– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌సెప్టెంబర్‌ 27 ‌నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలగిరులపై స్వయంభూ గా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవం ఇతర అన్ని ఉత్సవాలకు భిన్నమైనది, విలక్షణమైనది, వైభవోపేతమైనది.  శ్రీనివాసుని అనుగ్రహం కలిగేలా చతుర్ముఖ బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కనుక బ్రహ్మోత్సవాలు అని జగత్ప్రసిద్ధమయ్యాయి. అనాదిగా ఎందరో మహారాజులు, మహారాణులు భక్తిభావంతో వీటిని అత్యంత వైభవంగా నిర్వహించి చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఉత్సవాలు 966 నాటి పల్లపరాణి సామవై కాలం నుంచి పురటాసి తిరునాళ్లుగా ప్రసిద్ధమయ్యాయి. తిరుమలగిరులు దట్టమైన అరణ్యంతో నిండి ఉండడం, క్రూరమృగాల సంచారం, వసతుల లేమి కారణంగా ఒకప్పుడు శ్రీవారి బహ్మోత్సవాలను తిరుచానూరులోనే నిర్వహించేవారట. తిరుమల ఆలయంలో ధ్వజారోహణ, ధ్వజావరోహణ మాత్రమే చేసి, ఇతర వాహన సేవలన్నీ తిరుచానూరులో నిర్వహించేవారు. శ్రీవారిని దర్శించుకున్న భగవద్రామానుజాచార్యులు బ్రహ్మోత్సవాలను తిరుమలలోనే నిర్వహించేలా కట్టుదిట్ట ఏర్పాటు చేశారు. తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో జరుగనున్నాయి. ఈనెల (సెప్టెంబర్‌) 27‌వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. కోవిడ్‌ ‌బెడద నేపథ్యంలో గత రెండేళ్లు ఈ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు.

స్వయంభూ, లేదా ప్రతిష్ఠితాలైన దేవతా మూర్తులకు నిత్యార్చనలోపిస్తే దేశానికి అరిష్టమని, దుర్భిక్షాలు, ఉపద్రవాలు సంభవిస్తాయని, అలాంటి నిత్యార్చన లోపాల నివారణకు మహోత్సవాలు నిర్వహించాలని శాస్త్రం (నిత్యపూజా విహీనస్య ప్రాశ్చిత్తం మహోత్సవమ్‌) ‌నిర్దేశించింది. అలా బ్రహ్మోత్సవాల నిర్వహణతో నిత్యార్చన లోపంవల్ల సంభవించగల దుష్పరిణామాలు/అనర్థాలు పరిహార మవుతా యంటారు. ‘ఉత్‌’ అం‌టే ‘గొప్పది’, ‘సవం’ అంటే ‘య్ఞం’. గొప్ప య్ఞం విశేషం కనుక ఈ పక్రియకు ‘ఉత్సవం’ అని పేరు వచ్చింది. దేవదేవుని మూలబింబం (ధ్రువబేరం)లోని శక్తివృద్ధికి కూడా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

తిరుమలేశుని బ్రహ్మోత్సవాలను చరిత్రలోనే దానిని అరుదైన అంశంగా భావిస్తారు. ‘శ్రీవారి బ్రహ్మోత్సవం లోకానికి దివ్యోత్సవం’ అని నానుడి. ఈ ఉత్సవాలను వీక్షించేందుకు ‘ఎక్కడెక్కడో ఉన్న వారంత వానలను కూడా లెక్కచేయకుండా ఊరికురికి వస్తారు’ (నానాదిక్కుల నరులెల్లా, వానలలో ననె వత్తురు గదలి) అని అన్నమాచార్యులు బ్రహ్మోత్సవాల విశిష్టతను చాటారు.

విజయనగర ప్రభువుల కాలంలో కన్యామాసం తిరునాళ్లు, పురట్టాసి తిరునాళ్లు, తిరుక్కోడి తిరునాళ్లు పేరిట ఏడాది పొడవునా బ్రహోత్సవాలు జరిగేవి. ఇప్పుడు పురట్టాసి ఉత్సవాలు మాత్రమే నిరంత రాయంగా సాగుతున్నాయి. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు ఏటా ఆశ్వీయుజ మాసంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని వరహా పురాణం పేర్కొంటోంది. ఏడాదికి ఒకసారి ఆశ్వీయుజ మాసంలో నిర్వహించే వాటిని నవరాత్రి బ్రహ్మోత్స వాలని, మూడేళ్లకు ఒకసారి అధికమాసం వచ్చినప్పుడు భాద్రపద మాసంలో నిర్వహించే వాటిని సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలని అంటారు. రెండవ తరహా బ్రహ్మోత్సవాలలో అంకురార్పణ, ధ్వజారోహణ, ధ్వజావరోహణ ఉండవు.

‘కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందనః!

ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వేంకటనాయకః!!’ (కృతయుగంలో నృసింహుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరంలో వాసుదేవుడు (శ్రీకృష్ణుడు), కలియుగంలో వేంకటేశ్వరుడు) అని శాస్త్ర వచనం. దుష్టశిక్షణ కోసం శ్రీమన్నారాయణుడు మొదటి మూడు అవతారాలు దాల్చాడు. నాలుగవ అవతారంగా భక్తపాలన కోసం సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగివచ్చిన దివ్యమంగళ అర్చావతారమూర్తి శ్రీనివాసుడు.

అనేక సంకటాలమయమైన కలియుగంలో మానవు లను ఉద్ధరించేందుకు శ్రీమహావిష్ణువు కన్యామాసంలో శ్రవణా నక్షత్ర కాలంలో తిరుమల గిరులపై వేంకటేశ్వరుడిగా కొలువుదీరాడు. ‘వేంకటమ్‌’ అం‌టే సమస్త పాపాలను పోగొట్టేదని అర్థం. వేంకటాద్రివాసుడు సాక్షాత్తు వేదస్వరూపుడు. బ్రహ్మాండ భాండాలలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం (వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన లేనే లేదని నానుడి. ఆయనకు సమమైన దేవుడు భూత భవిష్యత్తులో కనిపించరని ‘వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి’ అని కీర్తి పొందాడు. అరిష్వడ్వర్గాలతో సతమతమయ్యే మానవులను ఉద్ధరించేందుకు, వారి కష్టాల నివారణకు ‘వేంకటేశ్వరుడు’ అనే పేరుతో దిగివచ్చాడు. కనుకనే ‘కలౌ వేంకటనాయకః’ అనేలా పూజలు అందుకుంటున్న కొండంత దేవుడు ఏడుకొండల వాడు.

ఉత్సవ ప్రియుడు (ఉత్సవప్రియః శ్రీనివాసః)

‘వైకుంఠాన్నయినా విడిచి ఉంటాను కాని భక్తులను కాదని ఒక్క క్షణమైనా ఉండలేను’ అనే భావనతో దివి నుంచి భువికి దిగి వేంకటాచలంలో అద్భుత సాలగ్రామ శిలామూర్తిగా, వక్షస్థల మహాలక్ష్మితో స్వయం వ్యక్త రూపంలో ఆవిర్భవించిన శ్రీనివాసుడు ఉత్సవ ప్రియుడు (ఉత్సవప్రియః శ్రీనివాసః). ఇన్ని రకాల ఉత్సవాలు ఇంకా ఏ దేవుడికి జరగవనడం అతిశయోక్తి కాదు. సాధారణంగా బేసి సంఖ్యలో (బేసీ రోజులలో) నిర్వహించే ఉత్సవాలు సరి సం•్యలోనూ జరగడం తిరుమలేశుని ప్రత్యేకత.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

స్వామివారి సర్వసేనాధ్యక్షుడు విష్వక్సేనుల వారు తిరుమల తిరుమాడ వీధుల్లో ఊరేగడంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. బ్రహ్మాది దేవతలను ఆహ్వానిస్తూ గరుడాళ్వార్‌ ‌పటంతో ధ్వజారోహణ చేస్తారు.‘జయంకరోతి దేవానం ధ్వం సయిత్యా సురాన ధ్వం సనాశ్చ జయశ్చైవ ధ్వజమిత్యభిధీయతే’ (సకల దేవతలకు జయం కలిగించి అసురులను నాశనం చేయాలనే సంకల్పంతో ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారంటూ ధ్వజారోహణ వైభవాన్ని శ్రీవైఖానస భగవత్‌ ‌శాస్త్రం పురాణాలు పేర్కొంటున్నాయి.

ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి వేళ మీన లగ్నంలో నూలుతో చేసిన కొడితాడుతో ‘గరుడధ్వజం’ పటం ఎగురువేస్తారు. ఈ పతాకమే సర్వదేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రం. దీనిని అందుకుని ముక్కోటి దేవతలు ఈ తొమ్మిది రోజుల పాటు తిరుమలలోనే ఉండి ఉత్సవాలు తిలకించి ఆనందిస్తా రని పురాణాలు వివరిస్తున్నాయి. వాహనాలలో ఉభయ దేవేరులతో స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. స్వామి వారి వాహనం ముందు బ్రహ్మరథం కదులుతుంది. ధ్వజా రోహణ సమయంలో ఉత్సవ మూర్తి మలయప్ప స్వామి, ఆలయం ప్రాంగణంలోని తిరుమలరాయల మండపంలో చతురస్రాకార శిలావేదికపై వేంచేసి నివేదనలు, హరతులు అందుకుంటారు. ఉదయాస్త మానాలలో ఇక్కడ కొలువు మేళం జరుగుతుంది.

వాహన సేవలు

తిరుమలేశుడికి నిత్యకల్యాణమే. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారు అత్యంత ఉత్సాహంగా, ప్రసన్నంగా ఉంటూ, వాహన సేవలలో పాల్గొనేవారికి కోరిన వరాలు ప్రసాదిస్తారట. ధ్వజారోహణ నుంచి ధ్వజావరోహణ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారు సర్వాలంకారభూషితులై ఉభయదేవేరులతో ఉదయం, రాత్రివేళల్లో వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దివ్యదర్శనంతో అనుగ్రహిస్తారు.

తిరువీధి ఉత్సవం గురించి, అన్నమాచార్య…

‘తిరువీధుల మెరిసే దేవదేవుడు

గరిమల మించిన సింగారముల తోడను

తిరుదండెల పైనేగె దేవుడిదే తొలినాడు

సిరుల రెండవనాడు శేషుని మీద

మురిపేన మూడోనాడు ముత్యాలపందిరి కింద

పొరినాలుగోనాడు పువ్వు కోవిలలోను

గక్కన ఐదవనాడు గరుడుని మీద

ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద

చొక్కమై ఏడవనాడు సూర్యప్రభలోనను

యిక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు

కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు

పెనచి పదోనాడు పెండ్లిపీట

ఎనసి శ్రీవేంకటేశుడింతి అలమేల్మంగతో

వనితల నడుమను వాహనాల మీదను’ అని కీర్తించారు. శ్రీవారు అధిరోహించే ఒక్కొక్క వాహన దర్శనం వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుందని చెబుతారు.

పెద్ద చిన్న శేష వాహనాలు (కుటుంబ శ్రేయస్సు), హంస వాహనం (బ్రహ్మపద ప్రాప్తి), సింహ వాహనం (ధైర్యసిద్ధి), ముత్యపుపందిరి వాహనం (సకల సౌభాగ్యసిద్ధి), కల్పవృక్ష వాహనం (ఐహిక ఆముష్మిక ఫలప్రాప్తి), సర్వభూపాల వాహనం (యశోప్రాప్తి), మోహినీ అవతారం (మాయా మోహనాశనం), గరుడ వాహనం (సర్వపాప ప్రాయశ్చిత్తం), హనుమంత వాహనం (భగద్భక్తి ప్రాప్తి), గజవాహనం (కర్మవిముక్తి), సూర్య వాహనం (ఆయురారోగ్య ప్రాప్తి), చందప్రభ వాహనం (మానసిక శాంతిప్రాప్తి), స్వర్ణ రథోత్సవం (మనోవాంఛాఫలసిద్ధిప్రాప్తి), అశ్వ వాహనం (కలికల్మష నాశనం), చక్రస్నానం (సకల పాపవిమోచనం) కలుగుతాయని పురాణ వాక్కు.

పూటకొక వాహనంపై విహరిస్తూ తీరికలేకుండా భక్తకోటికి దర్శనంతో అనుగ్రహించే స్వామికి ఆలయంలో ప్రత్యేక స్నపన తిరుమంజనంతో సేదతీరుస్తారు. రంగనాయక మండపంలో సుగంధ పరిమళ పుష్పాలు, ఫలాలతో మండపాన్ని మనోహరంగా అలంకరిస్తారు.

చక్రస్నానం ముగిసిన సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభంపై ఎగురుతున్న ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా సాగిన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలను తిలకించిన బ్రహ్మాది దేవతామూర్తులకు ఇలా వీడ్కోలు చెబుతూ ఈ ఉత్సవాలను ముగిస్తారు.

పార్వేట ఉత్సవం

నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్న అర్చన ఆరగింపుల అనంతరం మలయప్ప స్వామిని వేటదుస్తులు, శిరస్త్రాణం, పంచాయుధాలు, ఆభరణాలు, పూమాలలతో అలంకరించి బంగారు తిరుచ్చి శేషాచలం అడవుల్లోని పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకుంటారు. వేరే వాహనంపై విచ్చేసే శ్రీకృష్ణస్వామి కూడా పార్వేట ఉత్సవంలో పాల్గొంటారు.అర్చకస్వాములు జంతువులను వేటాడే దృశ్యాలను ప్రదర్శిస్తారు.

‘ఆనందనిలయే శ్రీమద్విమానే సర్వభూషితే!

సర్వమంగళ సంధాత్రే దీప్యతే నిత్యమంగళమ్‌!!’

About Author

By editor

Twitter
Instagram