– పాలంకి సత్య

నూతన ధారావాహిక నవల ప్రారంభం

ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


సప్తాశ్వరథమారూఢం

ప్రచండం కశ్యపాత్మం

శ్వేతపద్మధరం దేవం

తం సూర్యం ప్రణమామ్యహం

కలి ప్రారంభమైన మూడువేల ఇరవై సంవత్సరాలకు ఆ కుటీరంలో ఖగోళశాస్త్ర విద్యాబోధన జరుగుతున్నది. మొదటగా గురుశిష్యులిద్దరూ ప్రతిదినం వలెనే సూర్యుని ప్రార్థించారు. నేర్పుతున్నది తండ్రి ఆదిత్యదాసు. నేర్చుకుంటున్నది ఆయన తనయుడు పదునాలుగేళ్ల మిహిరుడు.

వారి నివాసం ఉజ్జయినీ నగరం.

ఆదిత్యదాసు, ‘‘కుమారా! ఈనాడు గ్రహణాల గురించీ, అవి ఏర్పడే విధానం గురించీ, వాటిని ముందుగానే లెక్కించి సూచించే పక్రియ గురించీ నేర్చుకొనెదవుగాక’’ అని చెప్పి ‘‘గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయో  పురాణాలు చెప్పింది నీకు తెలుసు కదా!’’ అని కూడా అన్నాడు.

మిహిరుడు వినయంగా, ‘‘దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మథించారు. ముందుగా వచ్చిన కామధేనువు, కల్పతరువు, రత్న సముదాయం మొదలైన వాటిని దేవతలనే స్వీకరించనిచ్చిన దానవులు అమృతభాండాన్ని తాము తీసుకుంటామని అన్నారు. జగత్ప్రభువు శ్రీమన్నా రాయణుడు మోహినీ రూపంలో వచ్చి రాక్షసుల నుంచి అమృతభాండాన్ని తన వశం చేసుకున్నాడు. దేవతలకే ఆయన అందిస్తుండగా గమనించిన స్వర్భానుడనే రాక్షసుడు సూర్యచంద్రుల మధ్య కూర్చుని అమృతాన్ని స్వీకరించాడు. సూర్యచంద్రులా విషయాన్ని తెలియజేయగా మహావిష్ణువు చక్రాయుధంతో ఆ రాక్షసుడి తల నరికివేశాడు. అయితే అప్పటికే అమృతపానం చేయడం వలన తలా, మొండెమూ విడివిడిగా జీవంతో మిగిలాయి. ఆ శరీరభాగాలకే రాహుకేతువులని పేర్లు. సూర్యచంద్రులపై కోపంతో రాహుకేతువులు వారిని చంపడానికి చేసే ప్రయత్నమే గ్రహణమని పురాణాలు వివరిస్తున్నాయి.’’ అని చెప్పాడు.

ఆదిత్యదాసు, ‘‘వాస్తవానికి రాహుకేతువులు రాక్షసుని శరీరభాగాలు కావు. ఆ రెంటినీ ఛాయా గ్రహాలని అంటారు. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని మనకు కనిపించే గ్రహాలు. మనకు కనిపించనివి రాహు, కేతువులు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది కానీ సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తు న్నదన్న విషయాన్ని ఇదివరలోనే నేర్చుకున్నావు కదా! సూర్యుడు చరిస్తున్నట్లుగా కనిపిస్తున్న మార్గమూ, చంద్రుడు చరించే మార్గమూ ఒకే సమతలంలో లేవు. ఆ రెండు గ్రహాల కక్ష్యల మధ్య కోణం…’’ అని వివరించసాగాడు.

ఖగోళశాస్త్ర బోధన జరిగిపోతున్నది. తండ్రికీ, తనయుడికీ సమయం మీద ధ్యాస లేదు. పక్కనే ఉన్న వంటింటిలో పనిచేసుకుంటున్న గృహిణికి పాఠం వినబడుతున్నది. కొంతసేపటికి ఆమె వచ్చి ‘మధ్యాహ్న సంధ్యా సమయమైనద’ని గుర్తు చేసిన తరువాత, గురుశిష్యులిద్దరూ అతి కష్టం మీద పాఠాన్ని నిలిపి లేచారు.

*  *  *

భర్తకూ, కుమారునకూ భోజనం వడ్డిస్తున్న ఇంటి ఇల్లాలు ఛాయాదేవి, ‘‘గ్రహణాల గురించి మీరు పుత్రు నికి చెప్తూ ఉండగా విన్నాను. పురాణాలను కాదనడం దైవదూషణ కాదా?’’ అని అడిగినది.

ఆదిత్యదాసు ‘‘శాస్త్ర విజ్ఞానం భగవంతుని కాదనదు. సృష్టికారకుని దూషించే పనిని ఏ శాస్త్రవేత్తా చేయడు’’ అని అన్నాడు.

మిహిరుడు ‘‘నీడ ద్వారా గ్రహణమేర్పడే సమయంలోనే రాహుకేతువులు సూర్యచంద్రుల దగ్గరకు వచ్చి వారిని కబళించే విఫలయత్నం చేస్తార నుకుంటే ఇటు శాస్త్రాన్ని కాదన్నట్లూ కాదు, అటు పురాణాలు అసత్యమన్నట్ల్లూ కాదు’’ అని అన్నాడు.

‘‘కుమారా, ఒక తండ్రిగా నిన్ను పొగడరాదు. కానీ నీ జ్ఞానం, విజ్ఞానం, విశ్లేషణాశక్తీ నాకు ఆనంద దాయకములు, గర్వకారణములు.

‘‘పితృదేవుల కృప. మీ కుమారునిగా పుట్టడం, మీ దగ్గరే విద్యనభ్యసించగలగడం నా పూర్వ జన్మ సుకృతం.’’

మళ్లీ ఛాయాదేవి, ‘‘మహారాజుల చాటింపు విన్నారా?’’ అని అడిగింది. తండ్రీకొడుకులు ఆమె వంక ప్రశ్నార్థకంగా చూశారు.

‘‘మహారాజు గంధర్వసేనులు చైత్రపూర్ణిమ నాడు తన కుమారులు విక్రమాదిత్యులను పట్టాభిషిక్తులను చేయనున్నట్లుగా ప్రజలకు తెలియచేస్తూ చాటింపిం చారు. మన ఇంటి ముందు నుండే రాజభటులు వెళ్లిన సంగతిని మీరిరువురూ గమనించనే లేదు’’ అన్న ఛాయాదేవి, మళ్లీ తానే ‘‘విక్రమునకు పదునా రేండ్ల వయస్సు. అంత చిన్నవానికే రాజ్యభార మప్పగించడం ఏమిటో!’’ అని అన్నది.

ఆదిత్యవాసు ‘‘చిన్న వయస్సేమి? సకల శాస్త్ర పారంగతుడు, సమస్త శస్తాస్త్ర నిపుణుడు, సర్వ కళాకోవిదుడు. రాజ్యభారాన్ని చక్కగా వహింపగలడు’’ అని అన్నాడు.

‘‘రాజనీతిని మీ వద్దనే అభ్యసించినాడు కదా!’’

‘‘పంచతంత్రాన్ని కూడా వివరణాత్మకంగా చెప్పిన మాట వాస్తవమే. రాజనీతి శాస్త్రమంతటినీ నేను నేర్పలేదు’’ అన్న ఆదిత్యదాసు ‘‘కుమారా! నీవును రాజకుమారునితోపాటు విష్ణుశర్మ కృతమైన పంచతంత్రాన్ని పఠించినావు కదా?’’ అన్నాడు.

‘‘జనకుల కృపా విశేషం.’’

*  *  *

భోజనానంతరం ఆదిత్యదాసు విశ్రమిస్తుండగా మహారాజు వద్ద నుండి వార్తాహరుడు వచ్చి ‘‘విక్రమా దిత్యుల పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసి ఆశీ ర్వదించవలసినదిగా తమను అర్థిస్తున్నట్లుగా తెలియ చేయమని గంధర్వసేన ప్రభువులు నన్ను ఆజ్ఞాపిం చారు. మహారాజుల వానప్రస్థ దీక్షకు ఆశీర్వచ నాలనూ, వారి ప్రయాణానికి స్వస్త్యయనములనూ చెప్పవలసినదిగా వారి కోరక’’ అన్నాడు.

ఆదిత్యదాసు తాను తప్పక రాగలనని మహారాజుకు తెలియచేయమన్నాడు.

*  *  *

ఆనాటి సాయంత్రం మిహిరునకూ ఒక లేఖ అందింది. ‘‘మిత్రమా, నేను రాజ్యపాలన బాధ్యతను స్వీకరించే సమయంలో నీవు నా వెంట ఉండవల సినదిగా కోరుతున్నాను. సహాధ్యాయులమైన కార ణంగా మన మధ్య గాఢమైన మైత్రీ బంధమేర్పడింది. ముందునాటి రాత్రికే రావలసినదిగా ప్రాణ స్నేహితుడవైన నిన్ను అడుగుతున్నాను’’ అని విక్రమాదిత్యుడు స్వహస్తాలతో ఆ లేఖ రాశాడు.

లేఖాంశాలను తండ్రికి తెలియజేసి ఆయన అనుమతిని తీసుకున్న తరువాత మిహిరుడు విక్రమాదిత్యునికి తాను తప్పక రాగలనని ప్రత్యుత్తరం పంపించాడు.

మహారాజుల ఆహ్వానం, విక్రమాదిత్యుని లేఖా ఆదిత్యదాసుని ఆశ్చర్య పరచలేదు. కానీ కొంతవరకూ మనసు ఉద్విగ్నమయ్యేలా చేశాయి. గంధర్వ సేన మహారాజుకిది రెండవసారి వానప్రస్థ దీక్ష. గతంలో జరిగిన విషయాలు ఆదిత్యదాసు కనులముందు కదలాడాయి…

*  *  *

ఉజ్జయిని, అంబావతి అనే పేర్లు కూడా ఉన్న అవంతీనగరం భరతభూమిలోని సప్తనగరాలలో ఒకటి. ఆ నగరాన్ని ఏలుతున్నవారు పరమార వంశ స్థులు అగ్నివళీయులు. గుప్త సామ్రాజ్యం పతనమ య్యాక వాయవ్య దిశ నుండి శకుల దండ యాత్రలు అధికమయ్యాయి. వారి చేతిలో పరాజితు లైన పర మార రాజులు శ్రీశైలంలో భ్రమరాంబామల్లికార్జునుల సన్నిధిలో తలదాచుకున్నారు. ఆ వంశీయులు దగ్గర దగ్గరగా రెండు వందల సంవత్సరాలు రాజ్యభ్రష్టులు గానే ఉండిపోవలసి వచ్చింది. ఆపైన పరమారవంశ తిలకమనతగిన గంధర్వ సేనుడు శకులను జయించి, రాజ్యలక్ష్మిని చేపట్టి, ప్రజానురంజకంగా పాలించాడు. అతని కుమారుడే శంఖరాజు.

శంఖరాజు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, యుక్తవయస్కుడైన తరువాత గంధర్వసేనుడు పట్టం కట్టి, వానప్రస్థ దీక్షను స్వీకరించాడు. శంఖరాజు తండ్రివలెనే ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాడు. కానీ దురదృష్టమతనిని పట్టి పీడించింది. ఒకనాడు వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు గుర్రం మీద నుండి జారిపడిన సమయంలో గాయ మేర్పడింది. గాయం నయమైనప్పటికీ అతనికి సంతానం కలిగే యోగ్యత లేకుండాపోయింది. శంఖరాజు తండ్రికి విషయం చెప్పి•, అరణ్యంలో యోగ సాధనలో నిమగ్నుడై, బ్రహ్మరంథ్రం ద్వారా ప్రాణత్యాగం చేశాడు.

అట్టి విపత్కర పరిస్థితిలో గంధర్వసేనుడు వాన ప్రస్థ దీక్షను త్యజించి, గృహస్థ ధర్మాన్నీ, రాజ్య పాలననూ చేపట్టవలసి వచ్చింది. ఆయన సంతాన ప్రాప్తికై శివుని ప్రార్థించాడు. ఆయన తపఃఫలమో, అవంతీనగర ప్రజల పుణ్యమో, విక్రమాదిత్యుడనే పేరుతో ప్రసిద్ధుడైన కుమారుడు కలిగాడు. మహారాజులో భయాందోళనలు మొదలైనాయి. ఈ కుమారుడైనా పుత్రపౌత్రాభివృద్ధికరంగా వర్థిల్లాలని గంధర్వసేనుడు కోరుకొనడంలో ఆశ్చర్యం లేదు కదా!

*  *  *

చైత్ర శుక్ల చతుర్దశి. మరునాడు జరగబోయే పట్టాభిషేకానికై ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిహిరుడు సాయం సమయమయ్యేసరికి విక్రమా దిత్యుని మందిరానికి చేరుకుని, తన రాకను తెలియచేయమని ద్వారపాలకునికి చెప్పాడు. అతడు లోనికి వెళ్లి, వార్తను విన్నవించి, విక్రముని ఆనతిపై మిహిరుని లోనికి తీసుకుని వెళ్లాడు. యువరాజు నేలపై వ్యాఘ్రాజినం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆశ్చర్యంగా చూసిన మిహిరునితో అతడు ‘‘రేపు రాజ్యాభిషేకం కదా! నేడు ఏకభుక్తమూ, అధశ్శ యనమూ చేయాలి. భగవంతుని సన్నిధిలోనే సమయమంతా గడపాలి’’ అన్నాడు.

మిహిరుడతని ప్రక్కనే కూర్చున్నాడు.

‘‘రాజ్యమేలడమంటే భోగభాగ్యాలను అనుభవిం చడం కాదు. ప్రజాపాలనలో కష్టాలుండగలవు అన్నదానికి సూచన ఈ దీక్ష’’ అన్న విక్రమునితో మిహిరుడు ‘‘భరత•ండ రక్షణనూ, సనాతన ధర్మ పరిరక్షణనూ నీవు చేయగలవని జ్యోతిశ్శాస్త్రవేత్తలు నీ జనన సమయములోనే భవిష్యత్తుని సూచించారని మా జనకులన్నారు’’ అని చెప్పాడు.

‘‘మిహిరా! భవిష్యవాణి నేను చక్రవర్తిని కాగలనని కూడా సూచించినదట. ఆ వాణి మా జ్యేష్ఠ సోదరుల గురించి మా తండ్రిగారికి ఏమీ తెలియచేయలేదా? నాకు అన్నగారు ఉండేవారని వినడమే. ఆయన ప్రమాదం బారిన పడ•నేల? వారు సంతానము లేకనే మరణించనేల? మా తండ్రిగారు రాజ్యపాలనను తిరిగి చేపట్టనేల? జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ విషయమై ఏమందురో?’’

‘‘చరాచర జగత్తుని శాసించేది భగవంతుడే. మానవమాత్రులు కొంతవరకూ సూచించగలరు, కానీ శాసించగలరా? సాక్షాన్నారాయణావతారం శ్రీరామ చంద్రునికి పట్టాభిషేకం జరగవలసిన సమయంలో వనవాస దీక్షను పూనవలసిన స్థితి ఏర్పడలేదా? ఈ మధ్యనే చార్వాకుడొకడు మా తండ్రిగారితో ఈ విషయమై చర్చను ప్రారంభించ బోయాడు. జాతకచక్రంలో అయిదు గ్రహాలు ఉచ్చలో ఉన్న శ్రీరాముడు కష్టాలెందుకు అనుభవించవలసి వచ్చినదని ప్రశ్నించాడు.’’

విక్రమాదిత్యుడు కుతూహలంగా, ‘‘గురువర్యులేమన్నారు?’’ అన్నాడు.

‘‘మానవ జీవితం భోగాలనుభవించేందుకే ఉద్దేశించినదికాదు. కర్తవ్య నిర్వహణయే ముఖ్యం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ క్షత్రియ ధర్మాలు, ధర్మాచరణ అన్నిటికన్నా ముఖ్యమని మనుష్యకోటికి తెలియచేయడం తన మొదటి కర్తవ్యంగా శ్రీరామచంద్రుడు భావించాడు. సుఖాలను ఆయన కోరుకొనలేదు. ఈ సంగతిని జనకులు ఆ చార్వాకునికి విశదీకరించారు.’’

‘‘నా కర్తవ్య నిర్వహణలో భగవంతుడు నన్ను అనుగ్రహించునుగాక’’ అని విక్రముడు అక్కడ ఉన్న దేవతామూర్తులను సాష్టాంగ ప్రణామం చేశాడు.

కొంతసేపు మౌనం వహించిన విక్రముడు ‘‘ఈనాడు నా మనసులో ఆందోళన నెలకొని ఉంది. అందుకే నిన్ను రమ్మని కోరాను’’ అన్నాడు.

‘‘యువరాజా! మీకన్నా వయసులో, జ్ఞానంలో చిన్నవాడిని. తమరు సకల విద్యావిశారదులు, సమస్త కళాకోవిదులు.’’

‘‘ఇదేమి? ఆకస్మికంగా పిలుపు మారింది?’’

‘‘రేపటి నుంచి తాము ఉజ్జయినీ పాలకులన్న మాట మరువరాదు కదా!’’

‘‘అది బాహ్యలోకానికి మాత్రమే. నీవు నాకు నెచ్చెలివి. అత్యంత సన్నిహితుడివి. పంచతంత్ర గ్రంథాన్ని ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఆనాడే నీవంటి మిత్రుని పొందడంలోని లాభాన్ని గ్రహించాను. ఏ విషయాన్నైనా సమగ్రంగా విశ్లేషించి, సారాన్ని విశదీకరించగలిగిన శక్తి నీకు చిన్ననాడే అలవడింది’’ అని విక్రముడు మిహిరుని హస్తాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు.

మిహిరుడు విక్రమునితో ‘‘నీవంటి మిత్రుడు లభించడం నా అదృష్టం!’’ అన్నాడు.

*  *  *

విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడై నాలుగు సంవత్సరాలు గడిచినాయి. ఒకనాడు ఉదయ సంధ్యావందనమైన తరువాత ఆదిత్యదాసు కుమారునితో ‘‘నీ విద్యాభ్యాసం పూర్తయింది. ఇక విశేషాంశాలు నేర్చుకొనడానికి పాటలీపుత్రం, అటుపైన వారణాసికే వెళ్లడం అభిలషణీయం. వైద్యశాస్త్రంలోని కొన్ని రహస్యాంశములకు తక్షశిల మేలు’’ అన్నాడు.

అక్కడే ఉన్న ఛాయాదేవి ‘‘శిల్పశాస్త్ర మభ్యసింపవలదా?’’ అన్నది.

ఆదిత్యదాసు ‘‘శిల్పశాస్త్రం దేనికి? ధనార్జనకా?’’ అని ప్రశ్నించాడు.

విద్యాబోధన, వైద్యం, జ్యోతిషం వంటి వృత్తులలో ఉన్నవారు తమ వద్దకు వచ్చిన శిష్యుల నుంచి, రోగుల నుంచి, భవిష్యత్తు తెలుసుకోదలచిన వారి నుంచి ధనం స్వీకరించరాదన్నది ప్రాచీన భరతవర్షంలోని ధర్మం. శిల్పులు, భవన నిర్మాతలు, చిత్రకారులు, నాట్యవృత్తికారులు ధనార్జన చేయవచ్చును. ధనార్జన చేయగల ఏ విద్యనూ ఆదిత్యదాసు బోధించలేదు, మిహిరుడు నేర్చుకొనలేదు.

ఛాయాదేవి ‘‘నేనేనాడూ ధనాన్ని ఆశించ•లేదు. విశేషమైన భోగాలనూ, దాసదాసీ జనాన్నీ, వస్త్రాభరణాలనూ ఆశించలేదు. కుమారుడు భాగ్యవంతుడు కావాలని అనుకోవడంలో దోషమేమి?’’ అన్నది.

‘‘ఏమీ లేదు. మిహిరుడు తనకు నచ్చిన జీవన మార్గాన్నే ఎన్నుకొనునుగాక’’ సంభాషణ అప్పటికి ఆగిపోయినది.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram