– డా. రామహరిత

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. గతంలో మాదిరిగానే ఆయన ఈసారి కూడా కేదారేశ్వరుడి దర్శనానికి వచ్చారు కదా, ఇందులో వింతేముందని భావించడం సహజం. కానీ ఈసారి కేదార్‌నాథ్‌ ‌పర్యట నలో ఎవరూ గుర్తించని విషయం ఒకటుంది! అదే ఆయన వస్త్రధారణ! ఆయన ధరించిన ‘చోలాధోరా’కు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే హిమాచల్‌‌ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతం ‘చంబా’ గ్రామానికి చెందిన ఒక మహిళ స్వయంగా చేత్తో కుట్టిన ఈ ‘చోలాధోరా’ను శీతల ప్రాంతంలో ధరించడం ద్వారా ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా ఆయన ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంత వాసులతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి ప్రస్ఫుటం చేశారు.

ఆయన ధరించిన ‘చోలాధోరా’ వెనుక భాగంలో కుట్టిన ఎంబ్రాయిడరీ డిజైన్‌కూ ఒక ప్రత్యేకత ఉంది. మధ్యభాగంలో ‘స్వస్తిక్‌’ ‌చిహ్నం, దానికి ఇరువైపులా నెమలి పింఛాలు అందిస్తున్న ఒక ప్రత్యేక సందేశాన్ని ఇక్కడ గుర్తించాలి. గతంలో పశ్చిమ దేశాలకు చెందిన మేధావులు ఈ స్వస్తిక్‌ ‌చిహ్నాన్ని ‘హాక్రె‌కెయిజ్‌’ (‌రెండో ప్రపంచయుద్ధ కాలంలో నాజీ సైనికులు చేతులకు బ్యాడ్జ్‌గా ధరించేవారు. దీన్నే ‘హుక్డ్ ‌క్రాస్‌’ అని పిలిచేవారు) అంటూ తీవ్రస్థాయిలో తప్పుడు ప్రచారం చేశారు. అత్యంత పవిత్రంగా భావించే ఈ ‘స్వస్తిక్‌’ ‌చిహ్నాన్ని దోషీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని హిందువులు తీవ్ర పోరాటమే చేశారు. ఈ స్వస్తిక్‌ ‌చిహ్నమున్న వస్త్రాన్ని ధరించడం ద్వారా, ద్వేషానికి చిహ్నమంటూ చేసిన దుష్ప్రచారం తప్పని మోదీ ప్రపంచానికి విస్పష్టంగా వెల్లడించారనే చెప్పాలి.

‘హిందూత్వ’, ‘హిందూయిజం’ల మధ్య తప్పుడు వ్యత్యాసాన్ని కల్పించి ప్రచారం చేస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ‘హిందూఫోబియా’ పేరుతో హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. హైందవం ప్రపంచానికి చేసిన మేలును గుర్తిస్తూ అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్‌, ‌ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఓహియో, మసాచుసెట్స్‌ల్లో అక్టోబర్‌ ‌నెలను ‘హిందూ వారసత్వ మాసంగా’ పాటించడం ఇక్కడ గుర్తించాల్సిన అంశం. దీపావళి పండుగ సందర్భంగా న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇదే సమయంలో హిందూ వ్యతిరేక, ముస్లిం అనుకూల ‘టీనెక్‌ ‌డెమోక్రటిక్‌ ‌మున్సిపల్‌ ‌కమిటీ’ (టీడీఎంసీ) హిందూఫోబియా వేగంగా పెరిగిపోతున్నదంటూ హెచ్చరించడమే కాదు, ఏకంగా ఒక తీర్మానమే చేసింది (అయితే ఈ తీర్మానాన్ని న్యూజెర్సీ డెమోక్రటిక్‌ ‌స్టేట్‌ ‌కమిటీ ఖండించింది). ఈ స్థాయిలో బెదిరింపులు, హెచ్చరికలు కొనసాగుతున్నప్పటికీ అమెరికా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం నిరుత్సాహం కలిగిస్తోంది. ప్రస్తుత భారత్‌ను పాలిస్తున్నది ‘హిందూ జాతీయవాద ప్రభుత్వం’ అంటూ చేసే శ్లేష వ్యాఖ్యల పట్ల, ఈ దేశంలోని మెజారిటీ వర్గమైన హిందువులూ అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు దేవాలయాలు, హిందూ ధార్మిక సంస్థల హక్కుల పరిరక్షణకు ఒక బలమైన చట్టాన్ని అమల్లోకి తేవడంలో కేంద్ర ప్రభుత్వ జాప్యం కూడా హిందువుల్లో నిరాశకు కారణమవుతోంది. రాజ్యాంగ పరమైన పరిష్కారాలకు యత్నించకుండా ప్రధాని నరేంద్ర మోదీ ‘సరికొత్త భారత్‌’ ‌పైనే దృష్టి కేంద్రీకరించి అడుగులు వేయడమూ ప్రశ్నార్థమవుతుంది.

కానీ తరచి చూస్తే యోగాను భారతీయ విజ్ఞాన వ్యవస్థగా అంతర్జాతీయీకరించడం మోదీ తను తొలి విడత అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దిశగా వేసిన మొదటి అడుగు. ఇక రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళుతోంది. ఇందులో భాగంగానే మార్చి 19, 2019న మోదీ ‘కాశీ విశ్వనాథ్‌ ‌మందిర విస్తరీకరణ, సుందరీకరణ యోజన’కు శంకుస్థాపన చేయడం ద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇతర ప్రాంతాల్లో ఇదే మాదిరి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఇది ఒక నమూనాగా ఉండటమే కాదు, కాశీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది’ అన్నారు. రెండేళ్ల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్‌ను నవీకరించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘విశ్వనాథ ధామ్‌ ఆలయ భవనాలు మాత్రమే కాదు, భారతీయ సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మిక ఆత్మకు, భారతీయ ప్రాచీనత్వానికి, శక్తికి, గతిశీలతకు ఒక గొప్ప చిహ్నం. ప్రాచీన స్ఫూర్తి భవిష్యత్తుకు ఏ విధంగా మార్గదర్శనం చేస్తున్నదో ఇక్కడ మనం గమనించవచ్చు’ అన్నారు.

మూలాధార స్ఫూర్తి, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని తీసుకురావాలన్న కాంక్ష, మోదీ మాటల్లో స్పష్టమయ్యాయి. 2020, ఆగస్ట్‌లో అయోధ్యలో రామమందిర శంకుస్థాపన సందర్భంగా కూడా మోదీ సరిగ్గా ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. ‘శతాబ్దాల తరబడి విధ్వంసం, పునరుద్ధరణ అనే పురాతన చక్రీయ- శృంఖలాల నుంచి రామ జన్మభూమికి విముక్తి లభించింది. ఈ ఆలయం మనలో శాశ్వతంగా నిలిచిన విశ్వాసానికి చిహ్నం. మనలోని జాతీయ భావానికి ఇది సంగ్రహ రూపం. లక్షలాది దేశవాసుల సామూహిక ఆత్మశక్తికి ఇది చిహ్నం. భావితరాలకు మనలోని విశ్వాసం, భక్తి, నిశ్చయాత్మకతను తెలియజేసి, ఈ ఆలయం వారిలో స్ఫూర్తిని నింపుతుంది’ అన్నారు.

ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాధాన్యం కలిగిన ఈ ప్రదేశాల ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరింపజేయడానికి చేసే సుస్థిర యత్నాలను చూస్తుంటే, కచ్చితమైన రాజకీయ ప్రయోజనం కలుగుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. 2021లో కేదార్‌నాథ్‌లో జగద్గురు ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. నిజానికి 2013లో సంభవించిన ఘోరమైన వరదల్లో కేదార్‌నాథ్‌ ‌ధ్వంసమైంది. వేలాదిమంది ఆ వరదల్లో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేదార్‌నాథ్‌కు 2013 ముందునాటి వైభవాన్ని తిరిగి తీసుకురావాలన్న దృఢనిశ్చయం మోదీలో స్పష్టంగా కనిపించింది. జగద్గురు శంకరాచార్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడికి వచ్చే యాత్రికులు, భక్తులు.. నిజంగా ఈ కేదార్‌నాథ్‌ ‌తిరిగి మామూలు స్థాయికి చేరుతుందా? అన్న అనుమానం వ్యక్తం చేసేవారు. అయితే గతంలో కంటే మరింత సమున్నత స్థాయిలో కేదార్‌నాథ్‌ ‌సగర్వంగా నిలబడగలదని, నా అంతరంగం స్పష్టం చేసింది’ అన్నారు. సనాతన ధర్మానికి పూర్వవైభవం తీసుకొచ్చిన జగద్గురు శంకరాచార్య విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా, నరేంద్రమోదీ ఆ సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేయడమే కాకుండా, ఈ జ్యోతిర్లింగానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు యత్నించారనే చెప్పాలి. కేదార్‌నాథ్‌కు ఆధ్యాత్మిక యాత్ర జరపడం, అక్కడి గుహలో ఒక రాత్రి ధ్యానంలో గడపడాన్ని గమనిస్తే, ఆయనలో ఉత్తరదాయిత్వంగా వచ్చిన దృఢమైన హిందువు కనిపిస్తాడు.

మోదీ వ్యతిరేకులైన చాలామంది రాజకీయ విశ్లేషకులు కనిపించే ఈ వాస్తవాలను కేవలం ప్రతీకాత్మకంగా పరిగణించడం సహజమే. కానీ మోదీ మెల్లగా భారత్‌కు సంపూర్ణ గుర్తింపును తీసుకురావడానికి, ఇదే సమయంలో ఆర్థికాభివృద్ధి, ఆధునిక రంగాల్లో శిఖరస్థాయికి చేర్చడానికి యత్నిస్తున్నారన్నది కనిపిస్తున్న సత్యం. ఎంతోమంది నాయకులు సనాతన ధర్మానుయాయులుగా గుర్తింపు పొందడానికి ఇష్టపడరు. కానీ నరేంద్ర మోదీ తన వస్త్రధారణలోనే మతాన్ని ప్రస్ఫుటింపజేస్తూ, దాని పరిపూర్ణతపై దృఢమైన విశ్వాసంతో గట్టిగా నిలబడి ముందుకు సాగుతున్నారు.

గుజరాత్‌, ‌పవాగఢ్‌లో పునరుద్ధరణ పూర్తయిన కాళీమాత దేవాలయ పతాకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది జూన్‌లో ఆవిష్కరించారు. గతంలో ఈ దేవాలయంపైనే దర్గా ఉండటంతో గత 500 ఏళ్లుగా, కాళీమాత ఆలయం ఏవిధమైన మరమ్మత్తులకు నోచుకోక అట్లాగే ఉండిపోయింది. అయితే ఇరు వర్గాల ఏకాభిప్రాయంతో దర్గాను మరో చోటుకు తరలించి, దేవాలయానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. ఆలయంలో పతాకావిష్కరణ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ‘గత ఐదు శతాబ్దాలుగా ఆలయ శిఖరంపై పతాకం ఎగురలేదు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల కాలంలో కూడా ఇది జరగలేదు. కానీ ఐదు శతాబ్దాల తర్వాత నేడు పవాగఢ్‌ ఆలయ శిఖరంపై పతాకం రెపరెపలాడుతోంది. శతాబ్దాలు, యుగాలు మారిపోవచ్చు కానీ విశ్వాస ఔన్నత్యం మాత్రం శాశ్వతం’ అన్నారు.

దేవాలయ కారిడార్ల పునరుద్ధరణ కోసం మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. దేవాలయాల చుట్టూ తిరిగే కుహనా రాజకీయ నాయకుల వ్యవహార శైలికి ఇది పూర్తి భిన్నం. ‘గత స్వార్థ ప్రభుత్వాల వైఖరి కారణంగా దేవాలయాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నాయి’ అని నిర్వేదంగా మోదీ అన్న మాటలు, దేవాలయాల సందర్శన ద్వారా మోదీకి రాజకీయ ప్రాచుర్యం లభించిందనే వారి మాటల్లో లేశమాత్రం  నిజం కూడా లేదనడానికి గొప్ప ఉదాహరణ.

మోదీ ప్రాధాన్యతల్లో దేవాలయాలకు అగ్రస్థానం ఉంటుందనేది ఒక ముఖ్య కోణం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌ ‌జ్యోతిర్లింగ క్షేత్రంలో మహా కాల్‌ ‌లోక్‌ ‌కాంప్లెక్స్ ‌తొలిదశ నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఆయన ‘అవంతిక’ (ప్రస్తుత ఉజ్జయిని) ప్రాధాన్యాన్ని గురించి వివరిస్తూ ‘వేలాది సంవత్సరాలపాటు భారత సంపద, సౌభాగ్యం, నాగరికత, సాహిత్యాలకు ఉజ్జయిని అగ్రస్థానంలో నిలిచింది’ అన్నారు. సంప్రదాయంగా ఉజ్జయిని పవిత్రమైన సప్త పురాలుగా పేరు పొందిన ఏడు నగరాల్లో ఒకటి. ఆ నగరాలు వరుసగా అవంతిక, అయోధ్య, మధుర, హరిద్వార్‌, ‌కంచి, కాశి, ద్వారక. ఖగోళశాస్త్ర పరంగా ఉజ్జయిని భారత్‌కు నడిబొడ్డున ఉన్న నగరం. మహాకాళేశ్వరుని నివాసస్థలం. ‘భారత సాంస్కృతిక వైభవం విస్తరించాలంటే, దేశ విజయపతాక ప్రపంచ పటంలో రెపరెపలాడాలి. విజయపుటంచులను చేరుకోవడానికి దేశం సాంస్కృతిక శిఖరాన్ని అందుకోవడం తప్పనిసరి. ఆ విధంగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో సగర్వంగా నిలవగలగాలి’ అని నరేంద్రమోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఏడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న వారు ఏనాడూ ఘనమైన భారత వారసత్వాన్ని, పూర్వ వైభవాన్ని బహిరంగంగా కీర్తించిన పాపాన పోలేదు. దేశీయ గొప్పతనాన్ని చిన్నదిగా చూపడానికే రచయితలూ అలవాటు పడిపోయారు. దేశం తన ఉత్తరదాయిత్వాన్నే అంగీకరించలేని దుస్థితి! సంప్రదాయం, విలువలు, సంస్కృతి, వీటన్నింటికి మించి ఆధ్యాత్మికపరమైన ఆత్మవిశ్వాసం అవిచ్ఛిన్నంగా కొనసాగిన కారణంగా, భారత నాగరికత వేలాది సంవత్సరాలు నిరంతరాయంగా పరిఢవిల్లింది. భారత గుర్తింపు కేవలం దాని సాంస్కృతిక విలువలపై ఆధారపడింది. అందువల్ల సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారానే భారత స్వాభిమానం గుర్తింపు పొందగలదు. ‘ఈ జ్యోతిర్లింగాల అభివృద్ధి ద్వారానే బానిస మనస్తత్వం నుంచి దేశం బయటపడటంతో పాటు, భారతీయ ఆధ్యాత్మిక వెలుగులు, జ్ఞానం, తత్వశాస్త్రం మరింతగా వ్యాప్తి చెందగలవు. భారతీయ సాంస్కృతిక సిద్ధాంతం మళ్లీ శిఖర స్థాయికి చేరుకోవడమే కాదు, ప్రపంచానికి మార్గదర్శనం చేయడానికి సంసిద్ధంగా ఉంది’ అని నరేంద్ర మోదీ అన్నారు.

మొన్నటి తన ఎర్రకోట ప్రసంగంలో మోదీ స్వాతంత్య్ర అమృత కాలంగా పేర్కొంటూ ‘పంచప్రాణాల’ను ప్రస్తావించారు. వలసవాదం నుంచి బయట పడటమన్నది ఆయన పేర్కొన్న పంచ ప్రాణాల్లో ఒకటి. సాంస్కృతిక పునరుజ్జీవనం, నాగరికత ఆచార విచారాలను సంస్కరించడం మోదీ విశాల దృక్కోణంలో భాగం. ఆలయాల పునరుద్ధరణ పేరుతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు వల్ల మతపరమైన పర్యాటకం మరింత వేగంగా విస్తరిస్తుంది. భారతీయ సమాజం తన ప్రత్యేక గుర్తింపును తిరిగి పొందాలన్న ఉద్దేశంతో, ప్రజ హృదయాల్లో మథనాన్ని కలిగించేందుకు ఎంతో నైపుణ్యంతో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

మోదీ ప్రభుత్వం ‘పర్వతమాల యోజన’ పేరుతో ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సంఘటితం చేసే పక్రియలో భాగంగా చార్‌ధామ్‌ అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం చార్‌ధామ్‌లను కలిపే మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుకు సాగుతోంది. ‘21వ శతాబ్దంలో మన స్వాభిమాన వారసత్వం, అన్ని రకాల అభివృద్ధి అనే రెండు అంశాలు భారత అభివృద్ధికి మూల స్తంభాలు’ అని మోదీ ఇటీవల బద్రీనాథ్‌, ‌కేదార్‌నాథ్‌ ‌పర్యటన సందర్భంగా, కేదార్‌నాథ్‌-‌హేమకుండ్‌ ‌రోప్‌వేకు శంకుస్థాపన చేసిన సందర్భంగా పేర్కొన్నారు. ‘శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాలు మన బానిస మనస్తత్వానికి ప్రతీకలు’ అని ఆయన నిర్వేదంతో అన్నారు.

దీపావళి పర్వదినం సందర్భంగా మోదీ అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గత పాలకులు ఇటువంటి సాంస్కృతిక, మతపరమైన చిహ్నాలుగా నిలిచే కార్యక్రమాలను బుద్ధిపూర్వకంగా నిర్వహించలేదు. కానీ మోదీ అందుకు పూర్తి భిన్నం. సనాతన సాంస్కృతిక స్ఫూర్తి గత కొన్ని శతాబ్దాలుగా దురాక్రమణలు, బానిసత్వం, నిరంకుశత్వం కింద నలిగిపోయింది. ప్రస్తుత పరిణామాన్ని విశ్లేషకులు ‘సాంస్కృతిక జాతీయవాదం’గా పేర్కొంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం మోదీ దౌత్యనీతి, పరివ్యాప్తిలో అతి కీలక అంశమన్నది అక్షరసత్యం.

వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు, అక్కడి దేవాలయాలను దర్శించడం మోదీ తన కార్యక్రమాల్లో భాగం చేసుకున్నారు. ఆవిధంగా సాంస్కృతిక, చారిత్రక అనుసంధానలను సాధించడం, మతపరమైన గుర్తింపును మరింత బలోపేతం చేయడం ఆయన ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది. బుద్ధ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన నేపాల్‌, శ్రీ‌లంకల్లో పర్యటించడం, దీపావళి సందర్భంగా పెద్ద సభల్లో ప్రసంగించడం, విదేశీ పర్యటనల సందర్భంగా వివిధ మతాలకు చెందిన పెద్దలను కలుసుకొని ముచ్చటించడం వంటివి మోదీ సూక్ష్మ వివేచనకు నిదర్శనం.

ఆవిధంగా ఆయన భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, స్వాభిమానాన్ని, గుర్తింపును తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు. ఈ విధానంలో భారతీయ నాగరికతకు మరింత గౌరవాన్ని చేకూర్చడం, ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పడం, దేశాన్ని ఆత్మనిర్భరత దిశగా పయనింపజేయడం ఆయన ప్రధాన లక్ష్యాలు.

అను: విఠల్‌రావు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram