– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

అక్షతత్వం అంటే వ్యవహార దక్షత. అక్షతం అనే పదానికి అర్థం శుభస్థితి. శుభమూ దక్షతా కలగలిస్తే ఇంకే ముందీ? విజయాలన్నీ ఒకదాని వెంట మరొకటిగా వరసకడతాయి. బ్రిటన్‌ ‌సరికొత్త ప్రధాని రుషి సూనక్‌ ‌సతి అక్షతను చూస్తే ‘ఇదీ జీవితం’ అనిపించి హృదయం ఉప్పొంగుతుంది ఎవరికైనా. సదా వికసిత వదనంతో కనిపించే ఆమెకి అత్యంత ప్రత్యేకత ఎప్పుడు మిలమిల మెరిసే కళ్లు. చురుకుతనానికి నకళ్లుగా ఉంటాయవి. పెళ్లయి పదమూడేళ్లు. వివాహం ఎంత ఆదర్శప్రాయమో, అనంతర జీవితమూ అంతే స్ఫూర్తిదాయకం. తాను, తన భర్త (అక్షతామూర్తి) తల్లీ తండ్రీ…. నలుగురివీ విభిన్న రంగాలు. ఆమె ఆ అన్నింటి మౌలిక సూత్రాలకీ ప్రాతినిధ్యమూ అన్నట్లు ఉన్నారిప్పుడు. స్వతహాగా అక్షత కళావేత్త, అంతే స్థాయిలో వాణిజ్య నిపుణురాలు. భర్త కేవలం 42 ఏళ్ల వయసులోనే  బ్రిటన్‌ ‌పాలన పగ్గాలు చేపట్టి చరిత్రను తిరగరాసిన భారత సంతతి వ్యక్తి. అక్షత మాతృమూర్తి సాంకేతిక, ప్రజారోగ్య, సమాజసేవ, రచనా రంగాల ప్రముఖురాలు. తండ్రి అతిపెద్ద ఐటీ వ్యవస్థకు అధిపతి. ఇంత విస్తృత కుటుంబ నేపథ్యమున్న ఆమె ఘనవిజయాల రారాణి కాక మరెవరు? శక్తి సంపదలు ఎన్ని ఉన్నా, ప్రతిభా సామర్థ్యాల చిరునామా దారు అయినా, తనదైన మేలిమి విశిష్టత ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం! అన్ని తరహాల విలువలు కలిగి, వాటి పరిరక్షణలోనూ అందరికన్నా మిన్నగా మెలిగే అక్షత పేరు భారత్‌, ‌బ్రిటన్‌ ‌దేశాలతో పాటు ప్రపంచమంతటా మారుమోగుతోంది ఇవాళ! ఆస్తీ అంతస్తుల సామ్రాజ్ఞిగా ధగధగ లాడుతున్నా, సకల విధాల నిరాడంబర తత్త్వమే తనకు ఏకైక అమూల్య ఆభరణం. ఇంకా విశదీకరించి చెప్పాలంటే…

విశ్వవిఖ్యాత సమాచార సాంకేతిక దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఆద్యులూ బాధ్యులైన నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల తనయ అక్షత. బాల్యమంతా కర్ణాటక ప్రాంతంలో గడపడంతో అక్కడి వారందరికీ ప్రేమ పాత్రురాలైన అమ్మాయి. బెంగళూరులోని బాలికల పాఠశాలలో చదువు అయ్యాక, ఉన్నత విద్యాభ్యాసమంతా అమెరికాలో కొనసాగింది. అక్కడే ఫ్యాషన్‌ ‌డిజైనింగ్‌ ‌పాఠాలు చదివి, అటు తర్వాత అంతర్జాతీయ ప్రొఫెషనల్‌, ‌వస్తూత్పత్తుల సుప్రసిద్ధ సంస్థల్లో విధులు నిర్వర్తించారు. బిజినెస్‌ అడ్మిని స్ట్రేషన్‌లో మాస్టర్‌ ‌కోర్సు చేస్తుండగా, విశ్వ విద్యాలయంలో రుషితో పరిచయమై, అదే ప్రేమ, పెళ్లి బంధంగా వెలుగొంది ఇప్పుడు ఆమెని బ్రిటన్‌ ‌ప్రధాని సతీమణి స్థాయికి చేర్చి చరిత్రాత్మక ఘట్టానికి తెర తీసింది. తొలి నుంచీ భారతీయ సంప్రదాయా లకు సమధిక ప్రాధాన్యమిచ్చే వారి పరిణయం 2009లోనే అయినా; ఆ నిరాడంబర నిర్వహణ ఇప్పటికీ సుందర సుమధుర సుమనోహర జ్ఞాపకమే. బెంగళూరులోనే ఆ కనువిందైన వేడుక. ఆడంబ రాలకు దూరంగా ఉండటం తమ పెద్దలకే కాదు, తమకు అలవాటని ఆనాడే నిరూపించారు అక్షర దంపతులు. నాటి వివాహ వేడుకల వర్ణచిత్రాల్ని ఇప్పుడొక్కసారి చూస్తే, అడుగడుగునా స్ఫూర్తి, ఆదర్శాలే ఉట్టిపడుతుంటాయి. వైభవ ప్రాభవాలు వారి అలంకరణలో కాక, నడక, నడతల్లో వెల్లి విరుస్తుంటాయి. ఆ ఇద్దరూ ఒక్కటైన పుష్కర కాలమైనా ఇప్పటికీ, అదే మూర్తిమత్వం. పుట్టినింటి, మెట్టినింటి పేరు ప్రఖ్యాతుల మీదనే ఆధారపడినట్లు కాకుండా, తనదైన తీరుతెన్నుల్లో తనకే ప్రత్యేకమైన చక్కని పద్ధతులతో ధగధగలాడుతున్నారామె. తనకు తానుగా సొంతంగా గొప్ప గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతగానో పరిశ్రమిస్తూ, అందులోనూ సహజ సిద్ధ తనే కనబరుస్తూ, తానేమిటో లోకానికి సవివరంగా తెలియపరుస్తున్నారు. ఇప్పుడామె ఉండే లండన్‌ ‌మహానగరంలోని 10 డానింగ్‌ ‌స్ట్రీట్‌…. ఎవరు అడిగినా అడగకున్నా చెబుతుంది అక్షతామూర్తి మహిళా లోక మణిదీపమని!

ఇంటా బయట మిన్న

ఎప్పుడు, ఎక్కడా ఏ సందర్భంలోనూ హంగులూ ఆర్భాటాలను ఇష్టపడని అక్షత, అదే అంశాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే ముందుగా అమ్మ గురించి చెబుతారు. ‘అందరికీ అన్ని ప్రయోజనాలూ అందా లన్నది అమ్మ జీవితలక్ష్యం. తను రాసిన పుస్తకాల్లో ఒకటి నాకు మరీమరీ ఇష్టం. అందులో జీవితాను భవాలెన్నో వివరించారు. వాటి సారాంశమూ ఒకటే- విద్య, ఉద్యోగం, వివాహం, కుటుంబం అన్ని వ్యవస్థలకీ సమున్నత విలువలే ప్రమాణం. అదే నేనెప్పుడూ మననం చేసుకుంటూ ఉంటాను. మా పిల్లలు కృష్ణ, అనౌష్కలకీ అదే చెబుతుంటాను. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మానవతా విలువలే మన కీర్తి ప్రఖ్యాతి. సంపన్నత అనేది ధనకనక వస్తు విశేషాల్లో ఉండదు. అది మనిషి అంతరంగంలో ఉంటుందీ అని. సమయాన్ని ఎన్నడూ వృథా చేయకూడదన్నది మరో జీవన పాఠం. చిన్నప్పుడు, పెద్దయ్యాక కూడా నాకు నాన్న చెప్పినవే తలపులోకి వస్తున్నాయి. ఇప్పటికీ అదే చెబుతుంటా రాయన. కాలాన్ని మించిన జ్ఞానసంపద ఇంకేదీ ఉండదని. సమయాన్ని తిరిగి తీసుకురాలేం. అవకాశాలైనా అంతే. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుంటేనే, వచ్చిన అవకాశాలన్నింటినీ సవ్యంగా వినియోగించుకుంటూ వెళ్తేనే జీవనయానం ఫల ప్రదమవుతుంది. మా ఇద్దరమ్మాయిలకీ నేనూ అదే చెబుతున్నా’. మాటల్లో, చేతల్లో నిపుణత చూపే ఆమెది అలుపూ సొలుపూ తెలియని పరిశ్రమ. పెళ్లికి మూడేళ్ల ముందే స్వయంగా వాణిజ్య సంస్థను నెలకొల్పి దిగ్విజయంగా నిర్వహించారు. విదేశంలో ఉన్నప్పటికీ, అక్కడి కళాకారుల బృందాలతోనే భారతీయ డిజైన్లను రూపొందింపజేసి విస్తృత ప్రాచుర్యం కలిగించారు. తదుపరి పరిణామాల్లో తన మేధాశక్తిని అమ్మా నాన్నా, సోదరుడి సంస్థల వైపు మళ్లించారు. ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసు కుంటారే తప్ప, తొందరపాటు అన్నది ఏ దశలోనూ ఉండదామెకు. ఇన్నిన్ని విలక్షణతలు ఉన్నందునే, ప్రతి పనిలోనూ అక్షత దూరదృష్టి ప్రకాశిస్తుంటుంది. ఎన్నెన్ని సంపదలొచ్చినా నూతనంగా, రాజకీయ పాలనా రంగాల కటాక్షమూ ప్రసరించినా ఆమెలో అదే ప్రశాంతత, అంతే నిబద్ధత. అందుకే ఇంటింటా ఆమె పేరే ప్రతిధ్వనిస్తుంది.

ఉన్నతం, ఉద్దాతం

రుషి జంట ఇంగ్లండ్‌ ‌వాసులకు మహోత్తమ పాలన అందిస్తారన్నదే అందరి ప్రగాఢ ఆశ, ఆకాంక్ష. వారి ప్రయాణం బహు మేలిమి మలుపు తిరిగిందని ఇరు కుటుంబాల పెద్దలూ మహదానంద భరితులవు తున్నారు. రాజకీయ రంగాన నిలిచి గెలిచిన మహానేత రుషి సూనక్‌ అయితే, నిర్వహణ వేదికపైన కాంతులీనుతున్న వనితారత్నం అక్షతామూర్తి. బ్రిటన్‌ ‌ప్రధానమంత్రిగా రుషి ఎన్నిక అక్కడి భారత సంతతి వారిని ఎంతెంతో ఉత్తేజితం చేస్తోంది. ఆయన సహధర్మచారిణి అక్షత కార్యదక్షత అతివలందరినీ సగర్వంలో ముంచెత్తుతోంది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి దేశాన్ని పురోగమన పథంలో నడిపిస్తానని రుషి భరోసా ఇస్తున్నారు. ప్రజా ప్రయోజ నాలే పరమావధిగా, సంక్షేమ అభివృద్ధులే ధ్యేయంగా నా వంతు పాత్ర నిర్వహిస్తానని అక్షత సవినయంగా విన్నవిస్తున్నారు. ఆ దంపతులు పిన్న వయస్కులు. శతకోటి ఆశలతో భావి ప్రయాణం కొనసాగిస్తున్న నవోత్సాహకులు. తల్లిదండ్రుల సేవా నిరతే తమను ఇంత అత్యుత్తమంగా తీర్చిదిద్దిందని రుషి, అక్షత ఇద్దరూ చెప్పడం వీనులవిందులా ఉంది.

 సరిగ్గా ఏడేళ్ల కిందట మొదటిసారి పార్లమెంట్‌ ‌సభ్యుడిగా ఎన్నికైన రుషి సూనక్‌ ‌ప్రమాణం చేసింది భగవద్గీత సాక్షిగా. అక్కడి మంత్రిమండలిలో నాడు కీలక శాఖలు వహించినప్పుడు తన అధికార నివాస ప్రాంగణంలో చేసుకుంది దీపావళి పండుగని. భారత ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఆ దంప తులు ఇంతింతై అన్నట్లు కీర్తి పతాకను ఎగుర వేస్తున్నారు. బ్రిటిషర్ల పాలన నుంచి విముక్తమై 75 ఏళ్లయిన భారత్‌ ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాలు నిర్వహించుకుంటుంది. ఇదే సందర్భంలో అదే బ్రిటన్‌ ‌ప్రధాని సింహాసనంపైన రుషి! కాలచక్ర పరిణామ పరంపరలు ఈ విధంగానే ఉంటుంటాయి. వ్యక్తులకైనా వ్యవస్థలకైనా శాశ్వతంగా సంక్రమించేది సమున్నత తత్త్వమే. ఆ రీతిన పరికించి చూసినప్పుడు, ప్రధానంగా అక్షత ఓర్పు నేర్పులే గెలిచాయి, గెలిపించాయన్నది అక్షర సత్యం. ఇక్కడి భారతీయత అక్కడా గుబాళించడం నిత్య దీపావళిని మన ముందుకు తెస్తోంది.

విజయానంద గీతిక

సాదాసీదా జీవితం అమూల్య పాఠాలు నేర్పు తుంది. కోట్లాది ఆస్తులున్నప్పటికీ వాటితో ప్రమేయం లేనంత కలగలుపు మనస్తత్వం మనిషిని కీర్తిశిఖరాల అంచులకు చేరుస్తుంది. కుటుంబ నేపథ్యం ప్రగతి బాటన పయనింపజేస్తుంది. అన్నీ ఉన్నా ఒదుగుదలకే పట్టం కట్టిన నిరాడంబర తత్త్వం మనిషిలో మహనీయతకు మూలకారకమవుతుంది. అక్షత మాతృదేవత సుధామూర్తి సామాన్యురాలా? ఉద్యోగ ప్రకటన చేసిన ఒక సంస్థ అలనాడు ‘మహిళలు దరఖాస్తు చేయనక్కర్లేదు’ అంటే ‘ఎందుకు చేయ కూడదు’ అని నిలదీసిన ధీర నారి. ఆ అతిపెద్ద కంపెనీ అధినేతను ఒకే ఒక్క కార్డు ముక్కతో స్పందింపజేసిన గొప్ప వ్యక్తి. ప్రత్యేక గుర్తింపును డిమాండ్‌ ‌చేసి మరీ సాధించుకుని, తొలి మహిళా ఇంజనీరుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ఆరంభించిన సాహసి. మరి ఆ కుటుంబం నుంచి వచ్చిన అక్షతా మూర్తి ఎంతటి సృజనవంతురాలో వేరే చెప్పాలా? పుస్తక రచన, సమాజ సేవా కార్యక్రమాలు, నిర్మాణ నిర్వహణ, పర్యవేక్షణలు రోజువారీ అలవాటుగా మార్చుకున్న కుటుంబీకులు. మరీ ముఖ్యంగా అక్షత ఎప్పటికీ వార్తల్లో వ్యక్తి. తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త, కుమార్తెలు అందరితోనూ ప్రగాఢత ఎంతైనా చూడముచ్చట. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధిగా నిలిచి గెలిచిన ఆ అతివ జీవితాన అందుకే విజయాల వరస. అభినందనలూ వందనాలూ ఉమ్మడిగా అందిద్దాం.

By editor

Twitter
Instagram