– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌,  ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌రెండు దశాబ్దాల తరవాత జరిగిన అంతర్గత ఎన్నికల నాటకాన్ని హస్తం పార్టీ బాగానే రక్తి కట్టించింది. పైకి ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించామని అధినాయకత్వం చెప్పుకున్నప్పటికీ తెరవెనక జరిగిన తంతు గురించి అందరికీ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లీ కుమారులైన సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీల దర్శకత్వంలోనే కథంతా నడిచింది. రాజస్తాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లోత్‌ అభ్యర్థిత్వం తొలుత తెరపైకి రావడం, ఆనక మధ్యప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ ‌పేరు చక్కర్లు కొట్టడం, చివరికి మల్లికార్జున ఖర్గే పేరు ఖరారు కావడం వెనక అధినాయకత్వం హస్తం లేదని ఏ కాంగ్రెస్‌వాదీ చెప్పలేడు. ఖర్గే అధిష్టానం అధికారిక అభ్యర్థి కాదని, పోటీ విషయంలో అధినాయకత్వం తటస్థంగా వ్యవహరించిందని తల్లీ కొడుకు ఎంతగా ఊదరగొట్టినప్పటికీ అసలు విషయం అందరికీ తెలిసిందే. అధికారిక అభ్యర్థి కాబట్టే ఖర్గే సునాయాసంగా ఆ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు కాగలిగారు. అయితే ఖర్గేను స్వతంత్రంగా పని చేయనిస్తారా, లేదా అధినాయకత్వం కనుసన్నల్లోనే ఆయన పనిచేయాల్సి ఉంటుందా? అన్నదే అసలు ప్రశ్న. దీనిపైనే ఖర్గే భవితవ్యం, పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.


వందేళ్లకు పైగా చరిత్ర గల హస్తం పార్టీ నాయకత్వం అంతా గాంధీ, నెహ్రూల కుటుంబం కనుసన్నల్లోనే నడిచింది. సుదీర్ఘ చరిత్రలో అప్పుడప్పుడు గాంధీయేతర నాయకులు అధ్యక్ష పగ్గాలు అందుకున్నప్పటికీ వారు స్వతంత్రంగా పనిచేసిన దాఖలాలు లేవు. గాంధీల చేతుల్లో వారు రిమోట్‌ ‌కంట్రోలర్లుగానే పని చేశారన్నది చేదు నిజం. ఆ పరిస్థితే పార్టీకి పెనుశాపంగా పరిణమించింది. ఇప్పుడు ఖర్గే పరిస్థితి ఎలా ఉంటుందన్నది మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్న. వాస్తవానికి ఖర్గే అధ్యక్ష పదవికి అన్ని విధాలా అర్హుడైన నాయకుడు. సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. పూర్తిగా వివాదరహితుడు. కాంగ్రెస్‌ ‌సిద్ధాంతాలను బాగా వంటబట్టించుకున్న నాయకుడు. కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎంతో కొంత పట్టున్న కర్ణాటకకు చెందిన ఎస్సీ నేత. ఎస్‌. ‌నిజలింగప్ప తరవాత కర్టాటక నుంచి అత్యున్నత పీఠం అందుకున్న నాయకుడు. బాబూ జగ్జీవన్‌రామ్‌ ‌తరవాత ఏఐసీసీ పగ్గాలు అందుకున్న ఎస్సీ నాయకుడు. హిందీపై గట్టి పట్టున్న వ్యక్తి. ప్రజాదరణతో కేంద్ర, రాష్ట్ర చట్టసభలకు పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన నాయకుడు. హస్తం పార్టీ అత్యున్నత పీఠాన్ని అధిష్టించడానికి ఇంతకుమించి అర్హతలు అవసరం లేదు. అయితే తన పనిని తాను స్వేచ్ఛగా చేసుకోవడంపైనే ఖర్గే భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అధికారం తమకు వద్దని తల్లీ, కుమారుడు పైకి ఎంతగా చెబుతున్నప్పటికీ, వారి ప్రమేయం లేకుండా ఖర్గే కీలక నిర్ణయాలు తీసుకోగలరా? అన్న ప్రశ్నకు సమాధానం లభించడం కష్టమే. గతానుభవాలు చూసినప్పుడు ఈ అభిప్రాయం కలగక మానదు.

గతంలో పీవీ నరసింహారావు, సీతారాం కేసరి విషయంలో అధిష్ఠానం అనుసరించిన వైఖరి గమనించిన తరవాత ఖర్గేకు ఎంతటి స్వేచ్ఛ లభిస్తుందన్నది ప్రశ్నార్థకమే. పార్టీకి లాభం జరిగితే అది తమ గొప్పని, నష్టం జరిగితే అందుకు బాధ్యత అధ్యక్షుడిదని ప్రకటించి బలిపశువును చేయడం గాంధీ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. ఇక అంతర్గతంగా పార్టీ ప్రక్షాళనలో ఖర్గేకు ఎంతవరకు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నది కూడా ప్రశ్నార్థకమే. వర్కింగ్‌ ‌కమిటీ సభ్యుల నియామకం, పార్లమెంటరీ బోర్డుకు సభ్యుల ఎంపిక, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల ఎంపికలో కొత్త అధ్యక్షుడికి ఎంతవరకు ప్రాధాన్యమిస్తారన్నది అనుమానాస్పదమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్‌ ‌రాజీనామా చేసినప్పటికి పార్టీ రోజువారీ వ్యవహారాల్లో ఆయన ప్రమేయం కొనసాగింది. తల్లి అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ రాహుల్‌ అం‌తా తానై వ్యవహరించారు. ఇప్పుడు జోడోయాత్ర చేస్తున్న ఆయన ఎంత కాదనుకున్నా పార్టీలో కీలక నాయకుడిగా ఉంటారు. ఈ యాత్ర వల్ల పార్టీకి ఎంతో కొంత మేలు జరిగితే అది కచ్చితంగా ఆయన ఖాతాలోకే వెళుతుంది. అంతే తప్ప అధ్యక్షుడి ఖాతాలో జమపడదు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రధానిగా ఉన్న సమయంలో ఎలాంటి అధికారిక పదవి లేనప్పటికి తెరవెనక రాహుల్‌ ‌పోషించిన పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేబినెట్‌ ‌నిర్ణయాలను సైతం నిరసించిన దాఖలాలు ఉన్నాయి. ఆధార్‌ ‌గుర్తింపు కార్డులకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ఆధార్‌ ‌నంబరును ఆయన చించేసిన విషయం ఇంకా ఎవరూ మరచిపోలేదు. నాడు రాహుల్‌ ‌వ్యవహార శైలిపై నోరు మెదపని నాయకత్వం ఇప్పుడు ఖర్గేను తన పని తాను చేసుకోనిస్తుందా?

ప్రజాస్వామ్య పద్ధతికి పట్టం కడుతూ అధ్యక్ష ఎన్నిక నిర్వహించామని అధినాయకత్వం ఎంతగా గొప్పలు చెబుతున్నప్పటికీ, ఆ సందర్భంగా వ్యవహరించిన తీరు విమర్శలకు గురైంది. తొలుత అశోక్‌ ‌గెహ్లోత్‌, ‌తరువాత దిగ్విజయ్‌సింగ్‌, ‌చివరికి ఖర్గే పేర్లను తెరపైకి తీసుకురావడం వెనక అధినాయకత్వం ఎన్నో లెక్కలు, కూడికలు, తీసివేతల కసరత్తు చేసింది. అటు సీఎం, ఇటు ఏఐసీసీ అధ్యక్ష పదవి కావాలని గెహ్లోత్‌ ‌పట్టుబట్టడంతో ఆయనను తెలివిగా తప్పించారు. తరవాత దిగ్విజయ్‌ ‌పేరు ప్రకటించినప్పటికి రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఖర్గే పేరు ఖరారు చేశారు. ఆయన అన్నింటికీ మించి గాంధీ కుటుంబానికి వీర విధేయుడు, ఎస్సీ నాయకుడు కావడంతో త్రాసు ఆయన వైపు మొగ్గు చూపింది. అంటే తోలుబొమ్మలాట మాదిరిగా ముగ్గురు నాయకులను మార్చారు. అధ్యక్ష పదవికి పోటీ పడ్డ శశిథరూర్‌ ‌విషయంలో పార్టీ అనుసరించిన తీరులో హుందాతనం లోపించింది. అప్రజాస్వామికంగా వ్యవహరించింది. తాము ఎవరి వైపూ లేమని అమాయకత్వం నటిస్తూ ఒక పక్క సోనియా, రాహుల్‌ ‌గాంధీ ప్రకటనలు చేసినప్పటికీ తమ చర్యల ద్వారా పరోక్షంగా ఖర్గే వైపున్నట్లు సంకేతాలిచ్చారు. అనధికారికంగా రాష్ట్రాల పీసీసీలకు ఈ మేరకు సందేశాలు వెళ్లాయి. ఉదాహరణకు థరూర్‌ ‌సొంత రాష్ట్రమైన కేరళలో ఆయనను పట్టించుకున్న వారు లేరు. రాజధాని తిరువనంత పురం నుంచి పార్లమెంటుకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ శశిథరూర్‌ను పలకరించిన వారు లేరు. ఒక్క కేరళలోనే ఈ పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు ఇదే రకమైన చేదు పరిస్థితి ఎదురైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ‌నగరానికి వచ్చిన థరూర్‌కు పార్టీ శ్రేణులు మొహం చాటేశాయి. వేరే పని ఉన్నందువల్ల శశిథరూర్‌ను కలవలేకపోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి స్వయంగా ప్రకటిం చారు. స్వయంగా అధ్యక్షుడే అలా ప్రకటించిన తరవాత ఏ కార్యకర్త, ఏ నాయకుడు థరూర్‌ను కలిసేందుకు సాహసించగలరు? పోలింగులో పలు అవకతవకలు జరిగాయని థరూర్‌ ‌వర్గం బహిరంగం గానే ఆరోపించింది. ముఖ్యంగా ఉత్తర్‌‌ప్రదేశ్‌, ‌తెలంగాణ, పంజాబ్‌ ‌శాఖల్లో సజావుగా ఎన్నికలు జరగలేదని పేర్కొంది. ఈ మేరకు పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ ‌మధుసూదన్‌ ‌మిస్త్రీకి లేఖ రాసింది. ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని థరూర్‌ ‌ముఖ్య ఎన్నికల ప్రతినిధి సల్మాన్‌ ‌సోజ్‌ ‌విమర్శించారు. కీలకమైన యూపీలో పోలైన ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. యూపీ ఎన్నికల్లో బ్యాలెట్‌ ‌బాక్సులకు సీలు వేయలేదు. పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద అనధికారిక వ్యక్తులు సంచరించారు. వారు పోలింగ్‌ ‌పక్రియను ప్రభావితం చేశారు. ఓటు వేయడానికి వచ్చిన ప్రతినిధుల ఓట్లను అప్పటికే వేరే వారు వేశారని సౌజ్‌ ‌పేర్కొన్నారు. మొత్తం ఓట్లలో 1200లకు పైగా ఈ రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. పంజాబ్‌లో బోగస్‌ ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించగా, తెలంగాణలో ప్రతినిధుల జాబితాలో మార్పులు, చేర్పులు చేశారని అన్నారు. తెలంగాణలో ఎన్నిక సందర్భంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వంటి సీనియర్‌ ‌నాయకులు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలకు, ఫిర్యాదులకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ ‌మధుసూదన్‌ ‌మిస్త్రీ పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఓడినప్పటికీ శశిథరూర్‌ ‌మంచి ఓట్లే సంపాదించారు. గతంలో అధ్యక్ష పదవికి పోటీచేసిన వారి కన్నా ఎక్కువ ఓట్లే సాధించడం విశేషం. మొత్తం ఓట్లలో ఖర్గేకు 7,897 రాగా, థరూర్‌కు 1,072 లభించడం విశేషం. అంటే దాదాపు 12 శాతం ఓట్లు ఈ కేరళ నేతకు పోలయ్యాయి. 2000 సంవత్సరంలో సోనియాపై పోటీ చేసిన యూపీకి చెందిన జితేంద్ర ప్రసాద్‌కు కేవలం 94 (1.24 శాతం) ఓట్లే లభించడం గమనార్హం. నాడు సోనియాకు 7,448 ఓట్లు (98.76 శాతం) పోలయ్యాయి. 1997లో శరద్‌ ‌పవార్‌, ‌సీతారాం కేసరి, రాజేశ్‌ ‌పైలెట్‌ ‌మధ్య ముక్కోణపు పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో 6,224 (83.43 శాతం) ఓట్లు సాధించి కేసరి ఘన విజయం సాధించారు. పవార్‌కు 882 (11.82 శాతం), పైలెట్‌కు 354 (4.75 శాతం) ఓట్లు మాత్రమే లభించాయి. ఈ లెక్కన చూస్తే అధిష్టానం అండదండలు లేనప్పటికీ శశిథరూర్‌ ‌గౌరవ ప్రదమైన ఓట్లే సాధించి, పార్టీలో తనకు ఎంతో కొంత ఆదరణ ఉన్నట్లు నిరూపించు కున్నారు.

మంచి మెజార్టీతో ఖర్గే ఎన్నికైనప్పటికీ అధ్యక్ష పదవి ఆయనకు ముళ్ల కిరీటం వంటిదేనని చెప్పవచ్చు. పార్టీ ప్రక్షాళనతో పాటు తక్షణం ఆయన హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతర్గత కలహాలు, సరైన నాయకత్వం కొరవడిన నేపథ్యంలో హిమాచల్‌ ఎన్నికలను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. గెలుపు విషయాన్ని పక్కనపెడితే కనీసం గౌరవ ప్రదమైన సీట్లు రాకుంటే ఖర్గేకు తాటాకులు కట్టడానికి పార్టీలో కొన్ని వర్గాలు కాచుకు కూర్చుంటాయి. ఇక డిసెంబర్‌లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. ఈ పశ్చిమ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పాతుకుపోయిన కమళదళాన్ని ఎదుర్కోవడం తేలికేమీ కాదు. 2023లో సొంత రాష్ట్రమైన కర్ణాటకతో పాటు మధ్యప్రదేశ్‌, ‌రాజస్తాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌ ‌తదితర రాష్టాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌గుజరాత్‌లను పక్కన పెడితే సొంత రాష్ట్రమైన కర్ణాటకలో విజయ తీరాలకు చేరకపోతే ఖర్గే పీఠానికి ముప్పు తప్పదు. అందుకు పార్టీ ఆయనను బలిపశువును చేయక మానదు. కాంగ్రెస్‌ ‌రాజకీయాలను కాచి వడపోసిన మల్లికార్జున ఖర్గే వంటి సుదీర్ఘ నేపథ్యం గల నాయకుడికి ఈ విషయాలు తెలియవని అనుకోలేం.

About Author

By editor

Twitter
Instagram