– క్రాంతి

దీపావళి పండుగ జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. ఈ సంతోషకర వాతావరణంలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ఆలయం వద్ద తెల్లవారక ముందే భారీపేలుడు వినిపించింది. అయితే, అది సాధారణ టపాకాయ పేలుడు కాదు, ఆ ధాటికి రెండు ముక్కలైన కారులో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. పోలీసులు వచ్చి చూసి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పేలుడుగా ప్రకటించారు. కానీ ఘటనా స్థలిని పరిశీలించిన బీజేపీ నేత అణ్ణామలై అది ఉగ్రవాద చర్యగా గుర్తించారు. రెండేళ్ల క్రితం వరకూ ఆయన ప్రముఖ పోలీసు అధికారి, నేరాలను పసిగట్టడంలో ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తి. దీంతో ఇరకాటంలో పడ్డ పోలీసులు ఉగ్రవాద చర్యగా అంగీకరించడంతో పాటు నిందితులను గుర్తించి అరెస్టు కూడా చేశారు.

అక్టోబర్‌ 23.. ‌కోయంబత్తూరు ఉక్కడం ప్రాంతంలోని కొట్టై ఈశ్వరన్‌ ‌కోయిల్‌ (ఆలయం) ముందు ఉదయం నాలుగున్నర గంటల సమయంలో పాత మారుతి 800 కారు వచ్చి ఆగింది. క్షణాల్లోనే భారీ పేలుడు వినిపించింది. కారు రెండు ముక్కలైంది. దీంతో ఆ ప్రాంత ప్రజలంతా భయబ్రాంతులకు గురయ్యారు. దీపావళి (అక్టోబర్‌ 24) ‌ముందు రోజున హిందూ ఆలయం ముందు ఇంతపెద్ద పేలుడు జరగడం కోయంబత్తూరు సహా తమిళనాడు అంతటా ఆందోళన కలిగించింది. మరికొద్ది సేపట్లో ఆలయంలో పూజలు ఆరంభం కావాల్సిన సమయం.. కాస్త ఆలస్యంగా కారు పేలి ఉంటే భక్తులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడి ఉండేవారు. అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఆ ప్రాంతాన్ని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు, కోయంబత్తూరు పోలీస్‌ ‌కమిషనర్‌ ‌బాలకృష్ణన్‌ ‌సందర్శించారు. మరణించిన వ్యక్తి 25 ఏళ్ల జమేషా ముబిన్‌ అని గుర్తించారు. అయితే, మొదట ఎల్‌పీజీ సిలిండర్‌ ‌పేలడంతో అతను మరణించాడని డీజీపీ ప్రకటించారు. ఆ తర్వాత అది ఉగ్రవాద కుట్ర అని తేలిపోయింది.

హిందువుల పవిత్ర పండుగ దీపావళి రోజున ఆలయం ముందు భారీ పేలుడు, అందులో ఇతర మతానికి చెందిన వ్యక్తి ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. అసలేం జరిగిందో తెలియక కోయంబత్తూరు నగరమంతా ఉద్రిక్తంగా మారిపోయింది. రెండేళ్ల క్రితం వరకూ దేశంలోనే ప్రముఖ ఐపీఎస్‌ అధికారిగా గుర్తింపు పొంది, ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా పనిచేస్తున్న అణ్ణామలై కొట్టై ఈశ్వరన్‌ ‌కోయిల్‌కు రావడంతో ఈ కేసు మలుపు తిరిగిందని చెప్పాలి.

అణ్ణామలై అనుమానంతో కేసులో కదలిక

పేలుడు జరిగిన ఈశ్వరన్‌ ‌కోయిల్‌ ‌పరిసరాల్లో చెల్లాచెదురైన చిన్న చిన్న మేకులు, అల్యూమినియం ముక్కలు, ఐరల్‌ ‌బాల్స్ ‌కనిపించాయి. వీటిని జాగ్రత్తగా గమనిస్తే కుట్ర కోణం తేలికగానే అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇది సాధారణ గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పేలుడు కాదని, ఉగ్రవాద చర్య అని ఆరోపించారు బీజేపీ నేత అణ్ణామలై.. దీని వెనుక ఐసిస్‌ ఉం‌డొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి దర్యాప్తు లేకుండానే సిలిండర్‌ ‌పేలుడు అని పోలీసు అధికారులు ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు. డీఎంకే ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. అణ్ణామలై ఆరోపణలతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దర్యాప్తులో ఊహించినట్లు గానే అనేక సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో మరణించిన జమేషా ముబిన్‌ అమాయకుడేం కాదని స్పష్టమై పోయింది. కుట్ర పూరితంగానే కారును ఆలయం దగ్గర నిలిపాడని గుర్తించారు. ముబిన్‌ ‌కారు దిగి బయటకు వచ్చి దూరంగా వెళ్లి రిమోట్‌ ‌ద్వారా పేల్చేందుకు పథకం రూపొందించినట్లు స్పష్టమవు తోంది. అయితే, ఆయన కారు దిగేలోపే పేలి పోవడం, ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. ముబిన్‌ ‌నేర చరిత్ర పోలీసులకు ముందే తెలిసి ఉండటంతో కొద్ది గంటల్లోనే దర్యాప్తు, అరెస్టులు జరిగిపోయాయి. ఏడీజీపీ తమరై కణ్ణన్‌, ఇం‌టెలిజెన్స్ ఐజీ సెంథిల్‌ ‌వేలన్‌ ఈ ‌ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల అరెస్ట్

ఇం‌జనీరింగ్‌ ‌పట్టభద్రుడైన జమేషా ముబిన్‌తో పాటు కొందరు వ్యక్తులు మూడేళ్ల క్రితం ఉగ్రవాద కార్యకలాపాల శిక్షణ కోసం కేరళ వెళ్లినట్లు తెలుస్తోంది. వీరికి ఐసిస్‌తో సంబంధాలున్నాయని ఆరోపణ లున్నాయి. 2019లో కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు జమేషా ముబిన్‌ను అదుపు లోకి తీసుకున్నారు. అయితే ఆధారాలు దొరకకపోవడంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండా వదిలేశారు. కోయంబత్తూరు పోలీస్‌ ‌కమిషనర్‌ ‌బాలకృష్ణన్‌ ఈ అం‌శాన్ని నిర్ధారించారు. విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తప్పించుకున్న ముబిన్‌ ఇప్పుడు శివుడి ఆలయం ముందే సజీవ దహనం అయ్యాడు.

పక్కా ప్రణాళికతో..

జమేషా ముబిన్‌ ఇం‌టి నుండి అక్టోబర్‌ 22‌న రాత్రి 11:25 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు ఓ గోనె సంచిని కారులో ఎక్కించారని పోలీసులు గుర్తించారు. వీరిలో ముబిన్‌ ‌కూడా ఉన్నాడు. ఆయన నివాసంలో 50 కిలోల పొటాషియం నైట్రేట్‌, అల్యూమినియం ఫౌడర్‌, ‌సల్ఫర్‌, ‌బొగ్గు, ఫ్యూజ్‌ ‌వైర్‌తో పాటు 7-వోల్ట్ ‌బ్యాటరీ, ఇతర పేలుడు పదార్థాలు లభించాయి. దర్యాప్తులో భాగంగా ముబిన్‌తో పరిచయం ఉన్న ఏడుగురిని పోలీసులు ప్రశ్నించారు. నీలగిరి కూనూర్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మృతుని కాల్‌ ‌డేటా ఆధారంగా మహమ్మద్‌ ‌తల్కా (25), మహమ్మద్‌ అజారుద్దీన్‌ (25), ‌మహమ్మద్‌ ‌రియాజ్‌ (27), ‌ఫిరోజ్‌ ఇస్మాయిల్‌ (27), ‌మహమ్మద్‌ ‌నవాజ్‌ ఇస్మాయిల్‌ (27)‌లను చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద అరెస్ట్ ‌చేసినట్లు తెలిపారు. వీరి నుంచి మరికొంత సమాచారం రాబట్టారు. ఆరో వ్యక్తి, మృతుడి బంధువు అప్సర్‌ఖాన్‌గా గుర్తించారు. అతన్ని అక్టోబర్‌ 30‌న అరెస్టు చేశారు.

భారీ ‘ఉగ్ర’కుట్ర

నిందితులు కోయంబత్తూరులోని మరో మూడు ఆలయాల దగ్గర కూడా పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. కోనియమ్మన్‌ ఆలయం, కోట్టైమేడు సంగమేశ్వరాలయం, పులియకుళం వినాయకర్‌ ఆలయంతో పాటు రేస్‌ ‌కోర్స్, ‌విక్టోరియా హాల్‌, ‌రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాలు వీరి జాబితాలో ఉన్నాయని తెలిపారు. మూడు ఆలయాల దగ్గర సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ముబిన్‌ అతడి అనుచరులు ద్విచక్రవాహనాలపై తిరుగుతూ కనిపించారు. దీంతో వీరు భారీ కుట్రకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. ఈ ఘటన తర్వాత పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

శ్రీలంక పేలుళ్లతో సంబంధాలు!

ఈ పేలుడు ఘటనలో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 2019లో శ్రీలంక బాంబు పేలుళ్లతో దీనికి లింకులు కనిపిస్తున్నాయి. ముబిన్‌ ‌పేలుడుకు రెండు రోజుల ముందు కేరళలోని త్రిసూర్‌ ‌జైల్లో ఉన్న అజారుద్దీన్‌ అనే వ్యక్తిని కలిసినట్టు సమాచారం. లంక బాంబు పేలుళ్ల కేసులో అజారుద్దీన్‌ ‌నిందితుడిగా ఉన్నాడు. శ్రీలంక దాడులకు సూత్రధారి అయిన ఇస్లాం మతాధికారి జహ్రాన్‌ ‌హషీమ్‌కు కూడా ముబిన్‌ ‌ఫేస్‌బుక్‌ ‌ఫ్రెండ్‌. 2019‌లో శ్రీలంక పేలుళ్లపై భారత్‌లో దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఏ అల్‌-ఉమ్మాతో పాటు తౌహీద్‌ ‌జమాత్‌ ‌సంస్థల పాత్రపై అనుమానాలు వ్యక్తంచేసింది. ఆ కేసులో జమీషా ముబిన్‌ను కూడా ప్రశ్నించింది. 1993లో చెన్నైలోని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యాలయం వద్ద పేలుడు ఘటనతోనూ వీరికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీలంకలో ఈస్టర్‌ ‌రోజున జరిగిన పేలుళ్ల తరహాలోనే కోయంబత్తూరులోనూ కుట్ర పన్నినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు కొద్ది రోజుల ముందు కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయం మీద పెట్రోల్‌ ‌బాంబులతో దాడి జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 23‌న ఇదే నగరంలోని చిట్టపుదూర్‌ ‌ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయంతో పాటు టౌన్‌ ‌హాల్‌ ‌వద్ద వస్త్ర దుకాణంపైనా దాడి చేశారు. అయితే, వీటి వెనుక ఎవరి హస్తం ఉందో ఇంకా తేలలేదు.

వాట్సాప్‌లో కీలక సమాచారం

పేలుడు నేపథ్యంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి ముబిన్‌ ఇం‌ట్లో, అల్‌-ఉమ్మా సంస్థకు చెందినవారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహిం చారు. అల్‌-ఉమ్మా చీఫ్‌ ‌సయ్యద్‌ అహ్మద్‌ ‌బాషా సోదరుడు నవాబ్‌ఖాన్‌ ఇం‌ట్లో కూడా సోదాలు చేశారు. కోయంబత్తూరులో 1998లో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినవారిలో ఈ నవాబ్‌ ఒకడు. ప్రస్తుతం ఇతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. నవాబ్‌ ‌కుమారుడు మహమ్మద్‌ ‌డల్గాను పోలీసులు ప్రశ్నించారు. ముబిన్‌ ‌తన మరణానికి ముందు పోస్ట్ ‌చేసిన వాట్సాప్‌ ‌స్టేటస్‌లో ‘నా మరణవార్త మీకు చేరితే, నా పొరపాట్లను క్షమించండి. నా లోపాలను దాచిపెట్టండి. నా కోసం ప్రార్థించండి’ అని ఉందని పోలీసులు తెలిపారు.

కోయంబత్తూరు పేలుడు ఘటనపై తమిళ నాడులో రాజకీయం దుమారం చెలరేగింది. ఇది ఉగ్రవాద చర్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అణ్ణామలై, ప్రతిపక్ష నేత పళనిస్వామి విమర్శలు, తర్వాత వెలుగు చూసిన వాస్తవాలతో స్టాలిన్‌ ‌ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పోలీసులు చురుగ్గా పనిచేయడం లేదు కాబట్టి కేసుపై ఎన్‌ఐఏ ‌దర్యాప్తు కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాసినట్లు అణ్ణామలై ప్రకటించారు. స్టాలిన్‌ ‌తన వైఫల్యాల నుంచి దాక్కోవడం మానేసి బయటకు రావాలన్నారు. ఈ ఘటన పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ ‌విభాగం పనితీరులో లోపాన్ని ఎత్తి చూపుతోందని పళనిస్వామి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది ప్రభుత్వం. మరోవైపు ఈ పేలుళ్ల ఘటనపై అధికార డీఎంకే క్షుద్ర రాజకీయం చేస్తోంది. ఎన్‌ఐఏ ‌మొదట ప్రశ్నించాల్సింది అణ్ణామలైని అని వ్యాఖ్యానించారు ఆ పార్టీ నేత, మంత్రి సెంథిల్‌ ‌బాలాజీ. అయనకు ముందుగానే సమాచారం ఉందని, పోలీసుల కన్నా ముందుగానే ఎలా బయటపెట్టారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల్ని బీజేపీ గట్టిగానే తిప్పికొట్టింది.

——————————————————————–

ఉ‌గ్రవాదుల అడ్డా కోయంబత్తూరు

కోయంబత్తూరు పేలుళ్ల పేరు వినగానే ఇక్కడి ఉగ్రవాద ఘటనలే ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. తమిళనాడులో రెండో అతిపెద్ద నగరమైన దీన్ని కోవై అని కూడా పిలుస్తారు. పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఉన్న ఈ నగరం దక్షిణ భారత మాంచెస్టర్‌గా ప్రసిద్ధి. కేరళను ఆనుకొని ఉన్న ఈ నగరాన్ని ఉగ్రవాదులు చాలా కాలంగా స్థావరంగా మార్చుకున్నారు. గతంలో కూడా ఎన్నో పేలుళ్ల ఘటనలు ఇక్కడ చోటుచేసుకున్నాయి.

1998 ఫిబ్రవరి 14న కోయంబత్తూరులో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఆరోజు నగరంలోని మొత్తం 11 ప్రాంతాల్లో 12 పేలుళ్లు సంభవించాయి. 58 మంది మరణించారు. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు, రెగ్జిన్‌ ‌బ్యాగ్‌లల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఆ రోజున బీజేపీ అప్పటి జాతీయ అధ్యక్షుడు లాల్‌కృష్ణ అద్వానీ అక్కడ భారీ ర్యాలీ జరిపి ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణించిన విమానం గంటన్నర ఆలస్యంగా రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అద్వానీ లక్ష్యంగా జరిగిన ఈ దాడులకు ఉగ్రవాదులు ‘ఆపరేషన్‌ అల్లాహు అక్బర్‌’ అని పేరు పెట్టుకున్నారు. తాజా పేలుడు కేసులో అరెస్టయిన అయిదుగురిలో ఒకరైన మహమ్మద్‌ ‌తల్కా 1998 నాటి వరుస పేలుళ్ల సూత్రధారి, నిషేధిత అల్‌-ఉమ్మా వ్యవస్థాపకుడైన సయ్యద్‌ ‌బాషా రక్తసంబంధీకుడే. నాటి పేలుళ్ల కేసులో మొదటి నిందితుడు సయ్యద్‌ అహ్మద్‌ ‌బాషాకు జీవిత ఖైదు విధిస్తూ 2003లో తీర్పు వెలువడింది. అల్‌-ఉమ్మా చీఫ్‌ ‌సయ్యద్‌ ‌బాషా సోదరుడు నవాబ్‌ ‌ఖాన్‌ ‌సైతం నాటి పేలుళ్ల కేసులో ప్రధాన పాత్రధారి. నవాబ్‌ ‌ఖాన్‌కు 27 ఏళ్ల కఠిన కారాగారవాస శిక్ష విధించారు. మహమ్మద్‌ ‌తల్కా ఇప్పుడు దారుణకృత్యాలు చేయడంలో సయ్యద్‌ ‌బాషా పంథాను అనుసరించినట్లు తెలుస్తోంది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram