– క్రాంతి

హిందూ దేవాలయాలను కూలగొట్టడం, విగ్రహాలను ధ్వంసం చేయడం చరిత్రలో చూస్తాం. అది మధ్యయుగాల నాటి పశుత్వమనే అనుకోనక్కరలేదని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సినిమాలు, టీవీ ధారావాహిక కార్యక్రమాలు, కథలు, నవలలు, కార్టూన్లు అన్నీ హిందూ దేవతలను, హిందువుల విశ్వాసాలను కించపరచడానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ దేశంలో హిందుత్వను వ్యతిరేకించడమే సిద్ధాంతంగా ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. తమిళనాడు, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లలో కొన్ని పర్యాయాలు అవి అధికారం కూడా చేపట్టాయి. ఇప్పటికీ వీలైనప్పుడల్లా గద్దెనెక్కుతున్నాయి. వాటిలో కొన్ని గుళ్లను కూలగొట్టడమే పనిగా ఉన్నాయి. కొన్ని హిందూ దేవాలయాలు అపవిత్రమవుతున్నా పట్టించుకోనవసరం లేదన్న ధోరణిలో ఉన్నాయి. ముస్లింలు ఎంత రెచ్చిపోతున్నా మౌనాన్ని ఆశ్రయించే ప్రభుత్వాలు సరేసరి. ఈ పరిస్థితి ఇంకా కొనసాగాలా అన్న ప్రశ్న ఇప్పుడు హిందువు వేసుకుంటున్నాడు. ఇప్పుడు హిందువు అంటే విభూతి ధరించి ధ్యానం చేసుకోవడానికే పరిమితం కావడం లేదు. శివుని మూడో కన్నును ఆదర్శంగా తీసుకుంటున్నాడు. ఆయన చేతిలోని త్రిశూలం కేసి చూస్తున్నాడు. ఆయన చేతిలో డమరుకంలా గర్జిస్తున్నాడు. అలాగే కుంకుమ పెట్టుకుని అమ్మవారి ముందు స్తోత్రాలు చదవడమే కాదు, ఆమె వలెనే దుష్ట శిక్షణకు సిద్ధమవుతున్నాడు. ఇది ఆధునిక హిందూ సమాజం ఇస్తున్న సంకేతం.

ఈ దేశం రాముడిని ఆదర్శ పురుషునిగా పూజిస్తుంది. కానీ ఆయనను కొందరు నీతిమాలిన మనుషులు తిట్టడం ఇక్కడొక వికృతి. కృష్ణుడికి పదహారువేల మంది భార్యలంటూ ఎద్దేవా చేయడం మరొకటి. హిందూ దేవుళ్ల విగ్రహాల మెడలలో చెప్పుల దండలు వేసి మరీ ఊరేగించిన నీచత్వం తమిళనాట జరిగింది. కానీ ఇప్పుడు హిందువు ఆగ్రహిస్తున్నాడు. ఇది ధర్మాగ్రహం అయినా చాలా ఆలస్యంగా జరిగిన పరిణామం. హేతువాదం పేరుతో, నాస్తికత్వం పేరుతో హిందూ ధర్మం మీద, పురాణాల మీద, దేవుళ్ల మీద కుసంస్కారంతో వ్యాఖ్యలు చేయడం, దూషించడం పాత విషయమే. దీనికి క్రైస్తవ సంఘాలు, ముస్లిం మతోన్మాదులు, చాలా సందర్భా లలో కమ్యూనిస్టులు వత్తాసు పలుకుతుంటారు. కింది కులాల వారుగా చెప్పే వారితో ఇలాంటి పనులు చేయించడం ఇటీవలి పరిణామం. అయ్యప్పస్వామి మీద నీచమైన వ్యాఖ్యలు, తరువాత దీక్షలో ఉన్న స్వాములు తిరగబడి దాడి చేయడం తాజా పరిణామం. అదే సమయంలో బాసర అమ్మవారిలో ఐటెం గర్ల్‌ను చూసిన పశుత్వం కూడా ప్రదర్శించడం చూశాం. తాము అమ్ముడుపోయి, ఇతర మతాలను తిట్టడానికి సిద్ధమవుతున్న వీళ్లంతా ఆత్మగౌరవం గురించి, చరిత్రలో జరిగిన అన్యాయాల గురించి, అణచివేత గురించి గొంతు చించుకోవడమే వింత. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కని కొందరు, ఇది క్రియేటివ్‌ ‌లిబర్టీ అని ఇంకొందరు బుకాయిస్తున్నారు. కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ మురికి వదలడం లేదు. ఆఖరికి హిందువులే తమ ప్రయత్నం తాము ప్రారంభించారు. ఇంతకాలం హిందూత్వకు అవమానాలు జరిగితే దానిని ఖండించే బాధ్యత, ప్రతిఘటించే బాధ్యత ఆర్‌ఎస్‌ఎస్‌దో, విశ్వహిందూ పరిషత్‌దో, బజ్రంగ్‌దళ్‌దో అనుకునేవారు. ఆ వాతావరణం ఇప్పుడు మారుతున్నందుకు గర్వ పడాలి. హిందూత్వను కాపాడుకునే బాధ్యత ప్రతి హిందువుదీ అన్న స్పృహ పెరిగింది.

ఇంతకాలం సహనంగా ఉన్న హిందువులు హఠాత్తుగా తిరగబడే సరికి కొందరికి మతిపోయింది. ఎంత అసహ్యంగా దూషించినా దేవుళ్లు ఏమీ అనకపోవచ్చు. కానీ ఇకపై అలాంటి నోటి తీటను ప్రదర్శిస్తే హిందూ సమాజం ఊరుకోదన్న గట్టి హెచ్చరికే వెళ్లింది. ఇకపై ఈ కిరాయి, విద్రోహక మూకలు నోళ్లను అదుపు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. సహనానికి కూడా హద్దు ఉంటుంది. ఈ హద్దులు చెదిరితే ఏమౌతుందో ఇటీవలి రెండు ఘటనలు ఉదాహరణలుగా నిలిచాయి. ఈ ఉదంతాలకి కేంద్ర బిందువులుగా ఉన్న బైరి నరేశ్‌, ‌రేంజర్ల రాజేశ్‌ ‌చాలా చిన్న పురుగులు. వీరికన్నా పెద్ద విషసర్పాలు ఉన్నాయి. హిందువులు మౌనంగా ఉన్నంత కాలం ఈ స్వయం ప్రకటిత నాస్తిక, హేతువాద, నకిలీ అంబేడ్కరిస్టులు, సాంస్కృతిక కార్యకర్తల ఆటలు సాగుతూనే ఉంటాయి.

హేతువాదం, నాస్తికవాదం హిందూమతానికి కొత్త కాదు. వాటి గురించి ప్రస్తావన రామాయణంలోనే ఉంటుంది. నాస్తికత్వం గురించి మాట్లాడిన జాబాలి ఆ పురాణంలో కనిపిస్తాడు. సమాజంలో మూఢనమ్మకాలను తొలగించేందుకు ఈ వాదాలను ఆశ్రయిస్తే ప్రజలు కూడా సంతోషంగా స్వాగతిస్తారు. కానీ హేతు- నాస్తికవాదాల ముసుగులో హిందుత్వ వ్యతిరేకతను నూరిపోసేవారితోనే అసలైన ప్రమాదం. తెల్లనివన్నీ పాలు కాదు. వీరికి తోడుగా బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌పేరు చెప్పుకొని సమాజంలో కుల, మత వైషమ్యాలను రెచ్చగొట్టే వర్గాలు కూడా తయార య్యాయి. నల్లనివన్నీ నీళ్లు కాదు.

హేతువాదం అంటే- ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా దానికి కారణాలను అన్వేషించడం. జ్ఞానం (రుజువు)కు హేతువు (కారణం) మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక ధోరణిని హేతువాదం అంటారు.

మరి నాస్తిక వాదం అంటే.. భగవంతుని ఉనికిని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను నాస్తికులు అంటారు. వాస్తవానికి వీరు ఏ మతాన్నీ ఆచరించరు. దైవాన్ని నమ్మేవారు ఆస్తికులు. ఆస్తికవాదం ఎంత ప్రాచీనమో నాస్తికవాదం కూడా అంతే ప్రాచీనమైనది. కానీ ఇవాళ దేశంలో లేదా రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తున్న నాస్తికుల, హేతువాదుల మాటలలో, చేతలలో ఈ అంశాలు ఉన్నాయా?

డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌చూపించిన మార్గంలో సమసమాజ స్థాపనకు కృషి చేస్తూ, సామాజిక రుగ్మతలపై పోరాడుతూ, షెడ్యూల్డ్ ‌కులాలు, మతాలవారి అభ్యున్నతి కోసం పని చేసేవారిని ఆయన అనుయాయులు అని చెప్పవచ్చు. ఈ కోవలోనే దళిత, బహుజనవాదాలు పుట్టు కొచ్చాయి. వీరంతా తమ హక్కుల కోసం పోరాటం చేయడాన్ని స్వాగతించాల్సిందే. కానీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్నదేమిటి? హేతువాదులు, నాస్తికుల పేరుతో కొన్ని శక్తులు హిందూమతం మీద విషం చిమ్ముతూ పెద్ద ఎత్తున దాడికి దిగుతున్నాయి. అంబేడ్కరిస్టులం, దళిత, బహుజనవాదులం అని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు కూడా ఈ కుట్రలో భాగస్వాములుగా మారారు. హిందూమతాన్ని, దేవుళ్లను విమర్శించడం, దూషించడం, హేళన చేయడం కొందరు వ్యక్తులకు అలవాటుగా మారి పోయింది. ఇందుకోసం వీరు ఈ వాదాలను అడ్డుపెట్టుకుంటున్నారు. నాస్తికత్వం కూడా అంతే. వేరొక మతాన్ని పల్లెత్తు మాట కూడా అనదు. కేవలం హిందూధర్మమే లక్ష్యంగా దుమ్మెత్తి పోయడం కనిపిస్తుంది.

వాస్తవానికి ఈ వాదాలు వినిపించేవారిలో చాలా వరకూ ఎడారి మతాల వాళ్లే ఉన్నారని చెప్పవచ్చు. ఇందుకు ఆధారాలు అనేకం. ఇంట్లో ఒక మతాన్ని పాటిస్తూ, సమాజంలో మాత్రం నాస్తికులం, హేతువాదులం అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఒక మతాన్ని ఆచరిస్తున్న వారు ఇతర మతాన్ని విమర్శిస్తే అది కచ్చితంగా మత విద్వేషమే. రాజ్యాంగంలోని వాక్‌ ‌స్వాతంత్రపు హక్కును అడ్డం పెట్టుకొని ఇతరుల మనోభావాలు గాయపరిచేలా వ్యవహరిస్తున్న ఇలాంటి చీడపురుగులను సమాజం నుంచి వెలి వేయాలి. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరి మతాన్ని వారు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ వీరు ఒక మతాన్ని ఆచరిస్తూ హిందూమతానికి, దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆక్షేపణీయం. అలాంటి హక్కు కల్పించేటంత తెలివితక్కువ వారు కారు మన రాజ్యాంగ నిర్మాతలు.

ఇప్పుడు తిరగబడి ఉండవచ్చు కానీ, ఇంతకాలం హిందువులు మన్నుతిన్న పాముల్లా పడి ఉండడం వల్లనే కదా ఈ శక్తులన్నీ ఇంతదూరం వచ్చేశాయి! మన కులానికో, అభిమాన నటునికో అవమానం జరిగిందని రోడ్డెక్కే హిందువులు, మతం విషయం వచ్చే సరికి పలాయనం చిత్తగిస్తారు. ఇది ఉదా సీనతా? లేక అతి మంచితనమా? తోటి హిందువుల గోడు పట్టనివారే ఇప్పుడు ఎక్కువ. హిందూ మతాన్ని కించపరిచినా పట్టించుకోనంత మొద్దు చర్మం మనది. ఈ బలహీనతకే ఇలాంటి శక్తులు చెలరేగిపోవడానికి ఊతమిస్తున్నది. ఇప్పుడు రోజులు మారాయి. చైతన్యం వస్తోంది.. ఆ చైతన్యం ఎంత శక్తిమంతంగా ఉందో ఇటీవలి రెండు ఘటనలు చాటి చెప్పాయి.

నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా చెప్పుకునే ఓయూ విద్యార్థి బైరి నరేశ్‌ అయ్యప్పస్వామి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు హిందూ సమాజం ఒక్కసారిగా భగ్గుమంది. ఇతడు ఇటీవల వికారాబాద్‌ ‌జిల్లాలోని కొడంగల్‌లో జరిగిన అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ సభలో అయ్యప్పస్వామిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. స్వామివారిని కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. హరిహరాదులు, రాముడు, సీత, కృష్ణుని మీద కూడా కారుకూతలు కూశాడు. మేము నాస్తికులం, దేవుళ్లను నమ్మం, అంబేడ్కర్‌ ‌సభ అంటేనే నాస్తికుల సభ అంటూ ఈ విమర్శలు చేశాడు. ఈ మాటలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారాయి.

అయ్యప్ప దీక్షలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అందరికీ ఆగ్రహం తెప్పించాయి. తెలుగు రాష్ట్రాల్లో దీక్షాధారులంతా రోడ్డెక్కారు. విశ్వహిందూ పరిషత్‌, ‌బజరంగ్‌దళ్‌తో పాటు బీజేపీ నాయకులు ఆయన వ్యాఖ్యాలను ఖండించారు. నరేశ్‌ ‌మీద పీడీ యాక్ట్ ‌పెట్టి అరెస్ట్ ‌చేయాలని అన్ని జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. పలు పోలీస్‌ ‌స్టేషన్లలో అతనిపై కేసులు నమోదయ్యాయి.

కోస్గిలో అయ్యప్ప స్వాములు నిరసన చేపట్టి నప్పుడు బైరి నరేశ్‌ అనుచరుడు బాలరాజు వీడియో తీస్తూ కనిపించాడు. ఎందుకు తీస్తున్నావంటే వాదనకు దిగాడు. అతడే నరేశ్‌ అని భావించిన స్వాములు, స్థానికులు చితకబాదారు. రోడ్డు మీద పరుగెత్తించి మరీ కొట్టారు. పోలీసులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అనంతరం బాలరాజును ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది.

నరేశ్‌ ‌వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. నరేశ్‌పై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్‌ ‌తీవ్రంగా స్పందించారు. తాను మతాన్ని కించపరుస్తూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా పీడీ యాక్ట్ ‌కింద కేసు నమోదు చేశారని, ఇప్పుడు అయ్యప్పస్వామిపై అసభ్యకర పదజాలంతో వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌ ‌మీద వెంటనే పీడీ యాక్ట్ ‌కింద కేసు నమోదు చేయాలని రాజాసింగ్‌ ‌సోషల్‌ ‌మీడియాలో కోరారు. లేకుంటే ప్రగతిభవన్‌ను అయ్యప్ప స్వాములు ముట్టడిస్తారని, అది గుర్తించుకోవాలని హెచ్చరించారు. నరేశ్‌పై పీడీ యాక్ట్ ‌పెట్టి జైలుకు పంపించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరావు సైతం డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సహించబోమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌కూడా హెచ్చరించారు. ఈ పరిణామాలతో నరేశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే సోషల్‌ ‌మీడియా అకౌంట్ల ద్వారా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. నరేశ్‌ను పరిగి సబ్‌ ‌జైలుకు తరలించే క్రమంలో అయ్యప్ప స్వాములు పోలీస్‌ ‌వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పరిగి సబ్‌ ‌జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు రావడంతో నరేశ్‌ ‌జైలు లోపలకు పరుగులు తీశాడు.


వెండితెరకు చేరిన హిందూ ఆగ్రహ జ్వాల

భారతీయ సినిమా పరిశ్రమలో హిందూత్వ అంటే ఎక్కువ మందిలో చులకన భావమే కనిపిస్తుంది. హాస్యం పేరుతో మన దేవతలను, దేవుళ్లను ఆటపట్టించడం మామూలైపోయింది. తమిళ సినిమా పరిశ్రమ ఇందుకు ప్రసిద్ధిగాంచింది. బలాత్కారాలు, రక్తం చిందించుకోవడాలు, వెకిలిపనులకు వేదికగా హిందూ దేవాలయ ప్రాంగణాలను చూపుతూ, వివాహాలు, ఔన్నత్యంతో కూడిన దృశ్యాలకు నేపథ్యంగా చర్చ్‌లను చూపుతారని వీరి మీద వినిపించే విమర్శ. ఇటీవల ఆదిపురుష్‌ ‌సినిమా మీద వచ్చిన విమర్శ బలమైనది. నీవు చూపించదలిచినది రావణాసురుడినా, లేక విదేశీ దురాక్రమణదారుడినా అని ప్రేక్షకలు అడగవలసి వచ్చింది. వెండితెర మీద వచ్చినా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ ‌మీద ప్రదర్శించినా గట్టి విమర్శనే ఎదుర్కొనవలసి వస్తున్నది.

తాండవ్‌ అన్న సినిమాలో హిందూ దేవుళ్ల విగ్రహాలను అపవిత్రం చేసే దృశ్యం మీద ప్రేక్షకులు మండిపడ్డారు. దీనితో నిర్మాత, దర్శకుడు క్షమాపణ చెప్పారు. లుడో అన్న చిత్రానికి కూడా దర్శకుడు అనురాగ్‌ ‌బసుకు నిరసన సెగ తగిలింది. ఏ సూటబుల్‌ ‌బాయ్‌ అనే సినిమాలో ముస్లిం యువకుడు హిందూ యువతికి ముద్దు ఇస్తున్న దృశ్యం పెట్టినందుకు హిందువులు మండిపడ్డారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలైంది. ఇక లక్ష్మిబాంబ్‌ ‌పేరుతో వచ్చిన సినిమాకు ఎంత అపఖ్యాతి రావాలో అంత అపఖ్యాతి వచ్చింది. ప్రేక్షకులకు భయపడి ఆ సినిమా పేరు లక్ష్మి అని మార్చారు. ఇందులో లక్ష్మి పాత్రను అసభ్యంగా చిత్రించినందుకు కూడా ఆగ్రహం వెల్లువెత్తింది. సిక్కుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నదన్న కారణంగా పాతాళ్‌ ‌లోక్‌ ‌సినిమా మీద కూడా ప్రేక్షకులు మండిపడ్డారు. సేక్రెడ్‌ ‌గేమ్స్ 2 అనే చిత్రం కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నది. లీల, హస్ముఖ్‌, ‌మీర్జాపూర్‌, ‌కృష్ణ అండ్‌ ‌హిస్‌ ‌లీలా వంటి సినిమాలు కూడా హిందువుల ఆగ్రహాన్ని చవి చూశాయి. గతంలోను ఇలాంటివి ఎన్నో. షబానా ఆజ్మీతో నిర్మించ తలపెట్టిన వాటర్‌ అనే చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. కారణం హిందువుల మండిపాటు. ఇవి కాకుండా చాలా వ్యాపార ప్రకటనలు కూడా హిందూ వ్యతిరేకతకు, దుష్ప్రచారానికి అంకితమైనట్టు కనిపిస్తుంది.
మీడియాలో ఒక వర్గం నిరంతరం హిందూ వ్యతిరేక ప్రచారానికి పరిమితమైంది. హిందువుల పండగలంటే పర్యావరణానికి చేటని ప్రచారం చేయడమే వీటి పని. పండుగ వస్తే చాలు వ్యతిరేక ప్రచారంతో ఊదరగొడతారు. దీపావళి, హోలీ, వినాయక చవితి, దేవీ నవరాత్రులు ఏదీ వదలరు. అన్నింటికీ పర్యావరణంతో ముడిపెడతారు. అదే సమయంలో ఇతర మతాల పండగల వల్ల జరిగే నష్టం గురించి నోరు విప్పరు.

హిందుత్వను హేళన చేయడంలో ముందంజలో ఉన్నవాళ్లలో స్టాండప్‌ ‌కమేడియన్లు కూడా వస్తారు. వెకిలితనానికి హాస్యమనీ, వ్యంగ్యమనీ పేర్లు పెట్టి బతికే తెగ ఇది. వీళ్ల ప్రదర్శనలకి ప్రధాన వస్తువు హిందూ వ్యతిరేకత. ఒక స్టాండప్‌ ‌కమేడియన్‌ ‌మున్వర్‌ ‌ఫారూకీకి తెలంగాణ ప్రభుత్వం రక్షణ ఇచ్చి మరీ రప్పించింది. బీజేపీ వ్యతిరేకత ఉన్నవాళ్లకి ఇలాంటి వాళ్లంతా శిఖండులుగా ఉపయోగ పడుతున్న మాట నిజం.

వీళ్లు ఎంత ప్రమాదకరంగా తయారయ్యారంటే అన్నీ సిద్ధం చేసుకున్న నిర్వాహకులు కూడా ప్రదర్శనలు రద్దు చేయవలసి వచ్చింది. వీళ్లు వస్తే అంతు చూస్తామని హిందూ సంఘాలు హెచ్చరించే వరకు పరిస్థితి వెళ్లిపోయింది. హిందువులు, హిందూ దేవుళ్లు, బీజేపీ, మోదీ, భారతదేశం మీద జుగుప్పాకరమైన వ్యాఖ్యలు చేసి ప్రేక్షకులను నవ్వించడమే చాలా మంది స్టాండప్‌ ‌కమేడియన్లు చేసే పని. ఇప్పుడు వీళ్లని ఏ రాష్ట్రాలు రానివ్వడం లేదు. హిందూ వ్యతిరేకులు, ఉదారవాదులు, ఎన్‌జీవోలు వీరి పోషకులు.


కుట్రపూరితంగానే

ఇంతకీ ఉద్దేశపూర్వకంగానే తాను వ్యాఖ్యలు చేసినట్టు పోలీసుల విచారణలో నరేశ్‌ ఒప్పుకున్నట్లు రిమాండ్‌ ‌రిపోర్టులో పేర్కొన్నారు. డిసెంబర్‌ 19, 2022‌న అంబేడ్కర్‌ ‌విగ్రహ ఆవిష్కరణ సభ జరిగింది. దీనికి నరేశ్‌ను పిలవడమూ ఉద్దేశపూర్వ కంగానే జరిగింది. ఆ కార్యక్రమ నిర్వాహకుడు హనుమంతు ఇదే చెప్పారు. ఇక బైరి నరేష్‌ ‌మీద గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా నరేశ్‌ ‌రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఈ సమయంలో నలుగురు ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్‌ ‌రికార్డ్ ‌చేశారు.

నరేశ్‌ ‌వివాదం పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసి కూడా మరో నాస్తికుడు రేంజర్ల రాజేశ్‌ ‌రెచ్చిపోయాడు. కొడంగల్‌లో జరిగిన అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ సభలో రాజేశ్‌ ‌కూడా పాల్గొనడం గమనించదగ్గ విషయం. వివాదం ముదిరిన సందర్భంలో నరేశ్‌కు సోషల్‌ ‌మీడియాలో మద్దతు తెలిపి వివాదానికి మరింత ఆజ్యం పోశాడు. అంతేకాదు, రాజేశ్‌ ‌సరస్వతి అమ్మవారిని అవమా నిస్తూ మాట్లాడాడు. ఇతని వ్యాఖ్యలపైన సరస్వతీ మాత భక్తులంతా ఆగ్రహించారు. పవిత్ర శారదా మాతా క్షేత్రం బాసరలో బంద్‌ ‌పాటించారు. స్థానిక శివాజీ చౌక్‌ ‌వద్ద ధర్ణా నిర్వహించారు. బాసర ఆలయం వద్ద స్థానికులు, గ్రామస్తులు ప్రదర్శన చేపట్టారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహించే అర్చక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన ద్వారం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. షాపులు బంద్‌ ‌చేసి రోడ్డుపై నిరసన తెలిపారు. స్థానిక పోలీస్‌ ‌స్టేషన్‌కు వెళ్లి రాజేశ్‌పై ఫిర్యాదు చేశారు. రాజేశ్‌ను అరెస్టు చేయాలని, అతనిపై పీడీ యాక్ట్ ‌నమోదు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

నిజామాబాద్‌ ‌జిల్లాలో రాజేశ్‌ ఇం‌టి ముందు అయ్యప్ప స్వాములు బైఠాయించి ధర్నా నిర్వహించారు. గతంలోనూ రాజేశ్‌ అయ్యప్పను కించపరుస్తూ పాటలు పాడి యూట్యూబ్‌లో పెట్టాడని ఆరోపించారు. రాజేశ్‌ను తమకు అప్పగించాలని భక్తులు డిమాండ్‌ ‌చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరకు రాజేశ్‌ ‌క్షమాపణ చెప్పాడు. దీంతో అయ్యప్పస్వామి భక్తులు ఆందోళన విరమించారు.

హిందూ వ్యతిరేకులకు, పరమతాలకు కొందరు రాజకీయ నాయకులు, మంత్రులు నిరంతరం వత్తాసు పలకడమే ఈ ధోరణి ఇలా కొనసాగడానికి కారణమని విశ్వహిందూ పరిషత్‌ అభిప్రాయపడింది. నరేశ్‌, ‌రేంజర్ల రాజేశ్‌లపై పీడీ యాక్ట్ ‌నమోదు చేయాలని పరిషత్‌ ‌నేతలు డిమాండ్‌ ‌చేశారు. కొంతమంది హిందూ ద్రోహులు దేవుళ్లను విమర్శించి పబ్లిసిటీ పొందడం ఒక ఎజెండాగా పెట్టుకున్నారని.. ఆ దురుద్దేశంతోనే వాళ్లు హిందూ దేవతలు, దేవుళ్లపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసు అధికారులు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వ్యక్తులకు మద్దతుగా నిలవడం సమాజం క్షమించదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్‌ ‌నేతలు హితవు పలికారు. ఇలాంటి ద్రోహులు విదేశాల మిషనరీల నుంచి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడే డబ్బులకు ఆశపడి కన్న తల్లికి ద్రోహం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతూ రాజ్యాంగ గౌరవాన్ని మంటగలుపుతున్నారన్నారు. అంబేడ్కర్‌ ‌పేరు చెప్పి అంబేబ్కర్‌ ‌మూల సిద్ధాంతానికే ప్రమాదం తీసుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూమతం మీద, దేవతల మీద విద్వేషాలు కొత్త కాకపోవచ్చు. ఒక వింత ఉదాసీనత హిందూ సమాజంలో పెరుగుతోంది. వీరు సెక్యులర్‌ ‌మాయలో పడి చూసీ చూడనట్లుగా వ్యవహ రిస్తున్నారు. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, పురాణాలను.. వాటిలోని పాత్రలను కించపరుస్తూ లెక్కలేనన్ని రచనలు వచ్చాయి. కానీ ఎప్పుడూ హిందువు పెద్దగా స్పందించలేదు. అక్కడక్కడా నిరసనలు వినిపించినా, వారి గళం పెద్దగా లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో హిందువుల మనోభావాలకు విలువ లేనట్లయిపోయింది.

నాలుగేళ్ల క్రితం కత్తి మహేష్‌ అనే సినీ విమర్శకుడు రామాయణం, రాముని మీద ఇలాగే చెలరేగిపోయాడు. మీడియా సంస్థలు డిబేట్లు పెట్టి మరీ అతనికి అండగా నిలిచాయి. హిందూ సంస్థల ఫిర్యాదులతో అతనిపై తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ విధించింది. చివరకు చిత్తూరులో జరిగిన ఓ ప్రమాదంలో కత్తి మహేష్‌ ‌దీనస్థితిలో మరణించాడు.

మన సినీ పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, నటులు, రచయితలు అయ్యప్ప దీక్ష స్వీకరిస్తారు. కొందరైతే ఏడాది పొడవునా నల్ల దుస్తుల్లో కనిపిస్తారు.. కానీ వీరెవరూ బైరి నరేశ్‌ ‌వ్యాఖ్యల మీద స్పందించలేదు. నిరసన వ్యక్తం చేసింది సాధారణ అయ్యప్ప భక్తులు, ఇతర హిందూ సమాజం మాత్రమే. సినీ పరిశ్రమ పెద్దలు ఇంత ఉదాసీనంగా ఉండటానికి కారణం ఏమిటి? సినీ పరిశ్రమతో పాటు మీడియాలో అడుగడుగునా హిందూ మత ద్వేషులు కనిపిస్తారు. మన దేవతలను, పురాణ పాత్రల ఔన్నత్యాన్ని దిగజారుస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి.

నిజానికి నరేశ్‌, ‌రాజేశ్‌ ‌చాలా చిన్న పాత్ర ధారులు. వీరిని ఆడించే అసలు శక్తులు, సంస్థలు చాలా ఉన్నాయి. హిందూ మతం మీద కుట్ర చిన్నదేం కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా హిందూ సమాజంలో చిచ్చు పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగు తున్నాయి.

అంతర్జాతీయంగా కూడా ఈ కుట్ర ఉంది. డిజ్‌మ్యాంటిలింగ్‌ ‌గ్లోబల్‌ ‌హిందుత్వ ఉద్యమం అలాంటిదే. ఇందులో విచ్ఛిన్నకర శక్తుల పాత్ర అపారం. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ఉన్న భయం ఇప్పుడు హిందువులో లేదు. హిందూ సమాజంలో చైతన్యం వచ్చింది. కానీ ఇది సరిపోయేలా లేదు. మరింత ఐక్యత రావాలి. హిందువులంతా కులం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి కలిసికట్టుగా కుట్రలను తిప్పి కొట్టాలి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్


స్ఫూర్తినిచ్చిన ఘట్టం

అయ్యప్పస్వామి భక్తులు ప్రశాంతంగా పూజాపునస్కారాలు చేసుకునేవారు కావచ్చు. కానీ అసలు ఆ ధర్మానికే భంగం వాటిల్లుతున్న సంకేతాలు కనపడితే ఎదురుతిరగడం తప్పనిసరి అనుభవాలు నేర్పుతున్నాయి. అయ్యప్ప భక్తులు 2018లోనే ఈ అంశాన్ని అవగాహన చేసుకున్నారు. ఆ పోరాట స్ఫూర్తి ఇప్పుడు కనిపించి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ ఇక్కడ సమస్య చిన్నది. అయినా ఇది మంచి స్పందన. ఆ సంవత్సరం మధ్యలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయ్యప్పస్వామి భక్తులను తీవ్రంగా కలచివేసిన మాట నిజం. అన్ని వయసుల మహిళలను స్వామి ఆలయంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును ఇవ్వడంతోనే కలకలం మొదలయింది. ఆ తీర్పును తప్పక అమలు చేస్తామని కేరళ సీపీఎం ప్రభుత్వం అత్యుత్సాహం చూపించింది. దీనితో అక్టోబర్‌ 2, 2018‌న వేలాదిగా భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. తీర్పును అమలు చేయకుండా అడ్డుకోవడానికి ఉద్యుక్తులయ్యారు. తమకు సుప్రీంకోర్టు అంటే, దాని తీర్పులు అంటే గౌరవమేనని కానీ 800 ఏళ్ల చరిత్ర ఉన్న అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునన్న తీర్పును తాము హర్షించలేమని భక్తులు చెప్పారు. నిజానికి ఈ నిరసనోద్యమంలో మహిళలే కీలకపాత్ర పోషించారు కూడా.

రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులను అయ్యప్ప భక్తులు దిగ్బంధనం చేశారు. విశ్వహిందూ పరిషత్‌ ‌నుంచి బయటకు వచ్చిన తరువాత డాక్టర్‌ ‌ప్రవీణ్‌ ‌తొగాడియా ఆరంభించిన అంతరాష్ట్రీయ హిందూ పరిషత్‌ ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్రను నిర్వహించింది. ఇదే కాకుండా చాలా హిందూ సంఘాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. అయితే షాహిన్‌బాగ్‌ ఉద్యమకారుల వలె వీరు మొండితనంతో వ్యవహరించలేదు. తిరువనంతపురంలో కిల్లిపాలెం రోడ్డు మీద పెద్దఎత్తున భక్తులు చేరి దిగ్బంధించారు. కానీ అంబులెన్సులను మాత్రం వెళ్లనిచ్చారు. ఇదుక్కికి చెందిన అంబిలి అనే మహిళ సుప్రీంకోర్టు తీర్పునకు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా బలవన్మరణానికి సిద్ధమయ్యారు. కానీ అది సరికాదు కాబట్టి పక్కనే ఉన్న ఇతర భక్తులు నిరోధించారు. అక్కడే వారు గంటపాటు అయ్యప్ప మంత్రాలు వల్లించారు. వారిది ఒక్కటే వాదన. ఎంత పెద్ద న్యాయస్థానమైనా అది అయ్యప్పస్వామి కంటే ఉన్నతమైనది కాదు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే ఆలయం పవిత్రతను కాపాడడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా కోరారు.

కొన్నిరోజుల పాటు సాగిన నిరసనోద్యమంలో అనేకమంది లాఠీ దెబ్బలకు గురయ్యారు. రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని శైలజా విజయన్‌ ‌కోరారు. ఈమె అయ్యప్పస్వామి భక్తుల జాతీయ సంఘం ఉపాధ్యక్షురాలు. సీపీఎం ఎటూ హిందూ వ్యతిరేకి కాబట్టి అత్యంత కఠినంగా వ్యవహరించింది. బీజేపీ మాత్రం తీర్పును వెంటనే అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోజంతా నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనస్తాపం కలిగించిందని అయ్యప్పస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని నిర్వహిస్తున్న రాచకుటుంబం కూడా బాహాటంగానే ప్రకటించింది.
అయోధ్య ఉద్యమం దగ్గర నుంచి హిందువులు మేల్కొనడం ఆరంభమైందని అనాలి. ఏవో కొన్ని హిందూ సంఘాలు తప్ప, వేరెవరూ కల్పించుకోని తరుణంలో అయోధ్య రామజన్మ భూమి విముక్తి ఉద్యమం సంఘపరివార్‌ ఆరంభించింది. అప్పటి నుంచి హిందువులు క్రమంగానే అయినా చైతన్యవంతులు అవుతున్నారు. హిందువులు అయోధ్యను సాధించుకున్నారు. న్యాయపోరాటంతోనే దానిని సాధించారు. ఇదే ఇప్పుడు హిందూ సమాజంలోని కదలికకు ముఖ్య కారణం. ఏమైనా ఇక ముందు కూడా హిందూ సమాజం సంఘటితంగా కదలడం అవసరం. అంత ఉద్యమం జరిగినా కొందరు అల్పులు మళ్లీ హిందూ దేవుళ్లను కించపరచడానికి ఒడిగడుతున్నారు. దీనిని కొనసాగనివ్వరాదు. మత సహనం ఎవరి దగ్గర నుంచి హిందువులు నేర్చుకోనక్కరలేదు. అలాగే తమ ధర్మానికి హాని జరుగుతుంటే వారు మిన్నకుండి పోవలసిన అవసరం లేదు. న్యాయపోరాటం చేయాలి. లేదా ఉద్యమించాలి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram