– సుజాత గోపగోని, 6302164068

ఈ రాష్ట్రంలో హిందువులు నిర్వహించుకునే పండుగలు, వేడుకలపై ఏదో ఒక రకంగా దాడి జరుగుతూనే ఉంది. అపశ్రుతులు దొర్లుతూనే ఉన్నాయి. అయితే, ఇవి అనుకోకుండా జరిగేవి కావు, పనిగట్టుకొని హిందూధర్మంపై అక్కసును వెళ్లగక్కుతున్నవే ఇవన్నీ. ఈ తీరు రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు హిందూ సంఘాలను, ఆధ్యాత్మిక వాదులను, మేధావులను, అందరినీ కలచివేస్తున్నాయి. ఈ ఘటనల పట్ల అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అంతా అయ్యాక ఏదో కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో ఘటనలు పక్కనపెడితే.. ఈ యేడాది చోటు చేసుకున్న దుర్ఘటనలే చూస్తే.. హిందువులు జరుపుకునే దాదాపు ప్రతి పండుగకూ ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా ఆ స్ఫూర్తిని దెబ్బతీసే ఘటనలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశం, లౌకిక రాజ్యం అన్న భావన కేవలం ఆలోచనలకు, పుస్తకాల్లో చదువుకునేందుకే పరిమితమన్న విమర్శలు వస్తున్నాయి. ఆచరణలో వీటిని ఎవరూ లెక్క చేయడం లేదన్న భావనకు జరుగుతున్న వరుస సంఘటనలే సాక్ష్యం.

ఈ యేడాది వినాయక నవరాత్రోత్సవాల సమయంలో సాక్షాత్తూ తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన వైఖరి.. గణేష్‌ ‌మంటపాల ప్రతినిధులు, హిందూ సంఘాలు, చివరకు విపక్షాలు సైతం కన్నెర్రజేసేలా సాగింది. తర్వాత దేవీ శరన్నవరాత్రోత్సవాల సమయంలోనూ తీవ్ర కలకలం చెలరేగింది. హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీలో ఏకంగా ఇద్దరు ముస్లిం మహిళలు కత్తులు, సుత్తెలతో విరుచుకుపడ్డారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ అపచారం జరగలేదు. విగ్రహం కాస్త దెబ్బతిన్నది. స్థానికులు గమనించి వెంటపడటంతో ఆ మహిళలు ఎట్టకేలకు దొరికారు. అయితే, ప్రతిఘటించిన ఓ బాలుడి మీద అప్పటికే వారి ప్రతాపం చూపించారు.

తాజాగా దీపావళి పర్వదినాన కూడా హిందువులకు కలతను మిగిల్చేలా చేసిందో క్రిస్టియన్‌ ‌కుటుంబం. ఏకంగా దీపాలను కాలితో తన్నారు. చెప్పులు చూపించారు. ఇష్టం వచ్చినట్లు దూషించారు. దీపావళి పండుగ చేసుకోవొద్దంటూ ఓ హిందూ కుటుంబాన్ని బెదిరించారు. దీంతో, ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుందామనుకున్న ఆ కుటుంబ సభ్యులు బిక్కచచ్చిపోయారు. ఈ దుర్మార్గం జరుగుతున్న సమయంలో అక్కడున్న వాళ్లు వీడియో రికార్డ్ ‌చేశారు. క్రిస్టియన్‌ ‌కుటుంబం ఆగడాలను, వాళ్లు రెచ్చిపోయిన తీరును, దూషణలను, దీపాలను కాలితో తన్నిన దృశ్యాలను, చెప్పులు చూపించి బెదిరించిన వ్యవహారం మొత్తాన్ని వీడియో తీశారు. అది దీపావళి రోజున సోషల్‌ ‌మీడియాలో వైరలయింది. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్‌ ‌హిందూ సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది.

హిందువుల ప్రధాన పండుగ దీపావళి.. నోములు, వ్రతాలు నోచుకునే పర్వదినం. దీపాలతో భువిని కాంతులీనేలా చేసే వేడుక. అలాంటి దీపావళిని కూడా హేళన చేసేలా ఒక వర్గం వారు ప్రవర్తించారు. దీపాలలో దేవుళ్లను చూసుకునే హిందూ కుటుంబంపై అక్కసు వెళ్లగక్కారు. అసలు దీపాలే వెలిగించొద్దంటూ హుకుం జారీచేశారు.

మరోచోట… ఏదైనా వివాదం ఎదురైతే సర్దిచెప్పాల్సిన, సామరస్యం నెలకొల్పాల్సిన రాజకీయ నాయకుడే దీపావళి పండుగపై కక్ష గట్టాడు. అది కూడా అధికార పార్టీ నాయకుడు, వార్డు కౌన్సిలర్‌ ‌భర్త. దీపావళి బాంబులు కాల్చుకుంటున్న వాళ్లపై దాడికి దిగాడు, ఆ నేత. ఇక్కడ కూడా సీసీ కెమేరాల్లో

ఆ అరాచకం అంతా రికార్డయ్యింది.

పై రెండు సంఘటనలూ హైదరాబాద్‌లోనే చోటు చేసుకున్నాయి. అవి కూడా ఆధారాలు దొరికిన సంఘటనలు. పోలీసులకు చేరిన ఫిర్యాదులు మాత్రమే. ఇంకా బయటకు రాని.. హిందువులను భయపెట్టిన ఘటనలు ఎన్ని జరిగాయో! హిందూ పండుగలే లక్ష్యంగా చోటు చేసుకుంటున్న ఈ దాడులపై యావత్‌ ‌హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పదే పదే.. మన పండుగలను కించపరిచే సంఘటనలు, ఉత్సవాలను వెక్కిరించేలా సాగుతున్న

ఈ పరిణామాలపై అందరూ కలత చెందుతున్నారు.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అర్చన అపార్ట్‌మెంట్‌లో చాలా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దీపావళి నాడు… ఓ హిందూ కుటుంబం తమ గుమ్మం ముందు దీపాలు వెలిగించుకుంది. అయితే, ఎదురు ఫ్లాట్‌లో నివాసం ఉన్న క్రైస్తవ కుటుంబం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఏంటీ న్యూసెన్స్’ అం‌టూ ఎదురింటి మహిళ ప్రశ్నించింది. మా ఇంటిముందే దీపాలు పెట్టుకున్నాం కదా.. అన్నందుకు ఆ మహిళ కోపంగా వచ్చి దీపాలను కాలితో తన్నేసింది. తాము టపాసులు కాల్చలేదని, కేవలం దీపాలు వెలిగించుకున్నామని ప్రాధేయపడినా కనికరించలేదు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది. పక్కనే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు ఈ గొడవలోకి రంగప్రవేశం చేశారు. ‘నాటకాలు చేస్తున్నార్రా.. చీరేస్తాం ఒక్కొక్కడ్ని ఏమనుకుంటున్నారో..’ అంటూ బెదిరించారు. దీంతో భయాందోళనలకు గురైన బాధిత హిందూ కుటుంబం.. నిశ్శబ్దంగా ఉండిపోయింది.

అయితే.. ఈ గొడవంతా ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ ‌చేశారు. దాన్ని ట్విటర్‌లో పోస్టు చేశారు. హైదరాబాద్‌ ‌పోలీస్‌, ‌తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీఆర్‌కు దాన్ని ట్యాగ్‌ ‌చేశారు. ‘పండుగ రోజున ఓ హిందూ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ప్రశాంతంగా దీపాలు పెట్టుకుని పండుగ చేసుకుంటున్న ఆడపిల్లలపై కూడా దుర్భాషలాడుతూ.. కయ్యానికి కాలు దువ్వారు, కొందరు. కాలితో దీపాలని తన్నేసి, చెప్పులని చూపించారు. ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం’ అని ట్వీట్‌ ‌చేశారు. ఈ ఘటనపై బాధిత హిందూ కుటుంబం కూడా పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్‌, ‌భజరంగదళ్‌ ‌ప్రతినిధులు, కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత హిందూ కుటుంబానికి మేమున్నామంటూ భరోసా కల్పించారు.

అదే రోజున మేడ్చల్‌ ‌రంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ‌నాయకుడు చేసిన దౌర్జన్యం కూడా చర్చనీయాంశం అయ్యింది. పండుగ పూట అందరితో సహృదయంతో నడుచుకోవాల్సింది పోయి గొడవకు దిగాడు. మేడ్చల్‌ ‌మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్‌ ‌మాధవి భర్త సాటే నరేందర్‌. ‌తన ఇంటి పక్కన నివాసముంటున్న మోహన్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డాడు. మోహన్‌రెడ్డి ఇంట్లో కాల్చిన టపాసులు తన ఇంట్లో పడ్డాయనే కోపంతో అనుచరులతో కలిసి దాడి చేశాడు. ఆయన అనుచరులు ఇంట్లోకి చొరబడి మహిళలపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారని బాధితుడు మోహన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడ్చల్‌ ‌పోలీసులు నరేందర్‌, అతని అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరేందర్‌ అరాచకం కూడా అక్కడున్న సీసీ కెమేరాల్లో రికార్డయ్యింది. ఆ ఫుటేజ్‌ ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు.

హిందువులను ప్రశాంతంగా, సంతోషంగా పండుగలను జరుపుకోనివ్వకుండా సాగుతున్న ఇలాంటి దుశ్చర్యలపై అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. హిందువులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. అన్నిమతాల వాళ్లూ కలిసి మెలిసి జీవించే హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram