్రేలియా, యూకే, సింగపూర్‌, ఇటలీలు వరుసగా తర్వాత స్థానాలను దక్కించుకున్నాయి. బ్రిక్స్ ‌దేశాల విషయానికొస్తే, చైనా 12వ స్థానంలో, బ్రెజిల్‌ 49‌వ స్థానంలో ఉన్నాయి. భారత్‌ 54‌వ స్థానంలో ఉంటే, దక్షిణాఫ్రికా 68వ స్థానంలో నిలిచింది. సార్క్ ‌దేశాల్లో శ్రీలంక (74), నేపాల్‌ (102), ‌బంగ్లాదేశ్‌ (100), ‌పాకిస్తాన్‌ (83), ‌భారత్‌ ‌కంటే దిగువనే ఉన్నాయి.

కశ్మీరం కళకళ

కశ్మీర్‌ను భూలోక స్వర్గం అంటారు. ప్రకృతి అందాలకు అది నెలవు. ఉద్యానవనాలు, పూలతోట లతో కనులపండువగా ఉంటుంది. నిన్నమొన్నటి వరకూ బాంబుల మోతతో, తీవ్రవాదుల దాడులతో, సైన్యం బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లి రక్తపాతానికి నెలవుగా ఉన్న కశ్మీర్‌ ‌లోయలో నేడు (ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత) ప్రశాంత వాతావరణం నెలకొంది. పర్యాటకులు పోటెత్తు తున్నారు. ఈ భూఖండంలోనే అత్యంత పెద్దదయిన తులిప్‌ ‌గార్డెన్‌ను చూడటానికి వస్తున్నారు. మంచు నిండిన హిమగిరి సొగసులను తనివితీరా వీక్షిస్తున్నారు. హిందూ రాజులు, మొగల్‌ ‌చక్రవర్తులు, బ్రిటిష్‌ ‌వలస పాలకులతో పాటు లక్షలాది మందిని సమ్మెహితుల్ని చేసిన ప్రకృతి సోయగాలను ఆస్వాదించటానికి వస్తున్నారు. శ్రీనగర్‌లో హౌస్‌ ‌బోట్లు ఉండే దాల్‌ ‌లేక్‌ని చూసి పరవశిస్తున్నారు. అక్కడే ఉండే నిషాత్‌ ‌గార్డెన్‌ అం‌దాలను చూసి మైమరిచిపోతున్నారు. కార్గిల్‌ ‌నుంచి శ్రీనగర్‌, ‌పాడుం, లెహ్‌లకు ప్రయాణించటానికి చక్కటి రోడ్డు మార్గం ఉంటుంది. ట్రెక్కింగ్‌, ‌మౌంటనీరింగ్‌లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. సాధారణంగా మార్చి నుంచి ఆగస్టు వరకూ కశ్మీర్‌ ‌పర్యటనకు అనుకూలమైన సమయం. ఈ సీజన్లో అయితే హిమపాతం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అనేక ప్రాంతాలు మంచుదుప్పటి కప్పుకున్నట్టుగా తయారయ్యాయి. లెహ్‌, ‌రాజౌలి తదితర ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్ర యాలు కూడా మంచుతో నిండిపోవటంతో ప్రయాణాలను నిలిపివేశారు.

1990 నుంచి కశ్మీర్‌ ‌తీవ్రవాదుల నిలయంగా ఉండేది. వేలాది మంది అమాయక ప్రజలు తీవ్రవాదుల కారణంగా మృత్యువాతపడ్డారు. దాంతో పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే దశాబ్దం తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. సందర్శకులను ఆకర్షించటానికి, శ్రీనగర్‌ అధికారులు 2007లో తులిప్‌ ‌గార్డెన్‌ ‌ప్రారంభించారు. హౌస్‌ ‌బోట్లతో నిండి ఉండే దాల్‌ ‌లేక్‌కి, జబర్వాన్‌ ‌హిల్స్‌కి మధ్య ఉన్న 30 హెక్టార్ల ప్రదేశంలో దీనిని ఏర్పాటు చేశారు. 12 రంగులు, పారడ్‌ ‌నుంచి టెక్సాస్‌ ‌గోల్డ్ ‌వరకూ 68 రకాల తులిప్‌ ‌రకాలు చూడముచ్చటగా ఉంటాయి. కరోనా తర్వాత ఈ ఉద్యానవనాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. గత ఏడాది 20 లక్షల మంది కశ్మీర్‌ను సందర్శించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు అధికం. జమ్ముకశ్మీర్‌కి పర్యాటకులు తరలిరావటం మంచి పరిణామంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో ఆర్టికల్‌ 370‌ను రద్దు చేసి జమ్ముకశ్మీర్‌, ‌లద్ధాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్పు చేసింది. దాంతో భయం గుప్పిట్లో బతికిన కశ్మీర్‌ ‌వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తీవ్రవాదుల ఉనికి మాయమైంది. దీనిపై హోం మంత్రి అమిత్‌ ‌షా మాట్లాడుతూ, ‘ఒకప్పుడు అది టెర్రరిస్టు హాట్‌ ‌స్పాట్‌. ‌నేడు అది టూరిస్టు హాట్‌ ‌స్పాట్‌’ అని వ్యాఖ్యానించటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

గంగానదిలో నౌకా విహారం

‘2024లో అయోధ్యలో రామాలయం పూర్తవుతుంది. అప్పుడు చూడండి. మా రాష్ట్రానికి పర్యాటకుల రద్దీ ఎంత పెరుగుతుందో అంటున్నారు ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌. ‌హిందువుల్లో ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారయినా అయోధ్య సందర్శించాలని ఆశపడతారని ఆయన చెప్పిన మాటల్లో అతిశయోక్తి లేదనిపిస్తుంది. కాశీ.. మతపరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఇకో టూరిజం పరంగా విశిష్ట స్థానం పొందింది. భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో కాశీ ఒకటి. ఇక్కడ ప్రహహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తి పొందుతారని హిందువులు నమ్ముతారు. అలాగే ‘కాశ్యాన్తు మరణాన్‌ ‌ముక్తి’ అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందన్న విశ్వాసం కూడా భక్తుల్లో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం.

కాశీలో కాశీవిశ్వనాథుని ఆలయం, విశాలాక్షి ఆలయం, కాలభైరవాలయం, మృత్యుంజయేశ్వ రాలయం, సారనాథ్‌ ‌మందిరం, వ్యాసకాశిలతో పాటు దాదాపు 23వేలకు పైగా ఆలయాలున్నాయి. ఏటా కోటి మంది వరకూ పర్యాటకులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు. కాశీవిశ్వనాథ్‌ ‌ధామం కొత్త హంగులు దిద్దుకున్న తర్వాత ఒక్క శ్రావణంలోనే కోటి మంది వరకూ యాత్రికులు విచ్చేశారు. ఇక ప్రయాగ్‌ ‌రాజ్‌లో 2019లో కుంభమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 24 కోట్లమంది భక్తులు హాజరయ్యారు. ఇకపోతే, ప్రభుత్వం రూ. 30వేల కోట్ల ఖర్చుతో మధుర-బృందావన్‌లో మౌలిక సదుపాయాల మెరుగుపరుస్తోంది. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. తాజాగా 38వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పర్యాటక మంత్రిత్వ శాఖ ఎంఓయూలు చేసుకుంది. భారత్‌ ‌ఘనమైన సంస్కృతి, చరిత్రలను తెలుసుకుంటూ, మన దేశ వారసత్వ పరంపరను అవగాహన చేసుకుంటూ, జాతీయ ఉద్యానవనాలను తిలకిస్తూ 27 నదుల మీదుగా సాగే నౌకావిహారానికి వారణాసి వేదిక య్యింది. జనవరి 13వ తేదీన ప్రధాని మోదీ దీనిని ప్రారంభించారు. సాధారణంగా నౌకలనగానే అవి సముద్రం మీద ప్రయాణిస్తాయి. నదుల మీద నౌక ప్రయాణించటం విశేషం. అంతకు మించిన ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. బంగ్లాదేశ్‌ ‌చారిత్రక మూలాలను కూడా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. వారణాసి నుంచి బయలుదేరే ‘గంగా విలాస్‌’ అనే పేరు గల ఈ నౌక 51 రోజల పాటు మొత్తం 3,200 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. బంగ్లాదేశ్‌ ‌మీదుగా అస్సాంలోని డిబ్రూగర్‌ ‌చేరుకుంటుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్‌కత్తాకి, 35వ రోజు బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చేరుకుంటుంది. నౌకలో మూడు అంతస్తులు, 18 సూట్స్ ఉం‌టాయి. 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, సౌకర్యవంతంగా ప్రయాణించ టానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్టు ఉంటుంది. నౌకలో జిమ్‌, ‌స్పా వంటి సదుపాయాలు ఉంటాయి. ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పెంచేలా సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఉంటాయి. గంగావిలాస్‌ ‌తొలి పర్యటనకు 32 మంది న్యూజిలాండ్‌ ‌వాసులు మొత్తం నౌకను బుక్‌ ‌చేసుకోవటం విశేషంగా చెప్పుకోవాలి.

మూడో స్థానంలో ఆంధప్రదేశ్‌

‌మన దేశంలో టూరిస్టులు ఎక్కువ ఏ ప్రాంతా లను చూస్తారు? వారిని ఆకర్షించే అంశాలేమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారాన్ని క్రోడీకరించి పర్యాటకశాఖ ఫలితాలను ప్రకటిస్తుంది. 2021లో దేశీయ టూరిస్టులు సందర్శించిన ప్రాంతాల్లో ఆంధప్రదేశ్‌ ‌మూడో స్థానంలో ఉంది. 93.27 మిలియన్ల మంది పర్యాటకులు ఆ రాష్ట్రాన్ని సందర్శించారు. 115.33 మిలియన్ల మంది పర్యాటకులతో తమిళనాడు మొదటిస్థానంలో, ఉత్తరప్రదేశ్‌ (109.70‌మిలియన్లు) రెండో స్థానంలో ఉన్నాయి. కర్ణాటక (81.33 మిలియన్లు), మహారాష్ట్ర (43.56 మిలియన్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక విదేశీయులు సందర్శించే రాష్ట్రాల్లో పంజాబ్‌ (0.3 ‌మిలియన్‌), ‌మహారాష్ట్ర (0.18 మిలియన్‌), ‌ఢిల్లీ (0.1 మిలియన్‌), ‌కర్ణాటక (0.072 మిలియన్‌), ‌కేరళ (0.06 మిలియన్‌) ఉన్నాయి.

స్వదేశీ టూరిస్టులు సందర్శించే రాష్ట్రాలలో.. తమిళనాడు 17.02 శాతం, ఉత్తరప్రదేశ్‌ 16.19 ‌శాతం, ఆంధప్రదేశ్‌ 13.77 ‌శాతం, కర్ణాటక 12 శాతం, మహారాష్ట్ర 6.43శాతం, తెలంగాణ 4.72 శాతం, పంజాబ్‌ 3.93 ‌శాతం, మధ్యప్రదేశ్‌ 3.77 ‌శాతం, గుజరాత్‌ 3.62‌శాతం, పశ్చిమబెంగాల్‌ 3.59 ‌శాతంగా ఉన్నాయి. విదేశీ టూరిస్టులు సందర్శించిన ప్రదేశాల్లో పంజాబ్‌ 29.22 ‌శాతం, మహారాష్ట్ర 17.6శాతం, దిల్లీ 9.5 శాతం, కర్ణాటక 6.87 శాతం, కేరళ 5.74 శాతం, తమిళనాడు 5.46 శాతం, ఉత్తరప్రదేశ్‌ 4.24‌శాతం, మధ్యప్రదేశ్‌ 3.94 ‌శాతం, పశ్చిమబెంగాల్‌ 3.30 ‌శాతం, రాజస్థాన్‌ 3.3 ‌శాతంగా ఉన్నాయి.

తమిళనాడులో అనేక దేవాలయాలు, వారసత్వ కట్టడాలు, హిల్‌ ‌స్టేషన్లు, హెరిటేజ్‌ ‌సైట్లు, జలపాతాలు, నేషనల్‌ ‌పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. దేశంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రంగా తమిళనాడు నిలవటానికి ఇదే ప్రధాన కారణం. ఇక్కడ దాదాపు 74 ప్రదేశాలను ప్రాధాన్యం గల గమ్యాలుగా చెబుతారు. ఇందులో చెన్నై, రామేశ్వరం, ఏర్కాడ్‌, ‌కొడైకెనాల్‌, ఊటీ, కన్యాకుమారి తదితరాలు ఉన్నాయి. ఇక ఆంధప్రదేశ్‌ ‌విషయానికొస్తే తిరుపతి, విశాఖపట్టణం, అరకు, శ్రీశైలం, అనంతపురం, అమరావతి, పాపికొండలు తదితర ప్రదేశాలను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. పర్యాటక శాఖ, అటవీశాఖ సహకారంతో ఉత్తరాంధ్రలోని అరకు, అనంతగిరి, సరుగుడులలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొంది స్తోంది. దట్టమైన అటవీప్రాంతంలో పర్యాటకులు రాత్రి బస చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతగిరిలో 10 నుంచి 12 కాటేజీలను నిర్మిస్తున్నారు. అక్కడ కాఫీ ప్లానిటేషన్లు ఉన్న ప్రాంతం అనువైనదిగా భావిస్తున్నారు. ఏపీ ఫారెస్టు డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ)తో దీని కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ. ఐదు కోట్లు. వచ్చే రెండేళ్లలో వీటి నిర్మాణం పూర్తవుతుంది. తెలంగాణలోని హైదరాబాద్‌లోఎక్కువ చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలున్నాయి. దానితో పాటు నగరంలోనూ, దాని సమీప ప్రాంతాల్లోనూ అనేక దర్శనీయ స్థలాలున్నాయి. వరంగల్‌, ‌నాగార్జునసాగర్‌, ‌భద్రాచలం, ఆదిలాబాద్‌ ‌తదితర ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తన ‘స్వదేశీ దర్శన్‌’ ‌స్కీంలో భాగంగా దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 19 స్థలాలను ఎంపిక చేసింది. దక్షిణాదిలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు, హంపీలను ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలుగా గుర్తించింది. కర్ణాటకతో పాటు, ఆంధప్రదేశ్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, ‌గోవా, గుజరాత్‌, ‌కేరళలలో రెండు ప్రాంతాలు, చండీగఢ్‌, ‌లద్ధాఖ్‌లలో ఒక్కో ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఆయా రాష్ట్రాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటానికి ఇతోధిక కృషి చేస్తున్నాయి. పర్వత ప్రాంతాలు, నదులు, బీచ్‌లు, వెట్‌ ‌ల్యాండ్స్, ‌ఫారెస్టు, టీప్లాంటేషన్లు, వారసత్వ కట్టడాలు, సిటీ టూరిజం ఉన్న ప్రాంతంగా బెంగాల్‌ ‌ప్రసిద్ధి చెందింది. సంస్కృతీ సాంప్రదాయాల ప్రకారంగానూ, ఆహారపు అలవాట్ల ప్రకారంగానూ ప్రత్యేకస్థానం సంపాదించుకుంది. విదేశీ టూరిస్టులను ఆకర్షించటంలో దేశంలో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 50 శాతం విదేశీ యులు బంగ్లాదేశ్‌ ‌నుంచి వస్తున్నారు. అమెరికా, యూరప్‌లతో సంబంధాలు మెరుగయితే పర్యాటకులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతారని ఆ రాష్ట్రం భావిస్తోంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల రోడ్‌ ‌షో నిర్వహించింది.

ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించటంతో మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ (ఎం‌టీడీసీ) వినూత్నమైన కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. తన ఆధ్వర్యంలో పర్యాటకులకు ‘సెరల్‌ ‌ఫుడ్‌’ అం‌దించా లని నిర్ణయించుకుంది. రాగులు, సజ్జలు, జొన్నలు తదితర చిరుధాన్యాలతో చేసిన స్పెషల్‌ ‌దోసె, ఊతప్పం, ఖిచిడి, బిస్కెట్లు, కేకు, మోదక్‌, ‌పాపడ్‌, ఉప్మా తదితరాలను అందుబాటులోకి తెస్తోంది.

గోవా టూరిజం శాఖ అక్కడ బీచ్‌లను శుభ్రం చేసేందుకు రూ.10 కోట్లను ఏటా ఖర్చు చేస్తోంది. ఇంత వెచ్చించినా అక్కడక్కడా బీచ్‌లు మురికిగా ఉండటంతో బీచ్‌ను శుభ్రం చేసే సమయాన్ని రాత్రి 9గంటల వరకూ పొడిగించారు. అంతేకాదు, ఇటీవల బీచ్‌లను శుభ్రం చేసే బాధ్యత సంబంధిత పంచాయతీలు కూడా తీసుకోవాలని సూచించారు. అలాగే బీచ్‌ల దగ్గర స్వచ్ఛతను దెబ్బతీసే వారికి జరిమానాలు కూడా వేయాలని చూస్తున్నారు.

మధ్యప్రదేశ్‌ ‌టూరిజం శాఖ గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ‌పీపుల్స్ ఇం‌డియన్‌ ఆరిజన్‌ (‌జీఓపీఐఓ) సంస్థతో కలిసి ఇటీవల ఎంఓయూ కుదుర్చుకుంది. విదేశాలలో ఉండే ఈ సంస్థల శాఖలు మధ్యప్రదేశ్‌లో ఉండే పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం నిర్వహిస్తాయి.

పర్యాటక శాఖ అదనపు సేవలు

పర్యాటక మంత్రిత్వ శాఖ కొందరు టూర్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ ఏజెంట్లు, టూరిస్టు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు, అడ్వంచర్‌ ‌టూర్‌ ఆపరేటర్లు, డొమెస్టిక్‌ ‌టూర్‌ ఆపరేటర్లకు గుర్తింపునిస్తోంది. ఇందుకోసం వెబ్‌ ఆధారిత పబ్లిక్‌ ‌డెలివరీ సిస్టమ్‌ (‌పీడీఎస్‌)‌ను ఏర్పాటు చేసింది. జు•తీ•ఙవశ్రీ•తీ••వ•జూజూతీశీఙ•శ్రీ. అఱమీ.ఱఅలో ఆసక్తి గలవారు ఎవరైనా సంప్రదించ వచ్చు. 30 జూన్‌ 2022 ‌నాటికి 40 ట్రావెల్‌ ఏజెంట్లు, 16 టూరిస్టు ట్రాన్స్ ‌పోర్టు ఆపరేటర్లు, 50 గ్రీన్‌ ‌షూట్స్/‌స్టార్టప్‌లు, 105 టూర్‌ ఆపరేటర్లు రిజిస్టరయి ఉన్నారు. అలాగే హోటళ్లను స్టార్‌ ‌రేటింగ్‌ ‌ప్రకారం వర్గీకరిస్తోంది. ఒక స్టార్‌ ‌నుంచి ప్రారంభించి, ఐదు స్టార్‌లు, ఐదు స్టార్‌ల డీలక్స్ ‌వరకూ హోటళ్లు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్లో ఇందుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి.

 ఆతిథ్య రంగంలో మానవవనరులను సిద్ధం చేసుకోవటానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టూరిజం అండ్‌ ‌ట్రావెల్‌ ‌మేనేజ్‌మెంటు (ఐఐటీటీఎం), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హోటల్‌ ‌మేనేజ్‌మెంటు అండ్‌ ‌ఫుడ్‌ ‌క్రాఫ్టస్‌లను ఏర్పాటు చేసింది. ఐఐటీటీఎం స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ. పర్యాటక మంత్రిత్వ శాఖ 1983లో న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించింది. ప్రస్తుతం దీని శాఖలు నెల్లూరు, భువనేశ్వర్‌, ‌గ్వాలియర్‌, ‌నోయిడా, గోవా, షిల్లాంగ్‌, ‌బోథ్‌ ‌గయలలో ఉన్నాయి. ఇందులో బీబీఏ, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సులతో పాటు 14 నెలల డిప్లమా కోర్సులు కూడా ఉన్నాయి. హోటల్‌ ‌మేనేజ్‌మెంటు, కేటరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను అప్పటి కేంద్ర ప్రభుత్వం 1982లో ప్రారంభించింది. ఇది బీఎస్సీ, ఎంఎస్సీ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ ‌కోర్సులను నిర్వహిస్తోంది. దాంతోపాటు ఒకటిన్నర సంవత్సరాల పాటు ఉండే డిప్లమో ఇన్‌ ‌ఫుడ్‌ ‌ప్రొడక్షన్‌ ‌కోర్సులను కూడా నిర్వహిస్తోంది.

పర్యాటకులకు నాణ్యమైన సేవలు అందించేం దుకు ఈ రంగం ఎప్పటికప్పుడు తనను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. దీనివల్ల పర్యాటకులకు సరికొత్త అనుభూతి సొంతమవుతోంది. పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఇది నిరంతరం కొనసాగవల సిందే. ప్రభుత్వం కూడా తన వంతు ప్రోత్సాహం అందించాలి. రెగ్యులారిటీ నిబంధనలను సడలించటం, తక్కువ వడ్డీకి రుణాలు, పన్నుల్లో రాయితీలు వంటి చర్యలు చేపట్టాలని ఈ రంగం కోరుతుంది. దానితోపాటు ఆతిథ్య రంగానికి పరిశ్రమల హోదా కల్పించటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, గోవా, గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌రాజస్తాన్‌ ‌రాష్ట్రాలు ఈ దిశగా ముందడుగు వేశాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవలసి ఉంది. అలాగే ఆతిథ్య రంగంలో ఉన్న కంపెనీలు బడ్జెట్‌, ‌బిజినెస్‌, ‌లగ్జరీ హోటళ్లు, హోమ్‌ ‌స్టేలు, విల్లాలు వంటివి మరికొన్ని కొత్తవి ఏర్పాటు చేయటం ద్వారా ఈ ఏడాది అదనంగా కొత్త అవకాశాలను కొల్లగొట్టొచ్చు.

—————————————

పర్యాటకరంగంలో మలుపులు, మెరుపులు

 1.  థామస్‌ ‌కుక్‌ (22 ‌నవంబరు, 1808- 18 జులై, 1892)ని ‘ఫాదర్‌ ఆఫ్‌ ‌టూరిజం’గా పేర్కొంటారు. ప్రపంచవ్యాప్త ట్రావెలింగ్‌ ఏజెన్సీ ‘థామస్‌ ‌కుక్‌’‌ను ప్రారంభించి పర్యటనలకు నాంది పలికింది ఆయనే. ప్రయాణంతో పాటు అద్దె గదుల వసతి, ఇతరత్రా సౌకర్యాలన్నింటికి ఛార్జీలను వసూలు చేసే ‘ప్యాకేజీ టూర్‌లను కూడా ఆయనే ప్రారంభించారు. మొదట యూరప్‌లో రైల్‌ ‌టూర్‌ను మొదలుపెట్టారు. 1860లో తన ఏజెన్సీని ప్రారంభించిన అనంతరం అమెరికా టూర్లు ఏర్పాటు చేశారు. 1880 ప్రాంతంలో ఈ కంపెనీ ఇంగ్లండ్‌, ఈజిప్టులలో మిలటరీ ట్రాన్స్‌పోర్టును, పోస్టల్‌ ‌సర్వీసెస్‌ను కూడా చేపట్టింది. భారతదేశంలో కూడా మంచి ట్రావెల్‌ ‌కంపెనీగా ఇది ప్రాచుర్యం పొందింది.
 2. బ్రిటిష్‌ ‌వనిత మేరీజేన్‌ ‌కార్బెట్‌ని ‘మదర్‌ ఆఫ్‌ ‌టూరిజం’గా పిలుస్తారు. ఈమె ప్రసిద్ధ పర్యావరణవేత్త జిమ్‌ ‌కార్బెట్‌ ‌తల్లి. టూరిజం సాంప్రదాయం అనే విత్తనాన్ని నాటింది ఆమే. అది శాఖోపశాఖలుగా వర్ధిల్లి, ఈ రోజు అక్కడ ప్రజలకు ప్రధాన వృత్తిగా మారటమే కాదు, ఆర్థికాభివృద్ధికి కీలక అంశంగా నిలిచింది. 130 సంవత్సరాల క్రితం, హిల్‌ ‌టౌన్‌గా పిలిచే నైనిటాల్‌ని సందర్శించే వాళ్ల కోసం మొట్ట మొదట లాడ్జింగ్‌ ‌సౌకర్యాన్ని ప్రారంభించింది. కాలగమనంలో ప్రభుత్వాలు, ప్రజలు కూడా ఆమెను విస్మరించారు. ఆమె ముస్సోరి, నైనిటాల్‌ ‌కొండల్లో నివాసం ఉండి, చివరకు నైనిటాల్లోనే కన్నుమూసింది.
 3. భారతదేశంలో టూరిజం అనేది 19వ శతాబ్దంలో ప్రారంభం అయ్యింది. 1945లో ప్రారంభమైన సర్‌ ‌జార్జి సార్జెంట్‌ ‌కమిటీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటానికి ఏర్పాటయ్యింది.
 4. మొట్టమొదటి టూరిస్టు ఎవరు? ఇది తెలుసు కోవటం నిజంగా ఆసక్తి గొలిపే అంశం. ఏ మాత్రం సౌకర్యాలు లేని రోజుల్లో సిరియాకస్‌ ఆఫ్‌ అం‌కోనా (1391-1452) గ్రీకు, రోమన్‌ అవశేషాలపై అధ్యయనం చేసేందుకు మెడిటేరియన్‌ ‌సాగరం మీదుగా ప్రయా ణించారు.
 5. భారతీయ హోటల్‌ ఇం‌డస్ట్రీ పితామహుడు రాయ్‌ ‌బహదూర్‌ ‌మోహన్‌ ‌సింగ్‌ ఓ‌బ్రాయ్‌ని ఫాదర్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌టూరిజం అంటూంటారు.
 6.  ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని జాతీయ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో సరికొత్త అవకాశాల గురించి, దాని వల్ల ఆర్థికాభివృద్ధిలో కలిగే ప్రభావం గురించి అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం గత ఏడాది సంక్షోభం నుంచి పరివర్తన దిశగా (రీ థింకింగ్‌ ‌టూరిజం.. ఫ్రం క్రైసిస్‌ ‌టు ట్రాన్స్ ‌ఫర్మేషన్‌) అన్న నినాదంతో కార్యక్రమాలు నిర్వహించింది. అజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌ప్రచారంలో పర్యాటకానికి భాగస్వామ్యం కల్పించింది. (ఈ ఏడాది థీమ్‌ ఇం‌కా నిర్ధరాణ కాలేదు.)
 7. 1             1991లో భారతీయ పర్యాటకుల సంఖ్య 1.94 మిలియన్లు కాగా, 2021 నాటికి 4.9 శాతం వార్షిక వృద్ధి సాధించి (కాంపౌండ్‌ ‌యాన్యువల్‌ ‌గ్రోత్‌ ‌రేట్‌.. ‌సీఏజీఆర్‌) 8.55 ‌మిలియన్లకు చేరుకుంది. కొవిడ్‌, ‌దాని పర్యవసానంగా లాక్‌డౌన్ల కారణంగా 2020లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. మరుసటి ఏడాది అంటే 2021లో సానుకూల వాతావరణం ఏర్పడింది. దాంతో ఒక్కసారిగా పర్యాటకుల సంఖ్య దాదాపు 17.4 శాతం అధికమైంది.
 8. 2021లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం 5.4 శాతం వృద్ధి చెందింది. 2019, 2020, 2021లలో పర్యాటకుల సంఖ్య 1466 మిలి యన్లు, 405 మిలియన్లు, 427 మిలియన్లుగా నమోదయ్యారు.
 9. పర్యాటకులు ఎక్కువగా విచ్చేసే దేశాలలో ఫ్రాన్స్ ‌ప్రథమస్థానంలో ఉంది. ఇటలీ, మెక్సికో, యూఎస్‌ఏ, ‌స్పెయిన్‌, ‌టర్కీ, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకె, పోలెండు మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, 286.8 మిలియన్ల మంది యూరప్‌ను సందర్శించారు. తర్వాత 82.4 మిలియన్ల టూరిస్టులతో అమెరికా, 20.7 మిలియన్ల టూరిస్టులతో ఆసియా, పసిఫిక్‌, ‌మధ్యప్రాచ్యం, ఆఫ్రికా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
 10. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఉండే ప్రదేశాల్లో తాజ్‌మహల్‌ను సందర్శించటానికి ఎక్కువ మంది పర్యాటకులు ఇష్టపడుతున్నారు. తర్వాత స్థానాల్లో ఎర్రకోట, కుతుబ్‌ ‌మినార్‌, ‌మామళ్ల పురం, ఆగ్రాఫోర్ట్, ‌గోల్డొండ ఫోర్డ్, ‌సన్‌ ‌టెంపుల్‌, ‌కోణార్క్, అప్పర్‌ ‌ఫోర్ట్ అగుఆటా, చిత్తోఢ్‌గఢ్‌, ‌శనివార్వాడా ఉన్నాయి.
 11. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, 2021లో నెలవారీ ఫారిన్‌ ఎక్స్ఛేంజి (ఎఫ్‌ఈఈ) ‌వసూళ్లు 65,070 కోట్లు. 2020లో 50,136 కోట్లతో పోలిస్తే అది 29.8 శాతం వృద్ధి చెందింది. అమెరికా డాలర్ల రూపంలో చెప్పాలంటే, 2020లో 6.95 బిలియన్‌ ‌డాలర్లయితే, 2021లో 8,7970 బిలియన్‌ ‌డాలర్లకు చేరింది.
 12. విదేశీ పర్యటనల్లో భాగంగా మన భారతీయ పర్యాటకులు ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతాల్లో దక్షిణాసియా మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో ఉత్తర అమెరికా, పశ్చిమ ఆసియా, యూరప్‌, ఆ‌ఫ్రికా తదితర దేశాలు ఉన్నాయి. భారత టూరిస్టులు ఎక్కువ సమయం గడిపే దేశాల్లో పోర్చుగల్‌ (201.49 ‌రోజులు) తొలిస్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌ (195.86), ఐర్లాండ్‌ (169.62), ఇటలీ (161.78), స్వీడన్‌ (161.20), ‌జెక్‌ (152.18) ఉన్నాయి. భారతీయులు తక్కువ సమయం గడిపే దేశాల్లో చైనా (6.48 రోజులు), మాల్దీవులు (17.52), శ్రీలంక (21.32), పాకిస్తాన్‌ (24.80), ‌బంగ్లాదేశ్‌ (31.40) ఉన్నాయి.
 13. భారతీయ పర్యాటకులు రోడ్డు, రైళ్లతో పోలిస్తే ఎక్కువగా విమానాయానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ, ముంబయ్‌, ‌చెన్నై, కొచ్చిన్‌, ‌బెంగళూరు ఎయిర్‌ ‌పోర్టులు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కాలికట్‌, ‌త్రివేండ్రం, కలకత్తా, అహ్మదాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టులు 10లోపు స్థానాలను దక్కించుకున్నాయి.
 14. కొత్త ప్రదేశాలను సందర్శించటం వల్ల మానసికంగా చైతన్యం కలుగుతుంది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలలో మనకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులతో మన అనుభవాలను పంచుకోవటం సంతోషాన్ని ఇస్తుంది. వాషింగ్టన్‌ ‌స్టేట్‌ ‌యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడయ్యింది. సంవత్సరంలో కొన్ని మార్లు పర్యటనలు చేపట్టి.. కనీసం ఇంటి నుంచి 75 మైళ్లన్నా వెళ్లగలిగినవారు, అసలు పర్యటించిన వారితో పోలిస్తే ఏడు శాతం అత్యధిక సంతోషంగా ఉంటారట.

About Author

By editor

Twitter
Instagram