– చాగంటి ప్రసాద్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘‘అన్నయ్య గారొచ్చారండి!’’.. భర్త విశ్వనాథ శాస్త్రిని పిలిచి, పమిట చెంగు నిండా కప్పుకుని వంటింట్లోకి నడిచింది విశాల.

‘‘ఎక్కడి నుండి బావ రాక?’’… అంటూ దివాకర శాస్త్రిని ఇంట్లోకి ఆహ్వానించాడు విశ్వనాథశాస్త్రి.

‘‘మొన్న మన చంద్రంకి చూసాము కదా లలిత అనే అమ్మాయిని. వాళ్ల నాన్నగారు గంగాధరశాస్త్రి గారిని కలిసి వస్తున్నాను. అబ్బ! ఎండలు చంపేస్తున్నాయి! ‘‘హుష్‌…’’అం‌టూ కండువాతో విసురుకుంటూ అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు దివాకరం.

‘‘కాసిని చల్లని మంచినీళ్లు తాగండి. మజ్జిగ ఇస్తాను. ఎండబడి వచ్చారు’’… అంటూ నీళ్ల గ్లాసు చేతికి ఇచ్చింది విశాల.

ఆడపిల్ల వాళ్లు ఏ సమాధానం చెప్పారో..! అని మనసులో కంగారు పడుతున్నారు ఆ దంపతులు.

విశాల ఇచ్చిన మంచి నీళ్లు గడగడ తాగి,.. గొంతు సవరించుకున్నాడు దివాకరం.

‘‘లలిత తల్లిదండ్రులకి మనవాడు బాగా నచ్చాడు. జాతకాలు కూడా మనమూ చూసాము. వాళ్లు కూడా సరే అన్నారు. కానీ’’.. అంటూ నసిగాడు..

‘‘చెప్పు బావా! పెళ్లి విషయాల్లో మీమాంసలు వద్దు’’ అన్నాడు విశ్వం.

‘‘అమ్మాయి పౌరోహిత్యం చేసేవాళ్లని చేసుకోనని చెప్పిందిట.. అమ్మాయి తల్లిదండ్రులు ఆమెతో చాలా సేపు మాట్లాడి… తమ అశక్తతను వ్యక్తం చేశారు. క్షమించమని కోరారు’’… బాధగా అన్నాడు.

‘‘కారణం ఏంటట?.. అడిగాడు విశ్వం.

‘‘ఏమో మరి! చెప్పలేదు’’.. అన్నాడు దివాకరం..

‘‘అందుకనే మొత్తుకున్నాను. మనలాగే వైదిక కర్మలు చేసే కుటుంబం నుండే సంబంధాలు చూద్దాం అని’’….. అంది విశాల.

‘‘ఆ అమ్మాయి తండ్రిగారు మనల్ని అడిగితేనే కదా ముందుకు వెళ్లాం! పోన్లే చెల్లెమ్మ! వాడికేం తక్కువా? అందగాడు, మంచి సంపాదన, స్వంత ఇల్లు, కారు. మనవాడిని చేసుకోవడానికి ఆ అమ్మాయికి అదృష్టం లేదన్నమాట… అమ్మాయి అందగత్తె, మంచి చదువు, మాట తీరు, నమ్రత, అన్నీవున్నాయి.. అని ఆశపడ్డాము. పెళ్లిళ్లు అంటే ఎన్నో చూడాలి.. అదీ గాక… ఈ రోజుల్లో ఆడపిల్లల స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలకి పెద్దలు విలువ నిస్తున్నారు మరి! ఎవరిని తప్పు పట్టి ప్రయోజనం లేదు. మరో సంబంధం చూద్దాం..’’ అన్నాడు దివాకరం.

‘‘అలాగే బావ! నాకు స్వంత బావలు, మరుదులు లేకపోయినా..నువ్వు మా ఆత్మబంధువులా, చంద్రం పెళ్లి నీ భుజస్కంధాల మీద వేసుకున్నావు’’.. అంటూ ఆప్యాయంగా భుజం తట్టాడు..

‘‘అలా అంటావేంటి విశ్వం! చంద్రం నా ఒళ్లో పెరిగిన వాడు. నేను మీ నాన్నగారి దగ్గర విద్య నేర్చుకున్నవాడిని. మనకి బంధుత్వం కన్నా బాంధవ్యం ఎక్కువ… నాకే కనక ఆడపిల్ల వుంటే, చంద్రాన్ని వదులుకునేవాడినా?’’.. అంటూ నవ్వాడు.

‘‘భోజనానికి లేవండన్నయ్యా!’’ అంది విశాల.

‘‘వద్దమ్మా! ఇంటికి వెళ్లాలి. సనాతన భారతీయ వేద సంస్కృతి మీద నేను రాసే వ్యాసాల మీద జర్మనీ విద్యావేత్త పంపిన ప్రశ్న పరంపరకి సమాధానాలు రాయాలి. ఆ తర్వాతే భోజనం’’… అని చెప్పి ఇంటికి బయలుదేరాడు..

శంకరమఠంలో జరుగుతున్న చండీహోమం చేయించి ఇంటికి వచ్చి భోజనం చేస్తున్న చంద్ర శేఖరంతో.. ‘‘ఏంటోరా! మేము బ్రతికి వుండగా నీ పెళ్లి చేయగలమో లేదో అని భయంగా వుంది’’… అంది.

‘‘అవేం మాటలమ్మ! శుక్రవారం పూటా? ఏమైంది ఇప్పుడు? మొన్న చూసిన అమ్మాయికి నేను నచ్చలేదా? అంతేనా! అమ్మాయికి నేను నచ్చాలని రూలేముంది ? వాళ్లకీ స్వంత అభిప్రాయాలు వుంటాయి. ఈ అమ్మాయి కాకపోతే, ఇంకో అమ్మాయి’’…. అంటూ వేరే మాటలు మాట్లాడి, వాతావరణం తేలిక చేశాడు. విశాల గట్టిగా నిట్టూర్చి దేవుడి గదిలోకి వెళ్లి ‘‘కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర’’.. అంటూ లలితా సహస్రంలో శ్లోక భాగాన్ని, మంత్రంగా మననం చేస్తోంది కొడుకు పెళ్లి త్వరగా అవ్వాలని..

* * * * *

 ‘‘తస్య తే పవిత్ర పత ఇతి పవిత్ర పతే పవిత్రేణ’’… అన్న ఘన పదం పద్మాసనంలో కూర్చుని, స్థిర చిత్తంతో తన గదిలో వల్లె వేస్తున్నాడు చంద్రశేఖరం. అప్పుడే వచ్చిన దివాకరం అరుగు మీద కిటికీలోంచి అతని ముఖ వర్చస్సును చూసి అబ్బురపడ్డాడు. అతనికి పురాణాల్లో చదివిన ఋష్యశృంగుణ్ణి వర్ణించిన ఘట్టం గుర్తుకు వచ్చింది. ఇంతటి సమ్మోహనాకారుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు పెట్టి పుట్టాలి’’ అనుకున్నాడు..

‘‘దివాకరంతో పాటు విశ్వం దంపతులు హల్లో కూర్చున్నారు. తన సంచిలోంచి ఫొటో, జాతకం తీశాడు దివాకరం.

‘‘అమ్మాయి బావుంది. చంద్రంకి చూపిస్తాను…’’ అంటూ తన దగ్గర పెట్టుకుంది విశాల. ‘‘జాతకం కూడా చూశాను. పొంతనలు సరిపోయాయి. గ్రహ మైత్రి బావుంది…’’ అన్నాడు దివాకరం.

‘‘ఇంతకీ అమ్మాయి తండ్రిగారి పేరు, ఏం చేస్తూ వుంటారు’’? వివరాలు అడిగాడు విశ్వం.

‘‘పేరు సుబ్బయ్య శాస్త్రి గారు. సిటీ చివర ఒక కొత్త గుడిలో పూజారిగా జీతానికి పనిచేస్తున్నారు. స్మార్తం పెద్దగా నేర్చుకోకపోయినా, నగరంలో జరిగే కార్యక్రమాలకి వెళ్లి నాలుగు డబ్బులు సంపాదిస్తు న్నాడు’’.. చెప్పాడు.

‘‘మరి అమ్మాయి ఏం చదువుకుంది?’’ అడిగాడు విశ్వం.

‘‘బిటెక్‌ ‌పాస్‌ అయ్యి ప్రైవేట్‌ ‌కంపెనీలో వుద్యోగం చేస్తోంది.. ఇహ పిల్ల పిల్లాడు ఒకరినొకరు చూసుకోవడమే వుంది’…’ అన్నాడు దివాకరం.

‘‘ఆ ఏర్పాట్లు కూడా నువ్వే చూడు బావా…’’ అన్నాడు విశ్వం

‘‘అలాగే! ఈ వారంలో చూపించేద్దాం…’’ అన్నాడు దివాకరం.

* * * * *

 ‘‘ఏరా? అమ్మాయి నచ్చిందా?’’ పెళ్లి చూపులు చూసి ఇంటికి వచ్చిన వెంటనే కొడుకుని విశాల అడిగింది..

‘‘అందంగానే వుంది. కానీ ఆ అమ్మాయి మాటలని బట్టి ఆమెకి నేను నచ్చకపోవచ్చు’’ అని చిన్నగా నవ్వాడు.

‘‘అదేంటి?’’ అంది అర్ధమవ్వక..

 ‘‘ఆ అమ్మాయికి నేను ఏం చేస్తున్నానో తెలియదు, నేను చదివిన విద్య ఏమిటో అర్థమవ్వ లేదు. మీరు పంచె గోచి పెట్టుకుని తిరుగుతారా? స్మార్తం అంటే ఏమిటి? మీరు పిలక అలాగే వుంచేసుకుంటారా?’’ ఇలా వంద ప్రశ్నలేసింది..’’ చెప్పాడు.

‘‘మరి సమాధానం చెప్పావా?’’ అడిగాడు విశ్వం.

‘‘లేదు! నా సమాధానం వినే ఆసక్తి చూపలేదు.. నేను చెప్పబోతుంటే… మా నాన్న చేసే గుళ్లో పూజారి ఉద్యోగం మా అమ్మకి ఇష్టం లేదుట! అందుకనే మీలా పూజలు, వ్రతాలు చేయించే వాళ్లంటే నచ్చరు. మా నాన్న పోరు పడలేక, మిమ్మల్ని చూడడానికి ఒప్పుకున్నాను. నా జీవితం బావుండాలని మా అమ్మ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే, చాదస్తంగా మీ సంబంధం చాలా గొప్పది అని తీసుకొచ్చాడు మా నాన్న’’ అంటూ ఆసక్తి లేనట్టు మాట్లాడిందే అమ్మా!’’ అని చెప్పి స్నానం చేయడానికి వెళ్లిపోయాడు.

‘‘దివాకరం మొహం కోపంతో ఎర్రబడింది. మన వాళ్లలో కూడా కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలని ఇలానే పెంచుతున్నారు. మనం చేసే వృత్తి మీద మన వాళ్లకే గౌరవం లేదు. మన వాళ్లు నేర్చుకున్న వేదవిద్యకి పక్క రాష్ట్రాలలో ఎంతో ఆదరణ వుంది. అక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటి పిల్లవాడు దొరికితే ఆడపిల్ల గలవాళ్లు కళ్లకద్దుకుని, కాళ్లు కడిగి కన్యాదానం చేస్తున్నారు. ధర్మబద్ధంగా సంపాదించుకున్న ఆదాయం మనది. ఎవర్నీ దోచి సంపాదించడం లేదు. యజమాని బాగా వుండాలని గొంతు చించుకుని అన్నీ పూజలు చేస్తాం. విద్యను నమ్ముకున్నాం, అందరి హితం కోరే వాళ్లం కాబట్టే మనల్ని పురోహితుడు అంటారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉంటే స్మార్తం, వేదం నేర్చుకునే వాళ్లు క్రమేపి తగ్గిపోతారు.ముందు ముందు వైదిక కర్మలు చేసేవారు దొరకరు. పౌరోహిత్యం చేసేవాళ్లకి కూడా పెళ్లిళ్లు చేసుకుని అందరిలాగా జీవితాన్ని గడపాలని ఉండదా? తలుచుకుంటే గుండె మండి పోతోంది.. ఏమిటో కలికాలం!’’ అని మధనపడి..’’ వస్తాను బావా’’.. అంటూ.. ఇంటి బాట పట్టాడు.

 ‘‘ఎందరి చేతో నాతిచరామి..’’ -అనిపించిన నేను, నా కన్న కొడుకు చేత అనిపించలేక పోతున్నా’’… బాధగా అనుకున్నాడు విశ్వం. ఇద్దరు బెంగతో అలాగే పడుకున్నారు.. కొన్ని రోజులు పోయాక వాళ్లు చూసిన మరో సంబంధం వాళ్ల దగ్గర నుంచి కూడా అదే సమాధానమే వచ్చింది. అమ్మాయికి అబ్బాయి చేసే వృత్తి నచ్చలేదని.

* * * * *

శృతిని షాపింగ్‌ ‌మాల్‌లో చూడగానే, ‘‘ఎన్నాళ్ల కెన్నాళ్లకు శృతి! పెళ్లయ్యాక పూర్తిగా నల్ల పూసవయి పోయావు. ఎలా వున్నావు?’’ అంటూ కౌగిలించు కుంది లలిత తన స్నేహితురాల్ని.

 ‘‘ఎక్కడే! రోజు ఆఫీసుకెళ్లి వచ్చేసరికి ఎనిమిది, తొమ్మిది అవుతుంది. రాహుల్‌ ‌వచ్చే సరికి అర్ధరాత్రి.. ఆ మధ్య వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌. అయినా కూడా పని ఏం తగ్గలేదు. అందుకనే ఎవ్వరుతోనూ టచ్‌లో లేను’’… చిన్నగా నవ్వుతూ చెప్పింది. ఆ నవ్వులో జీవం లేదు అనుకుంది లలిత.

 ‘‘నీ సంగతి చెప్పు ముందు? ఇంకా బ్రహ్మచారిణిగా స్వేచ్ఛా జీవితాన్ని ఆస్వాదిస్తున్నావా?’’ చమత్కారంగా అడిగింది. ‘‘చాలా సంబంధాలు వస్తున్నాయి.. నాకే నచ్చడం లేదు. నేను కూడా నిర్ణయం తీసుకోలేక పోతున్నాను…త్వరలో చెప్తాను’’.

‘‘ఒకే! పెళ్లి సెటిల్‌ అవ్వగానే ట్రీట్‌ ఇవ్వాలి మరి’’.. అంది శృతి. ‘‘సెటిల్‌ అవ్వగానే ముందు నీకే చెప్తానుగా, రా అలా కాఫీ తాగుతూ మాట్లాడు కుందాం’’ అంది లలిత. ‘‘ఇంట్లో బోల్డు పనులు న్నాయి.. ఒక పక్క ఆఫీసు పని, మరో పక్క రేపు మార్నింగ్‌కి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి’’.. అంటూ మాటిమాటికి వాచీ చూసుకుంటోంది.

 ‘‘ఒకే! పది నిమిషాల్లో వదిలేస్తాలే! ఇద్దరు ఒక టేబు ల్‌ ‌దగ్గరకు చేరారు..

 ‘‘ఇప్పుడు చెప్పు.. రాహుల్‌ ‌నిన్ను ప్రేమగా చూసుకుంటాడా? బోల్డు ఎంజాయ్‌ ‌చేస్తున్నారు కదూ? వీకెండ్‌ ‌పార్టీస్‌ ‌చాలా బావుంటాయిట కదా? నెలకోసారి ఔటింగ్స్‌కి వెడుతూ వుంటారా?’’ ప్రశ్నల వర్షం కురిపించింది లలిత. ‘‘బానే వుంటాడు. ఏదీ! ఇద్దరం ప్రేమగా గడిపినది చాలా తక్కువ.. ఇద్దరం ఉద్యోగాల్లో బిజీ.. మొదట రెండు నెలలు అన్నీ తిరిగాము.. ఇప్పుడు అస్సలు ఎక్కడికి వెళ్లడం లేదు. ఇంటికి వచ్చే సరికి అలిసిపోయి, నాలుగు మెతుకులు నోట్లో వేసుకోవడం, మళ్లీ ఆఫీసు పని వుంటే, ల్యాప్‌టాప్‌ ‌ముందు కూర్చోవడం, లేదా పడుకోవడం…’’ అంటూ నిట్టూర్చింది.

 ‘‘అలాంటప్పుడు నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుని హాయిగా సుఖపడచ్చు కదే! మీ ఆయనకి పెద్ద జీతం కూడా కదా?’’ సలహా పడేసింది లలిత.

‘‘అమ్మో ఎలా మానగలను? తనకి వచ్చే జీతంలో టాక్స్‌లు, ఇంటి అద్దె, కారు, ఇంటి లోను వాయిదాలు పోను సగం కంటే తక్కువ వస్తుంది.. నా జీతం కూడా అవసరం. అందుకనే ఇద్దరం కష్టపడక తప్పదు. ఇలా ఎంత కాలమో?’’… ‘‘అమ్మో టైము ఏడైపోయింది.. మళ్లీ కలుద్దాం’’ అంటూ కంగారుగా పరిగెత్తింది. ఆమె వెళ్లిన వైపు చూస్తూ ఆలోచనలో పడింది లలిత.

* * * * *

గుళ్లో దేవీనవరాత్రులు వైభవోపేతంగా జరుగు తున్నాయి. చంద్రశేఖర శాస్త్రి దగ్గరుండి హోమాలు, యాగాలు చేయిస్తున్నాడు. గంగాధర శాస్త్రి కూతురు లలితని తీసుకుని గుడికి వచ్చాడు. అక్కడ చంద్రాన్ని చూసిన లలిత పక్కకు తప్పుకుని దూరంగా కూర్చుంది. గంగాధరాన్ని చూసి నవ్వుతూ పలక రించాడు. ఇంతలో కొంతమంది రాజకీయవేత్తలు, జిల్లా కలెక్టర్‌, ఆ ఏరియా పెద్దలు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని, చంద్రశేఖర్‌తో మాట్లాడుతున్నారు. ‘‘మీ గురించి చాలా విన్నాను…’’ అన్నారు కలెక్ట్టర్‌. ‘‘ఏ ‌విషయం సర్‌’’ అని గౌరవంగా అడిగాడు.

‘‘మీరు చాలా తక్కువ సమయంలో వేదవిద్య నేర్చుకున్నారని, ఇంకా తర్కం, మీమాంస నేర్చుకునే వైపు పయనిస్తున్నారని.. మీ మావయ్య దివాకరశాస్త్రి గారు చెప్పారు.. వారి ఆర్టికల్స్ ‌నేను చదువుతూ వుంటాను. నాకు వేదం నేర్చుకునే వాళ్లంటే చాలా ఇష్టం, గౌరవం.. మీలాంటి అరుదైన యువకులే మన భారతీయ సనాతన సంస్కృతిని ముందుకు తీసుకు వెళ్లగలరు. అందరూ టెక్‌ ‌కోర్సులు చదువుతారు. కానీ మన స్వంతమని గొప్పగా చెప్పుకునే ఈ విద్యను నేర్చుకోవడం, అదీ ఈ రోజుల్లో చాలా గ్రేట్‌… ‌మీరు అనురక్తితో కృషి చేయడం కూడా చాలా గొప్ప విషయం. చాలా ఏళ్ల క్రితం మా పూర్వీకులు కాశీలో వేదవిద్య అభ్యసించారు.. నాకు మీరు ఇందాకా చదివిన -ఘన పనస – చాలా ఇష్టం..అని నవ్వుతూ, చేతులు జోడించారు చంద్రంకి.

‘‘నేను చాలా చిన్నవాడిని సర్‌.. ఇం‌కా నేర్చు కోవాలసింది అనంతం సర్‌..’’ అన్నాడు వినయంగా.

‘‘యు ఆర్‌ ‌టూ మోడెస్టి? అని నవ్వి, కలెక్టర్‌.. ‌వెడుతూ వెడుతూ, చంద్రం పాదాలకి నమస్క రించాడు. ‘‘అయ్యో సర్‌! ‌గుడిలో అమ్మవారి ముందు ఎవ్వరికీ పాద నమస్కారం చేయకూడదు’’ ఇంగ్లీషులో చక్కని ఉచ్చారణతో చెప్పాడు..

‘‘సారీ చంద్రశేఖర్‌ ‌గారు! మిమ్మల్ని చూడగానే పాద నమస్కారం చేయాలని అనిపించింది… దేవుడి ముందు అలా చేయకూడదని నాకు తెలియదు..’’ అని చేతులు జోడించారు. జిల్లా కలెక్టర్‌ అతనికి నమస్కరించడం చూసి లలిత ఆశ్చర్యపోయింది. ఆమె పక్కనే కూర్చుని అమ్మవారికి దండం పెట్టుకుంటునప్పుడు వాళ్లిద్దరి మాటలు వినబడ్డాయి. ఆమెకి కొంత అర్థమైంది, కొంత అవ్వలేదు. కానీ చంద్రం చాలా గొప్పవాడు అనిపించింది ఆమె మనసుకు. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన లలిత.. ‘‘నాన్నగారు! మీరు వైదిక విద్య వైపు ఎందుకు వెళ్లలేదు? అడిగింది వున్నట్టుండి. ‘‘ఏం తల్లి! ఇవ్వాళ ఈ సందేహం ఎందు కొచ్చింది? అడిగాడు గంగాధర శాస్త్రి కూతుర్ని. ‘‘చెప్పండి! మీరు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం వైపు వచ్చారు. తాతగారు వైదిక కర్మలు చేయించే వారు కదా?’’ అడిగింది. ‘‘అవును తాతగారిలా ఎందరో ఈ స్మార్త, వేద విద్యలు అభ్యసించి, ధర్మబద్ధంగా వైదిక వృత్తిని నిర్వహించి ఘనాపాటీలుగా పేరు గడించారు. నాకు ఆ విద్య అబ్బలేదు..’’ సమాధానం చెప్పాడు.

‘‘అంత కష్టమా? అడిగింది.

‘‘కాదు మరీ! స్మార్తంతో పాటు వేదం కృష్ణ యజుర్వేదం ఘనాంతం వరకూ పన్నెండు సంవత్సరాలు, ఋగ్వేదం ఆరు ఏళ్లు, సావశీ ఎనిమిది ఏళ్లు, శుక్ల యజుర్వేదం ఆరు ఏళ్లు పడుతుంది. ఏ ప్రొఫెషనల్‌ ‌విద్యకు ఇది తక్కువ గాదు. మామూలు లౌకిక విద్యలైతే, ఆ పరీక్ష సమయానికి గుర్తు పెట్టుకుంటే చాలు, వేదవిద్య అలా కాదు. జీవితాంతం చదువుతూ వుండాలి, ధారణాశక్తి బాగా వుండాలి. వాళ్లకు సంఘంలో గౌరవం వుంటుంది. ఈ మధ్య అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లో యువకులు ఈ విద్య పట్ల మొగ్గు చూపుతున్నారు’’… వివరించాడు. ‘‘ఇప్పుడు అలాంటి వాళ్లు లేరు కదూ?’’ అడిగింది.. ఉత్సుకతతో..

 ‘‘ఎందుకు లేరు..! ఎందరో వున్నారు.. అంతెందుకు, నిన్ను చూడడానికి వచ్చిన చంద్రశేఖర శాస్త్రి మన దగ్గర్లోనే వున్నాడు. తక్కువ కాలంలో నేర్చుకుని, ఎంతో పేరు తెచ్చుకున్నాడు.. ఘనాపాటి ఐన అతని తాతగారిలా చంద్రశేఖర్‌ ‌శాస్త్రి గర్భాష్టమశీలో ఉపనయనం చేయించుకుని, అప్పటి నుంచి కఠోర పరిశ్రమ చేసి వేద భాగాలైన మూలం, పదం, క్రమం, జట, ఘన, భాష్యం సంస్కృత వ్యాకరణం మీద పట్టు సాధించాడు. సంస్కృతంతో పాటు హిందీ, తమిళ, మలయాళం, జర్మన్‌ ‌లాంటి విదేశీ భాషలు కూడా నేర్చుకున్నాడుట. ఈ తరం యువకుల కన్నా ఇంగ్లీష్‌ అనర్గళంగా మాట్లాడ గలడని దివాకరశాస్త్రి చెప్పారు.. అలాంటి తెలివైన వాడిని అల్లుడిగా చేసుకుందామని ఆశతో, వాళ్లింటికి వెళ్లి అడిగాను. చివర్లో మామాట కాదని, మరెవరో కావాలని, నువ్వతన్ని తిరస్కరించావు’’ అని ఆమె కేసి చూశాడు కోపంగా. లలిత తల వంచుకుని కాలి బొటనవేలు నేలమీద రాస్తూ ఆలోచిస్తోంది..

 ‘‘మంచి పిల్లవాడు.. అందగాడు, చక్కని గౌరవనీయమైన సంపాదన. సంఘంలో ఎంతో పలుకుబడి. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు. నువ్వు విడిగా ఉద్యోగం చేయక్కర్లేదు. స్వంత ఇల్లు, ఆస్తి కలవాడు. మనిషి వేషధారణబట్టి, అతను చేసే పనిని బట్టి వాళ్లను తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ల విద్వత్తును చూడాలి. సర్లే!.. ఇప్పుడు అనుకుని ప్రయోజనం ఏముంది.. ప్చ్! అనుకుంటూ, డ్రాయింగ్‌ ‌రూమ్‌లోకి దారి తీశాడు. ‘‘వాళ్ల మాటలు వింటున్న తల్లి గాయత్రి, ‘‘నాన్నగారు చెప్పినది అక్షర సత్యం లలిత! ఎంతో గొప్పది వేదవిద్య. అలాగే దానిని ధృఢ సంకల్పంతో నేర్చుకునే వాళ్లు కూడా అంత గొప్ప వాళ్లు. చంద్రం లాంటి వాళ్లే మనదైన గొప్ప వేదసంస్కృతిని నిలబెట్టే వేదపురుషులు. అలాంటి యోగ్యుణ్ణి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది’’ అనునయంగా చెప్పింది.

శృతిని కలిసిన రోజు నుంచి, చంద్రశేఖరం గురించి ఆలోచిస్తోంది… అలాగే ఈ రోజు అతను సామాన్యుడు కాడాని తెలుసుకుంది. అలాంటతన్ని తిరస్కరించిన కారణం కూడా చాలా సిల్లీగా అనిపించింది. ‘‘అమ్మా! మీరు చంద్రం గారి ఇంటికి వెళ్లి నన్ను క్షమించమని ఆడగగలరా? అలాగే నన్ను ఆయన భార్యగా స్వీకరించాలని కూడా..’’ అంది సిగ్గుపడుతూ. ఆ మాట వినగానే గాయత్రి, గంగాధర శాస్త్రి మొహాల్లో ఆనందం వెల్లి విరిసింది.

About Author

By editor

Twitter
Instagram