– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికీ కొన్ని హక్కులు ఉంటాయి. వాటికి పరిమితులూ ఉంటాయి. ఏ హక్కు పరిపూర్ణం కాదు. అది సహేతుకమైన నిబంధనలకు లోబడి ఉండాల్సిందే. అదే సమయంలో కొన్ని బాధ్యతలూ ఉంటాయి. కానీ ప్రాంతీయ పార్టీల రాకతో ఈ పోకడ మారింది. వాటికి హక్కులే తప్ప బాధ్యతలు అంటూ ఏమీ ఉండవు. అదేమంటే కేంద్రంపై దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకుంటాయి. ఒకప్పటి కాంగ్రెస్‌వాది, 90వ దశకంలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో అందరికన్నా నాలుగాకులు ఎక్కువే చదివారు. ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఘర్షణలు, సీబీఐ, ఈడీలు తమ రాష్ట్రంలోకి రాకూడదంటూ ఏకంగా బెంగాల్‌ అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా మమత తన స్థాయిని తాను తగ్గించుకున్నారు. తద్వారా తన ప్రభుత్వం, పార్టీ నాయకుల అవినీతి చరిత్రను కాపాడుకునే ప్రయత్నం చేశారు.

గతేడాది తిరుగులేని బలంతో మూడోసారి అధికారం చేపట్టిన మమతా బెనర్జీ పాలన ఏకపక్షంగా సాగుతోంది. ప్రజాక్షేమం కన్నా పార్టీ నాయకులు, మంత్రుల క్షేమమే ఆమెకు ముఖ్యమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని చూసీ చూడనట్లు వదిలేయలేదు. ప్రజల దృష్టికి తీసుకు వెళ్లేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 13‌న ‘నబన్న అభిజన్‌’ (‌మార్చ్ ‌టు సెక్రటేరియట్‌) ‌కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు, పార్టీ కార్యకర్తలతో రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయానికి భారీ ప్రదర్శనగా బయలుదేరింది. శాంతియుతంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ దీనిని మమత సర్కారు సహించలేకపోయింది. ఉద్దేశపూర్వకంగా పోలీసులను రంగంలోకి దించి వారిని రెచ్చగొట్టింది. దీంతో పోలీసులు తమ ప్రతాపం చూపారు. నిరసనకారులను ముందుకు సాగకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారిపై బాష్పవాయు గోళాలను, జలఫిరంగులను ప్రయో గించారు. ప్రదర్శనకారులను చెల్లాచెదురు చేశారు. రాజధాని నగరం కోల్‌కతాలోని హౌరా రైల్వేస్టేషన్‌, ‌లాల్‌బజార్‌, ‌సంత్రాగచ్చి, హౌరా వంతెన తదితర ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకు న్నాయి. ఒక పోలీసు వాహనం దహనమైంది. ప్రజల ఆస్తులకు పెద్దయెత్తున నష్టం వాటిల్లింది. ప్రతిపక్ష నాయకుడు, నందిగ్రామ్‌ ‌శాసనసభ్యుడు సువెందు అధికారి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌, ‌పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్‌ ‌ఘోష్‌, ‌హుగ్లీ పార్లమెంటు సభ్యుడు లాకెట్‌ ‌ఛటర్జీ, పార్టీ నాయకులు రాహుల్‌ ‌సిన్హా తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు, బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని వివిధ ఠాణాలకు తరలించారు. వారిపై తప్పుడు కేసులు బనాయించారు. ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అడ్డుకోవడం, వారిపై బాష్ప వాయు గోళాలు ప్రయోగించాల్సిన అవసరం ఏమిటో ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాని విషయం. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపే హక్కు ప్రజా స్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందునా 70కి పైగా సీట్లు సాధించిన ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీకి ఈ విషయంలో మరింత బాధ్యత ఉంది. ప్రజల తరఫున పనిచేస్తూ, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం విపక్షం బాధ్యత. దశాబ్దాల పాటు విపక్షంలో ఉన్న మమతా బెనర్జీ అప్పట్లో వామపక్ష సర్కారుపై ఎంత తీవ్రంగా ధ్వజమెత్తేవారో, ప్రజలను, పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎంత రెచ్చగొట్టేవారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నాటి వామపక్ష ముఖ్య మంత్రులు జ్యోతిబసు, బుద్ధదేవ్‌ ‌భట్టాచార్యలపై ఆమె దుమ్మెత్తి పోసేవారు. కానీ అధికారం ఆమె చేతికి వచ్చాక వైఖరి పూర్తిగా మారిపోయింది. తనకు వ్యతిరేకంగా ఎవరూ ఏమీ మాట్లాడరాదని, విపక్షాలు సైతం చూస్తూ ఉండి పోవాలని భావిస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా ఎవరినీ అదుపులోకి తీసుకోరాదని, అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కలకతా హైకోర్టు ఆదేశించడం గమనార్హం.

ఇక మమత వైఖరిని చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. బెంగాల్‌ ‌భారతదేశంలో భాగమా? కాదా? భారత చట్టాలు బెంగాల్‌లో వర్తించవా? అనే సందేహాలు ఏర్పడతాయి. సెంట్రల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌-‌కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్సు మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ)లను రాష్ట్రంలో నిషేధిస్తూ ఏకంగా బెంగాల్‌ అసెంబ్లీ ఈనెల 19న తీర్మానం చేసింది. టీఎంసీ శాసనసభ్యులు ఫిర్హాద్‌ ‌హకీమ్‌, ‌సుబ్రతా ముఖర్జీ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అసెంబ్లీలో మెజార్టీ ద్వారా తీర్మానం ఆమోదించు కున్నా తన మంత్రులు, నాయకులు, మేనల్లుడు అభిషేక్‌ ‌బెనర్జీల అవినీతి, కుంభకోణాలపై ఆమె ప్రజలకు జవాబు చెప్పక తప్పదు. మెజార్టీని అండగా చూసుకుని 169వ నిబంధన కింద సీబీఐ, ఈడీలను నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తీర్మానానికి తెరవెనుక అనేక కారణాలు ఉన్నాయి. చాలామంది టీఎంసీ నాయకులు, మంత్రులు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారు. దీంతో ఎప్పుడు దాడులు జరుగతాయోనన్న భయంతో ముందు జాగ్రత్తగా మమత అసెంబ్లీ చేత తీర్మానం చేయించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మమత మంత్రివర్గంలోని పార్థ ఛటర్జీ పాఠశాల టీచర్ల నియామకంలో అవినీతి ఆరోపణలతో అరెస్టయ్యారు. పశువుల అక్రమ రవాణా వ్యవహారంలో అనుబ్రత మోండల్‌ అనే మరో టీఎంసీ నాయకుడు కటకటాలు లెక్కిస్తున్నారు. మమత మేనల్లుడు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని డైమండ్‌ ‌హార్బర్‌ ‌పార్లమెంటు సభ్యుడు అభిషేక్‌ ‌బెనర్జీ బొగ్గు అవినీతిలో పీకల్లోతుల్లో కూరుకుపోయారు. ఇందుకు సంబంధించి అభిషేక్‌ను ఈడీ ఇంతకు ముందు ప్రశ్నించింది. ఇదే కేసుకు సంబంధించి అభిషేక్‌ ‌భార్య, మేనకోడలును కూడా ఈడీ ప్రశ్నించింది. ప్రస్తుతం అభిషేక్‌ ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో మమత తరఫున వ్యవహారాలను చక్కబెడుతున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో చక్రం తిప్పుతున్నారు. శారదా చిట్‌ ‌ఫండ్‌ ‌కేసులో గతంలో టీఎంసీ నాయకులు కొందరు అరెస్టయ్యారు. మమతగానీ, టీఎంసీగానీ సీబీఐ, ఈడీలకు ఎందుకు అంతగా భయపడుతన్నారో అర్థం కావడం లేదు. నిజానికి వారు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుంటే నిర్భయంగా దర్యాప్తు సంస్థ ముందుకు హాజరు కావచ్చు. తమ నిజాయతీని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు. దర్యాప్తు సంస్థలే అంతిమ న్యాయనిర్ణేతలు కాదు. వీటిపైన న్యాయస్థానాలు ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు వంటి అత్యున్నత సంస్థలు ఉన్నాయి. వీటిని విస్మరించి సీబీఐ, ఈడీలపై నిషేధం విధించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వక మానదు. 2018లో నాటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇలానే వ్యవహరించి అప్రతిష్టపాలైంది. సీబీఐకి గల ‘సాధారణ అనుమతి’ని బాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఢిల్లీ స్పెషల్‌ ‌పోలీసు ఎస్టాబ్లిష్‌ ‌చట్టం కింద ఏర్పాటైన సీబీఐ రాష్ట్రాలకు సంబంధిం చిన కేసులను తనంతట తాను దర్యాప్తు చేయదు. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే దర్యాప్తు చేస్తుంది. 2019లో శారదా చిట్స్ అవినీతి వ్యవహారానికి సంబంధించి నాటి కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను విచారించ కుండా మమత సర్కారు అడ్డుపడగా సర్వోన్నత న్యాయస్థానం అడ్డుకున్న విషయం విదితమే. తాజాగా దర్యాప్తునకు సంబంధించి ఈడీకి గల అధికారాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సోదాలు, అరెస్టులు, పత్రాలు స్వాధీనం చేసుకునే అధికారం ఈడీకి ఉందని జూలై 27న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ అయిన కార్తీ చిదంబరం దాఖలు చేసిన ఓ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. పరిస్థితులు ఇంత స్పష్టంగా ఉన్న తరవాత కూడా తమకున్న మెజార్టీ దన్నుగా మమత అసెంబ్లీలో సీబీఐ, ఈడీలపై తీర్మానం చేయడం ఆమె అపరిపక్వతకు అద్దం పడుతోంది.

మూకుమ్మడి మెజార్టీ కారణంగా అయినదానికీ, కానిదానికీ అసెంబ్లీలో తీర్మానాలు చేయడం మమతకు కొత్తేమీ కాదు. అంతర్జాతీయ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకునే, విచారించే, సోదాలు జరిపే అధికారం బోర్డర్‌ ‌సెక్యూరిటీ పోర్స్ (‌బీఎస్‌ఎఫ్‌) – ‌సరిహద్దు భద్రతాదళానికి గతంలో ఉండేది. గత కొంతకాలంగా అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, చొరబాట్లు పెరిగిన నేపథ్యంలో దానిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ కేంద్రం ఇంతకుముందు నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌లతో సరిహద్దులు గల పంజాబ్‌, ‌బెంగాల్‌, అసోంలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. దీనిని పంజాబ్‌, అసోం సర్కార్లు ఆమోదించగా, బెంగాల్‌ ‌ప్రభుత్వం వ్యతిరేకించడం గమనార్హం. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అంటూ దీనికి వ్యతిరేకంగా బెంగాల్‌ అసెంబ్లీ గత ఏడాది నవంబరు 16న తీర్మానం ఆమోదించడం గమనార్హం.

పంజాబ్‌, ‌బెంగాల్‌, అసోం సరిహద్దులు ఎంత సున్నితమైనవో ఆమెకు తెలియనిది కాదు. దీన్ని కూడా రాజకీయం చేయడం సీనియర్‌ ‌నాయకురాలైన మమతకు తగదు. గతంలో జాతీయ పౌరపట్టిక, సిటిజన్‌షిప్‌ ఎమెండ్‌మెంట్‌ ‌యాక్ట్, ‌పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ వ్యాఖ్యలపైనా మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు వెగటు పుట్టించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాల యాలకు సహజంగా గవర్నర్‌ ‌కులపతిగా వ్యవహ రిస్తారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సంప్రదాయం. కానీ గవర్నరుకు గల ఆ హోదాను తొలగిస్తూ ఈ ఏడాది జూన్‌ 13‌న బెంగాల్‌ అసెంబ్లీ తీర్మానం ఆమోదించడం గమనార్హం. తన చర్యల ద్వారా తాను చక్రవర్తినని, తనకు ఎదురు ఉండకూడ దని మమత భావిస్తున్నట్లు కనపడుతుంది. తాను ప్రజాస్వామ్య దేశంలో ఉన్నట్లు ఆమె భావించడం లేదు. కానీ ఏదో ఒకరోజున తనను నేలపై నడిపించే శక్తి ప్రజలకు ఉందన్న వాస్తవాన్ని మమత గ్రహించడం లేదు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE